మళ్ళీ నడక కొనసాగించే ముందు వెనక్కి తిరిగి నడిచి వచ్చిన దారిని ఒకసారి చూసుకుందాం. క్రిందటి మారు ఒక పద్య నిర్వచనాన్ని/ఛందస్సుని/నమూనాని (ఈ మూడూ ఒకటే) గ్రాఫులో చూపించే ప్రయత్నం చేసాము. అలాగే పద్య నిర్మాణాన్ని (అంటే ఒక పద్య పాదాన్ని) గ్రాఫులో చూపించే ప్రయత్నం చేసాము. ఒకే చందస్సులో ఉండే వివిధ పద్యాల గ్రాఫుల్లో తేడాలు ఎలా వస్తాయో గుర్తించాము. ఈ తేడాకి, పద్య పాదంలో ఉండే పదాల విభజన ప్రధాన కారణమని తెలుసుకున్నాము. గ్రాఫులో x-axisలో అక్షరాలని, y-axisలో గురు లఘువుల విలువలని తిసుకున్నాము. పదాల మధ్య వచ్చే విరామాన్ని కూడా ఒక అక్షరంగా పరిగణించి దానికి 1 విలువ ఇచ్చాము.
ఇప్పటి దాకా చేసిందీ చూసిందీ ఇది. వచ్చే టపాలో తెలుగు ఛందస్సులని గ్రాఫుల్లో గీసే ప్రయత్నం చేస్తానని చెప్పాను కదా. కాని దానికింకా సమయం ఉంది. అంతకన్నా ముందు మరొక విషయాన్ని తెలుసుకోవాలి. క్రిందటిసారి రెండు పాటలని "తనన" భాషలో ఇచ్చి కనుక్కోండి చూద్దామన్నాను కదా. దాని వెనక ఒక కారణం ఉంది. అందులో మొదటి పాట రెండవ పాట కన్నా కనుక్కోడం సులువని నా ఆలోచన. రవి రాకేశ్వరుల ప్రయత్నాలు నా ఆలోచనని ఒక రకంగా నిరూపించాయనే అనుకుంటున్నాను. ఎందుకో మనం సులువుగానే ఊహించవచ్చు. అదేమిటంటే, మొదటి పాటలో ప్రస్ఫుటంగా కనిపించే ఒక లయ ఉంది. అంటే? "తనన" అనేది మొదటి పాదంలో నాలుగు మార్లు వస్తోంది. అలాగే మొదటి రెండు పాదాలు ఒకటే "తనన"లు. మూడు నాలుగు పాదాల్లో కూడా ఇలాంటి సామ్యమే ఉంది. ఇది ఆ పాటకి ప్రస్ఫుటంగా కనిపించే ఒక నడకని ఇస్తోందన్న మాట. అలాంటి నడకని గుర్తించడం సులభం. అదే రెండో పాటలో అలా మళ్ళీ మళ్ళీ ఒకేలాగ వచ్చే "తనన"లు లేవు. అందువల్ల దానికి చదవగానే గుర్తుపట్ట గలిగేటంత ప్రత్యేకమైన నడక లేదు.
సరే, దీనికీ ఛందస్సుకీ ఏమిటి సంబంధం? అంటే, పాటల్లో లాగానే ఇలాంటి తేడాలు పద్యాలలో కూడా ఉన్నాయి! ఉదాహరణకి ఈ క్రింద "లయగ్రాహి", "మత్తకోకిల" అన్న రెండు ఛందస్సులకి (రెండూ వృత్తాలే) గ్రాఫులు ఇస్తున్నాను. లయగ్రాహి గురించి రాకేశ్వరగారు తన బ్లాగులో వివరంగా వ్రాసారు.
ఇప్పుడు ఈ గ్రాఫులని కిందటి టపాలో ఉన్న ఉత్పలమాల గ్రాఫుతో పోల్చి చూడండి. వృత్యనుప్రాసలో మళ్ళీ మళ్ళీ ఒకే అక్షరాలు వచ్చినట్టుగా, ఇక్కడ (లయగ్రాహి, మత్తకోకిల వృత్తాలలో) ఒకే గురు లఘు క్రమం మళ్ళీ మళ్ళీ వస్తోంది కదా. ఇలాంటి repetitive pattern మనకి ఉత్పలమాలలో కనిపించదు.
ఇప్పుడు మత్తకోకిలలో ఉన్న ఈ రెండు పాదాలు, వాటికి సంబంధించిన గ్రాఫులు పరిశీలించండి:
నిండుపున్నమి పండువెన్నెల జాలువారిన రేయిలో
నా మనస్సు వ్యథన్ భరింపగ జాలకుండె క్షమింపవే
మొదటి ఉదాహరణలో ఛందస్సు నిర్వచనంలో ఉన్న repetitive patternని సరిగ్గా అనుసరించి పద్యం నడిచింది. అంటే అందులో పదాలు సరిగ్గా ఆ patternకి తగ్గట్టు ఉన్నాయి. రెండో ఉదాహరణలో అలా జరగడం లేదు. అవునా. అయినా రెండో ఉదాహరణని రెండు మూడు సార్లు చదివి చూడండ్ది. అది మత్తకోకిల నడకలోనే ఉందని సులువుగానే గ్రహించ గలుగుతారు. రెండు గ్రాఫులు చూసినా వాటి మధ్య పోలికలు బాగానే కనిపిస్తాయి (ముఖ్యంగా దీన్ని ఉత్పలమాల, దాని ఉదాహరణలతో పోల్చి చూస్తే తేడా బాగా తెలుస్తుంది). Pattern Recognitionతో కొంత పరిచయం ఉన్నవాళ్ళకి, repetitive patterns ఉన్నప్పుడు వాటిని గుర్తుపట్టడం సులువన్న విషయం తెలిసే ఉంటుంది.
అంతే కాదు, repetitive pattern ఛందస్సుకి ఒక ప్రత్యేకమైన నడకని ఇస్తుంది. ఆ ఛందస్సులో పద్యాలని అలాంటి నడకతో రాయడమే సాధ్యమవుతుంది! ఎంత విరగ్గొట్టి రాద్దామనుకున్నా ఇంచుమించు ఆ నడక వచ్చే తీరుతుంది. ఇలాంటి ప్రత్యేకమైన నడక లేని ఉత్పలమాల లాంటి పద్యాలకి రకరకాల నడకలు వస్తాయి. అంటే నడక పరంగా చూస్తే, మత్తకోకిల లయగ్రాహి లాంటి వృత్తాలు చాలా rigid వృత్తాలన్న మాట. వీటిని nonelastic ఛందస్సు అని పిలవవచ్చు. ఛందస్సుకి ఎలాస్టిసిటీ అన్న విషయాన్ని శ్రీశ్రీ ఒకచోట ప్రస్తావించారు. కానీ దాని గురించి ఎక్కడా వివరించినట్టు లేదు. ఉత్పలమాలలాంటి వృత్తాలు పూర్తి elastic వృత్తాలు.
దీని సారాంశం రెండు ముక్కల్లో చెప్పాలంటే, Repetitive pattern ఉన్న ఛందస్సులకి రెండు ప్రత్యేకతలు ఉంటాయన్న మాట:
1. ఈ ఛందస్సులో ఉన్న పద్యాలని గుర్తుపట్టడం సులువు
2. ఈ ఛందస్సులో వ్రాసే పద్యాలకి ఒకటే ప్రత్యేకమైన నడక ఉంటుంది. దాని కారణంగా అది nonelastic ఛందస్సు అవుతుంది.
ఇంకొక విషయం. సంస్కృతంతో పోలిస్తే, తెలుగు వృత్తాలకి ఎలాస్టిసిటీ ఎక్కువ! ఎందుకంటారా, అదంతా "యతి" మహత్తు! సంస్కృతంలో యతి విరామాన్ని నిర్దేశిస్తుంది. అంటే సరిగ్గా యతిస్థానంలో ఉన్న అక్షరంతో ఒక కొత్త పదం మొదలవ్వాలన్న మాట. ఉదాహరణకి ఉత్పలమాలలో యతి స్థానం 10. కాబట్టి ఏ ఉత్పలమాల పద్యంలోనైనా పదవ అక్షరంతో కొత్త పదం కచ్చితంగా మొదలవ్వాలి. క్రితం టపాలో ఇచ్చిన రెండు ఉదాహరణలూ దీన్ని అనుసరించడం యాదృఛ్చికం!
"ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి..." అన్న పద్యంలో ఈ నియమం పాటించబడ లేదు. యతిస్థానం లో "దం" అన్నది పదం మధ్యలో ఉంది. ఇది తెలుగు పద్యం కనక సరిపోయింది. ఇలాంటిది సంస్కృతంలో కుదరదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, మన గ్రాఫు రెండు భాగాలు అయిపోతుంది. యతి స్థానం ముందు వరకూ ఒక భాగం. తర్వాతది మరొక భాగం. ఈ రెండిటి మధ్య 1 విలువ ఉండే విరామం ఎప్పుడూ ఉంటుంది. దీనితో పద్యానికి కొంతవరకూ ఒక ప్రత్యేకమైన నడక అంటూ ఏర్పడుతుంది. అందులోని ఎలాస్టిసిటీ కొంత తగ్గుతుంది. అంతే కాదు, సంస్కృతంలో ప్రతి పాదం చివరకూడా ఇలాగే విరామం ఉండాలి. అంటే ఒకే పదం రెండు పాదాల్లోకి సాగకూడదన్న మాట. అంచేత ఒక పాదం పూర్తయ్యాక తప్పనిసరిగా చిన్న విరామం ఇచ్చి తరువాత పాదాన్ని చదవడం మొదలుపెడతాం. దీనివల్ల నడక మరింత సులభంగా తెలుస్తుంది. అదే తెలుగు పద్యాలలో అయితే ఈ నియమం లేదు. అంచేత తెలుగులో ప్రతిపాదం తర్వాత ఒక విరామం ఉండవలసిన పనిలేదు. అలా లేనప్పుడు, అలాంటి పద్యాలని గుర్తుపట్టడం మరింత కష్టం! అయితే దీనివల్ల పద్యాలకి ఎలాస్టిసిటీ మరింత పెరుగుతుంది.
ఇవాళ్టికి ఇక్కడకి ఆపుదాం. ఈసారి విషయం కొంచెం బరువైనట్టుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదివి, ఏమైనా సందేహాలుంటే నిరభ్యరంతరంగా అడగండి.
ఆ... ఆగండాగండి. ఈసారి మీ మెదడుకి మేత ఏమీ ఇవ్వలేదు కదూ! సరే, కిందటి టపా వ్యాఖ్యలలో "కన్నెపిల్లవని" పాట ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్రశ్న. అందులో "తనన తనన అన్న తాన అన్న తాళం ఒకటే కదా" అన్న వాక్యం గుర్తుందా? దీని అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? లేదంటే ఇప్పుడు ఆలోచించండి. ఆలోచించి, ఏమిటనుకుంటున్నారో చెప్పండి. సరేనా!
పూర్తిగా చదవండి...