తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, September 25, 2011

కత్తిలాంటి పద్యం!

మొన్న పుస్తకం.నెట్లో బుడుగోయ్ గారు మంచి కత్తిలాంటి పద్యాన్ని ప్రస్తావించారు.

చింతలతోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా
లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్
బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమం బయిపోవునేమొ సా
గింతును రుద్రవీణపయి నించుక వెచ్చని అగ్నిగీతముల్

చింతలతోపు. హోరున కురిసే వాన. వానలో తడిసి ముద్దవుతున్న బాలెంత. ఆమె ఒడిలో పసి మొగ్గలాంటి చిన్ని బిడ్డ. ఆ బిడ్డకి కప్పడానికి ఒక్క బొంతకూడా లేదు. ఇది కవికి కనిపించిన దృశ్యం. మనిషిగా అతని గుండె మండింది. కవిగా పద్యం పొంగింది. భౌతిక ప్రపంచంలో అలాంటి వేలమంది బాలెంతలకి పసిబిడ్డలకి ప్రతిరూపంగా కవి మనసులో కదలాడిన చిత్రమది. ఏం చెయ్యగలడు కవి? ఆ చలిలో ఆ పసిబిడ్డ శరీరం గడ్డకట్టుకు పోతుందేమో! ఎలా కాపాడడం? కవి దగ్గరున్న పరికరం ఒక్కటే, పద్యం! కవి చేతిలో ఏ రూపాన్నయినా ధరించగలదది. అగ్నిధార కురిపించ గలదు. అమృతాభిషేకం చెయ్యగలదు. రుద్రవీణ వినిపించగలదు. ఇక్కడ, రుద్రవీణని మీటి తన గుండెమంటనే అగ్నిగీతాలుగా చేసి పాడుతున్నాడు కవి. ఆ గీతాలు పసిబిడ్డకి కాస్తంత వెచ్చదనాన్ని యిస్తాయేమోనని!

దాశరథి "రుద్రవీణ" అనే కవితా సంపుటిలో "మూర్చన" అనే కవితలోని పద్యమిది. సానబెట్టిన కత్తులాంటి పదునైన పద్యాలని వ్రాసిన దాశరథివంటి తెలుగు కవి మరింకొకడు కనిపించడంటే అతిశయోక్తి గాదు. పదాలలో చుఱుకుదనం, నడకలో పరువులెత్తే ఉద్రేకం, భావంలో విప్లవం, వీటన్నిటినీ ఛందస్సులో సునాయాసంగా బిగించగల నైపుణ్యం, దాశరథి సొంతం. ఆ కాలంలో అందరి కవుల్లాగానే దాశరథికూడా భావకవిత్వం వ్రాసారు. అయితే భావకవుల్లో ఒకరిగా మిగిలిపోలేదు. అదే పద్యాన్ని ఆయుధంగా మార్చి నిజాం దౌర్జన్యాల మీద పోరాటం సాగించిన కవియోధుడు దాశరథి. పద్యం అనే కత్తికి రెండువైపులా పదునే అని నిరూపించిన, నాకు తెలిసినంత వరకూ, ఏకైక కవి దాశరథి. పద్యాన్ని అభ్యుదయ భావాల వాహికగా నిర్వహించిన కవులు లేకపోలేదు. కాని దాశరథి పద్యంలోని వాడి వేడి నాకింకెక్కడా కనిపించలేదు. దానికీ క్రింద పద్యం ఒకానొక సాక్ష్యం. ఇదికూడా రుద్రవీణలోనిదే:

ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగిల్చి కాల్చి, నా
లో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు; న
ఱ్ఱాకట గుందు పేదలకు బ్రహ్మ లిఖించిన కొంటెవ్రాతలో
వ్యాకరణమ్ములేదు, రసభంగిమ కానగరాదదేలనో!

దీని గురించి నేనేమీ మాట్లాడను.

దాశరథి రచించిన అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం అనే ఆరు ఖండకావ్యాలని ఒక సంపుటిగా కిందటేడే విశాలాంధ్రవాళ్ళు ప్రచురించారు. చాలా రోజుల తర్వాత ఆ ఖండకావ్యాలు మరల ప్రచురణభాగ్యం పొందాయి.
ఒకటికాదు రెండుకాదు, బోలెడన్ని కత్తులిమిడిన ఒరని చేతబట్టుకోవాలనుకుంటే, ఈ పుస్తకాన్ని దొరకపుచ్చుకోండి!

పూర్తిగా చదవండి...

Sunday, September 11, 2011

ముచ్చటయిన మూడు కృష్ణ వర్ణనలు

భాగవతంలో కృష్ణుని వర్ణనలకి కొదవేముంది! అందులోనూ పోతన తెలుగుపోత, మధురాతిమధురం. ఆ వర్ణనలు చేస్తున్నప్పుడా భక్తకవి ఆ మాధవునితో తాదాత్మ్యాన్ని పొందే ఉంటాడనిపిస్తుంది! అలాంటి భాగవతంలో నాకు బాగా నచ్చిన మూడు శ్రీకృష్ణ వర్ణనలని ఎంచమంటే, నేనెంచుకొనే మూడు పద్యాల గురించి ఇప్పుడు చెపుతాను.

ఒకటి:

కడుపున దిండుగా గట్టిన వలువలో
లాలిత వంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును
జాఱి రానీక డా చంక నిఱికి
మీగడపెరుగుతో మేళవించిన చల్ది
ముద్ద డాపలి చేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు
వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగడీల నడుమ జక్కగ గూర్చుండి
నర్మభాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద
శైశవంబు మెఱసి చల్ది గుడిచె

ఈ పద్యాన్ని చదివితే అనిపిస్తుంది, పెద్దయ్యాక సంగతి చెప్పలేము కానీ చిన్ననాటి యీ బాలకృష్ణుడు మాత్రం పదహారణాల తెలుగబ్బాయే అని. ఇలాంటి అచ్చమైన తెలుగు కైతలని అచ్చులు పోసిన పోతనకి తెలుగుజాతి ఎప్పటికీ ఋణపడిపోయింది! చిన్నారి కిట్టయ్య తన చెలికాళ్ళతో కలిసి ఆడుతూపాడుతూ చల్ది తినే దృశ్యాన్ని మనకి కళ్ళకి కట్టిస్తున్నాడు పోతన. ఎంత చూడముచ్చటయిన దృశ్యమది! సర్వయాగాలకూ భోక్త అయిన ఆ పరమాత్ముడేనా ఇలా చిన్నమగవాని రూపంలో చల్ది కుడుస్తున్నదీ అని దేవతలందరూ ఆశ్చర్యపోయారట ఆ దృశ్యాన్ని చూసి.

ఆవుల్ని తోలుకొని ఊరుబయట వనంలోకి గోపాలకులందరూ వచ్చారు. భోజనం వేళ అయ్యేసరికి తెచ్చుకున్న చల్ది తినాలని అందరూ కూర్చున్నారు. కృష్ణుడి చేతిలో ఎప్పుడూ మురళి ఉంటుంది కదా! మరి అన్నం తినేదెలా? ఆ వంశనాళాన్ని (అంటే వెదురు గొట్టం!) తన నడుము చుట్టూ చుట్టగా కట్టుకున్న తుండుగుడ్డలో జొనిపాడు. అంతేనా - ఆవులని అదిలించేందుకు చిన్న బెత్తము (వేత్రదండం), కొమ్ముబూరా కూడా ఉన్నాయి చేతిలో. వాటినేమో జాఱిపోకుండా ఎడం చంకలో ఇఱికించాడు. అదే చేతిలో చలిది ముద్దని అదిమి పట్టుకున్నాడు. మాములు చల్దన్నమా అది! చక్కని చిక్కని మీగడపెరుగుతో కలిపినది. మరి ఆ పెరుగన్నంలో నంచుకోడానికి ఏమిటున్నాయి? చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలున్నాయి. అంటే ఇంకాస్త కావాలి, ఇంకాస్త కావాలని బతిమాలో పేచీపెట్టో తెచ్చుకున్న ఊరగాయ అన్నమాట! అది వ్రేళ్ళ సందుల్లో ఇఱికించాడు. హాయిగా స్నేహితుల మధ్య (సంగిడీలు - స్నేహితులకి చక్కని తెలుగుపదం) కూర్చుని, ఊసులాడుకుంటూ నవ్వుతూ తుళ్ళుతూ చక్కగా చల్ది ఆరగిస్తున్నాడు చిన్ని కన్నయ్య. చేతిలో ఉన్న వేణువునీ బెత్తాన్నీ కొమ్ముబూరనీ పక్కన పెట్టవచ్చు కదా! అలా తన దగ్గరే అట్టేపెట్టుకోడంలో బాలకృష్ణుని పసితనం మన కళ్ళకిగడుతుంది. అదీ పోతన వర్ణనలోని అందం! మీగడపెరుగుతో మేళవించిన చల్ది, ఊరగాయలూ తెలుగుదనపు ఘుమఘుమలు. వాటిని మీగడతరకల్లాంటి తెలుగుపదాలతో మేళవించి తెలుగు చిన్నారి కిట్టమూర్తిని మన కళ్ళముందుంచాడు పోతన.

ఈ పద్యం వెనక తమాషా అయిన కథ ఒకటి ఉంది. కృష్ణుడు గోపాలబాలలతో అడవికి వచ్చినప్పుడు అఘాసురుడనే రాక్షసుడు పెద్ద పాము రూపంలో వచ్చి నోరు తెరచి పడుకుంటాడు. తోవలో అడ్డంగా ఉన్నది పామేమో అని అనుమానించినా, మన వెనక కృష్ణుడుండగా మనకి భయమేమిటని పిల్లలంతా ఆ పామునోట్లోకి వెళ్ళిపోతారు. అయితే ఆ పాము నోట్లోని విషజ్వాలలకి అందరూ చనిపోతారు. తనమీద అంతటి గుడ్డి నమ్మకాన్ని పెట్టుకున్న ఆ గోపాలుర మీద జాలిపడి కృష్ణుడు ఆ పాము గొంతు చీల్చి చంపి, పిల్లలని తిరిగి బతికిస్తాడు. ఇదంతా చూసిన బ్రహ్మ ఆశ్చర్యపోతాడు. అంతటి బ్రహ్మనీ మాయ ఆవరిస్తుంది. అతను కృష్ణుడిని మామూలు బాలుడే అనుకొని, ఈ బాలుడికి ప్రాణాలిచ్చే శక్తి ఎక్కడిదని ఆశ్చర్యపోతాడు. కృష్ణుడిని మరింత పరీక్షించాలని చెప్పి, ఇలా హాయిగా కూర్చుని చల్దులు తింటున్న సమయంలో ఆవులన్నిటినీ మాయం చేసేస్తాడు. ఆవులని వెతుక్కుంటూ కృష్ణుడు వెళ్ళి, కనపడక తిరిగివచ్చి చూస్తే గోపబాలురందరూ కనిపించకుండా పోతారు. బ్రహ్మ అందరినీ ఒక గుహలో దాచేస్తాడు. సంగతి తెలుసుకున్న కృష్ణుడు తనే ఆ సమస్త గోవులూ గోపబాలుర రూపాలని ధరించి అందరి ఇళ్ళకీ వెళ్ళిపోతాడు. ఇలా ఏడాది గడిచిపోతుంది. బ్రహ్మ కాలమానంలో అది ఒక క్షణం. బ్రహ్మకి మతిపోతుంది! ఏమిటీ మాయ? సృష్టి చేసే బ్రహ్మ నేనొక్కడినే కదా! మరి అన్ని గోవలనీ, అంతమంది పిల్లలనీ ఎవరు సృష్టించారు? ఇలా తికమక పడుతూ ఉంటే కృష్ణుని విశ్వరూప సందర్శనం అవుతుంది. మాయ తొలగిపోతుంది. ఈ బ్రహ్మ పదవి వదిలేసి, హాయిగా తనూ ఓ గోపాలబాలుడై కృష్ణుడితో కలిసి అలా చల్ది కుడిస్తే ఎంత బాగుంటుందో కదా అని అనుకుంటాడు.
అదీ కథ!

ఇక రెండో పద్యం:

కటి చేలంబు బిగించి, పింఛమున జక్కం గొప్పు బంధించి, దో
స్తట సంస్ఫాలన మాచరించి, చరణద్వంద్వంబు గీలించి, త
త్కుటశాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాలసింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానం బనూనంబుగన్

ఇది చాలా మందికి తెలిసిన పద్యమే. కృష్ణుడు కాళీయమర్దనానికి సంరంభంతో ఉరుకుతున్న సందర్భం. పైన చెప్పిన పద్యం ఒక స్థిరచిత్రం (still photograph) అయితే, ఇది చలనచిత్రం! అందులో కృష్ణుని పసితనం కనిపిస్తే ఇందులో గోపకిశోరుని పొంగు మన కళ్ళముందు కదలాడుతుంది.

ఉత్తరీయాన్ని నడుముకి బిగించాడు. జాఱకుండా పింఛాన్ని చక్కగా కొప్పున బంధించాడు. జబ్బలు రెండూ చఱిచాడు. రెండు కాళ్ళనీ దగ్గరగా తెచ్చాడు. తెచ్చి, ఆ చెట్టుకొమ్మపైనుండి గభాలున చెఱువులోకి దూకాడు. ఎవరు? సింహకిశోరం లాంటి గోపాలుడు. "లాంటి" ఏవిటి, అప్పుడతడు సింహకిశోరమే! అంతెత్తునుండి దూకేసరికి, గుభగుభమన్న శబ్దం నలుదిక్కులా నిండిపోయిందట!

పద్య నిర్మాణంలోని సొగసు బిగువు వల్ల కృష్ణుడిలో ఉఱకలు వేస్తున్న అదే ఉత్సాహం మనలోనూ కలగడం లేదూ! అదీ కవిత్వమంటే!

ముచ్చటగా మూడో పద్యం ఇదిగో:

త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప, ప్రాభాత నీ
రజ బంధు ప్రభమైన చేలము పయిన్‌ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్‌

ఈ పద్యం ఎందుకంత ఇష్టమంటే చెప్పడం కష్టం! మొదటి పద్యంలో లాగా ఒక రూపాన్ని విస్తృతంగా వర్ణించే పద్యం కాదిది. కదిలే చిత్రాన్ని అక్షరాలలో బంధించే పద్యమూ కాదు. ఈ పద్యంలో కనిపించే కృష్ణుడు అపురూప ధీర సౌందర్య విలసితుడు. ఇందులో ఏదో తెలియని అలౌకికత ఉంది. ఆధ్యాత్మికావేశముంది. అది త్రిజగ్నమోహనమైన నీలకాంతి. నీలమంటే నలుపు. నలుపుకి కాంతి ఎక్కడిది? అదే మాయ. ముజ్జగాలనీ మోహింప జేసే మాయ. నల్లని మేఘముపై పడిన ఉదయసూర్యుని అరుణారుణకిరణంలా పైన ఉత్తరీయం ప్రకాశిస్తోంది. ఆ మూర్తిలో ఒక ఉత్సాహముంది. ఆ ఉత్సాహమా ముఖారవిందముపై కదలాడే నీలి ముంగురులలో ద్యోతకమవుతోంది. మా విజయునికి విజయాన్ని చేకూర్చాలనే ఉత్సాహమది.
ఆహా! అలాంటి వన్నెలాడు మోహనకృష్ణుని ఆ రూపం మదిలో ఆవేశించిన భీష్ముడు ఎంతటి ధన్యుడు! దాన్ని చూసి మనకి చూపించిన పోతన మరెంత ధన్యుడు!

పూర్తిగా చదవండి...