తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, September 25, 2011

కత్తిలాంటి పద్యం!

మొన్న పుస్తకం.నెట్లో బుడుగోయ్ గారు మంచి కత్తిలాంటి పద్యాన్ని ప్రస్తావించారు.

చింతలతోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా
లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్
బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమం బయిపోవునేమొ సా
గింతును రుద్రవీణపయి నించుక వెచ్చని అగ్నిగీతముల్

చింతలతోపు. హోరున కురిసే వాన. వానలో తడిసి ముద్దవుతున్న బాలెంత. ఆమె ఒడిలో పసి మొగ్గలాంటి చిన్ని బిడ్డ. ఆ బిడ్డకి కప్పడానికి ఒక్క బొంతకూడా లేదు. ఇది కవికి కనిపించిన దృశ్యం. మనిషిగా అతని గుండె మండింది. కవిగా పద్యం పొంగింది. భౌతిక ప్రపంచంలో అలాంటి వేలమంది బాలెంతలకి పసిబిడ్డలకి ప్రతిరూపంగా కవి మనసులో కదలాడిన చిత్రమది. ఏం చెయ్యగలడు కవి? ఆ చలిలో ఆ పసిబిడ్డ శరీరం గడ్డకట్టుకు పోతుందేమో! ఎలా కాపాడడం? కవి దగ్గరున్న పరికరం ఒక్కటే, పద్యం! కవి చేతిలో ఏ రూపాన్నయినా ధరించగలదది. అగ్నిధార కురిపించ గలదు. అమృతాభిషేకం చెయ్యగలదు. రుద్రవీణ వినిపించగలదు. ఇక్కడ, రుద్రవీణని మీటి తన గుండెమంటనే అగ్నిగీతాలుగా చేసి పాడుతున్నాడు కవి. ఆ గీతాలు పసిబిడ్డకి కాస్తంత వెచ్చదనాన్ని యిస్తాయేమోనని!

దాశరథి "రుద్రవీణ" అనే కవితా సంపుటిలో "మూర్చన" అనే కవితలోని పద్యమిది. సానబెట్టిన కత్తులాంటి పదునైన పద్యాలని వ్రాసిన దాశరథివంటి తెలుగు కవి మరింకొకడు కనిపించడంటే అతిశయోక్తి గాదు. పదాలలో చుఱుకుదనం, నడకలో పరువులెత్తే ఉద్రేకం, భావంలో విప్లవం, వీటన్నిటినీ ఛందస్సులో సునాయాసంగా బిగించగల నైపుణ్యం, దాశరథి సొంతం. ఆ కాలంలో అందరి కవుల్లాగానే దాశరథికూడా భావకవిత్వం వ్రాసారు. అయితే భావకవుల్లో ఒకరిగా మిగిలిపోలేదు. అదే పద్యాన్ని ఆయుధంగా మార్చి నిజాం దౌర్జన్యాల మీద పోరాటం సాగించిన కవియోధుడు దాశరథి. పద్యం అనే కత్తికి రెండువైపులా పదునే అని నిరూపించిన, నాకు తెలిసినంత వరకూ, ఏకైక కవి దాశరథి. పద్యాన్ని అభ్యుదయ భావాల వాహికగా నిర్వహించిన కవులు లేకపోలేదు. కాని దాశరథి పద్యంలోని వాడి వేడి నాకింకెక్కడా కనిపించలేదు. దానికీ క్రింద పద్యం ఒకానొక సాక్ష్యం. ఇదికూడా రుద్రవీణలోనిదే:

ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగిల్చి కాల్చి, నా
లో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు; న
ఱ్ఱాకట గుందు పేదలకు బ్రహ్మ లిఖించిన కొంటెవ్రాతలో
వ్యాకరణమ్ములేదు, రసభంగిమ కానగరాదదేలనో!

దీని గురించి నేనేమీ మాట్లాడను.

దాశరథి రచించిన అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితాపుష్పకం అనే ఆరు ఖండకావ్యాలని ఒక సంపుటిగా కిందటేడే విశాలాంధ్రవాళ్ళు ప్రచురించారు. చాలా రోజుల తర్వాత ఆ ఖండకావ్యాలు మరల ప్రచురణభాగ్యం పొందాయి.
ఒకటికాదు రెండుకాదు, బోలెడన్ని కత్తులిమిడిన ఒరని చేతబట్టుకోవాలనుకుంటే, ఈ పుస్తకాన్ని దొరకపుచ్చుకోండి!

1 comment: