తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, February 6, 2008

తెలుగు పద్యమంటే...

తెలుగువాళ్ళకి తెలుగుపద్యమంటే ఏమిటో చెప్పాల్సిన అవసరమేముందీ అని దీర్ఘం తీస్తున్నారా?
నిజమే, కానీ "పద్యం" అన్న పదానికి కాలక్రమంలో నానార్థాలు ఏర్పడ్డాయి కదా. కాబట్టి స్పష్టతకోసం ఈ వివరణ.


కొందరు పద్యం అన్న పదాన్ని కవిత్వానికి పర్యాయపదంగా ఉపయోగిస్తారు. ఛందోబద్ధమైనా కాకపోయినా కవితాఖండికని పద్యం ఆంటూ ఉంటారు. కానీ నా నిర్వచనం అదికాదు.
ఛందోబద్ధమైన అక్షర సముదాయం పాదం. అలాటి పాదాల సమాహారం పద్యం. ఇదీ నా నిర్వచనం.
"పద సముదాయం" అని కాకుండా "అక్షర సముదాయం" అని ఎందుకన్నానూ అంటే, తెలుగులో, ఒక పదంలో కొంత భాగం ఒక పాదంలోనూ మరికొంత రెండవపాదంలోనూ ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ పద్యం చూడండి:


శ్రీరఘురామ, చారు తులసీ దళ ధామ, శమ క్షమాది శృం
గార గుణాభిరామ, త్రిజగన్నుత శౌర్య రమాలలామ, దు
ర్వార కబంధ రాక్షస విరామ, జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ!

ఇందులో ఏ పాదం తీసుకున్నా చివరి పదం కొంతభాగమే ఆ పాదంలో ఉండి మిగతాభాగం రెండవ పాదంలోకి వెళుతోంది.
అయితే, ఈ నిర్వచనంలో ఒక చిన్న చిక్కుందండోయ్!

తాన తాన తాన తానాన తానాన
తాన తాన తాన తాన తాన
తాన తాన తాన తానాన తానాన
తాన తాన తాన తాన తాన

పైది ఛందోబద్ధమైన పాదాల సమాహారమే. కానీ పద్యం కాదు, దానికి అర్థం లేదు కాబట్టి. అందువల్ల పద్యాన్ని ఇలా నిర్వచించుకోవచ్చు.

"ఛందోబద్ధమైన అక్షరాల సమాహారం పాదం. పాదాల అర్థవంతమైన సమాహారం పద్యం".

హమ్మయ్యా! ఒక పెద్దపని అయిపోయింది!
ఏమిటీ, "ఛందోబద్ధమైన" అంటే ఏమిటా... అమ్మో పెద్దపని ఇప్పుడే మొదలయ్యిందిలా ఉందే! దాని గురించి మరో సారి మాట్లాడుకుందామేం...

9 comments:

 1. బాగా చెప్పారు.మిగతావి వేచి చూస్తాము.

  ReplyDelete
 2. ఈమాట లో తన రచనలద్వారా అంతర్జాల తెలుగ్ పాఠకులకి చిరపరిచితులైన శ్రీ భైరవభట్ల కామేశ్వర్రావుగారికి స్వాగతం. మీరిలా పద్యం గురించి విపులంగా చర్చించటానికి బ్లాగు తెరవటం చాలా సంతోషం.
  మన బ్లాగ్లోకంలో ఛందస్సు చంద్రాహాసాలని అనునిత్యం పదును పెడుతుండే వీరులు చాలా మందే ఉనారు. నెమ్మది మీద పరిచయం అవుతార్లెండి.

  ReplyDelete
 3. వికటకవి గారూ, కొత్తపాళి గారూ,
  మీ ప్రోత్సాహానికి నెనరులండి.
  కొత్తపాళి గారు, మీ ప్రాచీనసాహిత్యానువాదాల బ్లాగూ, మరొకరి తప్పటడుగుల బ్లాగూ, ఇలా పద్యాలకు సంబంధించిన బ్లాగులు చూసాను. ఆ స్ఫూర్తితోనే నేనూ ఇందులో ఉడతా భక్తిగా "బ్లాగ"స్వామినౌదామని ఇది మొదలుపెట్టాను. కొత్త కాబట్టి మీలాటివాళ్ళ సలహాసూచనలు తప్పకుండా ఉపయోగపడతాయి, సంకోచించకుండా ఇవ్వండి.

  ReplyDelete
 4. నమస్తే కిరణ్ గారు,
  మీ ఆవకాయ బాగానే ఊరుతూ ఊరిస్తోంది:-)

  ReplyDelete
 5. నమస్తే బ్లాగ్ చాల చాల బాగుంది. సత్య హరిశ్చంద్ర, చింతామణి వగైరా పద్యాలూ కుడా పోస్ట్ చేయండి.

  ReplyDelete
 6. ఉత్పలమాల:-
  భైరవభట్ల వంశజుడ! భక్తిగ మీకు నమస్కరింతు. మీ
  ధారణ , పద్య భాషణము, తప్పక యొప్పిదమౌనటంచు, తా
  కోరి యనుంగు పృచ్ఛకుగ గుర్తుగ పిల్చె రహిపనెంచి. నే
  నేరకపోతి మీ ఘనత నిత్యుడ! మీకు శుభాభినందనల్.

  ReplyDelete
 7. #Tel
  mee telugu padyaM Seershika chAlA bAguMdi ennO maMchi padyAlu dorukutunnAyi dhanya vAdamulu

  ReplyDelete
 8. పిల్లలకు కొద్దిగా పద్యాలైతే పరిచయం చెయ్యగలిగాను.
  ఆ పరిచయాన్ని ఇంకొంచెం విస్తృతం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను.
  ఆ ప్రయత్నంలో భాగంగా వెతుకుతుంటే ఈ తీగ తగిలింది.

  మీ అమ్మాయి పద్యాలు వినలేక పోయాను.
  fileden సభ్యత్వం అవసరమా?

  మీరు ఒకసారి ఈ ప్రయత్నం (http://telugu4kids.com/padyalu1.aspx)చూసి
  సూచనలు (http://telugu4kids.com/contactus.aspx) ఇవ్వగలరు.

  ReplyDelete