తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, December 30, 2011

పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం - తరువాయి భాగం

క్రిందటి టపాలో సత్యాపతి తన ప్రియసతి పదపల్లవ తాడననాన్ని రుచిచూసిన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాం కదా. అతను కాక (అంత కన్నా ముందే) ఆ సత్కారాన్ని పొందిన ఆ మరో దేవుడెవరో తెలుసుకోడానికి ఉవ్విళ్ళూరుతున్నారా?:-) ఆ దేవుడు ఆదిదేవుడు, శంకరుడు. దాని గురించి చెప్పినది స్వయంగా ఆదిశంకరులు. ఆ అయ్యవారు అమ్మవారి పాదతాడనాన్ని పొందడమే కాదు, అది పొందాలని ఉవ్విళ్ళూరారట కూడా!

నమోవాకం బ్రుమో నయన రమణీయాయ పాదయోః
త వాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచి రసాలక్త కవతే
అసూయ త్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనా మీశానః ప్రమదవన కంకేళి తరవే

అమ్మవారి పాదాలు లత్తుకతో అలంకరింపబడి నయనరమణీయంగా ప్రస్ఫుటమైన కాంతితో వెలుగుతున్నాయి. ఉద్యానవనంలోని కంకేళి తరువులు (అశోక వృక్షాలు) ఆ పాదాల తాడనాన్ని (అభిహననము) పొందుతున్నాయి. వాటిని చూసి పశుపతి అయిన ఈశ్వరుడు, తనకా భాగ్యం దక్కలేదే అని వాటిని చూసి ఈర్ష్యపడుతున్నాడట. ఎంత చోద్యమో చూసారా! అలాంటి పాదాలకి నమోవాకాలు చెపుతున్నారు శంకరాచార్యులవారు, సౌందర్యలహరిలో. ఇంతకీ అశోకవృక్షాలను అమ్మవారు తన్నడమేమిటి?

చెట్లు చక్కగా పుష్పించడానికి పూర్వకాలంలో కొన్ని చిత్రమైన పద్ధతులు ఆచరించేవారట. వీటిని దోహదక్రియలంటారు. ఒకో చెట్టుకి ఒకో రకమైన క్రియ. ఆలింగనాత్ కురువకః - అంటే కురువకాన్ని కౌగలించుకుంటే బాగా పుష్పిస్తుంది, కరస్పర్శేణ మాకందః - చేతి స్పర్శ చేత మామిడి పుష్పిస్తుంది. ఇలా చాలా చెట్లకి దోహదక్రియలున్నాయి. ఇవన్నీ స్త్రీలు మాత్రమే చెయ్యాలి. నాకు తెలిసిన మరికొన్ని:

సల్లాపతః కర్ణికారః - కర్ణికారానికి (కొండగోగు) చక్కని మాటలు
నమేరుః హసితేనచ - నమేరువుకు (సురపొన్న) నవ్వు
వకుళో ముఖసీధునా - వకుళానికి (పొగడ) నోట్లో మధువు తీసుకొని పుక్కిలించాలి
అశోకః చరణాహత్యా - అశోకానికి చరణాహతి, అంటే మనం చెప్పుకుంటున్న కాలితాపు
సిందువారో ముఖానిలాత్ - సిందువారానికి (వావిలి చెట్టు) నోటితో ఊదడం
తిలకో వీక్షణేనచ - తిలకానికి (బొట్టుగు చెట్టు) కంటిచూపు

పదహారవశతాబ్దానికి చెందిన కృష్ణనందుడనే అతను తంత్రసారమనే గ్రంథంలో యీ దోహదక్రియలన్నిటినీ వివరించాడట. కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోకూడా వీటి ప్రస్తావన కనిపిస్తుంది.

ఇంతకీ అసలు సంగతికి మళ్ళీ వద్దాం. అలా పార్వతీదేవి తమ ఉద్యానవనంలోని అశోకవృక్షాలు బాగా పుష్పించాలని నిత్యమూ వాటిని తంతోంది. అంత అందమైన పాదాల తాకిడి వాటికి మాత్రమే దక్కుతోందని శివునికి వాటి మీద అసూయ కలిగిందట! తనకీ ఆ అదృష్టం దక్కాలని తహతహ లాడేడు. మరి ఆయన కోర్కె తీరిందా? ఎందుకు తీరదు! అది తీరిన విధానాన్ని ఆ తర్వాతి పద్యంలోనే ఆదిశంకరులు వివరించారు.

మృషాకృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితమ్
లలాటే భర్తారమ్ చరణకమలే తాడయతి తే
చిరాదన్తశ్శల్యం దహనకృతమున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశానరిపుణా

సౌందర్యలహరిలో శ్లోకాలన్నిటిలోకి నాకు బా...గా... యిష్టమైన శ్లోకమిది. శివుడు పార్వతీదేవి చేత తల దన్నించుకోడానికి ఒక ఉపాయం పన్నాడు. మృషా అంటే కపటం, నాటకం. పార్వతి దగ్గరున్నప్పుడు గోత్రస్ఖలనం చేసినట్టు నటించాడు. గోత్రస్ఖలనమంటే భార్యని పొరపాటుగా వేరే స్త్రీ (సవతో, ప్రేయసో) పేరుతో పిలవడం. బహుశా మరి "గంగా" అని పిలిచాడేమో పార్వతిని! అలా చేస్తే ఆమెకి ఎంత బాధ కలుగుతుంది, ఎంత కోపం వస్తుంది! శివుడలా చేసి, నాలిక్కరుచుకొని, ఏమీ పాలుపోవనివాడిలాగా (వైలక్ష్య), పాదాలకి వంగి తన శిరసుతో నమస్కరించాడు, క్షమించమని వేడుకున్నట్టుగా. అలా తన కాళ్ళకు మ్రొక్కిన భర్త లలాటాన్ని తన చరణకమలంతో పార్వతి తన్నింది. ఆ రకంగా శివుని కోరిక తీరింది! చూసారా కపట నటనలో ఆ జగన్నాటకసూత్రధారిని మించిపోయాడీ జగత్పిత! భార్య పాదతాడన భాగ్యం కోసం ఎంతటి సాహసానికి పూనుకున్నాడు!

ఇంతవరకూ చెప్పి ఆపేస్తే అతను ఆదిశంకరులు ఎందుకవుతారు, మహాకవి ఎలా అవుతారు! అసలు కవిత్వమంతా ఆ మిగిలిన రెండు పాదాలలోనూ ఉంది. పార్వతీదేవి అలా కాలితో శివుని ఫాలభాగాన్ని తన్నినప్పుడు, ఆమె కాలియందెలు గలగలమన్నాయి. ఆ సవ్వడి ఎలా ఉన్నదంటే - శివుని ఫాలాగ్నికి కాలి బూడిదైన (దహనకృతం) మన్మథునికి (ఈశానరిపు - ఈశ్వరుని శత్రువు), జరిగిన ఆ పరాభవం ఒక బాణమై హృదయంలో చిరకాలంనుండి గుచ్చుకొని ఉందట (చిరాత్ అంతః శల్యం). పార్వతీదేవి తన కాలితో ఆ శివుని ఫాలభాగాన్ని ఎప్పుడైతో తన్నిందో, ప్రతీకారం జరిగినట్టయింది. పరాభవ బాణం పెకిలించబడింది (ఉన్మూలితా). మన్మథుని మనసుకి ఎంతో హాయి కలిగింది. ఆ ఆనందంలో అతను కిలకిలా నవ్వాడు. ఆ కిలకిలలల్లాగా ఉన్నాయట కాలియందెల గలగలలు!
ఆహా! ఎంత మహాద్భుతమైన ఊహ! ఎంత రమణీయ కల్పన! ఎంతటి ధ్వని! దీనికి మించిన కవిత్వముంటుందా! జాగ్రత్తగా గమనిస్తే, యిక్కడ నిజంగానే మన్మథునికి జయం కలిగింది. అమ్మవారి పాదతాడన సౌఖ్యాన్ని అనుభవించాలన్న శివుని కోర్కె మన్మథ ప్రేరితమే కదా! ఇక్కడ మనమొక మనోహరమైన ఊహ చేయవచ్చు. తనకు జరిగిన పరాభవానికి ఎలాగైనా బదులు తీర్చుకొనేలా చెయ్యమని మన్మథుడు అమ్మవారి పాదాలని ఆశ్రయించాడు. అమ్మ ఎప్పుడైనా కరుణాహృదయ కదా. మారాం చేసే తన బిడ్డ మురిపం తీర్చాలని అనుకున్నది. ఏ పాదాలనయితే మన్మథుడు ఆశ్రయించాడో, ఆ పాదాలపైనే తన భర్తకి కోరిక కలిగేలా ఆమె చేసింది. అతడు తన కాళ్ళకి మ్రొక్కేలా చేసింది. అలా మ్రొక్కిన అతడి ఫాలాన్ని తన కాలితో తన్నింది. ఆ పని ద్వారా అటు తన భర్త కోర్కెను, యిటు మన్మథుని ఆకాంక్షనూ కూడా నెరవేర్చింది. శివుడు శృంగారి కావడమే మన్మథుని జయ సూచకం. అది చాలదన్నట్టు ఆ శృంగారలీలలో మన్మథుని దహించిన ఫాలభాగమే తన్నబడడం, మన్మథునికి సంపూర్ణ విజయం. ఇదంతా ఒక ఎత్తైతే, ఆనంద హృదయడైన మన్మథుని నవ్వుల కిలకిలలతో, పార్వతీదేవి శింజినుల మంజుల స్వనాన్ని పోల్చడం అన్నది పరమ రమణీయమైన ఉపమ!

ఇది వరకు చెప్పానేమో తెలియదు, సర్వసంగపరిత్యాగి అయిన ఒక సన్న్యాసి, మహాకవి కూడా కావడమన్నది వింతలలో వింత. అది ఒక్క ఆదిశంకరుల విషయంలో మాత్రమే నిజమయ్యింది! పై శ్లోకానికి ఆధ్యాత్మికపరమైన వివరణ కూడా ఉన్నది. అదేమిటో తెలుసుకో గోరినవారు చాగంటి కోటేశ్వరరావుగారిని వినాలి. :-) ప్రస్తుతానికి నాకు మాత్రం ఇందులోని కవిత్వమే ముఖ్యం.

తెలుగు పద్యం లేకుండా యీ తెలుగుపద్యం బ్లాగులో వేసిన మొట్టమొదటి టపా (ఒకే ఒక్క టపాకూడా అవుతుందేమో) యిదేనేమో! ఇంతటి గొప్ప శ్లోకాన్ని గురించి చెప్పే టపాకి ఆ మాత్రమైనా ప్రత్యేకత ఉండొద్దూ మరి. పద్యాభిమానులెవరైనా దీనికి అందమైన ఆంధ్రీకరణ జేసి వ్యాఖ్యలలో యిచ్చినట్లయితే ఆ ప్రత్యేకత మరింత ఇనుమడిస్తుంది!

8 comments:

 1. హేల త్వదాహ్వయమ్ము నితరేతర రీతి వచించి స్థాణువై
  శూలి భవత్పదాబ్జముల సోకగ జేసె లలాట మంత నీ
  కాలొక యింత తాకి ఘలు ఘల్లని గజ్జెలు మ్రోగెనమ్మరో -
  లీల పురా పరాభవ శిలీముఖ మొక్కెడ బెల్లగిల్ల నా
  వాలుగడాలు నవ్వుల రవంబుల జేసినయట్లు జేతయై !!!


  ( స్థాణువు = శివుడు , ఇక్కడ అచేతనుడై అని కూడ ; వాలుగడాలు = మన్మథుడు ; జేతయై = జయించిన వాడై )

  ఎంత ప్రయత్నించినా , నాలుగు పాదాల్లో ఇంతటి భావాన్ని పలికించడం నా శక్తికి మించినదైనది. ఆదిశంకరులకు ,వారి అద్భుత కవన శక్తికి నమోవాకం ప్రశాస్మహే !!!
  ఈ శ్లోకం అందించిన మీకు నా ధన్యవాదాలు !!!

  ReplyDelete
  Replies
  1. డా .విష్ణు నందన్ గారికి
   ధన్యవాదములు.మీ అనువాదం హృద్యం .రసనిష్యందం .చక్కని పద్యాన్ని మూలానికి దగ్గరగా అంటే జగద్గురువుల భావానికి దగ్గరగా తెలుగు లోకి తెచ్చారు .

   Delete
 2. విష్ణునందన్ గారు,

  ధన్యోస్మి! చాలా మంచి పద్యాన్ని అందించినందుకు కృతజ్ఞతలు, నమోవాకాలు.
  తెలుగు సంస్కృత పదాల సరైన పొహళింపు పద్యానికి ఎంత అందాన్నిస్తుందో మీ పద్యం చాటుతోంది.

  ReplyDelete
 3. అన్నట్టు చెప్పడం మరిచాను. ఆదిశంకరుల జీవితచరిత్ర వ్రాసిన వారినుండి యీ అనువాదం రావడం మరింత విశేషం!

  ReplyDelete
 4. శ్రీ విష్ణునందనుల వారి పద్యము అద్భుతముగా ఉంది.

  ReplyDelete
  Replies
  1. నా పేరు సుమతి , మీ సైట్ చాల బాగుంది.

   Delete
 5. "ఇంతవరకూ చెప్పి ఆపేస్తే అతను ఆదిశంకరులు ఎందుకవుతారు" ...
  అక్కడినుండి మిగతాది చదువుతుంటే.. మన్మధుని కిలకిలలనే అమ్మ కాలి అందెల గలగలలు వినబడి.. కళ్ళు నీళ్ళతో నిండిపోయి.. తుడుఛుకునేందుకు శరీరం సహకరించక.. తుడుచుకోకుండా మిగతాది చదువుకోలేక ..
  ఏదైనా అలవాటయితే మొహం మొత్తాలి కదా!.. ఈ పద్యాలు అలవాటయిన కొద్దీ ఆనందాన్నిస్తాయి... తడుముకోకుండా ఆనందంవైపు నడిచిపోవడమెలాగో నేర్పిస్తాయి.

  ReplyDelete
 6. hi nice to meet you!!
  i`m from korea ....

  my blog visit..
  bye

  ReplyDelete