తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, June 22, 2008

నీకున్ మాంసము వాంఛయేని...


నీకున్ మాంసము వాంఛయేని కఱవా? నీ చేత లేడుండగా
జోకైనట్టి కుఠారముండ ననలజ్యోతుండ, నీరుండగా
పాకంబొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షింప కా బోయచే
జేకొంటెంగిలి మాంసమిట్లు దగునా! శ్రీకాళహస్తీశ్వరా!

ఒక మహాభక్తుడు గొప్పకవి కూడా అయినప్పుడు, ఇలాటి విచిత్రమైన పద్యాలే పుడుతాయి! మొత్తం కాళహస్తీశ్వరశతకంలో ఇలాటి పద్యం మరొకటి లేదు.

శతకమంతటా సంసార బంధంలో చిక్కుకున్న భక్తుని ఆర్తే కనిపిస్తుంది. తను అనుభవించిన సుఖాలమీద, తను ఆశ్రయించిన రాజుల మీద రోతా, ఈసడింపే అంతటా పరచుకుంది. చెప్పింది గొప్ప కవి కాబట్టి అవన్నీ గుండెను బలంగానే తాకుతాయి. వాటి మధ్యలో యీ పద్యం! ఇందులో ఉన్నదేమిటి? శివుడు బోయవాడి దగ్గర ఎంగిలి మాంసం తిన్నాడని ఆక్షేపణ! అతడెవడి దగ్గర ఏది తింటే మధ్యలో ధూర్జటి కేమిటిట దుగ్ధ? దుగ్ధ కాదు, ఇదో రకమైన సరసం! ఒక స్నేహితుడితో సరదాగా చేసే చమత్కార సంభాషణ. మన దేశంలో భక్తి చాలా విచిత్రమైనది. భక్తుడికి దైవం మీద ఎంత భక్తి ఉంటుందో, అంత చనువూ ఏర్పడుతుంది! ఆ చనువుతో భక్తులు తాము కొలిచే దైవాన్ని ఏమైనా అనే హక్కు తీసుకుంటారు.
కాళహస్తీశ్వరుడు తిన్నడి దగ్గర మాంసం తిన్న సంఘటన ధూర్జటి చదివాడు, స్వయంగా కాళహస్తీశ్వర మాహాత్మ్యంలో తనే చిత్రించాడు కూడా. అది గుర్తొచ్చి ఉంటుంది. శివుని రూపం అతని కళ్ళలోనే ఎప్పుడూ కదులుతుందాయె. అయితే అది లింగాకారంలో కాక సశరీరమైన రూపమే ఈ సందర్భంలో కనిపించినట్టుంది. వెంటనే అతనిలోని కవి మేల్కొన్నాడు. ఆ కవికి ఒక చేతిలో లేడి, మరో చేతిలో గొడ్డలి, నుదుటిని నిప్పుకన్ను, నెత్తిన గంగ, మరో చేతిలో కపాలం కనిపించాయి! ఇంకేముంది, యీ సొగసైన పద్యం రూపుకట్టింది. మాంసం వండుకోడానికి అవసరమైన పదార్థాలన్నీ శివుడిదగ్గరే ఉన్నాయన్న గమనింపు కవి అయినవాడికి మాత్రమే వచ్చే ఊహ. దాన్నంత ముచ్చటగా చెప్పడం ధూర్జటికే చెల్లు. ఈ పద్యంలోని "జోకైన" ఇంగ్లీషు జోకు కాదు. తెలుగు "జోక", అంటే తగిన, ఉచితమైన అని అర్థం. ఇక్కడ "అనలజ్యోతి" అంటే ఫాలనేత్రపు మంట కావచ్చు, లేదా చేతిలోని మంటైనా కావచ్చు. కొన్ని శివమూర్తులలో చేతిలో మంట ఉంటుంది.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మాంసమంటే ప్రీతివల్ల శివుడు ఎంగిలి మాంసం తినలేదని ధూర్జటికీ తెలుసు. దాన్ని నిరూపించడానికే ఈ పద్యం! శివుడు తిన్నడి ఎంగిలి మాంసం తిన్నా, రాముడూ శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళు తిన్నా అది వాళ్ళకి ఆ తినుబండారాలపై వాంఛా కాదు, వాళ్ళకి లేకా కాదు. వాటి ద్వారా భక్తులు తమని తాము భగవంతునికి సమర్పించుకుంటారు. భగవంతుడు స్వీకరించేది అదే. ధూర్జటి తన బ్రతుకే ఎంగిలి బ్రతుకని భావించాడు. శివుడు తిన్నడి ఎంగిలి మాంసం ఎలా స్వీకరించాడో, తననీ అలాగే స్వీకరిస్తాడని తనకి తాను ధైర్యం చెప్పుకోడానికే ఈ పద్యం.
శతకం ఛందోబద్ధమైన పద్యాలలో మాత్రమే రాయగల కవిత్వ ప్రక్రియ. కవికి తన సాధకబాధకాలు, ఆలోచనలూ, అనుభవాలూ వ్యక్తం చెయ్యడానికి పూర్తిగా స్వేఛ్చ ఉండేది ఇందులోనే. శతకానికి ఆయువుపట్టు, కవికి రాసే విషయం మీద ఉండే నిష్ఠ. శతకం ముక్తకమనే కావ్య ప్రక్రియ కిందకి వస్తుంది. ఇందులో కథాకావ్యాలలో లాగా కథనం, రస నిర్వహణ, రచనా శిల్పం ఉండవు. కేవలం కవి అనుభూతీ, అనుభవమే. కాబట్టి భక్తి అయినా, నీతి అయినా, లోకానుభవమైనా ఏదైనా కవి తీవ్రంగా అనుభవించి రాసినప్పుడే అందులో కవిత్వం ఇతరులకి చేరుతుంది. కాళహస్తీశ్వరశతకం ఇప్పటికీ చదివేవాళ్ళ మనసులని కదిలించేది దీని వల్లనే. వేమన శతకం ప్రజాదరణ పొందడానికి కారణమూ ఇదే. ఏదో ఎదుటివాళ్ళకి నీతి చెప్పాలనే ఉద్దేశంతో రాసే శతకాలు కాలగర్భంలో కలసిపోతాయి. ఈ సంగతి నాకు రమారమీ ఏభై అరవై (శతక)పద్యాలు రాసిన తర్వాత బోధపడింది! దాంతో అవి పాతరేయబడ్డాయి :-)
కాళహస్తీశ్వరశతకం శార్దూల మత్తేభ వృత్తాలలో నడిచినా, అందులో చాలా వరకూ తేటతెలుగు పదాలే. వ్యావహారిక ప్రయోగాలే. ఇందులో పద్యాలు కంఠస్థం చేస్తే ఈ వృత్తాల నడక అలవడి, అలవోకగా హాయిగా సాగే పద్యరచన సాధ్యమవుతుంది.
"స్తుతమతియైన ఆంధ్రకవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ అతులిత మాధురీమహిమ!"

5 comments:

 1. హా తెలిసెన్ భువనైకమోహనో
  ద్దత సుకుమార వారవనితా జనతా ఘనతాపహారిసం
  తతమధురాధరోదిత సుధారసధారల గ్రోలుటం జుమీ.
  మీ కాళహస్తీశ్వర శతకపద్యం,వివరణ చదవగానే ఆ శతకాన్ని తీసి ఈ రోజే ఓసారి పూర్తిగా మళ్ళీ
  చదవాలనిపించింది.చదివాక కామెంటు రాస్తాను.

  ReplyDelete
 2. రసికులకి అంతగా నచ్చకపోవచ్చు కానీ, ఈ "స్తుతమతియైన..." పద్యానికి మరో అర్థముందని బేతవోలు రామబ్రహ్మంగారు తన "పద్యకవితా పరిచయం" పుస్తకంలో చెప్పారు. అదేంటంటే:
  సు కుమార వార = పుత్ర సమూహం
  వనితా జనతా = కాంతలు
  భార్యాపుత్రులున్నమాట. వీళ్ళు భువనైక మోహనోద్ధతులు. అంటే సంసారం, మోహాన్ని కలిగిస్తుంది. దాన్నుంచి కలిగే ఘనమైన తాపాన్ని హారించేది, ఏమిటీ అంటే,
  "సంతత మధు రాధ" = ఎల్లవేళలా మధువునికూడా అధిగమించే, అంటే మధువుకన్న తియ్యనైన
  రోదిత = ర + ఉదిత = రం అనే బీజాక్షరం
  అలాంటి మధువుకన్నా తియ్యనైన రం అనే బీజాక్షరోపాసన వల్ల లభించిన "సుధారసధారల" = అమృతధారలను తాగడంవల్ల సుమా!
  ఇక్కడ మరో విశేషం, "ఆంధ్రకవి ధూర్జటి" అన్న సమాసాన్ని "ఆంధ్ర - కవిధూర్జటి" అని విడగొట్టుకుంటే, ఆంధ్ర కవీశ్వరుడు అన్న అర్థం వచ్చి (ధూర్జటి అంటే శివుడు), ఇది ధూర్జటికే కాక మొత్తం ఆంధ్ర కవీశ్వరులందరికీ అన్వయించుకొనే వీలుంటుంది!

  ReplyDelete
 3. హా తెలిసెన్ భువనైకమోహనో
  ద్దత సుకుమార వారవనితా జనతా ఘనతాపహారిసం
  తతమధురాధరోదిత సుధారసధారల గ్రోలుటం జుమీ.
  ee padhyam purthigaa teliyacheyavalasinadi ga koeruchunnanu. Thank you for the nice blog.

  ReplyDelete
 4. Rathna Kumari garu,
  ఇక్కడ చూడండి

  http://telpoettrans.blogspot.com/2006/11/extempore-poem-caatuvu-is-extempore.html

  ReplyDelete
 5. మామూలుగానే చాలా అద్భుతంగా ఉంది.

  ధూర్జటి రాసిన ఓ పద్యం, "నిను సేవించిన గల్గు మానవులకున్ వీటీ వధూటీ ఘటీ"....ఇలా ఎన్నో 'టీ' లతో ఓపద్యం, చిన్నప్పుడు ఎక్కడో కంఠస్తం చేసాను. (ఈపుడు మర్చి పోయాను లెండి). ఆ పద్య్మ గొర్తొస్తే దయచేసి తెలుపండి...

  "హా తెలిసెన్..." పైన చెప్పినది తెనాలి రామకృష్ణుని పూరణ మాత్రమే. ఇతర కవుల పూరణ కూడా ఉంది. నోరి నరసిం హ శాస్త్రి గారి "ధూర్జటి" నవలలో చెప్పబడ్డాయి అవి.

  ReplyDelete