తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, July 19, 2008

తామసి


పూర్ణిమగారడిగిన "తామసి" పద్యాలివిగో.
ఇవి రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథిగా అందరికీ తెలుసు. సినిమా పాటల రచయితగా చాలామందికి తెలుసు. "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అని ఎలుగెత్తి చాటిన తెలంగాణా పోరాట కవిగా మరి కొందరికి తెలిసుంటుంది. ఇతని కవితల్లో అంగారం శృంగారం రెండూ కనిపిస్తాయని ప్రసిద్ధి. దాశరథి చాలా వివాదాలలో కూడా చిక్కుకున్నారు. శ్రీశ్రీకి దాశరథికీ పడేదికాదు.
ఏదేమైనా, ఆధునిక కాలంలో తెలుగుపద్యానికి అభ్యుదయమనే కొత్త శక్తినిచ్చిన కవులలో ఇతను ప్రసిద్ధుడు.

ఇతని గురించి మరికొన్ని వివరాలు వికీపీడియాలో చూడవచ్చు. దాశరథి కవితలు కొన్ని ఆంధ్రభారతి సైటులో చదువుకోవచ్చు.
ఈ తామసి పద్యాలు, దాశరథి రాసిన "అమృతాభిషేకం" అన్న కవితా సంపుటిలోనివి. ఇందులో మనం దాశరథిలోని భావకవిని చూస్తాం. చీకటిని వర్ణిస్తున్నాడు. చీకటంటే భావకవులకి చెప్పలేని ఇష్టం కదా!


తామసి
------

ఇరులు నిశాసతీ భుజములెక్కి, శిరమ్మున నిక్కి తారకా
తరుణి కపోలపాళికలు తాకి, విహాయస వీధి ప్రాకి, చం
దురు పయి సోకి, భూమిధర దుర్గమ వీధుల దూకి, మెల్లగా
ధరపయి కాలు మోపిన వుదారములై హరినీలకాంతులన్!
(నిశాసతి - రాత్రి అనే స్త్రీ, విహాయస వీధి - ఆకాశం)

ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందుబింబాననా
ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి
ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా
భ్రుకుటికా ధనువు నంబకము కూర్చి
ఇటు సాగి అటు సాగి ఇందీవరేక్షణా
పక్ష్మ భాగములపై వచ్చి వ్రాలి
ఇటు వీగి అటు వీగి మృగనేత్ర బంగారు
చెక్కిలిపై అగర్ చుక్క నునిచి

వెండికొండపయిన్ మబ్బు విధము దోచి
చంద్ర కేదారమున లేడి చాయ దిరిగి
ఆదిశేషునిపై విష్ణువై శయించి
చీకటులుగూర్చె నందమ్ము లోకమునకు
(భ్రుకుటికా ధనువు - బొమముడి అనే విల్లు, అంబకము - బాణము, పక్ష్మ భాగము - కనుఱెప్పల వెండ్రుకలు, అగర్ చుక్క - నల్ల చందనంతో పెట్టే బుగ్గ చుక్క)

ఇరులు కోకిలములై ఎచ్చోట కూయునో
అచ్చోట మధుమాస మవతరించు
ఇరులె తుమ్మెదలుగా ఏవేళ పాడునో
ఆ వేళల వసంత మందగించు
ఇరులె మయూరులై ఎట నాట్యమాడునో
అటనే నవాషాఢ మావహించు
ఇరులె ఉత్పలములై ఏనాడు పూచునో
ఆ రోజు కార్తిక మ్మాగమించు

ఇరుల కన్న అంద మెచట కానగ రాదు
ఇరులె సౌఖ్యములకు దరులు సుమ్ము
ఇరులు లేని నాడు నరులు కానగరారు
నరులు లేని నాడు ధరణి లేదు

కబరీభరమ్ములై కనుపించు చీకట్లు
కలకాల మందాలు చిలుకు గాత
నల్లకల్వలవోలె ఉల్లసిల్లెడు నిరుల్
కాసారములలోన గ్రాలు గాత
నీలిమేఘమ్ములై నింగి బ్రాకెడు తమం
బాకాశమున నడయాడు గాత
జవరాలి కనుపాప చాయ దోచెడు సాంధ్య
మెడదలో వలపు వర్షింతు గాత

ఇరులె కురులయి, ఝరులయి పరుగులెత్తి
ఇరులె కరులయి హరులయి ఇంపు నింపి
ఇరులె విరులయి సరులయి ధరణి నిండి
ఇరులె నరులకు మరులు కల్పించు గాత

వెచ్చదనము లేని వెఱ్ఱి దీపమ్ముల
పెట్టదలచెదేల పిచ్చిదాన
వర్షధార వోలె వచ్చు చీకట్లలో
మట్టిదివ్వె నిలుచు మాట కల్ల

గౌళి నాల్క మీది కంటకమ్ములలోన
చిక్కుకొన్న యట్టి చిన్న పురుగు
అంధకారమందు ఆటాడు దీపంబు
మరు నిముసమునందు మడియ గలదు
(గౌళి - బల్లి)

ఆకాశమ్మది చీకటిల్లు, శశి తారార్కావళుల్ మిణ్గురుల్
లోకంబియ్యిది చీకటింటి పరదాలో డాగు మృత్పిండ మిం
దాకల్పింపగ జూచెదేల పరిహాసార్థమ్మొ దీపావళీ
ప్రాకారమ్ములు తామసీధరణి కంపంబల్లదే వచ్చెడిన్

కానుగ చెట్లనీడల నొకానొక స్వప్నపు సెజ్జమీద ని
ద్రాణత హాయిగొల్పగ సదా శయినింపగ నీ మహాంధకా
రాన మనస్సు శాంతిగొనె, రాను భవత్ కమనీయ కాంతి సౌ
ధానకు, నన్ను పిల్వకుము తన్వి! విభా విభవాభిరామవై!
(విభా విభవ అభిరామ - వేకువ కాంతి కలిగిన అందమైన స్త్రీ)

-----------------------

మన కావ్యాలలో చీకటి వర్ణనలకి కొదవలేదు! అందులోనూ ఒకొక్కరి ధోరణి ఒకొక్కరిది. మన మనుచరిత్రలోది మచ్చుకొకటి. మరిన్ని పద్యాలు మరోసారి.

మృగనాభి పంకంబు మెయినిండ నలదిన
మాయ కిరాతు మైచాయ దెగడి
నవ పింఛమయభూష లవధరించి నటించు
పంకజాక్షుని చెల్వు సుంకమడిగి
కాదంబ నికురంబ కలితయై ప్రవహించు
కాళింది గర్వంబు కాకువేసి
తాపింఛ విటపి కాంతార సంవృతమైన
అంజనాచలరేఖ నవఘళించి

కవిసె మఱియును గాకోల కాలకంఠ
కంఠ కలకంఠ కరిఘటా ఖంజరీట
ఘన ఘనాఘన సంకాశ గాఢ కాంతి
గటికి చీకటి రోదసీ గహ్వరమున

8 comments:

 1. పూర్ణిమ గారికి మీకు అనేకానేక ధన్యవాదాలు.దాశరథి గారి పేరు వినడమే కాని వారి కవితలనెప్పుడూ చదివే అవకాశం కలగలేదు.ఈరోజు ఇదిగిలాగ వారి కవితను చూడటం జరిగింది.వీలువెంబడి దాశరథి గారి కవితలు చదివే ప్రయత్నం చేస్తాను.మరోసారి మీ ఇరువురికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  ReplyDelete
 2. పూర్ణిమగారడిగిన నుంచి ఆలొచిసస్తూనే ఉన్నా నన్ను నేను తిట్టుకుంటూ... ఎందుకంటే తామసిని గురు పూజా సంధర్భంగా మా తరగతికి భోదించితిని. కానీ తదుపరి మరచితిని. పోనీ ఒకసారి మళ్ళీ తెలుగు పుస్తకం చదువుదామా అంటే అది అందుబాటులో లేకుండా అమెరికాలో ఉంటిని.
  ధన్యవాధములు మంచి పద్యాలను రాసినందుకు.

  ReplyDelete
 3. నేను దాశరథి గారి అభిమానిని. నేను పదవ తరగతి లో ఉన్నప్పుడు, ఉపాధ్యాయ దినోత్సవము రోజు, మా తరగతి వాళ్ళకి తెలుగు ఉపాధ్యాయుడిగా వెళ్ళి దాశరథి గారి మహాంద్రోదయమ్ అనే పాఠం చెప్పాను...నాకు ఆ రోజు ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి వచ్చింది...అందులోని కొన్ని పద్యాలు నాకు ఇంకా గుర్తున్నాయి..."నేనురా తెలగాణ నిగళాలు తెగ దొబ్బి ఆకాశమంత ఎత్తరచినాను, నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుడిని కాపాడినాను,...ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలను తెంపి అగ్ని లో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ"


  "నాకు కావలె నవ శిరీష ప్రసవ మంజుల భావ గుంఫిత కావ్యరాజము"
  అప్పుడు మా తరగతి లో శిరీష, మంజుల అనే అమ్మాయిలు ఉండే వారు, వాళ్ళను చూస్తూనే, రాగయుక్తంగా ఈ పద్యమ్ చదివాను...ఇంకో దాశరథి కవిత కూడా నాకిష్టం, అది "కామన" అనే పేరుపై రాసారు
  ...
  అది ఇక్కడ చదవొచ్చు........

  http://kavanavanam.blogspot.com

  దాశరథి గారిని గుర్తు చేసినందుకు, మరొక్క సారి

  ReplyDelete
 4. ఆదివారం ఇంత అందంగా తెలవారుతుందంటే.. అసలు నిద్రేపోయేదాన్ని కానేమో!! కాలమనే జాతరలో.. నిర్లక్ష్యంగా పారేసుకున్న నేస్తాన్ని మళ్ళీ నా ముందుకు తెచ్చినందుకు "ధన్యవాదాల"తో సరిపెట్టలేను.. అంతకు మించిన పదసంపద లేదు నా దగ్గర!!

  చాలా చాలా థాంక్స్!!

  ReplyDelete
 5. పదవ తరగతి తెలుగు వాచకం లో ఓ హిట్,
  దాశరధి కృష్ణమాచార్యులు, పద్యాలు బా కష్టం గాఅ ఉంటాయని మా వాళ్ళందరూ చదివే వారు కాదు, నేను అ పద్యాలు వదలకుండా చదివా చివరకు అందరికనా నాకే ఎక్కువ మార్కులు వచ్చాయి

  ReplyDelete
 6. నా 10 వ తరగతి ఒకసారి గుర్తుకు వచ్చింది ...

  ReplyDelete
 7. రాaz గాలిపెళ్లైJuly 11, 2023 at 11:30 PM

  ఈ పద్యాల కోసం ఎంతో వెతికాను మామ్ ఎన్నో సంవత్సరాలుఎన్నో నిద్రలేని రాత్రులు. మీకు చాలా చాలా ధన్యవాదాలు..

  ReplyDelete
 8. రాaz గాలిపెళ్లైJuly 11, 2023 at 11:34 PM

  క్షమించండి గురువు గారు ..మామ్ అన్నందుకు... చాలా చాలా ధన్యవాదాలు పద్యాలు మాకు అందించినందుకు...మీకు శత కోటి వందనాలు...

  ReplyDelete