క్రిందటి టపాలో సత్యాపతి తన ప్రియసతి పదపల్లవ తాడననాన్ని రుచిచూసిన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నాం కదా. అతను కాక (అంత కన్నా ముందే) ఆ సత్కారాన్ని పొందిన ఆ మరో దేవుడెవరో తెలుసుకోడానికి ఉవ్విళ్ళూరుతున్నారా?:-) ఆ దేవుడు ఆదిదేవుడు, శంకరుడు. దాని గురించి చెప్పినది స్వయంగా ఆదిశంకరులు. ఆ అయ్యవారు అమ్మవారి పాదతాడనాన్ని పొందడమే కాదు, అది పొందాలని ఉవ్విళ్ళూరారట కూడా!
నమోవాకం బ్రుమో నయన రమణీయాయ పాదయోః
త వాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచి రసాలక్త కవతే
అసూయ త్యత్యంతం యదభిహననాయ స్పృహయతే
పశూనా మీశానః ప్రమదవన కంకేళి తరవే
అమ్మవారి పాదాలు లత్తుకతో అలంకరింపబడి నయనరమణీయంగా ప్రస్ఫుటమైన కాంతితో వెలుగుతున్నాయి. ఉద్యానవనంలోని కంకేళి తరువులు (అశోక వృక్షాలు) ఆ పాదాల తాడనాన్ని (అభిహననము) పొందుతున్నాయి. వాటిని చూసి పశుపతి అయిన ఈశ్వరుడు, తనకా భాగ్యం దక్కలేదే అని వాటిని చూసి ఈర్ష్యపడుతున్నాడట. ఎంత చోద్యమో చూసారా! అలాంటి పాదాలకి నమోవాకాలు చెపుతున్నారు శంకరాచార్యులవారు, సౌందర్యలహరిలో. ఇంతకీ అశోకవృక్షాలను అమ్మవారు తన్నడమేమిటి?
చెట్లు చక్కగా పుష్పించడానికి పూర్వకాలంలో కొన్ని చిత్రమైన పద్ధతులు ఆచరించేవారట. వీటిని దోహదక్రియలంటారు. ఒకో చెట్టుకి ఒకో రకమైన క్రియ. ఆలింగనాత్ కురువకః - అంటే కురువకాన్ని కౌగలించుకుంటే బాగా పుష్పిస్తుంది, కరస్పర్శేణ మాకందః - చేతి స్పర్శ చేత మామిడి పుష్పిస్తుంది. ఇలా చాలా చెట్లకి దోహదక్రియలున్నాయి. ఇవన్నీ స్త్రీలు మాత్రమే చెయ్యాలి. నాకు తెలిసిన మరికొన్ని:
సల్లాపతః కర్ణికారః - కర్ణికారానికి (కొండగోగు) చక్కని మాటలు
నమేరుః హసితేనచ - నమేరువుకు (సురపొన్న) నవ్వు
వకుళో ముఖసీధునా - వకుళానికి (పొగడ) నోట్లో మధువు తీసుకొని పుక్కిలించాలి
అశోకః చరణాహత్యా - అశోకానికి చరణాహతి, అంటే మనం చెప్పుకుంటున్న కాలితాపు
సిందువారో ముఖానిలాత్ - సిందువారానికి (వావిలి చెట్టు) నోటితో ఊదడం
తిలకో వీక్షణేనచ - తిలకానికి (బొట్టుగు చెట్టు) కంటిచూపు
పదహారవశతాబ్దానికి చెందిన కృష్ణనందుడనే అతను తంత్రసారమనే గ్రంథంలో యీ దోహదక్రియలన్నిటినీ వివరించాడట. కృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలోకూడా వీటి ప్రస్తావన కనిపిస్తుంది.
ఇంతకీ అసలు సంగతికి మళ్ళీ వద్దాం. అలా పార్వతీదేవి తమ ఉద్యానవనంలోని అశోకవృక్షాలు బాగా పుష్పించాలని నిత్యమూ వాటిని తంతోంది. అంత అందమైన పాదాల తాకిడి వాటికి మాత్రమే దక్కుతోందని శివునికి వాటి మీద అసూయ కలిగిందట! తనకీ ఆ అదృష్టం దక్కాలని తహతహ లాడేడు. మరి ఆయన కోర్కె తీరిందా? ఎందుకు తీరదు! అది తీరిన విధానాన్ని ఆ తర్వాతి పద్యంలోనే ఆదిశంకరులు వివరించారు.
మృషాకృత్వా గోత్రస్ఖలనమథ వైలక్ష్యనమితమ్
లలాటే భర్తారమ్ చరణకమలే తాడయతి తే
చిరాదన్తశ్శల్యం దహనకృతమున్మూలితవతా
తులాకోటిక్వాణైః కిలికిలిత మీశానరిపుణా
సౌందర్యలహరిలో శ్లోకాలన్నిటిలోకి నాకు బా...గా... యిష్టమైన శ్లోకమిది. శివుడు పార్వతీదేవి చేత తల దన్నించుకోడానికి ఒక ఉపాయం పన్నాడు. మృషా అంటే కపటం, నాటకం. పార్వతి దగ్గరున్నప్పుడు గోత్రస్ఖలనం చేసినట్టు నటించాడు. గోత్రస్ఖలనమంటే భార్యని పొరపాటుగా వేరే స్త్రీ (సవతో, ప్రేయసో) పేరుతో పిలవడం. బహుశా మరి "గంగా" అని పిలిచాడేమో పార్వతిని! అలా చేస్తే ఆమెకి ఎంత బాధ కలుగుతుంది, ఎంత కోపం వస్తుంది! శివుడలా చేసి, నాలిక్కరుచుకొని, ఏమీ పాలుపోవనివాడిలాగా (వైలక్ష్య), పాదాలకి వంగి తన శిరసుతో నమస్కరించాడు, క్షమించమని వేడుకున్నట్టుగా. అలా తన కాళ్ళకు మ్రొక్కిన భర్త లలాటాన్ని తన చరణకమలంతో పార్వతి తన్నింది. ఆ రకంగా శివుని కోరిక తీరింది! చూసారా కపట నటనలో ఆ జగన్నాటకసూత్రధారిని మించిపోయాడీ జగత్పిత! భార్య పాదతాడన భాగ్యం కోసం ఎంతటి సాహసానికి పూనుకున్నాడు!
ఇంతవరకూ చెప్పి ఆపేస్తే అతను ఆదిశంకరులు ఎందుకవుతారు, మహాకవి ఎలా అవుతారు! అసలు కవిత్వమంతా ఆ మిగిలిన రెండు పాదాలలోనూ ఉంది. పార్వతీదేవి అలా కాలితో శివుని ఫాలభాగాన్ని తన్నినప్పుడు, ఆమె కాలియందెలు గలగలమన్నాయి. ఆ సవ్వడి ఎలా ఉన్నదంటే - శివుని ఫాలాగ్నికి కాలి బూడిదైన (దహనకృతం) మన్మథునికి (ఈశానరిపు - ఈశ్వరుని శత్రువు), జరిగిన ఆ పరాభవం ఒక బాణమై హృదయంలో చిరకాలంనుండి గుచ్చుకొని ఉందట (చిరాత్ అంతః శల్యం). పార్వతీదేవి తన కాలితో ఆ శివుని ఫాలభాగాన్ని ఎప్పుడైతో తన్నిందో, ప్రతీకారం జరిగినట్టయింది. పరాభవ బాణం పెకిలించబడింది (ఉన్మూలితా). మన్మథుని మనసుకి ఎంతో హాయి కలిగింది. ఆ ఆనందంలో అతను కిలకిలా నవ్వాడు. ఆ కిలకిలలల్లాగా ఉన్నాయట కాలియందెల గలగలలు!
ఆహా! ఎంత మహాద్భుతమైన ఊహ! ఎంత రమణీయ కల్పన! ఎంతటి ధ్వని! దీనికి మించిన కవిత్వముంటుందా! జాగ్రత్తగా గమనిస్తే, యిక్కడ నిజంగానే మన్మథునికి జయం కలిగింది. అమ్మవారి పాదతాడన సౌఖ్యాన్ని అనుభవించాలన్న శివుని కోర్కె మన్మథ ప్రేరితమే కదా! ఇక్కడ మనమొక మనోహరమైన ఊహ చేయవచ్చు. తనకు జరిగిన పరాభవానికి ఎలాగైనా బదులు తీర్చుకొనేలా చెయ్యమని మన్మథుడు అమ్మవారి పాదాలని ఆశ్రయించాడు. అమ్మ ఎప్పుడైనా కరుణాహృదయ కదా. మారాం చేసే తన బిడ్డ మురిపం తీర్చాలని అనుకున్నది. ఏ పాదాలనయితే మన్మథుడు ఆశ్రయించాడో, ఆ పాదాలపైనే తన భర్తకి కోరిక కలిగేలా ఆమె చేసింది. అతడు తన కాళ్ళకి మ్రొక్కేలా చేసింది. అలా మ్రొక్కిన అతడి ఫాలాన్ని తన కాలితో తన్నింది. ఆ పని ద్వారా అటు తన భర్త కోర్కెను, యిటు మన్మథుని ఆకాంక్షనూ కూడా నెరవేర్చింది. శివుడు శృంగారి కావడమే మన్మథుని జయ సూచకం. అది చాలదన్నట్టు ఆ శృంగారలీలలో మన్మథుని దహించిన ఫాలభాగమే తన్నబడడం, మన్మథునికి సంపూర్ణ విజయం. ఇదంతా ఒక ఎత్తైతే, ఆనంద హృదయడైన మన్మథుని నవ్వుల కిలకిలలతో, పార్వతీదేవి శింజినుల మంజుల స్వనాన్ని పోల్చడం అన్నది పరమ రమణీయమైన ఉపమ!
ఇది వరకు చెప్పానేమో తెలియదు, సర్వసంగపరిత్యాగి అయిన ఒక సన్న్యాసి, మహాకవి కూడా కావడమన్నది వింతలలో వింత. అది ఒక్క ఆదిశంకరుల విషయంలో మాత్రమే నిజమయ్యింది! పై శ్లోకానికి ఆధ్యాత్మికపరమైన వివరణ కూడా ఉన్నది. అదేమిటో తెలుసుకో గోరినవారు చాగంటి కోటేశ్వరరావుగారిని వినాలి. :-) ప్రస్తుతానికి నాకు మాత్రం ఇందులోని కవిత్వమే ముఖ్యం.
తెలుగు పద్యం లేకుండా యీ తెలుగుపద్యం బ్లాగులో వేసిన మొట్టమొదటి టపా (ఒకే ఒక్క టపాకూడా అవుతుందేమో) యిదేనేమో! ఇంతటి గొప్ప శ్లోకాన్ని గురించి చెప్పే టపాకి ఆ మాత్రమైనా ప్రత్యేకత ఉండొద్దూ మరి. పద్యాభిమానులెవరైనా దీనికి అందమైన ఆంధ్రీకరణ జేసి వ్యాఖ్యలలో యిచ్చినట్లయితే ఆ ప్రత్యేకత మరింత ఇనుమడిస్తుంది!
పూర్తిగా చదవండి...
Friday, December 30, 2011
పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం - తరువాయి భాగం
Thursday, December 22, 2011
పెళ్ళాల పాదతాడనం దేవుళ్ళకి శిరోధార్యం!
భార్య పాదతాడనం రుచిచూసిన దేవుడనగానే మనకి గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడొక్కడే. అదికూడా, మన నంది తిమ్మనగారి పుణ్యమా అని తెలుగు కృష్ణుడికి మాత్రమే దక్కిన భాగ్యమది. మరి టపా శీర్షికలో "దేవుళ్ళు" అని బహువచనమేమిటి? మరో దేవుడు కూడా భార్య చేత తన్నించుకున్నాడా?! అన్న అనుమానం ఈపాటికి మీకు కలిగుండాలి. అవును, భార్య చేత తలదన్నించుకున్న దేవుడు మరొకడున్నాడు. అసలు నంది తిమ్మనగారి కృష్ణుడికి స్ఫూర్తినిచ్చింది కూడా ఆ దేవుడే అని నా నమ్మకం. అతనెవరో ఆ సందర్భమేమిటో తెలుసుకొనే ముందు, నంది తిమ్మనగారి పారిజాతాపహరణ కావ్యంలో మనందరికీ పరిచయమైన పద్యాన్ని మరోసారి గుర్తుచేసుకుందాం.
జలజాతాసన వాసవాది సుర పూజాభాజనంబై తన
ర్చు లతాంతాయుధు గన్నతండ్రి శిరమచ్చో వామపాదంబునన్
దొలగన్ ద్రోచె లతాంగి, యట్లయగు, కాంతుల్ నేరముల్ సేయ పే
రలుకన్ బూనినయట్టి కాంత లుచితవ్యాపారముల్ నేర్తురే!
ఈ సన్నివేశాన్ని ఎరుగని వారుండరు కదా. పారిజాతాపహరణ కావ్యం గురించి తెలియకపోయినా, శ్రీకృష్ణార్జునయుద్ధం సినిమాలో "అలిగితివా సఖీప్రియా..." పాట, చాలామందికి తెలిసే ఉంటుంది. నారదుడు తెచ్చి యిచ్చిన పారిజాతపుష్పాన్ని తనకివ్వకుండా రుక్మిణికి యిచ్చాడని సత్య అలకబూనుతుంది. ఆమె అలక తీర్చే ప్రయత్నంలో చివరికి ప్రేమతో ఆమె కాళ్ళకి మ్రొక్కుతాడు శ్రీకృష్ణుడు. సత్యభామ చిగురులవంటి పాదాల ఎఱ్ఱని వెలుగులు తన కిరీటములోని మణికాంతులకి వన్నెపెట్టే విధంగా తలవంచి ఆ పాదాలని మ్రొక్కాడట! నిజంగా తానేదో అపరాధం చేసేశానన్న పశ్చాత్తాపంతోనా? అబ్బే! కృష్ణుడంటే ఎవరు? జగన్నాటకసూత్రధారి. అదంతా ఆయనకొక లీక. శృంగారలీల. అప్పుడేమయ్యింది? అతడు కోరుకున్నదే జరిగింది! బ్రహ్మేంద్రాది దేవతలచేత పూజింపబడే ఆ తలని తన ఎడంకాలితో త్రోసేసిందా భామ.
పద్యాలలో పదాలని ఆచితూచి వెయ్యడంలో దిట్ట నంది తిమ్మన. బ్రహ్మేంద్రాది దేవతలచే పూజింపబడేది అని చెప్పి ఊరుకో లేదు చూసారా. అది "లతాంతాయుధు కన్నతండ్రి" శిరసు అని కూడా మనకి గుర్తుచేసారు. అక్కడుంది కీలకం! లతాంతము అంటే లత చివరల పూచేది, పువ్వు అని అర్థం. లతాంతాయుధుడంటే సుమశరుడయిన మన్మథుడు, శృంగారదేవత. అతని తండ్రి అంటే సర్వ సృష్టిలోని శృంగారానికి కారణభూతమైన వాడన్న మాట. దీనివల్ల మనకి ధ్వనిస్తున్న విషయమేమిటి? సత్యభామ చేష్టని శృంగార రస దృష్టితోనే చూడాలి తప్ప ఏదో పరమపూజనీయమైన ఆ శిరసుకి అవమానం జరిగిందని భావించకూడదు సుమా అని కవి మనలని హెచ్చరిస్తున్నాడు. ఆ శిరసు ఎంతటి పూజనీయమైనదైనా కావచ్చు. కాని ఆ సన్నివేశంలో అది మన్మథ జనకుని శిరసు. శ్రీకృష్ణుడు శృంగారనాయకుడు. ఆ చేష్ట శృంగారలీల. అందుకే ఆ తాకిడికి శ్రీకృష్ణుడు "ఉద్దీపిత మన్మథ సామ్రాజ్యాన్ని" పొందాడని తర్వాతి పద్యంలో అంటాడు తిమ్మన. పైగా, తన్నినది ఎవరు? "లతాంగి". అతను లతాంతాయుధు కన్నతండ్రి, ఈమె లతాంగి. పొత్తు సరిగ్గా కుదరింది. లతలాంటి మేను ఎంత సున్నితంగా ఉంటుంది! అందుకే ఆ తాకిడికి ఆయనగారి మేను పులకించింది. ఆ పులకల ములుకులు ఆమె పదపల్లవానికి గుచ్చుకుంటే ఎక్కడ నొప్పి కలుగుతుందోనని తెగ బెంగపడ్డాడట ఆ కపట గోపాలుడు! ఆమె "నెయ్యపు కినుక"తో ("ప్రణయకోపాని"కి ఎంత ముచ్చటైన తెలుగు పదం!), తనని తన్నినా అది మన్ననే అని కూడా అంటాడు. అదంతా ఒక రసరమ్య విలాసం. దాన్ని తన ముద్దుముద్దు పలుకులతో మనోహరంగా చిత్రించాడు నంది తిమ్మన.
చెలునికి నెచ్చెలి కాలితాపు అనుగ్రహించడమన్నది పూర్వకాలంలో ప్రసిద్ధమైన విషయం లాగానే అనిపిస్తుంది. దీని గురించి చాలా రిసర్చికూడా జరిగినట్టుంది! :) వాత్స్యాయనుడు నాయికా పదప్రహరణనాన్ని శృంగారలీలగా సూత్రీకరించాడు. వాత్స్యాయుని వ్యాఖ్యానించిన జయమంగళుడైతే ఏకంగా "క్రోధ వశాత్తస్య శిరసి పాదతాడనమపి నదోషాయ సౌభాగ్య చిహ్నం తదితి నాగరకవృద్ధాః" అన్నాడు. ఆలంకారికులు కూడా దీన్ని గురించి ప్రస్తావించారు. సాహిత్యదర్పణంలో విశ్వనాథ కవిరాజు రూపకాలంకారానికి యిచ్చిన ఉదాహరణ చూడండి:
"దాసే కృతాగసి భవత్యుచితః ప్రభూణాం పాదప్రహార ఇతి సుందరి నాస్మి దూయే, ఉద్యత్కఠోర పులకాంకుర కంటకాగ్రై ర్యద్భిద్యతే మృదుపదం నను సా వ్యథా మే"
(శ్లోకం ఛందస్సు గుర్తుపట్టారా?!)
ఈ శ్లోకం రెండవ భాగానికి ఇంచుమించు తెలుగుసేతే మనందరికీ బాగా తెలిసిన ఈ పద్యం:
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపుకిన్క బూని తా
చిన, యది నాకు మన్ననయ, చెల్వగు నీ పదపల్లవంబు మ
త్తను పులకాగ్రకంటక వితానము తాకిన నొచ్చునంచు నే
ననియెద నల్క మానవుగదా యికనైన నరాళకుంతలా!
దేవుళ్ళైనా దేవుళ్ళాడేంత మహత్తు దీనిలో ఉన్నదంటే ఇంక సామాన్యుల మాటేం చెపుతాం! ఇంతకీ ఆ రెండో దేవుడెవరో ఆలోచించారా? కనిపెట్టారా? అబ్బా ఆశ! అప్పుడే చెప్పేస్తే మజా ఏముంటుంది. అది తెలియాలంటే తదుపరి టపాకోసం ఎదురుచూడండి మరి. :-)
(తెలిసిన వాళ్ళు గుట్టు రట్టు చెయ్యకుండా, ఈ టపాకి వ్యాఖ్యలని మోడరేట్ చేస్తున్నానోచ్!)
పూర్తిగా చదవండి...
Thursday, December 15, 2011
చెప్పుకోండి చూద్దాం! - సమాధానం
ఇ ఈ లు ఋకారసహిత మె ఏ లకు నౌ
ఉ ఊ ల్దమలో నొడఁబడి
ఒ ఓ లకు వళ్లగు న్నయోన్నతచరితా!
సనత్ గారు సరిగానే కనుకున్నారు. గోపాలకృష్ణగారు చక్కగా వివరించారు!
"అఆ", "ఇఈ" - ఇలా అచ్చులు కలిపి చదివేటప్పుడు మొదటి అచ్చు హ్రస్వమే అయినా, దాన్ని పలకడంలో కొంత ఎక్కువ సమయం తీసుకుంటాము కాబట్టి అది గురువే అవుతుంది. ఒక రకంగా యిది విసర్గకి దగ్గర చుట్టం. "దుఃఖము" అన్న పదంలో దు అనేది దీర్ఘం కాదు. "ఖ" సంయుక్తాక్షరమూ కాదు. అయినా "దుః" అన్న అక్షరం గురువెందుకు అవుతోంది? దాన్ని ఉచ్చరించేటప్పుడు కాస్తంత ఆగి, తర్వాత "ఖ"ని ఉచ్చరిస్తాము. అందుకు "దుః" అన్నది గురువు. అలాగే "అఆ" అని కలిపి చదివేటప్పుడు "అ"ని పలికిన తర్వాత కొద్దిగా ఆపి "ఆ"ని పలుకుతాము. దీన్నే ఇంగ్లీషులో glottal stop అంటారు. ఎందుకిలా ఆపుతాము? మన భాషా స్వరూపం వల్ల! తెలుగులో పదం మధ్యలో అచ్చు అక్షరం రాదని తెలుసు కదా. ఒక వేళ రెండు పదాలు కలిపేటప్పుడు, రెండవ పదం మొదట అచ్చు ఉందంటే, అది "య"కారంగా మారిపోతుంది! "మా అమ్మ"ని కలిపి గబగబా అనాలంటే మాయమ్మ అవుతుంది. అలాగే "మా ఇల్లు" మొదలైనవి.
అయితే "అఆ"ని పలికాల్సినప్పుడు "ఆ" అన్నది పలికి తీరాలి, అది "యా"గా మార లేదు. అంచేత ఆ రెంటిని గబగబా కలిపి పలకడం కుదరదు. పలకడంలో వాటి మధ్య అనివార్యంగా కొంత ఖాళీ వస్తుంది. కాబట్టి, ఆ ఖాళీ సమయాన్ని కూడా "అ" ఉచ్చారణలో భాగం చేసి, "అ" గురువైపోతుందన్న మాట!
పూర్తిగా చదవండి...
Sunday, November 27, 2011
కంకంటి కవిత్వం
ఇంతకు బూని వచ్చి వచియింపక పోదునె? విన్ము తల్లి! దు
శ్చింతులు దైత్యు చేబడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవా
డెంత విమోహి రాముడని యెగ్గులు వల్కిన నాలకించి భూ
కాంతుడు నిందజెంది నిను గానలలోపల డించి రమ్మనెన్
ఈ పద్యమూ, యీ సన్నివేశమూ అందరికీ సుపరిచితమే. సీతమ్మను అడవిలో వదిలిపెట్టడానికి తీసుకువచ్చిన లక్ష్మణుడి కంట కన్నీరు చూసి సీతాదేవి ఆందోళన పడి ఏమిటని అడుగుతుంది. పూర్వం వనవాసం చేసినప్పుడు కాని, ఇంద్రజిత్తుతో ముఖాముఖీ యుద్ధం చేస్తున్నప్పుడు కాని, రావణాసురుని శక్తి నీ ఱొమ్ములో గుచ్చుకున్నప్పుడు కాని, రాని కన్నీరు ఇప్పుడు వచ్చిందేమిటని అడుగుతుంది. అప్పుడు లక్ష్మణుడు పలికిన మాటలివి. ఇంత చెయ్యడానికి సిద్ధపడి వచ్చి, యిప్పుడు చెప్పకుండా పోతానా తల్లీ, విను! అంటూ జరిగినది చెప్పే పద్యం. పద్యం ఎత్తుగడలోనే లక్ష్మణుడి దైన్యమంతా స్ఫురిస్తోంది. పద్యాన్ని రసవంతంగా నిర్మించడమంటే యిదీ. కంకంటి పాపరాజు రచించిన ఉత్తరరామాయణంలోని పద్యమిది. సీతాదేవిని అడవిలో వదిలిపెట్టిపోయే సన్నివేశమంతా పరమ కరుణాత్మకంగా చిత్రించాడు పాపరాజు.
ఇంతకీ ఈ రోజు ఉత్తరరామాయణం ప్రసక్తి ఎందుకు తెచ్చానో యీపాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును నేనుకూడా నిన్న శ్రీరామరాజ్యం సినిమా చూసేసాను, కుటుంబసపరివారసమేతంగా. నిక్కచ్చిగా నిర్మొహమాటంగా చెప్పాలంటే, సినిమా ఏదో ఫరవాలేదనిపించింది. జనాకర్షణ కోసం తీరి కూర్చొని సినిమాని చెడగొట్టలేదన్న తృప్తి ఒక్కటే మిగిలింది. బహుశా మొగుడులాంటి సినిమాలు రెండు మూడు చూసిన మీదట యీ సినిమా చూసుంటే యిది అద్భుతం అనిపించేదేమో! :) కాస్త బాగున్నవంటూ అనిపించినవి స్క్రీన్ ప్లే, కొన్నిచోట్ల సంభాషణలు. అంతే. మొదటి సీనులోనే ఒక చిన్న ఝలక్ - భరతుడు రాముని రంగులో లేడేమిటి అని. వాల్మీకి రామాయణంలో యిద్దరూ నీలమేఘశ్యాములే కదా! పౌరాణిక సినిమాల సంభాషణలు మామూలు వాడుక భాషకి ఎంత దగ్గరగా ఉన్నా, అవి సాంఘిక సినిమాలో సంభాషణల కన్నా చాలా తేడాగా ఉంటాయి. వాటిని పలకే ప్రత్యేక విధానమొకటి (దీన్నే "డిక్షన్" అంటారనుకుంటా ఇంగ్లీషులో) మన పాత సినిమావాళ్ళు ఏర్పరచారు. అది బాగా పట్టుబడితే కాని సినిమా రక్తికట్టదు. ఈ సినిమాలో అది పూర్తిగా లోపించింది. పాత పౌరాణికాలు చూడని యీ తరం వాళ్ళకి నచ్చి ఉంటుందేమో నాకు తెలియదు. నచ్చితే మంచిదే! లేదంటే తెలుగువాళ్ళకి ప్రత్యేకమైన మరొక సాంస్కృతిక అంశం కాలగర్భంలో కలిసిపోయినట్టే. పౌరాణిక సినిమాలో పద్యాలు లేకపోవడమూ లోటే! అయితే ఈ సినిమాలో పద్యాలు లేవన్న బాధకన్నా, పద్యాలు పెట్టలేని స్థితి ఏర్పడిందే అని ఎక్కువ బాధగా ఉంది. ఒక్క తరంలో యింత తేడానా! ఈ కాలంలో పద్యాలు ఎవరికి అర్థమవుతాయి అని చాలామంది అంటున్నారు. కాని నా ఉద్దేశంలో సమస్య అర్థమవ్వడము కాకపోవడమూ కాదు. ఇంతకు ముందు మాత్రం సినిమాలో పద్యాలందరికీ అర్థమైపోయి ఆదరించారా? పద్యాలపైన యిష్టం అభిరుచి పోయింది. ఒక రకమైన విముఖత కూడా ఏర్పడింది. అదీ సమస్య! ఇది కాలానుగుణంగా వచ్చిన మార్పని కొందరు కొట్టిపారేస్తారు. కాలం మార్పుకి సూచకమే కాని మార్పుని తెచ్చేది కాదన్న విషయం ఎంతమంది ఆలోచిస్తున్నారు? మార్పు రెండు రకాలు. ఒకటి మనిషి ప్రమేయం లేనిది (ప్రకృతి సహజం). రెండు మనిషి ప్రమేయమున్నది. కాలంతో జరిగే మార్పులన్నీ ప్రకృతి సహజంగా వచ్చేవి కావు. వచ్చే ప్రతి మార్పు మంచికే అన్న దురభిప్రాయమూ ఉంది. అదికూడా తప్పే. మన సంస్కృతిలో వస్తున్న యీ మార్పులు సహజమైనవా, వీటి ఫలితాలేమిటి అన్న ప్రశ్నలు వేసుకొని సమాధానం వెతుక్కోవలసిన అవసరం మనకి లేదా?
ఎక్కణ్ణుంచో ఎక్కడికో వెళ్ళిపోయాను! మనిషి కోతినుండి పుట్టేడనడానికి యీ శాఖాచంక్రమణం ఒక బహుచక్కని తార్కాణం. :-) మళ్ళీ పాపరాజు దగ్గరకి వచ్చేద్దాం.
లక్ష్మణుడు చెప్పిన వార్త విన్న సీత పరిస్థితిని యిలా వర్ణించాడా కవి:
ఊరక వెక్కివెక్కి యేడ్చుచు, నేడుపు విడిచి మౌనంబు పూనుచు, మౌనంబు మాని తనలో దా నగుచు, నగవుడిగి తల యూచుచు, దల యూచుట విడిచి ముక్కుపై వ్రేలు గీలుగొలుపుచు, జాలిగొని హాహాకారంబు సలుపుచు, దలపని తలపులివిగో! చూచితే? లక్ష్మణా! యని యతని దిక్కు చూడ్కులు నిగిడించి యిట్లనియె:
అడలకు మన్న! నీకు వసుధాధిపునానతి దాట వచ్చునే?
యిడుముల జెందుమంచు విధి యీ ధర నన్ను సృజించి యుండగా
గడవగ నెవ్వరోపుదురు? కానల కేగిననాడె యాపదల్
గడచితి నంచు నుంటి; నెఱుగన్ దుది నిట్లగు నంచు నా మదిన్
కళవళమంది తెల్పితివొ? కాక పరాకున దప్ప వింటివో?
కల నయినన్ రఘూద్వహుడు కానలలో నను ద్రోయ బంచునే?
తెలిసి గణింపు లక్ష్మణ! మతిభ్రమ యైనదొ? హా! సహింపు మి
ప్పలుకు; లెఱుంగ కంటి; వెత బాటిలె; నీకొక భ్రాంతి యున్నదే!
కవి చిత్రించిన యీ దృశ్యానికి వ్యాఖ్యానమక్కరలేదు. కనులముందర కదలాడి కనులలో నీరు చేరక మానదు. లక్ష్మణా నీకు మతికాని భ్రమించ లేదు కదా అని, మళ్ళీ అంతలోనే, నన్ను క్షమించు, బాధలో అలా అన్నాను కాని నీకు భ్రాంతి కలగడమేమిటని మరింత శోకమగ్న అయిన జానకీదేవి యిలా అంటుంది:
ఎన్నటికిన్ రఘూద్వహుని నేనును; నన్నిక రామచంద్రుడున్
గన్నుల జూడ గల్గదొకొ! కల్గక యుండిన బ్రాణ మేల పో
దన్న! రఘుప్రవీరు చెవులారగ నింతయు దెల్పు; నాదు మే
నున్నది; చెంత గంగమడు గున్నది; యైనటు లయ్యెడున్ దుదిన్
రామునికి "చెవులారాగ" తన స్థితిని చెప్పమంది సీత. ఆమె మనసులోని ఉద్వేగమంతా ఆ ఒక్కమాటలో వ్యక్తం చేసాడు పాపరాజు! రాముడు తనని వదిలేసాడన్న బాధకన్నా, తనకి ఒక్కమాటకూడా చెప్పకుండా పంపించేసాడన్న బాధే సీత మనసుని ముక్కలుచేసింది.
ఎఱగని మూఢులాడుకొను నెగ్గులకున్ భయమంది, యప్పుడే
కఱకుమనంబుతో విభుడు కాననసీమకు బంచెగాక; య
త్తెఱ గొకసారి నన్ బిలచి, తెల్పి, మనోవ్యథ దీర్చి, నిన్ను నే
మఱనని బంపడయ్యె; నభిమానము గూర్మియు నెందుబోయెనో!
దీనికి రాముని దగ్గర సమాధానం లేదు!
కవిత్వంలో గొప్ప దర్శకత్వ ప్రతిభకి మచ్చుతునక అనిపించే పద్యమొకటి యీ సన్నివేశంలో చిత్రించాడు కంకంటి పాపరాజు. సీతని వదలి లక్ష్మణుడు రథమ్మీద తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయే ఆ రథాన్ని సీతాదేవి చూస్తున్న దృశ్యమది:
రమణి మఱికొంత వడిదాక రథము జూచు
దరుణి మఱికొంతసేపు కేతనము జూచు
గాంత మఱిమీద రథపరాగంబు జూచు
బడతి మఱియంతటను వట్టిబయలు సూచు
కొంతసేపలా వెళిపోతున్న రథాన్ని చూసింది సీత. ఆ తర్వాత కొంతసేపు రథంపైన ఎగురుతున్న జెండాని మాత్రమే చూడగలిగింది. ఆపైన కొంతసేపు రథం వెళ్ళేదారిలో ఎగిరిన దుమ్ము మాత్రమే చూస్తూ నిలుచుంది. ఆ తర్వాత కొంతసేపటికి వట్టి బయలుని మాత్రం చూస్తూ ఉండిపోయింది! ఉత్తమమైన కవిత్వానికి యీ పద్యమొక గొప్ప ఉదాహరణ! ఉత్తరరామాయణంలో యీ ఒక్క సన్నివేశంతో తెలుగు సాహిత్యంలో స్థిరస్థానాన్ని సంపాదించిన కవి కంకంటి పాపరాజు.
కొసమెరుపు: శ్రీరామరాజ్యం సినిమాలో ఆంగికం ఆహార్యం అన్నీ సరిగ్గా కుదిరాయని నాకనిపించిన ఒకే ఒక పాత్ర ఏమిటో చెప్పుకోండి చూద్దాం! సరే, ఒక చిన్న క్లూ.
పూర్తిగా చదవండి...
Monday, November 7, 2011
శ్రీవికటకవిస్కీ
ఇవాళ తీరిగ్గా కూర్చొని అల్మారాలోంచి గుడ్డివేటుగా ఓ పుస్తకం తీస్తే "సిప్రాలి" చేతికొచ్చింది. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అయినట్టుగా, సిరిసిరిమువ్వ ప్రాసక్రీడలు లిమఋక్కులు కలిసి సిప్రాలి. ఎఱ్ఱటి అట్టమీద చెయ్యెత్తి ఏదో ఆవేశంగా చదువుతున్న శ్రీశ్రీ నలుపుతెలుపుల ఛాయాచిత్రం. చూస్తే నవ్వొచ్చింది. శ్రీశ్రీ ఒఠ్ఠి ఎఱ్ఱకవీ కాదూ, అతనిది నలుపుతెలుపుల వ్యక్తిత్వమూ కాదు. అతనిలో ఉన్న అనేక రంగులకీ అనేక ఛాయలకీ యీ సిప్రాలి పుస్తకమే నిదర్శనం. "What an irony!" అనిపించింది. శ్రీశ్రీలో బ్రహ్మాండమైన వికటత్వం ఉంది. దాని విశ్వరూపం ఇందులో కనిపిస్తుంది - భాషలోనూ భావంలోనూ కూడా. సరే ఎలాగూ తీసాను కదా అని ఓ నాలుగు సిరిసిరిమువ్వ లిక్కడ రువ్వుదామనిపించింది.
అందంగా, మధురస ని
ష్యందంగా, పఠితృహృదయ సంస్పందంగా
కందాలొక వంద రచిం
చిందుకు మనసయ్యె నాకు సిరిసిరిమువ్వా!
అంటూ మొదలుపెడతాడు తన శతకాన్ని. అందులో నిజంగా వంద కందాలున్నాయో లేదో నేను లెక్కపెట్టలేదు. అది అనవసరం. అందం మాట ఎలా ఉన్నా "మధురస" నిష్యందంగానే సాగుతుంది శతకం. :-)
ఎప్పుడో, భావకవిత్వ ప్రభావంనుంచి యింకా బయటపడని రోజుల్లో రాసాడు పద్యాలు!
మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!
దటీజ్ శ్రీశ్రీ!
సరే యిలా పద్యాలు రాయడం మొదలుపెట్టేసరికల్లా, హరిహరనాథుడు తిక్కనగారికి సాక్షాత్కారమైనట్లు చక్రపాణిగారు శ్రీశ్రీ కలలో కనిపించి యిలా అన్నారట:
నీకొక సిగరెట్టిస్తా
నాకొక శతకమ్ము రాసి నయముగ నిమ్మా,
త్రైకాల్య స్థాయిగ నీ
శ్రీ కావ్యము వరలునోయి సిరిసిరిభాయీ!
సిగరెట్టుకో శతకం - భలే మంచి చౌకబేరమూ!
దుష్కర ముష్కర ప్రాసలతో పద్యం రాయడం శ్రీశ్రీకి విస్కీ తాగినంత సులువు. నమ్మకం లేకపోతే యీ పద్యం చూడండి:
వాగ్న్యూనత లేల, మహో
గ్రాగ్న్యుర్వీధరము నీవె, అమృత హిమానీ
రుగ్న్యగ్రోధము నీవె, అ
సృగ్నృత్య గురుండ నీవె సిరిసిరిసుకవీ!
ఇందులో అర్థంపర్థం లేదనుకోకండి, ఉంది. భాషాపండితుల పండ్లదిటవుకిది ఒక ఎక్సర్సైజుగా వదిలేస్తున్నాను.
కావ్యం రచిస్తూ ముందుగా ఇష్టదేవతా ప్రార్థన చెయ్యాలి కదా. దానికోసం తెనాలి రాముని (రామలింగడా, రామకృష్ణుడా అన్న పేచీ రాకుండా "తెనాలి రాముని" అనడం శ్రీశ్రీ కవితాలౌక్యం), గాడిద ఏడుపుని పొగిడిన కవి చౌడప్పనీ, టిట్టిభ సెట్టినీ (ఇతనెవరో చెప్పినవారికి ఒక సెహభాష్ బహుమతి!), కూచిమంచి జగ్గకవినీ, పనిలో పనిగా గిరీశాన్నీ, జంఘాలశాస్త్రినీ, బారిస్టర్ పార్వతీశాన్నీ స్తుతిస్తాడు. వేమన కృష్ణశాస్త్రులని ఒకే పద్యంలోనూ, "చుళుకీకృత కాఫీ టీ జలనిధి"నీ (అబ్బా ఆశ, ఇదెవరో నే చెప్పనుగా! చెప్పాలంటే మరో పద్యం ముచ్చటించాలి. అది మరోసారి :-)) కూడా అదే అదాటున పొగిడేస్తాడు. మచ్చుకి జంఘాలశాస్త్రి పద్యం:
జంఘాలశాస్త్రి, మానవ
సంఘాల వ్రణాల పాలి శస్త్రిన్, స్తుత్యు
ల్లంఘన వాగ్రచనల మే
స్త్రిం ఘన భక్తిన్ స్మరింతు సిరిసిరిమువ్వా!
ఆ తర్వాత అతను చెప్పే శ్రీరంగ నీతులు, భర్తృహరి పద్ధతిలో వైరాగ్య మూర్ఖ పద్ధతులూ, సర్రియలిస్టుల భావ భంగిమలూ, ప్రబంధశైలిలోని కుకవినిందలూ, ఉపాలంభనాలూ, సరదా జరదా చాటువులూ ఎన్నెన్నో. అన్నీ తళుక్కున కవ్వించేవే. చురుక్కున నవ్వించేవే. మచ్చుకి కొన్ని.
మీసాలకి రంగేదో
వేసేస్తే యౌవనం లభించదు నిజమే!
సీసా లేబిల్ మార్చే
స్తే సారా బ్రాంది యగునె? సిరిసిరిమువ్వా!
ఉగ్గేల త్రాగుబోతుకు?
ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో?
విగ్గేల కృష్ణశాస్త్రికి?
సిగ్గేలా భావకవికి? సిరిసిరిమువ్వా!
నాకూ ఈ లోకానికి
తూకం సరికుదరలేదు తొలినుంచీ, అ
బ్బే! కప్పల తక్కెడ వలె
చీకట్లో చిందులాట సిరిసిరిమువ్వా!
తలకాయలు తమతమ జే
బులలోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజులు వస్తే
సెలవింక డెమోక్రెసీకి సిరిసిరిమువ్వా!
పెదబాలశిక్ష చదివీ
చదవడమే తడవుగాగ సాహిత్య విశా
రదులయినట్లుగ భావిం
చెదరు గదా కొంతమంది సిరిసిరిమువ్వా!
విసుమానముగ ఖరక్షీ
రసాగర గరంగరం తరంగాంతర దీ
ర్ఘ సుషుప్తిలోంచి మేల్కాం
చి సలాం కావించెనొకడు సిరిసిరిమువ్వా!
(ఇది అధివాస్తవిక భంగిమలు తెలిపే పద్యాలలో ఒక పద్యం. ఖరక్షీరసాగరాన్ని ఊహించడం శ్రీశ్రీకే చెల్లింది!)
ఓ! అంతా కవులే, అ
ఆ ఇ ఈలైనరాని యంబ్రహ్మలె, మే
మా ఋషులం అని, ఛీ
ఛీ, ఎంతటి నవ్వుబాటు సిరిసిరిమువ్వా!
కోట్లకొలది ప్రజలను చీ
కట్లోపల వదిలి నేటి కాంగ్రెస్ రాజ్యం
కాట్లాటల పోట్లాటల
చీట్లాటగ మారిపోయె సిరిసిరిమువ్వా!
అసలు సమస్యలు గ్రాసం,
వసనం, వాసం! అలాంటి వాటిని చూపే
పస లేక గింజుకొని చ
చ్చి సున్నమవుతోంది ప్రభుత! సిరిసిరిమువ్వా!
(పై రెండు పద్యాలూ శ్రీశ్రీ పేరు చెప్పుకొని నేనిప్పుడు రాసినవి కావు. అచ్చంగా శ్రీశ్రీనే స్వతంత్రం రాబోయే ముందురోజుల్లో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నప్పుడు రాసిన పద్యాలు!)
జగణంతో జగడం కో
రగా దగదు కాని దాని ఠస్సాగొయ్యా!
నగలాగ వెలుగును గదా
చిగిర్చితే నాలుగింట సిరిసిరిమువ్వా!
(శ్రీశ్రీకి ఛందస్సుపైనున్న పట్టుకి యీ పద్యమొక మచ్చుతునక. రెండవ పాదంలోనున్న యతి ఏమిటో తెలుసా? అది శ్రీశ్రీ కనిపెట్టిన "కంటికింపయిన యతి"!)
భాషకొక స్థాయినిచ్చే
ప్రాసలు యతు లకంకృతులు వ్యాకృతు లయ్యో
పైసొగసుపూతకైతే
చేసేదేమున్నదింక! సిరిసిరిమువ్వా!
(ఛందోలంకారాల అసలు కీలకమీ పద్యంలో ఉంది!)
ఈ కావ్యం దట్టమగు పొ
గాకు పొగల నట్టనడుమ కాంచెను జన్మన్
లోకంలో సహృదయులే
చేకొందురు గాక దీని సిరిసిరిమువ్వా!
ఈ శతకం ఎవరైనా
చూసి, చదివి, వ్రాసి, పాడి, సొగసిన, సిగరెట్
వాసనలకు కొదవుండదు
శీశు కరుణ బలిమివలన సిరిసిరిమువ్వా!
అన్న ఫలశ్రుతితో, చాలా సంప్రదాయబద్ధంగా ముగుస్తుందీ శతకం! :-)
దీన్ని చదివిన గమ్మత్తులో, నాకూ ఓ పద్యం తన్నుకొచ్చింది:
విస్కీ ప్రాయము కాదా
ప్రాస్కేళిని సలుపుటన్న! పద్యములన్నన్
రేస్కోర్సులోని గుఱ్ఱాల్
శ్రీస్కీతో పెట్టుకోకు సిరిసిరిమువ్వా!
పూర్తిగా చదవండి...