తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, November 7, 2011

శ్రీవికటకవిస్కీ

ఇవాళ తీరిగ్గా కూర్చొని అల్మారాలోంచి గుడ్డివేటుగా ఓ పుస్తకం తీస్తే "సిప్రాలి" చేతికొచ్చింది. శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ అయినట్టుగా, సిరిసిరిమువ్వ ప్రాసక్రీడలు లిమఋక్కులు కలిసి సిప్రాలి. ఎఱ్ఱటి అట్టమీద చెయ్యెత్తి ఏదో ఆవేశంగా చదువుతున్న శ్రీశ్రీ నలుపుతెలుపుల ఛాయాచిత్రం. చూస్తే నవ్వొచ్చింది. శ్రీశ్రీ ఒఠ్ఠి ఎఱ్ఱకవీ కాదూ, అతనిది నలుపుతెలుపుల వ్యక్తిత్వమూ కాదు. అతనిలో ఉన్న అనేక రంగులకీ అనేక ఛాయలకీ యీ సిప్రాలి పుస్తకమే నిదర్శనం. "What an irony!" అనిపించింది. శ్రీశ్రీలో బ్రహ్మాండమైన వికటత్వం ఉంది. దాని విశ్వరూపం ఇందులో కనిపిస్తుంది - భాషలోనూ భావంలోనూ కూడా. సరే ఎలాగూ తీసాను కదా అని ఓ నాలుగు సిరిసిరిమువ్వ లిక్కడ రువ్వుదామనిపించింది.

అందంగా, మధురస ని
ష్యందంగా, పఠితృహృదయ సంస్పందంగా
కందాలొక వంద రచిం
చిందుకు మనసయ్యె నాకు సిరిసిరిమువ్వా!

అంటూ మొదలుపెడతాడు తన శతకాన్ని. అందులో నిజంగా వంద కందాలున్నాయో లేదో నేను లెక్కపెట్టలేదు. అది అనవసరం. అందం మాట ఎలా ఉన్నా "మధురస" నిష్యందంగానే సాగుతుంది శతకం. :-)

ఎప్పుడో, భావకవిత్వ ప్రభావంనుంచి యింకా బయటపడని రోజుల్లో రాసాడు పద్యాలు!

మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
పళ్ళూడిన ముసిలిది కు
చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!

దటీజ్ శ్రీశ్రీ!

సరే యిలా పద్యాలు రాయడం మొదలుపెట్టేసరికల్లా, హరిహరనాథుడు తిక్కనగారికి సాక్షాత్కారమైనట్లు చక్రపాణిగారు శ్రీశ్రీ కలలో కనిపించి యిలా అన్నారట:

నీకొక సిగరెట్టిస్తా
నాకొక శతకమ్ము రాసి నయముగ నిమ్మా,
త్రైకాల్య స్థాయిగ నీ
శ్రీ కావ్యము వరలునోయి సిరిసిరిభాయీ!

సిగరెట్టుకో శతకం - భలే మంచి చౌకబేరమూ!

దుష్కర ముష్కర ప్రాసలతో పద్యం రాయడం శ్రీశ్రీకి విస్కీ తాగినంత సులువు. నమ్మకం లేకపోతే యీ పద్యం చూడండి:

వాగ్న్యూనత లేల, మహో
గ్రాగ్న్యుర్వీధరము నీవె, అమృత హిమానీ
రుగ్న్యగ్రోధము నీవె, అ
సృగ్నృత్య గురుండ నీవె సిరిసిరిసుకవీ!

ఇందులో అర్థంపర్థం లేదనుకోకండి, ఉంది. భాషాపండితుల పండ్లదిటవుకిది ఒక ఎక్సర్సైజుగా వదిలేస్తున్నాను.

కావ్యం రచిస్తూ ముందుగా ఇష్టదేవతా ప్రార్థన చెయ్యాలి కదా. దానికోసం తెనాలి రాముని (రామలింగడా, రామకృష్ణుడా అన్న పేచీ రాకుండా "తెనాలి రాముని" అనడం శ్రీశ్రీ కవితాలౌక్యం), గాడిద ఏడుపుని పొగిడిన కవి చౌడప్పనీ, టిట్టిభ సెట్టినీ (ఇతనెవరో చెప్పినవారికి ఒక సెహభాష్ బహుమతి!), కూచిమంచి జగ్గకవినీ, పనిలో పనిగా గిరీశాన్నీ, జంఘాలశాస్త్రినీ, బారిస్టర్ పార్వతీశాన్నీ స్తుతిస్తాడు. వేమన కృష్ణశాస్త్రులని ఒకే పద్యంలోనూ, "చుళుకీకృత కాఫీ టీ జలనిధి"నీ (అబ్బా ఆశ, ఇదెవరో నే చెప్పనుగా! చెప్పాలంటే మరో పద్యం ముచ్చటించాలి. అది మరోసారి :-)) కూడా అదే అదాటున పొగిడేస్తాడు. మచ్చుకి జంఘాలశాస్త్రి పద్యం:

జంఘాలశాస్త్రి, మానవ
సంఘాల వ్రణాల పాలి శస్త్రిన్, స్తుత్యు
ల్లంఘన వాగ్రచనల మే
స్త్రిం ఘన భక్తిన్ స్మరింతు సిరిసిరిమువ్వా!

ఆ తర్వాత అతను చెప్పే శ్రీరంగ నీతులు, భర్తృహరి పద్ధతిలో వైరాగ్య మూర్ఖ పద్ధతులూ, సర్రియలిస్టుల భావ భంగిమలూ, ప్రబంధశైలిలోని కుకవినిందలూ, ఉపాలంభనాలూ, సరదా జరదా చాటువులూ ఎన్నెన్నో. అన్నీ తళుక్కున కవ్వించేవే. చురుక్కున నవ్వించేవే. మచ్చుకి కొన్ని.

మీసాలకి రంగేదో
వేసేస్తే యౌవనం లభించదు నిజమే!
సీసా లేబిల్ మార్చే
స్తే సారా బ్రాంది యగునె? సిరిసిరిమువ్వా!

ఉగ్గేల త్రాగుబోతుకు?
ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో?
విగ్గేల కృష్ణశాస్త్రికి?
సిగ్గేలా భావకవికి? సిరిసిరిమువ్వా!

నాకూ ఈ లోకానికి
తూకం సరికుదరలేదు తొలినుంచీ, అ
బ్బే! కప్పల తక్కెడ వలె
చీకట్లో చిందులాట సిరిసిరిమువ్వా!

తలకాయలు తమతమ జే
బులలోపల దాచుకొనుచు పోలింగుకు పో
వలసిన రోజులు వస్తే
సెలవింక డెమోక్రెసీకి సిరిసిరిమువ్వా!

పెదబాలశిక్ష చదివీ
చదవడమే తడవుగాగ సాహిత్య విశా
రదులయినట్లుగ భావిం
చెదరు గదా కొంతమంది సిరిసిరిమువ్వా!

విసుమానముగ ఖరక్షీ
రసాగర గరంగరం తరంగాంతర దీ
ర్ఘ సుషుప్తిలోంచి మేల్కాం
చి సలాం కావించెనొకడు సిరిసిరిమువ్వా!
(ఇది అధివాస్తవిక భంగిమలు తెలిపే పద్యాలలో ఒక పద్యం. ఖరక్షీరసాగరాన్ని ఊహించడం శ్రీశ్రీకే చెల్లింది!)

ఓ! అంతా కవులే, అ
ఆ ఇ ఈలైనరాని యంబ్రహ్మలె, మే
మా ఋషులం అని, ఛీ
ఛీ, ఎంతటి నవ్వుబాటు సిరిసిరిమువ్వా!

కోట్లకొలది ప్రజలను చీ
కట్లోపల వదిలి నేటి కాంగ్రెస్ రాజ్యం
కాట్లాటల పోట్లాటల
చీట్లాటగ మారిపోయె సిరిసిరిమువ్వా!

అసలు సమస్యలు గ్రాసం,
వసనం, వాసం! అలాంటి వాటిని చూపే
పస లేక గింజుకొని చ
చ్చి సున్నమవుతోంది ప్రభుత! సిరిసిరిమువ్వా!

(పై రెండు పద్యాలూ శ్రీశ్రీ పేరు చెప్పుకొని నేనిప్పుడు రాసినవి కావు. అచ్చంగా శ్రీశ్రీనే స్వతంత్రం రాబోయే ముందురోజుల్లో మద్రాసు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమున్నప్పుడు రాసిన పద్యాలు!)

జగణంతో జగడం కో
రగా దగదు కాని దాని ఠస్సాగొయ్యా!
నగలాగ వెలుగును గదా
చిగిర్చితే నాలుగింట సిరిసిరిమువ్వా!

(శ్రీశ్రీకి ఛందస్సుపైనున్న పట్టుకి యీ పద్యమొక మచ్చుతునక. రెండవ పాదంలోనున్న యతి ఏమిటో తెలుసా? అది శ్రీశ్రీ కనిపెట్టిన "కంటికింపయిన యతి"!)

భాషకొక స్థాయినిచ్చే
ప్రాసలు యతు లకంకృతులు వ్యాకృతు లయ్యో
పైసొగసుపూతకైతే
చేసేదేమున్నదింక! సిరిసిరిమువ్వా!

(ఛందోలంకారాల అసలు కీలకమీ పద్యంలో ఉంది!)

ఈ కావ్యం దట్టమగు పొ
గాకు పొగల నట్టనడుమ కాంచెను జన్మన్
లోకంలో సహృదయులే
చేకొందురు గాక దీని సిరిసిరిమువ్వా!

ఈ శతకం ఎవరైనా
చూసి, చదివి, వ్రాసి, పాడి, సొగసిన, సిగరెట్
వాసనలకు కొదవుండదు
శీశు కరుణ బలిమివలన సిరిసిరిమువ్వా!

అన్న ఫలశ్రుతితో, చాలా సంప్రదాయబద్ధంగా ముగుస్తుందీ శతకం! :-)

దీన్ని చదివిన గమ్మత్తులో, నాకూ ఓ పద్యం తన్నుకొచ్చింది:

విస్కీ ప్రాయము కాదా
ప్రాస్కేళిని సలుపుటన్న! పద్యములన్నన్
రేస్కోర్సులోని గుఱ్ఱాల్
శ్రీస్కీతో పెట్టుకోకు సిరిసిరిమువ్వా!

19 comments:

 1. శ్రీశ్రేయోదాయక శ
  బ్దాశ్రిత సత్కవిత వెల్లువై ముంచెత్తున్
  సాశ్రువుఁడ నౌదు ముదమున
  శ్రీశ్రీ సిప్రాలి చదివి సిరిసిరిమువ్వా!

  ReplyDelete
 2. "మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ
  న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్
  పళ్ళూడిన ముసిలిది కు
  చ్చిళ్ళన్ సవరించినట్టు సిరిసిరిమువ్వా!"

  హహ్హ. ఇది చాలా బాగుంది :)

  ReplyDelete
 3. మాకూ ఓ గుక్కెడు ఒంపినందుకు సంతోషమండీ.. :)

  ReplyDelete
 4. బాగుందండీ, మీ పద్యం కూడా అదిరింది.

  ReplyDelete
 5. టిట్టిభశెట్టి - క్రీడాభిరామంలో సెకండు హీరో. ఈయన ఘనకార్యాలేవో మటుకు గుర్తు లేదు. చాలా కాలం క్రిందట చదివి మర్చిపోయాను.

  ReplyDelete
 6. కాఫీటీ జలనిధి జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి - ఇందులోనే రుక్కాయిని సంబోధిస్తూ చెప్పిన ఒక అరడజను పద్యాలు కూడ ఉండాలి
  పద్యమంటే అంతా సీరియస్సు, మూతి బిగింపులే కాదు, ఇలాంటి సరదా చమక్కులు కూడా ఉంటాయని చాటుతూ మంచి టపా రాశారు.
  ఇటీవలి కాలంలో ఆచార్య అక్కిరాజు సుందరరామకృష్ణగారు ఇంచుమించు ఇంతటి పెంకితనంతోనూ దానికి తూగిన క్రియేటివిటీతోనూ శతకాలు రాస్తున్నారు.

  ReplyDelete
 7. వ్యాఖ్యాతలకి ధన్యవాదాలు. రవికి, మౌనిగారికి చెరో వీరతాడు! శంకరయ్యగారు, బాగుంది పద్యం.
  మౌనిగారు, అవును సిప్రాలిలో రుక్కుటేశ్వర శతకం అనికూడా కొన్ని పద్యాలున్నాయి. అవి మరోసారి. అక్కిరాజుగారి పద్యాలు కొన్ని రుచి చూపిస్తే చదివి ఆనందిస్తాం.

  ReplyDelete
 8. మెప్పులు మన కెందుకులే
  కప్పుడు కాఫీయె ధరణిఁ గఱవగు వేళన్
  గొప్పగ కవితలు పుట్టునె
  చెప్పక తప్పింది గాదు సిరి సిరి మువ్వా !!

  ReplyDelete
 9. మీ పద్యము ,శ్రీ శంకరయ్య గారి పద్యము హృద్యముగా ఉన్నాయి.సిప్రాలి నేనూ చదివాను ఆనందించాను.

  ReplyDelete
 10. నమస్కారమండీ.

  ఓ! అంతా కవులే, అ
  ఆ ఇ ఈలైనరాని యంబ్రహ్మలె, మే
  మా ఋషులం అని, ఛీ
  ఛీ, ఎంతటి నవ్వుబాటు సిరిసిరిమువ్వా

  అనే ఈ పద్యములోని ప్రాస గురించి కొంచము చెప్పగలరా??

  అలాగే, రగా దగదు కాని దాని ఠస్సాగొయ్యా!లో కూడ యతి మైత్రిని కొంచము వివరించ గలరా?? ర - ఠ చూడటానికి యతికుదిరినట్టె వుంది కానీ, పలికేటప్పుడు కాదు కదా. ర- ఠ లకు యతి సరిపోదుకదా??

  ReplyDelete
 11. సంపత్ కుమార్ శాస్త్రిగారు,

  "ఓ! అంతా కవులే, అ" పద్యంలో ప్రాస గురించి. ప్రాసాక్షరంలో ఉండే హల్లు(లు) అన్ని పాదాల్లో ఒకటే ఉండాలి, అచ్చులు వేర్వేరవ్వచ్చు అన్నది కదా ప్రాస నియమం. ఇదే నియమం అసలు హల్లు లేకపోయినా వర్తిస్తుంది. అంటే ప్రాసాక్షరంలో అసలు హల్లు లేకుండా కేవలం అచ్చులే ఉండవచ్చన్న మాట. ఈ పద్యంలో ఉన్న ప్రాస అలాంటిది.

  ఇక "ర", "ఠ"ల యతి విషయం. ఈ రెండిటికీ యతిమైత్రి లేదు. ఇది శ్రీశ్రీ సరదాగా చేసిన ప్రయోగం. చూడడానికి దగ్గరగా ఉంటాయనే దీనికి "కంటికింపయిన యతి" అని అనే పేరుపెట్టారు.

  ReplyDelete
 12. interesting
  http://royalloyal007.blogspot.com

  ReplyDelete
 13. :)) ర ఠ లకు "కంటికింపయిన యతి" కాదనుకుంటా... సింపుల్ గా "నేత్రయతి" అని శ్రీశ్రీ పేరు పెట్టినట్లు గుర్తు.

  ReplyDelete
 14. ‘ఓ! అంతా కవులే’ పద్యంలో ప్రాసకు సంబంధించి .....
  అ ఆ ఐ ఔ లకు మఱి
  ఇ ఈ లు ఋకారసహిర మె ఏ లకు నౌ
  ఉ ఊ ల్దమలో నొడఁబడి
  ఒ ఓ లకు వళ్లగు న్నయోన్నతచరితా! (కవిజనాశ్రయం నుండి).

  ReplyDelete
 15. సందేహ నివృత్తి చేసినందుకు శ్రీ కామేశ్వరరావుగారికి, గురువులు శ్రీ కందిశంకరయ్య గారికి ధన్యవాదములు.

  ReplyDelete
 16. no words to say...,just sirasaa...namaami..!

  ReplyDelete
 17. ఓ అంతా కవులే,అ
  ఆ ఇఈలైన రాని యంబ్రహ్మలె.. అనే పద్యంలో ప్రాస గురించి సంపత్ కుమార శాస్త్రిగారడిగితే శంకరయ్యగారు కవిజనాశ్రయంనుంచి పద్యం ఉదహరించి చూపి సందేహ నివృత్తి చేసారు. కానీ ఇక్కడ గమనించ వలసిన విషయం మరొకటి ఉంది. అఆ అన్నప్పుడు ఆని వత్తి పలుకుతాము కనుక దాని ముందరి అ కూడా గురువౌతుంది.ఆ విధంగా గణాలు సరిపోతాయి.శ్రీశ్రీ సిప్రాలి చదివి ఆ ఉత్సాహంతోనే ఈ మధ్య నేను సరదా కంద పద్యాలు రాసేను. కొన్నిటిని నా బ్లాగు అపురూపం లో పెట్టడం జరిగింది.

  ReplyDelete
 18. నా సిప్రాలి ప్రతి పోయింది. దోమలను రెక్కేనుగులతో పోల్చిన పద్యం బ్లాగులో రాయగలరు.
  మేడిశెట్ట్రవిచన్ద్ర

  ReplyDelete
 19. మీ పద్యం అద్భుతం.

  ReplyDelete