తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, October 25, 2011

దీపావళి చందమామ

టపా శీర్షిక చూసి, అమావాస్య చంద్రుడిలా దీపావళి చందమామ యేమిటని కంగారు పడకండి :-) దీపావళి నాడు ఆకాశంలో చందమామ కనిపించడు కనుకనే యీ బ్లాగాకాశంలోనైనా అతణ్ణి ఉదయించేట్టు చేద్దామని చిన్న కోరిక. నరకుడిని కృష్ణుడు చంపాడనో, రావణుణ్ణి రాముడు చంపాడనో దీపావళి చేసుకుంటారన్నది పైపై మాటలేననీ, అసలు రహస్యం మరొకటి ఉందనీ నా అనుమానం. ఏమిటంటారా? చెపుతాను, సావధానంగా వినండి.

దీపావళి ఎప్పుడు వస్తుంది? అమావాస్యనాడు. అది శరత్కాలంలో వచ్చే ఒకే ఒక అమావాస్య. శరత్కాలమంటే వెన్నెలరాత్రులకి ప్రసిద్ధి. ఇప్పుడంటే నగరాల్లో ఆకాశం ఆకాశహర్మ్యాల ఆక్రమణ మధ్య బితుకుబితుకుమంటూ చిన్న చిన్న ముక్కలుగా మాత్రమే మనకి కనిపిస్తుంది. చంద్రుడు అసలే తప్పిపోతాడు. విద్యుద్దీపాల కాంతిలో వెన్నెల వెలవెల బోతుంది. ఋతువులకీ కేలండరు పేజీలకీ మధ్య, ఈ కాలపు నగరవాసులకి పెద్దగా తేడా తెలియదు. పల్లెప్రజలకింకా వాటితో అనుబంధం ఉందనుకుంటాను. శరత్కాలంలో పిండారబోసినట్లు వెన్నెల కాయడమంటే ఏమిటో వాళ్ళకి బహుశా తెలుస్తుంది. నా అదృష్టం కొద్దీ చదువుకొనే రోజుల్లో హాస్టల్లో ఉండేటప్పుడు, ఈ వెన్నెల అందాన్ని జుఱ్ఱుకొనే అవకాశం నాకు దొరికింది. కార్తీకమాసంలో, అప్పుడప్పుడే మొదలవుతున్న చిరుచలిలో, హాస్టల్ టెర్రెస్ మీద పచార్లు చేస్తూ, శరదిందుచంద్రికా వరసుధాధారలని చకోరమై ఆస్వాదించడం అందమైన అనుభవం. ఒక తీపి జ్ఞాపకం.

సరే, ప్రస్తుతానికి వస్తే, అలాంటి శరత్కాలంలో వచ్చే ఒకే ఒక అమావాస్య రాత్రి, చీకటితో నిండిపోతే సహించడమెలా? అదుగో అందుకే, ఆ రాత్రి దివ్వెలతో లోకమంతా వెలుగులు నింపెయ్యాలని, దీపావళి పండగని చేసుకోవడం మొదలుపెట్టి ఉంటామని నా ఊహ. అందుకే నా బ్లాగుని కూడా యివాళ జాబిలి జిలిబిలి వెలుగులతో నింపాలని అనుకుంటున్నాను. దీనికి మరొక ప్రేరణ రెండు రోజుల కిందట నాగమురళిగారి బ్లాగులో పెట్టిన "ఆకాశంలో ఆంబోతు" టపా.

ఇంతకీ మనకిప్పుడు కనిపించే యీ చందమామ ఎక్కడివాడు? ఎలా ఉన్నాడు? పద్యాలు చదవడం మొదలుపెట్టండి, మీకే బోధపడుతుంది.

ఆ యెచటొ యున్న యైరమ్మదీయ సరసి
లోని వెన్నెల జలము లీ లోకమందు
బాఱుదల కేర్పరచు వెలిపైడి తూము
చెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

కలువపూల చెలిమికాడు చందురుడు నడిమింట వెలుగుతున్నాడు. అతడెలా ఉన్నాడంటే - ఆకాశంలో ఎక్కడో మనకి కనిపించని చోట మెఱుపుతీగల కాంతులీనే సరసు ఉందిట. ఆ సరసంతా వెన్నెలనీరు నిండి ఉంటుంది. ఆ నీటిని మన భూమ్మీదకి పారించడానికి ఒక తూముని ఎవరో ఏర్పాటు చేసారట. అది వెలిపైడి తూము. తెల్లని బంగారంతో - అంటే వెండితో చేసిన తూము. ఆ తూమే యీ చందమామట!

శ్రీ వివస్వత్ప్రభా సమాశ్లిష్టమూర్తి
పార్వతీప్రాణనాథు శోభాశరీర
మమృతకళకును సముపోఢమైన వెలుగు
చెలగె నడిమింట గలువల చెలిమికాడు

నిత్యమూ ఐశ్వర్యప్రకాశంతో (విభూతితో) వెలిగే శోభాశరీరము కలవాడు పార్వతీప్రాణనాథుడయిన శివుడు. ఆ శరీరానికి అతి దగ్గరలో ఉన్నందువలన చంద్రునికి కూడా ఆ అమృత కళ లభించింది. అలాంటి కళతో వెలిగిపోతున్నాడీ కలువల చెలిమికాడు. ఇతడు కార్తీకమాసపు చంద్రుడు కాబోలు. అందుకే శివుని విభూతి వెన్నెలగా కురుస్తోంది!

బహుళ రాజనీతిపరముండు రాముండు
తాను హనుమబంపి వాని చర్య
యెట్టులెట్టులుండు నీక్షించు నన్నట్లు
చెలగె మింట గలువచెలిమికాడు

ఈ పద్యం అర్థమయితే సందర్భమేమిటో యిట్టే తెలిసిపోతుంది! గొప్ప రాజనీతిజ్ఞుడట రామచంద్రుడు. హనుమంతుడిని సీతాన్వేషణకి పంపి, అతడెలా తన కార్యాన్ని నిర్వహిస్తున్నాడో స్వయంగా చూద్దామని వచ్చాడా అన్నట్టుగా ఉన్నాడట ఆకాశంలోని యీ చంద్రుడు!

అదీ సందర్భం! హనుమంతుడు లంకలో సీతమ్మవారిని వెతుకుతూ ఉంటే పైనున్న చంద్రుడెలా ఉన్నాడో వర్ణించే పద్యాలివి.

మున్ను జూడనట్టి భూజాత గుర్తింప
బోవడేమొ కపివిభుండటంచు
దల్లిమోముపోల్కి దా జూపుచున్నట్లు
చెలగె మింట గలువచెలిమికాడు

తాను సీతమ్మవారిని ఎప్పుడూ చూసింది లేదే! మరి ఆమెని పోల్చుకోవడం ఎలా? హనుమంతుడలా అవస్థపడుతూ ఉంటే, అతనికి సహాయం చెయ్యడానికి ఆ అమ్మ పోలికని తాను చూపిస్తున్నాడా అన్నట్టుగా వెలుగుతున్నాడట చందమామ. ఎంతటి అద్భుతమైన ఊహ!

చిన్ననాటినుండి చందమామ చందమామ అని మన పెద్దవాళ్ళు చెపితే మనమూ అలాగే పిలిచేస్తూ వచ్చాము కాని, అసలు చంద్రుడు మనకి మామ ఎలా అయినాడో మనమెప్పుడయినా ఆలోచించామా? జగాలని పాలించే తండ్రి నారాయణుడు. చల్లని తల్లి లక్ష్మీదేవి. చంద్రుడు మరి లక్ష్మీదేవి తమ్ముడే కదా. ఇద్దరూ పాలసముద్రం నుండే పుట్టారు కాబట్టి వారు తోబుట్టువులు. మరి అమ్మ తమ్ముడు మనకి మేనమామే కదా అవుతాడు. అదీ ఆ పిలుపు వెనక రహస్యం. ఆ సంబంధాన్ని ఇక్కడ అందంగా ఉపయోగించాడు కవి. సీత సాక్షాత్తు లక్ష్మీదేవి. అక్కా తమ్ముళ్ళ మధ్యన పోలికలుంటాయి కదా. ఆ పోలికలు చూపించడానికని వచ్చినట్టున్నాడట చంద్రుడు. ఏమిటా పోలిక? చివరి దాకా చదవండి తెలుస్తుంది.

ఆంజనేయుడు మందరమై వియన్మ
హాంబునిధి వేఱ త్రచ్చిన నమృతకుంభ
మిదియు నూతన ముదయించెనేమొ యనగ
జెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

ఇది మరొక అద్భుతమైన ఊహ. ఆకాశమనే పాలసముద్రాన్ని ఆంజనేయుడే మందరపర్వతమై చిలకగా, అందులోనుండి మళ్ళీ కొత్తగా ఉద్భవించిన అమృతకుంభమా అన్నట్టుగా ఉన్నాడట చంద్రుడు!

చల్ల చేసి రాత్రి చల్లపై జేసిన
వెన్నముద్దగాగ విడిచె ననగ
చిన్ని వెన్న నల్ల చిద్రుపలు చుక్కలై
చెలగె మింట గలువచెలిమికాడు

రాతిరనే భామ వెన్నెల మజ్జిగని చిలికింది. మజ్జిగ చిలికితే పైన వెన్న ముద్దగా తేలుతుంది కదా. ఆ తేలిన వెన్నముద్దని అలాగే ఉంచేసిందిట. చిలికేటప్పుడా వెన్ననుండి కొన్ని తుంపరలు చెల్లాచెదరై చూట్టూ పడ్డాయి. ఆకాశం మధ్యలో వెలిగే చందమామ ఆ వెన్నముదట. చుట్టూ పరచుకుని ఉన్న చుక్కలే ఆ వెన్న తుంపరలట!
పైన అమృతమధనం పౌరాణికమైన కల్పనయితే, యిది పల్లెదనం నిండిన పోలిక. రెండిటిలోనూ ఉన్నది చిలకడమే! ఈ కవి ఊహ ఎంతగా ఆకాశాన్ని తాకుతుందో, దాని మూలాలు అంతగా నేలలోకి చొచ్చుకొని ఉంటాయి!

లంకలోన గలదు లావణ్యనిధి సీత
ప్రతిఫలించె నామె వదనసీమ
యాకసంపు సరసియం దన్నయట్లుగా
జెలగె మింట గలువచెలిమికాడు

కింద లంకలోనున్న సౌందర్యనిధి సీత మోము, పైన ఆకాశమనే సరస్సులో ప్రతిఫలిస్తోందా అన్నట్టుందట ఆ జాబిల్లి. అమ్మవారికీ చందమామకీ ఉన్న పోలిక యిదీ!

ఇవీ యీ చందమామ విశేషాలు. ఈపాటికే యీ కవి ఎవరో మీరు ఊహించే ఉంటారు. అవును విశ్వనాథ సత్యనారాయణగారే. రామాయణ కల్పవృక్షంలో సుందరకాండలో పూర్వరాత్రమనే ఖండములోని పద్యాలివు. ఈ సందర్భంలో చంద్రవర్ణన యిరవై పద్యాలలో సాగుతుంది. నాకు బాగా నచ్చిన కొన్ని పద్యాలిక్కడ పంచుకున్నాను. ఇదే సందర్భంలో వాల్మీకి కూడా చంద్రవర్ణన చేసారు. నాగమురళిగారి టపాలో వాటిని చదువుకోవచ్చు. రెండిటినీ పోల్చినప్పుడు నాకు తోచినది ఏమిటంటే - వాల్మీకి వర్ణనల్లో ఒక ముగ్ధ సౌందర్యం ఉంది. అమాయకమైన ఒక పల్లెదనముంది. అతను మౌని. అందులో కొన్ని కొన్ని విశేషాలు నిగూఢంగా స్ఫురిస్తాయి. విశ్వనాథ వర్ణన అలా కాదు. ప్రౌఢమైనది. ఒక నాగరీకుడయిన కవి చేసిన ఊహలుగా కనిపిస్తాయి. వాల్మీకి వర్ణన నేరుగా కథకి సంబంధం లేనిది. విశ్వనాథ వర్ణన కథకి అనుసంధానమైనది. వీటిలో వాచ్యత అధికం. అయినా మనోహరమైనవి, ఔచితీశోభితమైనవి. వాల్మీకి వాల్మీకే. విశ్వనాథ విశ్వనాథే. రామ రావణ యుద్ధమంటే రామ రావణ యుద్ధమే!

అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

23 comments:

 1. "బ్లాగాకాశంలోనైనా చందమామ ఉదయించేట్టు చేద్దామని" nice concept. దీపావళి శుభాకాంక్షలు!!

  ReplyDelete
 2. మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
  సిరికి లోకాన పూజలు జరుగు వేళ
  చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
  ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
  భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

  ReplyDelete
 3. చాలా చక్కటి పద్యాలను పరిచయము చేసి మనోల్లాసము కలిగించారు. ధన్యవాదాలు. దీపావళి శుభాకాంక్షలు.

  ReplyDelete
 4. యైరమ్మదీయ సరసి - అంటే యేమిటండి?

  మొదటి రెండు పద్యాలు మినహాయించి మిగతా పద్యాల్లో "అన్నట్లు, అన్నట్లు, అనగా" - అన్న శబ్దాలను ఉపయోగించారు. మొదటి రెండు పద్యాలలో ఇలాంటివి లేవు.

  ఆ యెచటొ యున్న యైరమ్మదీయ సరసి
  లోని వెన్నెల జలము లీ లోకమందు
  బాఱుదల కేర్పరచు వెలిపైడి తూము
  చెలగె నడిమింట గలువపూ చెలిమికాడు

  మొదటి మూడు పాదాలు, చివరి పాదము కలుపుతూ అంటే - తూము "వలె/మాడ్కి/పొల్కి/లాగున/చెఱగున" నడిమింట చంద్రుడు చెలగెను - అని చెప్పకుండా తూము, చెలగిన చంద్రుడు వేటికవే ప్రత్యేకంగా చెప్పవచ్చునా?

  ReplyDelete
 5. మీ బ్లాగ్ చాల బాగా వుంది ముందుగ మీకు దీపావళి శుభాకాంక్షలు, మీ బ్లాగ్ సుమధుర పద్యాల తోరణాలతో మనసులను ఆహ్లాద పరిచేవిగా వున్నాయి, హాస్యాన్ని అందించే పద్యాలూ ఏవయిన వుంటే అందించగలరని ప్రార్దిస్తున్నాను.
  http://sarvejanasukhinobhavanthu.blogspot.com/

  ReplyDelete
 6. అద్భుతం. అత్యద్భుతం. రెండు రోజుల క్రితమే మీరీ టపా రాసినా ఇప్పుడే చూశాను. విశ్వనాధ విశ్వనాధే.

  >> వాల్మీకి వర్ణనల్లో ఒక ముగ్ధ సౌందర్యం ఉంది. విశ్వనాథ వర్ణన ప్రౌఢమైనది.
  మీ మాటలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అది ఆది కావ్యం. అంతకు ముందు లేని కావ్యమార్గాన్ని కొత్తగా సృష్టించాడు వాల్మీకి. అందుకే అందులో పునరుక్తి దోషాలు మొదలైనవి ఉంటాయి. ముగ్ధంగా ఉంటుంది. కావ్య నియమాలు తర్వాత వచ్చినై. తర్వాతి కవులు ఆయన వేసిన బాటకి ఎన్నో మెరుగులు చేరుస్తూ పోయారు. (ఇవన్నీ మా సంస్కృతం లెక్చరరు గారు చెప్పిన మాటలే).

  ఏదేమైనా వాల్మీకి మాత్రం విశ్వనాధ కవిత్వాన్ని గురించి 'పుత్రాదిచ్ఛేత్ పరాజయం' అని ప్రశంసిస్తూ ఉంటాడని నా అనుకోలు.

  >> వెలిపైడి తూము
  ఈ పద్యంలోని ఊహ, సొగసు చెప్పనలవి కానిది. నాకు వెంటనే సౌందర్యలహరిలోని ఒక శ్లోకం గుర్తొచ్చింది.

  కలంకః కస్తూరీ రజనికరబింబం జలమయం
  కలాభిః కర్పూరైర్మరకతకరండం నిబిడితమ్ |
  అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం
  విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే ||

  మరొక్క మాఘుడి శ్లోకం (గొప్పదో కాదో చెప్పలేను కానీ, చదవగానే గుర్తుండిపోయింది).
  ఉదమజ్జి కైటభజితశ్శయనాదపనిద్ర పాండుర సరోజ రుచా
  ప్రధమప్రబుద్ధ నదరాజసుతా వదనేందునేవ తుహిన‌ద్యుతినా ||
  (కైటభారి నిద్రాస్థానమైన సముద్రం నుంచి అప్పుడే విచ్చుకున్న కలువ పువ్వువంటి కాంతి కలిగిన చంద్రుడు ఉదయించాడు. ఆయన అప్పుడే నిద్రలేచిన లక్ష్మీదేవి వదనంలాగా ఉన్నాడు.)

  మొత్తానికి నేను రాసిన టపాకి మీరు చాలా మంచి పారితోషికమే ఇచ్చారు.

  ReplyDelete
 7. >> ఇతడు కార్తీకమాసపు చంద్రుడు కాబోలు. అందుకే శివుని విభూతి వెన్నెలగా కురుస్తోంది!

  మీ వ్యాఖ్యానం అదిరింది.

  ReplyDelete
 8. తప్పిపోతున్న అందాన్ని వెతికిపట్టుకొంటున్న నాగరీకుని మనోగతాన్ని ముద్దుగా, ముగ్ధగా చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలికి సమకాలీనులైన శ్రీవాదిరాజతీర్థులు వ్రాసిన రుక్మిణీశవిజయంలోని ఓ పద్యం గుర్తుకువచ్చింది.

  యదా హరిః ప్రాదురభూత్కలాభిః
  తదా సమాయవ్యవాంశ్చ చంద్రః
  ప్రియాప్రియాప్యైవ నిజాన్వయోత్థ-
  ముకుందవక్త్రేందు కలావలోకాత్

  ఎప్పుడైతే హరి కృష్ణరూపంలో ప్రకటమయ్యడో, ఆ సమయంలో తన వంశంలో (చంద్రవంశం)లో అవతరించిన కృష్ణుని ముఖకాంతిని చూసి, ప్రియ-అప్రియాలనే ద్వంద్వభావాలవొలె పదహారు కళలతో చంద్రుడు ఉదయించాడు.

  ఇక్కడి చమత్కారమేమంటే, కృష్ణుడు తన వంశంలో పుట్టినందుకు ప్రియత్వంతోను (శుక్లపక్ష కళలు), ఆతని ముఖకాంతి తన కాంతిని మీరినందుకు అప్రియంతోను (కృష్ణపక్ష కళలు) చంద్రునికి వృద్ధి-హ్రాసాలు కలుగుతున్నాయట!.

  ReplyDelete
 9. చాలా బాగున్నది. మీ టపా, మీ వివరణ :-)

  ReplyDelete
 10. sukla paksha kalalu... krishna paksha kalalu..anni kalla mundu aarabosaru..
  malli malli chadavalani pinchindi..

  ReplyDelete
 11. వ్యాఖ్యానించిన అందరికీ కృతజ్ఞతలు.
  మంచి శ్లోకాలని పంచుకున్న నాగమురళిగారికి, రఘోత్తమరావుగారికి మరోమారు కృతజ్ఞతలు.
  రాకుమారగారు, మీ పద్యం చాలా బాగుంది!
  అనానిమస్ గారు, ఇరమ్మదము అంటే మెఱుపులోని అగ్ని. ఐరమ్మదీయ అంటే మెఱుపుకి సంబంధించిన అని అర్థం వస్తుంది. ఐరమ్మదీయ సరసి అంటే మెఱుపుల కాంతులీనే సరసు అని అర్థం చెప్పుకోవచ్చు.
  "అన్నట్లు, అన్నట్లు, అనగా" అన్న పదాలు లేవు కాబట్టి, చంద్రుడే ఆ తూము అన్న అర్థం వస్తుంది. ఇది రూపకాలంకారం అవుతుంది. తూము "వలె/మాడ్కి/పొల్కి/లాగున/చెఱగున" అంటే అది ఉపమానం అవుతుంది. "చంద్రుని వంటి ముఖము" అంటే ఉపమ. అదే "ముఖచంద్రుడు" అంటే, ముఖమనే చంద్రుడు - ఇది రూపకం.
  "అన్నట్లు, అన్నట్లు, అనగా" మొదలైన పదాలున్న పద్యాలలో ఉన్నది ఉత్ప్రేక్ష. అన్నీ పోలికలే, కాని చెప్పడంలో తేడా!

  ReplyDelete
 12. కామేశ్వరరావు గారూ, మన్నించాలి.

  ఇచ్ఛ - ఐచ్ఛిక
  వివాహము - వైవాహిక
  ఇతిహాసము - ఐతిహాసిక
  ఇంద్రజాలము - ఐంద్రజాలిక

  ఈ విధంగా ఇరమ్మదము - ఐరమ్మదిక అవాలని నా అనుమానం. ఐంద్రజాలికవిద్య (ఇంద్రజాలమునకు సంబంధించిన విద్య) అనేది సాధువు. ఐంద్రజాలీయ అన్నప్రయోగం సాధువవుతుందా? అలాగే వైవాహికసంప్రదాయం (వివాహమునకు సంబంధించిన సంప్రదాయము) సాధువయితే వైవాహీయ సంప్రదాయం సాధువవుతుందా? ఇదే విధంగా ఐరమ్మదికసరసి (మెఱుపుకు సంబంధించిన సరసి) సాధువయితే ఐరమ్మదీయసరసి సాధువా? అసాధువా?

  అలా ఉంచితే ఈయ - ఈ ప్రత్యయం అస్మత్, భవత్, ప్రతాపరుద్ర, ఇత్యాది నామవాచకాలకు ఆరోపిస్తే అస్మదీయ, భవదీయ, ప్రతాపరుద్రీయ అనే రూపాలు వస్తవి. ఐరమ్మద (క లుప్తం అయినది) అనే విశేషణానికి ఈయ అనే ప్రత్యయం చేర్చి ఐరమ్మదీయ అని ప్రయోగించవచ్చునా? ఇట్టి ప్రయోగాలు మీకు తెలిస్తే దయ ఉంచి చెప్పండి.

  దయచేసి ఇది రంధ్రాన్వేషణ అని భావించవద్దని ప్రార్థిస్తున్నాను.

  ReplyDelete
 13. అనానిమస్ గారు,
  అయ్యో రంధ్రాన్వేషణ కానే కాదు! నిజానికి మీకు నేను ఎంతో కృతజ్ఞుడిని. మీ వలన నేనొక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను! నాకు సంస్కృత వ్యాకరణం తెలియదు. ఒకో ప్రత్యయాన్ని బట్టి ఒకో రకమైన రూపం వస్తుందనుకుంటాను. ఆన్లైన్ సంస్కృత నిఘంటువులో ఐరమ్మద పదం ఉంది. ఇరమ్మద సంబంధమైన అనే అర్థంలో. దానినుండి ఐరమ్మదీయ సాధ్యమే అనుకుంటా. సంస్కృతం బాగా తెలిసినవారు చెప్పాలి.

  ఈ పదం వ్యుత్పత్తి సంగతి అలా ఉంచితే, అంతకన్నా మరొక అద్భుతమైన విషయం తెలిసింది! అదేమిటంటే, ఛాందోగ్యోపనిషత్తులో యీ "ఐరమ్మదీయ" సరస్సు ప్రస్తావన ఉంది. బ్రహ్మలోకంలో అర, ణ్య అనే పేరుగల సముద్రాలు, వాటి మధ్య ఐరమ్మదీయ అనే సరసు ఉందట. దాని పక్కగా, నిరంతరం సోమరసాన్ని వర్షించే ఒక రావిచెట్టు ఉందట. బ్రహ్మచర్యాన్ని గురించి చెపుతూ, అరణ్యవాసం కూడా బ్రహ్మచర్యమే అని, అది ఎందుకు అవుతుందో వివరించే సందర్భం. బ్రహ్మలోకంలో ఉన్న అర, ణ్య అనే సముద్రాల దగ్గర చరించడమే అరణ్యవాసమని ఆ ఉపనిషత్తు చెపుతుంది. ఇక్కడ "ఐరమ్మదీయ" అనే పదానికి ఆనందాన్ని యిచ్చే అన్నముతో నిండినది అనే అర్థం తీసుకోవచ్చని ఒక చోట ఉంది. అదికూడా ఇరం->ఇరమ్మద->ఐరమ్మద->ఐరమ్మదీయ అనే క్రమంలో వచ్చినట్టుగానే ఉంది. మరి దీనికీ "ఇరమ్మద" పదానికీ సంబంధమున్నదో లేదో నాకు తెలియదు.

  ఈ పద్యంలో విశ్వనాథవారు బ్రహ్మలోకంలోని ఆ "ఐరమ్మదీయ" సరసునే ప్రస్తావించారన్నది స్పష్టం. బహుశా పక్కనుండే రావిచెట్టు వర్షించే సోమరసంతో ఈ ఐరమ్మదీయ సరసు నిండి ఉంటుందని విశ్వనాథవారి ఊహ అయి ఉండవచ్చు. అదే సుధ, వెన్నెల. దాన్ని ఈ లోకములోకి పారింప జేసే తూము చంద్రుడు.

  ఛాందోగ్యోపనిషత్తులోని యీ మొత్తం వర్ణన కుండలినీ యోగానికి సంబంధించినదై ఉండే అవకాశం ఉన్నది. ఐరమ్మదీయ సరస్సు, సుషుమ్నకి కాని, సహస్రారానికి కాని ప్రతీకగా తీసుకోవచ్చునేమో. సహస్రారంలో ఉండే శక్తి, సుధాధారతో ప్రపంచాన్ని (నాడీమండలాన్ని) తడుపుతుందని సౌందర్యలహరిలోని ఒక శ్లోకం ఇక్కడ గుర్తుకువస్తోంది. సుందరకాండని కుండలినీయోగంతో పోలుస్తూ విశ్లేషించే ఆనవాయితీ ఉంది. ఇక్కడ విశ్వనాథవారు దానిని సూచిస్తున్నారేమో!

  ఇందుకే రామాయణకల్పవృక్షానికి వ్యాఖ్యానం ఎంతో అవసరమనేది! మిగతా పద్యాలలో మరింకెన్ని లోతులున్నాయో! ఒడ్డున కూర్చొని చూసే నాలాంటి అల్పునికి ఏవో పైపై అందాలు మాత్రమే కనిపిస్తాయి. గజ యీతగాళ్ళెవరైనా దీనిలోకి దూకి, ఇందులోని రత్నాలని వెలికి తియ్యాలి!

  ReplyDelete
 14. రాఘవ గారుగానీ అనామకంగా వ్యాఖ్యానించటం లేదు కద ???

  ReplyDelete
 15. అయ్యా, మీ వివరణ చక్కగా ఉంది. బహుశా ఐరమ్మదీయ ప్రయోగం వైదిక వాఙ్మయానికి చెందిన ప్రయోగం కావచ్చును. లేదా ఐరమ్మదీయసరసి ఇరమ్మద ధాతూత్పన్నం కాకపోయి ఉండవచ్చును. పండితులే ప్రమాణము. లౌకిక సంస్కృత/తెలుగు వాఙ్మయాలలో ఇట్టి ప్రయోగం ఉన్నట్లు లేదు. ఇరమ్మదమాలికా అని ఒకానొక ప్రయోగం విశ్వనాథ వారే మరో సందర్భంలో చేసినట్టు లీలగా గుర్తు.సరిగ్గా జ్ఞాపకానికి రావట్లేదు.

  ఇందాక రూపకం గురించి మీ వివరణా బావుంది. మరో ప్రశ్న వచ్చింది కానీ సంశయంతో ఆగాను. కాస్త ధైర్యం తెచ్చుకుని మీ ముందుంచుతున్నాను. ముఖచంద్రుడు - ఇది ఒక సమాసము. అయితే ఉపమాన ఉపమేయాల మధ్య క్రియాపదం రావడం క్లిష్ట అన్వయదోషం కాదా?

  ఆ పద్యంలో "...తూము చెలగె నడిమింట కలువపూ చెలిమికాడు" అని ఉన్నది. "....తూము" - ఇది ఉపమానము, కలువలచెలిమికాడు - ఉపమేయము. రెండూ పక్కపక్కన రావడం సబబు. మధ్యలో క్రియాపదం "చెలగె" అని రావడము వలన చెలగినది తూమా, చంద్రుడా అన్న సంశయం వచ్చే అవకాశం ఉంది. సంస్కృతభాషలో ఎలా చదివినా అన్వయం కుదిరే సౌలభ్యం ఉంది. అయితే అక్కడా రూపకానికి సంబంధించి ఉపమాన ఉపమేయాల మధ్య క్రియాపదాగమనం అవాంఛితమని నా భావన.

  ఇది అన్వయక్లిష్టత తప్ప తప్పనిసరి పొఱబాటు కాకపోవచ్చును.

  ReplyDelete
 16. అవును. ఐరమ్మదీయ పదం వైదిక వాఙ్మయానికి చెందినదే అయి ఉండవచ్చు. ఇరమ్మదమాలిక అనే పదం వచ్చే విశ్వనాథవారి పద్యం:

  నిష్ఠావర్షదుదార మేఘపటలీ నిర్గచ్ఛదుద్యోతిత
  స్పేష్ఠేరమ్మదమాలికా యుగపదుజ్జృంభన్మహాఘోర బం
  హిష్ఠ స్ఫూర్జధు షండమండల రవా హీనక్రియా ప్రౌఢి ద్రా
  ఘిష్ఠంబై పెనురావమంతట నెసంగెన్ ఛిన్న చాపంబునన్

  వేరు వేరు వాక్యాలలో ఉపమాన ఉపమేయాలున్న రూపకాలంకారం సంస్కృతంలో కన్నా తెలుగులో ఎక్కువ కనిపిస్తుందనుకుంటా. వేరే ఉదాహరణలు చప్పున గుర్తుకు రావడం లేదు. తూము, చంద్రుడు ఉపమాన ఉపమేయాలే కాబట్టి, "చెలగె" అన్న క్రియాపదం దేనికి అన్వయించినా పెద్ద ఇబ్బంది లేదు కదా. కొద్దిగా అన్వయక్లిష్టత ఉన్నదనడంలో సందేహం లేదు.

  సనత్ గారు,
  ఈ అజ్ఞాత రాఘవ కాదనుకుంటానండి :)

  ReplyDelete
 17. ఋతువులకీ కేలండరు పేజీలకీ మధ్య, ఈ కాలపు నగరవాసులకి పెద్దగా తేడా తెలియదు. పల్లెప్రజలకింకా వాటితో అనుబంధం ఉందనుకుంటాను.
  నగరవాసుల మాట నిజమే! కాని పల్లెవాసులు కూడా చందమామను చూస్తున్న దాఖలాలు లేవు! టెలివిజన్ మాయ మేఘాలు అక్కడ మరి దట్టంగా కమ్మేశాయి మాష్టారూ!

  చంద్రుడు మరి లక్ష్మీదేవి తమ్ముడే కదా. ఇద్దరూ పాలసముద్రం నుండే పుట్టారు కాబట్టి వారు తోబుట్టువులు. మరి అమ్మ తమ్ముడు మనకి మేనమామే కదా అవుతాడు.
  ఇది గొప్ప ఊహ. మొత్తం మీద బ్లాగ్లోకంలో వెన్నెల కురిపించారు.కృతజ్నతలు.
  gksraja.blogspot.com
  మావి చిగుర్లు, కోకిల పాటలు, వసంతాగమన వేడుకలు, షడ్రుచుల పచ్చడి, పండగసందడి..ఉగాది.
  యుగానికి ప్రారంభం---
  http://gksraja.blogspot.com/2011/04/blog-post.html

  ReplyDelete
 18. విష్ణులోకములోని ఐరమ్మదీయ సరసి ...

  పింగళి సూరన - కళాపూర్ణోదయము
  శా. ఆ సింధూత్తము చేరువన్‌, సరసియొం డైరమ్మదీయంబు నా
  భాసిల్లున్‌, జలనీలికా కబరికా పద్మాస్య పుష్పంధయా
  ళీ సంవీక్షణ వీచికావళి మృణాళి బాహుకోకస్తన
  శ్రీసంపాదితమూర్తి ముక్తిపదలక్ష్మీమండలీ కర్తయై. 8.219

  "ఐరమ్మదీయసరసి" అంటే "మేఘజ్యోతులఁ గ్రుమ్మరించు వెలుంగుల సరస్సు" అన్నారు చదలువాడ జయరామశాస్త్రిగారు.

  ReplyDelete
 19. చాలా బాగా చెప్పారు. సంతోషం

  ReplyDelete
 20. This comment has been removed by the author.

  ReplyDelete
 21. మంచి వివరణ,,,, బాగుంది.

  ReplyDelete
 22. How To Play Baccarat - Free online casino slots with online
  Baccarat is a classic game 제왕카지노 of luck. 메리트 카지노 고객센터 You 바카라사이트 place bets on the number of coins in a casino or a game. You can also bet with the house edge.

  ReplyDelete