తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, May 22, 2010

మన్మథుడి విజయరహస్యం

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే

ఈ మధ్యనే శంకరాచార్యులవారి సౌందర్యలహరి చదవడం మొదలుపెట్టాను. ఇప్పటిదాకా దాని గురించి ఎవరైనా చెప్పగా వినడమే కాని ఎప్పుడూ చదవలేదు. చదవడం మొదలుపెట్టగానే, ఇది మామూలు పుస్తకంలా చదువుతూ పోకుండా, ఆ శ్లోకాలని కంఠస్థం చేస్తే బాగుంటుందన్న కోరిక బలంగా ఏర్పడింది. ఇంకా పట్టుపని పది శ్లోకాలయ్యాయి! అందులో పై శ్లోకం ఆరవది.

లోకాన్ని జయించిన మన్మథుడి గురించిన శ్లోకం. అతని విల్లేమో పువ్వులతో చేసింది. చాలా సుకుమారమైనది. మౌర్వీ అంటే వింటి నారి (అల్లె త్రాడు). అదేమో మధుకరమయీ, అంటే తుమ్మెదల మయం. అలాంటి అల్లెతాడుకి బిగువేముంటుంది? ఇంక ఆ మన్మథుడి దగ్గరున్న బాణాలేమో అయిదే అయిదు! అతనికి సహాయం ఎవరయ్యా అంటే వసంతుడు. ఏడాదికి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అతని తోడు. ఈ మన్మథ యోధుడెక్కే రథం ఏమిటంటే మలయమారుతం. అంటే వట్టి గాలి! పైగా ఆ మన్మథుడెవరు? అనంగుడు. అంటే అతనికి భౌతికమైన శరీరమే లేదన్న మాట! అలాంటి మన్మథుడు తానొక్కడే ఈ లోకాన్నంతటినీ జయిస్తున్నాడు. ఎలా? ఓ హిమగిరిసుతా! నీ కడకంటి చూపులలోని ఏదో ఒక కృపావిశేషం లభించడం వల్లనే సుమా! మన్మథుని మహత్తు వెనకనున్న అసలు రహస్యం అమ్మవారి కృపేనన్నమాట.

మన్మథుడంటే మరెవరో కాదు మనిషి అంతరంగంలోని అనుభూతులే. సుకుమారమైన మనిషి మనసే మన్మథుడి విల్లు. అతని అయిదు బాణాలు మనిషి పంచేంద్రియాలు. ఈ బాణాలని మనసనే ధనుస్సుకి అనుసంధానం చేసే వింటి నారి - ఇంద్రియ స్పందనని మనసుకి చేర్చే నాడి. అలా పంచేద్రియాల స్పందన మనసుని వంచుతుంది. దాని ద్వారా ఏర్పడిన అనుభూతి చిత్తాన్ని సంచలింపచేసి మనిషిని లొంగదీసుకుంటుంది. అదే మన్మథ విజయం. అయితే ఈ అనుభూతిని కలిగించే శక్తి ఏదో మన అంతరంగంలో ఉండి ఉండాలి. ఆ మూల శక్తినే రకరకాల రూపాలలో భావించి స్తోత్రం చేసారు మన పూర్వులు. అందులో అమ్మవారి రూపం ఒకటి.

ఈ శ్లోకం చదవగానే కరుణశ్రీగారు వ్రాసిన పద్యం ఒకటి గుర్తుకువచ్చింది. ఉదయశ్రీ పుస్తకంలో "తపోభంగం" అన్న పద్య కవితలో నాకు ఇష్టమైన పద్యమిది.

తియ్యవిల్కాడు వింట సంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము
గౌరి కడకంటి చూపుతో కలిసిపోయి
గుచ్చుకొనె నవి ముక్కంటి గుండెలోన

శివునికి తపోభంగమైన సన్నివేశం. శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే అతనికి ఉపచారాలు చేస్తున్న పార్వతీదేవి పూలబుట్టతో అతని దగ్గరకి వచ్చింది. సరిగ్గా అప్పుడే తియ్యవిలుకాడైన మన్మథుడు సమ్మోహన బాణాలని తన వింట సంధించి విడిచాడు. అవి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయి. అలా చెప్పి ఊరుకుంటే అందులో కవిత్వమేముంటుంది! ఇందులో మూడవపాదం ఈ పద్యానికి ఆయువుపట్టు. శివుని ఎదురుగ్గా నించున్న పార్వతీదేవి అతడిని తన కడకంటితో చూస్తోంది. ఆ కడకంటి చూపులలో ఈ బాణాలు కలిసిపోయి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయట! అందమైన స్త్రీల చూపులని మన్మథ బాణాలతో పోల్చడం మామూలు. కాని ఇక్కడ నిజంగా మన్మథ బాణాలున్నాయి. అవి ఆ చూపులతో కలిసిపోయాయి. ఇప్పుడు శివుని మనసు చలించినది మన్మథుడి బాణాల వల్లనా, గౌరి చూపులవల్లనా? పరమ శివునిలో స్పందన కలిగించే శక్తి అమ్మవారికి తప్ప మన్మథుడి కెక్కడిది! మరి శివుడు పాపం మన్మథుణ్ణి ఎందుకు భస్మం చేసాడు? ఎందుకంటే మన్మథుడు తన ప్రతాపం వల్లనే ఇదంతా జరిగిందని భ్రమించాడు. అంచేత అతనికి కర్మ చుట్టుకుంది. ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పింది కాదు.

శంకరాచార్యులవారు వాడే ప్రతి పదం వెనక ఏదో ఒక ప్రత్యేకమైన కారణం, అర్థం ఉండే ఉంటుందని చాలామంది వ్యాఖ్యాతలు అంటారు. పై శ్లోకంలో అమ్మవారికి "హిమగిరిసుతే" అన్న పదం ఉపయోగించడం శివ తపోభంగ ఘట్టాన్ని గుర్తుచెయ్యడానికే కాబోలు! ఆ శ్లోకమిచ్చిన స్ఫూర్తితోనే కరుణశ్రీగారు ఈ పద్యాన్ని వ్రాసారేమో! శంకరుల శ్లోకం గురించి తెలుసుకున్నాక, కరుణశ్రీగారి పద్యం మరింత అందగించింది. మరింత నచ్చింది!


పూర్తిగా చదవండి...

Wednesday, May 5, 2010

అంతర్జాలంలో మరో కల్పవృక్షం

కల్పవృక్షం అంటే మళ్ళీ రామాయణ కల్పవృక్షం అనుకుంటున్నారా ఏంటి? కాదు, ఇది వేరే కల్పవృక్షం. అదేమిటో తెలియాలంటే ఈ పద్యం చదవండి:

పత్రపత్రంబునకు మంచిఫలముగల్గి
కవుల దనుపుచు నర్థసంగ్రహణబుద్ధి
రోసి డస్సినవారల గాసిదీర్చు
గల్పవృక్షంబుగాదె నిఘంటువరయ!

ఇది శ్రీ పాలూరి శంకరనారాయణగారు వ్రాసిన పద్యం.

పత్రం అంటే రెండర్థాలు. ఒకటి ఆకు. రెండు కాగితం. అలాగే ఫలము అంటే పండు, ప్రయోజనము. పత్ర పత్రానికి మంచి ఫలం ఉండేది కల్పవృక్షం. కోరిన కోరికలన్నిటినీ ఫలింప జేసేది కాబట్టి. అలాగే ప్రతి కాగితమూ ప్రయోజనవంతంగా ఉండే పుస్తకం ఒకటుంది. అది కవులని తృప్తిపరుస్తూ ఉంటుంది. అర్థాలు తెలుసుకొనే ప్రయత్నంలో అలసిపోయేవారికి చెట్టులా సేదదీరుస్తుంది కూడా. అర్థవంతమైన కవిత్వాన్ని వ్రాసేందుకు కవులకూ, ఆ కవిత్వాన్ని అర్థం చేసుకునేందుకు పాఠకులకూ కూడా ఉపయోగపడుతుందన్న మాట! అవును అదే నిఘంటువు. ఇప్పుడు చాలామంది తెలుగువాళ్ళకు దాని అర్థం తెలియాలంటే దాన్నే ఆశ్రయించాలేమో! తేలిక భాషలో చెప్పాలంటే డిక్షనరీ.
సరే మరి ఆకుల్లేకుండా పళ్ళు మాత్రమే ఉన్న చెట్లెక్కడైనా ఉంటాయా? మనిషి టెక్నేంద్రజాలానికి ఆ మాత్రం సాధ్యం కాకుండా పోతుందా! జంతర్ మంతర్ అంతర్జాలంలో ఉన్న డిక్షనరీలన్నీ "అపర్ణలే" (అంటే కాగితాలు లేనివే) కదా. తెలుగులో ఇప్పటికే బ్రౌన్ డిక్షనరీ అంతర్జాలంలో ఉన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కనీసం నా బ్లాగులో పద్యాలు చదివేవాళ్ళు, నేను పొద్దులో ఇచ్చే గడితో కుస్తీ పట్టేవారు ఈ బ్రౌణ్యాన్ని ఉపయోగించే ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ దొరికిన మరో వరం ఆంధ్రభారతి నందనవనంలో కొత్తగా వెలసిన నిఘంటు కల్పవృక్షం. ఇందులో బ్రౌణ్యమే కాకుండా, శబ్దరత్నాకరం, మరి రెండు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు కూడా కలిపి ఉన్నాయి! ఈ నిఘంటువుల నుండి విడివిడిగా కాని అన్నిట్లో కలిపి కానీ కావలసిన పదాలను వెతుక్కోవచ్చు. ఆ వెతుకులాట పదాలలో (ఆరోపాలలో) కాని, మొత్తం వాటి అర్థాలలో ఎక్కడైనా కాని చేసుకోవచ్చు. శొధన (అదే, తెలుగు భాషలో చెప్పాలంటే సెర్చి) సులువు చేసుకోడానికి మరెన్నో వెసలుబాట్లు కూడా ఉన్నాయక్కడ. ఇంకెందు కాలస్యం, వెంటనే ఆ ఫలాలని ఆరగించడం మొదలుపెట్టండి! అన్నట్టు మరో విషయం. ఇది ఇంకా ఎదుగుతున్న చెట్టు. అంటే ఇందులో మరెన్నో నిఘంటువులు చేరబోతున్నాయన్న మాట!

బ్రౌను డిక్షనరీ ఒక యూనివర్సిటీ వాళ్ళ కృషి ఫలితమైతే, ఈ కొత్త నిఘంటువు కేవలం ఇద్దరి కృషి ఫలితం. వారు శ్రీ వాడపల్లి శేషతల్ప శాయిగారు, శ్రీ కాలెపు నాగభూషణ రావుగారు. వారి వెనక అజ్ఞాతంగా మరెవరైనా ఉన్నారేమో తెలియదు. తెలుగు మీద అభిమానమున్న వాళ్ళందరూ వారి కృషికి జోహార్లు చెప్పాల్సిందే. మన వంతు సహాయం కూడా చెయ్యవచ్చు. ఎలాగో అక్కడున్న Aboutలో ఇచ్చిన్న వివరాలని చూడండి.
పూర్తిగా చదవండి...

Friday, April 16, 2010

ధర్మరాజుని చెడతిట్టిన అర్జునుడు!

"ధర్మరాజునేవిఁటి అర్జునుడేవిఁటి చెడతిట్టడమేవిఁటి? విడ్డూరంగా ఉందే!" అని ఆశ్చర్యపోతున్నారా? అవును విడ్డూరమే కదూ మరి! ఎంతో కలిసిమెలిసి ఉండే అన్నదమ్ములు పాండవుల్లో అర్జునుడు ధర్మరాజుని తిట్టడమా? ఇదేదో అవార్డు పొందిన ఏ ఆధునిక భారత నవలలోనో ఉన్న సన్నివేశం అనుకునేరు. కాదు కాదు. ఇది అచ్చంగా ఆ వ్యాసుడు రాసిన మహాభారతంలో ఉన్న విషయమే. మరో విషయం చెపితే మరీ ఆశ్చర్యపోతారు. స్వయంగా శ్రీకృష్ణుడి ప్రోద్బలంతోనే అర్జునుడా పని చేస్తాడు! సరే, ఇక ఊరించింది చాలు, అసలు కథలోకి ప్రవేశిద్దాం.

అవి కురుక్షేత్ర సంగ్రామం మహా జోరుగా సాగుతున్న రోజులు. అప్పటికే పదహార్రోజుల యుద్ధం అయిపోయింది. భీష్మ ద్రోణులు నేల కూలారు. కర్ణుడు కౌరవ పక్షాన సర్వసేనాధిపతి అయ్యాడు. ఈ కర్ణుడు వికెట్టొక్కటి తీసేస్తే ఆట గెలిచినట్టేనని అనుకుంటున్నారు పాండవులు. కర్ణుడు సర్వసేనాధిపతిగా ఒక రోజు యుద్ధం అప్పుడే అయిపోయింది. ఆ రోజు కర్ణార్జునులు భీకరంగా యుద్ధంచేసుకున్నారు. అర్జునుడి ప్రతాపానికి కౌరవ సేనలు చెల్లాచెదరైపోయాయి. ఆ రోజు యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు విచారగ్రస్తుడయ్యాడు. అప్పుడు కర్ణుడతనికి ధైర్యం చెపుతూ, "రేపు చూడు నేనెలా విజృంభిస్తానో! నీకు శత్రువులంటూ లేకుండా చేస్తాను. ఆ అర్జునుణ్ణి సంహరిస్తాను." అని బీరాలు పలికుతాడు. శల్య సారథ్యంలో ఆ మరునాడు రెట్టించిన ఉత్సాహంతో కదనరంగానికి వెళతాడు కర్ణుడు. మళ్ళీ సంగ్రామం భీకరంగా సాగుతూ ఉంటుంది. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తూ కర్ణుడికి దూరంగా వెళతాడు. ధర్మరాజు కర్ణుడూ యుద్ధానికి తలపడతారు. వేసవికాలం మిట్టమధ్యాహ్నం మండే సూర్యుడిలాగా (ప్రస్తుతం ఆ ప్రతాపం ఎలా ఉంటుందో మనందరికీ అనుభవమే కదా! వేడి 43 డిగ్రీలకి పెరిగిపోతోంది!) పరాక్రమిస్తాడు కర్ణుడు. అప్పుడు ధర్మరాజు కర్ణుడి చేతిలో బాగా తన్నులు తిని యుద్ధభూమినుంచి పలాయనం చిత్తగిస్తాడు.

అప్పుడు జరుగుతుందొక విచిత్రమైన నాటకీయ సంఘటన! అలాంటి సందర్భంలో ఇలాంటి సన్నివేశాన్ని ఎవ్వరం ఊహించలేం! అప్పటికే రెండు సార్లు కర్ణుడి చేతిలో తన్నులు తిని పరాభవింప బడ్డాడేమో, శిబిరంలోకి వెళ్ళి, ధర్మరాజు తనలో తానే బాగా కుమిలిపోతూ ఉంటాడు. ఈ లోపున యుద్ధభూమిలో అర్జునుడు ధర్మరాజుని వెతుకుతూ కర్ణుడున్న దిశగా వస్తాడు. అక్కడ భీముడొక్కడే యుద్ధం చేస్తూ ఉంటాడు. కర్ణుడి ఉగ్రమూర్తిని చూసి అర్జునుడు విస్తుపోతాడు. "బ్రతికి యుండిన శుభములు వడయవచ్చు", ముందు రథాన్నిక్కడనుంచి పోనియ్యమంటాడు కృష్ణుడితో. అర్జునుడు అలసినట్టున్నాడు కాస్త బడలిక తీర్చుకోవడం మంచిదే అనుకుంటాడు కృష్ణుడు (ఈ అర్జునుడిలా మాట్లాడతాడేమిటి? వీడికి కాస్త చికిత్స చెయ్యాలి అని బహుశా లోపల అనుకుని ఉంటాడు). "సరే, ధర్మరాజు ఎలా ఉన్నాడో ఒకసారి పరామర్శించి వచ్చి అప్పుడీ కర్ణుడి సంగతి చూద్దాం", అని రథాన్ని ధర్మరాజు శిబిరం వైపు పోనిస్తాడు. కృష్ణార్జునులు రణరంగం నుంచి రావడాన్ని చూసి, కర్ణుణ్ణి చంపి ఆ శుభవార్త తనకి చెప్పడానికి వచ్చేరనుకుంటాడు ధర్మరాజు. పరమానందం పొందుతాడు. "ఆహా! అంతమంది చూస్తూ ఉండగా ఈ రోజు కర్ణుడు నన్ను అవమానించాడు. దానికి తగిన ప్రతీకారం చెల్లించి వచ్చారన్నమాట. సెహభాష్!" అని మెచ్చుకుంటాడు.

అరుదిది! నీవు నొవ్వక మహాబలు గర్ణు వధించితాతడ
క్కురుపతి సంతసింప - నరుగూల్చెద సంగరభూమి నేన యొ
క్కరుడను వీక దాకి - యను గర్వపు మాట సనంగనీక, నే
టి రణములోన నిట్లు ప్రకటింతె భవద్భుజ వీర్యశౌర్యముల్

"నువ్వేమాత్రం కష్టం లేకుండా ఆ మహాబలుడైన కర్ణుడిని సంహరించావా! ఆ దుర్యోధనుడి సంతోషం కోసం, 'నేనొక్కడినే ఆ అర్జునుణ్ణి చంపుతానూ అని విర్రవీగిన వాడి మాటలని వమ్ము చేస్తూ, ఇవ్వాళ యుద్ధంలో నీ భుజబలాన్ని, శౌర్యాన్ని చూపించి వచ్చావా!" అని అర్జునుణ్ణి పొగుడుతాడు.

కృష్ణార్జునులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇలా ధర్మరాజు అమితోత్సాహంతో మాట్లాడెస్తూ ఉంటే, మెల్లిగా అసలు సంగతి చెప్తాడు అర్జునుడు. "అన్నా! మరేమో, అశ్వత్థామ నా మీద యుద్ధానికి వచ్చాడు. చాలా ఘోరంగా యుద్ధం చేసాడు. మొత్తానికి ఎలాగైతేనేం అతని గర్వాన్ని అణచి అతన్ని తిప్పికొట్టాను. ఆ తర్వాత నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. అక్కడ భీముడొక్కడే యుద్ధం చేస్తూ కనిపించాడు. నువ్వేమో దెబ్బలు తగిలి శిబిరానికి వచ్చావని చెప్పారు. నువ్వెలా ఉన్నావో చూడ్డానికి వచ్చాము. నువ్వు క్షేమంగానే ఉన్నావుగా. ఇప్పుడు వెళ్ళి ఆ కర్ణుడి పనిపడతాను చూడు!" అని అంటాడు అర్జునుడు.

ఇంకేముంది! కర్ణుడు బతికే ఉన్నాడన్న మాట వినగానే ధర్మరాజు ఉత్సాహమంతా నీరుగారిపోతుంది. పైగా విపరీతమైన కోపం వస్తుంది. రాదూ మరి! తను ఓడిపోయి వచ్చానని పరామర్శించడానికి వస్తాడా అర్జునుడు! పైగా తనని అవమానించిన కర్ణుడిని చంపకుండా వస్తాడా! ఉక్రోషం పొంగుకొస్తుంది. పట్టరాని కోపంతో అర్జునుణ్ణి చెడామడా తిడతాడు. తిక్కన కలంలో ఆ ఘాటైన అచ్చ తెలుగు తిట్లు మచ్చుకి మీరూ రుచి చూడండి. :-)

విను కర్ణున కేనోడితి
నన నేటికి నీవు నోడి తనిలజ మాద్రీ
తనయులు మున్నే యోడిరి
మనతో గూడంగ గంసమర్దను డోడెన్

నేను కర్ణుడికి ఓడిపోయానని అనుకోనక్కరలేదు. నేనొక్కడినే కాదు, ఇప్పుడు నువ్వూ ఓడిపోయావు. భీముడు, నకులసహదేవులు ఇంతకు ముందే ఓడిపోయారు. ఆఖరికి మనతో కలిసి ఉండడం వల్ల ఈ కృష్ణుడు కూడా ఓడిపోయాడు!

కావున మనమిక ననికిన్
బోవం బనిలేదు, విపినభూమికి జని య
చ్చో వెఱపు దక్కి తపసుల
మై విచ్చలవిడి జరింత మందఱము దగన్

"అంచేతనింక మనం మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళక్కరలేదు. అందరం కట్టకట్టుకొని మళ్ళీ అడవులకు పోదాం. అక్కడ ఎలాంటి భయమూ లేకుండా తపస్సుచేసుకుంటూ మన ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. అదే మనకి తగిన పని", అని అంటాడు. "లేదా గొప్పలకిపోకుండా, వినయంతో వెళ్ళి ఆ దుర్యోధనుడికి సేవకులమై పడి ఉందాం", అని కూడా అంటాడు. అంతేనా! ఇంకా వినండి:

అని వధించెద గర్ణు నేనని ప్రతిజ్ఞ
సేసి, యిటు దెచ్చి నన్నిట్లు సేసి, తింత
కెట్లు నేర్చితి? పొడవుగా నెత్తి నేల
వైవ నోర్చితి నను బగవారి నడుమ

కర్ణుడిని చంపుతానని పెద్ద పోటుగాడిలా ప్రతిజ్ఞ చేసావు. తీరా చూస్తే ఇప్పుడిలా కొంపముంచావు. నన్ను బాగా పైకెత్తేసి చివరికి నేల మీద గభీలున పడెయ్యడమే నీకిష్టంలాగా ఉంది, అదీ శత్రువుల మధ్యలో!

దేవతలిచ్చిన తేరు నశ్వంబులు
గపికేతనంబును గలవు, దైవి
కంబు చేనున్నది గాండీవమను దాటి
యంత విల్లది గాక, హరి రథంబు
గడపెడు నటె! పరికర మిట్టిదై యుండ
నెట్లు కర్ణునికోడి యిట్టు వలియ
బాఱతెంచితి వీవు? భండనంబున గర్ణు
గని పాఱు దని సుయోధనుడు సెప్పె

నది నిజంబుగ గొనక బేలైతి; నాదు
బేలతనమున గాదె పాంచాల మత్స్య
పాడ్యులాదిగ గలిగిన బంధుమిత్త్ర
జనుల దెగటాఱి రప్రయోజనముగాగ

దేవతలిచ్చిన రథమూ, గుఱ్ఱాలూ ఉన్నాయి. సాక్షాత్తూ హనుమంతుడు నీ జెండాపై ఉన్నాడు. దైవసహాయంతో లభించిన గాండీవం, తాటిచెట్టంత విల్లది, చేతిలో ఉంది! నారాయణుడే నీ రథ సారథి! ఇన్నీ ఉండి కర్ణుడిని ఎదుర్కోలేక ఇలా పారిపోయి వచ్చావు నువ్వు. యుద్ధంలో కర్ణుడిని చూస్తే అర్జునుడు పరిగెట్టి పారిపోతాడని దుర్యోధనుడు ముందే చెప్పాడు. వాడి మాట వినక నేను బేలనయ్యాను. ఇలా నా బుద్ధిలేనితనం కారణంగా పాపం అనవసరంగా పాంచాలురు, మత్స్యులు, పాండ్యులు మొదలైన బంధు మిత్త్రులందరూ యుద్ధానికి వచ్చి నాశనమయ్యారు!

ఇంకా ఎంతమాటన్నాడో తెలుసా?

గొంతి కడుపునందు గొడుకుచూలై నీవు
దోపకుండ వైతి, తోచినట్టి
పిండ మెడలియైన బిదప దిగంబడ
దయ్యె; నింత వుట్ట దట్టులైన!

"కుంతి కడుపులో నువ్వు కొడుకులా కనిపించి కూడా కాకుండా పోయావే (అంటే నువ్వు మగాడివి కాకుండా పోయావే అనీ)! పిండంగా ఉన్నప్పుడే జారిపోయుంటే ఇంత జరిగేది కాదు కదా!" అన్నాడు. ఎంతలేసి మాటలన్నాడో చూసారా?!

"ధర్మరాజుని చెడతిట్టిన అర్జునుడు" అని కదా శీర్షిక? మరి ధర్మరాజు అర్జునుడిని చెడతిట్టడం గురించి చెపుతున్నానేమిటని అలోచిస్తున్నారా? అగండాగండి. ముందుంది అసలు కథ!

ధర్మరాజు చివరగా మరోమాట కూడా అంటాడు.

హరి గలుగంగ నేటికి? భయంబున వచ్చితి; నీదు గాండివం
బెరువుగ నిచ్చి, నీవు నొగలెక్కి హరిన్ రథి జేయ గన్న ని
ష్ఠురభుజవిక్రమోగ్రుడగు సూతతనూభవు దత్సహాయులన్
బొరిగొనడే సుయోధనుని పోడిమి దూలగ నొక్క మాత్రలోన్

"అక్కడ కృష్ణుడు ఉన్నా కూడా భయంతో వచ్చేసావే! నీ గాండీవాన్ని కృష్ణుడికి ఎరువుగా ఇచ్చి, అతన్ని రథమెక్కించి, నువ్వు రథాన్ని తోలవలసింది కదా. అప్పుడా దుర్యోధనుడి పొగరు అణిగేటట్టు కర్ణుడిని వాడి సేనని ఒక్క చిటికలో చంపేసేవాడు!" అని అంటాడు.

అది వినగానే చయ్యని తన కత్తి తీస్తాడు అర్జునుడు. "ఇదేమిటి. ఇక్కడ కౌరవులు లేరే. మనం ధర్మరాజు కుశలాన్ని తెలుసుకోడానికి వచ్చాం. అతను బాగానే ఉన్నాడు. అంచేత సంతోషించాలి కాని ఇప్పుడు కోప్పడాల్సిన సమయం కాదు కదా! ఎందుకు కత్తి తీసేవ్?" అని అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, "నా గాండీవాన్ని మరొకడికి ఇమ్మని ఎవడైనా అంటే కనక, వాడి తల తెగనరుకుతానని నేను ప్రతిజ్ఞ చేసాను. ఇప్పుడీ ధర్మరాజు నన్నంత మాటన్నాడు. కాబట్టి ఇతన్ని చంపేస్తాను" అంటాడు. అది విని కృష్ణుడు, "పోపో! నువ్వెవడివయ్యా బాబూ! నీయిల్లు బంగారంగానూ! నువ్వెప్పుడో ఏదో ప్రతిజ్ఞ చేసానని చెప్పి, నీ అన్న, సాక్షాత్తు ధర్మదేవత అయిన ధర్మరాజుని చంపేస్తానంటావా? నీకు మతీసుతీ తప్పిందా ఏమిటి? సరే, నీకు సత్యమంటే ఏమిటో, ధర్మమంటే ఏమిటో పూర్తిగా తెలిసినట్టు లేదు. చెప్తాను విను" అని ఒక కథ చెప్తాడు.

పూర్వం కౌశికుడనే ఒక ముని ఒక గ్రామానికి పక్కనే ఆశ్రమం ఏర్పరుచుకొని తపస్సు చేసుకొనేవాడు. అతను సత్యవ్రతాన్ని ఆచరిస్తూ, ఎప్పుడూ సత్యమే పలుకుతాడనే ప్రసిద్ధి పొందాడు. ఒకనాడు పక్కనున్న గ్రామంలో దొంగలు పడ్డారు. వాళ్ళనుండి కొంతమంది జనం తప్పించుకు పారిపోయి, ఆ కౌశికుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి పక్కనున్న పొదల్లో దాక్కుంటారు. వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన దొంగలు కౌశికుణ్ణి ఊరి జనం ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు. తనకి అసత్య దోషం అంటకూడదని, వాళ్ళు పొదల్లో దాక్కున్నారన్న విషయం దొంగలకి చెప్పేస్తాడా ముని. ఆ దొంగలా జనాలని చంపేసి, వాళ్ళ ధనాన్ని దోచుకుని చక్కాపోతారు. అప్పుడు వాళ్ళందరినీ చంపిన పాపానికి ఆ ముని నరకానికి వెళతాడు.

అదీ కథ. అంచేత హింసని కలిగించే నిజం సత్యం అవ్వదు. ఇప్పుడు చంపకూడని నీ అన్నని చంపి, హింస చేస్తే అది సత్యవాక్పరిపాలన అవ్వదు అని కృష్ణుడు వివరిస్తాడు. అప్పుడు అర్జునుడు సంతోషించి, "పాపం చెయ్యకుండా నన్ను రక్షించావు కృష్ణా. అయినా నా ప్రతిజ్ఞ వృథా పోకుండా, అన్నగారికి ఏమీ జరగకుండా ఏమైనా మార్గముంటే చెప్పు" అంటాడు. అప్పుడొక ఉపాయం చెపుతాడు కృష్ణుడు. "పెద్దవాళ్ళని, గురువులని దూషించడమంటే వాళ్ళని చంపినంత పని. అంచేత నువ్వు ధర్మరాజుని దూషించి, ఆ తర్వాత అతని కాళ్ళపైబడి క్షమించమను సరిపోతుంది. నీ ప్రతిజ్ఞ తీరినట్టైపోతుంది". ఇదీ కృష్ణుడు చెప్పిన ఉపాయం! బాగుంది కదూ :-)

ఇక చూస్కోండి! అర్జునుడు ధర్మరాజుని చెడ తిట్టడం మొదలుపెడతాడు. ఈ తిట్టడం చూస్తే, ఏదో మొహమాటానికి పైపై తిట్టడం అనిపించదు. మహ ధాటిగా, ఎప్పటినుంచో మనసులో రగులుతున్న కోపాన్ని వెళ్ళగక్కినట్టుగా ఉంటుంది. గట్టిగా తిడితే కాని తన ప్రతిజ్ఞ నెరవేరినట్టు కాదనుకున్నాడో ఏమో అర్జునుడు!

కన దస్త్రంబుల నుజ్జ్వలోద్భట గదాఘాతంబులం గాల గే
లను విద్విట్చతురంగ సంఘముల గూలం, గేలి సల్పంగ జా
లిన యా భీముడు వల్కుగాక నను; దోర్లీలాసమగ్రుండవై
యనిలో నిల్వగ లేని నీ విటుల కీడాడంగ నర్హుండవే?

ప్రకాశించే అస్త్రశస్త్రాల తోనూ, భీకరమైన గదాదండంతోనూ శత్రువుల చతురంగ బలాలనీ చీల్చి చెండాడేటట్టు యుద్ధం చెయ్యగలిగిన ఆ భీముడు నన్నేమైనా అన్నాడంటే అర్థముంది, జబ్బసత్తువలేక యుద్ధరంగంనుంచి పారిపోయి వచ్చిన నీకు నన్ను ఇంతలేసి మాటలనడానికి అర్హత ఉందా?

నన్నెఱిగి యెఱిగి యిట్లన
జన్నే? నీ జిహ్వ పెక్కు శకలము లై పో
కున్నది యేలొకొ? రణమున
నెన్నడు నీవేమి సేసి తింత యనుటకున్?

నా గుఱించి తెలిసి తెలిసీ ఇన్నిన్ని మాటలంటావా? ఇంతలేసి మాటలన్న తర్వాత కూడా నీ నాలుక ముక్కలై పోలేదేమిటో! ఎప్పుడైనా యుద్ధంలో నువ్వేమైనా చేసావా, నన్నింత మాటలనడానికి?

నకులుడు సహదేవుండును
బ్రకట భుజాస్ఫురణమున నరాతిబలము నే
లకు గోలకు దెత్తురు; నో
రికి వచ్చినయట్టు లాడిరే యిబ్భంగిన్?

నకులుడూ సహదేవుడూ కూడా తమ భుజబలంతో శత్రువులని మట్టికరిపిస్తారే! వాళ్ళైనా ఎప్పుడూ నోటికి వచ్చినట్టిలా మాట్లాడారా?

నీవు జూదంబాడగా వైరబంధంబు
కౌరవకోటితో గలిగె; మనకు
రాజ్య నాశంబు నరణ్యవాసంబును
దాస్య దైన్యంబు నత్యంత దుఃఖ
ములు దెచ్చికొంటి; సిగ్గొలయదు నీ మనం
బున నించుకేనియు; ననికి జాల
కున్న వానికి దాల్మి యొప్పగు గాక ప్ర
ల్లదనములు పలికిన లాఘవంబు

సెందు? మున్నేమి సేసిన జేసి తింక
నైన దుర్బుద్ధితనములు మాని తగిన
పౌరుషము లేము సేయగ నూరకుండు;
మిడుము వడువారు సైతురే యివ్విధంబు?

నువ్వు జూదమాడ్డం వల్లనే మనకీ దురవస్థ, కౌరవులతో యుద్ధమూ, రాజ్య నాశనము, అరణ్యవాసము, అజ్ఞాత వాసంలో దాస్య వృత్తి ఇవన్నీ వచ్చాయి. అయినా ఇంకా నీకేమాత్రం సిగ్గు లజ్జా లేకుండా పోయింది! యుద్ధం చెయ్య లేకపొతే కనీసం సహనమైనా ఉండొద్దూ? ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం దేనికి? చేసినదేదో చేసావ్. ఇకనైనా నోరుమూసుకొని ఉండు. వచ్చిన కష్టాలతో పాటు నువ్విలా నోరు పారేసుకున్నావంటే సహించి ఊరుకోలేం!

చూసారా ఎంతగా ధర్మరాజుని చెడతిట్టాడో అర్జునుడు! ఎంత గట్టి వార్ణింగిచ్చాడో! నిజంగా అర్జునుడు ధర్మరాజుతో ఇలాంటి మాటలు మాట్లాడాడని ఊహించనుకుడా లేం కదా! ఏం చేస్తాడు తప్పనిసరై తిట్టాడు, కృష్ణుడు తిట్టించాడు. :-) సరే మొత్తం ఇలా తిట్టడమంతా అయిపోయాక, మళ్ళీ తన ఒరలోంచి కత్తి తీస్తాడు. "మళ్ళీ ఇదేంటి" అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, "నేనింతలేసి మాటలు ధర్మరాజుని అన్నందుకు గాను నాకు మరణమే ప్రాయశ్చిత్తం. నా తల నరుక్కుంటాను" అంటాడు! అప్పుడు కృష్ణుడేం చేస్తాడు? "ఓరినీ! ఇంత ఉపాయం చెప్పిందీ నువ్వు చావడానికా! చాల్చాల్లే ఊరుకో. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయి. నిన్ను నువ్వు చంపుకోవడమే కదా నీకు కావలసింది. నిన్ను నువ్వు పొగుడుకో. అదే ఆత్మహత్యతో సమానం." అని మరో ఉపాయం చెప్తాడు కృష్ణుడు. సరే నువ్వు చెప్పినట్లే చేస్తానని, తన గొప్పతనాన్ని తాను పొగుడుకుంటాడు అర్జునుడు! అంతా అయ్యాక ధర్మరాజు కాళ్ళ మీద పడి, "తప్పక నిన్ను అన్నేసి మాటలన్నాను. తూచ్! అవేం పట్టించుకోకు. ఇప్పుడు నిజం చెప్తాను విను. నువ్వు నా ప్రాణం కన్నా కూడా నాకెక్కువ. ఇప్పుడే నాకు అనుజ్ఞ ఇవ్వు. వెళ్ళి ఆ కర్ణుడిని చంపి వస్తాను" అని వేడుకుంటాడు అర్జునుడు.

హమ్మయ్యా అయ్యిందిరా సీను అనుకొని కృష్ణుడు ఊపిరి పీల్చుకునే లోపు, మరో ఉపద్రవం వచ్చిపడుతుంది! తనని అన్నేసి మాటలన్నాక, తర్వాత తూచ్ అంటే మాత్రం, ధర్మరాజు మనసు ముక్కలై పోయి ఉండదూ! "నా వల్ల మీకు చాలా కష్టాలు వచ్చాయి. ఈ వంశానికి కీడు తెచ్చిన నాలాంటి పాపాత్ముడి తల నఱికి వెయ్యడమే సరైన పని. నువ్వేదో దయ దలిచి ఆ పని చెయ్యలేదు. నేనిప్పుడే అడవులకి పోతాను. మీరందరూ సుఖంగా ఉండండి. పిఱికివాణ్ణి, బలహీనుణ్ణి రాజుగా చెయ్యడం తగునా? ఆ భీముడికే పట్టం కట్టెయ్యండి", అని ధర్మరాజు తన పక్క దిగి అడవులకి ప్రయాణం కడతాడు! ఓరినాయనోయ్! ఇదెక్కడి గొడవరా అనుకొని ఉంటాడు కృష్ణుడు. ఏం చేస్తాడు. వెళ్ళి తనే స్వయంగా ధర్మరాజు కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. "ధర్మరాజా, నేను చెపితేనే అర్జునుడు నిన్నలా అన్నాడు తప్పిస్తే నిజంగా కాదు. నీ కాళ్ళు పట్టుకొని శరణంటున్నానయ్యా, మా ఇద్దరి తప్పూ మన్నించు. నీకు అమితానందం కలిగేటట్టు ఇప్పుడే వెళ్ళి ఆ కర్ణుడిని చంపివస్తాము." అని ప్రార్థిస్తాడు. స్వయంగా పరమాత్ముడైన ఆ కృష్ణుడు ధర్మరాజు కాళ్ళ మీద పడి ఇలా వేడుకుంటాడు! అప్పటికి ధర్మరాజు మనసు శాంతిస్తుంది. ఇవాళేదో నాకు వికారం పుట్టి ఇన్ని మాటలన్నాను, క్షమించమని తిరిగి వేడుకుంటాడు ధర్మరాజు. అప్పుడతని అనుజ్ఞతో కర్ణ సంహారానికి బయలుదేరుతారు కృష్ణార్జునులు.

అదండీ కథ. కర్ణుడిని చంపే ముందు ఇంత తతంగం జరిగింది! అలాంటి సందర్భంలో అసలిలాంటి సన్నివేశం పెట్టడంలో వ్యాసుని ఆంతర్యం ఏమిటి? ఇందులోంచి మనం తెలుసుకోవలసింది ఏమిటి? ఈ ప్రశ్నలకి ఎవరికివారు, తమ సంస్కారాన్ని బట్టి సమాధానాలు ఆలోచించుకోవలసిందే! :-)

పూర్తిగా చదవండి...

Monday, March 29, 2010

భవిష్యత్తు

ఈ రోజు నిశ్యాలోచనాపథం ఫేం సౌమ్యగారి గూగుల్ బజ్ చూడగానే నాకీ కవిత గుర్తుకు వచ్చింది! ఇది ఎవరిదో ఎక్కడిదో వివరాలు త్వరలో విడుదల :-)

భవిష్యత్తు
======

నడచుచున్న పథంబు కంటక శిలావృ
తంబు, కటికచీకటి పైన, దారిసుంత
నాకు దోచదు, లాగుచున్నదియు నన్ను
కాలశైవలిన్యావర్తగర్భమునకు

(నడుస్తున్న దారంతా ముళ్ళూ రాళ్ళూ. పైనంతా కటికచీకటి. దారి ఏమాత్రం కనబడటం లేదు. కాలమనే నది నీటి సుడిలోకి నన్ను లాగుతున్నట్టుగా ఉంది.)

సురిగిపోయితి నంచు నెంచుకొనులోన
ముందు దూరాన కనవచ్చె పురుషుడొకడు
శతసహస్ర మార్తాండ తేజస్సహితుడు
హృదయ బాధా నివారణ మదనమూర్తి

(పూర్తిగా ఆ సుడిలో మునిగిపోతున్నానని అనుకొనే లోపల ముందు అల్లంత దూరంలో ఒక పురుషుడు కనిపించాడు. వందవేల సూర్యుల తేజస్సుతో ఉన్నవాడు. గుండెలో బాధని తీర్చే అందగాడు.)

అతి ప్రయాసంబు మీద నే నతనియున్న
తావునకు బోయి పడితి, నతండ దేమొ
అంజనావనీధర మట్టు లతి భయంక
రాకృతి వహించె, నాకు భయంబు తోచె

(అతి కష్టమ్మీద నేనతను ఉన్న చోటుకి వెళ్ళి పడ్డాను. అదేమిటో, అతను నల్లని అంజనా పర్వతాకారంలో భయంకరంగా కనిపించాడు. నాకు భయం వేసింది.)

పరుగులెత్తి మిక్కిలి దూర మరిగి వెనుక
తిరిగి చూచితి, నా చిత్రపురుషుడేలొ
నన్నుగని శాంతముగ నిల్చి నవ్వుచుండె
నా కతని నవ్వు దోచె స్వప్నంబువోలె

(పరుగులు పెట్టి, చాలా దూరం వెళ్ళి, వెనక్కి తిరిగి చూసాను. ఆ చిత్రపురుషుడు ఎందుకో నన్ను చూసి శాంతంగా నిల్చుని నవ్వుతున్నాడు. అతని నవ్వు ఏదో స్వప్నంలాగా అనిపించింది నాకు.)

వివిధ సూచీముఖోపలవిషమమైన
మార్గమున బోవుచుంటిని మరల నేను
ఇటుల జూతునుగద, ముందు నీ పురుషుడె
అతి మనోహరమూర్తి నన్నాహరించి

(ఎన్నో సూదుల్లాంటి మొనలున్న రాళ్ళతో నిండి నడవడానికి కష్టంగా ఉన్న త్రోవలో మళ్ళా పోతున్నాను. ఇటు తిరిగి చూసేసరికి ముందు ఆ పురుషుడే, ఎంతో మనోహరమైన మూర్తితో నన్ను ఆకర్షిస్తూ!)


పూర్తిగా చదవండి...

Wednesday, March 24, 2010

శ్రీరామనవమి శుభాకాంక్షలు!

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

వామాంకస్థితజానకీ పరిలసత్కోదండదండంకరే
చక్రంచోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖంశరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్నిస్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం

ఇది తెలుగువాళ్ళకి చాలందికి పరిచయమైన శ్లోకమే, కనీసం మొదటి పాదం. ఇది భద్రాచల ఆలయంలో గర్భగుడికి ముందు గది గోడపై ఉంటుంది కూడాను. ఈ శ్లోకం శ్రీరామకర్ణామృతంలోనిది అని ఈ మధ్యనే నాకు తెలిసింది. ఇది వ్రాసింది ఆది శంకరాచార్యులవారని అంటారు. ఇదే నిజమైతే శంకరాచార్యూలవారి కాలానికే భద్రాద్రిపై శ్రీరాముడు వెలశాడని అనుకోవాలి! ఏదైతేనేం ఆ భద్రాద్రి రాముని రూపాన్ని వర్ణించే చక్కని ధారాసారమైన శ్లోకమిది. శ్రీరామకర్ణామృతాన్ని సిద్ధయోగి అనే అతను తెలుగులోకి మొట్టమొదట అనువదించారని చెప్తారు. ఇతనెవరో ఏ కాలానికి చెందినవారో నాకు తెలియదు. పై శ్లోకానికి అతని అనువాదం:

శరచాపాబ్జరథాంగముల్ కరచతుష్కప్రాప్తమైయుండ సు
స్థిర వామాంకమునందు సీత నియతిన్ సేవింప భద్రాద్రిపై
నిరదైనట్టి సరోజనేత్రు బలు యోగీంద్రేంద్ర సంస్తోత్రు భా
సుర కేయూరవిభూషణున్ దలచెదన్ శుద్ధాంతరంగమ్మునన్

ఇక్కడ అబ్జమంటే శంఖం, రథాంగం అంటే చక్రం. విల్లు, బాణము, శంఖము, చక్రము నాలుగు చేతుల్లో వెలుగుతూంటే, ఎడమతొడపై కూర్చుని ఉన్న సీతతో కేయూరాది భూషణాలతో అలంకరింపబడి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ భద్రాద్రి కొండకొనపై వెలసి ఉన్న రాముని నీలమేఘశ్యాముని మనసారా ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం.


ఇంక, అంతటి భాషాపటిమ నాకు లేకపోయినా, నాకు వచ్చిన భాషలో రాముని గూర్చి చాన్నాళ్ళ క్రితం నేను వ్రాసిన పద్యాలు కూడా ఈ శ్రీరామనవమి సందర్భంగా మరోసారి ఇక్కడ తలచుకుంటున్నాను:

"శ్రీరామా!" అని భక్తిన్
నోరారగ బిల్చినంత నుప్పొంగె మనో
వారాశి, కురిసె నమృతము
పారిన కన్నీటి సుధలు పద్యములయ్యెన్

నీ నామము నెమ్మనమున
నే నీమముతో స్మరింతు నిత్యము శ్యామా!
నానాటి జీవితమ్మిది
నీ నైవేద్యమ్మొనర్తు నిర్గుణధామా!

కలలోననైను నిన్నే
తలచే సౌభాగ్యగరిమ తక్క మరేదీ
వలదింక నాకు వరదా
కొలువై నీవుండ గుండెగుడిలో స్థిరమై!

ఆ రావణు బరిమార్చిన
ధీరోదాత్తుడవు నీవు, దీనుడ నేనున్
నా రాక్షసగుణముల సం
హారము గావించి బ్రోవవయ్యా రామా!

ఒకరికి తల్లివి తండ్రివి
ఒకరికి నువు బిడ్డవౌదు వొకరికి తోడున్
ఇక మరి నాకేమౌదువు
సకలము నీవే యటంచు స్వామీ కొలువన్!

నినునెన్నడు గనలేనని
మునుపెన్నడొ భాధపడుచు మూల్గితి గానీ
నను నేనే కనలేనని
కనుగొంటిని నేడు తుదకు కనువిప్పయ్యెన్!

నీలోపల నేనుంటినొ
నాలోపల నీవు దాగినావో యేమో
యేలాగున తెలియునురా
లీలా మానుష విలాస శ్రీరఘురామా!


పూర్తిగా చదవండి...