తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, May 5, 2010

అంతర్జాలంలో మరో కల్పవృక్షం

కల్పవృక్షం అంటే మళ్ళీ రామాయణ కల్పవృక్షం అనుకుంటున్నారా ఏంటి? కాదు, ఇది వేరే కల్పవృక్షం. అదేమిటో తెలియాలంటే ఈ పద్యం చదవండి:

పత్రపత్రంబునకు మంచిఫలముగల్గి
కవుల దనుపుచు నర్థసంగ్రహణబుద్ధి
రోసి డస్సినవారల గాసిదీర్చు
గల్పవృక్షంబుగాదె నిఘంటువరయ!

ఇది శ్రీ పాలూరి శంకరనారాయణగారు వ్రాసిన పద్యం.

పత్రం అంటే రెండర్థాలు. ఒకటి ఆకు. రెండు కాగితం. అలాగే ఫలము అంటే పండు, ప్రయోజనము. పత్ర పత్రానికి మంచి ఫలం ఉండేది కల్పవృక్షం. కోరిన కోరికలన్నిటినీ ఫలింప జేసేది కాబట్టి. అలాగే ప్రతి కాగితమూ ప్రయోజనవంతంగా ఉండే పుస్తకం ఒకటుంది. అది కవులని తృప్తిపరుస్తూ ఉంటుంది. అర్థాలు తెలుసుకొనే ప్రయత్నంలో అలసిపోయేవారికి చెట్టులా సేదదీరుస్తుంది కూడా. అర్థవంతమైన కవిత్వాన్ని వ్రాసేందుకు కవులకూ, ఆ కవిత్వాన్ని అర్థం చేసుకునేందుకు పాఠకులకూ కూడా ఉపయోగపడుతుందన్న మాట! అవును అదే నిఘంటువు. ఇప్పుడు చాలామంది తెలుగువాళ్ళకు దాని అర్థం తెలియాలంటే దాన్నే ఆశ్రయించాలేమో! తేలిక భాషలో చెప్పాలంటే డిక్షనరీ.
సరే మరి ఆకుల్లేకుండా పళ్ళు మాత్రమే ఉన్న చెట్లెక్కడైనా ఉంటాయా? మనిషి టెక్నేంద్రజాలానికి ఆ మాత్రం సాధ్యం కాకుండా పోతుందా! జంతర్ మంతర్ అంతర్జాలంలో ఉన్న డిక్షనరీలన్నీ "అపర్ణలే" (అంటే కాగితాలు లేనివే) కదా. తెలుగులో ఇప్పటికే బ్రౌన్ డిక్షనరీ అంతర్జాలంలో ఉన్న విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. కనీసం నా బ్లాగులో పద్యాలు చదివేవాళ్ళు, నేను పొద్దులో ఇచ్చే గడితో కుస్తీ పట్టేవారు ఈ బ్రౌణ్యాన్ని ఉపయోగించే ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరికీ దొరికిన మరో వరం ఆంధ్రభారతి నందనవనంలో కొత్తగా వెలసిన నిఘంటు కల్పవృక్షం. ఇందులో బ్రౌణ్యమే కాకుండా, శబ్దరత్నాకరం, మరి రెండు ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులు కూడా కలిపి ఉన్నాయి! ఈ నిఘంటువుల నుండి విడివిడిగా కాని అన్నిట్లో కలిపి కానీ కావలసిన పదాలను వెతుక్కోవచ్చు. ఆ వెతుకులాట పదాలలో (ఆరోపాలలో) కాని, మొత్తం వాటి అర్థాలలో ఎక్కడైనా కాని చేసుకోవచ్చు. శొధన (అదే, తెలుగు భాషలో చెప్పాలంటే సెర్చి) సులువు చేసుకోడానికి మరెన్నో వెసలుబాట్లు కూడా ఉన్నాయక్కడ. ఇంకెందు కాలస్యం, వెంటనే ఆ ఫలాలని ఆరగించడం మొదలుపెట్టండి! అన్నట్టు మరో విషయం. ఇది ఇంకా ఎదుగుతున్న చెట్టు. అంటే ఇందులో మరెన్నో నిఘంటువులు చేరబోతున్నాయన్న మాట!

బ్రౌను డిక్షనరీ ఒక యూనివర్సిటీ వాళ్ళ కృషి ఫలితమైతే, ఈ కొత్త నిఘంటువు కేవలం ఇద్దరి కృషి ఫలితం. వారు శ్రీ వాడపల్లి శేషతల్ప శాయిగారు, శ్రీ కాలెపు నాగభూషణ రావుగారు. వారి వెనక అజ్ఞాతంగా మరెవరైనా ఉన్నారేమో తెలియదు. తెలుగు మీద అభిమానమున్న వాళ్ళందరూ వారి కృషికి జోహార్లు చెప్పాల్సిందే. మన వంతు సహాయం కూడా చెయ్యవచ్చు. ఎలాగో అక్కడున్న Aboutలో ఇచ్చిన్న వివరాలని చూడండి.

11 comments:

 1. Very good link. Me very much impressed. Thanks!

  ReplyDelete
 2. ఈ మధ్యే చూశాను, మీరిచ్చిన లంకె. బావుంది. ఎవరైనా ఆంధ్రనామ సంగ్రహానికి (ఆంధ్రభారతి లో ఉంది) వ్యాఖ్యానం వ్రాస్తే బావుంటుంది.

  ReplyDelete
 3. మంచి సమాచారం అందించారు.
  ధన్యవాదాలు.

  ReplyDelete
 4. ఎందుచేతనో తెలియదు, ఆంధ్రభారతి.కామ్ సైటు నా కలనయంత్రంలో తెఱచుకోవటం లేదు. ఎవరైనా దయచేసి సహాయం చేయండి సలహా చెప్పి.

  ReplyDelete
 5. అవును ఈ నిఘంటువు వచ్చిన తర్వాత నాకు చాలా పదాలను అర్థాలు దొరుకుతున్నాయి.

  ReplyDelete
 6. ఆంధ్రభారతి వాళ్ళు చేస్తున్న తెలుగు సేవ సామాన్యం కాదు. ఇప్పుడు నిఘంటువు కూడ దానికి తోడవడం చాలా సంతోషించాల్సిన వార్త.
  సుమారు ఒక యేడాది క్రితం నేను ఆ సైటుని తరచూ చూర్స్తుండిన రోజుల్లో మంటనక్కలో అది తెలుగుని సరిగ్గా చూపించేది కాదు. కేవలం ఆ సైటు చూడ్డం కోసం IE ఉపయోగించేవాడిని.

  ReplyDelete
 7. వీరి సేవ అసామాన్యం. అనుకున్నదే తడవుగా వెదుకులాటకి సరైన అర్థాలు/పదాలు దొరకడం ముదావహం.

  మంటనక్క సంగతేమో కానీ గూగుల్ క్రోముతో తంటాలుగానె ఉంది.ఆ సైటు చూడ్డం కోసం IE ఉపయోగించా.

  అదే వారికి ఉత్తరమిచ్చా...

  ReplyDelete
 8. "నిఘంటుశోధన"లో తెలుగు వ్రాయటంకోసం వాడిన స్క్రిప్ట్ "ఈమాట"వారు వాడేది. దీనినే "ప్రాణహిత" "ప్రజాకళ" వారుకూడా వాడుతున్నారు. GoogleChromeలో వాటన్నిటినీ ప్రయత్నించాను. అన్నిచోట్లా ఇదే సమస్య. త్వరలోనే దీనికి పరిష్కారమో, ప్రత్యామ్నాయమో చేస్తాను.

  GoogleChromeలో గమనించిన ఇంకోసమస్య - తెలుగు,ఇంగ్లీషు కలసి ఉన్న వ్యాక్యాలలో కొన్నిచోట్ల ఇంగ్లీషు మాటలు కనిపించటంలేదు. ఇది ఇంకా Betaనే అనుకుంటా.

  Firefox(Windows/Fedora11)లో ఏ సమస్యలూ లేకుండా పనిచేసింది. ఎవరికైనా ఇబ్బందులు వస్తే నాకు తెల్పండి - పరిష్కారానికి ప్రయత్నిస్తాను.

  కామేశ్వరరావుగారికి, మీ అందరికీ ధన్యవాదాలు. తప్పులు గమనిస్తే వెంటనే తెలుపమని మనవి.

  --
  నమస్సులతో,
  శేషతల్పశాయి.

  ReplyDelete
 9. హలో సార్,

  మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చెయ్యాలో తెలియక ఇలా కామెంట్ రాస్తున్నా.
  అల్లసాని పెద్దన మను చరిత్ర కి ఇంగ్లీషు అనువాదం ఏమైనా ఉందా ? సీపీ బ్రౌన్ అనువాదం ఒకటి ఉందని గూగిలిస్తే తెలిసింది, అదెక్కడ దొరుకుతుందో మీకు తెలుస్తుందేమోనని.

  రాజశేఖర్.

  ReplyDelete
 10. రాజశేఖర్ గారూ,

  మనుచరిత్రకి ఇంగ్లీషు అనువాదాలేవీ వచ్చినట్టుగా నాకు తెలియదు. బ్రౌన్ మనుచరిత్రని పరిష్కరింప చేసి ప్రచురింప చేసేడు కాని ఇంగ్లీషులోకి అనువదించ లేదనుకుంటాను. ఒకటి రెండు చోట్ల కనుక్కొని ఏమైనా తెలిస్తే చెప్తాను. బ్లాగు ప్రొఫైల్లో నా ఈమైల్ చేర్చాను. దానికొక మైలు పంపండి.

  ReplyDelete
 11. ఆంధ్రభారతి నిఘంటుశోధనకు క్రింది మూడు నిఘంటువులను జతచేశాము.
  1. శ్రీహరి నిఘంటువు
  2. శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు
  3. శంకరనారాయణ ఇంగ్లీష్-తెలుగు నిఘంటువు
  --
  వాడపల్లి శేషతల్పశాయి
  http://www.andhrabharati.com/dictionary/index.php

  ReplyDelete