తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, April 16, 2010

ధర్మరాజుని చెడతిట్టిన అర్జునుడు!

"ధర్మరాజునేవిఁటి అర్జునుడేవిఁటి చెడతిట్టడమేవిఁటి? విడ్డూరంగా ఉందే!" అని ఆశ్చర్యపోతున్నారా? అవును విడ్డూరమే కదూ మరి! ఎంతో కలిసిమెలిసి ఉండే అన్నదమ్ములు పాండవుల్లో అర్జునుడు ధర్మరాజుని తిట్టడమా? ఇదేదో అవార్డు పొందిన ఏ ఆధునిక భారత నవలలోనో ఉన్న సన్నివేశం అనుకునేరు. కాదు కాదు. ఇది అచ్చంగా ఆ వ్యాసుడు రాసిన మహాభారతంలో ఉన్న విషయమే. మరో విషయం చెపితే మరీ ఆశ్చర్యపోతారు. స్వయంగా శ్రీకృష్ణుడి ప్రోద్బలంతోనే అర్జునుడా పని చేస్తాడు! సరే, ఇక ఊరించింది చాలు, అసలు కథలోకి ప్రవేశిద్దాం.

అవి కురుక్షేత్ర సంగ్రామం మహా జోరుగా సాగుతున్న రోజులు. అప్పటికే పదహార్రోజుల యుద్ధం అయిపోయింది. భీష్మ ద్రోణులు నేల కూలారు. కర్ణుడు కౌరవ పక్షాన సర్వసేనాధిపతి అయ్యాడు. ఈ కర్ణుడు వికెట్టొక్కటి తీసేస్తే ఆట గెలిచినట్టేనని అనుకుంటున్నారు పాండవులు. కర్ణుడు సర్వసేనాధిపతిగా ఒక రోజు యుద్ధం అప్పుడే అయిపోయింది. ఆ రోజు కర్ణార్జునులు భీకరంగా యుద్ధంచేసుకున్నారు. అర్జునుడి ప్రతాపానికి కౌరవ సేనలు చెల్లాచెదరైపోయాయి. ఆ రోజు యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు విచారగ్రస్తుడయ్యాడు. అప్పుడు కర్ణుడతనికి ధైర్యం చెపుతూ, "రేపు చూడు నేనెలా విజృంభిస్తానో! నీకు శత్రువులంటూ లేకుండా చేస్తాను. ఆ అర్జునుణ్ణి సంహరిస్తాను." అని బీరాలు పలికుతాడు. శల్య సారథ్యంలో ఆ మరునాడు రెట్టించిన ఉత్సాహంతో కదనరంగానికి వెళతాడు కర్ణుడు. మళ్ళీ సంగ్రామం భీకరంగా సాగుతూ ఉంటుంది. అర్జునుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తూ కర్ణుడికి దూరంగా వెళతాడు. ధర్మరాజు కర్ణుడూ యుద్ధానికి తలపడతారు. వేసవికాలం మిట్టమధ్యాహ్నం మండే సూర్యుడిలాగా (ప్రస్తుతం ఆ ప్రతాపం ఎలా ఉంటుందో మనందరికీ అనుభవమే కదా! వేడి 43 డిగ్రీలకి పెరిగిపోతోంది!) పరాక్రమిస్తాడు కర్ణుడు. అప్పుడు ధర్మరాజు కర్ణుడి చేతిలో బాగా తన్నులు తిని యుద్ధభూమినుంచి పలాయనం చిత్తగిస్తాడు.

అప్పుడు జరుగుతుందొక విచిత్రమైన నాటకీయ సంఘటన! అలాంటి సందర్భంలో ఇలాంటి సన్నివేశాన్ని ఎవ్వరం ఊహించలేం! అప్పటికే రెండు సార్లు కర్ణుడి చేతిలో తన్నులు తిని పరాభవింప బడ్డాడేమో, శిబిరంలోకి వెళ్ళి, ధర్మరాజు తనలో తానే బాగా కుమిలిపోతూ ఉంటాడు. ఈ లోపున యుద్ధభూమిలో అర్జునుడు ధర్మరాజుని వెతుకుతూ కర్ణుడున్న దిశగా వస్తాడు. అక్కడ భీముడొక్కడే యుద్ధం చేస్తూ ఉంటాడు. కర్ణుడి ఉగ్రమూర్తిని చూసి అర్జునుడు విస్తుపోతాడు. "బ్రతికి యుండిన శుభములు వడయవచ్చు", ముందు రథాన్నిక్కడనుంచి పోనియ్యమంటాడు కృష్ణుడితో. అర్జునుడు అలసినట్టున్నాడు కాస్త బడలిక తీర్చుకోవడం మంచిదే అనుకుంటాడు కృష్ణుడు (ఈ అర్జునుడిలా మాట్లాడతాడేమిటి? వీడికి కాస్త చికిత్స చెయ్యాలి అని బహుశా లోపల అనుకుని ఉంటాడు). "సరే, ధర్మరాజు ఎలా ఉన్నాడో ఒకసారి పరామర్శించి వచ్చి అప్పుడీ కర్ణుడి సంగతి చూద్దాం", అని రథాన్ని ధర్మరాజు శిబిరం వైపు పోనిస్తాడు. కృష్ణార్జునులు రణరంగం నుంచి రావడాన్ని చూసి, కర్ణుణ్ణి చంపి ఆ శుభవార్త తనకి చెప్పడానికి వచ్చేరనుకుంటాడు ధర్మరాజు. పరమానందం పొందుతాడు. "ఆహా! అంతమంది చూస్తూ ఉండగా ఈ రోజు కర్ణుడు నన్ను అవమానించాడు. దానికి తగిన ప్రతీకారం చెల్లించి వచ్చారన్నమాట. సెహభాష్!" అని మెచ్చుకుంటాడు.

అరుదిది! నీవు నొవ్వక మహాబలు గర్ణు వధించితాతడ
క్కురుపతి సంతసింప - నరుగూల్చెద సంగరభూమి నేన యొ
క్కరుడను వీక దాకి - యను గర్వపు మాట సనంగనీక, నే
టి రణములోన నిట్లు ప్రకటింతె భవద్భుజ వీర్యశౌర్యముల్

"నువ్వేమాత్రం కష్టం లేకుండా ఆ మహాబలుడైన కర్ణుడిని సంహరించావా! ఆ దుర్యోధనుడి సంతోషం కోసం, 'నేనొక్కడినే ఆ అర్జునుణ్ణి చంపుతానూ అని విర్రవీగిన వాడి మాటలని వమ్ము చేస్తూ, ఇవ్వాళ యుద్ధంలో నీ భుజబలాన్ని, శౌర్యాన్ని చూపించి వచ్చావా!" అని అర్జునుణ్ణి పొగుడుతాడు.

కృష్ణార్జునులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇలా ధర్మరాజు అమితోత్సాహంతో మాట్లాడెస్తూ ఉంటే, మెల్లిగా అసలు సంగతి చెప్తాడు అర్జునుడు. "అన్నా! మరేమో, అశ్వత్థామ నా మీద యుద్ధానికి వచ్చాడు. చాలా ఘోరంగా యుద్ధం చేసాడు. మొత్తానికి ఎలాగైతేనేం అతని గర్వాన్ని అణచి అతన్ని తిప్పికొట్టాను. ఆ తర్వాత నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. అక్కడ భీముడొక్కడే యుద్ధం చేస్తూ కనిపించాడు. నువ్వేమో దెబ్బలు తగిలి శిబిరానికి వచ్చావని చెప్పారు. నువ్వెలా ఉన్నావో చూడ్డానికి వచ్చాము. నువ్వు క్షేమంగానే ఉన్నావుగా. ఇప్పుడు వెళ్ళి ఆ కర్ణుడి పనిపడతాను చూడు!" అని అంటాడు అర్జునుడు.

ఇంకేముంది! కర్ణుడు బతికే ఉన్నాడన్న మాట వినగానే ధర్మరాజు ఉత్సాహమంతా నీరుగారిపోతుంది. పైగా విపరీతమైన కోపం వస్తుంది. రాదూ మరి! తను ఓడిపోయి వచ్చానని పరామర్శించడానికి వస్తాడా అర్జునుడు! పైగా తనని అవమానించిన కర్ణుడిని చంపకుండా వస్తాడా! ఉక్రోషం పొంగుకొస్తుంది. పట్టరాని కోపంతో అర్జునుణ్ణి చెడామడా తిడతాడు. తిక్కన కలంలో ఆ ఘాటైన అచ్చ తెలుగు తిట్లు మచ్చుకి మీరూ రుచి చూడండి. :-)

విను కర్ణున కేనోడితి
నన నేటికి నీవు నోడి తనిలజ మాద్రీ
తనయులు మున్నే యోడిరి
మనతో గూడంగ గంసమర్దను డోడెన్

నేను కర్ణుడికి ఓడిపోయానని అనుకోనక్కరలేదు. నేనొక్కడినే కాదు, ఇప్పుడు నువ్వూ ఓడిపోయావు. భీముడు, నకులసహదేవులు ఇంతకు ముందే ఓడిపోయారు. ఆఖరికి మనతో కలిసి ఉండడం వల్ల ఈ కృష్ణుడు కూడా ఓడిపోయాడు!

కావున మనమిక ననికిన్
బోవం బనిలేదు, విపినభూమికి జని య
చ్చో వెఱపు దక్కి తపసుల
మై విచ్చలవిడి జరింత మందఱము దగన్

"అంచేతనింక మనం మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళక్కరలేదు. అందరం కట్టకట్టుకొని మళ్ళీ అడవులకు పోదాం. అక్కడ ఎలాంటి భయమూ లేకుండా తపస్సుచేసుకుంటూ మన ఇష్టం వచ్చినట్లు ఉండవచ్చు. అదే మనకి తగిన పని", అని అంటాడు. "లేదా గొప్పలకిపోకుండా, వినయంతో వెళ్ళి ఆ దుర్యోధనుడికి సేవకులమై పడి ఉందాం", అని కూడా అంటాడు. అంతేనా! ఇంకా వినండి:

అని వధించెద గర్ణు నేనని ప్రతిజ్ఞ
సేసి, యిటు దెచ్చి నన్నిట్లు సేసి, తింత
కెట్లు నేర్చితి? పొడవుగా నెత్తి నేల
వైవ నోర్చితి నను బగవారి నడుమ

కర్ణుడిని చంపుతానని పెద్ద పోటుగాడిలా ప్రతిజ్ఞ చేసావు. తీరా చూస్తే ఇప్పుడిలా కొంపముంచావు. నన్ను బాగా పైకెత్తేసి చివరికి నేల మీద గభీలున పడెయ్యడమే నీకిష్టంలాగా ఉంది, అదీ శత్రువుల మధ్యలో!

దేవతలిచ్చిన తేరు నశ్వంబులు
గపికేతనంబును గలవు, దైవి
కంబు చేనున్నది గాండీవమను దాటి
యంత విల్లది గాక, హరి రథంబు
గడపెడు నటె! పరికర మిట్టిదై యుండ
నెట్లు కర్ణునికోడి యిట్టు వలియ
బాఱతెంచితి వీవు? భండనంబున గర్ణు
గని పాఱు దని సుయోధనుడు సెప్పె

నది నిజంబుగ గొనక బేలైతి; నాదు
బేలతనమున గాదె పాంచాల మత్స్య
పాడ్యులాదిగ గలిగిన బంధుమిత్త్ర
జనుల దెగటాఱి రప్రయోజనముగాగ

దేవతలిచ్చిన రథమూ, గుఱ్ఱాలూ ఉన్నాయి. సాక్షాత్తూ హనుమంతుడు నీ జెండాపై ఉన్నాడు. దైవసహాయంతో లభించిన గాండీవం, తాటిచెట్టంత విల్లది, చేతిలో ఉంది! నారాయణుడే నీ రథ సారథి! ఇన్నీ ఉండి కర్ణుడిని ఎదుర్కోలేక ఇలా పారిపోయి వచ్చావు నువ్వు. యుద్ధంలో కర్ణుడిని చూస్తే అర్జునుడు పరిగెట్టి పారిపోతాడని దుర్యోధనుడు ముందే చెప్పాడు. వాడి మాట వినక నేను బేలనయ్యాను. ఇలా నా బుద్ధిలేనితనం కారణంగా పాపం అనవసరంగా పాంచాలురు, మత్స్యులు, పాండ్యులు మొదలైన బంధు మిత్త్రులందరూ యుద్ధానికి వచ్చి నాశనమయ్యారు!

ఇంకా ఎంతమాటన్నాడో తెలుసా?

గొంతి కడుపునందు గొడుకుచూలై నీవు
దోపకుండ వైతి, తోచినట్టి
పిండ మెడలియైన బిదప దిగంబడ
దయ్యె; నింత వుట్ట దట్టులైన!

"కుంతి కడుపులో నువ్వు కొడుకులా కనిపించి కూడా కాకుండా పోయావే (అంటే నువ్వు మగాడివి కాకుండా పోయావే అనీ)! పిండంగా ఉన్నప్పుడే జారిపోయుంటే ఇంత జరిగేది కాదు కదా!" అన్నాడు. ఎంతలేసి మాటలన్నాడో చూసారా?!

"ధర్మరాజుని చెడతిట్టిన అర్జునుడు" అని కదా శీర్షిక? మరి ధర్మరాజు అర్జునుడిని చెడతిట్టడం గురించి చెపుతున్నానేమిటని అలోచిస్తున్నారా? అగండాగండి. ముందుంది అసలు కథ!

ధర్మరాజు చివరగా మరోమాట కూడా అంటాడు.

హరి గలుగంగ నేటికి? భయంబున వచ్చితి; నీదు గాండివం
బెరువుగ నిచ్చి, నీవు నొగలెక్కి హరిన్ రథి జేయ గన్న ని
ష్ఠురభుజవిక్రమోగ్రుడగు సూతతనూభవు దత్సహాయులన్
బొరిగొనడే సుయోధనుని పోడిమి దూలగ నొక్క మాత్రలోన్

"అక్కడ కృష్ణుడు ఉన్నా కూడా భయంతో వచ్చేసావే! నీ గాండీవాన్ని కృష్ణుడికి ఎరువుగా ఇచ్చి, అతన్ని రథమెక్కించి, నువ్వు రథాన్ని తోలవలసింది కదా. అప్పుడా దుర్యోధనుడి పొగరు అణిగేటట్టు కర్ణుడిని వాడి సేనని ఒక్క చిటికలో చంపేసేవాడు!" అని అంటాడు.

అది వినగానే చయ్యని తన కత్తి తీస్తాడు అర్జునుడు. "ఇదేమిటి. ఇక్కడ కౌరవులు లేరే. మనం ధర్మరాజు కుశలాన్ని తెలుసుకోడానికి వచ్చాం. అతను బాగానే ఉన్నాడు. అంచేత సంతోషించాలి కాని ఇప్పుడు కోప్పడాల్సిన సమయం కాదు కదా! ఎందుకు కత్తి తీసేవ్?" అని అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, "నా గాండీవాన్ని మరొకడికి ఇమ్మని ఎవడైనా అంటే కనక, వాడి తల తెగనరుకుతానని నేను ప్రతిజ్ఞ చేసాను. ఇప్పుడీ ధర్మరాజు నన్నంత మాటన్నాడు. కాబట్టి ఇతన్ని చంపేస్తాను" అంటాడు. అది విని కృష్ణుడు, "పోపో! నువ్వెవడివయ్యా బాబూ! నీయిల్లు బంగారంగానూ! నువ్వెప్పుడో ఏదో ప్రతిజ్ఞ చేసానని చెప్పి, నీ అన్న, సాక్షాత్తు ధర్మదేవత అయిన ధర్మరాజుని చంపేస్తానంటావా? నీకు మతీసుతీ తప్పిందా ఏమిటి? సరే, నీకు సత్యమంటే ఏమిటో, ధర్మమంటే ఏమిటో పూర్తిగా తెలిసినట్టు లేదు. చెప్తాను విను" అని ఒక కథ చెప్తాడు.

పూర్వం కౌశికుడనే ఒక ముని ఒక గ్రామానికి పక్కనే ఆశ్రమం ఏర్పరుచుకొని తపస్సు చేసుకొనేవాడు. అతను సత్యవ్రతాన్ని ఆచరిస్తూ, ఎప్పుడూ సత్యమే పలుకుతాడనే ప్రసిద్ధి పొందాడు. ఒకనాడు పక్కనున్న గ్రామంలో దొంగలు పడ్డారు. వాళ్ళనుండి కొంతమంది జనం తప్పించుకు పారిపోయి, ఆ కౌశికుడు తపస్సు చేసుకుంటున్న చోటికి వచ్చి పక్కనున్న పొదల్లో దాక్కుంటారు. వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన దొంగలు కౌశికుణ్ణి ఊరి జనం ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు. తనకి అసత్య దోషం అంటకూడదని, వాళ్ళు పొదల్లో దాక్కున్నారన్న విషయం దొంగలకి చెప్పేస్తాడా ముని. ఆ దొంగలా జనాలని చంపేసి, వాళ్ళ ధనాన్ని దోచుకుని చక్కాపోతారు. అప్పుడు వాళ్ళందరినీ చంపిన పాపానికి ఆ ముని నరకానికి వెళతాడు.

అదీ కథ. అంచేత హింసని కలిగించే నిజం సత్యం అవ్వదు. ఇప్పుడు చంపకూడని నీ అన్నని చంపి, హింస చేస్తే అది సత్యవాక్పరిపాలన అవ్వదు అని కృష్ణుడు వివరిస్తాడు. అప్పుడు అర్జునుడు సంతోషించి, "పాపం చెయ్యకుండా నన్ను రక్షించావు కృష్ణా. అయినా నా ప్రతిజ్ఞ వృథా పోకుండా, అన్నగారికి ఏమీ జరగకుండా ఏమైనా మార్గముంటే చెప్పు" అంటాడు. అప్పుడొక ఉపాయం చెపుతాడు కృష్ణుడు. "పెద్దవాళ్ళని, గురువులని దూషించడమంటే వాళ్ళని చంపినంత పని. అంచేత నువ్వు ధర్మరాజుని దూషించి, ఆ తర్వాత అతని కాళ్ళపైబడి క్షమించమను సరిపోతుంది. నీ ప్రతిజ్ఞ తీరినట్టైపోతుంది". ఇదీ కృష్ణుడు చెప్పిన ఉపాయం! బాగుంది కదూ :-)

ఇక చూస్కోండి! అర్జునుడు ధర్మరాజుని చెడ తిట్టడం మొదలుపెడతాడు. ఈ తిట్టడం చూస్తే, ఏదో మొహమాటానికి పైపై తిట్టడం అనిపించదు. మహ ధాటిగా, ఎప్పటినుంచో మనసులో రగులుతున్న కోపాన్ని వెళ్ళగక్కినట్టుగా ఉంటుంది. గట్టిగా తిడితే కాని తన ప్రతిజ్ఞ నెరవేరినట్టు కాదనుకున్నాడో ఏమో అర్జునుడు!

కన దస్త్రంబుల నుజ్జ్వలోద్భట గదాఘాతంబులం గాల గే
లను విద్విట్చతురంగ సంఘముల గూలం, గేలి సల్పంగ జా
లిన యా భీముడు వల్కుగాక నను; దోర్లీలాసమగ్రుండవై
యనిలో నిల్వగ లేని నీ విటుల కీడాడంగ నర్హుండవే?

ప్రకాశించే అస్త్రశస్త్రాల తోనూ, భీకరమైన గదాదండంతోనూ శత్రువుల చతురంగ బలాలనీ చీల్చి చెండాడేటట్టు యుద్ధం చెయ్యగలిగిన ఆ భీముడు నన్నేమైనా అన్నాడంటే అర్థముంది, జబ్బసత్తువలేక యుద్ధరంగంనుంచి పారిపోయి వచ్చిన నీకు నన్ను ఇంతలేసి మాటలనడానికి అర్హత ఉందా?

నన్నెఱిగి యెఱిగి యిట్లన
జన్నే? నీ జిహ్వ పెక్కు శకలము లై పో
కున్నది యేలొకొ? రణమున
నెన్నడు నీవేమి సేసి తింత యనుటకున్?

నా గుఱించి తెలిసి తెలిసీ ఇన్నిన్ని మాటలంటావా? ఇంతలేసి మాటలన్న తర్వాత కూడా నీ నాలుక ముక్కలై పోలేదేమిటో! ఎప్పుడైనా యుద్ధంలో నువ్వేమైనా చేసావా, నన్నింత మాటలనడానికి?

నకులుడు సహదేవుండును
బ్రకట భుజాస్ఫురణమున నరాతిబలము నే
లకు గోలకు దెత్తురు; నో
రికి వచ్చినయట్టు లాడిరే యిబ్భంగిన్?

నకులుడూ సహదేవుడూ కూడా తమ భుజబలంతో శత్రువులని మట్టికరిపిస్తారే! వాళ్ళైనా ఎప్పుడూ నోటికి వచ్చినట్టిలా మాట్లాడారా?

నీవు జూదంబాడగా వైరబంధంబు
కౌరవకోటితో గలిగె; మనకు
రాజ్య నాశంబు నరణ్యవాసంబును
దాస్య దైన్యంబు నత్యంత దుఃఖ
ములు దెచ్చికొంటి; సిగ్గొలయదు నీ మనం
బున నించుకేనియు; ననికి జాల
కున్న వానికి దాల్మి యొప్పగు గాక ప్ర
ల్లదనములు పలికిన లాఘవంబు

సెందు? మున్నేమి సేసిన జేసి తింక
నైన దుర్బుద్ధితనములు మాని తగిన
పౌరుషము లేము సేయగ నూరకుండు;
మిడుము వడువారు సైతురే యివ్విధంబు?

నువ్వు జూదమాడ్డం వల్లనే మనకీ దురవస్థ, కౌరవులతో యుద్ధమూ, రాజ్య నాశనము, అరణ్యవాసము, అజ్ఞాత వాసంలో దాస్య వృత్తి ఇవన్నీ వచ్చాయి. అయినా ఇంకా నీకేమాత్రం సిగ్గు లజ్జా లేకుండా పోయింది! యుద్ధం చెయ్య లేకపొతే కనీసం సహనమైనా ఉండొద్దూ? ఇలా నోటికి వచ్చినట్లు మాట్లాడ్డం దేనికి? చేసినదేదో చేసావ్. ఇకనైనా నోరుమూసుకొని ఉండు. వచ్చిన కష్టాలతో పాటు నువ్విలా నోరు పారేసుకున్నావంటే సహించి ఊరుకోలేం!

చూసారా ఎంతగా ధర్మరాజుని చెడతిట్టాడో అర్జునుడు! ఎంత గట్టి వార్ణింగిచ్చాడో! నిజంగా అర్జునుడు ధర్మరాజుతో ఇలాంటి మాటలు మాట్లాడాడని ఊహించనుకుడా లేం కదా! ఏం చేస్తాడు తప్పనిసరై తిట్టాడు, కృష్ణుడు తిట్టించాడు. :-) సరే మొత్తం ఇలా తిట్టడమంతా అయిపోయాక, మళ్ళీ తన ఒరలోంచి కత్తి తీస్తాడు. "మళ్ళీ ఇదేంటి" అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు కృష్ణుడు. అప్పుడు అర్జునుడు, "నేనింతలేసి మాటలు ధర్మరాజుని అన్నందుకు గాను నాకు మరణమే ప్రాయశ్చిత్తం. నా తల నరుక్కుంటాను" అంటాడు! అప్పుడు కృష్ణుడేం చేస్తాడు? "ఓరినీ! ఇంత ఉపాయం చెప్పిందీ నువ్వు చావడానికా! చాల్చాల్లే ఊరుకో. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలున్నాయి. నిన్ను నువ్వు చంపుకోవడమే కదా నీకు కావలసింది. నిన్ను నువ్వు పొగుడుకో. అదే ఆత్మహత్యతో సమానం." అని మరో ఉపాయం చెప్తాడు కృష్ణుడు. సరే నువ్వు చెప్పినట్లే చేస్తానని, తన గొప్పతనాన్ని తాను పొగుడుకుంటాడు అర్జునుడు! అంతా అయ్యాక ధర్మరాజు కాళ్ళ మీద పడి, "తప్పక నిన్ను అన్నేసి మాటలన్నాను. తూచ్! అవేం పట్టించుకోకు. ఇప్పుడు నిజం చెప్తాను విను. నువ్వు నా ప్రాణం కన్నా కూడా నాకెక్కువ. ఇప్పుడే నాకు అనుజ్ఞ ఇవ్వు. వెళ్ళి ఆ కర్ణుడిని చంపి వస్తాను" అని వేడుకుంటాడు అర్జునుడు.

హమ్మయ్యా అయ్యిందిరా సీను అనుకొని కృష్ణుడు ఊపిరి పీల్చుకునే లోపు, మరో ఉపద్రవం వచ్చిపడుతుంది! తనని అన్నేసి మాటలన్నాక, తర్వాత తూచ్ అంటే మాత్రం, ధర్మరాజు మనసు ముక్కలై పోయి ఉండదూ! "నా వల్ల మీకు చాలా కష్టాలు వచ్చాయి. ఈ వంశానికి కీడు తెచ్చిన నాలాంటి పాపాత్ముడి తల నఱికి వెయ్యడమే సరైన పని. నువ్వేదో దయ దలిచి ఆ పని చెయ్యలేదు. నేనిప్పుడే అడవులకి పోతాను. మీరందరూ సుఖంగా ఉండండి. పిఱికివాణ్ణి, బలహీనుణ్ణి రాజుగా చెయ్యడం తగునా? ఆ భీముడికే పట్టం కట్టెయ్యండి", అని ధర్మరాజు తన పక్క దిగి అడవులకి ప్రయాణం కడతాడు! ఓరినాయనోయ్! ఇదెక్కడి గొడవరా అనుకొని ఉంటాడు కృష్ణుడు. ఏం చేస్తాడు. వెళ్ళి తనే స్వయంగా ధర్మరాజు కాళ్ళ మీద పడి వేడుకుంటాడు. "ధర్మరాజా, నేను చెపితేనే అర్జునుడు నిన్నలా అన్నాడు తప్పిస్తే నిజంగా కాదు. నీ కాళ్ళు పట్టుకొని శరణంటున్నానయ్యా, మా ఇద్దరి తప్పూ మన్నించు. నీకు అమితానందం కలిగేటట్టు ఇప్పుడే వెళ్ళి ఆ కర్ణుడిని చంపివస్తాము." అని ప్రార్థిస్తాడు. స్వయంగా పరమాత్ముడైన ఆ కృష్ణుడు ధర్మరాజు కాళ్ళ మీద పడి ఇలా వేడుకుంటాడు! అప్పటికి ధర్మరాజు మనసు శాంతిస్తుంది. ఇవాళేదో నాకు వికారం పుట్టి ఇన్ని మాటలన్నాను, క్షమించమని తిరిగి వేడుకుంటాడు ధర్మరాజు. అప్పుడతని అనుజ్ఞతో కర్ణ సంహారానికి బయలుదేరుతారు కృష్ణార్జునులు.

అదండీ కథ. కర్ణుడిని చంపే ముందు ఇంత తతంగం జరిగింది! అలాంటి సందర్భంలో అసలిలాంటి సన్నివేశం పెట్టడంలో వ్యాసుని ఆంతర్యం ఏమిటి? ఇందులోంచి మనం తెలుసుకోవలసింది ఏమిటి? ఈ ప్రశ్నలకి ఎవరికివారు, తమ సంస్కారాన్ని బట్టి సమాధానాలు ఆలోచించుకోవలసిందే! :-)

24 comments:

 1. చాలా బాగా రాశారండీ. ఈ ఘట్టంలో పద్యాలన్నీ నేను సొంతంగా చదవలేదుగానీ, మా నాన్నగారు ఈ ఘట్టాన్ని రసవత్తరంగా (ఇప్పుడు మీరు చెప్పినట్టే) మాకు చిన్నప్పుడు చెప్పారు.

  > అలాంటి సందర్భంలో అసలిలాంటి సన్నివేశం పెట్టడంలో వ్యాసుని ఆంతర్యం ఏమిటి? ఇందులోంచి మనం తెలుసుకోవలసింది ఏమిటి?

  ఈ ప్రశ్నలకి మీ అభిప్రాయాలు కూడా రాస్తే బాగుంటుంది కదా!

  ReplyDelete
 2. chaalaa bagundadee.Kotta vishayam telusukunnaanu.Dhanyavaadaalu

  ReplyDelete
 3. >> ఇందులోంచి మనం తెలుసుకోవలసింది ఏమిటి? ఈ ప్రశ్నలకి ఎవరికివారు, తమ సంస్కారాన్ని బట్టి సమాధానాలు ఆలోచించుకోవలసిందే! :-)
  మీగురించి ఎమీ లేదు అంటున్నారు. కాదు. చాలా ఉంది. మాటల్లో వ్రాతల్లో చెప్పలేనంత. మొదటినుండీ చివరిదాకా చదివాను. ఎదురుకుండా కూర్చుని చెబుతున్నట్లు ఉంది.
  సమాధానాలు సంస్కారంతో వస్తాయని చెప్పేది ఇంకా బాగుంది.
  ధన్యవాదాలతో. లక్కరాజు

  ReplyDelete
 4. hahaha.... చాలా బాగా ఉంది... నేను చాల రోజులైంది ఇది చదివి... చదువుతుంటే గుర్తు వచ్చింది... తమ లో ఉన్న అసంతృప్తి ని పోగొట్టుకోవడానికి అప్పుడప్పుడు ఇలా అత్యంత దగ్గరి వారు కూడా పోట్లాడుకోవాలి... అందులో తప్పేమీ లేదు... ఇలా తిట్టుకున్నాక.. ఇలా అన్నానేమిటీ అని మన మనస్సులో బాధ మొదలై... తిట్టిన మన వారి తో బంధం ఇంకా దృఢమవుతుంది... అన్నని తిట్టిన తమ్ముడు తన అసంతృప్తి ని పోగొట్టుకున్నా.... బాధని పొంది చావ బోయాడు... తన పట్ల తనవారికి కలిగిన కష్టాన్ని దాని స్థాయి ని వారి నోటి ద్వారా తెలుసుకుని ముందు ముందు జాగ్రత్త పడేలా ఈ సంఘటన పురికొల్పింది ... ముందు ముందు ఎటువంటి ద్వేష భావం లేకుండా అసంతృప్తి పోవాలనుకుంటే ఇలా తిట్టుకోవాలి ..పొగుడుకోవాలి లాంటి ఒక ఒప్పందం పెట్టుకోవాలి అని.. నా అభిప్రాయం...

  ReplyDelete
 5. చాలా బాగున్నదండీ ..... ధన్యవాదాలు

  ReplyDelete
 6. తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి అన్నారు. అలాగే, కావ్యాలకు సంబంధించిన విషయాలు భైరవభట్ల కామేశ్వరరావు గారు చెబితేనే (వ్రాస్తేనే) వినాలి (చదవాలి) అనేట్లుందండి ఇప్పుడు మీరు చెప్పిన విషయం.

  ReplyDelete
 7. para ninda = maranam

  swa-prasamsa = atmahatya

  ide summary anukuntaa ! tenglish lo typing ki manninchamani manavi.

  ReplyDelete
 8. monna bhakti tv lo garikapaati narasimha rao garu ide vishayam cheppaaru. meeru antha kanna vivaram gaa, padyaalato cheppaaru. baagundandee.

  ReplyDelete
 9. ఇది నేను బాలలకథలు పుస్తకంలో చదివాను కానీ ఇంత వివరంగా చదవలేదు. చక్కగా వివరించారు. నెనర్లు!

  ReplyDelete
 10. నేను మూలం చదవలేదు కానీ మీరు ఇలా కొన్ని అద్భుతమయిన పద్యాలు నాలాటివారికి అందించడం చాలా బాగుంది. ధన్యవాదాలు.

  ReplyDelete
 11. నేను చిన్నప్పుడు ఒకసారి విన్నానండి. ఇలా వివరంగా చదవటం ఇదే. మాలతిగారి మాటే నాదీను.

  ReplyDelete
 12. నేనీ ఘట్టం ఇంచుమించు ఇలానే, మీరు వర్ణించినట్టుగానే, మా ఇంటిపక్కన గుడిలో మహాభారతం పురాణశ్రవణం లో నా చిన్నతనంలో విన్నాను. గొల్లాపిన్ని శేషశర్మ గారని కృష్ణదేవరాయ యూనివర్శిటీ లో ఆంధ్రోపన్యాసకులాయన. అద్భుతంగా వివరించారు. అయితే ఆయన ద్వారా కథ వినడమే తప్ప, పద్యాలను సావకాశంగా చదివే అవకాశం ఇప్పుడే కలిగింది. గారెల్లాగానే ఉన్నాయి, పద్యాలు.

  బహుబాగు.

  ఇహపోతే, ఒకరిని మాటలతో మనసునొప్పించటం కూడా చంపడం కిందికే వస్తుందని బుద్ధుడి ప్రాకృత పద్యం ఒకటి ఉంది. Killing అని జిడ్డుకృష్ణమూర్తి ప్రసంగంలో కూడా ఇదే చెబుతాడాయన.

  ReplyDelete
 13. "కర్ణుడిని చంపే ముందు ఇంత తతంగం జరిగింది! అలాంటి సందర్భంలో అసలిలాంటి సన్నివేశం పెట్టడంలో వ్యాసుని ఆంతర్యం ఏమిటి? ఇందులోంచి మనం తెలుసుకోవలసింది ఏమిటి?"

  నా మటుకు నాకు అనిపించేది ఇది:
  "రామాయణం, మహాభారతం పూర్తిగా చదివితే బావుంటుంది.
  గుడ్డివాళ్ళు ఏనుగును తడిమి చూసినట్టు కొన్ని పాత్రలనో, కథాంశాలనో పట్టుకుని అతిగా విమర్శించడమో, ధర్మసూత్రాలు వల్లించడమో చేయడం వల్ల అనర్థం కలుగుతుంది.
  ఒక్కో పాత్రనూ ఎన్నో కోణాలలో చూపించారు ఈ గ్రంథాలలో.
  కొందరు కథానాయకులు, నాయికలు, ఇంకొందరు ప్రతికథా నాయకులు, నాయికలుగా ఊహించేసుకుని అయితే ఆకాశానికి ఎత్తెయ్యడమో, లేకపోతే పాతాళానికి తోసెయ్యడమో కాక తరచి చూసి ఆలోచించి ఆస్వాదించవలసిన గ్రంథాలు ఇవి.
  సమయానికి తగ్గట్టు ఏ ఒక చిన్న కథాంశమో ఒక ఉపాయానికో, ఆలోచనకో స్ఫూర్తినిస్తే, అది ఆ సందర్భానికి మాత్రమే అని తెలుసుకోవాలి.
  ఒక ధర్మ శాస్త్రమో, అధర్మ శాస్త్రమోగా పరిగణిస్తే అవి మనకు అందించే సాహిత్య విలువలు, అద్భుత ఊహా శక్తి, ఆలోచన పరంపరా కోల్పోతాము."

  ReplyDelete
 14. వ్యాఖ్య రాసిన అందరికీ ధన్యవాదాలు. అందరి అభిప్రాయాలూ బాగున్నాయి.

  సాయికిరణ్ గారూ, చాలా పెద్ద కితాబే ఇచ్చేసారు! :-) నిజానికి ఈ పోస్టు రాయడానికి నాకు స్ఫూర్తి మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారు. అంచేత ఈ ప్రశంసలన్నీ వారికే, "చంద్రశేఖరార్పణం". ఏం గొంతుకో వారిది! బహుశా ఎనభై ఏళ్ళుంటాయి. అంత వయసులో కూడా ఎక్కడా వణుకంటూ లేకుండా స్థిరంగా, దృఢంగా, గంభీరంగా ఉంటుంది. ఆ గొంతుతో శ్లోకం చదివినా, పద్యం చదివినా వింటే చెవుల్లో తుప్పొదిలి పోతుంది! అతను భారతం చెపుతూ ఉంటే విని తీరాలి. టి.టి.డి. చానెల్లో సోమవారం నుండి శుక్రవారం దాకా రాత్రి పదకొండు నుంచి పదకొండున్నర వరకూ భారత ప్రవచనం చేస్తున్నారు. వట్టి పురాణ ప్రవచనంలాగా కాక, సంస్కృత భారతంలోని శ్లోకాలతో పాటు తెలుగు భారతంలో పద్యాలు, తిరుపతివేంకట కవుల పద్యాలు, ఇతర కవుల పద్యాలు సందర్భోచితంగా చెపుతూ సారస్వత విశేషాలను కూడా వివరిస్తూ అద్భుతంగా సాగుతోంది.

  ReplyDelete
 15. కౌశికుడి కథ గుఱించి,
  సత్యస్య వచనం శ్రేయః సత్యాదపి హితం వదేత్।
  యద్భూతహితమత్యన్తమేతత్సత్యం మతం మమ॥

  ఇది నాకు ఆరోజు గుర్తుకురాబోయి అంత సీను లేక గుర్తుకు రాని శ్లోకం। (చిలోగం - అరవంలోఁ) । ఇప్పుడు పుస్తకంనుండి ఎక్కిస్తున్నాను।

  ReplyDelete
 16. బహు రసవత్తరంగా చెప్పారు మాస్టారూ!
  మొత్తానికి పాండవులనే తిక్కలాళ్ళని నెత్తికెత్తుకుని పాపం శ్రీకృష్ణునికి తల చాలానే బొప్పి కట్టి ఉంటుంది :)

  ReplyDelete
 17. తెలియని ఒక కొత్త కోణాన్ని చూపించారు. చాలా బాగుంది. ఇలాగే మంచి మంచి విషయాలు మా అందరికి చెప్తూ వుండండి.

  ReplyDelete
 18. మీరింత పండితులు, "భావ స్థిరాణి, జననాంతర సౌహృదాణి" అంటే ఏమిటో కాస్త చెబుతారా. కాళిదాస కవి రచనలోనిదట

  ReplyDelete
 19. సలాహుద్దీన్‌గారూ, అవును యిది కాళిదాసు రచించిన అభిజ్ఞానశాకుంతలంలో "రమ్యాణివీక్ష్య మధురాంశ్చ నిశమ్యశబ్దాన్" అని మొదలయ్యే శ్లోకంలోని పాదం. దీని గురించి యిక్కడ వ్యాఖ్యలో వివరించడం కష్టం. సుజనరంజని పత్రికలో ప్రతి నెలా "పద్యం-హృద్యం" శీర్షికలో "పద్యాలలో నవరసాలు" అన్న పేరుతో వ్యాసాలు వ్రాస్తున్నాను (http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/jan13/padyamhrudyam.html ). వచ్చే నెల వ్యాసంలో దీని గురించి కొంత వివరణ యిస్తాను చదవండి.

  ReplyDelete
 20. పోస్ట్ చాలా వివరంగా బాగుంది. ఒక్కటి నచ్చని పాయింటు.


  //అలాంటి సందర్భంలో అసలిలాంటి సన్నివేశం పెట్టడంలో వ్యాసుని ఆంతర్యం ఏమిటి? //

  అలాంటి సన్నివేశం వ్యాసుడు పెట్టలేదు . ఆ సన్నివేశం అలా జరిగితేనే వ్యాసుడు అక్షరీకరించాడంతే ! ఇలాంటి వాక్యాల వల్ల స్వతస్సిద్ధమైన ఆలోచన లేనివాళ్లకి మహాభారతం వ్యాసుని స్వకపోల కల్పితం అనిపిస్తుంది . మీరనే కాదు , చాలా మంది యథాలాపంగా ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తూనే ఉంటారు , అఫ్ కోర్స్ తమకి తెలీకుండానే .

  ReplyDelete
 21. అనానిమస్‌గారు, పోస్టు నచ్చినందుకు సంతోషం.
  ఇక మీకు నచ్చని అంశాన్ని గురించి చిన్న వివరణ (మీరు ప్రస్తావించిన నా వాక్యం ఎలాంటి అపోహలకీ దారితీయకూడదన్న ఉద్దేశంతో యిస్తున్నది). మహాభారతం నిజంగా జరిగిందా వ్యాసుని స్వకపోల కల్పితమా అన్న అంశం నా మటుక్కి నాకు అంత ప్రధానం కాదు. అందులో సారాన్ని తెలుసుకొని, మనకి ఉపయోగమైనదాన్ని గ్రహించడమే నాకు ముఖ్యం. నేనీ బ్లాగులో సాధారణంగా ఏ ఇతిహాసాన్నైనా కావ్యాన్నైనా ఆ దృష్టితోనే వ్యాఖ్యానిస్తున్నాను. ఈ దృక్పథం, అవి నిజంగానే జరిగాయన్న అంశానికి వ్యతిరేకమేమీ కాదు. రామాయణమైనా, మహాభారతమైనా, మరే పురాణమైనా, పాశ్చాత్య చరిత్రకారుల్లాగా విషయాలని కేవలం "రికార్డు" చేయడానికి వ్రాయబడ్డవి కావన్నది అందరూ అంగీకరించే విషయమే. మన మనసులని ఆకట్టుకొనేలా తీర్చిదిద్దబడ్డ రచనలవి. అంచేత వాటినా దృష్టితో కూడా పరిశీలించవచ్చు. ఇది మనకి కొత్త విషయం కూడా కాదు. "ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మవిదులు వేదాంతమనియు..." అంటూ నన్నయ్యగారు, "కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని" భారతాన్ని గురించి చెప్పనే చెప్పారు. అంచేత మహాభారతాన్ని కేవలం ఒక కావ్యంగా పరిశీలించే లైసెన్సు కనీసం అప్పటికే ఉంది. :) అలా చూసినంత మాత్రాన అది ఇతిహాసం కాకుండా పోదు!

  ReplyDelete
 22. అవును. మీరు చెప్పింది వాస్తవమే . కావ్యమని ఎందుకంటారంటే అందులో కావ్య లక్షణాలున్నాయని . ఒకవేళ లౌకికంగా మనం ఒక నవలలోనో ఇంకో కథలోనో లేని సన్నివేశాలను చొప్పించినా అలాంటి పని వ్యాసుడు చేయలేదు . ఇదిగో ఇది ఇలా జరిగింది ఇతిహాసమంటూనే కావ్యలక్షణాలో , ధర్మ మర్మాలో విప్పి చెప్పి ఉండవచ్చును కాని భారతం జరిగినది వాస్తవం .అందులోని సన్నివేశాలన్నీ వాస్తవం . అర్జునుని ధర్మ రాజు తూలనాడడమూ వాస్తవమే , ధర్మరాజును అర్జునుడు నిందించడమూ నిక్కమే . జరిగినది వాస్తవమైనప్పుడు - ఆ సన్నివేశాన్ని వ్యాసుడు 'పెట్టడమే'ముంది ? ఆ సన్నివేశాన్ని పెడితే గిడితే భగవంతుడే కల్పించాడనాలేమో , లేక విధి సంఘటితమనాలేమో ?

  ఆ సందర్భం అక్కడ వ్యాసుడు ఎందుకు ఉంచాడు అనేకన్నా ఆ సందర్భం లో వ్యాసుని ' పద ప్రయోగౌచిత్యానౌచిత్యాలో ' ' పరస్పర దూషణల్లోని నాటకీయత ' గురించో ' 'భావ శబలతేత్యాది ' వర్ణనల గురించో అడిగితే సమంజసమే కానీ - అసలా సందర్భాన్ని అక్కడెలా 'పెట్టాడు ' అన్న ప్రశ్న ఉదయించదు . ఉదయిస్తే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయవలసి వస్తోంది .

  ReplyDelete
 23. దీని గురించి యింత వాదన అవసరం లేదేమో. మీకా పదం నచ్చలేదు. నా దృష్టిలో అది తప్పుకాదు. దానికి నేనెంత వివరణ యిచ్చినా మీరు దాన్ని అంగీకరించరు. మీరెంత కాదన్నా నేనంగీకరించను. ఇది తెగేది కాదు.
  కావ్యవిశ్లేషణ గురించి అన్నారు కాబట్టి, ఒక్కమాట చెప్పి నావైపునుండి వాదనని ముగిస్తాను. కావ్యాన్ని విశ్లేషించడంలో పదప్రయోగ ఔచిత్యం, నాటకీయత, వర్ణనలు మొదలైనవాటితో పాటు, కథనం లేదా కావ్యనిర్మాణం గురించిన ఆలోచనకూడా భాగమే. జరిగిన కథే అయినా దాన్ని చెప్పడంలో అనేక పద్ధతులుంటాయని మీకు తెలియంది కాదు. ఉదాహరణకి భగవద్గీతనూ, మహాభారత యుద్ధాన్నీ, వ్యాసుడు నేరుగా చూసినవాడే. ధృతరాష్ట్రునికి సంజయుడూ చెప్పాడు. వాటిని కథనంలో నిర్మించేటప్పుడు, తాను నేరుగా చెప్పనూ వచ్చు, సంజయుని మాటల్లోనూ చెప్పవచ్చు. రెండూ జరిగిన కథని చెప్పడమే. కాని మహాభారతంలో రెండవ మార్గాన్ని ఎన్నుకున్నారు వ్యాసులవారు. ఈ నిర్మాణంలో విశేషమేమిటి అని కావ్య దృష్టితో విశ్లేషించవచ్చు. అలాగే మహాభారతంలో కొన్ని సన్నివేశాలు క్లుప్తంగా చెప్పబడ్డాయి, మరికొన్ని వివరంగా ఉంటాయి. ఈ తేడా కథనంలో వ్యాసులవారు కూర్చినదే కదా.

  "కర్ణుడిని చంపే ముందు ఇంత తతంగం జరిగింది! అలాంటి సందర్భంలో అసలిలాంటి సన్నివేశం పెట్టడంలో వ్యాసుని ఆంతర్యం ఏమిటి?"
  అని నేను వ్రాయడంలో నా ఆంతర్యం పైన చేసే విశ్లేషణలాంటిది చేయవచ్చుననే. "పెట్టడం" అనడంలో నా ఉద్దేశం "నిర్మించడం" అని. దానికి "కల్పించడం" అని మీరైనా మరెవరైనా అర్థం చేసుకుని ఉంటే యీ వివరణతో ఆ అపోహ తీరుతుందని ఆశిస్తున్నాను.

  ReplyDelete
 24. అవును నిజమే , ఇక్కడితో ఆపేద్దాం.

  ReplyDelete