నను మెడబట్టి గెంటితివి నాటకరంగముపైకి, చేత కా
దని బతిమాలుకొన్న వినవైతివి, కన్నులు విప్పి సభ్యులన్
గనుగొనినంత కాళ్ళు వడకన్ దొడగెన్ - సరికొత్త నర్తనం
బనుకొని చప్పటుల్ జరిచిరందరు, చాల్ తెరదింపుమో ప్రభూ!
మొన్ననీ పద్యమెందుకో హఠాత్తుగా గుర్తుకువచ్చింది. ఇదో తమాషా సన్నివేశం! కవి దేవునితో మొరబెట్టుకుంటున్నాడు. పద్యం సులభంగానే అర్థమవుతోంది కదా, వివరించాల్సిన పనిలేదు. జీవితాన్నో లోకాన్నో నాటకరంగంతో పోల్చడం పాత విషయమే. ఈ పద్యంలో ఉన్న ప్రత్యేకతంతా, వద్దు మొఱ్ఱో అంటున్నా దేవుడు తనని నాటకరంగంపైకి మెడబట్టి గెంటాడనడం. ఆ తర్వాత, ఎదురుగా ఉన్న సభ్యులని చూసి యితని కాళ్ళు వణుకుతూ ఉంటే ఆ ప్రేక్షకులేమో అదేదో కొత్త నాట్యమనుకొని చప్పట్లు కొట్టడం. భలే తమాషా అయిన ఊహ కదూ. తమాషాగా కనిపించినా, చాలా లోతున్న ఊహ. మామూలుగా - లోకం నాటకరంగం, మనుషలందరూ నటులు అనే పోలికలో ఆంతర్యం ఈ జగత్తంతా మిథ్య అని, జీవితమంతా కనిపించని శక్తి మన చేత ఆడిస్తున్న నాటకమని చెప్పడం. ఇక్కడ విషయం అది కాదు! ఇక్కడ కవికి తాను నటుడిని కానని తెలుసు. నటించాలన్న కోరికా లేదు. కాని, యితరులు తనని నటుడనుకుంటున్నారు. తన ప్రతి చేష్టను ఒక అద్భుతమైన నటన అనుకుంటున్నారు. అంటే యితరులు తనకు లేని శక్తి తనపైని ఆరోపిస్తున్నారు. వారే తనకొక లేని పాత్రని సృష్టిస్తున్నారు! తనకా శక్తి లేదని, తానా పాత్రకి అర్హుణ్ణి కాదని పరిపూర్ణ జ్ఞానం కవిగారి కున్నది. అయినా ఏమీ చెయ్యలేని విపత్కర పరిస్థితి!
మనందరి జీవితాల్లోనూ అడుగడుగునా యిలాంటి సన్నివేశం ఎదురుపడుతూనే ఉంటుంది. ఒక కుఱ్ఱాడికి ఒకటి రెండు పోటీల్లో బహుమతులు వచ్చాయనుకోండి. ఇక వాడి తల్లిదండ్రులకి అతనొక ప్రతిభామూర్తిగా కనిపించడం మొదలవుతుంది. అంతకుముందుకూడా అతడు పోటీల్లో పాల్గొని బహుమతులు రాకపోయి ఉండవచ్చు. ఇప్పుడవేవీ గుర్తుకు రావు. అప్పటినుండీ ప్రతి పోటీలోనూ అతడే బహుమతి గెల్చుకోవాలని తహతహ! అలా అతనికా పాత్ర ఆపాదింపబడుతుంది. ఇదింకా కాస్త నయమే! కొందరు పిల్లలయితే, వాళ్ళు పుడుతూనే ఇంజనీరో డాక్టరో అయిపోతారు. ఇక పెరిగి పెద్దవుతూ వాళ్ళా పాత్రని నిర్వహించడానికి నానా కష్టాలూ పడాల్సిందే!
పెళ్ళవ్వగానే అబ్బాయి "బాధ్యతగల భర్త" పాత్ర, అమ్మాయి "ఆదర్శవంతమైన గృహిణి" పాత్ర, ఆఫీసులో "ప్రతిభగల ఉద్యోగి" పాత్ర, స్నేహితులకి "మంచి మిత్రుని" పాత్ర - ఇలా, ప్రేక్షకులని బట్టి ఒకే మనిషి అనేక పాత్రలను ఏకకాలంలో నిర్వహిస్తూ ఉండాల్సిందే! ఏదో ఒకటి రెండు చక్కని కవితలో, కథలో కలంనుండి జాలువారితే చాలు, ఇక అతను/ఆమె గొప్ప కవి లేదా రచయిత పాత్రని నిర్వహించాల్సిన అగత్యం ఏర్పడుతుంది! తెలిసిన వాళ్ళందరూ కనిపించినప్పుడల్లా, "అదేమిటండీ ఈ మధ్యన బొత్తిగా రాయడం మానేసారు" అంటూ ప్రశ్నలు సంధించడం మొదలుపెడతారు! లోకం కొంతమంది మీద ఆపాదించే మరొక అతి క్లిష్టమైన కష్టమైన పాత్ర "మేధావి" పాత్ర. ఒకరి మాటలో రాతలో కొన్నిటిని చూసి వాళ్ళ మీద మనకి కాస్త గురి ఏర్పడిందనుకోండి, వాళ్ళు నిజానికి ఆముదం చెట్టే అయ్యుండొచ్చు గాక - కానీ మన కళ్ళకి వాళ్ళు మహావృక్షంలా కనిపిస్తారు. వాళ్ళని సాక్షాత్తూ పుంభావసరస్వతనో సరస్వతీపుత్రులనో (మగవాళ్ళయితే! :) కీర్తిస్తాం. ఇక వాళ్ళా భారాన్ని మొయ్యడానికి అష్టకష్టాలూ పడాల్సిందే! పై పద్యంలో కవిగారిలా వాళ్ళకి తమ గురించీ, తమ శక్తి గురించీ స్పష్టమైన అవగాహన ఉంటే కాస్త ఫరవా లేదు. లేదంటే అథఃపాతాళానికి కూరుకుపోవలసిందే! సదరు "మేధావి" ఎప్పుడయినా ఏదైనా తనకు తెలియని విషయమ్మీద ఒక తెలివితక్కువ ప్రశ్న అడగడమో వ్యాఖ్య చెయ్యడమో చేసాడనుకోండి. "మీవంటి వారి దగ్గరనుండి ఇలాంటి ప్రశ్న/వ్యాఖ్య వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదండీ!" అని ఆశ్చర్యపోతూ పెదవి విరిచేస్తాం! మరికొందరు ప్రేక్షకులయితే మరీ విచిత్రంగా ఉంటారు. తమకి సంబంధం లేనివాళ్ళకి సంబంధం లేని పాత్రని తామే అంటగట్టేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒకతను మరొక తెలుసున్న మనిషి దగ్గరకి వెళ్ళి, "మీకేమండీ! రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ళు మీ మాటను జవదాటరు." అన్నాడనుకోండి, అంత కన్నా విడ్డూరం ఉంటుందా! తన బిడ్డలు (బిడ్డలుగా) రత్నాల్లాంటి వారో కాదో, తన మాట వింటారో వినరో, అయితే గియితే ఆ తండ్రి చెప్పాలి. ఆ మూడో వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఆ రకంగా పాపం ఆ బిడ్డలు "రత్నాల్లాంటి" బిడ్డలుగానూ, సదరు తండ్రి అలాంటి బిడ్డల తండ్రిగానూ పాత్రధారణ చెయ్యాల్సి వస్తుంది.
ఏతావాతా తేలిందేమిటయ్యా అంటే, మనం జీవితంలో ప్రతినిత్యం ఎవిరికో ఒకరికి ఏదో ఒక పాత్రని అంటగట్టి చప్పట్లు చరుస్తూనే ఉంటాం. ఏప్పుడూ ఎవరో ఒకరి చేత ఏదో ఒక పాత్రలోకి నెట్టివేయబడుతూనే ఉంటాం. ఆ విషయాన్ని మనం గ్రహించగలుగుతామా లేదా అన్నది ముఖ్యం. గ్రహించగలిస్తే, అందంగా నటించ గలిగినన్నాళ్ళు నటించి (నటించడం కన్నా నిర్వహించడం గౌరవమైన మాట కావచ్చు, కాని నిజానికి యీ సందర్భంలో రెండూ ఒకటే!) మరియాదగా తప్పుకో గలుస్తాం. లేదంటే అయ్యేది రసాభాసే!
ఇంతకీ యీ పద్యం ఎవరిదో చెప్పనే లేదు కదూ! ఈ పద్యం కరుణశ్రీగారి "అమర్ ఖయాం"లోది. ఒమర్ ఖయ్యాం రుబాయితుల స్ఫూర్తితో వ్రాసిన పుస్తకమిది. ఖయ్యాము రుబాయితుల అనువాదంగా కన్నా ఒక స్వతంత్ర కావ్యంగా నాకిది నచ్చుతుంది. చక్కని ధారతో, హాయిగా అర్థమయ్యే అందమైన కల్పనలతో రమ్యంగా సాగే పద్యాలు దీనిలోని ప్రత్యేకత.
తా.కా.: అంతర్జాలలోకం కూడా ఒక పెద్ద నాటకరంగమే. దీనికీ పై పద్యం అమోఘంగా వర్తిస్తుందన్న సంగతి గమనించారా?! :-)
పూర్తిగా చదవండి...
Friday, April 13, 2012
నను మెడబట్టి గెంటితివి...
Sunday, April 1, 2012
జానక్యాః కమలామలాఞ్జలిపుటే...
జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః
పూర్వం తెలుగువారి పెళ్ళి శుభలేఖలపైన యీ పద్యం తరచూ కనిపించేది. ఇది సీతారాముల పెళ్ళివేడుకలో ముత్యాల తలంబ్రాలను వర్ణించే పద్యం. పెళ్ళి శుభలేఖ మీద యీ శ్లోకం ఎందుకంటే, సీతారాముల పెళ్ళంత వైభవంగానూ తమ పెళ్ళివేడుక జరగాలని ఆకాంక్ష. సీతారాముల పెళ్ళంటే తెలుగువాళ్ళకి ఒక పండగ, ఒక సంబరం. ఈ శ్రీరామనవమి రోజు, సీతారాములు కొలువున్న ప్రతి హృదయమూ ఒక భద్రాచలమే. ప్రతి గుండెలోనూ మంగళవాద్యాలు మ్రోగవలసిందే.
పెళ్ళికన్నా ముందు శివధనుర్భంగ ఘట్టం మదిలో మెదులుతుంది. ఆ దివ్యమోహనమూర్తి, వినీలనీరదశ్యాముడు, విశ్వామిత్రుని వెనుకగా నిలబడి కనిపిస్తాడు. అదుగో చూడండి:
ఆ కనుదోయిలో తొణుకులాడు సముజ్జ్వల దివ్యదీప్తి ము
ల్లోకము లేలు రాజసము లోగొనగా, రఘురామమూర్తి తా
నాకృతిగొన్న వీరరసమట్టుల నమ్మునిరాజు వెన్క నా
జూకుగ నిల్చియుండె ప్రియసోదరుతో అభిరామమూర్తియై.
కరుణశ్రీగారి కవిత్వంలో మూర్తికట్టిన మనోజ్ఞ రూపం అది. కరుణశ్రీగారి గడుసుదనం గమనించండి. వీరరసం ఆకృతిగొన్నట్టుగా ఉన్నాడని వీరరసాన్ని గురించి వాచ్యంగా చెప్పి, నిలుచున్న తీరులోని నాజూకుదనంలో శృంగారరసాన్ని వ్యగ్యంగా చెప్పారు! ఆ అభిరామమూర్తి వీరశృంగార రసాకృతి.
అదుగో వినండి. జనకమహారాజు తన సింహాసనమ్మీద నుండి లేచి నిలుచుని యేదో ప్రకటన చేస్తున్నారు:
స్వాగతమో స్వయంవర సమాగత రాజకుమారులార! మీ
యాగమనమ్ముచే మది ప్రహర్ష పరిప్లుతమయ్యె, యీ ధను
ర్యాగమునందు శంకరుశరాసన మెక్కిడు నెవ్వ డా మహా
భాగు వరించు నా యనుగుపట్టి సమస్త సభాముఖమ్మునన్
జనకమహారాజా! ఓ రాజర్షీ! ఆనందంతో ఉరకలువేస్తున్నది నీ మనసొక్కటే కాదయ్యా. మా అందరి మనసులూను. ఎప్పుడెప్పుడు రామయ్య ఆ శంకరుని విల్లు ఎక్కుపెట్టి మా సీతమ్మను పెళ్ళాడతాడా అని మేమందరమూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నాం. అవునయ్యా అవును! నీ అనుగుపట్టి, మా సీతమ్మ, వరించినది కాబట్టే మా రామయ్య మహాభాగుడు, మహా భాగ్యవంతుడు అయ్యాడు. కాదన్నదెవరు! మా త్యాగయ్య స్పష్టంగా తేల్చిచెప్పాడు కదా, "మా జానకి చెట్టబట్టగా మహారాజువైతివి" అని. సాక్షాత్ లక్ష్మీస్వరూపమైన సీతమ్మని పెళ్ళాడిన తర్వాతే కదా రామునికి నారాయణాంశ పూర్ణంగా లభించినది. సీతలేని రాముడు లేడు. సీతమ్మవారిని తెలుసుకోకుండా రాముడు అర్థం కాడని అశోకవనంలో సీతని చూసిన తర్వాతనే హనుమంతునికి తెలిసివచ్చిందట (మాకు మా విశ్వనాథవారు చెప్పారులే):
చేతమునందు పూర్వమున శ్రీరఘురాము నెరింగినట్లుగా
నే తలపోసినాడ, నిపుడీయమ గాంచినయంత సర్వ మ
జ్ఞాతము గాగనుండెనను సంగతి నా కెరుగంగ నయ్యెడున్
సీత నెరుంగకుండ రఘుశేఖరు డర్థము కాడు పూర్తిగా
అరే, అదేమిటీ! రామయ్య కాకుండా ధనుస్సు వద్దకు వేరెవరెవరో వెళుతున్నారేమిటి!
బిగువు నిండారు కొమ్ముటేనుగులవంటి
రాచవస్తాదు లెందరో లేచినారు
అయితేనేం,
శివధనుర్భంగ మట్లుండ శృంగభంగ
మయ్యెను సమస్త సభ్య సమక్షమందు!
అంతేకదా మరి. శివధనుస్సుని సాధించడం ఆషామాషీ వ్యవహరమా! వశిష్ఠ విశ్వామిత్రులవంటి గురువుల దగ్గర యోగవిద్యని అభ్యసించిన గొప్ప సాధకుడైన రామయ్యకే అది సాధ్యం.
ఆఁ! ఎక్కడనుండి వస్తోందా సింహధ్వని?! ఓహో లక్ష్మన్న ఏదో ఎలుగెత్తి చాటుతున్నాడు. అదేమిటో మొల్ల మనకు చెపుతోంది:
కదలకుమీ ధరాతలమ! కాశ్యపి బట్టు ఫణీంద్ర! భూవిషా
స్పదులను బట్టు కూర్మమ! రసాతల భోగిడులీ కులీశులన్
బెదరక బట్టు ఘృష్టి! ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుపట్టుడీ కరులు! భూవరుడీశుని చాప మెక్కిడున్
రామయ్య చాపాన్ని ఎక్కుపెట్టబోతున్నాడట. భూమిని, భూమిని భరించే ఆదిశేషు, ఆదికూర్మ, ఆదివరాహ, దిగ్గజాలకి బహుపరాకు చెపుతున్నాడు లక్ష్మన్న. ఒకదాన్ని ఒకటి జాగ్రత్తగా పట్టుకోమని. అదరవద్దని, బెదరవద్దని. రాముడు విల్లెక్కు పెట్టబోతూ ఉంటే యింతటి ఆర్భాటం దేనికంటారా? రామయ్య ఆ ధనువుని ఎక్కుపెట్టగానే అది దిక్కులదిరే పెనుసవ్వడితో విఱిగిపడుతుందని లక్ష్మన్నకి తెలుసుగా. అందుకే ఆ హెచ్చరిక! అదిగదిగో, రామయ్య సదమల మదగజ గమనముతో స్వయంవర వేదిక చెంతకి వేంచేసాడు. వచ్చి:
ఇనవంశోద్భవుడైన రాఘవుడు భూమీశాత్మజుల్ వేడ్కతో
దను వీక్షింప, మునీశ్వరుండలర, కోదండంబు చేబట్టి చి
వ్వన మోపెట్టి గుణంబుబట్టి పటుబాహాశక్తితో దీసినన్
దునిగెన్ జాపము భూరిఘోషమున వార్ధుల్ మ్రోయు చందంబునన్
అంతే! సముద్రఘోషతో ఫెళ్ళుమని ఆ విల్లు విరిగింది. అప్పుడేమయింది?
ఫెళ్ళుమనె విల్లు, గంటలు ఘల్లు మనె, గు
భిల్లుమనె గుండె నృపులకు, ఝల్లు మనియె
జానకీదేహ మొక నిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయము గదుర!
నయము, జయము, భయము, విస్మయము - రెప్పపాటు కాలంలోనే అన్ని రకాల భావాలు ఒకేసారి విజృంభించాయట!
శివధనుర్భంగమైన ఆ క్షణంలోనే రామయ్య శ్రీరాముడయ్యాడు. జానకీరమణుడయ్యాడు. సీతారాముల విషయంలో విశ్వనాథవారి నిశ్చయం యిది:
ఆయమ పుట్టె పాల్కడలి నంగనగా దనవంతు తీసికోన్,
ఈయమ ధాత్రిలోన జనియించెను విల్లునువంప బెండ్లమై,
ఈయమ మున్ను వేదముల యింపగు తత్త్వము, తానె యామయై
ఆయమ కంటి యాన బడి యాచరణం బఖిలంబు చేయుచున్
ఈ పద్యంలో "ఆయమ" అంటే లక్ష్మీదేవి. "ఈయమ" అంటే సీతాదేవి. ఆమె యేమో క్షీరసాగర మధన సందర్భంగా, విష్ణువు తన వంతుగా స్వీకరించడంకోసం పాలకడలిలో పుట్టుంది. ఆమె శ్రీవారి మాటలని అనుసరించేది. కాని యీమె? ఈమె భూమిజాత. అయాచితంగా లభించినది కాదు. శివధనుస్సుని విఱిచిన ఫలంగా రాముని యీమె వరించినది. ఈమె వేదతత్త్వము. ఈమె కంటి ఆన చేతనే రాముడు అఖిల కార్యాచరణమూ చేస్తాడు. అందుకే, ఆ క్షణమే శ్రీరాముడు సర్వశక్తిమంతుడయ్యాడు, సంపూర్ణుడయ్యాడు. అప్పుడే అసలు రామాయణం, సీతాయాశ్చరితం మొదలయ్యింది. ఇక ఆ తర్వాత జరిగిన పెండ్లి వేడుకంతా మనకోసం మనం చేసుకొనేదే!
ముఖ్యంగా మన మన తెలుగువారికి తలంబ్రాల ముచ్చట ఎంతో సరదా! అందులోనూ సీతారాముల కల్యాణమంటే అవి మామూలు తలబ్రాలు కావుకదా! ముత్యాల తలంబ్రాలు. మామూలు ముత్యాలా! ఆణిముత్యాలు! అలాంటి ఆణిముత్యాల కాంతులు ఎన్నెని వింత వింత పోకడలు పోయాయో వర్ణించే శ్లోకమే పైన చెప్పుకున్నది. అది శంకరాచార్యుల విరచితమని కొందరంటారు కాని, నాకయితే ఎవరో అచ్చమైన తెలుగు కవి వ్రాసినదే అని గట్టి నమ్మకం! ఆ కవిత్వానికి నా పైత్యం కొంత కలిపి చేసిన అనువాదం ఇదిగో:
కెందామరౌ జానకీదేవి దోసిట
పద్మరాగమ్ములై పరిఢవిల్లి
రఘురాము తలపైని రహి నుంచినంతనె
మొల్లలై వెలుగులు వెల్లివిరిసి
అటనుండి జాఱి యా శ్యామలతనురుచి
నింద్రనీలమ్ములై యింపుమీరి
కరిమబ్బు చిరుజల్లు కురిసిపోయినయట్లు
నేలపై చినుకులై జాలువారి
వేడ్క సీతమ్మ రామయ్య పెండ్లినాడు
అలరు తలబ్రాల చినుకుముత్యాలజల్లు
తెలుగువారిండ్ల సిరిసంపదలును శుభము
బ్రగతి గూర్చుత శ్రీరామరక్ష యగుచు!
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!
పూర్తిగా చదవండి...
Thursday, March 1, 2012
అదిగో ద్వారక...
అదిగో ద్వారక! ఆలమందలవిగో అందందు గోరాడు! అ
య్యదియే కోట, అదే అగడ్త, అవె రథ్యల్, వారలే యాదవుల్!
యదుసింహుండు వసించు మేడ యదిగో! ఆలాన దంతావళా
భ్యుదయంబై వర మందురాంతర తురంగోచ్చండమై పర్వెడిన్!
ఆఁ.. ఆఁ... వినిపిస్తున్నాయ్... మీ ఈలలూ వన్సుమోర్లూ! :-) ఇదిగో మళ్ళీ వినండి.
తన కాలానికి ప్రచారంలో ఉన్న పద్యనాటక సంపదాయ ధోరణిని కాదని, పద్యాలు పాడడంలో ఒక కొత్త సంప్రదాయాన్ని సృష్టించినవారు ఘంటసాల మేష్టారు. ఒకొక్కరికి ఒకో పద్ధతి నచ్చుతుంది! (నాకు రెండూ నచ్చుతాయ్ :-)) పద్యాలు పాడడంలో మార్పుని తెచ్చింది ఘంటసాల అయితే, అసలు పద్య రచనలోనే ఒక విప్లవాన్ని తెచ్చినవారు తిరుపతివేంకట కవులు. అటు అవధానాలతో పండితులనూ, ఇటు భారత నాటకాలతో సామాన్య ప్రజలనూ ఏకకాలంలో తమ పద్యాలతో ఉఱ్ఱూతలూగించిన కవులు వారు. ఆ కాలంలో వారిదొక ప్రభంజనం.
పాండవుల అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయ్యాయి. దుర్యోధనుడు తమ రాజ్యం తిరిగి యివ్వడన్నది దాదాపుగా స్పష్టమైపోయింది. ఇరు పక్షాలవారూ యుద్ధోద్యోగులయ్యారు. నానా రాజుల సైన్యబలాలనీ సమీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయి. శ్రీకృషుడు పాండవులకి ఎంత సన్నిహితుడయినా, తమ పక్షమే వహిస్తాడని వారికి తెలిసినా, ఒక రాజుగా అతడిని వెళ్ళి తమ పక్షంలో ఉండమని కోరడం రాచమర్యాద. మరి ఆ కార్యాన్ని నిర్వహించ గలిగేవారెవరు? కృష్ణుని ప్రియసఖుడైన అర్జునుడు కాక ఇంకెవరు? శ్రీకృష్ణుడంటే అర్జునుడికున్న స్నేహం, భక్తి, అనురక్తి అనన్యసామాన్యం. అలాంటి ప్రియబాంధవుడైన కృష్ణుని చూడబోతున్నాడంటే అర్జునుడి మనసు ఉత్సాహంతో ఉరకలు వెయ్యదూ! "అదిగో ద్వారక!" అంటూ ఎత్తుగడలోనే ఆ ఉరకలేసే ఉత్సాహాన్ని అలవోకగా ధ్వనింపజేయ్యడం తిరుపతివేంకట కవుల నాటకీయ పద్యనిర్మాణ ప్రతిభ. తిరుమల కొండ చూసి అన్నమయ్య ఎంతటి ఆనందంతో "అదిగో అల్లదిగో శ్రీహరివాసము" అన్నాడో అదే ఆనందం మనకిక్కడ అర్జునుడిలో ధ్వనిస్తుంది. ద్వారకానగరం, నగరం ముందు పచ్చిక మేస్తున్న ఆలమందలు, కోట, అగడ్త - యిలా ఒకొటొకటీ చూస్తున్న కొద్దీ, శ్రీకృష్ణుని చూడ బోతున్నాననే ఆనందం అతనిలో పెరుగుతూ పోయింది. చివరికి కృష్ణుని మేడ కనిపించగానే ఆనందం పట్టలేక మళ్ళీ "యదుసింహుండు వసించు మేడ యదిగో!" అని పెద్దపెట్టున అన్నాడు. ఉప్పొంగిన ఆ ఆనందోత్సాహాన్ని, ధారగా సాగిన చివరి పాదం చక్కగా స్ఫురింపజేస్తోంది. నేను చూసిన పుస్తకంలో "నాలాన" అని ఉంది కాని, అది "ఆలాన" అయ్యుండాలి. "ఆలాన" అంటే ఏనుగులను కట్టే స్తంభం. "అదిగో" అన్న తర్వాత నాకు తెలిసి ద్రుతం రాదు. దంతావళం అంటే ఏనుగు. ఆలానములకు కట్టబడిన ఏనుగులతో అలరారుతున్నదా మేడ. మందురము అంటే గుఱ్ఱపుసాల. వర+మందుర+అంతర+తురంగ+ఉచ్చండమై. శ్రేష్ఠమైన గుఱ్ఱపుసాలలో మాంచి ఉత్సాహంతో నురుగులుకక్కే గుఱ్ఱాలతో శోభిస్తోంది.
ఈ పద్యంలో మరొక విశేషం కూడా ఉంది. అర్జునుడు ముందు చూసింది ద్వారకా నగరాన్ని, అల్లంత దూరంలో. అంత దూరం నుండి కోట కాని, కోటలోని రాజ మార్గాలు కాని (రథ్యలు), అందులోని ప్రజలు కాని కనిపిస్తారా? కనిపించరు. అంటే అర్జునుడు తన రథమ్మీద ద్వారకకి వస్తూ చెప్పిన పద్యమన్న మాట. ముందు దూరంగా ద్వారకని చూసాడు. కాస్త దగ్గరకి వచ్చాక నగర శివార్లలోని ఆలమందలు కనిపించాయి. మరికొంత దగ్గరకి వచ్చాక కోట, కోట ముందరి అగడ్త కనిపించాయి. కోటలోకి ప్రవేశించాడు. అప్పుడు రాజమార్గాలు (రథాలు వెళ్ళే మార్గాలు కాబట్టి అవి రథ్యలు), వాటిలో తిరుగుతున్న యాదవులు కనిపించారు. ఇంకా ముందుకు వెళ్ళేసరికి శ్రీకృష్ణుని మేడ, మేడలోని ఏనుగులు, గుఱ్ఱాలు అగుపడ్డాయి. యీ ఒక్క పద్యం చదివేలోపు అంత దూరం ప్రయాణం చేసాడన్న మాట అర్జునుడు! అంటే శ్రీకృష్ణుడి కోసం అతను ఎంత వేగంగా పరుగులు తీసి వచ్చాడో మనం ఊహించవచ్చు. అదీ పద్యనిర్మాణంలో నేర్పు!
ఇంతకీ యీ పద్యం ప్రస్తావనిప్పుడు రావడానికి కారణం ఏవిఁటంటే, ఒక పది రోజుల కిందట మా చిన్నాన్నగారి అబ్బాయి పెళ్ళికి విశాఖపట్నం వెళ్ళాం. మర్నాడు పెళ్ళనగా ముందు రోజు సాయంత్రం మా చిన్నాన్నగారింట్లో అందరం కులాసాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. మా కుటుంబం, చిన్నాన్నలిద్దరూ వాళ్ళ కుటుంబాలు, మా చిన్నాన్నల పిల్లలూ, వాళ్ళ పిల్లలూ, మా అత్తయ్యా వాళ్ళ కుటుంబం, మా పిన్ని వాళ్ళ చెల్లెళ్ళు - ఇలా, అబ్బో! చాలామందే చేరాం. పెళ్ళంటే మాటలా మరి, బంధువులందరూ కలిసి హడావిడి చెయ్యొద్దూ! సరే మా అమ్మాయి, మా మేనకోడలూ సంగీతం నేర్చుకుంటున్నారు కాబట్టి, ఇద్దరినీ కలిసి వాళ్ళకొచ్చిన గీతాలు రెండు పాడమన్నాం. ఇద్దరూ ఎంచక్కా కూర్చొని సంగీత కచేరీ మొదలుపెట్టారు. లోపల గదిలో పడుకొని ఉన్న మా చిన్నాన్నగారి మామగారు పాటలు విని బయటకి వచ్చారు. ఆయనకి సుమారు ఎనభయ్యేళ్ళుంటాయనుకుంటా. కళ్ళు కనిపించవు. కాని గొంతు ఖంగుమంటుంది. పద్యాలు పాడితే అదురొహో! ఇకనేం. పిల్లల పాటలయ్యాక అతనినో పద్యం పాడమని అడిగాం.
"కన్నె ప్రాయమునందు భాస్కరుని కరుణ" అంటూ కృష్ణకర్ణ సంవాదంలో (ఇవికూడా పాండవోద్యోగవిజయాలలో పద్యాలే) కృష్ణుడి పద్యాన్ని అందుకున్నారు. ఆహా! ఏవిఁ గొంతూ! ఏవిఁ రాగం! ఏవిఁ స్థాయి! చెవుల తుప్పొదిలిపోయింది. ఒక పద్యంతో ఏం సంతృప్తి కలుగుతుంది, మాకైనా అతనికైనా. అదే వరసలో తక్కిన పద్యాలు కూడా అందుకున్నారు. "అంచితులైన బందుగుల", "వ్యజనంబున్ ధరియించు ధర్మజుడు" పద్యాలుకూడా పాడారు. అంత పెద్దాయనకి ఆ పద్యాలు ఎంత గుర్తో! చివరిసారి అతను స్టేజెక్కి నాటకం వేసింది 1968లోనట! మనసుకి ఉత్సాహమున్నా వయసు సహకరించాలి కదా. వరసగా మూడు పద్యాలు పాడేసరికి కాస్త అలసట అనిపించిందేమో, ఆగారు. నా వెనక కూర్చున్న మా బావ, నువ్వందుకో అని నన్ను పొడిచాడు. నాకు పద్యాలయితే వచ్చు కాని అతనిలా ఎక్కడ పాడగలను. సంగీతమూ రాదు. గొంతుకి అంత స్థాయీ లేదు! అయినా మనవాళ్ళేగా, ఆయనకీ కొంచెం విరామం ఇచ్చినట్టవుతుందని నేను తర్వాతి పద్యం, "ఏ సతి వహ్నిలోన జనియించెను" అందుకున్నాను. అదయ్యాక, ఇంకా... అన్నారు. కృష్ణకర్ణ సంవాద ఘట్టంలో అక్కడికి కృష్ణుడి పద్యాలైపోయాయి. తర్వాత కర్ణుడి పద్యాలు. మనదెప్పుడూ కృష్ణ పాత్రే. అంచేత అక్కణ్ణుంచి నేరుగా రాయబారంలోకి దూకి "చెల్లియొ చెల్లకో" ఎత్తుకున్నాను. అది వినేసరికి మా చిన్నాన్నగారికి ఊపొచ్చింది. "జెండాపై కపిరాజు" అని ఆయన అందుకున్నారు. ఇక పద్యాలు ఊపందుకున్నాయి. మా నాన్నగారు పడకసీన్లో తన అర్జునపాత్ర పద్యం "అదిగో ద్వారక" ఎత్తుకున్నారు. ఆ తర్వాత అర్జునుడిదే, "అరవిందాక్షుడు శేషశాయి". అప్పుడిక కృష్ణుడి పద్యం, అంటే నావంతు. "ఎక్కడనుండి రాక యిటకు", ఆ తర్వాత "బావా ఎప్పుడు వచ్చితీవు!" పాడాను. అప్పుడు మళ్ళీ పెద్దాయన (అదే మా చిన్నాన్నగారి మావగారు) తన గొంతు సవరించి దుర్యోధనుడి పద్యం "కౌరవపాండవుల్ పెనగు కాలము" అందుకున్నారు. పడకసీను పద్యాలన్నీ వరసబెట్టి పాడేసాం. ఆ తర్వాత రాయబారంలో యింకా రెండు పద్యాలుండిపోయాయని గుర్తుచేసారు మా చిన్నాన్నగారు. "అలుగుటయే ఎరుంగని" పెద్దాయన, "సంతోషంబున సంధిసేయుదురె" నేనూ పూర్తి చేసాం. అందరి మనసుల్లో ఒక గొప్ప ఆహ్లాదం పరచుకుంది. ఆ తర్వాత మా పిన్ని చెల్లెలికి శాస్త్రీయసంగీతం బాగా వచ్చని చెపితే, ఆవిడని కూర్చోబెట్టి కచేరీ చేయించేసాం. అలా ఆ సాయంత్రం సంగీతపద్య విభావరిగా మారింది! అందరికీ ఆనందాన్ని పంచింది. ఒక తీయని జ్ఞాపకంగా మిగిలింది. మా బంధువులందరినీ మరింత ఆత్మీయులని చేసింది!
పూర్తిగా చదవండి...
Friday, January 27, 2012
నిరుపహతి స్థలం...
నిరుపహతిస్థలం మృదుతరాసన మొళ్ళుణి సింపుదంబులం
నరపిద పుస్తకప్రతతి లేఖకవాచకసంగ్రహం నిరం
తర గృహనిశ్చితస్థితి విచారకసంగతి సత్కళత్ర సా
దరతయి నుళ్ళ సత్కవియు మీసువదాగదె కావ్యవార్ధియం
ఇదే భాషో గుర్తుపట్టారుగా, కన్నడం. మరి పద్యాన్ని కూడా గుర్తుపట్టారా? ఆఁ... అవునదే... పెద్దనగారి చాటువు. ఒకేసారి రెండు భాషల్లో సినిమా విడుదల చేసినట్టు పెద్దనగారు కూడా ఒకేసారి తెలుగు కన్నడ భాషల్లో యీ చాటువు చెప్పేరనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ పద్యం సూక్తిసుధార్ణవము అనే కన్నడ గ్రంథంలోది . ఈ గ్రంథం క్రీ.శ. 1240 ప్రాంతంలో కూర్చబడింది, అంటే సుమారు పెద్దనగారి కాలానికి మూడువందల సంవత్సరాల ముందరన్న మాట. ఇది ఒక సంకలన గ్రంథం. అంటే రకరకాల కావ్యాలనుండి ఏర్చికూర్చిన పద్యాల సంకలనం. అయితే యీ పద్యం ఏ కావ్యంలోనిదో స్పష్టంగా తెలియలేదు.
సరే మరి తెలుగుపద్యం బ్లాగులో తెలుగుపద్యం లేకపోతే ఎలా! చాలామందికి నోటికొచ్చే ఉంటుంది కాని తెలియనివాళ్ళ కోసం:
నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క
ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచ మొప్పు త
ప్పరయు రసజ్ఞు లూహ తెలియంగల లేఖకపాఠకోత్తముల్
దొరికినగాని యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!
ఈ తెలుగు పద్యాన్ని చెప్పినది పెద్దనగారో మరెవరో కచ్చితంగా తెలియదు. ఒకవేళ పెద్దనగారే అయితే మాత్రం, కన్నడపద్య స్ఫూర్తితోనే యీ పద్యాన్ని చెప్పుంటారనడంలో సందేహం లేదు. అయితే మాత్రమేం! కిట్టనివాళ్ళు వట్టి అనువాదం అని కొట్టిపారేస్తూ ఉంటారు గాని, మూలాన్ని సానబెట్టి మెరుగులు దిద్ది రాతినుండి రత్నాన్ని తయారుచెయ్యడం మన తెలుగు కవులకి వెన్నతో బెట్టిన విద్య. తెలుగుభాషపై నాకున్న పక్షపాతం అని మీరన్నా ఫరవాలేదు, నాకు మాత్రం కన్నడపద్యం కన్నా మన తెలుగుపద్యమే ఎంతో అందంగా ఉందనిపించింది. ఎందుకంటారా? చూడండి.
కన్నడంలో "మృదుతరాసనం" అని చెప్పి ఊరుకున్నారు కాని తెలుగులో "ఊయల మంచ"మని ఎంత చక్కగా బొమ్మకట్టి చూపించారు! ఒక రసిక కవికి అంతకన్నా మృదుతరాసనం ఏముంటుంది! ఆ రసికతే పద్యమంతా కనిపిస్తుంది. కన్నడ పద్యం, ఒక బుద్ధిమంతుడైన పండితకవి తనకి కావలసిన సామగ్రి చిట్టా ఏకరువు పెట్టినట్టుంది. మరి తెలుగు పద్యమో! సరస రమణీయంగా, అచ్చంగా ఓ కవి చెప్పినట్టుగానే ఉంది. కన్నడ కవి కోరుకున్నది సత్కళత్ర సాదరత, అంటే మంచి భార్య తనని సాదరంగా చూసుకోవడం. దానికి దీటుగా తెలుగు కవి కోరుకున్నదేమిటి? "రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పురవిడెము". కన్నడ పద్యంలో "ఇంపు దంబులం" ఇక్కడ "కప్పురవిడెము" అయ్యింది. అవతల భార్య తన రాకకై వేచి చూస్తోంది. ఇతను రాకపోయేటప్పటికి తన చెలికత్తె ఒకర్తికి తాంబూలాన్ని యిచ్చి దూతగా పంపింది. కప్పురవిడెము పంపడంలోని ఆంతర్యం రసజ్ఞులు గ్రహించగలరు. కన్నడ పద్యంలో ఉటంకించిన "నిరంతర గృహనిశ్చిత స్థితి", "సత్కళత్ర సాదరత" అనే అంశాలిందులో ఎంత చక్కగా ధ్వనిస్తున్నాయో గమనించండి. ధ్వని కలిగినదే మంచి కవిత్వం. ఇక, కన్నడ పద్యంలోని "ఒళ్ళు ఉణిసి" అంటే మంచి భోజనం, తెలుగులో "ఆత్మకింపయిన భోజన" మయింది. కన్నడంలోని "విచారక సంగతి", తెలుగులో "ఒప్పు తప్పరయు రసజ్ఞు" లయ్యారు. కేవలం విచారణ, విశ్లేషణ ఉంటే సరిపోదు. ఒప్పు తప్పులు తెలిస్తే చాలదు. వారు రసజ్ఞలై ఉండాలి. లేదంటే ప్రతి దానికీ ఏదో ఒక నెరసు చూపిస్తూ కవిత్వాన్ని బొత్తిగా ఆస్వాదించలేని వారవుతారు. భాస్కరశతకంలో "చదువది ఎంత కల్గిన రసజ్ఞత యించుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు" అని చెప్పిన విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. కవిత్వాన్ని ఆస్వాదించడానికి రసజ్ఞత చాలా ముఖ్యం. అలాగే, కన్నడంలో "లేఖకవాచక సంగ్రహం", తెలుగులో "ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తము" లయ్యారు. వట్టి లేఖక వాచక సంగ్రహ ముంటే చాలదు. వాళ్ళు ఎలాంటి వారై ఉండాలో మన తెలుగు కవి చెపుతున్నాడు. వాళ్ళు ఊహ తెలియగల వారై ఉండాలి. ఇది చాలా విశేషమైన అంశం. ఆ రోజులలో కవికి లేఖకులుండేవారు. కవి చెపుతూ ఉంటే పక్కనే కూర్చొని ఒక వ్రాయసకాడు దానిని తాళపత్రాలమీద లిఖించేవాడు. ఆధునిక కాలంలో కూడా విశ్వనాథ వారికి యిలానే లేఖకులుండేవారు. కవితాధార అవిశ్రాంతంగా సాగుతూ ఉంటే దాన్ని అంత వేగంగానూ లేఖకుడు పట్టుకొని వ్రాయాలంటే మరి ఆ లేఖకునికి కవి చెపుతున్న విషయమ్మీద చక్కటి అవగాహన ఉండాలి. పైగా మధ్యలో ఏదైనా ఒకచోట ఆ వేగాన్ని అందుకోలేకపోతే, అక్కడ కవి చెప్పినది ఏమిటో ఊహించగలిగే ప్రజ్ఞ ఉండాలి. లేదంటే కుంటినడకే అవుతుంది. కవిత్వం ధ్వని ప్రధానం కాబట్టి, దాన్ని చదివే పాఠకులకి కూడా అందులోని ధ్వని గ్రహించ గలిగే ఊహశక్తి ఉండాలి. లేకపోతే ఎంత గొప్ప కవిత్వం రాసీ ఏమిటి ప్రయోజనం? అందుకే ఇవన్నీ దొరికితే తప్ప లేకపోతే కవిత్వం వస్తుందయ్యా అంటున్నాడీ కవి. దాన్ని సొగసైన తెలుగు నుడికారంలో చెపుతున్నాడు "ఊరక కృతుల్ రచియింపు మటన్న శక్యమే!" అని.
పాతకాలపు కవిత్వాన్ని నిరసించేందుకు కొంతమంది యీ పద్యాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు.
"ఏకాంతము, చెలికత్తె తెచ్చి యిచ్చిన కర్పూర తాంబూలమూ, ఉయ్యాల మంచమూ, మంచి భోజనమూ - కవిత్వం రాయాలంటే యివన్నీ కావలట! ఇదేమి కవిత్వం, వట్టి భోగపు కవిత్వం." అని పెదవి విరుస్తూ ఉంటారు. నిజమే, ఆ కాలంలో వచ్చినది చాలా వరకూ కడుపునిండిన కవిత్వమే. మరి ఆ పద్యంలో తర్వాత చెప్పినవాటి సంగతేమిటి? తప్పొప్పులు తెలిసిన రసజ్ఞులు, ఊహ తెలిసిన లేఖక పాఠకులు. ఏ కాలాంలోనైనా మంచి కవిత్వం రావడానికి అవసరమైనవే కదా యివి. దీని గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? మనకి నచ్చిన కవి, మనకి నచ్చిన అంశాన్ని గూర్చి ఏది రాసినా దాన్ని ఆకాశానికి ఎత్తెయ్యడమూ, కానప్పుడు అథః పాతాళానికి తొక్కెయ్యడమూ రసజ్ఞత అనిపించుకుంటుందా? అలా చేసినప్పుడు మంచి కవిత్వం వస్తుందా? ఇప్పటి విమర్శకులు వేసుకోవాల్సిన ప్రశ్నలివి. ఈ కాలంలో "లేఖకులు" లేరు. కాని వారి స్థానంలో యిప్పుడు ప్రచురణకర్తలున్నారు. సంపాదకులున్నారు. వాళ్ళకుండాల్సిన లక్షణం "ఊహ తెలియడం". ఇక పాఠకుల సంగతి సరేసరి! ఇక్కడొక అనుమానం రావచ్చు. కవిత్వం అనేది కవి వ్యక్తిగత విషయం. పాఠకులూ, విమర్శకులూ, సంపాదకులూ బయటవారు. కవి తనకోసం రాసుకుంటాడు కాని వీళ్ళకోసం కాదు కదా. అందువల్ల, ఒక కవి మంచి కవిత్వాన్ని రాయగలగడానికి వీరంతా ఎందుకూ? - అని. నిజమే, ఇక్కడ చెప్పినదాన్ని ఒక కవికి వ్యక్తిగతంగా అన్వయించడం అంత సమంజసం కాదు. సామాజికంగా అన్వయించుకోవాలి. అంటే, ఒక భాషలో, సమాజం నుండి మంచి కవిత్వం రావాలీ అంటే, ఆ భాషాసమాజంలో రసజ్ఞులైన విమర్శకులు, ఊహ తెలిసిన పాఠకులు సంపాదకులు తప్పకుండా ఉండాలి. మంచి కవిత్వానికి గుర్తింపు, ప్రచారం లభించినప్పుడే అది సమాజంలో నిలుస్తుంది. ఆ బాధ్యత, పైన చెప్పిన ముగ్గురిదీ. ఈ పద్యం మనకా విషయాన్ని గుర్తు చేస్తుంది.
ఇదీ మన తెలుగుపద్యం గొప్పదనం. మరో సంగతి మీరు గమనించారో లేదో. కన్నడ పద్యానికి యతి నియమం లేదు! ప్రాస ఒక్కటే ఉంది. తెలుగుపద్యానికి రెండూ ఉన్నాయి. అయినా తెలుగుపద్యం ఇంత కవితాత్మకంగా ఉందంటే దాని అర్థమేమిటి? వ్రాసే సత్తా ఉండాలే కాని, మంచి కవిత్వం పుట్టించేందుకు యతిప్రాసల నియమాలు బంధకం కావనే కదా. నిజానికీ యతిప్రాసలు, అభివ్యక్తిలో పద్య నిర్మాణంలో కొత్తదనం కోసం కవిని ఆలోచింపజేసే ఉపకరణాలని నా అభిప్రాయం. ఆ సాధన చేసే ఓర్పు నేర్పు కవికి అవసరం. మంచి కవిత్వం అప్పుడే పండుతుంది.
పూర్తిగా చదవండి...
Saturday, January 14, 2012
సంక్రాంతి శుభాకాంక్షలు!
సంక్రాంతి శుభాకాంక్షలు!
ఈసారి పండక్కి ఊరు వెళ్ళలేదు. అంచేత తలపోతలు కలబోతలూ ఏమీ లేవు. చుట్టాలుపక్కాలతో కలవకపోతే పండక్కి, అందులోనూ సంక్రాంతికి కళేముంటుంది? అయినా యథారీతి పొద్దున్నే లేచి యథాశక్తి భోగి మంట వేశాం. తమిళవాళ్ళు కూడా భోగి మంట వేస్తారు. డప్పులాంటి వాద్యాన్ని వాయించి మరీ! అయితే రెండు మూడిళ్ళవాళ్ళు తప్పించి పెద్దగా ఎవ్వరూ వెయ్యలేదు. నాలుగురోజులుగా తగ్గిందనుకున్న చలి మాత్రం మళ్ళీ బాగా తెలిసింది. తెలవారక ముందే లేచావేఁమో, యింకా కరగని పొగమంచు మరింత వణికించింది! ఇక్కడది అరుదుగా మాత్రమే దొరికే అనుభవం.
మనసిభవుండు భోగి చలిమంటల చుట్టును పుష్పచాప శిం
జిని రవళించుచుం దిరిగె సిద్ధమనోరథుడై, వియోగినీ
జనములు దీర్ఘ యామినుల జార్చిన లోచన బాష్పవారి వీ
చెను బవనమ్మనంగ మెఱసెం దృణలగ్న తుషారబిందువుల్
ఈ కవిగారు మంచి సరసులే! భోగిమంటల చిటపటలు ఇతనికి మన్మథుని వింటి చిరుమువ్వల సవ్వడిలా ఉందట. తన మనోరథం సిద్ధించిందన్న ఆనందంతో ఆ చెఱుకువిలుకాడు భోగిమంట చుట్టూ తిరుగుతున్నాడట. అతనలా సంబరం చేసుకుంటూ ఉంటే పాపం వియోగినులు మాత్రం తమ ప్రియుల నెడబాసి ఎంతో బాధపడుతున్నారు. కలిసి ఉన్న ప్రేయసీప్రియులను వేసవి పగళ్ళు ఎంతగా బాధిస్తాయో ("నలదమయంతులిద్దరు మనః ప్రభవానల బాధ్యమానలై" పద్యం గుర్తుందా, ఇంతకుముందు ముచ్చటించుకున్నాం!), వియోగంలో ఉన్న (అంటే దూరదూరంగా ఉన్న) ప్రేయసి ప్రియులను శీతకాలపు రాత్రులు అంతగా బాధిస్తాయి. వాళ్ళకు పగళ్ళు దీర్ఘాలయితే, వీళ్ళకు రాత్రులు దీర్ఘాలు. ఇది చలికాలం కదా. అంచేత వియోగినులకు దీర్ఘ యామినులు (రాత్రులు) ఎంతో కష్టాన్ని కలిగిస్తున్నాయి. వారి కన్నీటిని రేయి గాలి మోసుకొచ్చిందేమో అన్నట్టుగా ఉదయాన గడ్డిపోచలపై మంచు బిందువులు మెరుస్తున్నాయట!
భోగీ మంటతో పాటు మరో తప్పనిసరి అంశం ముగ్గులు. రంగు రంగుల ముగ్గులు. రంగవల్లికలు. కొందరు ధనుర్మాసం నెల్లాళ్ళూ పెడతారు కాని మేం మాత్రం పండగ మూడు రోజులే.
ఈ కవిగారి దగ్గర ఎంతందమైన రంగులున్నాయో చూడండి!
అరుణసరోరుహాక్షి సమదారుణ దృష్టులు, పుండరీక సుం
దరధవళాయతాక్షి తెలినవ్వుల చూపులు, మేచకోత్పల
స్ఫుర దురునేత్ర నీలి జిగి చూడ్కులు గూడి త్రివర్ణ శోభలం
గురియుచునున్న మ్రుగ్గులవిగో! భవనాంగణ శుభ్రసీమలన్
మూడు రంగులతో ముచ్చట గొలిపే ముగ్గులని మనకి చూపిస్తున్నారిక్కడ. కెందామరల్లాంటి కళ్ళున్న అమ్మాయిల చూపుల్లో ఎఱ్ఱదనం, తెలిదమ్మి పూవుల్లాంటి కళ్ళున్న అమ్మాయిల నవ్వుల చూపుల్లోని తెల్లదనం, నల్లకలువల కళ్ళ కలికి నెలతల చల్లని వెలుగు చూపుల్లోని శ్యామలత్వం - ఈ మూడు రంగులూ కలిసి మెరిసే రంగవల్లులు ఇళ్ళ ముంగిళ్ళలో వెలుగుతున్నాయట.
సంక్రాంతి పండగంటే అత్తవారింట్లో కొత్తల్లుళ్ళ సంబరాలు మామూలే. అయితే ఆ కొత్తదంపతుల వేడుక చూసి సర్వసాక్షి ఏమనుకున్నాడు? అది యీ కవిగారు చెపుతున్నారు. రవి గాననిచో కవి గాంచునే కదా!
భూతలనాకముల్ శ్వశురపూజ్యగృహమ్ములు, నవ్యనవ్య జా
మాతృవధూ వచోవలయ మంజులముల్ గనులార గాంచి, ఆ
శాతురుడైన సూర్యుడు సహస్రకరమ్ములతోడ నుత్తరా
శాతరుణోపగూహనము సల్పగ సాగెను తేజితేరుపై
మామగారిళ్ళల్లో కొత్త దంపతుల ముచ్చట్లను చూసిన సూర్యునికి తన ప్రేయసిని కలుసుకోవాలనే కోరిక తొందరపెట్టిందట. అందుకే తన వేయిచేతులు సాచి ఉత్తరదిక్కనే సతిని కౌగిలించుకోవాలని ఆ వైపు తన సప్తాశ్వరథాన్ని దౌడు తీయించాడట. అసలే మన్మథ ధ్వజమైన మకర రాశిలోకి అడుగుపెడుతున్నాడాయె. సూర్యునికి ఆమాత్రం కోరిక కలగడంలో ఆశ్చర్యమేముంది!
ఇవీ ఈ యేటి సంక్రాంతి పద్యాలు. ఇంతకీ యీ పద్యాలు వ్రాసిన కవి శ్రీ శనగన నరసింహస్వామి. అతని "హేమంత సంక్రాంతి" అనే ఖండికలోనివి. బాగున్నాయి కదూ!
పూర్తిగా చదవండి...