తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, December 5, 2010

వేటూరి పాట - ఒక "మాత్రా"కావ్యం

మొన్న కార్తీక సోమవారంనాడు పుణ్యంపురుషార్థం కలిసొస్తాయని నాకు బాగా ఇష్టమైన (ఆమాటకొస్తే ఎవరికిష్టం కాదు!) భక్త కన్నప్ప సినిమాలో కిరాతార్జునీయం పాటని నెట్లో వెతికి మరీ విన్నాను. మా చిన్నప్పుడీ పాట రేడియోలో ఉదయాన్నే భక్తిరంజని కార్యక్రమంలో చాలాసార్లు వచ్చేది, ముఖ్యంగా సోమవారాల నాడు. ఒకో దేవుడికి ఒకో రోజు ప్రత్యేకం కదా. అలా ఆ రోజు బట్టి ఆ దేవుడి పాటలు వేసేవారు. సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు ఇలా. ఇదొక సినిమా పాటని, భక్త కన్నప్ప సినిమాలోదని తెలీని వయసునుండే ఈ పాటని వింటూ వచ్చాను. మనసులో అలా పట్టేసింది. ఇప్పుడు రేడియో భక్తిరంజని లేకపోయినా ఇంటర్నెట్టూ గూగులూ ఉన్నాయి కదా! కాబట్టి వెతికిపట్టుకొని వినగలిగాను. అప్పటి రేడియో కన్నా ఇప్పటి ఇంటర్నెట్ మెరుగైన ప్రసారసాధనం. అయితే దాన్ని వాడుకొనే బాధ్యత మాత్రం మనదే. ఉదయాన్నే రేడియో వేస్తే చాలు, ఎంపికచేసిన మంచి పాటలు మనకోసం వినిపించేవి. ఇప్పుడు వెతుక్కొని వేసుకోవలసిన బాధ్యత మనమీద పడింది.

ఈ పాటలో వేటూరి తన విశ్వరూపం చూపించారు. శివుడు కైలాసంలో తాండవమాడుతూంటే ఒక్కసారి ఆ కైలాసగిరి కంపించింది. అకాలప్రళయ జ్వాల కనిపించింది. అప్పుడేమయ్యిందో చూడండి:

జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె

పార్వతీదేవి నివ్వెరపోయింది, శివుని మొహమంతా నవ్వు పరచుకుంది - అని ఎంత సొగసుగా చెప్పాడు వేటూరి.

ఈ పాట నిజంగా ఒక కాప్స్యూల్ కావ్యమే. అయినా ఇది పాట కాని పద్యం కాదు కదా, తెలుగుపద్యంలో దీని గురించి ఎందుకు అని చొప్పదంటు ప్రశ్న వెయ్యొద్దు. నచ్చిన ఈ పాట గురించి నాకిక్కడ చెప్పాలనిపించింది చెపుతున్నానంతే. :-)

ఇంతకుముందు ఎప్పుడో నా బ్లాగులోనే చెప్పినట్టు, ఛందస్సన్నది పద్యాలకి పరిమితం కాదు. పాటల్లో కూడా ఛందస్సుంటుంది. అందులోనూ ఇది శివుని గురించిన పాటాయె. తనికెళ్ళ భరణిగారు అన్నట్టు, శివుడే ఒక యతి. గణాలు అతని చుట్టూ ఎప్పుడూ ఉండనే ఉంటాయి. పైగా అతను "లయ"కారుడు. జాగ్రత్తగా చూస్తే పై రెండు పాదాలూ ఇంచుమించు సీస పద్యపాదాలే, యతి మైత్రితో సహా! ఈ పాటలో చాలా చోట్ల ఈ సీసలక్షణాలే కనిపిస్తాయి. వేటూరికి ఛందోధర్మాలు ఎంతగా తెలుసో యీ పాట నిరూపిస్తుంది. ఎలాంటి గణాలు వేస్తే పాటకి ఎలాంటి నడక వస్తుంది, భావానికి తగిన నడక ఎలా రప్పించాలి అన్న విషయాల మీద ఎంతో శ్రద్ధ, పరిజ్ఞానం ఉంటే కాని ఇలా రాయలేరు. తాండవానికి తగిన తాళం "తకిటతక తకతకిట"తో మొదలుపెట్టారు పాటని. ఇది అయిదు మాత్రల గణాలు, 3-2/2-3 విరుపుతో సాగుతుంది. దీన్ని సంగీత భాషలో ఖండ చాపు అంటారనుకుంటా (సంగీతం తెలుసున్నవాళ్ళెవరైనా చెప్పాలి).

ఆ తర్వాత అర్జునుడు తపోదీక్షలో చూపిన ఉత్సాహాన్ని ధ్వనిస్తూ, "అతడే అతడే అర్జునుడూ" అని మొదలుపెట్టి, "అనితర సాధ్యము పాశుపతాస్త్రము" అంటూ పాటని పరుగులు తీయించారు. "తకధిం తకధిం", "తకధిమి తకధిమి" అనే తాళాలు (ఛందస్సులో చెప్పుకోవాలంటే, స, నల గణాలు) పరుగులాంటి నడకనిస్తాయి, పాటకైనా పద్యానికైనా. గజేంద్రమోక్షంలో "సిరికిం జెప్పడు" అని సగణంతో మొదలయ్యే పద్యం గుర్తు తెచ్చుకోండి. నాలుగు మాత్రల పదాలతో వచ్చే ఈ నడకని చతురస్ర గతి అంటారు. "UII, IUI, UU" కూడా నాలుగు మాత్రల గణాలే. కాని ఒకో దానికి ఒకో ప్రత్యేకత ఉంది. వేటూరి ఈ పాటలో వాడిన IIU, IIII మాత్రమే వీటిల్లో పరుగులాంటి నడకనిస్తాయి.

అలా పరిగెత్తిన పాట ఒక్కసారి మళ్ళీ శివుని రూపంలోని మార్పుని వర్ణించడం కోసం సీసపు తూగుని సంతరించుకుంటుంది. శివుని రూపాన్ని వర్ణించే ఆ పాదాలన్నీ ఇంచుమించుగా సీసపద్య పాదాల మొదటి భాగాలే! అయితే ఇందులో మరో గమ్మత్తుంది. సీసపద్యంలో ఇంద్రగాణాలు ఏవైనా రావచ్చు అంటే "నల, నగ, సల, భ, ర, త"లు. కాని ఇందులో నల, భ గణాలు నాలుగు మాత్రలు. మిగతావి అయిదు మాత్రలు. ఇక్కడ వచ్చేవన్నీ ఈ అయిదు మాత్రల గణాలే. అంటే మళ్ళీ ఖండ గతి. అయితే దీని నడక తకిట-తక అన్న విఱుపు లేకుండా తకధింత/తద్ధింత అనే వస్తుంది. నడకలోనే కాదు, భాషలో కూడా ఎంత తేడా చూపించారో వేటూరి. భావానికి అనుగుణమైన భాష. తాండవం దగ్గర సంస్కృత పదాల సమాసాల పొహళింపు చూపిస్తే, ఇక్కడ చక్కని జాను తెనుగు కనిపిస్తుంది. అంత శివుడూ ఎఱుకలవానిగా మారుతున్న సందర్భం కదా. ఎంతో నిసర్గ సుందరంగా ఉంటుందీ వర్ణన.

నెలవంక తలపాగ నెమలియీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి పారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా (ఎఱుక అంటే జ్ఞానం. సర్వజ్ఞుడైన శివుడు ఎఱుకలవానిగా మారాడు!)
తల్లిపార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు

పై వర్ణన శ్రీనాథుని యీ సీసపద్యానికి ఏమాత్రం తీసిపోదు. (ఇంకా పైనుంటుందన్నా తప్పులేదు!)

వికటపాటల జటామకుటికా భారంబు
కఱకైన జుంజుఱు నెఱులు గాగ
జారు సుధాధామశకలావతంసంబు
పెడకొప్పుపైనుండు పీకెగాగ
ఘనలలాటంబున గనుపట్టు కనువిచ్చు
గైరికద్రవ తిలకంబు గాగ
భుజమధ్యమున గ్రాలు భుజగహారంబులు
గురిజపూసల గుబ్బసరులు గాగ

శంకరుండు కిరాతవేషంబు దాల్చి
యగజ చెంచెతయై తోడ నరుగుదేర
బాణి నోంకార దివ్యచాపము ధరించి
వచ్చె వివ్వచు వరతపోవనము కడకు

ఆ తర్వాత మూకాసురుడు వరాహరూపము ధరించి రావడం, అలా చిచ్చర పిడుగై వచ్చిన దాన్ని రెచ్చిన కోపంతో అర్జునుడు కొట్టడం, అది విలవిలలాడుతూ అసువులు వీడడం. ఆ పైన కిరాతార్జునుల వాదులాట, వాళ్ళ యుద్ధం, చివరికి తాడియెత్తు గాండీవంతో ముత్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు చండకోపంతో అతిపవిత్రమైన శివుని తలని మోదేసరికి, ఆ దెబ్బకి శివుడు ప్రత్యక్షమవ్వడం. ఒకో సందర్భానికి ఒకో నడక, దానికి తగ్గ యతిప్రాసలతో - ఎన్నెన్ని హొయలు పోతుందో! మొత్తం జరుగుతున్న కథంతా మన కళ్ళకి కట్టేస్తుంది, మనసుకి పట్టేస్తుంది!

వేటూరీ నీకు మరోసారి జోహార్! పాట పూర్తి సాహిత్యం ఇదిగో. చదువుకొని, వింటూ చదువుకొని, చూస్తూ వింటూ చదువుకొని ఆనందించండి.

తకిటతక తకతకిట చటిత పదయుగళా
వికట గంగాఝరిత మకుటతట నిగళా (వికటమైన గంగ దూకిన జట అనే సంకెల గలవాడు అని)

హరిహరాంచిత కళా కలిత నిలగళా (ఇది సరిగా అర్థం కాలేదు!)
సాంద్రచ్ఛటా పటల నిటల చంద్రకళా (దట్టని కాంతుల సమూహంతో వెలిగే నిటలమున్న చంద్రకళాధరుడు)

జయజయ మహాదేవ శివశంకరా
హరహర మహాదేవ అభయంకరా

అని దేవతలు శివుని కొనియాడా
పరవశమ్మున శివుడు తాండవమ్మాడగా

కంపించెనింతలో కైలాసమావేళ
కనిపించెనంత అకాల ప్రళయజ్వాల

జగములేలినవాని సగము నివ్వెరబోయె
సగము మిగిలినవాని మొగము నగవైపోయె

ఓం నమశ్శివాయ!
ఓం నమశ్శివాయ!

అతడే అతడే అర్జునుడు
పాండవ వీర యశోధనుడు

అనితరసాధ్యము పాశుపతాస్త్రము
కోరి యింద్రగిరి చేరి శివునికై
అహోరాత్రములు చేసెను తపస్సు
ఇది సృష్టించెను దివ్య మహస్సు

నెలవంక తలపాగ నెమలి యీకగ మారె,
తలపైని గంగమ్మ తలపులోనికి బారె,
నిప్పులుమిసే కన్ను నిదరోయి బొట్టాయె,
బూదిపూతకు మారు పులితోలు వలువాయె
ఎఱుక గల్గిన శివుడు ఎఱుకగా మాఱగా
తల్లి పార్వతి మారె తాను ఎఱుకతగా
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలమ్ము
కైలాసమును వీడి కదలివచ్చెను శివుడు

శివుని ఆనతిని శిరమున దాల్చి
మూకాసురుడను రాక్షసుడూ
వరాహరూపము ధరించి వచ్చెను
ధరాతలమ్మే అదిరిపోవగా

చిచ్చరపిడుగై
వచ్చిన పందిని రెచ్చిన కోపముతో అర్జునుడు
మట్టుపెట్టగా
పట్టె బాణమూ ధనువొక చేతను అందుకొనీ
చూసిన కంటను చూడకనే గురి
చూసినంతనే, వేసినంతనే

తలలు రెండుగా విలవిలలాడుచు
తనువు కొండగా గిరగిర తిరుగుచు
అటునిటు తగిలిన రెండు బాణముల
అసువులు వీడెను వరాహమూ

కొట్టితి నేనని అర్జునుడూ, పడ
గొట్టితి నేనని శివుడూ,
పట్టినపట్టును వదలకనే తొడ
గొట్టిన వీరముతో నపుడు

వేట నాది, వేటు నాది
వేటాడే చోటు నాది,
ఏటి తగవు పొమ్మని విలు
మీటి పలికె శివుడూ

చేవ నాది, చేత నాది
చేటెరుగని ఈటె నాది
చేవుంటే రమ్మని కను
సైగ చేసె అర్జునుడు

గాండీవ పాండిత్య కళలుగా బాణాలు
కురిపించె అర్జునుడు కానీ, అపుడతడు
వేయిచేతుల కార్తవీర్యార్జునుడూ

ఓంకార ఘనధనుష్టంకారములతోడ
శరపరంపర కురిసె హరుడూ, అయినా
నరునికాతడు మనోహరుడూ
(ఇక్కడ "ఘన" అంటే గొప్పది అనే అర్థమే కాకుండా మేఘం అన్న అర్థం కూడా వస్తుంది. మేఘంలాంటి ధనుస్సు ఉఱుములా ధ్వనిస్తూ బాణ వర్షాన్ని కురిపించింది అని అర్థం.)

చిత్రమేమొ గురిపెట్టిన బాణమ్ములు మాయమాయె
విధి విలాసమేమో పెట్టిన గుఱి వట్టిదాయె

అస్త్రములే విఫలమాయె, శస్త్రములే వికలమాయె
సవ్యసాచి కుడియెడమై సంధించుట మఱచిపోయె!

జగతికి సుగతిని సాధించిన తల
దిగంతాల కవతల వెలిగే తల (అలోకంబౌ పెంజీకటికవ్వల నేకాకృతి వెల్గు!)
గంగకు నెలవై, కళ కాదరువై (కళకి అంటే చంద్రకళకి ఆదరువై అంటే ఆధారమైనదై)
హరిబ్రహ్మలకు తరగని పరువై
అతి పవిత్రమై, అఘ లవిత్రమై (అఘము అంటే పాపం. లవిత్రము అంటే కొడవలి. కొడవలి గడ్డిని కోసినట్టు పాపాన్ని కోసేస్తుందని అర్థం!)
శ్రీకరమై శుభమైన శివుని తల
అదరగా,
సృష్టి చెదరగా,

తాడి యెత్తు గాండీవముతో ము
త్తాడి యెత్తుగా ఎదిగి అర్జునుడు
చండకోపమున కొట్టినంతనే

తల్లిదండ్రుల చలువ తనువైన(?) దేవుడు
కోరిన వరాలిచ్చు కొండంత దేవుడు
ఎదుట నిల్చెను శివుడు, ఎదలోని దేవుడు
పదములంటెను నరుడు భక్తితో అపుడు

కర చరణ కృతంవా కర్మవాక్కాయజంవా
శ్రవణ నయనజంవా మానసంవాపరాధం
విహిత మవిహితంవా సర్వమేతత్ క్షమస్వా
శివశివ కరుణాబ్ధే, శ్రీ మహాదేవ శంభో!
నమస్తే, నమస్తే, నమస్తే నమః!


పూర్తిగా చదవండి...

Friday, November 26, 2010

తెలుగుపద్యము ఋణమిది తీర్చగలనె!

మీరెప్పుడైనా అమెరికాలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో కూర్చొని, చక్కని మినపరొట్టెని (దీన్నే దిబ్బరొట్టె, పొంగరం అని కూడా అంటారు) ఆవకాయతో నంజుకొని (లోలోపలే లోట్టలేసుకుంటూ) తిన్నారా? ఆ తర్వాత విమానం బయలుదేరే వరకూ ఆ ఆవకాయ డొక్కని బుగ్గన పెట్టుకు చప్పరిస్తూ కూర్చున్నారా? నన్ను నమ్మండి, అదొక అనిర్వచనీయమైన అనుభూతి! కొంతమంది అనుమానంగా, మరికొంత మంది ఆశ్చర్యంగా, ఇంకొంతమంది అసూయగా (విమానం కోసమే చూస్తున్న పక్కనున్న తెలుగువాళ్ళు) చూసే చూపులు మీకు తగులుతూ ఉంటే అలా అమెరికన్ ఎయిర్ పోర్టులో కూర్చొని అచ్చతెలుగు వంటకాన్ని ఆస్వాదించడం ఎంత కిక్కిస్తుందనుకున్నారు! అల్లాంటి అదృష్టం మొన్నమొన్ననే నాకు కలిగింది. అదంతా తెలుగుపద్యం మహిమ!

ఈ బ్లాగు నేను మొదలుపెట్టింది స్వానుభవాలు వ్రాసేందుకు కాదు. అయితే ఈసారి నా అమెరికా ప్రయాణం మిగిల్చిన అనుభవాలు తెలుగుపద్యంతో ముడిపడ్డాయి కాబట్టి వీటినిక్కడ వ్రాస్తున్నాను. ముఖ్యంగా, నన్ను అమెరికాలో ఆప్యాయంగా ఆదరించిన వాళ్ళందరికీ బ్లాగు ముఖంగానే కృతజ్ఞతలు చెప్పుకోడం సమంజసమనిపించింది.

కన్నెగంటి చంద్రగారింటిలో, ఇండియాలో ఉండీ ఎన్నాళ్ళగానో తినలేకపోయిన జున్నుని రుచిచూడ్డంతో మొదలయ్యింది నా అదృష్టం! వారి మామగారి గొంతులో హాయిగా వినిపించిన పద్యాలు ఆ జున్నంత తీయగానూ ఉన్నాయి. అంత పెద్ద వయసులో చిన్నప్పుడెప్పుడో చదువుకున్న పద్యాలు పొల్లుపోకుండా అలా అనర్గళంగా వారి గళంలోంచి జాలువారడం ఎంత గొప్ప విషయం! అదీ తెలుగు పద్యం మహిమ! అలా ఆ జున్ను తినడంతో మొదలైన నా అదృష్టం మరెందరో సహృదయులైన సాహితీమిత్రుల కలయికతో, పరిచయాలతో పెరిగి పెరిగి, గన్నవరపు మూర్తిగారి సతీమణి ఆప్యాయంగా చేసిచ్చిన ఆ మినపరొట్టెని ఎయిర్ పోర్టులో కూర్చుని తినడంతో సంపూర్ణమయ్యింది!
అంతకుముందు అసలు ముఖపరిచయం కూడా లేనివాళ్ళు, పట్టుబట్టి నన్ను వాళ్ళిళ్ళకి భోజనాలకి తీసుకువెళుతూండడం చూసి, నాతో అమెరికా వచ్చిన నా ఆఫీసుమిత్రులందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వేళ్ళాడేసారు! కన్నెగంటి చంద్రగారూ, గన్నవరపు మూర్తిగారు, లంక చంద్రశేఖర్ గారు, మద్దుకూరి చంద్రహాస్ గారు ఇచ్చిన ఆతిథ్యం మరచిపోలేనిది. కాజా సురేష్ గారు, అనంత్ గారు, నరసింహ రెడ్డిగారు, జువ్వాడి రమణగారు మొదలైన సాహితీ మిత్రుల పరిచయం మరపురానిది. కార్తీకపౌర్ణమి సాయంత్రం చంద్రశేఖర్ గారింట్లో, ఆకాశదీపానికి నమస్కరించి తీర్థప్రసాదాలు తీసుకొని వారి ఆశీసులు పొందడం ఎంతో అదృష్టం. వారింటి వెనక పెరట్లో బల్లకుర్చీ మీద కూర్చొని పిల్లతెమ్మెరలు వీస్తూంటే పున్నమి వెన్నెల జల్లులో తడసిపోవడం ఒక మధురానుభూతి.

నెల్లాళ్ళుగా ఇక్కడుంటూ మాకు మాటమాత్రం చెప్పలేదేమని కోప్పడ్డవారున్నారు. నా తిరుగుప్రయాణం అనుకున్న రోజుకన్నా ముందుకు వచ్చేసినందుకు విచారించినవాళ్ళున్నారు. ఇంతమంది అభిమానాం వెనక ఏమిటి కారణం? అపరిచితుల మధ్యకూడా ఇంతటి అనుబంధాన్ని పెనవేసిన శక్తి ఏది? తెలుగంటే ప్రేమ, తెలుగుదనం మీద అభిమానం, తెలుగుపద్యం పైనున్న ఇష్టం. వాటికి నేను సదా ఋణపడిపోయాను!

ఏ దేశమేగినా ఎందు కాలిడినను
నాదైన గుర్తింపు నాకొసంగె
దూరతీరాలకు వారధియై నిల్చి
స్నేహానుబంధాలు చెలగజేసె
పరదేశమున ముఖపరిచయమ్మే లేని
వారిండ్ల అతిథిసత్కారమొసగె
సహృదయ సాంగత్య సౌరభ మెదనింపి
ఇంటిబెంగను మరపింపజేసె

మరపురాని అనుభవసంపద మిగిల్చె
అమ్మదీవెన వోలె నా కహరహమ్ము
తోడుగానిల్చి పచ్చనినీడ నిచ్చె
తెలుగుపద్యము ఋణమిది తీర్చగలనె!
పూర్తిగా చదవండి...

Friday, November 5, 2010

దీపావళి శుభాకాంక్షలు!

దీపావళి శుభాకాంక్షలు!
శుభాకాంక్షల కోసమే ఈ బ్లాగన్నట్టుగా తయారయ్యిందీ మధ్య.:-) అసలు, పండగల ముఖ్య ప్రయోజనాల్లో ఇదొకటి. మనిషి మరీ ఒంటరివాడైపోకుండా నలుగురినీ కలపడం కోసం. సరే "ఈ" కాలంలో అవి "ఈ-కలయికలుగా" మారడం సహజమే కాబోలు! ఇంటిదగ్గర ఉండుంటే ఈపాటికి టపాకాయల హడావిడిలో ఉండేవాణ్ణి! తారాజువ్వలు తప్పనిసరి. ఒక్కో పండక్కి ఒకో ప్రత్యేకత! సరదాగా జరుపుకొనే పండగల్లో మాత్రం దీపావళిదే అగ్రస్థానం.

చారిత్రకంగా పండగల పుట్టుపూర్వోత్తరాలు వాటి సాంఘిక మూలాలు మొదలైనవి పక్కన పెడితే, వాటి గురించిన కథలు భలే విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకి ఈ దీపావళి పండగే తీసుకోండి. మనందరికీ బాగా తెలిసిన కథ నరకాసుర వథ. శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై యుద్ధం చేసి నరకాసురుణ్ణి సంహరిస్తే ప్రజలందరూ ఆనందంగా మర్నాడు దీపావళి జరుపుకోవడం ఈ పండగ పుట్టుకకి కారణంగా చెప్తారు. కృష్ణుడో, విష్ణుమూర్తో, శివుడో - ఎంతమంది రాక్షసులని చంపలేదు! మరి నరకుడిని చంపినందుకు మాత్రమే మనం ఎందుకు పండగ జరుపుకుంటున్నాం? మన ఆనందానికి సూచనగా దీపాలని (దీపాలంటే కృత్రిమమైన విద్యుత్తు దీపాలు కాదు, సహజమైన చక్కని ప్రమిద దీపాలు) ఎందుకు వెలిగిస్తున్నాం? బాణాసంచా ఎందుకు కాలుస్తున్నాం? ఇవన్నీ ఆలోచిస్తే భలే వింతగా అనిపిస్తాయి. సరదాగా పండగ జరుపుకోక ఈ ప్రశ్నలన్నీ అవసరమా అంటే కాదు. అయినా ఏదో బుద్ధి అన్నది ఉన్నందుకు ఇలాంటి ప్రశ్నలు అప్పుడప్పుడైనా తలెత్తకుండా ఉండవుకదా. రాక్షసుడి చావుని పండగ్గా జరుపుకొనేది ఒక్క దీపావళికే అనుకుంటా!

నరకాసుడి కథ గురించి విశ్వనాథ సత్యనారాయణగారు ఒక ఊహ చేసారు. నాచన సోమన ఉత్తరహరివంశాన్ని గురించిన విమర్శ "ఒకడు నాచన సోమన" అనే పుస్తకంలో తన ఊహని ప్రతిపాదించారు. అదేమిటంటే, భూమినుంచి బద్దలై విడిపోయిన ఒక పెద్ద గోళానికి నరకుడు ప్రతీక అనీ, ఆ గోళం తన గతి తప్పి భూమ్మీద పడిపోడానికి దూసుకువస్తే, కృష్ణుడు దాన్ని తునాతునకలు చేసి భూమిని రక్షించాడనీ. చంద్రుడు భూమి ఏర్పడే కొత్తలో విడిపోయిన గోళమని అంటారు కదా. అలాగే మరొక ముక్క విడిపోయుండేందుకు అవకాశం లేకపోలేదు. అది చంద్రుడిలా చక్కగా భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పోకుండా, భూమ్యాకర్షణకి భూమ్మీదకి వచ్చిపడే అవకాశమూ ఉంది. ఏదో ఇంగ్లీషు సినిమాలో పెద్ద మీటియర్ భూమ్మీద పడబోతూ ఉంటే, దాన్నుంచి భూమిని రక్షించే ప్రయత్నం చెయ్యడమే కథ. నరకాసురుడిది కూడా అలాంటి కథే అని విశ్వనాథ వారి ఊహ. ఈ ఊహకి కారణాలు ఏంటంటే, ఒకటి - నరకుడి నగరం ప్రాగ్జ్యోతిష పురం కావడం. జ్యోతిషమంటే అంతరిక్షంలోని నక్షత్రాలకి సంబంధించినదని అర్థం. ప్రాక్ అంటే తూర్పు దిక్కు. ఈ రెండు పదాలు కలిపిన ప్రాగ్జ్యోతిషం అంతరిక్షంలో భూమికి తూర్పుగా ఉండే ప్రదేశాన్ని సూచిస్తుందని అనుకోవచ్చు కదా. నరకుడి నివాసం అక్కడంటే అతడు ఏ గ్రహమో అయ్యేందుకు అవకాశం ఉంది. రెండో కారణం. నరకుడు, విష్ణువు వరాహావతారంలో భూమిని రక్షించేటప్పుడు వాళ్ళిద్దరికీ పుట్టిన వాడు. వరాహావతారానికి కృష్ణావతారానికీ మధ్య కొన్ని మన్వంతరాల తేడా ఉంది. నరకుడు మనిషే (రాక్షసుడైనా) అయితే అన్నాళ్ళు బతికుండే అవకాశం లేదు. ఒకవేళ ఉన్నాడనుకున్నా అన్ని కోట్ల సంవత్సరాలుగా ఊరుకొని కృష్ణుడు అవతరించేదాకా జనాలని పీడించకుండా ఉన్నాడా? ఈ ప్రశ్నలకి నరకుడు ఒక గోళం అని చెప్పుకుంటే సమాధానాలు సులువుగా దొరుకుతాయి. నాచన సోముడు కూడా ఇలాగే ఊహించాడాని విశ్వనాథవారి ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడు తన చక్రంతో నరకుడిని వ్రక్కలు (తునాతునకలు) చేసాడని రెండుసార్లు నొక్కి మరీ చెప్పాడు నాచన. మామూలు మనిషైతే చక్రంతో తల నరికితే సరిపోతుంది కదా. తునాతునకలు చెయ్యడం దేనికి? అదే గోళమైతే ఏదైనా బాంబుపెట్టి పేల్చినట్టు చక్రంతో దాన్ని ముక్కచెక్కలు చేసే అవకాశం ఉంది. ఇదంతా ఊహే కావచ్చు. కాని సహేతుకమైనది. ఆర్య-ద్రవిడ లేదా జాతి/కుల వైరాన్ని ప్రతిపాదించే విద్వేష కారకమైన ఊహలకన్నా మేలైన ఊహ.

దీపాలు వెలిగించడం, బాణాసంచా కాల్చడం అన్నది బహుశా ఈ కథకి సంబంధం లేని ఆచారం. దీపావళి అమావాస్య తర్వాత రోజునుండీ కార్తీక మాసం మొదలవుతుంది. అంటే చంద్రుడు కృత్తికలో ఉండే నెల. కృత్తికని అగ్ని నక్షత్రం అంటారు. దానికి సూచనగానే బహుశా ఆ నెలంతా దీపాలు వెలిగిస్తారేమో. దీపావళి దానికి శ్రీకారం చుడుతుంది.

నరకాసురడి కథ పురాణాల్లో కావ్యాల్లో ఉంది కాని దీపావళి పండగ ప్రసక్తి తెలుగు కావ్యాల్లో ఎక్కడైనా ఉందేమో నాకు తెలీదు. నరకాసుడి కథ అనగానే గుర్తుకువచ్చేది మాత్రం సత్యభామ యుద్ధం, అందులోని ఈ పద్యం:

అరిజూచున్ హరిజూచు జూచుకములం దందంద మందార కే
సరమాలా మకరంద బిందు సలిలస్యందంబు లందంబులై
తొరగం బయ్యెదకొంగొకింత దొలగన్ దోడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీ గతిన్

ఈ పద్యం గురించి కొద్దిపాటి వివరణ ఇక్కడ వ్యాఖ్యల్లో చూడవచ్చు: http://www.eemaata.com/em/issues/200901/1386.html?allinonepage=1

అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. టపాకాయలతో పిల్లకాయలతో జాగ్రత్త సుమా!


పూర్తిగా చదవండి...

Sunday, October 17, 2010

విజయదశమి శుభాకాంక్షలు!

అందరికీ విజయదశమి శుభాకాంక్షలు!

శివము శక్తిని గూడిన సృష్టి జరుగు
లేక దైవము స్పందనే లేని జడము
అట్టి నిను, హరిహర విరించాదులకును
పూజ్యమౌ దాని, నుతియింప మ్రొక్కులిడగ
అకృత పుణ్యులకున్ సాధ్యమగుట యెట్లు?

అమిత సూక్ష్మము, నీ పాదకమల భవము,
అయిన రేణువుచే లోక మవికలముగ
నా విరించి రచించు; సహస్ర శీర్ష
ములను హరి యెట్లొ భరియించు, బూదివోలె
హరుడు దానిని పొడి జేసి అలముకొనును

ఇవి సౌందర్యలహరిలోని మొదటి రెండు శ్లోకాలకీ నా అనువాద ప్రయత్నం. దసరా పండగంటే అమ్మవారిని కొలిచే పండగ. అమ్మవారు శక్తి స్వరూపిణి. మన దేశంలోని మతాలలో శక్తిని ఆరాధించే వారి మతాన్ని శాక్తేయం అంటారు. ఈ శాక్తేయం ఎక్కువగా వంగ ప్రాంతంలో వర్ధిల్లిన మతం. అందుకే ఇప్పటికీ బెంగాలీలకి దసరానే అతి ప్రధానమైన పండగ. ఈ పండగని వాళ్ళు "పూజో" అంటారు. పదిరోజులు జరిగే ఈ దసరా పండగలో ఆ శక్తి వివిధ రూపాలని పూజిస్తాం.

శివము, శక్తి అనే ఈ ద్వంద్వం మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. వాక్కు-అర్థము, ప్రకృతి-పురుషుడు, బీజము-క్షేత్రము, చైతన్యము-జడము, energy-mass ఇలా. అవి రెండు కాదు ఒకటి అని తెలుసుకోవడం అద్వైతం. మన మెదడు ఉంది. అది ఏమిటంటే కొన్ని కోట్ల న్యూరాన్ల కలయిక. అయితే, అన్ని కొట్ల న్యూరాన్లు కలిసినంత మాత్రానే మెదడు ఏర్పడిపోతుందా? వాటిలోని స్పందన శక్తి ఏదో వాటిని పని చేయిస్తోంది. ఆ శక్తి లేకపోతే వట్టి న్యూరాన్లు మాత్రమే మెదడు కాలేవు. అలాగే ఒక పెద్ద జడపు ముద్దగా ఉన్న రూపంలో విశ్వానికి ఉనికి లేదు. ఏదో ఒక చైతన్యం, ఒక శక్తి - ఆ జడపు ముద్దని విశ్వంగా మార్చిందని మన సైంటిస్టులు కూడా ఊహిస్తున్న విషయమే. విచిత్రం ఏమిటంటే, ఈ శక్తి జడంలో ఉన్నదే! దానికి భిన్నమైనది కాదు. మనిషి మెదడులోని అన్ని కోట్ల న్యూరాన్లూ ఒక్క అండము, శుక్రము కలయికలోంచి ఉద్భవించాయి. ఏ ఏ న్యూరాన్లు ఎలా పనిచెయ్యాలన్న విషయమంతా పరమాణు సదృశమైన DNAలో నిక్షిప్తమై ఉంది. అందులోంచే మనిషి (జీవం) సృష్టించబడుతోంది. జీవి మనుగడకి, చావుకీ కూడా అది కారకమవుతోంది. ఇది ప్రాణశక్తి. విశ్వం పుట్టుక ఎలా అయితే మనకింకా అంతుబట్ట లేదో, అలానే ప్రాణం పుట్టుక కూడా అంతుబట్ట లేదు. అయితే ఈ రెంటికీ కూడా మూలమైనది శక్తి అని మాత్రం తెలుసు. ఆ శక్తులు రెండూ వేరువేరా, ఒకటేనా అన్నది తెలియదు. సృష్టి, స్థితి, లయ అనేవి అటు విశ్వానికీ, ఇటు ప్రాణానికీ కూడా సమానంగా ఉన్న లక్షణాలు.

ఇలా ఆలోచించుకుంటూ పోతే ఎక్కడ తేలతామో తెలీదు! శక్తిని ఆరాధించడమంటే నిజానికి గుడ్డిగా నమ్మడం కాదు. దాని ప్రభావాన్ని పరిపూర్ణంగా అనుభవించడం. దాని స్వరూపాన్ని శాస్త్రీయంగా అన్వేషించడం. దైనందిన జీవితపు మూసలో బతికేస్తున్న మనుషుల మనసులని ఆ అన్వేషణవైపు, ఆ అనుభవం వైపు మళ్ళించేందుకే ఈ పండగలు.

శక్తిని స్త్రీ రూపంగా ఎందుకు పూజిస్తాం అన్నది లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. అది అలా ఉంచితే, వివిధ రూపాల్లో శక్తిని అమ్మవారిగా పూజించడం మనకి బహుశా అనాదిగా వస్తున్న ఆచారమే అనుకుంటాను. ప్రతి గ్రామంలోనూ గ్రామదేవత రూపంలో పూజించేది శక్తినే కదా. విజయదశమి తర్వాత వచ్చే మొదటి మంగళవారం నాడు, మా ఊరి అమ్మవారైన పైడితల్లి ఉత్సవం జరుగుతుంది. మహా వైభవంగా జరుగుతుందది. చిన్నతనంలో అమ్మవారిపండగ అంటే మాకు భలే సంబరం! ఊరినిండా ఎక్కడ పడితే అక్కడ హరికథలు, బుఱ్ఱకథలు రాత్రంతా జరిగేవి. చుట్టుపక్కల ఊళ్ళల్లోని జనాలు తండోపతండాలుగా వచ్చేవారు. ఊరంతా కిటకిట, కళకళ. దసరా మొదటి రోజునించే పులివేషాలు, ఇంకా మిగతా పగటి వేషాలు ఊరంతా తిరగడం మొదలయ్యేవి. ఇక పైడితల్లమ్మవారి పండగ రోజైతే మరి చెప్పనే అక్కర లేదు. సాయంత్రం సుమారు నాలుగ్గంటలకి సిరిమాను ఉత్సవం మొదలయ్యేది. పైడితల్లి అమ్మవారి గుడినుండి కోటదాకా అమ్మవారు ముమ్మారు సిరిమాను రూపంలో తిరుగుతారు. ముందు జాలరివల, వెల్ల యేనుగు, రథం. వాటి వెనక సిరిమాను. మాను అంటే చెట్టు. శుభాన్ని చేకూర్చే మాను కాబట్టి సిరిమాను అని పేరు. ఆ మాను చివర అమ్మవారి గుడి పూజారి కూర్చుంటారు. వారిలో అమ్మవారు ఆవేశిస్తారని నమ్మకం. అలా ఆ సిరిమాను గుడినుండి కోటకి, మళ్ళీ కోటనుండి గుడికి మూడుసార్లు తిరిగుతూ ఉంటే దాన్ని చూడ్డానికి ఆ తోవంతా కిక్కిరిసిపోయి ఉంటారు జనం. ఆ తోవలో రెండు పక్కలా ఉన్న మేడలన్నీ జనాలతో నిండిపోతాయి. మా అదృష్టం ఏమిటంటే, మా ఇల్లు కోటకి సరిగ్గా ఎదురుగ్గా ఉండే వీధిలోనే! కాబట్టి ఇంటి అరుగుల మీద (ఇప్పుడు రోడ్డు విస్తరణ పుణ్యమా అని అరుగులని తెగనరికేసారనుకోండి :-() నిలబడితే హాయిగా కనిపించేది ఉత్సవం. ఆ రోజు, తెలుసున్న బంధువులు స్నేహితులు కుటుంబాలతో సహా మా ఇంటికే వచ్చేసేవారు, ఉత్సవాన్ని చూడ్డానికి. ఇంటి ముందు పెద్ద చెక్క మంచమొకటి వేసేవాళ్ళం, వచ్చిన వాళ్ళందరూ దాని మీద నిలబడి చూడ్డానికి. అతిథులందరికీ కాఫీ, టీ సరఫరాలు. వచ్చిన వాళ్ళ పిల్లలతో మా గెంతులు. పండగనగానే భలే సందడిగా ఉండేది ఇల్లంతా.

నాకు దసరా అంటే అమ్మవారిపండగే! ఈ ఏడాది కూడా పండక్కి ఇంటికి దూరంగా, చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది...ప్చ్...


పూర్తిగా చదవండి...

Monday, October 4, 2010

కప్పల పెళ్ళి

ఈ మధ్యనేదో కప్పలపెళ్ళి హవా వీస్తున్నట్టుంది! శంకరయ్యగారు "కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్" అన్న సమస్యనిచ్చారివాళ. మొన్నటికి మొన్న పొద్దులో గిరిగారు "శాపగ్రస్త మండూకము" అని పద్యాలలో ఏకంగా ఒక ఖండకావ్యాన్నే వ్రాసేసారు! సరే నేను మాత్రం తక్కూ తిన్నానా. కప్పలపెళ్ళి కథ ఒకటి నేనూ చెపుతాను. అబ్బే, నేను సొంతంగా రాసింది కాదు లెండి.

నీరప్రాంగణ కర్కటీబిలములన్ నిద్రింప, మృత్స్నామయా
హారంబుం గబళింప, బెల్లఱవ, నిట్టట్టుం బ్లుతంబుల్ గొనన్,
దూరాయాస్య దహీంద్ర భీతిహతి గొందుల్‌దూఱ, గోఱున్ మదిన్
సారాపేతమనోబలంబగు భవిష్యద్భేక ముత్సేకమై

భవిష్యద్భేకము అంటే భవిష్యత్తులో కప్ప. భవిష్యత్తులో కప్పేంటి? అంటే ప్రస్తుతం కప్పకాదు, సమీప భవిష్యత్తులో కప్పగా మారబోతున్న ఒక మనిషి. ఒకడు కప్పగా మారబోతున్నాడు. ఇంకా మార లేదు. కాని అతని మనసులో కప్ప లక్షణాలు పొడసూపాయి. ఆ లక్షణాలీ పద్యంలో వర్ణించబడ్డాయి. నీళ్ళ దగ్గరలో, కర్కటీబిలములన్ - కర్కటీ అంటే పీతలు (సరీగా చెప్పాలంటే ఆడపీతలు). అవి చేసిన కన్నాలు కర్కటీ బిలములు. నీటి గుంటల పక్కన పీతలు చేసిన కన్నాల్లో నిద్రించాలని ఉరకలువేస్తోంది ఆ మనిషి మనసు. మృత్స్నా అంటే మంచి మన్ను. మంచిమన్నుని ఆహారంగా తినాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. బెకబెకా అరవాలని ఉంది. ఇటు అటూ గెంతులు వెయ్యాలని కూడా ఉంది. కప్పలకి పాములంటే భయం కదా, తమని మింగేస్తాయని. అంచేత దూరాస్యత్ + అహీంద్ర = దూరన్నుంచి వస్తున్న పాము, భీతి హతి = ఆ పాముని చూసిన భయంతో కన్నాల్లోకి దూఱిపోదామనుకుంటున్నాడు! మనిషిగా ఉండగానే అతని మనసులో ఇలా కప్ప లక్షణాలు పెరిగిపోయి, అతడు పూర్తిగా గుండెదిటవు కోల్పోయాడు.

ఇంతకీ ఎవడితను? ఎందుకు కప్పలా మారబోతున్నాడు? ఇది తెలుసుకోవాలంటే తెనాలి రామకృష్ణుని పాండురంగమాహాత్మ్యం చదవాలి. అందులో "అయుత నియుతోపాఖ్యానం" అని ఒక కథ ఉంది. పాండురంగ మాహాత్మ్యం కావ్యమే కొన్ని కథల సమాహారం. అందులో ఇది చివరి కథ. అయుతుడు, నియుతుడు అని ఇద్దరు అన్నదమ్ములు అగస్త్యమహర్షి దగ్గర శిష్యరికం చేస్తున్నారు. చాలా నిష్ఠగా చదువుకొనేవారు. అగస్త్యునికి వీళ్ళిద్దరూ బాగా అనుంగు శిష్యులయ్యారు.ఆ రోజుల్లో గురువులకి శిష్యుల మీద చాలా ప్రేమ అధికారం రెండూ ఉండేవి కాబోలు. తన ప్రియశిష్యులిద్దరికీ పెళ్ళి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. వీళ్ళకి అలాంటిలాంటి అమ్మాయిలు కాదని సరాసరి బ్రహ్మదేవుని కూతుళ్ళనే ఇచ్చి చెయ్యాలనుకున్నాడు. బ్రహ్మదేవుడి దగ్గరకి స్వయంగా వెళ్ళి అడిగాడు. మరి మగపెళ్ళివారే ఆడపెళ్ళివాళ్ళ దగ్గరకి వెళ్ళి అడగడం ఆచారం. బ్రహ్మగారు అంతకన్నానా అని, సావిత్రి గాయత్రి అనే తన కూతుళ్ళని ఇద్దరినీ అగస్త్యుని వెంట పంపిస్తాడు. ఆ పెళ్ళికూతుళ్ళను వెంటపెట్టుకు వచ్చి, అగస్త్యుడు తన శిష్యులకి చూపించి వాళ్ళని పెళ్ళాడమంటాడు. నియుతుడు సరేనంటాడు కాని అయుతుడు ఒప్పుకోడు. నేను సంసార సాగరంలో మునగలేను స్వామీ నన్ను ఒదిలెయ్యండంటాడు. దానితో అగస్త్యునికి కోపం వచ్చి అయుతుణ్ణి తన ఆశ్రమం నుండి వెళ్ళగొట్టేస్తాడు. నియుతుడే ఇద్దరినీ పెళ్ళి చేసుకుంటాడు. ఆశ్రమం నుండి బయటకి వచ్చేసిన అయుతుడు హిమాలయాలకి వెళ్ళి ఘోర తపస్సు ప్రారంభిస్తాడు. ముల్లోకాలు అతని తపశ్శక్తికి అల్లకల్లోలం అయిపోతాయి. లాభం లేదని ఇంద్రుడు అతని తపస్సుని భగ్నం చెయ్యడానికి బయలుదేరతాడు. ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అయుతుని దగ్గరకు వస్తాడు. తన పరివారం కొందరు శిష్యులుగా వెంట వస్తారు. కామధేనువుకూడా ఒక ముసలిఆవు రూపంలో వెంటవస్తుంది. సరే వచ్చిన అతిథులకి కూర్చోపెట్టి మర్యాదలు చేస్తాడు అయుతుడు. ఇంద్రుడు అయుతుని వివరాలు అడిగి, పెళ్ళిచేసుకోనని ప్రతిజ్ఞ పూని ఇలా తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని అతనికి గృహస్థాశ్రమంలోని గొప్పదనాన్ని బోధిస్తాడు. ఇంద్రుడెన్ని విధాలుగా చెప్పినా అయుతుడు అతనికి తిరుగు జవాబు చెపుతాడు కాని అతనితో అంగీకరించడు. దాంతో విసిగిపోయిన ఇంద్రుడు, సరే నీ ఖర్మ అని చెప్పి వెళిపోతాడు. ఎలా అయినా అతని తపస్సుని భగ్నం చెయ్యాలని, తనతో తెచ్చిన ఆవుని అక్కడే ఉంచేసి వెళిపోతాడు. అది బాగా నీరసించిపోయి జబ్బుచేసినదానిలా కదలలేకుండా పడుంటుంది. అలా ఉన్న ఆవు మీద అయుతునికి జాలి కలుగుతుంది. ఆ ఆవుని జాగ్రత్తగా సాకుతాడు. చాలా సేవ చేస్తాడు. ఆవు బాగా పుంజుకొని చక్కగా బలిష్టంగా తయారవుతుంది. కొన్ని దూడలని కూడా కంటుంది. ఇదంతా తలకెత్తుకొనే సరికి అతని తపస్సు గంగలో కలుస్తుంది! అప్పటికి అతనికి తెలివి వస్తుంది. చీ చీ ఈ లంపటంలో ఇఱుకున్నానేమిటని చెప్పి, ఆ ఆవుని అడవిలోకి తరిమేస్తాడు. దానితో ఆ గోవుకి కోపం వచ్చి వాధూలుడనే ముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆ ముని తపస్సుచేస్తూ ఉంటే అతని చుట్టూ ఏర్పడిన పుట్టని కాస్తా మట్టేసి పోతుంది. దానితో ఆ వాధూల ముని తపస్సు భగ్నమై, ఆ ఆవును తరుముకు వస్తున్న అయుతుణ్ణి చూసి, నా ఆశ్రమంలోకి ప్రవేశించి నా తపస్సుని భంగం చేస్తావా అని కోపంతో నువ్వు కప్పవైపోవు గాకా అని శపిస్తాడు. అయుతుడు అతని కాళ్ళపై పడి జరిగిందంతా వివరిస్తాడు. అప్పుడు వాధూల మునికి అతనిపై కరుణ కలిగి, సరే భీమరథి నది ఒడ్డునున్న నరసింహస్వామిని పూజించు. మరో కప్పతో నీకు పెళ్ళై, సంతానం కలిగాక అప్పుడు నీకు శాపవిమోచనం అవుతుంది అని చెప్తాడు. అయుతుడు సరేనని భీమరథి నదివడ్డునున్న పాండురంగని క్షేత్రమైన పండరీపురాన్ని చేరుకొని, అక్కడకి దగ్గరలో ఉన్న నరసింహస్వామిని సేవిస్తూ ఉంటాడు. ఇంతలో అతనిలో కప్పలో కలిగే మార్పులు పొడసూపుతాయి. అదిగో అప్పుడు వచ్చే పద్యమే ఇది!

తెనాలి రామకృష్ణుడి ప్రత్యేకత ఇదే. ఏ కవైనా ఒక మనిషి కప్పగా మారడాన్ని వర్ణించాలనుకోండి. అతని ఆకారంలో వచ్చే మార్పులని వర్ణిస్తాడు. లేదా అతను కప్పగా మారిన తర్వాత ఎలా ఉన్నాడో వర్ణిస్తాడు. కాని రామకృష్ణుడు అలా కాదు. అతని దృష్టి విచిత్రంగా ఉంటుంది. పూర్తిగా కప్పగా మారక ముందు, మనిషి మనసులో కప్ప లక్షణాలు వస్తే ఎంత వింతగా ఉంటుంది అన్నది ఇతడి ఊహ. అందులో ఒక వెటకారం ఉంది. ఇది రామకృష్ణుడిలోని వికటత్వం. మనుషుల మనసుల్లోకి తొంగిచూసి, వాటిల్లో ఉండే అవలక్షణాలని సున్నితంగా, హాస్యభరితంగా చిత్రించడం తెనాలి కవిలో ఉన్న విశిష్టత. అలాంటి సందర్భం వస్తే వదులుకోడు. మీరే ఆలోచించండి, ఒక మనిషి పై పద్యంలో వివరించిన చేష్టలు చేస్తే ఎంత వింతగా ఉంటుంది? అయితే అవన్నీ అయుతుడు చేసేడని వర్ణించలేదు. అతని మనసులో అలాంటి కోరికలు చెలరేగేయని మాత్రం వర్ణించి ఊరుకున్నాడు! ఎవరైనా అలా చేస్తున్నారని చెప్తే ఆ చేసేవాడిని ఊహించి నవ్వుకుంటాం. కాని అలాంటి ఊహలు మనసులో మెదిలాయి అని మాత్రం చెప్పి ఊరుకుంటే, మనమూ అలా ఊహించుకుంటాం. రామకృష్ణుడు గొప్ప కవే కాదు మంచి సైకాలజిస్టు అనికూడా అనిపిస్తుంది. :-)


ఇంతకీ అయుతుడి సంగతేమయ్యింది? ఆ కప్పరూపంలో చాలా ఏళ్ళు విష్ణు సాన్నిధ్యంలో గడిపిన తర్వాత కన్యాకుబ్జ రాజ్య రాకుమార్తె తన చెలికత్తెలతో ఈ పుండరీక క్షేత్రానికి వచ్చి స్వేచ్ఛగా విహరిస్తూ అక్కడున్న ఈ కప్పని చూస్తుంది. వింత కాంతులతో ఉన్న ఆ కప్పని చూసి రాకుమార్తె దానితో సరదాగా ఆడుకోవాలని దాన్ని పట్టుకుంటుంది. తన చేతిలో కొంచెం సేపు ఆడిస్తూ, అల్లరిచేస్తూ, ఆ కప్పని తీసుకువెళ్ళి ఒక వృద్ధ బ్రాహ్మణుడి మీదకి విసురుతుంది. దాంతో ఆ బ్రాహ్మణుడు కోపించి ఆ రాకుమార్తెని, చెలికత్తెలనీ కూడా కప్పలుగా మారిపొమ్మని శపిస్తాడు. వెంటనే అవి కప్పలుగా మారిపోతాయి. ఒక్క భార్యని వద్దన్న అయుతుడికి ఈ కప్ప రూపంలో ఆ ఆడకప్పలన్నీ భార్యలైపోతాయి! నీళ్ళల్లో ఈదడంతో పాటు సంసారంలో కూడా ఈదాల్సి వస్తుంది! ఆఖరికి అయుతునికీ రాకుమార్తెకీ ఒక పిల్ల కప్ప, కొడుకు, పుడతాడు. దానితో అతనికి శాపవిమోచనమై, అంత కాలం విష్ణు సేవలో గడిపినందుకు ఫలంగా వైకుంఠాన్ని చేరుకుంటాడు.

ఇదీ కథ! ఈ కథ ఎక్కడా పురాణాల్లో ఉన్నట్టు లేదు. ఇదంతా రామకృష్ణుని స్వకపోలకల్పితమే! బహుశా మన జానపథకథలని ఆధారం చేసుకొని దీన్ని రచించి ఉంటాడు. రామకృష్ణుని వైచిత్రి పేర్లలో కూడా కనిపిస్తుంది. అయుత నియుతుల తండ్రి పేరు ప్రయుతుడు. అయుత, నియుత, ప్రయుత అనేవి సంస్కృతంలో సంఖ్యా వాచకాలు. ఎంత అన్న విషయంలో కొంత అభిప్రాయ భేదం ఉంది. అయుత అంటే పదివేలు, నియుత అంటే లక్ష, ప్రయుత అంటే పది లక్షలు అని చాలామంది ఒప్పుకున్న అర్థాలు. ఈ పేర్లని ఎందుకు ఎంచుకున్నాడో మరి! యుత అంటే బంధమనే అర్థం వస్తుంది. అయుత అంటే బంధం లేనివాడు, నియుత అంటే బంధమున్నవాడు అని అర్థం చెప్పుకోవచ్చు. ఆలా అవి ఆ పాత్రల స్వభావాలకి తగిన పేర్లే! కాని ఎంత బంధ విముక్తుడవుదామనుకున్నాడో అంతకి అంతా బంధాల్లో చిక్కుకున్నాడు అయుతుడు, అదీ విచిత్రం!
పెళ్ళి చేసుకోం, సంసార బంధాలలో చిక్కుకోం అని భీష్మించే బ్రహ్మచారులకి ఈ కథ మంచి గుణపాఠమే నేర్పుతుంది. :-)


పూర్తిగా చదవండి...