తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, November 26, 2010

తెలుగుపద్యము ఋణమిది తీర్చగలనె!

మీరెప్పుడైనా అమెరికాలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో కూర్చొని, చక్కని మినపరొట్టెని (దీన్నే దిబ్బరొట్టె, పొంగరం అని కూడా అంటారు) ఆవకాయతో నంజుకొని (లోలోపలే లోట్టలేసుకుంటూ) తిన్నారా? ఆ తర్వాత విమానం బయలుదేరే వరకూ ఆ ఆవకాయ డొక్కని బుగ్గన పెట్టుకు చప్పరిస్తూ కూర్చున్నారా? నన్ను నమ్మండి, అదొక అనిర్వచనీయమైన అనుభూతి! కొంతమంది అనుమానంగా, మరికొంత మంది ఆశ్చర్యంగా, ఇంకొంతమంది అసూయగా (విమానం కోసమే చూస్తున్న పక్కనున్న తెలుగువాళ్ళు) చూసే చూపులు మీకు తగులుతూ ఉంటే అలా అమెరికన్ ఎయిర్ పోర్టులో కూర్చొని అచ్చతెలుగు వంటకాన్ని ఆస్వాదించడం ఎంత కిక్కిస్తుందనుకున్నారు! అల్లాంటి అదృష్టం మొన్నమొన్ననే నాకు కలిగింది. అదంతా తెలుగుపద్యం మహిమ!

ఈ బ్లాగు నేను మొదలుపెట్టింది స్వానుభవాలు వ్రాసేందుకు కాదు. అయితే ఈసారి నా అమెరికా ప్రయాణం మిగిల్చిన అనుభవాలు తెలుగుపద్యంతో ముడిపడ్డాయి కాబట్టి వీటినిక్కడ వ్రాస్తున్నాను. ముఖ్యంగా, నన్ను అమెరికాలో ఆప్యాయంగా ఆదరించిన వాళ్ళందరికీ బ్లాగు ముఖంగానే కృతజ్ఞతలు చెప్పుకోడం సమంజసమనిపించింది.

కన్నెగంటి చంద్రగారింటిలో, ఇండియాలో ఉండీ ఎన్నాళ్ళగానో తినలేకపోయిన జున్నుని రుచిచూడ్డంతో మొదలయ్యింది నా అదృష్టం! వారి మామగారి గొంతులో హాయిగా వినిపించిన పద్యాలు ఆ జున్నంత తీయగానూ ఉన్నాయి. అంత పెద్ద వయసులో చిన్నప్పుడెప్పుడో చదువుకున్న పద్యాలు పొల్లుపోకుండా అలా అనర్గళంగా వారి గళంలోంచి జాలువారడం ఎంత గొప్ప విషయం! అదీ తెలుగు పద్యం మహిమ! అలా ఆ జున్ను తినడంతో మొదలైన నా అదృష్టం మరెందరో సహృదయులైన సాహితీమిత్రుల కలయికతో, పరిచయాలతో పెరిగి పెరిగి, గన్నవరపు మూర్తిగారి సతీమణి ఆప్యాయంగా చేసిచ్చిన ఆ మినపరొట్టెని ఎయిర్ పోర్టులో కూర్చుని తినడంతో సంపూర్ణమయ్యింది!
అంతకుముందు అసలు ముఖపరిచయం కూడా లేనివాళ్ళు, పట్టుబట్టి నన్ను వాళ్ళిళ్ళకి భోజనాలకి తీసుకువెళుతూండడం చూసి, నాతో అమెరికా వచ్చిన నా ఆఫీసుమిత్రులందరూ ఆశ్చర్యంతో నోళ్ళు వేళ్ళాడేసారు! కన్నెగంటి చంద్రగారూ, గన్నవరపు మూర్తిగారు, లంక చంద్రశేఖర్ గారు, మద్దుకూరి చంద్రహాస్ గారు ఇచ్చిన ఆతిథ్యం మరచిపోలేనిది. కాజా సురేష్ గారు, అనంత్ గారు, నరసింహ రెడ్డిగారు, జువ్వాడి రమణగారు మొదలైన సాహితీ మిత్రుల పరిచయం మరపురానిది. కార్తీకపౌర్ణమి సాయంత్రం చంద్రశేఖర్ గారింట్లో, ఆకాశదీపానికి నమస్కరించి తీర్థప్రసాదాలు తీసుకొని వారి ఆశీసులు పొందడం ఎంతో అదృష్టం. వారింటి వెనక పెరట్లో బల్లకుర్చీ మీద కూర్చొని పిల్లతెమ్మెరలు వీస్తూంటే పున్నమి వెన్నెల జల్లులో తడసిపోవడం ఒక మధురానుభూతి.

నెల్లాళ్ళుగా ఇక్కడుంటూ మాకు మాటమాత్రం చెప్పలేదేమని కోప్పడ్డవారున్నారు. నా తిరుగుప్రయాణం అనుకున్న రోజుకన్నా ముందుకు వచ్చేసినందుకు విచారించినవాళ్ళున్నారు. ఇంతమంది అభిమానాం వెనక ఏమిటి కారణం? అపరిచితుల మధ్యకూడా ఇంతటి అనుబంధాన్ని పెనవేసిన శక్తి ఏది? తెలుగంటే ప్రేమ, తెలుగుదనం మీద అభిమానం, తెలుగుపద్యం పైనున్న ఇష్టం. వాటికి నేను సదా ఋణపడిపోయాను!

ఏ దేశమేగినా ఎందు కాలిడినను
నాదైన గుర్తింపు నాకొసంగె
దూరతీరాలకు వారధియై నిల్చి
స్నేహానుబంధాలు చెలగజేసె
పరదేశమున ముఖపరిచయమ్మే లేని
వారిండ్ల అతిథిసత్కారమొసగె
సహృదయ సాంగత్య సౌరభ మెదనింపి
ఇంటిబెంగను మరపింపజేసె

మరపురాని అనుభవసంపద మిగిల్చె
అమ్మదీవెన వోలె నా కహరహమ్ము
తోడుగానిల్చి పచ్చనినీడ నిచ్చె
తెలుగుపద్యము ఋణమిది తీర్చగలనె!

9 comments:

 1. కామేశ్వరావుగారు,
  నరసింహమూర్తిగారి ఇంటిలో మిమ్మల్ని ప్రత్యక్షముగా కలవటము అలాగే మీ ఆలోచనలు మాతో పంచుకోవటము ఒక మరపురాని విషయము. ఆముక్తమాల్యద గ్రంథ వైశిష్ట్యమును నెలనెలాతెలుగువెన్నెల సాహితీ మిత్రులకు పరిచయము చెయ్యటము మాకు చాలా ఆనందముగా ఉన్నది. ధన్యవాదాలు.

  ReplyDelete
 2. కామేశ్వరరావు గారూ,
  మీరు డాలసు రావడము, మిమ్మలను ప్రత్యక్షముగా చూడడము నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. మీ తెలుగు పద్యం మాధుర్యాన్ని యెన్నాళ్ళ నుండో చవిగొన్నాము. మీకు ఆతిధ్యము యివ్వగలగడము మా అదృష్టము. మళ్ళీ రండి.

  ReplyDelete
 3. ఈ ముచ్చట ఎప్పుడు జరిగిందీ?
  ఒక మాటైనా చెప్పలేదు చూశారా? అందుకనే అంటారు ముందొచ్చిన చెవులకన్నా .. అని.
  జస్టు కిడ్డింగు.

  ReplyDelete
 4. హమ్మయ్య..... రక్షించారు.....ఇలా వచ్చినప్పుడల్లా, అలా మినపట్టు, ఆవకాయ డొక్కు తింటూ అటునుంచి అటే అలా వెళ్లిపోయాక తెలియచేస్తూ ఉండండి.......మా ఇంట్లో ఓ పూటో, నాలుగు రోజులో భోజనం ఖర్చు మిగిలిందనుకుని సంతోషపడతాం.......కానివ్వండి...అలానే కానివ్వండి మహానుభావా! :) జస్టు కిడ్డింగు.

  ReplyDelete
 5. కొత్తపాళీగారు,
  రామ రామ, వచ్చినట్టు చెప్పనందుకే నాకు కొమ్ములొచ్చేసాయంటున్నారా! :-) ఈ ట్రిప్పు కొద్దిగా హడావిడయ్యిందండి.

  వంశీగారు,
  ప్రస్తుతానికి మీరు పెట్టిన యీ గడ్డే (ఇది కూడా బహు రుచిగానే ఉంది!) పరమాన్నంగా ఆరగిస్తాను. :-) ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా తెలియజేసుకుంటాను :-)

  ReplyDelete
 6. శ్రీ సరస్వత్యై నమః:
  మిత్రులారా!
  తెలుగు పద్యము ప్రభావము అద్భుతమైనది. నాకూ అమెరికాలో కొందరు మిత్రులతో పరిచయ మేర్పడినది. హ్యూస్టనులో, అట్లాంటాలో, న్యూ జెర్సీలో, ఆస్టిన్లో. 2006లో సంక్రాంతి నాడు హ్యూస్టనులో తెలుగు కుటుంబములతో సామూహికముగ పండుగ ఉత్సవములలో పాల్గొనినాను. అక్కడక్కడ కొన్ని ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఇచ్చేను. ఇప్పుడు కొన్ని కొన్ని తెలుగు బ్లాగులు చూస్తూ ఉండుటవలన మరికొందరు మిత్రులు పరిచయ మగుచున్నారు. ఇదీ తెలుగు పద్య ప్రభావము - ఇది మరువలేనిది.

  తెలుగు పద్యము తీయని తేనెలూరు
  తెలుగు పద్యము గుండెలో వెలుగు నింపు
  లక్షణాలలో గతులలో రసములందు
  విశ్వ భాషలలో చాల వెలుగు తెలుగు

  ReplyDelete
 7. శ్రీకామేశ్వరావుగారు గారికి,మీ బ్లాగ్ ను ఇప్పుడే చూడటం జరిగింది. మీరు మా లాగే అలా అమెరికన్ ఎయిర్ పోర్టులో కూర్చొని అచ్చతెలుగు వంటకాన్ని ఆస్వాదించడం జరిగిందిఅని తెలిసి నాకు భలే సంతోషమేసింది."జే ఫ్ కె ఎయిర్ పోర్టులో' కూర్చొని పులిహోర,మినపాట్లు తో పాటు 'ఆంధ్ర శాఖంబరి' కూడా తిన్నాము. లొట్టలేసుకుంటూ ఆవకాయ దోక్కతో సహా మీరు అన్నట్లు అదంతా తెలుగుపద్యం మహిమ!

  మణిమూర్తి వడ్లమాని

  ReplyDelete
 8. మణిమూర్తిగారు, చాలా సంతోషమండి.
  తప్పుపడుతున్నానని అనుకోకపోతే చిన్న సవరణ, "శాఖంబరి" కాదు అది "శాకంబరి" :)

  ReplyDelete