తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, December 10, 2012

భక్తి స్మరియింతును శివశ్శివా యటంచు!


ఈ ఏటికివాళ ఆఖరి కార్తీకసోమవారం. ఏ పద్యాలతో యీ పరంపర ముగిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తే చాలా పద్యాలే కనిపించాయి. తెలుగు కావ్యాలలో, శతకాలలో, శివస్తుతికి కరువు లేదు! ఆనాటి నన్నెచోడుని కుమారసంభవం నుండి, ఈ నాటి శ్రీరామలింగేశ్వర శతకం దాకా ఎన్నో ఉన్నాయి. కాని అయ్యవారి స్మరణ అమ్మవారు లేకుండా సంపుర్ణం కాదనిపించింది. అసలు వారిద్దరికీ ఎడమే లేదు కదా. అంచేత అర్ధనారీశ్వర రూపాన్ని తలచుకొని మంగళాంతం చేయడం సబబనిపించింది. కానీ ఆ రూపాన్ని వర్ణించే, స్తుతించే పద్యాలేవన్నా మన సారస్వతంలో కనిపిస్తాయేమోనని ఆలోచిస్తే, ఏవీ తట్టలేదు. పెద్దనగారి "అంకము జేరి" పద్యంలో ఉన్నది అర్ధనారీశ్వరుడే అయినా, అందులో ప్రధాన వస్తువు అది కాదు. కొంత వెతికితే కుమారసంభవంలో ఒక పద్యం కనిపించింది, కాని అది పెద్దగా తృప్తినివ్వ లేదు (మంచి పద్యం ఎవరికైనా తెలిస్తే యిక్కడ తప్పక పంచుకోండి). ఆదిశంకరుల అర్ధనారీశ్వర స్త్రోత్రం మాత్రం మేరునగంలాగ కళ్ళెదుట కనిపించింది. కాని అది సంస్కృతమాయె! అంచేత ఆ స్తోత్రాన్ని మాతృకగా తీసుకొని తెలుగులో ఒక సీసమాలిక రచించాను. అది యిది:

ఒకవంక సంపెంగ యొకవంక కప్పురం
బైన మైచాయతో నలరు మూర్తి
నొకవంక ధమ్మిల్ల మొకవంక జూటమ్ము
నై యొప్పు కొప్పుతో నలరు మూర్తి
నొకవంక కఱిమబ్బు లొకవంక కెంపుమిం
చుల బోలు కురులతో నలరు మూర్తి
నొకవంక నిడుకల్వ యొకవంక విరిదమ్మి
యగు కన్నుగవతోడ నలరు మూర్తి
నొకవంక పూవులు నొకవంక పునుకలు
నలక గళమ్ముల నలరు మూర్తి
నొకవంక ఝణఝణ లొకవంక బుసబుస
లందెలరవళుల నలరు మూర్తి
నొకవంక కస్తూరి యొకవంక చితిబూది
యలదిన మేనితో నలరు మూర్తి
నొకవంక ప్రకృతియు నొకవంక వికృతియు
నమరు నాకృతితోడ నలరు మూర్తి

లాస్యతాండవకేళీ విలాసములను
సృష్టి లయములు లీలగ జేయు మూర్తి
నేకతమ నిరీశ్వర నిఖిలేశ్వరమ్ము
నైన తత్త్వముతో నలరారు మూర్తి
నఖిల జగతికి తలిదండ్రియైన మూర్తి
నాదిశంకర విదిత మహద్విభూతి
నాత్మ భావింతు నిరతమ్ము నర్చసేతు
భక్తి స్మరియింతును శివశ్శివా యటంచు!

ఆ ఆదిదంపతులది భలే అన్యోన్యమైన కలయిక. వాళ్ళ పేర్లు కూడా ఒకటే! "శివః" అంటే అయ్య, "శివా" అంటే అమ్మ! అందుకు "శివశ్శివా" అని స్మరించడం. అంత సామ్యం ఉన్న వాళ్ళిద్దరూ మళ్ళీ అంత అసామాన్యులు కూడాను! పైపై వేషాల మాట అటుంచి, తత్త్వతః కూడా ఎదురెదురు స్వభావాల వారు. ఒకరి కన్ను నిడువైన కలువ, మరొకరిది విప్పారిన తామర. అంటే ఒకరు రాత్రికీ మరొకరు పగటికీ ప్రతినిధులు. ఒకరు ప్రకృతి, మరొకరు వికృతి. ఒకరిది లాస్యసృష్టి, మరొకరిది విలయ తాండవము. ఇంతటి వైవిధ్యమున్న రెండు శక్తులు ఒకటి కావడమే సృష్టిలోని వింత. నిజానికి ఒకటే శక్తి యిలా రెండుగా కనిపిస్తోందన్నది అద్వైత సిద్ధాంతం. నిరాకార నిర్గుణ శక్తికి ఒక రూపాన్ని భావించడంలో, అద్వైతం ఈ అర్ధనారీశ్వర రూపాన్ని దాటి యింకా ముందుకుపోతుంది. అర్ధనారీశ్వర మూర్తి ఒకటే అయినా, అందులో శివ శక్తి రూపాలు భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి తేడాకూడా లేని, తెలియని రూపం మరొకటి ఉంది. అది లలితాదేవి! సౌందర్యలహరిలో ఆ రూపాన్ని ఆదిశంకరులు యిలా వర్ణిస్తారు:

త్వయా హృత్వా వామం వపు రపరితృప్తేన మనసా
శరీరార్ధం శంభో రపరమపి శంకే హృతమభూత్
యదేతత్ త్వద్రూపం సకల మరుణాభం త్రినయనమ్ 
కుచాభ్యా మానమ్రం కుటిలశశిచూడాల మకుటమ్ 

అమ్మా! నీ రూపం మొత్తం అరుణకాంతులతో వెలుగుతోంది (ఇది గౌరీదేవి రంగు). కాని నీకు మూడు కన్నులున్నాయి (ఇది శివుని రూపు). కుచభారంతో వంగిన శరీరమూ (పార్వతి రూపు), పైన జడలో నెలవంకా (శివుని రూపం) ఉన్నాయి నీకు. ఇది చూస్తే ఏమనిపిస్తోందంటే, నువ్వు శివుని వామభాగాన్ని ఆక్రమించడంతో సంతృప్తి పడక ఆ రెండో సగాన్ని కూడా ఆక్రమించినట్టుగా ఉన్నావు.
అదీ అసలు తత్త్వం!

పైకి భార్యాభర్తలు అన్యోన్యంగా చెరిసగమై జీవితాన్ని సాగిస్తున్నట్టు కనిపిస్తే,  దాని అసలు తత్త్వం, భార్యామణి పెత్తనమే - అన్న ధ్వని పై వర్ణనలో స్ఫురిస్తే, అది నా తప్పు కాదు :) అద్వైతాన్నయినా అర్థం చేసుకోవచ్చు కాని అర్ధాంగిని అర్థం చేసుకోలేమని ఊరికే అన్నారా! అందుకే కాబోలు ఆదిశంకరులు రెండవదాని ఊసెత్తకుండా మొదటిదాన్ని నెత్తికెత్తుకున్నారు. :)

ఏది యేమైనప్పటికీ, పరమశివుడు భర్తలకు పరమాదర్శం అనే ఒక మంచి మాటతో ఈ పరంపరకు మంగళాశాసనం పలకుతున్నాను. శుభం!

8 comments:

  1. అనువాదం అద్భుతంగా ఉంది కామేశ్వరరావుగారు! :)

    ReplyDelete
  2. కార్తీక సోమవారం మా జన్మ ధన్యం చేసారండీ భైరవభట్ల గారూ,నిన్న భీమశంకరం లో భవానీ శంకర జ్యోతిర్లింగం అభిషేక దర్శనం ఇవాళ మీ వాచిక దర్శనం. ధన్యవాదాలు

    ReplyDelete
  3. భేషో ! సొగసుగా ఉంది పద్యం !

    ReplyDelete
  4. సి పి బ్రౌన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో "జాతీయ స్థాయి పద్య, గేయ, నాటక రచనల" పోటీలకు ఆహ్వానం పలుకుతున్నాము. వివరాలకోసం దయచే www.cpbrown.org చూడండి

    ReplyDelete
  5. entha chakkati seesam rasina meeru dhanyulu. chadivi nenu kuda dhanyuda nayyanu.

    ReplyDelete
  6. ఆలస్యం గా చూసినా మంచి పద్యాన్ని చదవగాలిగినండు సంతోషంగాఉంది. నమస్సులతో సనత్

    ReplyDelete

  7. పులితోలురెంటెంబు వెలిపట్టుగెంటెంబు, గటిమండలంబున గరిమఁ దనర
    భసితాంగరాగంబు బహుగంధయోగంబు, బాహుమధ్యంబునఁ బరిఢవింప
    శీతాంశునవకాంతి చేమంతిపూబంతి, యుత్తమాంగంబున నొఱపుఁజూప
    గండపెండేరంబు కలితమంజీరంబు, పాదపద్మములందుఁ బ్రతిఘటింప
    నర్ధనారీశ్వరస్వామి యైతనర్చు
    దక్షపురిభీమలింగంబు దయ పొసంగ
    నర్థిఁగల నాకుఁ బ్రత్యక్ష మైనఁ జూచి
    మోద మిగురొత్తఁ బాదాబ్జములకు మ్రొక్కి.
    --రుక్మాంగదచరిత్రము (ఏకాదశీమాహాత్మ్యము) - ప్రౌఢకవి మల్లన (1.29)

    మిన్నుపైఁ బాఱువెల్లి ముత్యఁపుజల్లి, చలువల బచ్చు చెంగలువకచ్చు
    పుఱియల చౌకీలు పొలుపైన తడపాలు, పన్నగ విసరమ్ము బన్నసరము
    బలుకుల బూది క్రొవ్వలపుల జవ్వాది, వేలిమి మెకము పిసాళి శుకము
    చాఱలరెంటెంబు సన్నంపుగింటెంబు, భాను పండులచాలు పసిఁడినూలు
    జముని శిరమును మణినూపురమును మెఱయ
    మురువు గలిగిన తొడుకు వాపురము నెక్కి
    కరుణ నయనాంబుజంబులఁ గడలు కొనఁగ
    నెదుటఁ గనుపట్టె నర్ధనారీశ్వరుండు.
    --వరాహపురాణము - నంది మల్లయ, ఘంట సింగయ (9.88)

    గడితంపుమువ్వన్నె కడిఁదిదుప్పటియును, బసమీఱుబంగారుపట్టుచేల
    రుచిరాభినవచారురుద్రాక్షమాలికల్‌, మురువైసహురుమంజిముత్తెసరులు
    భువనాభిరామవిభూత్యంగరాగంబు, సారకాశ్మీరపటీరచర్చ
    భూరిశోభాకీర్ణభుజగభూషణములు, మణిమయతపనీయమండనములు
    పాండురారుణవర్ణవిభ్రాజమాన
    గాత్రమును గల్గి శృంగారగరిమ నలరు
    నర్ధనారీశ్వరేశ్వరుఁ డభవుఁ డిందు
    మౌళిభక్తాళిననయంబు మనుచుచుండు.
    --శివలీలావిలాసము - కూచిమంచి తిమ్మకవి (2.191)

    శార్దూలచర్మంబు మార్దవచేలంబు, భూతియుఁ గస్తూరి పొలుపుమిగుల
    బాములహారము ల్పద్మారిఖండంబు, సీమంతరేఖయుఁ జెలువుదనర
    మిన్నేటినటనయు మేలిమిసేసయు, ఫణికుండలము దంతపత్రికయును
    సూక్ష్మస్తనంబు విస్ఫురితకుచంబును, మహనీయసౌందర్యమహిమ లలర
    నర్ధనారీశ్వరాకృతి నమరఁ దాల్చి
    పరఁగ శూలాంకుశాభయవరదహస్త
    సరసిజాతుం డగుచు మించి సదమలమతిం
    జారు తేజోమయుం డైనశంకరుండు.
    --వైశ్యపురాణము - భాస్కరాచార్య (2.44)

    ReplyDelete
  8. శాయిగారు,
    అహాహా, ఎన్ని సొగసైన పద్యాలు! మీకు అనేకానేక కృతజ్ఞతలు. నమస్సులు.

    ReplyDelete