తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, December 3, 2012

ముక్కంటి! నా కింక దిక్కెవ్వరయ్య?


భక్తి అనేది చాలా విచిత్రమైనది. అది మనిషిని పూర్తిగా పరవశుణ్ణి చేస్తుంది. నిజమైన భక్తిలో ఆర్తి, వేదన, తపన, అమితమైన అనురాగమూ - యిలా ఎన్నెన్నో భావాలు పెనవేసుకుపోయి ఉంటాయి. ఈ కాలంలో అన్నిటితో పాటు భక్తికూడా కలుషితమైపోయింది కాని, పూర్వకాలంలోని భక్తుల కథలు చదివినా విన్నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది! గాఢభక్తికీ, మూఢభక్తికీ తేడా చెప్పడం కష్టమే! అయినా భక్తికుండే శక్తి చాలా గొప్పదని అనిపిస్తుంది, వారి కథలు చదివితే. అలాంటి ఒక వీర భక్తాగ్రేసరుడు రుద్రపశుపతి. ఇతనిది చాలా ఆసక్తికరమైన కథ!

తన పేరుకు తగ్గట్టే, రుద్రపశుపతి శివునికి పరమభక్తుడు. ఇతనొక రోజు పురాణం వింటూ ఉంటే అందులో క్షీరసాగర మథనం కథ వచ్చింది. అది చెపుతున్న పౌరాణికుడు ఆ పాలసంద్రంనుండి పుట్టిన కాలకూటవిషాన్ని శివుడు మింగాడని చెప్పాడట. అంతే!

ఆ రుద్రపశుపతి యాలించి, "భర్గు
డారగించుట నిక్కమా విషం" బనుడు

"ఏమిటి? శివుడు నిజంగా విషం తిన్నాడా!" అని అడిగాడట రుద్రపశుపతి. దానికా కథకుడు, "అవును నిజంగానే మింగాడు. అందులో అనుమానమేముంది?" అన్నాడట. అప్పుడు,

విని యుల్కిపడి వీపు విఱిగి "హా! చెడితి!"
నని, నేలబడి పొర్లి "యక్కటా! నిన్ను
వెఱ్ఱి జేసిరిగాక విశ్వేశ! యెట్టి
వెఱ్ఱివారైనను విషము ద్రావుదురె?
బ్రదుకుదురె? విషమ్ము పాలైన వార?
లిది యెట్టు వినవచ్చు ; నేమి సేయుదును?
నిక్క మెవ్విధమునె నిన్నెకా కెఱుగ;
ముక్కంటి! నా కింక దిక్కెవ్వరయ్య?
నా కొఱకైన బినాకి ! యివ్విషము
చేకొన కుమియవే నీకు మ్రొక్కెదను;
గటకటా ! మేన సగంబున నుండి
యెట వోయితవ్వ ! నీ వెఱు గవే గౌరి !

శివుడు విషం తాగాడన్న వార్త విని తట్టుకోలేకపోయాడు వెఱ్ఱి భక్తుడైన రుద్రపశుపతి. నేలపై పడిపోయి పొర్లుతూ శోకాలందుకున్నాడు. పైగా "అందరూ కలిపి నిన్ను వెఱ్ఱివాణ్ణి చేసేశారయ్యా శివయ్యా!" అని కూడా అన్నాడు! "ఇంక నేనేమి చేసేదిరా దేవుడా! నువ్వు తప్ప నాకు వేరే దిక్కు లేదే! అలాంటి నువ్వు విషం పుచ్చుకుంటే, నేనేమైపోవాలి. నీకు దండంపెడతాను, నాకోసమైనా ఆ తాగిన విషాన్ని కక్కెయ్యి!" అని విలపించాడు. "అవ్వా! నువ్వతని మేనిలో సగమున్నావే. అతను విషం తాగుతూంటే నువ్వేం చేస్తున్నావు తల్లీ" అని రోదించాడు. ప్రమథ గణాలనూ, ఇతర శివగణాలైన శతరుద్రులనూ, అసంఖ్యాతులనూ, వీరభద్రుణ్ణీ, అందరినీ నిలదీసి అడిగాడు. ఆఖరుకి ఇలా అంటాడు:

తల్లిలేని ప్రజల దలతురే యొరులు?
తల్లి యున్న విషము ద్రావ నేలిచ్చు !

తల్లిలేని వాడు కాబట్టి అతని గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. శివునికే ఒక తల్లంటూ ఉంటే అతడిని విషం తాగనిచ్చేదా అని వాపోతాడు! చివరకు, ఆ ఘోరాన్ని భరించలేక ఆత్మహత్యకు సిద్ధపడి సముద్రంలోకి దూకేస్తాడు. అప్పుడా రుద్రపతిని కాపాడి, శంకరుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమవుతాడు. అతని భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకోమంటాడు. ముగ్ధభక్తి మూర్తీభవించిన ఆ రుద్రపశుపతి, "నాకేమీ వద్దు. నీకేం ప్రమాదం ముంచుకొస్తుందో! నువ్వు మింగిన ఆ కాలకూటాన్ని గబుక్కున బయటకు ఉమ్మేయ్. అదే చాలు" అని కోరుకుంటాడు. అతని మాటలకు శివుడు నవ్వి, "ఆ కాలకూటం నా కంఠంలో అణుమాత్రంగా చిక్కుకొని ఉంది. దానికోసం నువ్వింత దుఃఖపడనక్కరలేదు. అది నన్నేమీ చెయ్యదు" అని భరోసా పలుకుతాడు. అయినా రుద్రపశుపతి నమ్మడు. "అయితే నన్ను చావనీయి. లేకపోతే నువ్వు మింగిన విషం బయటకి కక్కు" అని పంతం పడతాడు! అప్పుడు:

"నుమియ కుండిన జచ్చునో ముగ్ఢ" యనుచు
నుమబోటి యాత్మలో నుత్తలపడగ
"నుమిసిన గొని కాల్చునో తమ్ము" ననుచు
గమలాక్ష ముఖ్యులు గడగడ వడక
బ్రమధు లాతని ముగ్ధభక్తికి మెచ్చి
యమిత మహోత్సవులై చూచుచుండ
నొక్కింత నవ్వుచు నుడురాజధరుడు
గ్రక్కున లేనెత్తి కౌగిట జేర్చి,
"ప్రమధుల యాన నీ పాదంబులాన
సమయ నివ్విషమున సత్య మిట్లనిన
నమ్మవే వలపలి నాతొడ యెక్కి
నెమ్మి జూచుచునుండు నీలకంఠంబు"
నని యూరుపీఠంబునందు ధరించె
మును గుఱియున్నదే ముగ్ధత్వమునకు
నదిగాక కుత్తుక హాలాహలంబు
కదలినంతటనే చచ్చెద గాక ! యనుచు
దనకరవాలు ఱొమ్మున దూసి మోపి
కొని కుత్తుకయ చూచుచును ఱెప్ప లిడక
పశుపతి తొడమీద బాయక రుద్ర
పశుపతి నేడును బాయకున్నాడు.

విషం ఉమ్మకపోతే పాపం ఆ వెఱ్ఱివాడు చస్తాడు కాబోలని పార్వతీదేవి లోపల కలత చెందుతోంది. ఎక్కడ బయటకి ఉమ్మేస్తే తమనందరినీ కాల్చేస్తుందోనని విష్ణుమూర్తి మొదలైన దేవతలందరూ గడగడా వణుకుతున్నారు. రుద్రపశుపతి ముగ్ధభక్తికి మెచ్చి ప్రమథులు మహోత్సాహులై చూస్తున్నారు! అప్పుడు శివుడు నవ్వి, రుద్రపతిని తన తొడమీదకి ఎక్కించుకొని, "చూడు, గరళం నా కంఠంలోనే ఉంది. నీ పాదాలమీద ఒట్టు, ప్రమథగణాలమీద ఒట్టు. అది నన్నేమీ చెయ్యదు. కావలిస్తే అలాగే చూస్తూ ఉండు" అన్నాడట. "సరే చూస్తాను, అది కాని నీ గొంతు దిగిందా! నేను కత్తితో పొడుచుకు చస్తాను" అని రుద్రపశుపతి కత్తి తన ఱొమ్మున మోపి రెప్ప వెయ్యకుండా ఆ గరళకంఠుని కంఠాన్నే చూస్తూ కూర్చున్నాడట... ఇప్పటికీ కూడా!

ముగ్ధభక్తికి ఇంతకన్నా తార్కాణం మరొకటి ఉంటుందా! ఈ కథ పాల్కురికి సోమనాథుడు రచించిన బసవపురాణం లోనిది. దేశి ఛందస్సయిన ద్విపదలో, తేలిక భాషలో చేసిన రచన యిది. పదకొండు పన్నెండు శతాబ్దాల కాలంలో, ప్రధానంగా కన్నడ దేశంలో, వీరశైవం విజృంభించింది. దీనికి మూలకారకుడు బసవేశ్వరుడు. ఇతడు మహాభక్తుడు, ప్రవక్త, సంస్కర్త. బిజ్జల మహారాజుకి ప్రధానిగా కూడా ఉన్నాడు. ఇతడు సాక్షాత్తూ నంది అవతారమేనని వీరశైవులు భావిస్తారు. ఇతని కథనే పాల్కురికి సోమనాథుడు బసవపురాణంగా రచించాడు. ఈ పురాణంలో ఒక్క బసవునిదే కాక అనేకమంది శివభక్తుల కథలున్నాయి. ఆ కథలన్నీ ఇంచుమించు అద్భుత రసపోషకాలే!

ఈ కథ మొదట్లో బసవుని భక్తి గురించి, నాలుగు వాక్యాలాలో, గొప్ప కవితాత్మకంగా చెపుతాడు పాల్కురికి సోమన:

వడిబాఱు జలమున కొడలెల్ల గాళ్ళు
వడిగాలు చిచ్చున కొడలెల్ల నోళ్ళు
వడివీచు గాడ్పున కొడలెల్ల దలలు
వడిజేయు బసవన కొడలెల్ల భక్తి!

7 comments:

  1. వరుసగా కార్తీక సోమవారాలు ఈశ్వరధ్యానం చేసి చేయిస్తున్నారు.

    ReplyDelete

  2. వడిబాఱు జలమున కొడలెల్ల గాళ్ళు
    వడిగాలు చిచ్చున కొడలెల్ల నోళ్ళు
    వడివీచు గాడ్పున కొడలెల్ల దలలు
    వడిజేయు బసవన కొడలెల్ల భక్తి! - మొదటి మూడూ చుట్టుముట్టే తీరులోనే నాలుగోదీ నను ముంచెత్తడం.. తప్పించుకోలేని అశక్తతతో నేనందులో మునిగిపోవడం... ఊహించుకుని అనందించవచ్చు కానీ వర్ణించడమెలా?

    ReplyDelete
  3. మంచి కథను, మంచి భక్తిని, మంచి భావనను చాలా బాగా ఉటంకించారు కామేశ్వర రావుగారు, ధన్యవాదాలు

    నేను కుడా ఇంచుమించు అదే అమాయకత్వం తో కొన్ని పద్యాలు వ్రాసా.. "బాల శివుడు - కంప్లైంటు" అనే టపాలో.. ఆ భావాలను మరల పరికిన్చేలా అద్భుతంగా ఉన్నది మీ ఉంది మీ టపా..

    ReplyDelete
  4. అద్భుతంగా ఉందండి. ధన్యవదాలు!!

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. ధన్యవాదములు .

    ReplyDelete
  7. Adbutaha.telugu typing leka eng lo pettanu

    ReplyDelete