తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, February 5, 2010

చంద్రునికో నూలుపోగు

కిందటి టపాలో నా పద్యంలో, చంద్రబింబాన్ని అలసి వెలవెలబోతున్న సూర్యుని ప్రతిబింబంగా వర్ణించడాన్ని ఆ చంద్రుని తరఫున చంద్రమోహన్ గారు తీవ్రంగా ఖండించారు :-) అదీ పద్యంలో! పైగా నేను చంద్రునిపై మంచి పద్యాన్ని వ్రాస్తే గానీ వారి మనోభావాలు శాంతించవని కూడా హెచ్చరించారు! తమ పేరింటివారి మీద ఆ మాత్రం అభిమానం సహజమే. కాని వారి కోరిక విని నా గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఎందుకంటే మన కావ్యాలలో అందరికన్నా ఎక్కువగా, అందంగా వర్ణించబడింది బహుశా చంద్రుడే! అలాంటి చంద్రునిపై పద్యం వ్రాయాలంటే మాటలా?

చంద్రుని మీద పద్యం అనగానే నాకు గుర్తుకువచ్చిన పద్యం పెద్దన మనుచరిత్రలోనిది. చంద్రుని గురించి అంత అందమైన పద్యం మరొకటుందా అనిపించేంత చక్కని పద్యమది.

కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నెవెట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు

నతడు వొగడొందు మధుకైటభారి మఱది
కళల నెలవగువాడు చుక్కలకు ఱేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగులదొర జోడు రేవెలుంగు

"కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి కడుపార నెవ్వాని కన్నతల్లి" - స్థూలంగా చూస్తే, "పాలసముద్రమునుంచి పుట్టినవాడు ఎవడో అతడు" అని అర్థం, అంతే! ఇందులో కవిత్వమేముంది? అని పెదవి విరిచేస్తే ఏమీ లేదు! సూక్ష్మంగా పరికిస్తే చాలా ఉంది. ఈ పద్యం మనుచరిత్ర ప్రారంభంలో కృతిభర్త వంశ వర్ణనలో వచ్చే మొట్టమొదటి పద్యం. మనుచరిత్ర కృతిభర్త మరెవరో కాదు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. అతని వంశాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు పెద్దన్న. కృష్ణదేవరాయలు తుళు వంశానికి చెందిన రాజు. ఈ తుళువంశం చంద్రవంశం. అంటే ఈ వంశానికి ఆదిపురుషుడు చంద్రుడన్న మాట! ఆ చంద్రుని వర్ణనతో ఆ వంశ ప్రశంసని ప్రారంభించాడు. పెద్దనకి కృష్ణదేవరాయలపైనున్న అభిమానం అంతా ఇంతా కాదు! అలాంటి రాయల వంశ మూలపురుషుణ్ణి వర్ణించడమంటే పెద్దనగారి మనసులో ఉత్సాహం ఉప్పొంగి ఉండాలి. అందుకే ఇలాంటి పద్యం జాలువారింది. అసలీ పద్యంలో స్వయానా ఆ రాయలనే కీర్తిస్తున్నాడా అనికూడా నాకు అనిపిస్తుంది.

సీస పద్యం ఒకో పాదంలోనూ చంద్రుని ఒకో గొప్పతనాన్ని వర్ణించాడు. చంద్రుని వంశోన్నతిని చాటుతున్నది మొదటిపాదం. అయితే ఇందులో మంచి చమత్కారాన్ని చేశాడు పెద్దన. చంద్రుడు ఫలానా పాలసముద్రపు కొడుకు అని అన్నాడా? లేదు! కలశపాథోరాశి అంటే పాలసముద్రం. ఆ పాలసముద్రం మధ్యలోనున్న, "వీచి మతల్లి". మతల్లి అంటే శ్రేష్ఠమైన లేద గొప్ప అని అర్థం. వీచి అంటే అల. వీచిమతల్లి అంటే ఒక గొప్ప/పెద్ద అల. పాలసముద్రం మధ్యనున్న ఒక గొప్ప అల ఎవని కన్నతల్లో అతను చంద్రుడుట! సముద్రుణ్ణి మగవానిగా, చంద్రుడు లక్ష్మీదేవి మొదలైనవాళ్ళకి తండ్రిగా చెప్పడం సాధారణమైన విషయం. కాని ఇక్కడ తల్లిని కూడా తీసుకువచ్చాడు పెద్దన. పాల సముద్రాన్ని చిలికినప్పుడు మధ్యలో తరంగాలు ఏర్పడి ఉంటాయి కదా. అలాంటి ఒక ఉన్నతమైన, ఉత్తుంగమైన తరంగంనుంచి ఉద్భవించాడట చంద్రుడు. అంతే కదా మరి! ఉన్నట్టుండి అలా సముద్రంలోంచి హఠాత్తుగా పుట్టలేదు కదా చంద్రుడు. సముద్రాన్ని మథించినప్పుడు, అందులోంచి పుట్టిన అలల నురగ గడ్డగట్టి, ఆ మథన వేగానికి పైకి కొట్టబడి చంద్రుడు ఉద్భవించి ఉండాలి. ఇంత కథనీ గుర్తుచేస్తూ చంద్రుని పుట్టుక ఎంత గొప్పదో ధ్వనింపజేస్తోంది ఈ వర్ణన. పదాల పొందిక సరేసరి!

"అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు వన్నెవెట్టు ననార్తవంపు పువ్వు" - మళ్ళీ ఆ పదాల పొహళింపు చూడండి! తెలుగుభాషలోని అనుప్రాస సౌందర్యమంతా మొదటి మూడు పదాలలోనూ నింపేసాడు! అనలాక్షుడంటే నిప్పుకంటివాడు, శివుడు. అతని ఘనమైన జడలనే తోటకి వెన్నె తెచ్చే పువ్వుట చంద్రుడు. పైగా అలాంటిలాంటి పువ్వుకూడా కాదు. అనావర్తవంపు పువ్వు. అంటే అన్ని ఋతువులలోనూ కూడా పూసేపువ్వని అర్థం. ఏ ఋతువులోనైనా చందమామ ఆకాశంలో అలా వెలుగుతూనే ఉంటాడు కదా! పైగా మనకంటే ఒక పదిహేను రోజులు క్షీణిస్తున్నట్టు కనిపిస్తాడు కాని శివుని జటాజూటంలో ఎప్పుడూ వెన్నెలలు చిలికిస్తూనే ఉంటాడాయె. ఈ పాదంలో చంద్రుని ఔన్నత్యం, నిరంతర వైభోగం ధ్వనింపజేసాడు పెద్దన. అంతటి ఔన్నత్యం వైభోగం రాయలకి మాత్రం లేవా?

"సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు పుట్టుగానని మేని మెట్టపంట" - ఈ పాదంలో చంద్రుని సంపన్నత, దాతృగుణం వర్ణింపబడ్డాయి. సకల దేవతల ఆకలినీ కూడా తీర్చే మెట్టపంట చంద్రుడు. చంద్రుడు కురిపించే సుధ/అమృతం దేవతల ఆహారం కదా. పైగా అతనిది "పుట్టుగానని మేను". అంటే ఆ మెట్టపంట ఎవరూ నాటకుండానే స్వతస్సిద్ధంగా పండినదన్న మాట. అంచేత ఇది కూడా ఋతుసంబంధి కాదు. నిరంతరం ఆహారాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది.

"కటికిచీకటి తిండి కరముల గిలిగింత నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు" - ఇందులో చంద్రుని సరసత్వం వర్ణించాడు పెద్దన. కటికచీకటిని తినే చేతుల గిలిగింతతో, తొగ కన్నెని - అంటే కలువ కన్నెని, నవ్విస్తాడు చంద్రుడు. చంద్రకిరణాలు చీకటిని హరించి కలువకన్నెకి ఆనందాన్ని కలిగిస్తాయని భావం. ఇందులో "కటికి చీకటితిండి కరములు" అన్న సమాసం దుష్టసమాసం. పైగా విచిత్రమైన ప్రయోగం కూడాను! కటికచీకటిని తినే చేతులు అని చంద్రకిరణాలని వర్ణించడంలో మరి వేరే ఉద్దేశం కూడా ఏమైనా ఉందేమో నాకు తెలీదు.

"నతడు వొగడొందు మధుకైటభారి మఱది" - పైన చెప్పిన గొప్పతనమున్న చంద్రుడు స్వయానా మధుకైటభారి మఱది, అంటే విష్ణువు బావమఱది. బంధుత్వంలో కూడా చంద్రుని గొప్పతనాన్ని చెపుతున్నాడిక్కడ. "కళల నెలవగువాడు" - పదహారు కళలకి నెలవైనవాడు. రాయల కళావైదుష్యం ఇక్కడ ధ్వనిస్తోంది. చుక్కలకు రాజు. చంద్రుని/రాయల దక్షిణ నాయకత్వం స్ఫురిస్తోందిక్కడ. "మిసిమి పరసీమ" - మిసిమి అంటే మిలమిలా మెరిసిపోయే కాంతి. దానికి పైహద్దు చంద్రుడు. అంటే అంతకన్నా మెరిసే కాంతి మరెవ్వరికీ లేదని. ఇది రాయల కీర్తిని ధ్వనిస్తోంది. కీర్తిని వెలుగుతో పోల్చడం కవిసమయం. "వలరాజు మేనమామ" - మన్మథునికి స్వయానా మేనమామ. అంటే మన్మథుని అందమంతా ఇతనిలోనూ ఉందని అనుకోవచ్చు. ఇది కృష్ణరాయల సౌందర్యాన్ని ధ్వనిస్తోంది. "వేవెలుంగులదొర జోడు రేవెలుంగు" - వేయి వెలుగులున్న ఆ సూర్యునికి సరిజోడు, ఇతను రాత్రి వెలుగేవాడు అని. అంటే చంద్రవంశం సూర్యవంశానికి ఏమాత్రం తీసిపోని సరిజోడు అని అర్థం వస్తుంది.

ఇంతకన్నా అందంగా సమగ్రంగా చంద్రుణ్ణి మరెవరైనా వర్ణించారేమో నాకైతే తెలియదు. అలా చేస్తూ, కృష్ణరాయల గొప్పతనాన్ని కూడా ధ్వనింపజెయ్యడం పెద్దన ధురీణత. అతనికి రాయలమీదనున్న అభిమానానికి నిదర్శనం. ఈ "కలశపాథోరాశి" అనే ఎత్తుగడకి ప్రేరణ బహుశా క్రీడాభిరామంలో పద్యం అయ్యుండవచ్చు. ఆ పద్యం కూడా చంద్రస్తుతే.

చంద్రునిపై ఇంత పెద్ద పద్యం, ఇంత అందమైన పద్యం గురించి వివరించినా చంద్రమోహన్ గారు శాంతిస్తారని నమ్మకం లేదు :-) నన్ను స్వయంగా ఒక పద్యం వ్రాయమని ఆదేశీంచారు కదా! అంచేత ఆ చంద్రునికో నూలుపోగుగా నేనూ ఒక పద్యాన్ని ప్రయత్నించాను:

స్నేహరసార్ద్రయౌ జనని నిత్యము తండ్రి రుషాకషాయతన్
దా హృది నింకజేసుకు సుధామయ ప్రేమను జిల్కునట్లుగా
దాహకరోష్ణ తీక్ష్ణ కరధారను చల్లని వెన్నెలేరుగా
మోహన చంద్రబింబమ! అమోఘముగా ప్రసరింపజేతువే!

21 comments:

 1. అలసిన సూర్యుడి ప్రతిబింబమని వర్ణించటమూ బావుంది. అంతకన్న చంద్రుని నిజధర్మాన్ని వుటంకిస్తూ ఇప్పుడు చెప్పిన పద్యం ఎంతో బావుందండి. చంద్రమోహన్ గారి పేరూ వచ్చిందే.

  ReplyDelete
 2. కామేశ్వర రావు గారూ,

  నమస్సుమాంజలులు! మీనుండి ఇంత చక్కని పద్యం రాబట్టగలిగినందుకు చాలా గర్వంగా ఉందనుకోండి. మరెంతో ఆనందంగా కూడా! తండ్రి కోపాలను తనలో దాచుకొని పిల్లలపై ప్రేమానురాగాలను కురిపించే తల్లితో చంద్రుని పోల్చడం అమోఘంగానే ఉంది.

  మీరు వర్షించిన రసోల్లాస భావనా మకరంద సింధువులో తడిచి నా మనోభావాలు పూర్తిగా శాంతించాయిప్పుడు :)

  ReplyDelete
 3. పెద్దన గారు పద్యం కూడా చాలా బాగుంది. మను చరిత్రలో ఇంత మంచి పద్యం దాగుందా అని ఇప్పుడే వెదికి చదివాను మళ్ళీ. మీ వివరణ లేకుంటే అందులోని రమ్యత స్ఫురించేది కాదేమో! అందుకే ఇంతకు ముందు ఈ పద్యం కంటికానలేదు.

  చీకటి తిండి కరములు... కరములకు చేతులని కాక, కిరణాలనే అనుకుంటే అంత అనౌచిత్యంగా అనిపించదేమో. కిరణాలు ఎదురొచ్చిన చీకటిని తినేసి మాయంచేసేస్తూ వెలుగులు నింపుతాయి అన్ని భావం మేలుగా ఉంది.

  ReplyDelete
 4. బాగుంది. వీలైతే శరత్కాలంలో చంద్రుడి గురించికూడా ఒక పద్యం వ్రాయండి.

  ~సూర్యుడు

  ReplyDelete
 5. స్నేహరసార్ద్రయౌ జనని? స్నేహరసార్ద్రమౌ దాహకరూష్ణతీక్ష్ణకరధార?

  దాహకరూష్ణ ??

  ReplyDelete
 6. మందాకినిగారు, సూర్యుడుగారు, నెనరులు.

  సూర్యుడుగారు, శరత్కాలపు చంద్రుని గురించి ఎన్నో వర్ణనలున్నాయి కావ్యాలలో. వీలువెంబడి కొన్నిటిని వివరిస్తాను.

  చంద్రమోహన్ గారు,
  మీ కోపం ఉపశమించినందుకు సంతోషం :-) ఒక కొత్త (అనే అనుకుంటున్నాను)ఊహతో పద్యం వ్రాసేందుకు స్ఫూర్తినిచ్చినందుకు ఎన్నో కృతజ్ఞతలు.

  అనానిమస్ గారు,
  "స్నేహరసార్ద్రమౌ" అచ్చుతప్పే, సరిచేసాను.
  "దాహకరు + ఉష్ణ తీక్ష్ణ కర ధార" - దాహకరుడు అంటే సూర్యుడు - మండుతున్న కిరణాలు కలవాడు. అతని వేడి, వాడి కిరణ ధార అని. ఏమైనా తప్పుందంటారా?

  ReplyDelete
 7. దాహకరూష్ణ అన్నప్పుడు బహుశా ఇలాంటిదే ఏదో (మీరు చెప్పినట్టుగా) అనుకున్నానండీ!

  మీరు ఇలా ఒక తెలుగుప్రత్యయాన్తమైన పదానికీ మఱొక తత్సమ పదానికీ సంస్కృత సంధి చేయడం వల్ల నాకు అర్థం కాలేదండీ. మొదట చదివినప్పుడు, నాకు, భారవేరర్థగౌరవమ్ అన్నట్లుగా కవి చెప్పదలచుకున్న అర్థానికే ప్రధానమైన గౌరవం తీసుకోవలసివచ్చింది ఇక్కడ. (అసందర్భమేమో కానీనండీ, కిరాతార్జునీయంలో చాల చోట్ల వ్యాఖ్యానించడానికి వ్యాకరణపరంగా ఇబ్బంది పడ్డాడట మన మల్లినాథుడు.)

  * * *

  తర్వాత, స్నేహరసార్ద్రమౌ అంటే ఆ పదాన్ని తీసుకువచ్చి అనవసరంగా దాహకరూష్ణతీక్ష్ణకరధారకు అన్వయించుకోవాలీ, అర్థం చెడిపోతోందే అనిపించి ముద్రారాక్షసమేమో అని అడిగానండీ. ఇప్పుడు తీరా చూస్తే అచ్చంగా అది అచ్చుతప్పే అయ్యింది. :)

  * * *

  గమ్మత్తేమిటంటే, మీ ముందరి వ్యాసంలోని పద్యం మాదిరిగానే ఇందులో కూడ సూర్యచంద్రులను ఇరికించారు. బాగుంది. :)

  ReplyDelete
 8. పద్యం, దాని తాత్పర్య వర్ణన చాల బాగుంది. ఇలాంటి ఒక పద్యం గురించి తెలియచేసినందుకు కృతఙ్ఞతలు.

  ReplyDelete
 9. నూలుపోగని చెప్పి ఏకంగా పట్టు ఉత్తరీయమే గప్పారు. మీ పద్యం జూసి చంద్రుడికి ఎక్కడ కళ్లు నెత్తికెక్కుతాయో అని నేను యుద్ధ ప్రాతిపదక మీద ఓ పద్యం రాసి పడేశాను.
  చంద్రుడి పరంగా గతంలో నేనిచ్చిన సమస్య , మీ పూరణలు ఓ సారి గుర్తు చేసుకోనివ్వండి.
  భవదీయుడు
  ఊకదంపుడు

  ReplyDelete
 10. నూలుపోగని చెప్పి ఏకంగా పట్టు ఉత్తరీయమే గప్పారు. మీ పద్యం జూసి చంద్రుడికి ఎక్కడ కళ్లు నెత్తికెక్కుతాయో అని నేను యుద్ధ ప్రాతిపదక మీద ఓ పద్యం రాసి పడేశాను.
  చంద్రుడి పరంగా గతంలో నేనిచ్చిన సమస్య , మీ పూరణలు ఓ సారి గుర్తు చేసుకోనివ్వండి.
  భవదీయుడు
  ఊకదంపుడు

  ReplyDelete
 11. అనానిమస్ గారు,

  మీరన్నది అర్థమయ్యింది. ఇది అచ్చుతప్పు కాదు, అచ్చమైన తప్పే! దాహకరున్ అని వేస్తే తెలుగు ప్రత్యయం "ను" వచ్చి దాహకరునుష్ణ అని సంధి చేసుకోవాలి. దాహకర ఉష్ణ తీక్ష్ణ కరధార అని సిద్ధసమాసం చేసుకుని గుణసంధి చేస్తే సరిపోతుందనుకుంటాను. ఆ రకంగా మార్చాను. తప్పు చూపినందుకు ధన్యవాదాలు. మీరిలా అనామకులుగా ఉండిపోవడం బాగులేదు :-) దయచేసి మీరెవరో చెప్తారా?

  రాజేష్ గారు,
  నెనరులు.

  ఊదంగారు,
  నెనరులు. ఏడాదిన్నర కిందటి పద్యాలని గుర్తుచేసారు! మళ్ళీ అవన్నీ చదివి ఆనందించాను. మీ సీసం గురించి అక్కడే మాట్లాడతాను :-)

  ReplyDelete
 12. మీర లెఱుంగువాఁడనె సుమీ సిరిఁ గూడిన సూర్యవంశ్యరా
  డ్ఢీరుని రోచి నామకుఁడ నిప్పుడు నుంటి ననానిమస్సుగన్ :)

  ReplyDelete
 13. అనానిమస్సు గారి మొదటి వ్యాఖ్యలో అన్ని సార్లు "అండీ" అని చూడగానే కాస్త అర్థమయ్యింది. చాటునుండీ బాణాలెసే విలాసాన్ని స్వనామధేయుల నుండీ గ్రహించారాండీ? :-)

  కాకతాళీయంగా చంద్రుల మీద మొన్నే ఒకట్రెండు చక్కని పద్యాలు చదివానండీ ఈ మధ్యనే. ఓ కర్రకు చివర వస్త్రం చుట్టి సున్నపు నీటిలో ముంచి, ఆకాశానికి వెల్లవేస్తాడట ఒకాయన, ప్రతి ఉదయం పొద్దు లేవగానే. అలా ఆ పని ముగించి, రాత్రవగానే అలసి, ఆ కర్ర చివర ఉన్న సున్నంలో తడిచిన గుడ్డ ముక్కను చుట్టజుట్టి అలా విసిరేశాడట. అలా విసిరేసినాయన చంద్రుడయ్యడుట. (వ్యాఖ్యానం బావోలేకపోతే, అది నా లోపమేనని విన్నవించుకుంటున్నాను).

  ఇంకో వ్యాఖ్యానంలో చంద్రుడిని కాలిన పిడకతో పోల్చాడొకాయన.

  ReplyDelete
 14. శ్రీ సూర్యవంశ్య రాడ్కిరణా :-),

  ఆరయ సంస్కృతాంధ్రముల నంతటి 'ప్రత్యయ'మద్ది మీరలే
  వేఱెవెరంచు నెంచితి ధ్రువీకరణంబును పొందగోరితిన్ :-)

  ఇంతకీ చేసిన మార్పు సరిపోయినట్లేనా? అన్నట్టు మీ రెండవ పాదంలో యతి కుదిరినట్టు లేదు.

  రవి,

  మీరు చెప్పిన వర్ణనలు రెండూ ఇంతకుముందు చదివినట్టుగానే ఉన్నాయి. ఎవరివో గుర్తుకు రావడం లేదు. బహుశా కృష్ణరాయలివో, విశ్వనాథవో అయ్యుండవచ్చు. ఇప్పటికే మీరొక పోస్టు బాకీ ఉన్నారు. ఈ చంద్రుని వర్ణనల గురించి మరో పోస్టు కూడా ఇప్పుడు బాకీ.

  ReplyDelete
 15. నన్ను మీరు అనామకంగా ఉండనిచ్చేలా లేరు! సరే కానివ్వండి. :)

  మీరు చేసిన మార్పూ సరిపోయింది, నా రెండవ పాదంలో యతీ సరసంగా (రాట్+హీరుడు - ప్పుడు) సరిపోయింది. :)

  ReplyDelete
 16. మన్నించాలి, వ్యాఖ్య ప్రచురించాక ఇప్పుడు చూచుకున్నాను! హకార యుక్తమైన ఇకారానికీ, కేవల ఇకారానికీ సరసయతి ఎలా అంటారా! నిజమేనండీ! నేను అసలు సరిగా గమనించనేలేదు! మన పూర్వులు ఏదైనా వెసులుబాటు ఇచ్చారేమో తెలిసేవఱకు, దానిని యతిదోషంగానే తీసుకుందామండీ. నమస్సులు.

  ReplyDelete
 17. ఓ! అది రాడ్ధీరుని అని చదివాను. అందుకే యతి కుదరలేదనుకున్నాను. "హీ"కి "ఇ"కి మహరాజులా కుదురుతుంది సరసయతి! దోషమేమీ లేదు. "హీరుడు" అన్న ప్రయోగం మాత్రం కొత్తగా ఉంది.

  ReplyDelete
 18. రాడ్కిరణ! :)
  రాడ్ధీరుని ... అనే ఉంది కామెంటులో. హీరుడెక్కడినుండొచ్చాడు?

  @ రవి,
  వెల్లవేసిన గుడ్డ, కాలిన పిడక... హుఁ ఎందుకో అందరూ చంద్రుడిమీద కక్ష గట్టారు :)

  ReplyDelete
 19. సునామకా!
  హా!తెలిసెన్ :)

  ReplyDelete
 20. చంద్రమోహన్ గారు,

  అది "రాడ్ఢీరు"డండీ. "డ" కింద "ఢ" వత్తు. రాట్ + హీరుడు = రాడ్ఢీరుడు
  జగత్ + హితము = జగద్ధితము అయినట్టుగా.

  ReplyDelete
 21. అద్భుతంగా ఉంది మాష్టారూ. మీరు వివరించకపోతే నాకు సగం కూడా అర్థం అయ్యేది కాదేమో. నెనర్లు.

  --ఇందులో "కటికి చీకటితిండి కరములు" అన్న సమాసం దుష్టసమాసం.--
  ఇది చదివితే మా తాతయ్య చెప్పిన ఒక సందర్భం గుర్తుకొస్తోంది. పెద్దన వారు అమావస నిశికిన్ అని ప్రయోగిస్తే.. దానికి తెనాలి రామకృష్ణ కవి "ఎమి తిని సెబితివి కవితము ఎరిపుచ కాయ తిని .... అమవస నిసికిన్ అనుమాట అలసని పెదన" అని మొత్తం వత్తులు తీసేసి దుష్ట ప్రయోగాలాతో చురక వేస్తూ ప్రశ్నించారని.

  మరి ఇది ఏదన్న సినిమాలో కూడా ఉందొ ఏమో గుర్తులేదు.

  ReplyDelete