తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, February 17, 2010

చుక్క గుర్తు పద్యాలు!

రమణగారు తన "చిన్ననాటి తెలుగు పద్యాలు" పోస్టుతో నన్ను మళ్ళీ నా చిన్నప్పటి స్కూలు బెంచీ మీదకి తీసుకువెళ్ళి కూర్చోపెట్టేసారు! ఎదురుగా మా సుబ్బలక్ష్మీ టీచరు ఖంగుమనే గొంతుతో పాఠం చెపుతూ కనిపించారు, వినిపించారు. అల్లరి పిల్లలనీ, సరిగా చదవని వాళ్ళనీ "దొమ్మరగొండు రాస్కెల్స్" అని తిట్టినా, పాఠం మాత్రం ఆసక్తికరంగా చెప్పేవారు. మా అదృష్టం కొద్దీ ఎనిమిది, తొమ్మొది, రెండేళ్ళూ ఆవిడే మాకు తెలుగు టీచరు. ఆ పాఠాల మహత్వమో, ఆవిడ చెప్పడంలోని గొప్పతనమో కాని, అప్పుడు చదువుకున్న చాలా పద్యాలు మనసులో అలా ఉండిపోయాయి. చిన్నప్పడు కలిసి తిరిగి ఆడుకున్న మిత్రులు పెద్దయ్యాక ఎదురుపడితే ఆ చిన్ననాటి మధుర స్మృతులు అగరొత్తుల సువాసనలా కమ్ముకున్నట్టు, ఆ పద్యాలు అప్పుడప్పుడూ పలకరిస్తూ ఉంటాయి.

రమణగారి టపాతో ఇదిగో మళ్ళీ ఇప్పుడు పలకరించాయి. నేను కూడా వారు చదువుకున్న పాఠాలే చదువుకున్నాను. వారు చెప్పినట్టుగా తొమ్మిదవ తరగతి పుస్తకం చాలా బావుండేది. అందులోనూ అది నాకు మరీ ప్రత్యేకం. మా ముత్తాతగారి కథ "ఎవరు గొప్ప" గద్యభాగంలో ఉండేది. ఆ సంగతి స్నేహితులతోనూ, మా టీచర్ తోనూ చెప్పుకొని పొంగిపోవడం, అదో గొప్ప అనుభూతి. తాతలు తాగిన నేతులని స్వయంగా వాసన చూడ్డం అనవచ్చేమో దీన్ని! :-)

రమణగారిచ్చిన పద్యాలకి, నాకు గుర్తున్నవికూడా కలిపి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. నాకు గుర్తులేని మిగతా పద్యాలు ఇంకెవరికైనా గుర్తుంటే చెప్పండి. అవికూడా కలుపుతాను. ఇవి ఎనిమిది, తొమ్మిది, బహుశా పది క్లాసుల పద్యభాగాలలోని చుక్క గుర్తు పద్యాలు.

ప్రాయోపవేశం
=========

ఇది మహాభారతం అరణ్యపర్వం, ఎఱ్ఱన రచించిన భాగంలోనిది. దుర్యోధనుడు ఘోషయాత్రలో గంధర్వుల చేత పట్టుబడి భీమార్జునుల చేత విడిపించబడి, ఆ అవమానం తట్టుకోలేక ప్రాయోపవేశం చేసి ప్రాణాలు తీసుకుంటాననే సందర్భం.

అక్కట యమ్మహారణమునందు వియచ్చరకోటితోడ బే
రుక్కున బోరి యేను మృతినొందగ నేరన అట్టులైన నీ
తక్కువబాటు లేక ప్రమదంబున దైవపదంబు నొందెడిన్
మిక్కిలియైన కీర్తియును మేదినియందు వెలుంగు నిత్యమై

అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట గల్గినన్ మహా
ర్ణవమది యింకినన్ దివసనాథుడు జంద్రుడు తేజమేదినన్
కువలయనాథ నీకునొక కుత్సితభావము గల్గ నేర్చునే
భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింప శక్యమే

కౌరవనాథ నీకు నుపకారము చేసిరి పాండవేయు ల
వ్వీరులయందు నెయ్యమును వేడ్కయునొప్పగ నీ వభీష్ట స
త్కారము సేత యుక్తమగుగాక ప్రియంపడ నర్హమైనచో
దారుణ శోకవహ్ని పరితాపము బొందుట యిప్డు ధర్మమే

కృతముదలంచి చిత్తమున గిల్బిషమంతయు నుజ్జగించి స
న్మతుల బృథాతనూజుల నమానుషతేజుల బిల్వపంచి తత్
పితృధనమైన రాజ్యము నభీష్టముగా దగనిమ్ము నీకు నీ
క్షితివలయంబునన్ బరమ కీర్తియు బుణ్యము గల్గు భూవరా!

పార్వతి తపస్సు
==========

ఇది శ్రీనాథుడు రచించిన కాశీఖండంలోది. పార్వతీదేవి శివునికోసం తపస్సు చెయ్యబూనడం సందర్భం.

ఎక్కడలేరె వేల్పులు సమీప్స్తిత దాతలు ముద్దుగూన నీ
వెక్కడ ఘోరవీర తపమెక్కడ యీ పటు సాహసిక్యముల్
తక్కు శిరీష పుష్ప మవధాన పరత్వమునన్ మధువ్రతం
బెక్కిన నోర్చునో విహగమెక్కిన నోర్చునొ నిశ్చయింపుమా

భూధర రాజకన్య మణిభూషణముల్ దిగద్రావి యీశ్వరా
రాధన కేళి కౌతుక పరాయణయై ధరియించి బాండు ర
క్షాధృతి పూర్వకంబుగ బ్రగాఢ పయోధరమండలీ సము
త్సేద విశీర్ణ సంహతుల జెల్లు మహీరుహవల్కలంబులన్

రాజధర్మము
========

ఇది మహాభారతం సభాపర్వంలోనిది. నన్నయ్య కృతం. రాజసూయం సందర్భంగా నారదుడు వచ్చి, ధర్మరాజుకి రాజధర్మాన్ని బోధించే ఘట్టం.

కడు జనువాడునై పురుషకారియు దక్షుడునైన మంత్రి పెం
పడఱగ రాజపుత్రుల మహాధనవంతుల జేసి వారితో
నొడబడి పక్షమేర్పడగ నుండడుగా ధనమెట్టివారికిన్
గడుకొని చేయకుండునె జగన్నుత గర్వము దుర్విమోహమున్

ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత బుద్ధి నెఱింగి వారి న
య్యుత్తమ మధ్యమాధమ నియోగములన్ నియమించితే నరేం
ద్రోత్తమ భృత్యుకోటికి ననూనముగా దగు జీవితంబు లా
యత్తము సేసి యిత్తె దయ నయ్యయి కాలము దప్పకుండగన్

వార్తయందు జగము వర్తిల్లుచున్నది
అదియులేని నాడు అఖిల జనులు
అంధకారమగ్ను లగుదురు కావున
వార్త నిర్వహింప వలయు బతికి

రాయబారము
=========

ఇది మహాభారతం ఉద్యోగపర్వంలోని ప్రసిద్ధమైన రాయబార సన్నివేశం. తిక్కన రచన.

జలదస్వన గంభీరత
నెలుగొప్పగ దంతదీప్తు లెసగ ముకుందుం
డలరు చెవుల నఖిల జనం
బులు విన ధృతరాష్ట్ర భూవిభున కిట్లనియెన్

భరతకులంబు ధర్మమును బాడియు సత్యము బొత్తు పెంపునున్
గరుణయు గల్గియుండు ననగా నుతిగన్నది యందు సద్గుణో
త్తరులగు నీవు నీ యనుగు తమ్ముడు నీ తనయుల్ యశోదురం
ధర శుభశీలు రీ సుచరితక్రమ మిప్పుడు దప్పనేటికిన్

వీరునువారు బండితులు విక్రమవంతులు బాహుగర్వ దు
ర్వారులు లోని రిత్తబవరంబున నాఱడి జావబోవ నె
ట్లూరకయుండ్వచ్చు కడునొప్పెడు మేనులు వాడి కైదువుల్
గూరగ నాటినన్ బుడమి కూలుట కక్కట యోర్వవచ్చునే!

సారపు ధర్మమున్ విమలసత్యము బాపముచేత బొంకుచే
పారము బొందలేక చెడబారినదైన యవస్థ దక్షు లె
వ్వారలుపేక్ష సేసి రది వారల చేటగు గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్

ఇందీవరాక్షుని వృత్తాంతం
===============

ఇది అల్లసాని పెద్దన రచించిన స్వారోచిష మనుసంభవం (మనుచరిత్ర) లోనిది. ఇందీవరాక్షుడనే గంధర్వుడు శాపవశాత్తూ రాక్షసుడయిన కథ. శాపవిమోచనం అయ్యాక స్వయంగా తను స్వరోచికి చెప్పేది.

కలడుల్లోక యశఃపురంధ్రి జగతిన్ గంధర్వ వంశంబునన్
నలనాబాహ్వయుడే దదీయ తనయుండన్ బ్రహ్మమిత్రుండు శి
ష్యులకున్ గంటను వత్తిబెట్టుకొని ఆయుర్వేదమోరంత ప్రొ
ద్దుల జెప్పన్ వినుచుండి మానసమునందున్ దజ్జిఘృక్షా రతిన్

నటవిట గాయక గణికా
కుటిల వచశ్శీధు రసము గ్రోలెడు చేవికిన్
గటువీ శాస్త్రము వలది
చ్చట నిను చదివించకున్న జరగదె మాకున్

తండ్రీ నాకు ననుగ్రహింపగదె వైద్యంబంచు బ్రార్ధించినన్
గండ్రల్గా నటులాడి ధీకృతుల పోకాల్మంటి వోహో! మదిన్
దీండ్రల్ గల్గినవాని కేకరణినేనిన్ విద్య రాకుండునే
గుండ్రాడాచిన పెండ్లి యేమిటికి జిక్కున్ గష్టముష్టింపచా!

అనినం గన్నులు జేవురింప నధరంబల్లాడ వ్రేల్లత్పునః
పున రుద్యద్భృకుటీ భుజంగ యుగళీ పూత్కార ఘోరా నిలం
బన నూర్పుల్ నిగుడన్ లలాట ఫలకంబందంద ఘర్మాంబువుల్
జినుకన్ గంతు దిదృక్షు రూక్ష నయన క్ష్వేళా కరాళధ్వనిన్

భాస్కరా!
======

ఇవి భాస్కర శతకంలోని పద్యాలు.

చదువది యెంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా
చదువు నిరర్ధకంబు గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా

ఉరు గుణవంతుడొండు తనకొండపకారము సేయునప్పుడుం
పరహితమే యొనర్చు నొక పట్టునైనను కీడు సేయగా
నెరుగడు నిక్కమే కద యదెట్లన కవ్వము బట్టి యెంతయున్
తరువగ జొచ్చినం పెరుగు తాలిమి నీయదె వెన్న భాస్కరా

ఒక్కడె చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన దా
జక్కనొనర్ప కౌరవులసంఖ్యులు బట్టిన ధేనుకోటులం
జిక్కకనీక తత్ప్రబలసేన ననేక శిలీముఖంబులన్
మొక్కవొడంగ జేసి తుదముట్టడె యొక్క కిరీటి భాస్కరా

బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు గాని యాతడే
బలము తొలంగెనేని తనపాలిట శత్రువదెట్లు పూర్ణుడై
జ్వలనుడు కాన గాల్చుతరి సఖ్యముజూపును వాయుదేవుడా
బలియుడు సూక్ష్మదీపమగు పట్టున నార్పడె గాలి భాస్కరా

దానము సేయగోరిన వదాన్యున కీయగ శక్తిలేనిచో
నైన బరోపకారమునకై యొక దిక్కున దెచ్చియైన నీ
బూనును మేఘుడంబుధికి బోయి జలంబులు దెచ్చి యీయడే
వాన సమస్తజీవులకు వాంఛిత మింపెసలార భాస్కరా!

తనకు ఫలంబు లేదని యెదం దలపోయడు కీర్తి గోరు నా
ఘన గుణశాలి లోకహిత కార్యము మిక్కిలి భారమైన మే
లనుకొని పూను శేషుడు సహస్ర ముఖంబుల గాలి గ్రోలి తా
ననిశము మోవడే మరి మహాభరమైన ధరిత్రి భాస్కరా!

పోతన జిజ్ఞాస
=========

ఇది శ్రీ వానమామలై వరదాచార్యులు రచించిన పోతన చరిత్రములోనిది. ఇది చాలా మంచి ఘట్టం. పోతన వీథి భాగవతం చూస్తూ తనకి కలిగిన సందేహాలని తల్లిని అడుగుతాడు. ఆవిడ ఆ ప్రశ్నలకి గొప్ప తాత్త్వికమైన జవాబులిస్తుంది. పోతన భక్తి తత్త్వాలకి చిన్ననాడే ఎలా బీజాలు పడి ఉంటాయో ఊహించి చెప్పే సన్నివేశం. ఇందులో చివరగా పోతన, దీన్ని వీథి భాగవతం అని ఎందుకంటారని అడుగుతాడు తల్లిని. ఈ కథలు భాగవతంలోనివి కాబట్టి అని జవాబు చెపుతుంది. అయితే నేనా పుస్తకం చదువుతాను ఇమ్మంటాడు. అది సంస్కృతంలో ఉంది నాయనా మనకి అర్థం కాదని అంటుంది. అప్పుడు పోతన, "అయితే నేను పెద్దయ్యాక దాన్ని తెలుగులో వ్రాస్తాను" అంటాడు. దానికి తల్లి ఎంతో మురిసిపోయి "మా తండ్రే, మా నాయనే" అంటుంది!


ఇవ్విధి దివ్విటీల్వెలుగు లేమని బాలుడు పృచ్ఛసేయగా
నవ్వుచు లక్కమాంబ నిజనందను గన్గొని చంద్రసూర్యు లా
దవ్వుల వెల్గనేలయనె దాపున నా తెర యేల యన్నచో
నివ్వటిలుం బయిన్ మసక నీలపునింగి యదేలరా యనెన్

ధీనిదివై సతమ్మఖిల దేవతలొక్కటి యంచు నెంచుచున్
మానసమందుమారమణు మాటికి మాటికి సంస్మరింపనౌ
దా ననలమ్ము వృక్షసముదాయ విభేదము లూడ్చు కైవడిన్
జ్ఞానము రూపభేదము లొకండొనరించు నసంశయాకృతిన్

బుద్ధదేవుని పునరాహ్వానం
================

ఇది కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి రచన. ఎందులోనిదో గుర్తులేదు. ఇందులో పద్యాలు పూర్తిగా గుర్తు లేవు :-(

దయసేయంగదవయ్య శాక్యమునిచంద్రా! నీ పదస్పర్శచే
గయిసేయంగదవయ్య భారతమహీఖండంబు దివ్యత్ కృపా
మయ మందార మరంద బిందు లహరీ మందస్మితాలోకముల్
దయసేయంగదవయ్య మానవ మనస్తాపంబు చల్లారగన్

ఆటంబాంబుల బీటవారినది బ్రహ్మాండంబు సద్భావమే
మోటైపోయెను పంచశీలపథకమ్ముల్ దుమ్మువట్టెన్ దురా
శాటోపంబులు హద్దుమీరినవి పోరాటమ్మె ఆరాటమై
లూటీచేసిరి మానవత్వమును ఆలోకింపు లోకప్రభూ!

హింసాశక్తులు రక్తదాహమున దండెత్తెన్ దరిద్రప్రజా
సంసారమ్ములపై...
కిరాతశాత శరవిద్ధంబైన ఇద్ధారుణీ
హంసన్ గాయముమాన్పి కావవలెనయ్యా రమ్ము వేగమ్ముగన్

యుద్ధజ్వాలలు రేగె భీతిలి జగమ్ముయ్యాలలూగెన్ రుషా
కృద్ధ వ్యాఘ్రము గాండ్రుగాండ్రుమనుచున్ గ్రొన్నెత్తురుల్ ద్రావె ...
...
సిద్ధార్థా ప్రళయాగ్నులార్పవె ప్రజాశ్రేయమ్ము చేకూర్పవే!


శివాజీ సౌశీల్యం
==========

ఇది శ్రీ గడియారం వేంకటశాస్త్రిగారు రచించిన శివభారతములోనిది. శివాజీ సౌశీల్యాన్ని చాటిచెప్పే ఘట్టం. ఇందులోని పద్యాలు కూడా గుర్తులేవు :-( ఒక పద్యం మాత్రం ఇలా మొదలవుతుంది:

అనుచున్ జేవురు మీరు కన్నుగవతో నాస్పందితోష్ఠంబుతో
ఘన హుంకారముతో నటత్ భృకుటితో గర్జిల్లు నా భోంశలే
శుని జూడన్...

ఇది ఎందుకు గుర్తుండిపోయిందంటే, ఇది ఇందీవరాక్షుని వృత్తాంతంలో "అనినన్ గన్నులు జేవురింప..." అనే పద్యానికి చాలా దగ్గరగా ఉండే పద్యం, ఆ వర్ణన పరంగా. బహుశా గడియారంవారికి అల్లసాని పద్యమే స్ఫూర్తి అయ్యుండాలి. తమాషాగా ఆ రెండిటినీ ఒకే ఏడు పాఠంగా పెట్టారు!

ఇవి నాకు గుర్తున్న పద్యాలు. ఇవిగాక ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోని పద్యాలు. అవి అన్ని పద్యాలూ చుక్క గుర్తు పద్యాలే! అన్నీ గుర్తున్నాయి. అవి పద్యం.నెట్లో ఇంతకుముందు పెట్టినట్టు గుర్తు.

రమణగారు, చిన్ననాటి జ్ఞాపకాలని మరోసారి గుర్తుకుతెచ్చినందుకు ధన్యవాదాలు!

నా మిత్రుడు మరొక పాఠం గుర్తుచేసాడు.

స్వయంవరం
========

మొల్ల రామాయణంలో సీతాస్వయంవర సన్నివేశం.

గురుభుజశక్తి కల్గు పదికోట్ల జనంబును బంప వారునా
హరుని శరాసనంబు గొనియాడుచు బాడుచు గొంచువచ్చి సు
స్థిరముగ వేదిమధ్యమున జేర్చిన దానికి ధూపదీపముల్
విరులును గంధమక్షతలు వేడుకనిచ్చిరి చూడనొప్పగన్

కొంకక సావధానమతి గూర్చి వినుండిదె మత్కుమార్తెకై
యుంకువ సేసినాడ వివిధోజ్వలమైన ధనంబు గాననీ
శంకరు చాప మెక్కిడిని సత్త్వఘనుండగువాని కిత్తునీ
పంకజనేత్ర సీత నరపాలకులార నిజంబు సెప్పితిన్

కదలకుమీ ధరాతలమ కాశ్యపిబట్టు ఫణీంద్ర భూవిషా
స్పదులనుబట్టు కూర్మమ రసాతల భోగిడులీ కులీశులన్
బెదరక బట్టు ఘృష్టి ధరణీ ఫణి కచ్ఛప పోత్రి వర్గమున్
బొదువుచుపట్టుడీ కరులు భూవరుడీశుని చాప మెక్కిడున్

ఇనవంశోద్భవుడైన రాఘవుడు భూమీశాత్మజుల్ వేడ్కతో
దను వీక్షింప మునీశ్వరుండలర కోదండంబు చేబట్టి చి
వ్వన మోపెట్టి గుణంబుబట్టి పటుబాహాశక్తితో దీసినన్
దునిగెన్ జాపము భూరి ఘోషమున వార్ధుల్ మ్రోయు చందంబునన్


పూర్తిగా చదవండి...

Friday, February 12, 2010

విశ్వేశ్వరా!

మహాశివరాత్రి సందర్భంగా విశ్వనాథవారి విశ్వేశ్వరశతకం నుండి కొన్ని పద్యాలు:

శ్రీమంజూషిక భక్తరక్షణ కళా శ్రీచుంచు వానంద వ
ల్లీ మంజు ప్రసవంబు చిద్గగన ప్రాలేయాంశువున్ మోక్ష ల
క్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నీహారరుక్
శ్రీమంతంబయి పొల్చు వెల్గునొకడే సేవింతు విశ్వేశ్వరా!

కైలాసాచలసానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి త
త్ప్రాలేయాచల కన్యకా కుచతటీ పర్యంక నిద్రాగతం
బాలోలాగ్ర జటావనీ ఘటిత నాకౌకస్సరిత్కంబు దే
హాలంకారిత లేలిహానము వెలుంగర్చింతు విశ్వేశ్వరా!

కరితోల్పుట్టముకొంగుతో బునుక భిక్షాపాత్ర చేబూని సం
స్కరణం బించుక లేమి మై జడలు మూగన్ బొట్ట పెల్లాకటన్
సురుగున్ ముమ్మొనకర్రతో దడుముకొంచున్ లచ్చి గేహంబు ముం
దర నిల్పున్ భవదీయ భిక్షుకత కంతం బెప్డు విశ్వేశ్వరా!

ఓ సామీ! అల కొండకోయెతకు నీ యొయ్యారమో బూదిపూ
తే సర్వంబయి నీకు నాయమ సొబంగే నచ్చి కన్నారు ర
య్యా! సంతానము నేన్గుమోమొకడు వింతౌ నార్మొగాలొక్కడో
హో! సౌరాపద కాకరుండొక డదేమో కాని విశ్వేశ్వరా!

దివ్యజ్యోతివి నీకు బెల్లుబుకు భక్తిన్, జాటజూటాగ్ర చా
రువ్యాబద్ధ పవిత్ర దైవతధునీ! రుద్రాభిషేకంబొగిన్
నవ్యశ్రీగతి జేయగా నమకమైనన్ రాదుగా హూణ వా
క్కావ్యామోదము ముక్తిత్రోవెదురుచుక్కైపోయె విశ్వేశ్వరా!

ఈ సంసారము చేత నిల్లొడలు గుల్లే కాని లేదేమి మి
ధ్యా సౌఖ్యంబనిపించు దుఃఖమయ జన్మానేక మూహింపగా
సీసీ పో యనుగాని వానిపయినే చిత్తంబు లగ్నంబగున్
భాసాభాసము నీదు చిన్మయ ప్రభావజ్యోతి విశ్వేశ్వరా!

నా కే పూర్వజనుర్మహత్త్వముననో నా తండ్రి! నీ యీ పద
శ్రీ కంజాతములన్ దగుల్కొనియెబో చిత్తంబు దానన్ ననున్
జేకో బాధ్యత నీక యున్నయది తూష్ణీంభావ మేలా ప్రభూ!
నా కుయ్యింతయు నీ చెవిన్ జొఱద సంధ్యాధార! విశ్వేశ్వరా!

నేనున్ జేసిన పాపకర్మములు తండ్రీ! చెప్పగా రానివిన్
లోనన్ దల్పగనైన రానివి దయాలోకాంబుధారా ప్రవా
హానన్ క్షాళన చేసివైచెదవొ, లేదా రౌరవాగ్ని స్ఫులిం
గానీకంబుల నూరెదో రురువిషాణశ్రేణి విశ్వేశ్వరా!

ఆక్రోశించెద బాహులెత్తి ప్రభువా! ఆలింపవే! యేమి కా
మ క్రోధంబు లహో! ప్రమాణతను సంపాదించె నాయందు నీ
యక్రూరత్వము నీ వశిత్వమును నాయందింత పొందింపవే!
అక్రీతుండను దాసుడన్ శివశివా యన్నాను విశ్వేశ్వరా!

ఏనాడో శివ! దుఃఖసంసృతి మహాహీనాంబుధిన్ దాటి యెం
దో నేనొక్కడనే మహాగహనమందున్ నిల్చినీ తేజమున్
బ్రాణాయామమునందు జూచి "శివ! నిర్వాణైకమూర్తీ! నిరం
తానందైకమయస్వరూప!" యనుచున్ ధ్యానింతు విశ్వేశ్వరా!

ఆకర్ణించెద నేమియో ప్రమధ శంఖారావమో! జాట వీ
ధీకల్లోల తరంగ దేవతటినీ దీప్తారవంబో! కుభృ
చ్ఛ్రీ కన్యామణి పాదనూపుర మణిక్రేంకారమో! నన్నిదే
కైకో నీ వరుదెంతు వీ ధ్వని యదే కాబోలు విశ్వేశ్వరా!

నీవేమో కనిపించకుండినను గానీ యైన గన్పించి న
ట్లే వేలూహలుగాగ దెచ్చుకొని నీవే కాక లేడే కదా
దైవంబంచును నా కవిత్వము భవత్పాదద్వయిన్ జేర్చితిన్
రావే దీనికి నే ఫలం బొసగెదో రానిమ్ము విశ్వేశ్వరా!

నిను గ్రొంగొత్తలు తేర్చు గుంఫనల వర్ణింపంగ నూహింతు నౌ
నని యే దారినిబోయి పూర్వకవి పాదాంకంబులే తోచి లో
నన లజ్జాపరిగూఢ మానసుడనై నాలోన నేనే వినూ
తనశంకా హృదయుండనౌదు మఱి క్షంతవ్యుండ విశ్వేశ్వరా!

ఆనందైకమయస్వరూప! భవదీయైశ్వర్యమున్ ధూర్జటి
శ్రీనాథుల్ కవితాసతీ కుచతటీ శ్రీగంధ కస్తూరికా
స్థానంబున్ బొనరించి రిప్పటికి నస్మత్ స్తోత్ర పాత్రంబవై
తేనెల్ ద్రావిన నోటికిన్ జలము లందింపయ్యె విశ్వేశ్వరా!


పూర్తిగా చదవండి...

Friday, February 5, 2010

చంద్రునికో నూలుపోగు

కిందటి టపాలో నా పద్యంలో, చంద్రబింబాన్ని అలసి వెలవెలబోతున్న సూర్యుని ప్రతిబింబంగా వర్ణించడాన్ని ఆ చంద్రుని తరఫున చంద్రమోహన్ గారు తీవ్రంగా ఖండించారు :-) అదీ పద్యంలో! పైగా నేను చంద్రునిపై మంచి పద్యాన్ని వ్రాస్తే గానీ వారి మనోభావాలు శాంతించవని కూడా హెచ్చరించారు! తమ పేరింటివారి మీద ఆ మాత్రం అభిమానం సహజమే. కాని వారి కోరిక విని నా గొంతులో పచ్చివెలక్కాయ పడింది. ఎందుకంటే మన కావ్యాలలో అందరికన్నా ఎక్కువగా, అందంగా వర్ణించబడింది బహుశా చంద్రుడే! అలాంటి చంద్రునిపై పద్యం వ్రాయాలంటే మాటలా?

చంద్రుని మీద పద్యం అనగానే నాకు గుర్తుకువచ్చిన పద్యం పెద్దన మనుచరిత్రలోనిది. చంద్రుని గురించి అంత అందమైన పద్యం మరొకటుందా అనిపించేంత చక్కని పద్యమది.

కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి
కడుపార నెవ్వాని కన్నతల్లి
అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు
వన్నెవెట్టు ననార్తవంపు పువ్వు
సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు
పుట్టు గానని మేని మెట్టపంట
కటికిచీకటి తిండి కరముల గిలిగింత
నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు

నతడు వొగడొందు మధుకైటభారి మఱది
కళల నెలవగువాడు చుక్కలకు ఱేడు
మిసిమి పరసీమ వలరాజు మేనమామ
వేవెలుంగులదొర జోడు రేవెలుంగు

"కలశపాథోరాశిగర్భ వీచిమతల్లి కడుపార నెవ్వాని కన్నతల్లి" - స్థూలంగా చూస్తే, "పాలసముద్రమునుంచి పుట్టినవాడు ఎవడో అతడు" అని అర్థం, అంతే! ఇందులో కవిత్వమేముంది? అని పెదవి విరిచేస్తే ఏమీ లేదు! సూక్ష్మంగా పరికిస్తే చాలా ఉంది. ఈ పద్యం మనుచరిత్ర ప్రారంభంలో కృతిభర్త వంశ వర్ణనలో వచ్చే మొట్టమొదటి పద్యం. మనుచరిత్ర కృతిభర్త మరెవరో కాదు సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. అతని వంశాన్ని వర్ణించడం మొదలుపెట్టాడు పెద్దన్న. కృష్ణదేవరాయలు తుళు వంశానికి చెందిన రాజు. ఈ తుళువంశం చంద్రవంశం. అంటే ఈ వంశానికి ఆదిపురుషుడు చంద్రుడన్న మాట! ఆ చంద్రుని వర్ణనతో ఆ వంశ ప్రశంసని ప్రారంభించాడు. పెద్దనకి కృష్ణదేవరాయలపైనున్న అభిమానం అంతా ఇంతా కాదు! అలాంటి రాయల వంశ మూలపురుషుణ్ణి వర్ణించడమంటే పెద్దనగారి మనసులో ఉత్సాహం ఉప్పొంగి ఉండాలి. అందుకే ఇలాంటి పద్యం జాలువారింది. అసలీ పద్యంలో స్వయానా ఆ రాయలనే కీర్తిస్తున్నాడా అనికూడా నాకు అనిపిస్తుంది.

సీస పద్యం ఒకో పాదంలోనూ చంద్రుని ఒకో గొప్పతనాన్ని వర్ణించాడు. చంద్రుని వంశోన్నతిని చాటుతున్నది మొదటిపాదం. అయితే ఇందులో మంచి చమత్కారాన్ని చేశాడు పెద్దన. చంద్రుడు ఫలానా పాలసముద్రపు కొడుకు అని అన్నాడా? లేదు! కలశపాథోరాశి అంటే పాలసముద్రం. ఆ పాలసముద్రం మధ్యలోనున్న, "వీచి మతల్లి". మతల్లి అంటే శ్రేష్ఠమైన లేద గొప్ప అని అర్థం. వీచి అంటే అల. వీచిమతల్లి అంటే ఒక గొప్ప/పెద్ద అల. పాలసముద్రం మధ్యనున్న ఒక గొప్ప అల ఎవని కన్నతల్లో అతను చంద్రుడుట! సముద్రుణ్ణి మగవానిగా, చంద్రుడు లక్ష్మీదేవి మొదలైనవాళ్ళకి తండ్రిగా చెప్పడం సాధారణమైన విషయం. కాని ఇక్కడ తల్లిని కూడా తీసుకువచ్చాడు పెద్దన. పాల సముద్రాన్ని చిలికినప్పుడు మధ్యలో తరంగాలు ఏర్పడి ఉంటాయి కదా. అలాంటి ఒక ఉన్నతమైన, ఉత్తుంగమైన తరంగంనుంచి ఉద్భవించాడట చంద్రుడు. అంతే కదా మరి! ఉన్నట్టుండి అలా సముద్రంలోంచి హఠాత్తుగా పుట్టలేదు కదా చంద్రుడు. సముద్రాన్ని మథించినప్పుడు, అందులోంచి పుట్టిన అలల నురగ గడ్డగట్టి, ఆ మథన వేగానికి పైకి కొట్టబడి చంద్రుడు ఉద్భవించి ఉండాలి. ఇంత కథనీ గుర్తుచేస్తూ చంద్రుని పుట్టుక ఎంత గొప్పదో ధ్వనింపజేస్తోంది ఈ వర్ణన. పదాల పొందిక సరేసరి!

"అనలాక్షు ఘనజటా వనవాటి కెవ్వాడు వన్నెవెట్టు ననార్తవంపు పువ్వు" - మళ్ళీ ఆ పదాల పొహళింపు చూడండి! తెలుగుభాషలోని అనుప్రాస సౌందర్యమంతా మొదటి మూడు పదాలలోనూ నింపేసాడు! అనలాక్షుడంటే నిప్పుకంటివాడు, శివుడు. అతని ఘనమైన జడలనే తోటకి వెన్నె తెచ్చే పువ్వుట చంద్రుడు. పైగా అలాంటిలాంటి పువ్వుకూడా కాదు. అనావర్తవంపు పువ్వు. అంటే అన్ని ఋతువులలోనూ కూడా పూసేపువ్వని అర్థం. ఏ ఋతువులోనైనా చందమామ ఆకాశంలో అలా వెలుగుతూనే ఉంటాడు కదా! పైగా మనకంటే ఒక పదిహేను రోజులు క్షీణిస్తున్నట్టు కనిపిస్తాడు కాని శివుని జటాజూటంలో ఎప్పుడూ వెన్నెలలు చిలికిస్తూనే ఉంటాడాయె. ఈ పాదంలో చంద్రుని ఔన్నత్యం, నిరంతర వైభోగం ధ్వనింపజేసాడు పెద్దన. అంతటి ఔన్నత్యం వైభోగం రాయలకి మాత్రం లేవా?

"సకల దైవత బుభుక్షాపూర్తి కెవ్వాడు పుట్టుగానని మేని మెట్టపంట" - ఈ పాదంలో చంద్రుని సంపన్నత, దాతృగుణం వర్ణింపబడ్డాయి. సకల దేవతల ఆకలినీ కూడా తీర్చే మెట్టపంట చంద్రుడు. చంద్రుడు కురిపించే సుధ/అమృతం దేవతల ఆహారం కదా. పైగా అతనిది "పుట్టుగానని మేను". అంటే ఆ మెట్టపంట ఎవరూ నాటకుండానే స్వతస్సిద్ధంగా పండినదన్న మాట. అంచేత ఇది కూడా ఋతుసంబంధి కాదు. నిరంతరం ఆహారాన్ని ప్రసాదిస్తూనే ఉంటుంది.

"కటికిచీకటి తిండి కరముల గిలిగింత నెవ్వాడు దొగకన్నె నవ్వజేయు" - ఇందులో చంద్రుని సరసత్వం వర్ణించాడు పెద్దన. కటికచీకటిని తినే చేతుల గిలిగింతతో, తొగ కన్నెని - అంటే కలువ కన్నెని, నవ్విస్తాడు చంద్రుడు. చంద్రకిరణాలు చీకటిని హరించి కలువకన్నెకి ఆనందాన్ని కలిగిస్తాయని భావం. ఇందులో "కటికి చీకటితిండి కరములు" అన్న సమాసం దుష్టసమాసం. పైగా విచిత్రమైన ప్రయోగం కూడాను! కటికచీకటిని తినే చేతులు అని చంద్రకిరణాలని వర్ణించడంలో మరి వేరే ఉద్దేశం కూడా ఏమైనా ఉందేమో నాకు తెలీదు.

"నతడు వొగడొందు మధుకైటభారి మఱది" - పైన చెప్పిన గొప్పతనమున్న చంద్రుడు స్వయానా మధుకైటభారి మఱది, అంటే విష్ణువు బావమఱది. బంధుత్వంలో కూడా చంద్రుని గొప్పతనాన్ని చెపుతున్నాడిక్కడ. "కళల నెలవగువాడు" - పదహారు కళలకి నెలవైనవాడు. రాయల కళావైదుష్యం ఇక్కడ ధ్వనిస్తోంది. చుక్కలకు రాజు. చంద్రుని/రాయల దక్షిణ నాయకత్వం స్ఫురిస్తోందిక్కడ. "మిసిమి పరసీమ" - మిసిమి అంటే మిలమిలా మెరిసిపోయే కాంతి. దానికి పైహద్దు చంద్రుడు. అంటే అంతకన్నా మెరిసే కాంతి మరెవ్వరికీ లేదని. ఇది రాయల కీర్తిని ధ్వనిస్తోంది. కీర్తిని వెలుగుతో పోల్చడం కవిసమయం. "వలరాజు మేనమామ" - మన్మథునికి స్వయానా మేనమామ. అంటే మన్మథుని అందమంతా ఇతనిలోనూ ఉందని అనుకోవచ్చు. ఇది కృష్ణరాయల సౌందర్యాన్ని ధ్వనిస్తోంది. "వేవెలుంగులదొర జోడు రేవెలుంగు" - వేయి వెలుగులున్న ఆ సూర్యునికి సరిజోడు, ఇతను రాత్రి వెలుగేవాడు అని. అంటే చంద్రవంశం సూర్యవంశానికి ఏమాత్రం తీసిపోని సరిజోడు అని అర్థం వస్తుంది.

ఇంతకన్నా అందంగా సమగ్రంగా చంద్రుణ్ణి మరెవరైనా వర్ణించారేమో నాకైతే తెలియదు. అలా చేస్తూ, కృష్ణరాయల గొప్పతనాన్ని కూడా ధ్వనింపజెయ్యడం పెద్దన ధురీణత. అతనికి రాయలమీదనున్న అభిమానానికి నిదర్శనం. ఈ "కలశపాథోరాశి" అనే ఎత్తుగడకి ప్రేరణ బహుశా క్రీడాభిరామంలో పద్యం అయ్యుండవచ్చు. ఆ పద్యం కూడా చంద్రస్తుతే.

చంద్రునిపై ఇంత పెద్ద పద్యం, ఇంత అందమైన పద్యం గురించి వివరించినా చంద్రమోహన్ గారు శాంతిస్తారని నమ్మకం లేదు :-) నన్ను స్వయంగా ఒక పద్యం వ్రాయమని ఆదేశీంచారు కదా! అంచేత ఆ చంద్రునికో నూలుపోగుగా నేనూ ఒక పద్యాన్ని ప్రయత్నించాను:

స్నేహరసార్ద్రయౌ జనని నిత్యము తండ్రి రుషాకషాయతన్
దా హృది నింకజేసుకు సుధామయ ప్రేమను జిల్కునట్లుగా
దాహకరోష్ణ తీక్ష్ణ కరధారను చల్లని వెన్నెలేరుగా
మోహన చంద్రబింబమ! అమోఘముగా ప్రసరింపజేతువే!


పూర్తిగా చదవండి...