తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, August 15, 2008

స్వతంత్ర భారతి


అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ స్వాతంత్ర్య సమరాన్నీ, దానిలో పోరాడిన దేశభక్తులనీ, త్యాగధనులనీ ఈ రోజు తలచుకోవడం భారతీయులుగా మన కనీస కర్తవ్యం. ఈ సందర్భంగా కరుణశ్రీ "స్వతంత్ర భారతి" పద్యాలు మనసారా ఎలిగెత్తి పాడుకుందాం.
కరుణశ్రీ పద్యాలలో పదలాలిత్యమే కాదు, ఒక ఉత్సాహవంతమైన ధార కూడా ఉంటుంది. గొంతెత్తి పాడుకుంటే నవనవోన్మేషమైన ఒక నూతనోత్తేజం కలిగి మనసు పరవళ్ళు తొక్కుతుంది.
మరింక ఆలస్యం దేనికి...

స్వతంత్ర భారతి
-----------------
గణగణ మ్రోగెరా విజయఘంటలు భారతమాత మందిరాం
గణమున - ద్వారబంధముల గట్టిరి చిత్రవిచిత్ర రత్న తో
రణతతి - వీధివీధుల విరాజిలుచున్న వవే త్రివర్ణ కే
తనములు మేలుకాంచె పరతంత్ర పరాఙ్ముఖ సుప్త కంఠముల్

కంటికి కజ్జలమ్మునిడి, ఖద్దరు చీర ధరించి, నేడు పే
రంటము పిల్చుచున్నది స్వరాజ్యవధూమణి ప్రక్క యింటి వా
ల్గంటులు - కర్ణపేయములుగా ప్రవహించె "స్వతంత్ర భారతీ"
మంటపమందు శాంత సుకుమార మనోహర గాన వాహినుల్!

పాటాగొట్టి పరప్రభుత్వమునకున్, బ్రహ్మాండమౌ శాంతి పో
రాటంబున్ నడిపించినాడు మన వార్థాయోగి ఆంగ్లప్రభుల్
మూటల్ ముల్లెలు నెత్తికెత్తుకొని నిర్మోహాత్ములై సంద్రముల్
దాటంజొచ్చిరి నవ్వుకొన్నవి స్వతంత్ర స్వర్ణ సోపానముల్

నేతాజీ ప్రతిభాప్రతాములు, గాంధీతాత సత్యాగ్రహ
జ్యోతిర్దీప్తులు దేశభక్తుల అఖండోత్సాహముల్ విశ్వ వి
ఖ్యాతంబైన ఆగష్టువిప్లవ మహా గాధల్, సమైక్యమ్ములై
స్వాతంత్ర్యధ్వజ మెత్తె భారత మహాసౌధాగ్రభాగమ్ములన్

లాఠీపోటులు పూలచెండ్లు, చెరసాలల్ పెండ్లివారిండ్లు, ఏ
కాఠిన్యం బయినన్ సుఖానుభవమే, గాంధీ కళాశాలలో
పాఠంబుల్ పఠియించు శిష్యులకు తద్ బ్రహ్మాస్త్ర సంధానమే
పీఠంబుల్ గదలించి సీమలకు బంపెన్ శ్వేతసమ్రాట్టులన్

ప్రస్థానించిరి త్యాగమూర్తులు పవిత్రంబైన శ్రీకృష్ణ జ
న్మ స్థానంబున కేందరో నిహతులైనా రెందరో శౌర్య ధై
ర్య స్థైర్యంబులు చూపి విప్లవ సమిద్రంగమ్ములన్ వారి సు
ప్తాస్థి శ్రేణికలే పునాదులట మా స్వారాజ్య సౌధాలకున్

నీదేనోయి సమస్త భారతము తండ్రీ! ఇంక నీ గడ్డపై
లేదోయీ యధికార మెవ్వరికి పాలింపంగదోయీ! ప్రపం
చాదర్శంబుగ సర్వమానవ సమాహ్లాదంబు సంధిల్ల నీ
వైదుష్య ప్రతిభా విశేషములు విశ్వమ్మెల్ల కీర్తింపగన్!

2 comments:

  1. అధ్భుతమైన పద్యాలు అని వేరే చెప్పనవసరం లేదు..నేను ఇంతకు ముందర చదవనివివి, పరిచయం చేసినందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  2. గిరిగారు,
    పద్యాలు నచ్చినందుకు చాలా సంతోషం. ఇవి కరుణశ్రీ రాసిన ఉదయశ్రీ రెండవ భాగంలోనివి. మొదటి భాగంలో రకరకాల ఖండికలున్నా, రెండవ భాగంలో చాలావరకూ దేశభక్తికి సంబంధించిన ఖండికలే ఉన్నాయి. ప్రసిద్ధమైన "పాకీపిల్ల" కూడా ఈ రెండవ భాగం లోనిదే. వీలుచూసుకొని అది కూడా ఎప్పుడో పెడతాను.

    ReplyDelete