తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, August 7, 2008

పాపాయి పద్యాలు


ఉయ్యాలలో ఊగే పసిపాపాయిని చూస్తే, కాస్తో కూస్తో భావుకత ఉన్న ఎవరికైనా కవిత్వం వస్తుంది. కానీ ఇంత అందమైన కవిత్వం రాదేమో! జాషువా రాసిన యీ పద్యాలు చిన్నప్పుడు తెలుగు పాఠంగా చదువుకున్నాను. కానీ అప్పట్లో కన్నా, పెద్దయ్యాక, ఒక పాపకి తండ్రినయ్యాక, ఆ పాపాయి పసితనపు విలాసాలని స్వయంగా అనుభవించాక, ఇవి మరింత అందంగా కనిపించాయి.
ఆ అనుభూతిని రుచి చూడబోయేవాళ్ళు ఈ పద్యాలు చదివి కొంత ఊహించుకోవచ్చు. రుచి చూసినవాళ్ళు మళ్ళీ ఆ తీపిసంగతులు గుర్తు తెచ్చుకొని మురిసిపోవచ్చు.

బొటవ్రేల ముల్లోకముల జూచి లోలోన
ఆనందపడు నోరు లేని యోగి
తల్లిదండ్రుల తనూవల్లరి ద్వయికి వ
న్నియబెట్టు తొమ్మిదినెలల పంట
అమృతమ్ము విషమను వ్యత్యాస మెరుగ కా
స్వాదించ చను వెఱ్ఱిబాగులాడు
అనుభవించు కొలంది యినుమడించుచు మరం
దము జాలువారు చైతన్యఫలము

భాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు,
నిద్రపోవు, లేచి నిలువలేడు,
ఎవ్వరెరుగ రితని దే దేశమో గాని
మొన్న మొన్న నిలకు మొలచినాడు

నవమాసములు భోజనము నీర మెఱుగక
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి జిమ్ము జానెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిధి
నును జెక్కిలుల బోసినోటి నవ్వులలోన
ముద్దుల జిత్రించు మోహనుండు

బట్ట గట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలలో జేరె గాని
వారమాయెనొ లేదొ మా ప్రకృతి కాంత
తెలిపి యున్నది వీని కాకలియు నిద్ర!

గానమాలింపక కన్నుమూయని రాజు
అమ్మ కౌగిటి పంజరంపు చిలుక
నునుపు(?) కండలు పేరుకొను పిల్ల వస్తాదు
ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఊఊలు నేర్చిన ఒక వింత చదువరి,
సతిని ముట్టనినాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి
తన యింటి కొత్త పెత్తనపు ధారి

ఏమి పని మీద భూమికి నేగినాడొ
నుడువ నేర్చిన పిమ్మట నడగవలయు
ఏండ్లు గడచిన ముందుముందేమొ గాని
యిప్పటికి మాత్ర మే పాప మెఱుగడితడు
(ప్రసవాబ్ధి తరియించి - ప్రసవమనే సముద్రాన్ని దాటి)

ఊయేల తొట్టి యే ముపదేశమిచ్చునో
కొసరి యొంటరిగ నూ కొట్టు కొనును
అమ్మతో తనకేమి సంబంధమున్నదో
యేడ్చి యూడిగము జేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా గేకిసల్ కొట్టుకొనును
మూన్నాళ్ళలోనె ఎప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనును

ముక్కుపచ్చ లారిపోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నపుడు
నాదు పసిడికొండ నారత్నమని తల్లి
పలుకు, పలుకులితడు నిలుపుగాక!

8 comments:

  1. అద్భుతం మాస్టారు! వేల నెనర్లు. ఇంకో పది రోజుల్లో తండ్రి కాబోతున్న నాకు కలకండ (లాంటి పద్యం) పెట్టారు.
    పిల్లల మీద ఇలాంటి పద్యాలు తెలుగు సారస్వతం లో ఇంకా ఎక్కడైనా ఉన్నాయా?

    సంస్కృతంలోనైతే, కాళిదాసు అభిఙ్ఞాన శాకుంతలం లో ఓ పద్యం, పిల్లల మీద.

    "అలక్ష్య దంత ముకుళాననిమిత్త హాసైః
    అవ్యక్తక రమణీయ వచః ప్రవృత్తీన్
    అంకాశ్రయః ప్రణయినః తనయాన్ వహన్తీన్
    ధన్యాః తదంగ రజసా మలినీ భవంతి"

    వచ్చీ రాని చివురు దంతాలతో చిరునగవులు చిందిస్తూ, చిట్టి చిట్టి మాటలతో, వడిని ఆడుకుంటున్న పిల్లలను కలిగిన తల్లులు, ఆ బుడతల పాద స్పర్శ తో ధన్యులవుతున్నారు!

    ReplyDelete
  2. చాలా మంచి పద్యం గుర్తు చేశారు, నేను 9వ తరగతిలోనో లేక 10వ తరగతిలోనో తెలుగు పద్యభాగం లో 'శిశువు' అని ఇది చదువుకున్నాను. మా అందరికన్నా చిన్నవాడిలా కనపడే ఒక మిత్రుడిని శిశువు అని పిలుస్తూ కండల్ని చూసి "నునులేత కండలు తిరిగిన పిల్ల వస్తాదు" అని ఏడిపించే వాళ్ళం. ఆ ? చోట 'లేత' అని ఉండాలి అనుకుంటాను. (తప్పు కూడా అయి ఉండొచ్చు )

    ReplyDelete
  3. చాలా బావుందండీ.
    పని గట్టుకుని జాషువా కవి పద్యాల్ని పరిచయం చేస్తున్నందుకు మిగుల ధన్యవాదాలు.విన్నకోట రవిశంకర్ ది ఒక పద్యం ఉండాలి .. పైకెళ్ళిపోయిన పూర్వీకులందరూ సంతకాలు చేసి పంపిన ఆటోగ్రాఫ్ పుస్తకంలా ఉంది మా పాప అంటాడు అప్పూడే పుట్టిన కూతుర్ని చూసుకుంటూ.

    ReplyDelete
  4. బ్లాగ్ సభ్యత్వం తీసుకున్న కొత్తల్లోనే ఇంత మంచి పద్యం చదివే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ సాహిత్యాభిలాష తీరేందుకు ఒక మంచి వెబ్ సైట్ -- http://www.andhrabharati.com/
    ఈ టపా చదివే వారందరికీ పై వెబ్ సైట్ గురించి తెలుసేమో కానీ, నాకు ఈమధ్యనే తెలిసింది. మన
    మహోన్నత తెలుగు సాహిత్యపు ఆనవాళ్ళు అందులో కొన్ని ఉన్నాయి. తెలుగు వ్యాప్తికి ఇది కూడా సహాయం చేయగలదని ఆశిస్తున్నాను

    ReplyDelete
  5. రవిగారు,
    శుభాకాంక్షలు! చక్కని శ్లోకాన్నిచ్చినందుకు నెనరులు.
    కొత్తపాళిగారు,
    మీరు కోట్ చేసిన ఆ వాక్యం ఏ కవితలోది?

    ReplyDelete
  6. చాలా మంచి పద్యాలు. ఒకసారి తండ్రి/తల్లి అయిన తరువాత పిల్లలను విడిచి ఉండడం కూడా కష్టమే. నా భార్య పిల్లలతో భారతదేశం వెళ్ళినప్పుడు బెంగతో నే వ్రాసిన పద్యం:

    కం//
    చంటిది లేదిట నవ్వుతు,
    తుంటరి పిల్లాడులేడు తుళ్ళుతునింట్లో,
    ఒంటరి బ్రదుకది కష్టము,
    జంటగ ఉంటేనె మేలు, జగతిలొ రామా!

    ReplyDelete
  7. Manchi padyaaniki manchi spandana unte entha baaguntundo eee blog chaduvuthe artham avuthundi. spanadna ila unte naluguru tho manaku nachinavi panchukovatam entha mamatha nu penchutundo kadaa.

    Ravi Nalam
    nr48@in.com

    ReplyDelete
  8. మండుటెండలో ఉదక మండలం లో విహరించినట్లుంది.

    ReplyDelete