తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, August 31, 2008

కళలనెలవుకో నూలుపోగు




ఈ కందాన్ని చూడగానే తెలిసిపోతుంది దీని విశిష్టత ఏంటో. ఇది బహుభాషా కందం. ఉత్సాహవంతులు కొందరు ఇంగ్లీషులో పద్యాలు రాయడం మన బ్లాగర్లకి పరిచయమైన విషయమే! ఇది ఒక భాషలో కాదు, నాలుగు భాషల్లో ఉన్న కందం. మూడు నాలుగు పాదాలందరికీ తెలిసిన భాషలే, ఇంగ్లీషు, తెలుగు. రెండో పాదం కూడా చాలామందికి తెలిసే ఉంటుంది సంస్కృతం. ఇకపోతే మొదటి పాదం, ఇది పారసీ భాష. ఈ పద్యాన్ని రాసింది శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసుగారు. ఇది చిత్రకవిత్వమో, కేవలం సరదాకి రాసినదో కాదు. దీంత్లో ఎంతో ఔచిత్యం ఉంది. అది తెలియాలంటే ఈ పద్యం ఎందులోదో తెలుసుకోవాలి.

ఉమర్ ఖయాము రుబాయెతుల గురించి చాలామంది వినే ఉంటారు. ఆ రుబాయెతులని ఎందరో తమ తమ భాషల్లోకి అనువదించారు. తెలుగులో కూడా చాలామంది అనువదించారు. దాసుగారు కూడా వాటిని అనువదించారు. అందులోని ప్రార్థనా పద్యం ఇది. చాలామంది అనువాదాలకి ఇంగ్లీషులో Fitzgerald అనువాదమే ఆధారం. నారాయణదాసుగారు మాత్రం పారసీ భాష నేర్చుకొని నేరుగా పారసీ భాషలోని రుబాయతులని అనువదించారు. ఇంగ్లీషులోని Fitzgerald అనువాదాన్ని సంస్కృతంలోకి అనుష్టుప్ ఛందస్సులోనీ, తెలుగులోకి కంద పద్యాల్లోనీ అనువదించారు. పారసీలో ఉన్న మూలాన్ని మళ్ళీ తెలుగులో గీతి, భుజంగీ ఛందస్సులలో అనువదించారు! ఈ గ్రంధంలో మూల పారసీ రుబాయతూ, ఇంగ్లీషులో Fitzgerald అనువాదమూ, తన సంస్కృత తెలుగు అనువాదాలూ అన్నీ వరసగా ఇచ్చారు. మరి అలాటి గ్రంధానికి మొదట్లో ఇలాటి పద్యం ఎంత శొభని చేకూరుస్తుందో వేరే చెప్పాలా!

ఆధిబట్ల నారాయణ దాసు గారిని హరికథా పితామహునిగా చాలామందికి తెలిసే ఉంటుంది. ఎవరో తమిళ అయ్యరు వినిపించిన హరికథని విని, దాన్ని తెలుగుకి అనుగుణంగా మరిన్ని అందచందాలు చేకూర్చి, సంగీత సాహిత్య నాట్య కళా సమాహారంగా హరికథని తెలుగులో దిద్దితీర్చి దానికి ప్రాచుర్యాన్ని కల్పించిన వారు దాసుగారు. దాసుగారి సంగీత ప్రావీణ్యం అపారం. ఇతని గానం విని ఠాగూరు ముగ్ధులయ్యారట. ఠాగూరు విజయనగరం వచ్చి ఉపన్యాసమిచ్చినప్పుడు, దాసుగారు వెనకనెక్కడో కూర్చుంటే, స్వయంగా వెళ్ళి పలకరించి అతని గానం ఇంకా తన చెవులలో రింగుమంటోందని చెప్పినప్పుడు దాసుగారు పరమానందం చెందారు.

ఆదిభట్లవారు సంస్కృతాంధ్ర సాహిత్యాలలో కూడా విశేషమైన కృషి చేసారు. ఎన్నో రచనలు చేసారు. రెండు సంస్కృత శతకాలూ, అయిదు తెలుగు శతకాలూ రచించారు. అందులో ఒకటి సీసాలలో రాసిన అచ్చ తెలుగు శతకం. మరొకటి ఆనందగజపతి రాజుగారిచ్చిన "సతము సంతసమెసంగు సత్యవ్రతికిన్" అన్న సమస్యకి పూరణగా ఆశువుగా చెప్పిన శతకం.
ఆదిభట్లవారు అనేక కావ్యాలు రాసారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది బాటసారి పద్య కావ్యం. ఇదొక Allegory, ధ్వని కావ్యం అనవచ్చు. అంటే బయటకి ఒక కథా, పాత్రలూ కనిపించినా అంతర్గతంగా మరొక విషయాన్ని సూచిస్తూ సాగే రచన. నారాయణదాసుగారి అనువాద రచనల్లో గొప్పది రుబాయెతుల అనువాదం. నేరుగా మూలం నుంచి అనువదించడం, క్లుప్తతకి ప్రాధాన్యమివ్వడం ఈ అనువాదాన్ని గొప్ప అనువాదం చేసాయని అనిపిస్తుంది. ఒక్క ఉదాహరణ:

The Worldly Hope men set their Hearts upon
Turn Ashes - or it prospers; and anon,
Like Snow upon the Desert's dusty Face,
Lighting a little hour or two - was gone.

దీనికి తెలుగు అనువాదాలు:

మెయితాల్పు బ్రదుకు కోరిక
నయముగ దొలుదొలుత దోచినన్ బిమ్మట నె
మ్మెయి నయిన జెడున్! రగిలిన
పొయిమీదన్ రాలు మంచుబుగ్గ తెఱగునన్!

తలచు మిదెల్ల డెందమ, కల్లయనుచు
నవియివి నీకులోనై యున్నవనుచు
మంచు చిన్కిసుకపై మాయమౌనట్లు
పోవు నీ మూనాళ్ళ ముచ్చట బ్రతుకు!

నారాయణదాసుగారు ఉమర్ ఖయాముని అనువదించడంలో మరో విశేషముంది. నారాయదాసుగారి అసలు పేరు సూర్యనారాయణ. వారి తండ్రిగారిలాగానే ఆదిభట్లవారు కూడా సూర్యుని ఉపాసించేవారు. ఖయాము కూడా సూర్యోపాసకుడని ఆదిభట్లవారి నమ్మకం! ఖయాము రుబాయత్లలో మొదటిది "ఖుర్షీద్"అన్న పదంతో మొదలవుతుంది. దాని అర్థం సూర్యుడు. సూర్యోదయంతో మొదలయిందా కావ్యం.

ఇలా రాసుకుంటూ పోతే ఒక పెద్ద గ్రంధమే అవుతుంది. ఆదిభట్లవారి సర్వతోముఖ కళా వైదుష్యం అనంతమైనది. అతని సారస్వతాన్ని మొత్తం సమీక్షించిన పుస్తకం జోగారావుగారి సంపాదకత్వంలో వచ్చిన "సారస్వత నీరాజనము". Digital Libraryలో దొరుకుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు చదువుకోవచ్చు. అలానే ఆదిభట్లవారి ఇతర కృతులు బాటసారి, రుబాయెతులు మొదలైనవి కూడా Digital Libraryలో ఉన్నాయి.
జోగారావుగారు నారాయణ దాసుగారి అనంతమైన సారస్వత ప్రతిభకి పట్టిన నీరాజనం యీ పద్యం:

"నాయవి నాల్గుమోము లవునా! యెటు ముద్దిడె" దంచు నల్వ ఆ
ప్యాయముగా హసింపగ, "ననంత ముఖన్ నను నెట్లు ముద్దిడం
బోయెదొ!" యంచు జెల్వ నగ, "ముద్దిడెదం గను"మంచు నల్వ నా
రాయణదాసు కాగ ద్రపనందు సరస్వతికిన్ నమస్కృతుల్!"

ఈ రోజు ఆదిభట్ల నారాయణదాసుగారి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ కళలనెలవుకి నేనిచ్చే నూలుపోగే ఈ చిన్న టపా!


పూర్తిగా చదవండి...

Saturday, August 23, 2008

శ్రీకృష్ణ లీలామృతం


ఈ రోజు కిట్టయ్య పుట్టినరోజు. తెలుగువాళ్ళెవరికైనా కృష్ణుణ్ణి తలచుకోగానే,

శ్రీ కైవల్యపదంబు జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవో
ద్రేకస్తంభకు కేళిలోల విలసత్ దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండకుంభకు మహానందాంగనా డింభకున్

అంటూ, గోర్వెచ్చని పాలమీగడలకన్నా తియ్యనైన భాగవతాన్ని మనకందించిన పోతన తలపులోకి రాకమానడు కదా! ఆ పోతన తన భాగవతంలో, ముచ్చటగా వర్ణించిన శ్రీకృష్ణలీలలని తలచుకొని ఆనందిద్దామా మరి!

అదుగో దేవదేవుడు, దేవకిపంటగా శ్రీకృష్ణనిగా అవతరిస్తున్నాడు. ప్రకృతి ఆనందముతో ఉప్పొంగుతోంది:

స్వచ్ఛంబులై పొంగె జలరాసులేడును
గల ఘోషణములు మేఘంబు లుఱిమె
గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లె
దిక్కులు మిక్కిలి తెలివి దాల్చె
గమ్మని చల్లని గాలి మెల్లన వీచె
హోమానలంబు సెన్నొంది వెలిగె
గొలకుల కమలాళికులముపై సరినొప్పె
బ్రవిమల తోయలై పాఱె నదులు

వర పుర గ్రామ ఘోషయై వసుధ యొప్పె
విహగ రవ పుష్ప ఫలముల వెలసె వనము
లలరుసోనలు గురిసి రయ్యమరవరులు
దేవదేవుని దేవకీదేవి గనగ!

అరే, అంతలోనే అదుగో వసుదేవుడా బాలుణ్ణి పొత్తిళ్ళలో ఎత్తుకొని ప్రయాణమవుతున్నాడే!

బిడ్డని గరముల ఱొమ్మున
నడ్డంబుగబట్టి పదము లల్లన యిడుచున్
జడ్డన గావలివారల
యొడ్డు గడచి పురిటిసాల యొయ్యన వెడలెన్

ఆ హరికి స్వయంగా యమునా నది దారిస్తోంది చూసారా! అలనాడు శ్రీరామచంద్రునికి సముద్రుడు త్రోవిచ్చినట్టే లేదూ!

ఆ శౌరికి దెరువొసగె బ్ర
కాశొద్ధత తుంగభంగ కలిత ధరాశా
కాశ యగు యమున మును సీ
తేశునకు బయోధి త్రోవ యిచ్చిన భంగిన్

ఇంకేముంది, నందుని యింట వెలసా డానంద గోపాలుడు. రేపల్లే ఇక అతని యిల్లు! ఈ వార్త రేపల్లె మగువలకి తెలిసిపోయింది. ఇంకేం, చూడ్డానికి ఇరుగమ్మని పొరుగమ్మనీ వెంటపెట్టుకొని బయలుదేరారు.

ఏమి నోము ఫలమొ యింత ప్రొద్దొక వార్త
వింటి మబలలార వీను లలర
మన యశోద చిన్ని మగవాని గనెనట
చూచివత్తుమమ్మ సుదతులార

ఆ పసి బాలునికి అన్ని సపర్యలూ జరుగుతున్నాయి. ఉయ్యాలలూగిస్తూ జోలపాటలెలా పాడుతున్నారో వినండి:

జోజో కమలదళేక్షణ
జోజో మృగరాజమధ్య జోజో కృష్ణా
జోజో పల్లవకరపద
జోజో పూర్ణేందువదన జోజో యనుచున్

లోకాలని జోకొట్టి నిద్రపుచ్చే ఆ దేవదేవునికి నిద్రేమిటి! అయినా వాళ్ళకోసం కళ్ళుమూసుకొని నిద్ర నటిస్తున్నాడు.

లోకములు నిదురవోవగ
జో కొట్టుచు నిదురవోని సుభగుడు రమణుల్
జోకొట్టి పాడ నిదురం
గైకొను క్రియ నూరకుండె గనుదెఱవాయున్

అంతలో రాకాసి పూతన రానే వచ్చింది. చన్నిచ్చే నెపంతో ఆ పసివాని ప్రాణం తియ్యాలని. అక్కడున్నది పసిబాలుడా? పాలని త్రాగుతూ త్రాగుతూ పూతన ప్రాణాల్ని కూడా గుటగుటా తాగేశాడా బాలకృష్ణుడు! చచ్చిపడింది పూతన.

మేల్కొన్న తెఱగున మెల్లన కనువిచ్చి
క్రేగంట జూచుచు గిదికి నీల్గి
యావులించుచు జేతులాదరంబున జూచి
యొదికిలి యాకొన్న యోజనూది
బిగిచన్నుగవ గేల బీడించి కబళించి
గ్రుక్క గ్రుక్కడు గుటు గుబుకు మనుచు
నొకరెండు గ్రుక్కల నువిద ప్రాణంబులు
సైతము మేనిలో సత్త్వమెల్ల

ద్రావె నదియును గుండెలు దల్లడిల్ల
దిమ్మ దిరుగును నిలివక శిరము వ్రాల
నితర బాలుర క్రియవాడ వీవు గావు
చన్ను విడువుము విడువుము చాలు ననుచు

నిబ్బరపు దప్పి మంటలు
ప్రబ్బిన ధృతి లేక నేత్ర పదహస్తంబుల్
గొబ్బున వివృతములుగ నా
గుబ్బాగుబ్బయిన కూత గూలెన్ నేలన్!

విషధరరిపు గమనునికిని
విషగళ సఖునికి విమల విషశయనునికిన్
విషభవభవ జనకునికిని
విషకుచ చనువిషము గొనుట విషమే తలపన్!

విషాన్ని ధరించే పాముల శత్రువైన గరుత్మంతుడిపై తిరిగేవాడూ, విషాన్ని ధరించిన శివుని చెలికాడూ, విషధరమైన శేషునిపై పరుండేవాడూ, విషము(నీరు)నుంచి పుట్టిన పద్మంలోంచి పుట్టిన బ్రహ్మకి తండ్రీ - ఆ జగన్నాథుడు! అతన్ని విషపు చనుబాలు ఏం చేస్తాయి!

చూసారా మన చిన్నికృష్ణుడింతలోనే బుడిబుడి అడుగులు వేస్తున్నాడు!
రెండడుగులతో నింగీ నేలా ఆక్రమించుకొన్న అతను అడుగులు వెయ్యడం మొదలుపెట్టగానే, అతని శత్రువుల అడుగులు తడబడి కూలబడిపోయారట!

అడుగులు వే గలిగియు రెం
డడుగులనే మన్ను మిన్ను నలమిన బాలుం
డడుగిడ దొరకొనె శాత్రవు
లడుగులు సడుగులును వదలి యడుగవని బడన్

ఆహా ఆ బలరామ కృష్ణుల బాల్యక్రీడలు వర్ణించడం ఎవరి తరం!

తనయీడు గోప బాలురు
దను గొలువగ రాము గూడి తనువు గలుగుచుం
దనుగమనంబున గృష్ణుడు
తను మధ్యలు మెచ్చ నీలతనురుచి దనరెన్

బాల కృష్ణుడప్పుడే నవనీత చోరుడైపోయాడు! గోపాలుర ఇండ్లలో వెన్నంతా దొంగిలించి తిని ఏవీ ఎరగనట్లు వచ్చి తల్లిని బువ్వపెట్టమని అడుగుతున్నాడు చూడండి!

వల్లవ గృహ నవనీతము
లెల్లను భక్షించి వచ్చి యెఱగని భంగిం
దల్లి గదిసి చిట్టాడుచు
నల్లన చను బువ్వ బెట్టు మమ్మా యనుచున్

ఇలా అల్లరి చేస్తే ఆ గోపకాంతలు ఊరుకుంటారా ఏమిటి? వెళ్ళి యశోదకు చెప్పే మిషతో ఆ గోపాలబాలుని కొంటెపనులని ఎంత సొగసుగా వర్ణిస్తున్నారో వినండి మరి!

బాలురకుబాలు లేవని
బాలెంతలు మొఱలువెట్ట బకబక నగి యీ
బాలుండాలము సేయుచు
నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

పడతీ నీ బిడ్డడు మా
కడవలలో నున్న మంచి కాగిన పాలా
పడుచులకు బోసి చిక్కిన
కడవల బో నడచె నాజ్ఞ గలదో లేదో!

చిన్నపిల్లలికి పాలులేవని ఓ మూల బాలెంతలేడుస్తూ ఉంటే, నవ్వుతూ ఆవులవద్దకి పెయ్యలని వదిలిపెట్టాడు! వచ్చి, మేము కడవలలో దాచుకున్న కాగిన పాలన్నీ తీసుకెళ్ళి ఆ బాలెంతలకి పోసాడు. కడవలనేమో పగలుకొట్టేసాడు!
చిన్ని కృష్ణుడి ఆగడాలకి అంతూ పొంతూ ఉందా!

పుట్టి పుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చి తా
నుట్టి యందక ఱోళ్ళు బీటలునొల్ల ప్రోవిడి యెక్కి చే
వెట్టజాలక కుండ క్రిందొక పెద్ద తూటొనరించి మీ
పట్టి మీగడపాలు జేరల బట్టి ద్రావె తలోదరీ!

ఉట్టిమీద అందకుండా పాలని దాచుకుంటే, ఇంట్లో ఉన్న చిన్న ఱోళ్ళూ పీటాలూ అన్నిటినీ ఎత్తుపెట్టి, ఎక్కి, అయినా కుండలోపలకి చెయ్యిపెట్టడం వీలుకాక ఏం చేసాడో తెలుసా? ఆ కుండకి పెద్దకన్నం పెట్టి ఆ మీగడపాలు చేత్తో జుఱ్ఱుకుంటూ తాగేసాడు!

వారిల్లుసొచ్చి కడవల
దోరంబగు నెయ్యిద్రావి తుది నా కడవల్
వీరింట నీ సుతుండిడ
వారికి వీరికిని దొడ్డ వాదయ్యె సతీ!

పాలూ పెరుగూ దొంగతనంగా తిని ఊరుకున్నాడా మీ చిలిపి కన్నయ్య. వాళ్ళింట్లో కడవలు తీసుకొచ్చి వీళ్ళింట్లో పెట్టి వాళ్ళకీ వీళ్ళకీ మధ్య తగువులు పెట్టాడు!

ఓ యమ్మ నీ కుమారుడు
మా యిండ్లను బాలు బెరుగు మననీ డమ్మా!
పోయెద మెక్కడి కైనను
మా యన్నల సురభు లాన! మంజుల వాణీ!

అమ్మా యశోదమ్మా! నీ కొడుకు మా యిళ్ళల్లో పాలూపెరుగూ యింక ఉండనివ్వడని తేలిపోయింది. మా అన్నల గోవులని నమ్ముకొని ఇంకెక్కడికైనా పోతాం మేము!
ఇలా ఆ రెపల్లె మగువలు గోలపెడితే, అంతా విని యశోద ఏమంది?

చన్ను విడిచి యిట్టటు చన
డెన్నడు బొరుగిండ్ల త్రోవ లెఱుగడు నేడుం
గన్నులు దెఱవని మా యీ
చిన్ని కుమారకుని ఱవ్వ సేయం దగునే!

నా యెదనే వదలిపోని నా చిన్నికృష్ణుడి మీద ఇలా చాడీలు చెప్తారా అంటోంది! అహా ఏమి చోద్యం! ఆ యశోదకు తన నందకిశోరుని మీద ఎంత ప్రేమ!
ఇక కృష్ణుని అల్లరికి అదుపేముంటుంది?
అదిగో మన్ను తినే ఆ కన్నయ్యను చూడండి. అమ్మా తమ్ముడు మన్ను తినేనే అని చెప్తున్న ఆ రామన్నను చూడండి. ఎంత ప్రేమైతే మాత్రం మన్ను తిన్నాడంటే ఊరుకుంటుందా ఆ తల్లి, అన్నా అని చెవినులిమి యశోద, "ఏదన్నా నీ నోరుచూపూ" అంది. ఆ దొంగ కృష్ణుడు ఎంత అమాయకంగా మొహం పెట్టాడో చూడండి. పైగా మన్ను తినడానికి తనేం వెఱ్ఱివాడినా అంటున్నాడు:

అమ్మా మన్నుదినంగ నే శిశువునో యాకొంటినో వెఱ్రినో
నమ్మంజూడకు వీరిమాటలు మదిన్ నన్నీవు గొట్టంగ దా
రిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గం
ధమ్మాఘ్రాణము చేసి నా వచనముల్ దప్పైన దండింపవే!

నా నోటివాసన చూడు కావలిస్తే అని నోరు తెరిచాడు. ఇంకేముంది! అందులో సమస్త భువనాలూ కనిపించాయి! ఆ రూపాన్ని చూసిన యశోద ఏమనుకుంది?

కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్ నేరక యున్నదాననొ యశోదాదేవినే గానో పర
స్థలమో బాలకుడెంత యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమిహేతువొ మహాశ్చర్యంబు జింతింపగన్!

కలా వైష్ణవమాయా అనుకుంది! తనసలు యశోదాదేవినేనా అన్న సందేహం కలిగింది! యశోద తాపము నశియించి జన్మ ధన్యత గాంచింది!
కానీ తర్వాత మళ్ళీ మామూలే. ఆ స్పృహని మాయ కమ్మేసింది. లేకపోతే చిన్నారి శ్రీకృష్ణుడి చిలిపి ముచ్చట్లని తల్లిగా ఎలా అనుభవించగలదు?
కృష్ణుని ఆగడాలు మళ్ళీ మామూలే. ఇక లాభంలేదు, ఇతన్ని పట్టుకొని రోటికి కట్టేస్తే కాని ఈ ఊరిమీద పెత్తనాలు ఆగవని నిశ్చయించుకుంది యశోద. కాని అంత సులువుగా పట్టుబడతాడా కృష్ణుడు! ఘల్లు ఘల్లుమనే గజ్జలతో ఇటూ అటూ పెరిగెట్టాడు బాల గోపాలుడు.

గజ్జెలు గల్లని మ్రోయగ
నజ్జలు ద్రొక్కుటలు మాని యతిజవమున యో
షిజ్జనములు నగ దల్లియు
బజ్జం జనుదేర నతడు పరువిడె నధిపా!

మొత్తానికి అతన్ని పట్టుకుంది యశోద! పట్టుకొని ఏమంటోంది? "ఓహో! మీరేనా శ్రీ కృష్ణులంటే! మీకు వెన్నంటే అసలు తెలీదటకదా! దొంగతనమే చెయ్యరట కదా! అహా, ఈ భూలోకమంతటా మీ అంతటి బుద్ధిమంతులసలు ఉన్నారా?" అంటోంది!

వీరెవ్వరు శ్రీకృష్ణులు
గారా యెన్నడును వెన్నగానరట కదా!
చోరత్వంబించుకయును
నేరరట ధరిత్రి నిట్టి నియతులు గలరే!

"నువ్వెవరికీ పట్టుబడవని అందరూ అంటారే. నేను తలచుకొంటే నిన్ను పట్టుకోవడం ఒక పెద్ద పనా! నాకు కాక నువ్వెవరికి పట్టుబడతావు?" అని కూడా అంటోంది. నిజంగానే ఎవరికీ చిక్కని ఆ పరమాత్ముడు యశోదకి చిక్కాడు.

పట్టిన బట్టువడని నిను
బట్టెద నని చలముగొనిన బట్టుట బెట్టే
పట్టువడవండ్రు పట్టీ
పట్టుగొనన్ నాకుగాక పరులకు వశమే!

అలా పట్టుకొన్న కృష్ణుణ్ణి యశోద అదుగో ఆ రోటికి కట్టేసింది.

ఆ లలన గట్టె ఱోలన్
లీలన్ నవనీత చౌర్యలీలున్ బ్రియ వా
గ్జాలున్ బరివిస్మిత గో
పాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్!

చిక్కడు సిరికౌగిటిలో
జిక్కడు సనకాదియోగి చిత్తాబ్జములన్
జిక్కడు శ్రుతిలతికావలి
జిక్కె నతడు లీల దల్లి చేతన్ ఱోలన్!

అపళంగా ఆ కృష్ణుడేం చేసాడు? ఊపున పోయి పెరట్లో ఉన్న మద్ది చెట్లు రెండిటినీ కూల్చేసాడు!

ముద్దుల తక్కరి బిడ్డడు
మద్దుల గూల్పంగ దలచి మసలక తా నా
మద్దికవ యున్న చోటికి
గ్రద్దన ఱోలీడ్చుకొనుచు గడకం జనియెన్

బాలుడు ఱోలడ్డము దివ
మూలంబులు వెకలి విటపములు విఱిగి మహా
భీల ధ్వని గూలెను శా
పాలస్య వివర్జనములు యమళార్జునముల్

ఆ మద్దిచెట్లు కూకటి వేళ్ళతో సహా పెకలించబడి విరిగి పడిపోయాయి. శాపగ్రస్తులైన నలకూబర మణిగ్రీవులకి శాపవిమోచనమయ్యింది!

ఇంతలో అందరూ రేపల్లెని విడిచి బృందావనం చేరుకున్నారు. ఇది శ్రీకృష్ణుని రక్షణ కోసమట. సర్వ జగద్రక్షణుడైన ఆ హరికి రక్షణా! అతడే అందరినీ కాపాడేవాడు. అక్కడ కాళింది మడుగులో కాళీయుడున్నాడు. అతన్నుంచి ఈ గోపాలురందరినీ రక్షించాలని నిశ్చయించుకున్నాడు మన గోపాలపాలుడు! ఇంకేముంది. అన్నుకున్నదే తడవు, చెట్టెక్కి ఆ నదిలోకి దూకబోతున్నాడు. ఆహా ఆ సుందర దృశ్యాన్ని ఎంత సొగసుగా వర్ణించాడు పోతన! స్వయంగా కళ్ళతో చూసినట్టు, కళ్ళకు కట్టేట్టు ఉంది చూడండి.

కటి చేలంబు బిగించి పింఛమున జక్కం గొప్పు బంధించి దో
స్తట సంస్ఫాలన మాచరించి చరణ ద్వంద్వంబు గీలించి త
త్కుట శాఖాగ్రము మీదనుండి యుఱికెన్ గోపాల సింహంబు ది
క్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుభ ధ్వానంబనూనంబుగన్

నడుం చుట్టూ తన చేలాన్ని బిగించాడు. పింఛంలో కొప్పుని సరిచేసుకున్నాడు. రెండు జబ్బలూ చరిచాడు. రెండు కాళ్ళనీ అదిమిపట్టి ఒక్కసారిగా ఆ చెట్టుకొమ్మపైనుంచి గభీలుమని ఆ నదిలోకి దూకాడా గోప కిశోరుడు! గుభగుభ మంటూ పెద్ద శబ్దం నలుదిక్కులా కమ్ముకుంది.
అంతే. ఆ కాళీయునితో యుద్ధం చెయ్యడం అతని పీచమడచడం అయిపోయాయి. అహా! కాళీయఫణి ఫణజాలాన ఝణ ఝణ మంటూ కేళి ఘంటించిన ఆ గోప కిశోరమూర్తి ఎంత మనోహరంగా ఉన్నాడు!

ఘన యమునానదీ కల్లోల ఘోషంబు
సరస మృదంగ ఘోషంబుగాగ
సాధు బృందావనచర చంచరీక గా
నంబు గాయక సుగానంబుగాగ
గలహంస సారస కమనీయ మంజు శ
బ్దంబులు దాళ శబ్దములుగాగ
దివినుండి వీక్షించు దివిజ గంధర్వాది
జనులు సభాసీన జనులుగాగ

బద్మరాగాది రత్న ప్రభాభాసమాన
మహిత కాళియ ఫణిఫణా మండపమున
నళినలోచన విఖ్యాత నర్తకుండు
నిత్యనైపుణ్యమున బేర్చి నృత్యమాడె!

యమునానది అభంగ తరంగాలు మృదంగనాదం చేస్తున్నాయి. బృందావనంలో తిరుగాడే తుమ్మెదలు ఝుమ్మని గానం చేస్తున్నాయి. కలహంస, సారసములు సొంపైన నడకతో తాళాన్ని వేస్తున్నాయి. పైనున్న దేవతలందరూ ప్రేక్షకులయ్యారు. మణులు పొదిగున్న ఆ కాళీయుని పడగ రత్నవేదికగా మారింది. ఆ పద్మాక్షుడు తన సహజ ప్రతిభతో అక్కడ నృత్యం చేసాడు!

బృందావనమంతా ఒక ప్రశాంత వాతావరణం నెలకొంది. గోపాలుడు మురళీ లోలుడయ్యాడు. ఆ మోహన రూపాన్ని, ఆ మనోహర గానాన్ని చూసి గోపబాలలంతా పులకిస్తున్నారు.

శ్రవణోదంచిత కర్ణికారకముతో స్వర్ణాభ చేలంబుతో
నవతంసాయిత కేకిపింఛకముతో నంభోజ దామంబుతో
స్వవశుండై మధురాధరామృతముచే వంశంబు బూరించుచు
న్నువిదా మాధవు డాలవెంట వనమం దొప్పారెడిం జూచితే!

చెవులకి ఆనందమైన చెవికమ్మ, బంగారు చేలము, శిఖగా చేయబడిన పింఛము, మెడలో తామరపూల దండ. తరగని సౌందర్యంతో, తనలో తాను లీనమై తన పెదాల అమృతంతో ఆ వేణువుకి జీవం పోస్తున్న ఆ మాధవుని చూడండని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుంటున్నారు.

గిరులెల్ల జలము లయ్యెం
దరులెల్లను బల్లవించె, ధరణి గగన భూ
చరు లెల్లను జొక్కిరి హరి
మురళిరవామృతము సోక ముద్దియ కంటే!

ఆ గానానికి కొండలు కరిగాయి. చెట్లు పుష్పించాయి. ముల్లోకాలలోని జీవజాలమంతా ఆ మురళీ గానామృతంలో తన్మయమయ్యింది!

అంతలోనే మళ్ళీ ఓ ప్రమాదం ముంచుకొచ్చింది. తనకి పూజలు చెయ్యొద్దన్నాడని కృష్ణుడిమీద ఇంద్రునికి కోపం వచ్చింది. ఆ బృందావనంలో ప్రజలందరినీ శిక్షించాలనుకున్నాడు. రాళ్ళ వర్షం కురిపించాడు. అయినా ఆ పరమాత్ముని పాలనలో ఆ గోపాల బృందానికి ఆపదలు వస్తాయా?

బాలుండాడుచు నాతపత్రమని సంభావించి పూగుత్తి కెం
గేలం దాల్చిన లీల లేనగవుతో గృష్ణుండు దా నమ్మహా
శైలంబున్ వలకేల దాల్చి విపులచ్ఛత్త్రంబుగా బట్టె నా
భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీగోప గోపంక్తికిన్!

ఆడుతూ ఆడుతూ వెళ్ళి - అదేదో గొడుగనుకున్నాడు కాబోలు, పూలగుత్తి నెత్తినంత సులువుగా గోవర్ధన గిరిని తన కుడిచేత్తో ఎత్తేసాడు. చిరునవ్వుకూడా చెరగలేదు! చిటికిన వేలిపై ఆ కొండని నిలబెట్టి, నింగినుండి కురుస్తున్న రాళ్ళ వర్షానికి చకితులైన ఆబాలగోపాలాన్నీ పిలుస్తున్నాడు. ఏమని?

బాలుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైరింపగా
జాలండో యని దీని క్రింద నిలువన్ శంకింపగా బోల దీ
శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నా
కేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందం బ్రమోదంబునన్!

నేనేదో చిన్న కుఱ్ఱాణ్ణీ, ఈ పెద్ద కొండని మొయ్యగలనా అని సందేహించకండి అంటున్నాడు! బలే కృష్ణా! అంత పెద్ద కొండని ఎత్తిపట్టుకోడం చూసిన ఆ జనులకి నువ్వొక చిన్న పిల్లాడిలా అసలు కనిపిస్తావా? అయినా కొందరు మందబుద్ధుల సందేహాలని పూర్తిగా పోగొట్టాలనుకుంటున్నావు, అంతే కదా! ఈ కొండలూ, సముద్రాలూ, జంతుజాలము సమస్తమూ నిండిన భూవలయమే పైబడినా నా చేయి అల్లాడదు, హాయిగా నిశ్చింతగా ఇక్కడకి రండని పిలిచాడు.
అహా! ఆ గోకులానిది ఎంత అదృష్టం! లోక సంరక్షకుడైన ఆ కృష్ణుని రక్షణ దొరకింది.

అసలే కృష్ణుడు మోహనాకారుడు. మనోహరుడు. నవనీత చోరుడే కాదు, నవలామానస చోరుడు కూడా అయ్యాడు! బృందావనంలోని గోపికలందరి హృదయాల్లోనూ అతనే నిండిపోయాడు. అద్దమ రేయి బయలుదేరి, ఇల్లూవాకిలీ వదిలేసి, అతని వద్దకు పరుగుపరుగున వచ్చేసారు! ఏవీ ఎరగనట్టు కృష్ణుడు, ఇదేమిటని అడిగితే, తమ గోడుని విన్నవించుకుంటున్నారు.

నీ పాదకమలంబు నెమ్మి డగ్గఱగాని
తరలి పోవంగ బాదములు రావు
నీ కరాబ్జంబులు నెఱి నంటితివగాని
తక్కిన పనికి హస్తములు సొరవు
నీ వాగమృతధార నిండ గ్రోలగగాని
చెవులన్య భాషలు సేరి వినవు
నీ సుందరాకృతి నియతి జూడగ గాని
చూడ వన్యంబుల జూడ్కి కవలు

నిన్న కాని పలుకనేరవు మా జిహ్వ
లొక్క ననుచు బలుక నోడ వీవు
మా మనంబు లెల్ల మరగించి దొంగిలి
తేమి సేయువార మింక కృష్ణ!

ఎంతటి భక్తి పారవశ్యమది! మా మనసులని మరిగించి దొంగిలించుకు పోయావు, ఇంక మేమేమి చెయ్యగలమని వేడుకొన్నారు. కానీ కృష్ణుడు వాళ్ళనింకా పరీక్షించాలనుకున్నాడు. కనపడకుండా మాయమయ్యాడు. అతని కోసమా బృందావనమంతా వెతుకుతున్నారు పాపం గోపికలు.

నల్లనివాడు పద్మనయనంబుల వాడు కృపారసంబు పై
జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచె నో
మల్లియలార మీ పొదలమాటున లేడుగదమ్మ చెప్పరే!

మల్లెపొదలమాటున దాక్కున్నాడేమోనని ఆ మల్లెపూలని అడిగారు. ఊహూ జవాబు లేదు! అలా చెట్టూ పుట్టా వెతికినా కృష్ణుడు దొరకలేదు.

గోవుల వెంట ద్రిమ్మరుచు గొల్చినవారల పాపసంఘముల్
ద్రోవగ జాలి శ్రీ దనరి దుష్టభుజంగ ఫణాలతాగ్ర సం
భావితమైన నీ చరణపద్మము చన్నుల మీద మోపి త
ద్భావజపుష్పభల్లభవ బాధ హరింపు వరింపు మాధవా!

అంటూ, గోపికా గీతికలాలపించారు. కృష్ణుని నవనీత హృదయం కరిగింది. వాళ్ళను చేరుకున్నాడు.

పాయని గేహశృంఖలల బాసి నిరంతర మత్పరత్వముం
జేయుచునున్న మీకు బ్రతిసేయ యుగంబులనైన నేర నన్
బాయక గొల్చుమానసము ప్రత్యుపకారముగా దలంచి నా
పాయుట దప్పుగా గొనక భామినులార కృపన్ శమింపరే!

నామీద నిరంతరమూ మీకున్న ఈ భక్తి తత్పరతకి నేను యుగయుగాలైనా బదులు తీర్చుకోలేనన్నాడు. వాళ్ళనలా విడిచి వెళ్ళిపోవడం తప్పుగా భావించక దయతో శాంతించమన్నాడు. కృష్ణుడు తమని చేరుకోవడం కన్నా శాంతి మరేముంది ఆ గోపికలకు.

ఆ సమయంబునన్ విభుడనంతుడు కృష్ణుడు చిత్రమూర్తియై
చేసెను మండలభ్రమణశీల పరస్పర బద్ధ బాహు కాం
తా సువిలాసమున్ బహువిధ స్ఫురితానన హస్త పాద వి
న్యాసము రాసముం గృత వియచ్చర నేత్ర మనోవికాసమున్!

లీలామానుష స్వరూపుడైన ఆ స్వామి, అనంత మూర్తులని ధరించి, ప్రతి గోపిక మధ్యా ఒక కృష్ణుడై, వాళ్ళతో చేయీ చేయీ కలిపాడు. అందరూ చక్రాకారంలో నిలుచుని నాట్యం చేసారు. అదే రాసకేళి. ఆ విరళీకృత నవ రాసకేళిలో అందరూ పరమానందంగా ఓలలాడారు!

అప్పుడా దివ్యమోహన సుందరమూర్తి ఇలా ఉన్నాడు:

కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేచ ముక్తావళీ
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణీ!


పూర్తిగా చదవండి...

Friday, August 22, 2008

ప్రారంభించిన వేదపాఠమునకున్...


ఓ తెలుగింటి ఆడపడుచు పుట్టింటికి వచ్చింది. చాన్నాళ్ళై చూడని తమ్ముడు ఇంట్లో లేడు. కొంతసేపటికి వచ్చాడు. రాగానే ఆప్యాయమైన ఆ పలకరింపు ఎలా ఉంటుంది?
"ఏరా తమ్ముడూ బొత్తిగా నల్లపూసవైపోయావు? సెలవలే దొరకటం లేదా! నిన్నుచూడాలని కళ్ళుకాయలుకాచిపోయాయి మాకు! నువ్వెటూ రాలేదు, ఆఖరికి మేమే వచ్చాం..." ఇలానే కదా సాగుతుంది. ఇది పద్యంలో పెడితే ఎలా ఉంటుంది?

ప్రారంభించిన వేదపాఠమునకున్ బ్రత్యూహమౌనంచునో
ఏరా తమ్ముడ! నన్ను జూడ జనుదే వెన్నాళ్ళనో యుండి, చ
క్షూ రాజీవయుగంబు వాచె నిను గన్‌గోకున్‌కి, మీ బావయున్
నీ రాకల్ మదిగోరు జంద్రుపొడుపున్ నీరాకరంబుంబలెన్

అసలు సందర్భం తెలిస్తే ఇక్కడ పైకి కనిపించే ఆప్యాయత వెనకాల ఎంత వెటకారముందో అర్థమవుతుంది. ఆ తమ్ములుంగారు నిగమశర్మ. అతని అక్క అతని అక్కే, నిగమశర్మ అక్క. నిగమశర్మ చక్కని సదాచారుడైన వేదపండితుని యింట పుట్టీ, కాస్తైనా చదువుకొని కూడా వ్యసనాలకి బానిసైపోయి భ్రష్టుపట్టి పోతాడు. కన్న తల్లిదండ్రులనీ కట్టుకున్న భార్యనీ పట్టించుకోకుండా, ఉన్న సంపదనంతా తగలేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇతని అక్కగారు చక్కగా వేరే ఊళ్ళో భర్తా పిల్లతో సంసారం చేస్తూ ఉంటుంది. ఆవిడకి తన తమ్ముడి సంగతి తెలుస్తుంది. పాపం ఆపేక్షతో తన తమ్ముణ్ణి చక్కదిద్దాలని పుట్టింటికి సపరివారంగా వస్తుంది. చూస్తే తమ్ముడు కనపడడు. ఇల్లేమో పాడుపడినట్టుంటుంది. ఇంటిని కాస్త చక్కదిద్ది తమ్ముడికోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కొన్నాళ్ళకతడు పొద్దున్నే ఊడిపడతాడు, ఇంత చద్దన్నం తిని మళ్ళీ పోవడానికి. అక్కని చూసి ఆశ్చర్యపోతాడు. తనకి క్లాసుపీకడానికే వచ్చిందని అర్థమయ్యే ఉంటుంది నిగమశర్మకి. అయితే ఆ అక్కగారు చాలా తెలివైనది. వచ్చీ రాగానే మొదలుపెడితే ఎదోలా మళ్ళీ ఉడాయిస్తాడని ఆవిడకి తెలుసు. తెలివిగా తమ్ముడిపై ఆప్యాయత చూపి చక్కగా స్నానం అదీ చేయించి, కమ్మని భోజనం పెట్టి, మరదలిచేత తాంబూలం ఇప్పించి అప్పుడు తీరిగ్గా పరామర్శించడం మొదలుపెడుతుంది. అదుగో సరిగ్గా అప్పుడు వచ్చే పద్యం ఇది!

ఈ కథ తెనాలి రామకృష్ణుడు రాసిన పాండురంగ మాహాత్మ్యంలోనిది. తెనాలికవి పేరు తెలియని తెలుగువాడుండం చాలా అరుదు. ఇతని పేరుమీదున్న కథలూ, చాటువులూ అబ్బో ఎన్నో ఎన్నెన్నో! ఇతనికున్న "వికటకవి" బిరుదు కూడా బ్లాగుజనాలకి కొత్తకాదు :-) అయితే ఇతను రాసిన ఈ "పాండురంగ మాహాత్మ్యం" కావ్యం గురించి తెలుసున్నవాళ్ళు తక్కువేనేమో. ఇదో విచిత్రమైన కావ్యం. రామకృష్ణుడంటే మనికి తెలిసున్న కొంటెతనమంతా ఈ కావ్యంలోనూ కనిపిస్తుంది. బాహాటంగా కాదు, నర్మగర్భంగా! అవ్వడానికి ఇదీ కాళహస్తి మాహాత్మ్యం, శివరాత్రి మాహాత్మ్యం మొదలైనవాటిలాగ భక్తి ప్రబంధమే. కానీ తెనాలి రామకృష్ణుడు ధూర్జటిలా భక్తుడు కాదు. పోనీ రాయల మాదిరి మతప్రచారం చెయ్యడమైనా ఇతని ఉద్దేశంగా కనిపించదు. పెద్దనలాగా రసహృదయుడా అంటే అదీ కాదు! ఇతని మనసు అతిచంచలమైనది, రసాస్వాదన చేసే నిలకడ ఎక్కడిది! మరేవిటీ కావ్యం, ఎందుకు రాసాడూ అని ఆలోచిస్తే, ఇదో పెద్ద వ్యంగ్య(వెటకార) కావ్యంగా, పెద్ద parodyలా అనిపిస్తుంది. ఇందులోని కథలు కాని (చాలావాటికి ఎక్కడా ఆధారం కనిపించదు, ఇతని స్వకపోలకల్పితాలేనేమో), కథనం కాని, మాటల కూర్పుకాని, పద్య నిర్మాణం కాని అన్నిట్లోనూ గర్భితమైన ఒక వ్యంగ్యాన్ని చూడవచ్చు. ఆనాటి సమాజంపై, మనుషులపై ఒక వ్యంగ్యాస్త్రమేమో అనిపిస్తుంది. అయితే ఇదంతా ఖచ్చితంగా, ప్రస్పుటంగా కనిపించదు. అదే తమాషా! సన్నాయి నొక్కులు నొక్కడంలో, పోలీసు దెబ్బలు కొట్టడంలో ఇతను సిద్ధహస్తుడు. సరే విచిత్రమైన మాటల కూర్పుతో చాలాచోట్ల హాస్యాన్నీ విస్మయాన్నీ కూడా పండిస్తాడు.

ప్రస్తుత పద్యానికి తిరిగి వస్తే, ఈ నేపథ్యంలో మళ్ళీ పద్యాన్ని చదవండి. నిగమశర్మ చదువూ సంధ్యా లేకుండా తిరుగుతున్నాడు. ఆ విషయం అక్కగారికి తెలీదనుకొనేంత మూర్ఖుడు కాడతను. మరి మొదలుపెట్టడమే, "నీ వేద పాఠానికి ఆటంకమని చెప్పా చాన్నాళ్ళై మమ్మల్ని చూడ్డానికి రాలేదు" అని అక్కగారడిగితే అతని పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి! చీవూ నెత్తురూ ఉన్నవాడికి తగలాల్సిన చోట తగలదూ! పైగా నిన్నుచూడక "చక్షూరాజీవ యుగంబు" వాచిపోయిందంటోంది. కళ్ళనే మాటకి అంత బరువైన సంస్కృత సమాసం (అలంకార సహితంగా) వెయ్యడమెందుకు? ప్రాసకోసమా? మరింత వెటకారం కోసం. ఇప్పటికీ మనం వెటకారానికి అప్పుడప్పుడు కాస్త ఘనమైన పదాలు వాడుతూ ఉంటాం కదా. పైగా "మీ బావ కూడా నువ్వొస్తావని, చంద్రోదయం కోసం ఎదురుచూసే సముద్రంలా ఎదురుచూస్తున్నా"రంటోంది. ఇది మరీ విడ్డూరం! నిజానికి మామూలు తెలుగిళ్ళల్లో అయితే ఇదంత విడ్డూరమైన విషయం కాదు. అక్క భర్తతో బావమరిదికి ఒక ప్రత్యేకమైన చనువు ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక పార్టీ అయిపోయి ఆవిడగారిని ఆటపట్టిస్తూ ఉంటారు. తన తమ్ముడిపై భర్త చూపించే ఆప్యాయతకి ఆ యిల్లాలు మురిసిపోతూ ఉంటుంది. ఆ బంధుత్వంలో సారస్యమే వేరు, అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది!
కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. ఈ నిగమశర్మకి బావమాట దేవుడెరుగు తన ఇంట్లోవాళ్ళే పట్టరు కదా! అంచేత ఇలా అనడం మరింత విడ్డూరం. తమ్ముడికి వేస్తున్న మరో చురక. పైగా యిక్కడ యీవిడ కవిత్వం కూడా వెలగపెడుతోంది. చంద్రోదయం కోసం ఎదురు చూసే సముద్రంలా అతని బావ అతని కోసం ప్రతీక్షించాడట. "నీ రాకల్" మదిగోరు అనడంలో మళ్ళీ శ్లేష కూడానూ. పున్నమినాటి చంద్రుడి కళకి "రాక" అని పేరు. భేష్ రామకృష్ణా! బయటకి కనిపించని వెటకారాన్ని తీవ్రస్థాయికి తీసుకువెళ్ళడానికి అలంకారాలని ఎంత చక్కగా ఉపయోగించుకున్నావ్!
నిజానికిది రామకృష్ణుని గొప్పతన మనలేం, ఇది తెలుగుభాషలో ఉన్న గుణం. తెలుగు భాషకి అతి సహజంగా ఆ సొంపును తెచ్చిపెట్టే తెలుగింటి ఆడపడుచుల సంభాషణా చాతుర్యం! ఆ సంభాషణా చాతుర్యాన్ని సందర్భోచితంగా పద్యంలో బంధించడం తెనాలి కవి ప్రతిభ.

ఈ పద్యం "ఏరా తమ్ముడ!" అన్న సంబోధనతో మొదలుపెట్టవచ్చు. ఇంచుమించు యథాతథంగా రెండవ పాదాన్ని మొదటి పాదంగానూ, మొదటిపాదాన్ని రెండవ పాదంగానూ మార్చవచ్చు. కానీ మన కవిగారెందుకలా పద్యాన్ని నిర్మించలేదు? పద్యం మధ్యలో సంబోధన రావడంలో ఒక సొగసుంది. "ఏరా తమ్ముడ" అని మొదలుపెడితే మామూలు మాటల్లా (casual talk) కాకుండా ఏదో ఉపన్యాసం మొదలుపెట్టినట్టుంటుంది. ఇక్కడది రక్తి కట్టదు. అది గ్రహించి దానికి తగ్గట్టు పద్యాన్ని నడిపించడం కవి చూపించిన పద్య రచనా శిల్పం.

నిగమశర్మ అక్కని ఇంత గొప్పగా చిత్రించి కూడా ఆవిడకో పేరు ప్రసాదించలేదు! అదే మరి రామకృష్ణుని కొంటెతనం :-) ఇంతకన్నా కొంటెతనం మరొకటి ఉంది. ఈవిడగారు ఎంత నచ్చచెప్పినా మారినట్టు నటిస్తాడే కానీ నిజంగా మారడు నిగమశర్మ. ఓ రోజు డబ్బు దస్కం మూటగట్టుకొని చక్కా ఉడాయిస్తాడు. పొద్దున్న విషయం తెలిసిన ఇంటిల్లపాదీ ఏడవడం మొదలుపెడతారు. నిగమశర్మ పారిపోయినందుకు కాదు, పోతూ పోతూ తమ తమకిష్టమైన వస్తువులు తీసుకుపోయాడనిట! ఆఖరికి ఇంత తెలివీ వ్యక్తిత్వమూ ప్రదర్శించిన ఆ నిగమశర్మ అక్కగారు కూడా తను కొత్తగా చేయించుకున్న ముక్కెర పోయిందని లబోదిబోమంటుందిట! మనుషులలో ఉండే సంకుచిత స్వభావాన్ని వెటకారం చెయ్యడమే రామకృష్ణుని పరమోద్దేశం. అతనికి పాత్రల ఔచిత్యంతో పనేలేదు.

తెలుగు అక్కలందరికీ ఒక ప్రతినిధిలా నిలిచిపోవాలనేమో, ఈ పాత్రకి పేరుపెట్టకుండా "నిగమశర్మ అక్క" అని ఊరుకున్నాడు తెనాలి రామకృష్ణుడు!


పూర్తిగా చదవండి...

Friday, August 15, 2008

స్వతంత్ర భారతి


అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ స్వాతంత్ర్య సమరాన్నీ, దానిలో పోరాడిన దేశభక్తులనీ, త్యాగధనులనీ ఈ రోజు తలచుకోవడం భారతీయులుగా మన కనీస కర్తవ్యం. ఈ సందర్భంగా కరుణశ్రీ "స్వతంత్ర భారతి" పద్యాలు మనసారా ఎలిగెత్తి పాడుకుందాం.
కరుణశ్రీ పద్యాలలో పదలాలిత్యమే కాదు, ఒక ఉత్సాహవంతమైన ధార కూడా ఉంటుంది. గొంతెత్తి పాడుకుంటే నవనవోన్మేషమైన ఒక నూతనోత్తేజం కలిగి మనసు పరవళ్ళు తొక్కుతుంది.
మరింక ఆలస్యం దేనికి...

స్వతంత్ర భారతి
-----------------
గణగణ మ్రోగెరా విజయఘంటలు భారతమాత మందిరాం
గణమున - ద్వారబంధముల గట్టిరి చిత్రవిచిత్ర రత్న తో
రణతతి - వీధివీధుల విరాజిలుచున్న వవే త్రివర్ణ కే
తనములు మేలుకాంచె పరతంత్ర పరాఙ్ముఖ సుప్త కంఠముల్

కంటికి కజ్జలమ్మునిడి, ఖద్దరు చీర ధరించి, నేడు పే
రంటము పిల్చుచున్నది స్వరాజ్యవధూమణి ప్రక్క యింటి వా
ల్గంటులు - కర్ణపేయములుగా ప్రవహించె "స్వతంత్ర భారతీ"
మంటపమందు శాంత సుకుమార మనోహర గాన వాహినుల్!

పాటాగొట్టి పరప్రభుత్వమునకున్, బ్రహ్మాండమౌ శాంతి పో
రాటంబున్ నడిపించినాడు మన వార్థాయోగి ఆంగ్లప్రభుల్
మూటల్ ముల్లెలు నెత్తికెత్తుకొని నిర్మోహాత్ములై సంద్రముల్
దాటంజొచ్చిరి నవ్వుకొన్నవి స్వతంత్ర స్వర్ణ సోపానముల్

నేతాజీ ప్రతిభాప్రతాములు, గాంధీతాత సత్యాగ్రహ
జ్యోతిర్దీప్తులు దేశభక్తుల అఖండోత్సాహముల్ విశ్వ వి
ఖ్యాతంబైన ఆగష్టువిప్లవ మహా గాధల్, సమైక్యమ్ములై
స్వాతంత్ర్యధ్వజ మెత్తె భారత మహాసౌధాగ్రభాగమ్ములన్

లాఠీపోటులు పూలచెండ్లు, చెరసాలల్ పెండ్లివారిండ్లు, ఏ
కాఠిన్యం బయినన్ సుఖానుభవమే, గాంధీ కళాశాలలో
పాఠంబుల్ పఠియించు శిష్యులకు తద్ బ్రహ్మాస్త్ర సంధానమే
పీఠంబుల్ గదలించి సీమలకు బంపెన్ శ్వేతసమ్రాట్టులన్

ప్రస్థానించిరి త్యాగమూర్తులు పవిత్రంబైన శ్రీకృష్ణ జ
న్మ స్థానంబున కేందరో నిహతులైనా రెందరో శౌర్య ధై
ర్య స్థైర్యంబులు చూపి విప్లవ సమిద్రంగమ్ములన్ వారి సు
ప్తాస్థి శ్రేణికలే పునాదులట మా స్వారాజ్య సౌధాలకున్

నీదేనోయి సమస్త భారతము తండ్రీ! ఇంక నీ గడ్డపై
లేదోయీ యధికార మెవ్వరికి పాలింపంగదోయీ! ప్రపం
చాదర్శంబుగ సర్వమానవ సమాహ్లాదంబు సంధిల్ల నీ
వైదుష్య ప్రతిభా విశేషములు విశ్వమ్మెల్ల కీర్తింపగన్!


పూర్తిగా చదవండి...

Thursday, August 7, 2008

పాపాయి పద్యాలు


ఉయ్యాలలో ఊగే పసిపాపాయిని చూస్తే, కాస్తో కూస్తో భావుకత ఉన్న ఎవరికైనా కవిత్వం వస్తుంది. కానీ ఇంత అందమైన కవిత్వం రాదేమో! జాషువా రాసిన యీ పద్యాలు చిన్నప్పుడు తెలుగు పాఠంగా చదువుకున్నాను. కానీ అప్పట్లో కన్నా, పెద్దయ్యాక, ఒక పాపకి తండ్రినయ్యాక, ఆ పాపాయి పసితనపు విలాసాలని స్వయంగా అనుభవించాక, ఇవి మరింత అందంగా కనిపించాయి.
ఆ అనుభూతిని రుచి చూడబోయేవాళ్ళు ఈ పద్యాలు చదివి కొంత ఊహించుకోవచ్చు. రుచి చూసినవాళ్ళు మళ్ళీ ఆ తీపిసంగతులు గుర్తు తెచ్చుకొని మురిసిపోవచ్చు.

బొటవ్రేల ముల్లోకముల జూచి లోలోన
ఆనందపడు నోరు లేని యోగి
తల్లిదండ్రుల తనూవల్లరి ద్వయికి వ
న్నియబెట్టు తొమ్మిదినెలల పంట
అమృతమ్ము విషమను వ్యత్యాస మెరుగ కా
స్వాదించ చను వెఱ్ఱిబాగులాడు
అనుభవించు కొలంది యినుమడించుచు మరం
దము జాలువారు చైతన్యఫలము

భాష రాదు, వట్టి పాలు మాత్రమె త్రాగు,
నిద్రపోవు, లేచి నిలువలేడు,
ఎవ్వరెరుగ రితని దే దేశమో గాని
మొన్న మొన్న నిలకు మొలచినాడు

నవమాసములు భోజనము నీర మెఱుగక
పయనించు పురిటింటి బాటసారి
చిక్కు చీకటి జిమ్ము జానెడు పొట్టలో
నిద్రించి లేచిన నిర్గుణుండు
అక్షయంబైన మాతృక్షీర మధుధార
లన్నంబుగా తెచ్చుకొన్న యతిధి
నును జెక్కిలుల బోసినోటి నవ్వులలోన
ముద్దుల జిత్రించు మోహనుండు

బట్ట గట్టడు, బిడియాన బట్టువడడు,
ధారుణీ పాఠశాలలలో జేరె గాని
వారమాయెనొ లేదొ మా ప్రకృతి కాంత
తెలిపి యున్నది వీని కాకలియు నిద్ర!

గానమాలింపక కన్నుమూయని రాజు
అమ్మ కౌగిటి పంజరంపు చిలుక
నునుపు(?) కండలు పేరుకొను పిల్ల వస్తాదు
ఊయేల దిగని భాగ్యోన్నతుండు
ఊఊలు నేర్చిన ఒక వింత చదువరి,
సతిని ముట్టనినాటి సాంబమూర్తి
ప్రసవాబ్ధి తరియించి వచ్చిన పరదేశి
తన యింటి కొత్త పెత్తనపు ధారి

ఏమి పని మీద భూమికి నేగినాడొ
నుడువ నేర్చిన పిమ్మట నడగవలయు
ఏండ్లు గడచిన ముందుముందేమొ గాని
యిప్పటికి మాత్ర మే పాప మెఱుగడితడు
(ప్రసవాబ్ధి తరియించి - ప్రసవమనే సముద్రాన్ని దాటి)

ఊయేల తొట్టి యే ముపదేశమిచ్చునో
కొసరి యొంటరిగ నూ కొట్టు కొనును
అమ్మతో తనకేమి సంబంధమున్నదో
యేడ్చి యూడిగము జేయించుకొనును
పరమేశ్వరుండేమి సరసంబులాడునో
బిట్టుగా గేకిసల్ కొట్టుకొనును
మూన్నాళ్ళలోనె ఎప్పుడు నేర్చుకొనియెనో
పొమ్మన్నచో చిన్నబుచ్చుకొనును

ముక్కుపచ్చ లారిపోయి ప్రాయము వచ్చి
చదువు సంధ్య నేర్చి బ్రతుకు నపుడు
నాదు పసిడికొండ నారత్నమని తల్లి
పలుకు, పలుకులితడు నిలుపుగాక!


పూర్తిగా చదవండి...