తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, July 30, 2008

రెండు కన్నీటి చుక్కలు


మొన్న మళ్ళీ పేట్రేగిన బాంబుల భీభత్సం మనిషిగా మళ్ళీ సిగ్గుతో చచ్చిపోయేలా...
ఏదో ఆవేశం ఏదో ఆవేదన ఎవీ చెయ్యలేని నిస్సహాయత... రెండు కన్నీటి బిందువులై రాలిపడింది.

మరల చెలరేగె విద్రోహ మారణాగ్ని
మరల కన్నీరు పెట్టెను భరతభూమి
మరల నరజాతి చరిత నెత్తురుల దడిసె
మానవత్వము మరణించె మరల మరల

ఎన్నడైన నరుడు, ఈ మృగత్వము వీడి
పూర్ణుడైన మనిషివోలె యెదిగి
శాంతి లోకమందు స్థాపించునో? చీడ
పురుగు లెక్క పుడమి చెరచి చెడునొ!

రెండు కన్నీటి చుక్కలు, రెండు పద్య
వేదనా పుష్పములు, రాల్చి, వేగ మరచి
తిరిగి యెప్పటి రీతి నే మెరుగనట్లు
బ్రతుకు సాగింతు జీవచ్ఛవమ్ము రీతి...


పూర్తిగా చదవండి...

Thursday, July 24, 2008

సుకవి జీవించు ప్రజల నాలుకలమీద!


ఆధునిక పద్యకవులలో నిస్సందేహంగా ఒక మహోన్నతస్థానాన్ని సొంతంచేసుకొన్న కవి జాషువా. అతని కవిత్వంలోని విస్తృతి, గాఢత, పద్య రచనలోని వాడీ వేడీ అతన్ని గొప్పకవిని చేసాయి. కవికోకిలని చేసాయి. నవయుగ కవిచక్రవర్తిని చేసాయి!

నా కవితావధూటి వదనమ్ము నెగాదిగ జూచి రూపరే
ఖా కమనీయ వైఖరుల గాంచి భళీభళి యన్నవారె నీ
దేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్!

అన్న జాషువా ఆవేదన విన్నప్పుడు కరగని హృదయం ఉంటుందా? అలా అని జాషువా భీరువు కాదు. అతని కవిత్వంలో ఆవేదన ఎంత ఉందో, ఆవేశం తెగింపూ తిరుగుబాటూ కూడా అంతే ఉన్నాయి.

గవ్వకుసాటిరాని పలుగాకుల మూక లసూయచేత న
న్నెవ్విధి దూరినన్, నను వరించిన శారద లేచిపోవునే!
ఇవ్వసుధాస్థలిన్ బొడమరే రసలుబ్ధులు, ఘంటమూనెదన్
రవ్వలురాల్చెదన్, గరగరల్ సవరించెద నాంధ్రవాణికిన్.

అని ప్రతిజ్ఞ పూని, దాన్ని సాధించిన కవి జాషువా. తెలుగుకవిత్వం ఉన్నంతకాలం జాషువా తెలుగువాళ్ళ గుండెల్లో మార్మ్రోగుతునే ఉంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఒకవైపు అచ్చమైన అందమైన అమాయకమైన పసిపాప, మరో వైపు తెలుగుజాతిపై తెలుగుభాషపై ఉప్పొంగే అభిమానం, ఇంకొకవైపు దళితజాతి చైతన్యాన్ని లోకానికి చాటే గబ్బిలం - జాషువా కలానికి అనంత ముఖాలు. అతను రాసిన శ్మశానవాటిక పద్యాలు, ఒక కాలంలో, నోటికి రాని తెలుగువారు అరుదంటే అతిశయోక్తికాదు. పద్యాలలో అభ్యుదయకవిత్వాన్ని రాసినవాళ్ళు మరికొందరున్నా, జాషువా పద్యాలు నా హృదయాన్ని తాకినంతగా మరెవ్వరివీ తాకలేదు.
ఈ రోజు అతని వర్ధంతి సందర్భంగా అతన్ని గుర్తుచేసుకోవడం, మనం మరచిపోతున్న తెలుగుదనాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తుచేసుకోవడమే! మనలోని మానవత్వాన్ని ఒక్కసారి తట్టిలేపడమే!
అతని "తెలుగు వెలుగు" ఖండికలోంచి కొన్ని పద్యాలు.

ఒకనాడాంధ్రుని కత్తి శాత్రవ బలవ్యూహాలపై రక్తనా
టకమున్ సల్పుట విస్మరింపకుము, గాఢంబైన పాశ్చాత్య శో
భకు నీ విప్పుడు లోభివైతివి, ప్రదీప్తంబైన నీ ప్రజ్ఞ నూ
రక పోనీక సముద్దరింపుకొను మాంధ్రా! వీర యోధాగ్రణీ!


బోళావాడవుగాన నీదు విభవంబున్ సత్కళామర్మముల్
జాలా భాగము కొల్ల బెట్టితివి నీ శాస్త్రప్రపంచంబులో
మేనెల్లన్ గబళించినారు పరభూమిశాగ్రణుల్, నేటికిన్
బోలేదేమియు దిద్దుకొమ్ము బలగంబున్ స్వీయ విజ్ఞానమున్.


తలికోట యుద్ధాన నళియ రాయుని వల్ల
ప్రిదిలిపోయినది నీ వీరదట్టి
మాయనాయకురాలి మారాముడుల చేత
శమియించె నీ బాలచంద్రరేఖ
బుద్ధిమాలిన చిన్ని పొరపాటుకతమున
వితమయ్యె నీ కొండవీటి పటిమ
ఉత్సాహయుతమైన యుడుకునెత్తురు లేక
ప్రాప్తింపలేదు రాష్ట్ర ధ్వజంబు.


పరువు దూలిన నీ యనాదరణ కతన
మేటి నీ భాష పొలిమేర దాటలేదు
పరుల విజ్ఞానమునకు సంబరము పడక
కడగి యొత్తుము నీ వీర కాహళంబు


చీనా పెగోడాల సిగమీది పుష్పమై
పొడమె నీ రాతిచెక్కడపు చెణుకు
అరవ పాటకుల తంబురకు ప్రాణమువోసి
కులికె నీ చిన్నారి తెలుగుబాణి
హిమవద్గిరులదాక జృంభించి పగవాని
తరిమి వెన్నాడె నీ కఱకుటలుగు
మొగలు రాజుల సభా భూములనూరేగె
నీ జగన్నాథపండితుని పలుకు


ఎందు జూచిన నీ యశస్స్యందనములు
నడచిపోయిన జాడ లప్పుడును గలవు
దిక్తటంబుల యలర నెత్తింపవోయి
తెలుగు మన్నీల పరువు నిగ్గుల పతాక!


పూర్తిగా చదవండి...

Saturday, July 19, 2008

తామసి


పూర్ణిమగారడిగిన "తామసి" పద్యాలివిగో.
ఇవి రాసింది దాశరథి కృష్ణమాచార్యులు. దాశరథిగా అందరికీ తెలుసు. సినిమా పాటల రచయితగా చాలామందికి తెలుసు. "నా తెలంగాణ కోటి రత్నాల వీణ" అని ఎలుగెత్తి చాటిన తెలంగాణా పోరాట కవిగా మరి కొందరికి తెలిసుంటుంది. ఇతని కవితల్లో అంగారం శృంగారం రెండూ కనిపిస్తాయని ప్రసిద్ధి. దాశరథి చాలా వివాదాలలో కూడా చిక్కుకున్నారు. శ్రీశ్రీకి దాశరథికీ పడేదికాదు.
ఏదేమైనా, ఆధునిక కాలంలో తెలుగుపద్యానికి అభ్యుదయమనే కొత్త శక్తినిచ్చిన కవులలో ఇతను ప్రసిద్ధుడు.

ఇతని గురించి మరికొన్ని వివరాలు వికీపీడియాలో చూడవచ్చు. దాశరథి కవితలు కొన్ని ఆంధ్రభారతి సైటులో చదువుకోవచ్చు.
ఈ తామసి పద్యాలు, దాశరథి రాసిన "అమృతాభిషేకం" అన్న కవితా సంపుటిలోనివి. ఇందులో మనం దాశరథిలోని భావకవిని చూస్తాం. చీకటిని వర్ణిస్తున్నాడు. చీకటంటే భావకవులకి చెప్పలేని ఇష్టం కదా!


తామసి
------

ఇరులు నిశాసతీ భుజములెక్కి, శిరమ్మున నిక్కి తారకా
తరుణి కపోలపాళికలు తాకి, విహాయస వీధి ప్రాకి, చం
దురు పయి సోకి, భూమిధర దుర్గమ వీధుల దూకి, మెల్లగా
ధరపయి కాలు మోపిన వుదారములై హరినీలకాంతులన్!
(నిశాసతి - రాత్రి అనే స్త్రీ, విహాయస వీధి - ఆకాశం)

ఇటు ప్రాకి అటు ప్రాకి ఇందుబింబాననా
ముఖముపై కస్తూరి బొట్టు పెట్టి
ఇటు దూకి అటు దూకి కుటిల నీలాలకా
భ్రుకుటికా ధనువు నంబకము కూర్చి
ఇటు సాగి అటు సాగి ఇందీవరేక్షణా
పక్ష్మ భాగములపై వచ్చి వ్రాలి
ఇటు వీగి అటు వీగి మృగనేత్ర బంగారు
చెక్కిలిపై అగర్ చుక్క నునిచి

వెండికొండపయిన్ మబ్బు విధము దోచి
చంద్ర కేదారమున లేడి చాయ దిరిగి
ఆదిశేషునిపై విష్ణువై శయించి
చీకటులుగూర్చె నందమ్ము లోకమునకు
(భ్రుకుటికా ధనువు - బొమముడి అనే విల్లు, అంబకము - బాణము, పక్ష్మ భాగము - కనుఱెప్పల వెండ్రుకలు, అగర్ చుక్క - నల్ల చందనంతో పెట్టే బుగ్గ చుక్క)

ఇరులు కోకిలములై ఎచ్చోట కూయునో
అచ్చోట మధుమాస మవతరించు
ఇరులె తుమ్మెదలుగా ఏవేళ పాడునో
ఆ వేళల వసంత మందగించు
ఇరులె మయూరులై ఎట నాట్యమాడునో
అటనే నవాషాఢ మావహించు
ఇరులె ఉత్పలములై ఏనాడు పూచునో
ఆ రోజు కార్తిక మ్మాగమించు

ఇరుల కన్న అంద మెచట కానగ రాదు
ఇరులె సౌఖ్యములకు దరులు సుమ్ము
ఇరులు లేని నాడు నరులు కానగరారు
నరులు లేని నాడు ధరణి లేదు

కబరీభరమ్ములై కనుపించు చీకట్లు
కలకాల మందాలు చిలుకు గాత
నల్లకల్వలవోలె ఉల్లసిల్లెడు నిరుల్
కాసారములలోన గ్రాలు గాత
నీలిమేఘమ్ములై నింగి బ్రాకెడు తమం
బాకాశమున నడయాడు గాత
జవరాలి కనుపాప చాయ దోచెడు సాంధ్య
మెడదలో వలపు వర్షింతు గాత

ఇరులె కురులయి, ఝరులయి పరుగులెత్తి
ఇరులె కరులయి హరులయి ఇంపు నింపి
ఇరులె విరులయి సరులయి ధరణి నిండి
ఇరులె నరులకు మరులు కల్పించు గాత

వెచ్చదనము లేని వెఱ్ఱి దీపమ్ముల
పెట్టదలచెదేల పిచ్చిదాన
వర్షధార వోలె వచ్చు చీకట్లలో
మట్టిదివ్వె నిలుచు మాట కల్ల

గౌళి నాల్క మీది కంటకమ్ములలోన
చిక్కుకొన్న యట్టి చిన్న పురుగు
అంధకారమందు ఆటాడు దీపంబు
మరు నిముసమునందు మడియ గలదు
(గౌళి - బల్లి)

ఆకాశమ్మది చీకటిల్లు, శశి తారార్కావళుల్ మిణ్గురుల్
లోకంబియ్యిది చీకటింటి పరదాలో డాగు మృత్పిండ మిం
దాకల్పింపగ జూచెదేల పరిహాసార్థమ్మొ దీపావళీ
ప్రాకారమ్ములు తామసీధరణి కంపంబల్లదే వచ్చెడిన్

కానుగ చెట్లనీడల నొకానొక స్వప్నపు సెజ్జమీద ని
ద్రాణత హాయిగొల్పగ సదా శయినింపగ నీ మహాంధకా
రాన మనస్సు శాంతిగొనె, రాను భవత్ కమనీయ కాంతి సౌ
ధానకు, నన్ను పిల్వకుము తన్వి! విభా విభవాభిరామవై!
(విభా విభవ అభిరామ - వేకువ కాంతి కలిగిన అందమైన స్త్రీ)

-----------------------

మన కావ్యాలలో చీకటి వర్ణనలకి కొదవలేదు! అందులోనూ ఒకొక్కరి ధోరణి ఒకొక్కరిది. మన మనుచరిత్రలోది మచ్చుకొకటి. మరిన్ని పద్యాలు మరోసారి.

మృగనాభి పంకంబు మెయినిండ నలదిన
మాయ కిరాతు మైచాయ దెగడి
నవ పింఛమయభూష లవధరించి నటించు
పంకజాక్షుని చెల్వు సుంకమడిగి
కాదంబ నికురంబ కలితయై ప్రవహించు
కాళింది గర్వంబు కాకువేసి
తాపింఛ విటపి కాంతార సంవృతమైన
అంజనాచలరేఖ నవఘళించి

కవిసె మఱియును గాకోల కాలకంఠ
కంఠ కలకంఠ కరిఘటా ఖంజరీట
ఘన ఘనాఘన సంకాశ గాఢ కాంతి
గటికి చీకటి రోదసీ గహ్వరమున


పూర్తిగా చదవండి...

Thursday, July 10, 2008

ఈశ్వరుడే స్వయంగా రాసిన కవిత, మీరు చదివారా!?


అనుచు, జింతా పరంపర లనెడు వర్ష
ముడిగి, నత్కీరుడను మేఘు డుత్తరంబు
నడచె, సంతోషమున దక్షిణమున నున్న
కవుల ముఖపంకజములు వికాసమొంద

శివుడు రాసిన కవిత్వం ఇది కాదండోయ్! అది తెలియాలంటే చివరకంటా చదవాల్సిందే :-) దానికి సంబంధించిన నత్కీరుని కథలోని పద్యం ఇది. శ్రీ కాళహస్తిమాహాత్మ్యంలో మన తెలుగుకవి ధూర్జటి రాసింది.

ఆధునిక కాలంలో, అలంకారాలంటే కొంత విముఖత ఏర్పడింది. అవి కవిత్వానికి బరువులన్న అభిప్రాయం చాలామందిలో కలిగింది. అది నిర్హేతుకమేమీ కాదు. సన్నగా పీలగా ఉన్న ఒక వ్యక్తి, తన చేతికి లావుపాటి చేకట్టు (bracelet) వేసుకుంటే అది ఎబ్బెట్టుగా అనిపించదూ! అదే కాస్త ఒళ్ళుకనిపించేవాడు వేసుకుంటే కనువిందుగానే ఉంటుంది. అంటే, ఒక ఆభరణం, ఉచితమైన చోట ఉన్నప్పుడే అలంకారంగా ఒప్పుతుందన్నమాట. కవిత్వ విషయంలోనూ అంతే! ఔచిత్యం చెడిన అలంకార ప్రయోగం ఎప్పుడైతే కావ్యాలలో ఎక్కువయిందో, అప్పుడు వాటిమీద ఏహ్యభావం మొదలయ్యింది.అయితే, తగిన విధంగా అలంకారాలని ప్రయోగిస్తే, అవి కవిత్వానికి ఎంత పటుత్వాన్ని కలిగిస్తాయో, ఈ పద్యం చూస్తే తెలుస్తుంది!
అలంకారాలని కవులు సాధారణంగా వర్ణనల కోసం ఉపయోగిస్తారు. అది ఒక వస్తువు వర్ణన కావచ్చు, వాతావరణ చిత్రణకావచ్చు, పాత్ర రూపురేఖల వర్ణన కావచ్చు, మహా అయితే పాత్ర మనస్స్థితిని వర్ణించడానికీ కావచ్చు. పాత్రల స్వభావాన్ని చిత్రించేందుకు అలంకారాలని వాడడం అరుదుగా కనిపించే విషయం! ఈ పద్యంలో ధూర్జటి చేసిన పని అదే!

నత్కీరుడనే ఒక దక్షిణ దేశపు కవి ఉత్తరదిశగా వెళ్ళిపోయాడు. అప్పుడు దక్షిణ దేశంలో కవులందరూ సంతోషించేరట. ఎందుకూ అన్న కవి ఊహకి రూపమే ఈ పద్యం! "ఊహ ఉత్ప్రేక్షయగును" అని మనం చదువుకున్న "అలంకారశాస్త్రాన్ని" ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇక్కడున్న అలంకారం ఉత్ప్రేక్ష అని స్ఫురిస్తుంది. ఎవిటీ ధూర్జటి చేసిన ఊహ అంటే, నత్కీరుడనే మేఘం తన చింతలనే వర్షాన్ని విడివిపెట్టి ఉత్తరదిశగా వెళ్ళిపోయినప్పుడు, దక్షిణాది కవుల ముఖాలనే పద్మాలు వికసించేయి అని. నత్కీరుడు ఉత్తరానికి వెళ్ళిపోయాక దక్షిణాది కవులందరూ సంతోషించేరని మామూలుగా చెప్పేస్తే, ఎందుకు సంతోషించేరూ అన్న సందేహం వస్తుంది. "అంతకాలం నత్కీరుడు పెట్టే బాధలనుంచి విముక్తిపొందేరనా, లేక నత్కీరుడంటే ఈర్ష్యాద్వేషాలతో ఉన్నందువల్లా?" అని. ఔచిత్యశోభితమైన ఈ అలంకారం అలాంటి అనుమానాన్ని నివృత్తిచేస్తుంది!
ఎలా అంటారా - పద్మాలు ఎప్పుడు వికసిస్తాయి? సూర్యుడి వెలుగు సోకినప్పుడు. మరి నత్కీరుడనే మేఘం ఏం చేస్తోంది? ఆ సూర్యుడి వెలుగు పద్మాలపై పడకుండా చేస్తోంది. ఇక్కడ పద్మాలు దక్షిణాది కవులు. మరి సూర్యుడెవరు? ఆ కవులని పోషించే రాజన్న మాట. నత్కీరుడు తన అహంకారంతో అధికారంతో, రాజు ఇతర కవులని గౌరవించకుండా అడ్డుపడేవాడన్న విషయం స్ఫురించటం లేదూ! అంచేత ఇతర కవులు "హమ్మాయ్యా! వీడి పీడా విరగడయ్యిందిరా" అని ఊపిరిపీల్చుకోడంలో తప్పేమీ లేదని మనకి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా, నత్కీరుడి పాత్రలోని లోపం మరింతగా బయలుపడుతుంది. ఎందుకీ నత్కీరుడి లోపం మనకి బాగా తెలియాలీ అంటే, మొత్తం కథ చెప్పుకురావాలి. ఆ పని కొత్తపాళీ గారిక్కడ ఎప్పుడో చేసేసారు: http://telpoettrans.blogspot.com/2006/11/srikalahasti-mahatmyam-1-this-is-month.html
క్లుప్తంగా చెప్పుకోవాలంటే, నత్కీరుడు ఒక రాజు ఆస్థానంలో ప్రముఖ కవి. ఆ రాజు తన కొలువులోని కవులు మెచ్చేట్టుగా ఎవరు కవిత్వం చెప్పినా వాళ్ళకి బోలెడంత డబ్బిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ఓ సారి తీరని కఱవు వస్తుంది. ఒక శివాలయంలో పూజారి, శివభక్తుడు, ఆ కఱవుకి తట్టుకోలేక ఊరొదిలి పెట్టాలనుకుంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నేనో పద్యం రాసిస్తాను, నువ్వు పోయి రాజసభలో చదువు, నీకు రాజు కావలసినంత ధనమిస్తాడు, దాంతో నువ్వు హాయిగా బతకొచ్చు అంటాడు. సరే అని శివుడిచ్చిన పద్యం తీసుకెళ్ళి రాజసభలో చదువుతాడు. అందులో "ఆడవాళ్ళ కేశాలకి సహజమైన గుబాళింపు ఉంటుంది" అన్న అర్థం వచ్చే వాక్యాలుంటాయి. దానికి నత్కీరుడు నవ్వి, ఇలాటిది మనమెక్కడా లోకంలో చూడం, కవి సమయం కూడా కాదు అని హేళన చేస్తాడు. పాపమా పూజారి శివుడి దగ్గరికి తిరిగివచ్చి జరిగింది చెప్తాడు. దాంతో శివుడు "ఠాట్! నా పద్యంలోనే తప్పుపడతాడా, నేనే స్వయంగా వచ్చి తేల్చుకుంటా"నని రాజసభకి వెళ్ళి, ఎవడు తన పద్యంలో తప్పుపట్టిందని అడుగుతాడు. నత్కీరుడు లేచి తనెందుకు తప్పుబట్టేడో మళ్ళీ చెప్తాడు. దానికి శివుడు, పార్వతీ దేవి కేశాలు సహజంగానే సుగంధాన్ని కలిగుంటాయని నచ్చ చెప్తాడు. "అయితే ఏంటి, ఈ లోకంలో ఎవరికీ ఉండదు కాబట్టి, ఇక్కడ కవిత్వానికి వర్తించదు పొ"మ్మంటాడు. పైగా "లూలామాలపు" మాటలు మాట్లాడకని ఎద్దేవా కూడా చేస్తాడు! దాంతో శివుడికి కోపంవచ్చి, తన మూడో కన్ను చూపిస్తాడు. పోనీ అప్పటికైనా ఊరుకోవచ్చు కదా, నత్కీరుడు మరింత రెచ్చిపోయి, "నీ తలచుట్టూరా కన్నులున్నా సరే, పద్యం తప్పే! కాదని నా చేత ఒప్పించడం నీ తరం కాదు" అంటాడు. శివుడప్పుడు, వీడికిలా బుద్ధిరాదని అనుకొని కుష్టువ్యాధితో బాధపడమని శపిస్తాడు. దెబ్బకి దెయ్యం దిగుతుంది నత్కీరుడికి! లబోదిబోమంటాడు. శివుడు కాస్త కరుణించి, కైలాస శిఖరం చూస్తే నీకు శాపవిమోచనం కలుగుతుందని చెప్తాడు. ఈ కుష్టువ్యాధితో బాధపడుతూ అంత దూరం ఎలావెళ్ళడం అని విచారించి, చివరికి, తప్పదుకదా అని ఉత్తరదిశగా బయలుదేరుతాడు. అదీ ఈ పద్యం ముందు దాకా జరిగిన కథ.
ఇదో విచిత్రమైన కథ. కవికీ దేవుడికీ మధ్య, కవిత్వం గురించి గొడవరావడం మరెక్కడా చదివిన గుర్తులేదు, ఇక్కడ తప్ప. మామూలుగా ఈ కథ వింటే, నత్కీరుడు చేసినదాంట్లో తప్పేముంది అని అనిపిస్తుంది. శివుడు అన్యాయంగా అతన్ని శపించాడనికూడా అనిపిస్తుంది. కానీ కాళహస్తి మాహాత్మ్యం చదివితే ఆ పాత్ర స్వభావం అర్థమవుతుంది. దానికి పైన చెప్పిన పద్యం చాలా ఉపయోగపడుతోంది. ఇతరులని కించపరిచే గుణం నత్కీరుడిలో ఉంది. పండితులకి ధిషణాహంకారం సహజంగా ఉండవచ్చు. కానీ అది మితిమీరితేనే ప్రమాదం. ఇవతలవాళ్ళు చెప్పింది గ్రహించే స్థితిలో లేకుండా, తను చెప్పిందే వేదమని ఇతరులని కించరిచే స్థాయిలో అహంకరించే వాళ్ళు దుర్గతిపాలు కాక తప్పదని ఈ కథ మనకి నేర్పే నీతి.
నత్కీరుడు చాలా గొప్ప కవీ పండితుడూ, అందులో ఏ సందేహమూ లేదు. చివరన శివుడుకూడా అతన్ని "సాహిత్యశ్రీ!" అని సంబోధిస్తాడు. పూజారి వచ్చి పద్యం చెప్పినప్పుడు దాన్ని ఆక్షేపించడంలో తప్పులేదు. కానీ అది శివుడు చెప్పిన పద్యమని పూజారి చెప్పినప్పుడు, దానిగురించి మళ్ళీ ఆలోచించాలని నత్కీరుడికి తట్టలేదు. స్వయంగా శివుడే వచ్చి, పార్వతి కురులకి సహజగంధం ఉంటుందయ్యా అని చెప్పినప్పుడయినా, "అయితే ఓకే" అని నత్కీరుడు ఒప్పుకోవాల్సింది. అది చెయ్యకుండా, అహంకరించి, శివుడినే వేళాకోళం చేస్తాడు! "కవిత్వముల్ నిలచునే సత్యంబు వర్ణించుచో!" అన్న గ్రహింపు అతడికి రాలేదు. అందుకే అవస్థల పాలవుతాడు. చివరికి జ్ఞానోదయమై, దక్షిణకాశి అనబడే శ్రీకాళహస్తిని దర్శించి శాపవిమోచనమయ్యాక, ఆ శివుని మీద నూరు పద్యాలు (శతకమే అయ్యుంటుంది) రాస్తాడు.
"ఏ లీలన్ నుతియింపవచ్చు..." అన్న పద్యం ఈ కథ స్ఫూర్తితోనే ధూర్జటి రాసుంటాడని నేననుకోడానికి ఇదీ కారణం!

ధూర్జటి రాసిన శ్రీకాళహస్తి మాహాత్మ్యం, రస రమ్యమైన కావ్యం. చక్కని తెలుగునుడికారం కావ్యమంతటా పరిమళిస్తుంది. చదివి అర్థం చేసుకోడం మరీ కష్టం కూడా కాదు. తెలుగు కవిత్వాన్ని అభిమానించే వాళ్ళందరూ తప్పకుండా చదవాల్సిన కావ్యమిది. IISc Digital Libraryలో ఇది లభిస్తుంది.
"నవ్య భాష"లో, "మాధురీ మహిమతో" రాస్తానని ధూర్జటే చెప్పుకున్న ఈ కావ్యాన్ని చదివి ఆనందించండి!

ఇంతకీ ఈశ్వరుడు చెప్పిన ఆ పద్యం ఎవిటో చెప్పనే లేదు కదూ!
ఆ పద్యాన్ని ధూర్జటి తన కావ్యంలో చెప్పలేదు. అందులో వివాదం రేపిన అంశాన్ని మాత్రం ప్రస్తావించి ఊరుకున్నాడు.
ఆ పద్యం స్కాందపురాణంలో (సంస్కృతంలో) ఇలా ఉంది (కొద్దిగా తేడాగా):
జానాసి పుష్పగంధాన్ భ్రమర! త్వం బ్రూహి
తత్వతో నేద్య దేవ్యాః కేశ శకలాసి
తుల్యో గంధేన కిం గంధః?
(దేవి కేశశకలమునకు గల పరిమళముతో తుల్యమైన పరిమళమెందైన కలదేమొ చెప్పుము)

తమిళంలో "తిరువిడియాల్" అన్న గ్రంధంలో ఇదే పద్యం ఇలా ఉంది:
కొంగుతేర్ వాళికె అంశిరైత్ తుంబి
కామం శెప్పాదు కందదు మొళిమో
సయిరియదు కైళి యనర్పిన్
మయిలిల్ శెరియె యిట్ట్రు అరికై కూందలిన్
నఱియువుం ఉళవో నీ అఱియుం పూవే?
(పూల తేనె చక్కగా తెలిసి ఆస్వాదించే జీవితమూ, లోనికడగి ఉన్న ఱెక్కలూ గల తుమ్మెదా! నా ఉద్యానవనంలో ఉన్న కారణంగా నాపై మొహమాటంతో కాక, నువ్వు స్వయంగా తెలుసుకున్న నిజం చెప్పు. నీకు తెలిసిన పుష్పాలలో జననాంతర సౌహృదమూ, నెమలి సౌకుమార్యమూ, మల్లెమొగ్గలలాంటి పలువరుసా గల ఈ కాంతయొక్క కురులవలె పరిమళమున్న పువ్వు ఎక్కడైనా ఉందా?)


పూర్తిగా చదవండి...

Wednesday, July 2, 2008

ఏ లీలన్ నుతియింపవచ్చు...


ఏ లీలన్ నుతియింపవచ్చు నుపమోత్ప్రేక్షా ధ్వనివ్యంగ్య శ
బ్దాలంకార విశేష భాషల కలభ్యంబైన నీ రూపమున్
చాలుంజాలు, కవిత్వముల్ నిలచునే సత్యంబు వర్ణించుచో!
చీ! లజ్జింపరుగాక మాదృశ కవుల్, శ్రీకాళహస్తీశ్వరా!

కిందటిసారి ధూర్జటిలోని కవిని చూసాం. ఇప్పుడా కవిని ధిక్కరించే భక్తుని చూస్తున్నామీ పద్యంలో!
సాకారమైన శివమూర్తిని చూసి హాస్యమాడిన ధూర్జటిని ఆటపట్టించాలని ఆ శివుడుకి కూడా అనిపించింది కాబోలు.
చిదంబరుడై దర్శనమిచ్చి ఇప్పుడు వర్ణించు చూద్దాం అని సవాలు విసిరుంటాడు! చిదంబరుడంటే చిత్(మనసు/బుద్ధి) అంబరంగా(వస్త్రముగా) కలవాడని అర్థం. అతడు మనసు పొరలమాటున దాగుంటాడన్నమాట. అప్పుడతని రూపం ఎలా ఉంటుంది? మనిషి బుద్ధిలో ఉన్నది చైతన్యం. అంటే అప్పుడు శివుడు చైతన్యస్వరూపుడవుతాడు. ఎంతటి ఊహశాలురైనా, పాపం కవుల ఊహకికూడా కొన్ని పరిమితులుంటాయి కదా! నిరాకారమైన చైతన్యపు ముద్దని కవి ఏమని ఊహించగలడు! సాధారణభాష కన్నా కవిత్వభాష శక్తివంతమైనదైనా, దానికీ కొన్ని పరిమితులున్నాయి. కవి ఊహకే అందని విషయం గురించి వర్ణించడానికి భాషకూడా తోడ్పడదు.
ఆ సత్యాన్ని గ్రహించాడు ధూర్జటి. తన పరిమితులని తాను తెలుసుకున్నాడు.
ఉపమ, ఉత్ప్రేక్ష, ధ్వని, వ్యంగ్యము, శబ్దాలంకారాలూ - ఇవన్నీ కవిత్వభాషలో కనిపించే విశేషాలు. వీటివేటికి చిక్కని రూపం! మరో మాటకూడా అన్నాడు ధూర్జటి. "సత్యాన్ని వర్ణించాలంటే కవిత్వం నిలుస్తుందా?" అని. అంటే కవిత్వం వొట్టి అబద్ధాలపుట్టని తేల్చెస్తున్నాడా? కాదేమో. ఇక్కడ సత్యం అంటే "సత్యం శివం సుందరం"లోని సత్యం. అంటే The complete truth అన్న మాట. దాన్ని వర్ణించడం ఎవరితరం చెప్పండి!
ఈ పద్యంలో నాకు నచ్చేవి రెండు అంశాలు. ఒకటి ధూర్జటిలోని నిజాయితీ. కవిగా తాను ఓడిపోయాడు. దాన్ని నిర్లజ్జగా ఒప్పుకున్నాడు. పైగా "చీ, నాలాంటి కవులు సిగ్గుపడాలి" అన్నాడు. అంటే అహంకారంతో విర్రవీగకూడదూ అని అర్థం.
ఇక రెండో అంశం ఇందులోని భాష, పలుకుబడి. మొదటి రెండుపాదాలూ కవిత్వభాషలోని విశేషాలను చెప్పడంతో అయిపోయినా, మిగిలిన రెండు పాదాలూ వ్యావహారిక భాషాలోని వాడీ వేడీ కలిగున్నాయి. "చాల్చాలు" అన్న తృణీకార వ్యంజకమైన పలుకుబడి, "చాలుంజాలు" అని శార్దూలంలో ఒదిగిపోయింది. తర్వాత "కవిత్వముల్" అన్న బహువచన ప్రయోగం. ఇదీ కవిత్వం తాలూకు తక్కువతనాన్ని సూచించేదే. "మాదృశ కవుల్" అనడంలో తనతోపాటు, తనలా అహంకరించే కవులందరినీ కలుపుకోడం కూడా తెలుగు పలుకుబడిలో కనిపించేదే కదా. వాడుకభాషలోని పలుకుబడికున్న శక్తిని పద్యరూపంలో ప్రయోగించడం ఎలానో ఈ పద్యం చూపిస్తోంది!

శతక పద్యాలలో మకుటం ఒకటి ఉంటుంది. అది పద్యంలో కొంతభాగం ఆక్రమించుకోడమే కాక, అదనపు నిబంధనలని కూడా ప్రవేశపెడుతుంది. ఉదాహరణకి ఈ శతకంలో "శ్రీకాళహస్తీశ్వరా" అన్న మకుటంలో "శ్రీ" అన్నది యతిస్థానంలో ఉంది. కాబట్టి శతకంలోని అన్ని పద్యాల చివరిపాదాలూ ఈ అక్షరంతో యతిమైత్రి ఉన్నవే వాడాలి. అయితే ఇక్కడున్న ఒక విశేషమేమిటంటే, నాకు తెలిసి "శ్రీ" అన్న అక్షరం అన్నిటికన్నా ఎక్కువ అక్షరాలతో యతిమైత్రి కలిగి ఉంటుంది. దీన్ని తలదన్నే మరో అక్షరం "స్త్రీ" ఒక్కటే :-) హల్లుల్లో "శ"కి "ర"కి దేనికైనా యతి వేసుకోవచ్చు. అంటే, "చ, ఛ, జ, ఝ, శ, ష, స, ర, ల"లో ఏదైనా హల్లు రావచ్చన్నమాట! అలానే అచ్చుల్లో "ఇ, ఈ, ఎ, ఏ, ఋ" ఏవైనా రావచ్చు. అంతే కాదండోయ్, "రి"కి "ఋ" అచ్చుతో మైత్రి కుదిరితే చాలు, ఏ హల్లైనా వేసుకోవచ్చు! ఇంతటి విస్తృతమైన మిత్రబృందం(friends circle) మరే అక్షరానికీ లేదనుకుంటాను :-)
ఎలాగూ యతిమైత్రి విషయం వచ్చింది కాబట్టి ఈ పద్యం మొదటి పాదంలో యతిమైత్రి ఎలా కుదిరిందో చెప్పుకోండి చూద్దాం?

ఈ పద్యం ఎప్పుడు చదివినా, నాకు ధూర్జటి కాళహస్తీశ్వరమాహాత్మ్యములోనిదే ఒక కథ గుర్తుకు వస్తుంది. ఆ కథే ఈ పద్యానికి స్ఫూర్తేమోనన్న అనుమానం కూడా ఉంది. ఆ కథా కమామీషూ వచ్చే సారి...


పూర్తిగా చదవండి...