తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, January 1, 2010

ఒక్క క్షణమాగి యోచించు మోయి మనిషి!

బ్లాగు మిత్రులందరికీ కొత్త ఏడు 2010 శుభాకాంక్షలు!

మనం ఏడాదిలో రెండుసార్లు కొత్త సంవత్సరపు వేడుకలని జరుపుకుంటాం! ఒకటి మన ఉగాది, మరొకటి యీ ఇంగ్లీషు సంవత్సరాది. ఒకోటి ఒకో రకమైన అనుభూతినిస్తాయి నాకు. ఉగాదనగానే, కొత్త చింతపండు, బెల్లం, వేప్పువ్వు, ఉగాది పచ్చడి, వసంతం, మల్లెపూలు... వీటన్నిటితో పండగ వాతావరణం అలుముకుంటుంది. అంటే ప్రకృతే మనల్ని యీ వేడుక జరుపుకోడానికి సన్నధం చేస్తుందన్న మాట! పైగా మన సంవత్సారలకి పేర్లు కూడా ఉంటాయి. అవి అరవయ్యేళ్ళకొకసారి మారుతూ ఉంటాయి. మనిళ్ళల్లో పెద్దవాళ్ళుంటే, అరవయ్యేళ్ళ కిందట ఇదే సంవత్సరంలో జరిగిన విశేషాలని మళ్ళీ గుర్తుచేసుకుంటూ మనకి చెపుతూ ఉంటారు.

మరి ఈ ఇంగ్లీషు సంవత్సరమో? ఇది శీతకాలం మధ్యలో వస్తుందాయె. ప్రకృతి పెద్దగా మనలని ఉత్సాహపరిచేదేమీ ఉండదు. అయినా మరో పది పదిహేను రోజుల్లో సంక్రాంతి వస్తోందన్న కబురు మోసుకొస్తుందిది. అది కొంత ఉత్సాహమిస్తుంది. అంతే. ప్రధానంగా నాకీ ఇంగ్లీషు సంవత్సరాది గడచిపోతున్న కాలాన్ని గుర్తుచేస్తుంది. పేర్లతో కాకుండా, పెరుగుతూ పోయే సంఖ్యలతో మనమీ సంవత్సరాలని గుర్తుపడతాం కాబట్టి. 2009 మరి ఇక రాదు కదా! మన జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ ఇంగ్లీషు క్యాలెండరుతో గుర్తుపెట్టుకోవడం అలవాటైపోయింది కనుక, అబ్బో మనం ఉద్యోగం మొదలుపెట్టి ఇన్నేళ్ళైపోయిందా, మన పెళ్ళి జరిగి అన్నేళ్ళైపోయిందా, ఇలా కాలం ఎంత వేగంగా పరిగెడుతోందో అన్న స్పృహ కలిగిస్తుంది ఈ రోజు. అదీ మంచిదేగా! మనిషికి కాలస్పృహ చాలా అవసరం. అది ఉంటే నిజానికి చాలా అనర్థాలు జరగవు. మన జీవితం మనకిచ్చే అతికొద్ది కాలాన్ని మనం ఎలా వినియోగించుకుంటున్నాం అన్నది అందరూ ఆలోచించుకోవలసిన విషయం. కాలం గురించిన ఆలోచన రాగానే నాకు గుర్తుకొచ్చేది ఉమర్ ఖయాం రుబాయతులు. క్రితం సంవత్సరం దువ్వూరివారి పానశాల పద్యాలు గుర్తుచేసుకున్నాను. ఈమారు కరుణశ్రీ అమర్ ఖయాం వంతు.


ఒక్కొకరోజు తక్కువగుచున్నది మీ బ్రతుకంచెరుంగలే
రొక్కొరొకో! యిదేటి కునుకో యని వెచ్చని హెచ్చరింపుగా
కొక్కొరొకో యటం చదిగొ కూయుచునున్నది కోడి పాకపై
కెక్కి; లతాంగి మేలుకొనవే! కొనవే మధుపూర్ణపాత్రమున్!

ఈ కాలంలో మనకి కోడికూతలు వినిపించడం లేదు కాని ఇలాటి ప్రత్యేకమైన రోజులు, "ఒక్కొక ఏడు తక్కువగుచున్నది" అని గుర్తుచేస్తాయి.

నిన్న గతించి పోయినది నెచ్చెలి! మచ్చునకైన లేక! రే
పన్నది యెట్టులుండునొ రవంత యెరుంగము; నేడు వచ్చి ని
ల్చున్నది యింటి ముంగిట; ఒకొక్క క్షణ మ్మొక చైత్రరాత్రిగా
అన్నులమిన్న! నీ సుమధురాధర శీధు వనుగ్రహింపుమా!

పూల విధాన రాలి పడిపోదుము మేదినిమీద నెప్పుడో
కాలవశాన; వాడి వరుగై తరుగై మరుగైన రూపుతో
ధూళిగ మారిపోదుము; మధూళి నొసంగుము; నిత్య మృత్యు నృ
త్యాలయ మీ జగత్తు; తెరవా! తెర వాలకముందె మేలుకో!

ఏడ్చుచు పుట్టినా రెపుడొ! యేడ్చుచు పోదురు రేపు! సాటివా
రేడ్చుదు రీర్ష్యతోడ; పెడయేడ్పుల సంత, జగ మ్మిదంత; ఇ
ట్లేడ్చుచు మొండి బండబ్రతు కీడ్చుట మంచిదొ! గోస్తనీ రస
మ్మోడ్చుక త్రావి కన్ను లరమోడ్చుట మంచిదొ నిశ్చయింపుమా!

కాలము నిల్వబోదు క్షణకాలము; మృత్యువు చేతిలోనికూ
జాలము; నిల్వజాలని నిజాలము; ఎప్పటి కేమొ చెప్పగా
జాలము; గాన ఎందు కిక జాలము? బాలకురంగనేత్ర! నీ
వాలుగనుల్ తళుక్కుమన వంచుము శీధువు పానపాత్రలో

ఈ అనంత కాలంలో మన జీవితాలు ఎంత క్షణికమో ఒక్కసారి ఆలోచిస్తే, మనం ఇలా ఉండము. సమాజమూ ఇలా ఉండదు. ఇన్ని విద్వేషాలు, ఆవేశాలు, ఇంత అహంకారం, ఇదంతా దేనికోసం? ఖయ్యాము చెప్పినట్టు కాస్తంత చెట్టునీడ, ఒక రొట్టెముక్క, మధురమైన పానీయము, ఒక మంచి కావ్యము, ఎదురుగా ప్రియురాలు - ఇంతకన్నా జీవితాన్ని ఆనందించడానికి ఇంకేమిటి కావాలి?

సూత్రనిబద్ధమైనటుల సూర్యుని చుట్టి భ్రమించు ధాత్రి; ఈ
రాత్రి గతించినన్ మరలిరాదు చెలీ! తెలవారు నంతలో
యాత్రికు లేగుదెంతురు; ప్రయాణము తప్పదు దూరభూమికిన్;
పాత్రము నింపుమా! తడ వొనర్పకుమా! సుమనో మనోరమా!

ఈ అనంత సృష్టి కాలమానంతో పోల్చుకుంటే మన మానవులం పుట్టి ఇంకా ఒక్క రోజైనా అవ్వలేదు. అప్పుడే ఎంత విలయం సృష్టిస్తున్నాం! ప్రకృతిని ఎంతగా సర్వ నాశనం చేస్తున్నాం! ఇంత చిన్న జీవితం కలిగిన మానవుడు ప్రకృతి సంపదని ఎంతగా దోచుకుంటున్నాడు? ఎందుకిదంతా? మన శరీర సౌఖ్యానికి, మన మానసిక ఆనందానికి. ప్రకృతి మీద ఏవిటి మనకింత హక్కు? ఒక బలవంతుడు, తన మితిమీరిన కోరిక తీర్చుకోడానికి బలాత్కారానికి పూనుకోవడం కాదూ ఇది?

ఎప్పుడు భానుబింబ మను నీ దివిటీ వెలిగించినావొ! తా
నెప్పటి కారిపోదు; పొగ ఏర్పడదున్; కొడిగట్ట దింత; నీ
త్రిప్పిన మంటి బొంగర మిదే క్షణమాగదు; గిర్రుగిర్రు మం
చిప్పటి కట్టులే తిరుగు; నీ కరలాఘవ మేమిటో ప్రభూ!

జగతి తమస్సు వైదొలగ, చల్లని వెచ్చని వెల్గుదివ్వియల్
గగనము దాక రాత్రులు పగళ్ళును త్రిప్పుటెగాక; పొంగి బి
ట్టెగసి ధరిత్రిపై పడగలెత్తు సముద్ర తరంగపంక్తి నే
ర్పుగ వెనువెన్కకున్ మడచిపుచ్చెద వెంత దయార్ద్రమూర్తివో!

ఆ ప్రభువుకి, దయార్ద్రమూర్తికి, ప్రాకృతిక శక్తికి మనం ఇస్తున్న గౌరవం ఏమిటి? తీర్చుకుంటున్న ఋణం ఏది? కనీసం ఏడాదికొక్క సారైనా ఈ విషయాలని ఆలోచించొద్దూ? ఏడాదంతా మనం చేసే పనులలో ఈ ఆలోచనల ప్రభావం కాస్తంతైనా ఉంటుందని ఆశ!

7 comments:

  1. నిజం, ఎంతసేపూ ప్రకృతినికొల్లగొట్టి ముందుతరాలకు ఏదో మంచి చేయబోతున్నాననేభ్రమలో ముందుతరాలకు ప్రకృతినే లేకుండా చేస్తున్నది మానవజాతి.
    చక్కటి పద్యాల్ని చదివించినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  2. _________________________
    మనిషికి కాలస్పృహ చాలా అవసరం
    _________________________

    మంచి మాట వ్రాసారు!

    మీ టపా చాలా బాగుంది!!

    ReplyDelete
  3. బ్లాగు మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకంక్షలు,
    ఈ కొత్త వత్సరం అందరు సుఖ సంతోషాలతో ఉండాలని మనందరి పై ఆ శ్రీ నృసింహుని కృప ఉండాలని ఆసిస్తూ మీ కోసం భద్రాచల నరసింహ క్యాలండర్ -2010 ఈ కింది లింకులో
    http://bhadrasimha.blogspot.com/2010/01/2010.html
    ధన్యవాదములు
    - భద్రసింహ

    ReplyDelete
  4. మంచి పద్యాలు గుర్తుకు తెచ్చారు. ధన్యవాదములు. శతావధాన విశేషాలకోసం ఎదురుచూస్తున్నాం.

    ReplyDelete
  5. పద్యాలు వినూత్నంగా ఉన్నాయి. శీధువు అన్న పదం - నిన్ననే అమరంలో చూశాను. ఇంగ్లీషు rum ని సంస్కృతంలో శీధుః అంటారట. లోలకం బ్లాగు వేమూరి వారి పుస్తకమొకటి ఈ మధ్య పూర్తి చేశాను. అందులోనూ ఆయన శీధుః అన్న పదం గురించి వివరించారు.

    ReplyDelete
  6. చాలా బాగుందండీ. ఊరికే హాపీ న్యూయియర్ అనడంకంటే, జీవనశైలిని తరిచి చూసుకోడంలో ఒకఅందం వుంది. ఇలాగే మంచి పద్యాలు మరిన్ని అందించగలరని ఆశిస్తూ ...

    ReplyDelete