తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, January 14, 2010

సంక్రాంతి శుభాకాంక్షలు!

సంక్రాంతి శుభాకాంక్షలు!

ఈ సంక్రాంతికి మా ఇంటిముంగిట వెలిసిన రంగవల్లి ఇదిగో:



సంకురాతిరి పండగిదిగో
సందడించీ వచ్చెనండీ
సంతసాలను సంబరాలను
తెచ్చె చూడండీ

నింగి కెగసే భోగిమంటల
ముంగిలిని గొబ్బెమ్మ ముగ్గుల
పొంగిపొరలే పాడిపంటల
వెలుగు చూడండీ

ముగ్గువేసే ముదితచేతుల
గంగిరెద్దుల గంగడోలున
దారిలో హరిదాసుపాటల
ఊరిలో తిరనాళ్ళ ఆటల
వెల్లివిరిసే తెలుగుదనమూ
సౌరు చూడండి

ఈ రైతుపండగ సందర్భంగా రైతుకవి శ్రీ తుమ్మల సీతారామ్మూర్తిగారిని తలుచుకోవడం సమంజసం. తుమ్మలవారు అచ్చమైన గాంధేయవాది, స్వచ్ఛమైన తెలుగుకవి. తెలుగు పల్లె జీవిత సౌందర్యాన్ని పద్యాలలో ప్రతిబింబింప చేసిన కవికృషీవలుడు ఇతను. వారు సంక్రాంతికి ప్రత్యేకంగా వడ్డించిన విందుభోజనం ఇదిగో ఆరగించండి:

లేగటి పాలలో గ్రాగి మాగిన తీయ
తీయ కప్పురభోగిపాయసంబు
చవులూరు కరివేప చివురాకుతో గమ
గమలాడు పైరవంకాయ కూర
తరుణ కుస్తుంబరీ దళమైత్రిమై నాల్క
త్రుప్పు డుల్చెడు నక్కదోస బజ్జి
క్రొత్తబెల్లపు తోడికోడలై మరిగిన
మదురు గుమ్మడిపండు ముదురుపులుసు

జిడ్డుదేఱిన వెన్నెల గడ్డపెరుగు
గరగరిక జాటు ముంగారు జెఱుకురసము
సంతరించితి విందుభోజనము సేయ
రండు రండని పిలిచె సంక్రమణలక్ష్మి

ఈ సంక్రాంతి అందరి మనసుల్లో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ, మరొక మారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!

12 comments:

  1. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. బాగున్నాయండీ - తుమ్మల సీతారామ్మూర్తి గారి పద్యం, మీ ముత్యాల సరాలూ, ఇంటి ముందు ముగ్గూ ... అన్నీ బాగున్నాయి.
    సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  3. సంక్రాంతి శుభాకాంక్షలు

    ~సూర్యుడు

    ReplyDelete
  4. మీకూ సంక్రాంతి శుభాకాంక్షలండీ

    ReplyDelete
  5. మకర సంక్రాంతి శుభాకాంక్షలు.

    మా అమ్మాయిలకు కూడా చూపించాను ముగ్గులు ఎలా ఉంటాయో. ఇంగ్లీషులో కూడా రాస్తారన్నమాట, Very Coool! అని ఓ విశేషణాన్ని జోడించారు. గొబ్బెమ్మల గురించి వివరించటము కుదరటము లేదు. మరుసటి సంక్రాంతికైనా మా పల్లేటూరులో ఉండేట్లు ప్లాన్ చేసుకోవాలి.

    ReplyDelete
  6. మీకు మీ కుటుంభ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  7. కామేశ్వర రావు గారు !
    సంక్రాంతి శుభాకాంక్షలు

    ReplyDelete
  8. మాష్టారూ,

    సీతారామ్మూర్తిగారి సంక్రాంతి విందు భోజనం బహు పసందుగా ఉంది. మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. విందు భోజనం .. పసందు భోజనం .. తుమ్మల వారి పద్య భోజనం

    ReplyDelete
  10. తెలుగు ముంగిట(అందునా మీ బోటి వారి),'తెలుగువారి పెద్ద పండగ' తెలుగు ముగ్గుల్లో,పరభాషా వ్యామోహంలో చిక్కుకునుంటే చూసి మనసు చివుక్కుమని,ఈ వ్యాఖ్య రాస్తున్నా...

    ReplyDelete
  11. అనానిమస్ గారు,

    మీ మనసు మరీ సున్నితంలాగా ఉందండీ :-) మీ దృష్టి ముగ్గు 'పైకి' ప్రసరించిందో లేదో నాకు తెలియదు. అక్కడ మకుటాయమానంగా వెలుగుతూ మన తెలుగు అక్షరాలు కనిపించుండాలే! మరో విషయం, మేముంటున్నది తెలుగుదేశంలో కాదు. కాని ఇక్కడివాళ్ళు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. మరి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడమెలా? అయ్యా అదీ సంగతి, చిత్తగించవలెను. మీ మనసు బాధని నిర్మొహమాటంగా వ్యక్తపరచినందుకు సంతోషం. మీ పేరు చెప్పుకొని ఉంటే నేను మరింత సంతోషించేవాడిని!

    ReplyDelete
  12. మీ నుంచి ఈ సమాధానమే ఊహించానండీ..ఎందుకంటే నేను ముగ్గు పైనా చూశాను..మీరు వేరే దేశంలో ఉంటున్నారనీ తెలుసు..కాని నా మనసుసున్నితం కాదండీ..కొంచెం చాదస్తం ఎక్కువ..తెలుగు ముగ్గుల్లో ఇంగ్లీషు అక్షరాల్ని మొదట్నుంచీ నేను జీర్ణించుకోలేను,దానికి ఎలాంటి కారణాలున్నా..ఉదాహరణకి ఆంగ్లసంవత్సరాది నాడు ఇంగ్లీషు ముగ్గులెయ్యటం..

    ReplyDelete