తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, January 30, 2010

ఒక సాయంసంధ్య


అలసిన నీ మొగమ్ము నహహా యిదె చూడుమటంచు నవ్వులన్
దొలకుచు నింగిజాణ తన తూరుపుటద్దము జూప నందు నా
వెలవెల బోయినట్టి ప్రతిబింబము గాంచి కలంచి సిగ్గు పే
రలుకయు రాగ, రాగమయమయ్యెనొ భాస్కరు నాననమ్ము నాన్
జలజసఖారు లిర్వురును సంధ్యను దోచిరి నేడు చూడగన్

ఈ మధ్య ఆఫీసులో నాకు స్థానచలనం కలిగింది. ఒక చోటునుండి వేరే చోటుకి నా సీటు మారింది. ఆ మార్పు నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు నా సీటు వెనకాతలే ఒక కిటికీ. ఆ కిటికీ లోంచి చూస్తే అస్తమించే సూర్యుడు, సంధ్యాకాశం అందంగా కనిపిస్తాయి. అప్పుడుడప్పుడు సాయంత్రాలు ఆ కిటికీ తెర తొలగించి ఆ సంజ కెంజాయలని తిలకించడం ఒక అలవాటయ్యింది. నిన్న కూడా అలాగే కాసేపు చూశాను. అయితే నిన్న మరో చిత్రం కూడా నా కంటబడింది. మేముండే వింగులోంచి ఎదురుగా ఉండే వింగుకి వెళ్ళడానికి ఒక వరండా ఉంది. ఆ వరండాకి అటు చివర మరో కిటికీ. చిన్న విరామం తీసుకొని ఆ వరండాలో నడుస్తూ అటువైపుకి వెళ్ళాను. ఆ కిటికీలోంచి ఎదురుగా ఆకాశంలో అప్పుడే ఉదయించిన చంద్రుని పూర్ణబింబం కనిపించింది! ఇటువైపు సూర్యబింబం, అటువైపు చంద్రబింబం, ఎదురెదురుగా చాలా అద్భుతంగా తోచాయి. నిన్న శుక్ల చతుర్దశి కదా. సూర్యాస్తమయానికి కాస్తముందుగానే చంద్రోదయం అవుతుంది.

సూర్యచంద్రులని ఒకేసారి అలా ఆకాశంలో చూసేసరికి ఈ ఆలోచన వచ్చింది. దాన్ని పద్యంలో పెట్టడం కాస్త కష్టమే అయ్యింది. ఆఖరికి చూస్తే పద్యం కాస్తా అయిదు పాదాలయ్యింది. ఎలాగైనా నాలుగు పాదాలలో చెప్పగలనేమో అని ప్రయత్నించాను కాని ఇంత బాగున్నట్టు అనిపించలేదు. ఎన్నెన్నో విశేషమైన కల్పనలని మన ప్రాచీన పద్య కవులు ఇలా చిన్న చిన్న పద్యాల్లో ఎలా పొదిగేవారో కదా అని ఆశ్చర్యం వేసింది! ఈ పద్యాన్ని అర్థం చేసుకోవడం మరీ కష్టం కాదు కాబట్టి వివరణ ఇక్కడ ఇవ్వడం లేదు.

చాలా రోజులకి ఒక అద్భుతమైన అందమైన దృశ్యాన్ని చూసినందుకూ, మరీ అంత అందమైనది అద్భుతమైనది కాకపోయిన, ఒక చిన్న ఊహని పద్యంలో పెట్టగలిగినందుకూ ఎంతో తృప్తిగా ఉంది!

16 comments:

  1. బాగున్నదండి.ఉపమానం హృద్యంగా ఉందండీ. అలుకతో సూరీడు ఎర్రబడ్డాడో?

    ReplyDelete
  2. baagundi. vachana kavita aite inka baagunnu anipistondi. emaina mee krushi slaaghaneeyam

    ReplyDelete
  3. జలజసఖారు లిర్వురును సంధ్యను దోచిరి - బహుసుందరంగా వుందండి.తామరపువ్వులమిత్రులకి శత్రువులు ఇరువురు. సూర్యుని అనుకోవచ్చు కానీ చంద్రుడు కూడా అరి అవుతాడా. నాకు తెలియకే అడుగుతున్నాను. అన్యథా భావించరని తలుస్తాను.

    ReplyDelete
  4. సూర్యుడుగారు, ఫణిగారు, వర్మగారు ధన్యవాదాలు.
    మాలతిగారు ధన్యవాదాలు. జలజ సఖ అరులు ఇర్వురును - జలజ సఖుడు (సూర్యుడు), జలజ వైరి (చంద్రుడు) ఇద్దరూ అని. చంద్రుడు వస్తే (రాత్రి) తామరపువ్వులు ముడుచుకుపోతాయంటారు కాబట్టి తామరలకు చంద్రుడు శత్రువంటారు.

    ReplyDelete
  5. చాలా హాయిగా సాగిపోయిందండి పద్యం.

    ReplyDelete
  6. ఆహా! ఆఫీసులో నా గది వెనుక కూడా కిటికీ ఉంది. అది కూడా పశ్చిమం వైపునే ఉంది. ఐనా ఇంత మంచి భావన నాకు తట్టలేదు గదా :)

    నాకైతే మీరు చెప్పదలచిన భావం నాలుగు పాదాల్లోనే పూర్తయిపోయినట్లనిపించింది. నాలుగు పాదాల్లోనూ సూర్యుని గురించే చెప్పి కేవలం చంద్రుడిని పద్యంలోకి లాగడానికే ఐదో పాదం చెప్పినట్లుంది. పైగా జలజారి అని నెగటివ్ పేరొకటి. చంద్రుని తరపున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానధ్యక్షా!

    జలజసఖారులిర్వురూ 'సంధ్యను దోచి' ఆపై మీ మనసును దోచిన విధం, ఆ పై మీ మనసున దోచిన భావం ... చాలా బాగున్నాయి!

    ReplyDelete
  7. "నింగి జాణ" పద ప్రయోగం కూడా బాగుంది. ఆకాశాన్ని స్త్రీతో పోల్చడం కొత్తేనేమో!

    ReplyDelete
  8. o 'sayam sandhya' nu dochi
    dosillalo padhyaanni posi
    hrudyamgaa nadipaaru pada prayogaalu chesi.

    ReplyDelete
  9. తూరుపుటద్దం కూడా బావుంది.
    @చంద్రమోహన్ గారు,
    జాణ అంటే స్త్రీ నే అంటారా?
    కామేశ్వర రావు గారు, చంద్రుడు అంత తొందరగా ఎందుకు వచ్చాడో ఎవరికి తెలుసు. మీ కొత్త స్థానాన్ని చూడాలని మీరు కచేరి ఒదలకముందే వచ్చాడేమో

    రవి యుండ గానె రయమున వచ్చెలే
    ఇందుడుపనివేళ ఇంక మిగుల
    కనుటకయ్య నేడు కామేశ రాయుని
    నూత్న పదవి శోభ నోళ్ల వినుట.

    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  10. నరసింహగారు, అక్షరమోహనంగారు, చంద్రమోహన్ గారు, ఊదంగారు,
    ధన్యవాదాలు.

    చంద్రమోహన్ గారు,
    జలజం అంటే నీటినుండి పుట్టింది కాబట్టి కలువ అనికూడా అనుకోవచ్చు. పోని అలా తీసుకోండి. అప్పుడు జలజసఖుడు చంద్రుడు, జలజారి సూర్యుడు అవుతారు :-) మీరు జాగ్రత్తగా గమనిస్తే చంద్రుడు మూడవపాదంలోనే ఉన్నాడు. అది మీరు మరీ తీవ్రంగా ఖండిస్తారేమో! :-)

    ఊదంగారు,
    జాణ అంటే స్త్రీ అవ్వనక్కరలేదు కాని, నేను స్త్రీ అనే దృష్టితోనే ప్రయోగించాను. ముందు "గగనాంగన" అన్న పదం వెయ్యాలనుకున్నాను. కాని గణాలు సరిపోక "నింగిజాణ" అన్న పదం వచ్చింది. ఇది మరీ బాగుందనిపించింది. అన్నట్టు స్థానచలనం అయినంత మాత్రాన అది పదవీ ఉన్నతి కాదు సుమండీ!:-) నేను కచేరి వదిలేసరికి ఒకోసారి చంద్రాస్తమయం కూడా అయిపోతుంది

    ReplyDelete
  11. పద్యమంతా తెనుగులో చెప్పి, చివర్లో జలజ సఖారులని సంస్కృత సూర్యచంద్రులని దింపారు. బావుంది.

    మీ ఊహ చూసిన తర్వాత "పూర్ణమదః పూర్ణమిదం .." అన్న శ్లోకానికి తిరుమల రామచంద్రగారు సూర్యబింబం, చంద్రబింబాలకు అన్వయిస్తూ చెప్పిన ఓ వ్యాఖ్యానం గుర్తొచ్చింది.

    ReplyDelete
  12. రవి,

    నెనరులు. ఇంకెందుకాలస్యం, ఆ "పూర్ణమదః" శ్లోకంగురించి వెంటనే బ్లాగండి!

    ReplyDelete
  13. కామేశ్వర రావు గారు,
    మీరు స్థానచలనం అని టపాలోనే నొక్కి చెప్పినా, నా కెందుకో నమ్మబుద్ది కాలేదు.. అందుకే అలా అన్నాను..
    త్వరలోనే పదవి ఉన్నతి కూడ ఉందేమో లెండి..
    ఐతే పదోన్నతి అన్న ప్రయోగం తప్పంటారా...

    ఐనా, పద్యం ఎత్తుకుంటూనే తప్పులోకాలేస్తే చెప్పలేదేమిటండీ..
    రవియె క్రుంక కుండ అని మొదలుపెట్ట వలసినది.

    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  14. ఊదంగారు,

    హాయిగా మూడు చంద్రోదయాలు, ఆరు సూర్యాస్తమాయలుగా సాగిపోతోంది ఉద్యోగం. ఎందుకొచ్చిన పదోన్నతి చెప్పండీ, అనవసరమైన తలనొప్పి! :-)
    పదోన్నతి సరైన పదమే. అక్కడ మీరు పదవి పదంవాడారు కాబట్టి పదవీ ఉన్నతి అన్నానంతే.

    >>"ఐనా, పద్యం ఎత్తుకుంటూనే తప్పులోకాలేస్తే చెప్పలేదేమిటండీ.."
    ఈ మధ్య తప్పులెన్నడం తగ్గిద్దామనిపించి:-) అందులోనూ మీరు నాకు పదోన్నతి ప్రసాదించేరాయె! :-)

    ReplyDelete
  15. కామేశ్వర రావు గారు,

    'జలజారి'ని చూస్తూ మూడవ పాదం విషయం మరిచిపోయానండీ. నిజానికి ఖండించాల్సింది అదే!

    నెలరాజును యలసిన రవి
    మలిన ప్రతిబింబమట్లు మలచిన మీ యీ
    పలుకు చమత్కారమ్మును
    కలువల రాయని తరపున ఖండిస్తున్నా :)

    మీరు అర్జెంటుగా చంద్రుని పై ఓ మంచి పద్యం వ్రాస్తే గానీ మా మనోభావాలు శాంతించవంతే!

    ReplyDelete