తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, January 4, 2010

గరికిపాటివారి శతావధానం విశేషాలు

మిత్రుల కోరిక మీద శతావధానం విశేషాలు మరికొన్ని.

ఇంతకు ముందు ఒక టపాలో శతావధానం కన్నా అష్టావధానమే కష్టమని అన్నాను. కాని ఈ శతావధానం చూశాక దేని కష్టం దానిదే అని తెలిసింది. 75 పద్యాలను సరిగ్గా వరసలో గుర్తుకుపెట్టుకోవడం చాలా కష్టమైన పని. దీనికి చాలా సాధన అవసరం. దీని గురించి గరికిపాటి వారు చిన్నచిన్న విషయాలు చెప్పారు. ప్రతి పద్యానికి ఒక keyword (కీలక పదం) గుర్తుపెట్టుకుంటారుట. పద్య సంఖ్య, కీలకపదం కలిపి గుర్తుపెట్టుకుంటారు. ఇది అవధానం చేస్తున్నంత సేపూ మాటిమాటికీ మననం చేస్తూ ఉంటారు. దీనికి తోడు పృచ్ఛకుని పేరు కాని, అతని ఆకారంలోని ఏదైనా విలక్షణతని కాని ఇచ్చిన అంశంతో గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకి "భవశీర్షము ద్రుంచె రాగతత్పరమతియై" అనే సమస్య ఇచ్చిన అతనికి గుండుంది. అందులోని "శీర్షము" పదానికీ ఆ గుండుకీ లంకెపెట్టుకుంటారు. మూడు రోజుల్లో జుట్టొచ్చెయ్యదు కాబట్టి, అతన్ని చూడగానే ఆ సమస్య గుర్తుకువస్తుంది! పద్య నియమాలైన గణ యతి ప్రాసలు పద్యాలని గుర్తుపెట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయి. అందులోవాడే పదాలు కూడా సులువుగా గుర్తుండేటట్టు వేసుకూంటారు. ఉదాహరణకి "చిద్వేద్యమై హృద్యమై" లాంటి అనుప్రాసలు. మననం చేసుకోవడంలో ఒక పద్ధతేదో ఉంటుంది. ఒకసారి ముందునుంచి వెనక్కి, మరోసారి వెనకనుంచి ముందుకి ఇలా. సాధన చెయ్యడమే ధారణకి మార్గం. గరికిపాటి వారు ఎంత సాధన చేస్తే 75 పద్యాలు 32 నిమిషాల్లో చెప్పగలిగారో!

మూడు రోజులు శతావధానం చెయ్యడంలో మరో కష్టం ఉంది. అది మూడు రోజులూ, ఆరు పూటలూ పృచ్ఛకులనీ, ప్రేక్షకులనీ రంజింప చెయ్యడం. ఇది సాధనతో సాధ్యమయ్యేది కాదు. స్వతహాగా ఉండాల్సిన ప్రతిభ. గరికిపాటివారికది పుష్కలంగా ఉంది. చమత్కారాలతో ఎప్పుడు నవ్వించాలో, ఆర్ద్రతతో ఎలా ముంచెత్తాలో, ఆవేశంతో ఏలా ఊగించాలో అతనికి చాలా బాగా తెలుసు. పాత అవధానాలలోని పద్యాలు, తన సాగరఘోషలోని పద్యాలు, శంకరాచార్యులు, కాళిదాసు మొదలైనవాళ్ళ సంస్కృత శ్లోకాలు సందర్భోచితంగా చెప్పి వివరిస్తూ ఉంటే అలా ఎంత సేపైనా వినాలనిపిస్తుంది.

ఈ శతావధానంలో పృచ్ఛకులు ఇచ్చిన అంశాలలో చాలా వైవిధ్యం కనిపించింది. ముందుగా నేనిచ్చిన సమస్య గురించి. కిందటి టపా వ్యాఖ్యల్లో చెప్పినట్టు ఇది మత్తేభ/శార్దూల పద్యపాదం. ఒక అక్షరం చేరిస్తే శార్దూలం, రెండక్షరాలు చేరిస్తే మత్తేభం. ఇది ముందు పోల్చుకోవాలి. అవధానిగారికి ఇది పెద్ద కష్టం కాదు. అయితే ఇక్కడ కీలకమైన విషయం యతి నిర్వహించడం. యతిని నిర్వహిస్తూ "భూతమ్ము"ను దేవతలు చూసేదిగా చెయ్యాలి. దీనికి నేననుకున్న పూరణ "ఆవిర్భూతమ్మగు" అని వేసుకోవడం. అప్పుడు ప్రాస "ర్భ" అవుతుంది. ఇది మరింత క్లిష్టం. అవధానిగారి పూరణ ఇచ్చేముందు నా పూరణ ఇది:

దుర్భావ్యమ్మగు క్షీరవార్థి మథనోద్యోగమ్మునన్ బుట్టె మున్
దుర్భాగ్యమ్మన కాలకూటము వెసన్ గ్రోలెన్ శివుం డంతటన్
గర్భీభూత సుధానిధుల్ భుగభుగల్గా పొంగి యేతెంచె నా
విర్భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్

అయితే అవధానిగారు తెలివిగా ఈ క్లిష్ట ప్రాసని తప్పించుకున్నారు. అయితే అతను భూతాన్ని ఎలా మారుస్తున్నారన్నది రెండుపాదాలు చెప్పిన తర్వాత కూడా నాకు అంతుబట్టలేదు. అవధానిగారి పూరణలోని మొదటి రెండుపాదాలు ఇవి:

శ్రీభూదేవుల కేది యింటివెలుగై చిద్వేద్యమై హృద్యమై
శోభిల్లున్ సకలాగమాంత పదమై శుద్ధ ప్రకాశమ్మునై

మూడవ పాదం ఏమిటో, భూతం ఏమైందో మీరేమైనా ఊహిస్తారేమిటి?

నేనిచ్చిన సమస్య ఒక్క ఛందోగోపనమే అయితే, ఛందోగోపనంతో పాటు అచ్చు ప్రాసతో కూడిన మరో సమస్య ఒకరిచ్చారు. సమస్యలన్నిటిలోకీ అత్యంత క్లిష్టమైనది ఇదే.

ఉగము పైనున్న లోకరక్షకు గొల్తున్

ఇది కందపద్య పాదం. అయితే మొదటి అక్షరం లోపించింది. పైగా రెండో అక్షరం "ఉ". అది ప్రాసాక్షరం. ప్రాసాక్షరం అచ్చు అయినప్పుడు, మిగతా పాదాల్లో కూడా అచ్చు అక్షరమే రావాలన్నది నియమం. అది ఏ అచ్చైనా ఫరవాలేదు. ఇలాంటి పద్యాలు ప్రాచీన కావ్యాలలో ఎక్కడా ఉన్నట్టు లేవు. లాక్షణికులు మాత్రం ఒక ఉదాహరణ పద్యమేదో ఇచ్చారు. తర్వాత శ్రీశ్రీ ఒక్కడే తన సిరిసిరిమువ్వ శతకంలో అచ్చు ప్రాసతో పద్యం రాశాడు. అది ఇక్కడ చదువుకోండి: http://www.eemaata.com/em/issues/201001/1530.html/3/.
ఇందులో ఉన్న చిక్కేమిటంటే, సాధారణంగా ఇలా అచ్చుతో మొదలయ్యే తెలుగు పదాలకి, ముందు పదాలతో అచ్చు సంధి జరుగుతుంది. అలా జరగనప్పుడు యడాగమం వచ్చి అచ్చు కాస్తా "య"కారంగా మారుతుంది. అలా చెయ్యకపోవడం సమంజసం కాదు. అంచేత సంస్కృతాన్ని ఆశ్రయించాలి. లేదా ఇంకేమైనా కిట్టుంపు చెయ్యాలి. అలా కిట్టించి అవధానిగారు పూరించిన పూరణ ఇది:

అ ఉ మాహేశ్వరుడిట్లనె
"స ఇనో మంతవ్యయేవ సహసా భక్త్యా
స ఉదేతి" యనుచు, బ్రోవ పు
ర ఉగము, పైనున్న లోకరక్షకు గొలుతున్


ఇక్కడ "అ ఉ మాహేశ్వరుడు" అంటే "అవసరాలో", "అరిపిరాలో" ఇంటిపేరున్న ఉమా మహేశ్వర రావనే వ్యక్తి. అతను చెపుతున్నాడు. పేర్లని పొట్టిచేసేటప్పుడు సంధులు రావు కదా! రెండు మూడు పాదాలు సంస్కృతం. సూర్య స్తుతి. పుర ఉగము - ఉగము అంటే సంవత్సరమనే అర్థం వస్తుందిట. పుర ఉగము అంటే రాబోయే సంవత్సరము అని. రాబోయే సంవత్సరం అందరినీ రక్షింపమని సూర్యుడిని స్తుతిస్తూ, పైనున్న ఆ లోకరక్షకుడిని గొలిచెదనని ఆ సదరు ఉమామహేశ్వరుడు అన్నాడుట!

మరికొన్ని మంచి సమస్యలు:

భవశీర్షము ద్రుంచె లోకతత్పరమతియై (ఇక్కడ యతి సరిపోలేదు. అది కుదిరేటట్టు అవధానిగారు పూరించాలి)

మేరీమాతసుతుండు రాముడనియెన్ మేకొంచు సౌమిత్రియే

బ్రతికిన పుత్రునిచ్చెద, భవన్మృత పుత్రిక నిమ్ము సోదరీ!

మగనిన్ గొట్టిన కాంతయే యగును సమ్మానార్హ లోకంబునన్ (సమస్యలలో ఉన్న ఒకే ఒక పృచ్ఛకురాలు ఇచ్చిన సమస్య ఇది! చాలా సరసమైన పూరణ చేశారు గరికిపాటివారు)

మగవారికిన్నొక్కటుండున్ మగువలకమరన్ మంచిగన్ రెండునుండున్ (ఇది మహా స్రగ్ధర వృత్తం. ఇందులో రెండు యతులు. ఇందులోని అశ్లీల ధ్వనిని చక్కగా పరిహరించారు.)

ఖాట్మండూపుర విఘ్ననాయకుని శృంగారమ్ము విన్నాణమౌ

దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికందుల్ పుట్టే నుగ్రాకృతిన్

(పై రెండూ దుష్కర ప్రాస సమస్యలు)

గోవిందుడు క్రైస్తవులకు కులదైవంబౌ

దత్తపదులలో కొన్ని విశేషమైనవి:

వారాయ్, నానుని, వందే, నినవు - భారతార్థంలో (చంద్రముఖిలో పాట ఆధారంగా ఇవ్వబడిన పదాలు)

ఎడిసన్, థాంసన్, న్యూటన్, వాట్సన్ - భారతార్థంలోనే

బ్రాకెట్, లాకెట్, రాకెట్, క్రికెట్ - బాల కృష్ణుని లీలలు

దాశరథీ, శరధీ, రథీ, ధీ - విజయనగర వైభవం

కలివిడి, చలిమిడి, పిడికిలి, తిరగలి - సరిహద్దు జవానుల గొప్పతనం

అత్త, మామ, అమ్మ, నాన్న - ఆవే అర్థాలలో రాకుండా, శివధనుర్భంగం

రామ, భీమ, ప్రేమ, నీమ - ఇది అడిగిన పృచ్ఛకుని అవధానిగా స్తుతిస్తూ పద్యం!

టమోటా, పొటేటో, క్యాబేజి, కారెటు - భారతార్థం

గరికి, సరిక, రారిక, మరిక - ప్రస్తుత అవధానం గురించి

నయనతార, భూమిక, ప్రియమణి, దీపిక - ధనుర్మాసం (దీనికి ముందు దీపిక బదులు ఇచ్చిన మాట అనుష్క. కాని ఈ మాట అర్థ రహితం కాబట్టి మారిస్తే బాగుంటుందని అవధానిగారు సూచిస్తే, మార్చి దీపిక ఇచ్చారు పృచ్ఛకులు. దానికి బదులుగా దీపిక పూర్తిపేరు, "దీపిక పడుకొనె"ని పద్యంలో తెప్పించారు గరికిపాటివారు!)


వర్ణనలలో కొన్ని విశేషమైనవి:

శ్రీకృష్ణుని అష్టభార్యల సేవలు సీస పద్యంలో వర్ణించమని

దోమలు లేని భూమిని ఊహిస్తూ చంపకమాల

ఆడపిల్లలపై జరుగుతున్న అమానుషమైన దాడులని నిరసిస్తూ ఒక పద్యం

పృచ్ఛకులంతా అవధానులైతే అవధానం ఎలా ఉంటుంది?

వేదవాణి వైశిష్ట్యాన్ని గురించి

నాశనమవుతున్న పర్యావరణం

రుక్మిణీకల్యాణ సమయంలో కృష్ణుడు రుక్మిణిని గతజన్మలో బంగారు సీతగా ఊహించడం

తెలుగుభాష గొప్పదనం, మాధుర్యం

అదృశ్యమవుతున్న పల్లెటూళ్ళు

మీరు ముఖ్యమంత్రి అయితే ఏమిటి చేస్తారు?


సమస్య, దత్తపది, వర్ణన మొత్తం డెబ్భై అయిదు పద్యాలు కాకుండా, ఆశువుగా చెప్పిన పద్యాలు ఇరవై ఆరు. మొట్ట మొదటే ఒక అందమైన ఆశువు వచ్చింది. అవధానాన్ని శతపత్ర కమలంగా పోలుస్తూ ఆశువుగా పద్యం చెప్పమన్నారు. అప్పుడు చెప్పిన పద్యం:

అరయన్ పృచ్ఛకపత్రముల్ విరియ నవ్యంబైన యూహల్ మదిన్
పరమానందము గూర్చు బాలరవియై పద్యమ్ములే తేనెలై
సరసుల్ ప్రేక్షకులెల్ల బంభరములై సాగున్ గదా యజ్ఞ మా
అరవిందాసన బ్రోచుగావుత శతంబానందమై అందమై

ఇక్కడ "బాల రవి" అంటే ఈ అవధాన సంచాలకులు శ్రీ రవికుమార్ గారు. రాముని గురించి చెప్పి లక్ష్మణుడి గురించి చెప్పకపోవడం ఎంత తప్పో, ఈ అవధానంలో గరికిపాటివారి గురించి చెప్పి రవికుమార్ గారి గురించి చెప్పకపోవడం అంత తప్పు! శతావధానంలో సంచాలకులది చాలా ముఖ్యమైన పాత్ర. అవధాని వేగమైన ధార ఒడ్డులు తెగి ప్రవహించకుండా జాగ్రత్తగా చూసే బాధ్యత సంచాలకులది. అంటే వేగంగా చెపుతున్న పద్యంలో ఒక చిన్న యతిభంగమో, వ్యాకరణ దోషమో పొరపాటున పడవచ్చు. దానిని పృచ్ఛకులు, ప్రేక్షకులు గ్రహించి ఎత్తిచూపేలోపు, సంచాలకులు గ్రహించి అవధానిగారిని జాగ్రత్తగా హెచ్చరించాలి. అవధానిగారు పద్య పూరణ చేసేటప్పుడో, ధారణ చేసేటప్పుడో ఎప్పుడైనా ఒక క్షణం ఆగితే, దాన్ని జాగ్రత్తగా మాటలతో కప్పిపుచ్చాలి. అలాగే మధ్యలో అవధానిగారు మననం చేసుకొనేటట్టుగా పద్యాన్ని మరోసారి చెప్పమనడం వంటివి చేస్తూ ఉండాలి. ఈ సంచాలకత్వాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించారు రవికుమార్ గారు. మరో విశేషం ఏమిటంటే, వీరు అవధానిగారి పద్యాలలోని గొప్పతనాన్ని (భావంలో కాని భాషలో కాని) కూడా వివరించేవారు. అక్కడక్కడా ఒక పదం కన్నా మరొక పదం మరింత ఔచితీమంతంగానో, సమంజసంగానో ఉంటుందని సూచనులు కూడా చేసేవారు. ఆ సూచనలని గరికిపాటివారు సంతోషంతో ఆమోదించేవారు. దీని వల్ల పద్యాలలో అందం మరికాస్త పెరిగింది.

వృద్ధాశ్రమాల గురించి చెప్పిన ఆర్ద్రమైన ఒక ఆశువు:

ఇంత ముద్ద తినక ఏడిపించెను నాడు
పెట్టబోక ఏడిపించు నేడు
వృద్ధి జెందుచుండె వృద్ధాశ్రమమ్ములు
ఆశ్రమమ్ములందు అయిదవదది!


ఇక అప్రస్తుత ప్రసంగంలో ప్రస్తావించబడిన విషయాలు, చమత్కారాలు అనేకం. వాటిని ఇక్కడ వివరించడం సాధ్యం కాదు. చప్పున గుర్తుకు వస్తున్నవి కొన్ని:

రాకెట్, లాకెట్ మొదలైన దత్తపదిని పూరించే సమయంలో ఒక అప్రస్తుత ప్రసంగకుడు అడిగిన ప్రశ్న. ఇంగ్లీషు వస్తువుల పదాలని తెలుగులో వాడినప్పుడు సాధారణంగా, చివరన "ఉ"కారం చేరుతుంది కదా, లాకెట్టు, రాకెట్టు ఇలా. మరి "వాచ్"ని మాత్రం తెలుగులో "వాచు" అనకుండా "వాచీ" అనెందుకంటాము? దీనికి అవధానిగారు హాస్యంగా చెప్పిన సమాధానం. అది నిరంతరంగా పెట్టుకుంటే మన చెయ్యి "వాచి"పోతుందని చెప్పడానికి. ఈ సందర్భంలో గడియారం గురించి ఒక పిట్ట కథ చెప్పారు. గరికిపాటివారు భువనవిజయంలో తెనాలి రామకృష్ణుని పాత్ర వేసేవారట. అలాంటి ఒక సభలో, వేషం బాగానే కుదిరింది కాని చేతికి వాచీ ఉండిపోయిందట. దీన్ని గమనించిన ఒక ప్రేక్షకుడు, అదేమిటి తెనాలి రామకృష్ణునికి వాచీ ఎక్కడనుంచి వచ్చిందని అడిగాడట. అప్పటికప్పుడు ఏదో సమర్థించుకోవాలి కదా. అష్ట దిగ్గజ కవులు భూలోకం వచ్చి భువనవిజయం చేస్తున్నారన్నది ఆ భువనవిజయం జరిగే సందర్భం. అంచేత గరికిపాటివారు ఇలా సమర్థించుకున్నారట. "నేను భూలోకానికి దిగినప్పుడు, ఈ సభకి వస్తున్న తోవలో ఒకని చేతికి ఈ గడియారాన్ని గమనించి వింతగా తోచి, దాని గురించి వివరాలడిగాను. అతనా గడియారం గురించి వివరించాడు. అప్పుడు ఆశువుగా దానిగురించి ఒక పద్యం చెప్పాను. నా పద్యానికి మెచ్చి ఆ వ్యక్తి దీన్ని నాకు బహూకరించాడు." అని. ఆ ప్రేక్షకుడు ఘటికుడు. అయితే ఆ పద్యమేమిటో చెప్పమన్నాడట. అప్పుడు ఆశువుగా ఒక పద్యం చెప్పారు గరికిపాటివారు. ఆ పద్యం నాకు గుర్తు లేదు కాని. దాని తాత్పర్యం ఇది - గడియారంలో నిరంతరం తిరిగేది సెకన్ల ముల్లు. ఎప్పుడో గంటకొకసారి మాత్రమే కదిలేది పెద్ద ముల్లు. అయినా సమయం మనం పెద్దముల్లు చూపించే గంటలలోనే చెప్పుకుంటాం. వాచీ విషయంలో కూడా శ్రమకి తగిన గుర్తింపు లేదన్నమాట, అని విచారించే పద్యమది.

గరికిపాటివారు చెప్పిన మరో పిట్ట కథ. శ్రీశ్రీ, ఆరుద్ర ఒకసారి గయోపాఖ్యానం నాటకానికి వెళ్ళారట. అందులోని నటుడు (కృష్ణ పాత్రధారి అనుకుంటా) "పాతాళంబున దాగియుండినను..." అన్న పద్యం చదువుతూ, అలవాటుగా చెయ్యి పైకెత్తి పాడుతున్నాడట! ఆరుద్ర శ్రీశ్రీని అడిగాడట, "మావా, ఇతను పాతాళం అంటూ చెయ్యి పైకెత్తి చూపిస్తున్నాడేమిటి" అని. దానికి శ్రీశ్రీ ఇచ్చిన జవాబు, "మన నాటకరంగ పరిస్థితి అథఃపాతాళంలో ఉంది. అంటే పాతాళం కన్నా కిందనన్న మాట. అందుకే అతను పాతాళం తన పైనుందని చూపిస్తున్నాడు!".

మరేదో సందర్భంలో మరో సంఘటన వివరించారు. సాధారణంగా సాహిత్యమ్మీద కాని భాష మీద కాని ఏమాత్రం అధికారం లేనివాళ్ళు కవి రచయితలని పొగిడేస్తూ ఉంటారని, అవి ఒకోసారి చాలా ఇబ్బందికరంగా ఉంటాయని ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒక సభలో ఒక రచయిత్రికి సన్మానం జరుగుతోంది. ఆ సభలో మాట్లాడే ఒక వక్త ఆ రచయిత్రిని గురించి ఊరికే పొగిడేస్తూ, "ఈవిడ నిజంగా పుంభావ సరస్వతి" అన్నాడట! :-)

గరికిపాటివారిని చాలామంది పలకరించేటప్పుడు వేసే ఒక చచ్చు ప్రశ్న, ఈ మధ్యన ఇంకేం రాశారు, ఏమీ రాయలేదా అన్నది అని చెప్పారు. కవి అంటే ఎప్పుడూ ఎదో రాస్తూనే ఉండాలా? పోనీ అతను రాసినవి ఈ అడిగే వ్యక్తి చదివాడా అంటే ఉండదు. ఊరికినే ఏమైనా రాశాడో లేదో తెలుసుకోడానికే అడుగుతారు! ఇదే సందర్భంలో గరికిపాటివారు మరో మంచి విషయాన్ని చెప్పారు. ప్రతివాడికీ ఏదో రాసేద్దామనే ఉత్సాహమే తప్ప చదువుదామనే ఆసక్తి ఉండదు. అందరూ రాయడం కన్నా చదవడం మీద ఎక్కువ దృష్టిపెట్టడం చాలా అవసరం అన్నారు. నిజమే కదా! దీన్ని ఈ ఏడాది న్యూ ఇయర్ రిజల్యూషన్ గా నేను పాటించాలని అనుకుంటున్నాను. చదవాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి. అంచేత ఈ ఏడాది రాయడం బాగా తగ్గించి, చదవడం మీద ఎక్కువ దృష్టిపెట్టాలని ఆలోచన. ఎంతవరకూ అమలు చేస్తానో చూడాలి!

51 comments:

  1. కామేశ్వరరావు గారూ, శతావధానాన్ని మేము చూడలేకపోయినా మీ రచన చదువుతున్నంత సేపూ సభలో కూర్చున్న అనుభూతి. మంచి మంచి చతురోక్తులతో పసందైన పద్యాలతో బహురమ్యంగా వుంది. అలాగే చివరి చమక్కు పుంభావ సరస్వతి ;)

    మీరు న్యూఇయర్ లో తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచటంలో సఫలీకృతులై మాకు మరిన్ని సాహిత్య రచనలు అందచేస్తారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
  2. కామేశ్వర రావు గారు - చాలా చాలా ధన్యవాదలండి. ఇంత చక్కగా ఆ అవధానస్థలి ని గరికపాటిగారి ప్రక్రియ ని వర్ణించారు. మీరు మీ రెసల్యూషన్ అమలుపరిచే ముందు ఇంకో రెండో మూడో టపాలు గరికపాటిగారి అవధానం గురించి రాయమని ప్రార్థన. అది ప్రత్యక్షంగా చూసే భాగ్యం మాకు లేకపోయింది కానీసం మీ వర్ణనతో అయినా ఆ అనుభవాన్ని చవిచూద్దాం అన్న స్వార్థం మాత్రమే.

    ఆ సమస్యాలంటికి గరికపాటి గారు ఎలా పూరించారో చెప్పలేదు మరి మీరు??

    ReplyDelete
  3. చాలా బావుంది కామేశ్వర్రావుగారూ. మీ సమస్యకి కవిగారెత్తుకున్న పోకడ చూస్తే శ్రీమహావిష్ణువు పాదద్వయాన్ని సంబోధిస్తున్నారని అనిపిస్తున్నది. అది భూతంగా ఎలా పరిణమించిందో మాత్రం మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి.

    ReplyDelete
  4. ఈ వ్యాసం "బావుంది" అనడం కూడా చచ్చుగా ఉంటుంది. మాటలకందనంత గొప్పగా వివరించారు.అభివందనాలు.

    "స్త్రీ భావ సరస్వతి" అని శ్రీరమణ చమత్కరించారు ఓ పుస్తకంలో.

    ReplyDelete
  5. చక్కగా, విశదంగా రాసారు. రవి గారు అన్నట్టు ఉత్త "బావుంది" అనడం బావుండదు.

    గరికిపాటి వారి బెంగళూరు అవధానం విన్నాం కాబట్టీ, "చమత్కారాలతో ఎప్పుడు నవ్వించాలో, ఆర్ద్రతతో ఎలా ముంచెత్తాలో, ఆవేశంతో ఏలా ఊగించాలో అతనికి చాలా బాగా తెలుసు" అని మీరు అన్నారు కాబట్టీ ఈ శతావధానం ప్రేక్షకులను బాగా అలరించి ఉంటుందని తెలుస్తూనే ఉంది. వింటానికి దొరికితే బాగుండు.

    ReplyDelete
  6. కామేశ్వరరావు గారూ !! చాలా బాగున్నదండీ.

    ఊరించి ఊరిచి చెప్తూండడం చూస్తూంటే విశ్వనాథ వారి ప్రభావం మీ మీద ప్రస్ఫుటం గా ఉన్నట్టు కనిపిస్తోంది. అవధానం విసేషాలతో మీ తర్వాతి టపాలు ఎప్పుడెప్పుడా అన్నట్టు ఎదురుచూస్తున్నాం.

    ఇంతకీ గరికపాటివారి సహస్రభారతి (కాకినాడలో సహస్రావధానం)లో మీరు పాల్గొన్నారా? ఎందుకడుగుతున్నా అంటే, దోగ్ధ్రీ ధేనువు సమస్యా పూరణం అప్పుడు విన్నట్టు గుర్తు. నా పుస్తకాల్లో ఎక్కడొ రాస్కుంట్టు కూడా గుర్తు. కనిపిస్తే / గుర్తొస్తే మళ్ళీ రాస్తా...

    సనత్ కుమార్

    ReplyDelete
  7. This comment has been removed by the author.

    ReplyDelete
  8. అద్భుతమండీ, మీ వ్యాసమూ, ఆ సభా.
    మీ పూరణ ఇంకా అద్భుతం

    ఇలాంటి వ్యాసము ఏ వార్తాపత్రికలో నైన వచ్చి ఉంటే ఎంత బాగుండేది.
    ఓంకారం గురించి చెప్పారేమో అని అనిపిస్తుంది.. కానీ భూతం గురించి ఇదమిద్దంగ ఇది అని చెప్పలేకపోతున్నాను. ( దైవీభూతం ఒక అవకాశమై దోచుచున్నది)

    ఈ ఉత్కంఠ ను చివరపాదం వరకు నిలిపి ఉంచటం అవధాని గారి చమత్కారం. సరే మీ సంగతి సనత్కుమార్ గారు చెప్పారుగా .

    ఇంతకీ ఈ సారి మీ అమ్మగారు ఏమి వడ్డించారో చెప్పలేదు, మీరు.
    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  9. కామేశ్వరరావు గారూ !!

    if I am not mistaken, భక్తులను చూస్తే ప్రేమతో ద్రవీభూతమ్మగు హృదయాన్ని సూచించారేమో?

    సనత్కుమార్

    ReplyDelete
  10. 1) రెండు గురువులతో భూతాన్ని కలపాలి. (ద్రవీభూతం అవడానికి అవకాశం లేదు)
    (2) అందుట్లో రెండవ గురువు 'వీ' 'వే' 'వై' లలో ఒకటయ్యుండాలి... (సంభూతమో, పృతగ్భూతమో అవడానికి ఆస్కారం లేదు)...
    (3) మొదటి గురువు ముందు లఘువుండాలి (తిరుప్పావై అనుకోడానికి లేదు)

    nail biting tension..... గోళ్ళిప్పటికే వేళ్ళ లోపలకి ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కుంటున్నాయి. ఇంకెప్పుడు తెల్లవారుతుంది? ఎప్పుడు సమాధానం దొరుకుతుంది??

    ReplyDelete
  11. దైవీభూతమ్మగు దాని అయ్యుండచ్చా?? ;)

    ReplyDelete
  12. నిక్కచ్చి గా 'దైవీ భూతమైన హృదయకమలాన్ని' సూచించి ఉండవచ్చు.

    ReplyDelete
  13. "దైవీ భూతం" - ఇదే కావాలి.
    దై - గురువు
    వీ - వీక్షించు లోని వీ తో యతి కుదురుతోంది.
    నాకు "గుంఫీభూతం" అన్న ఆలోచన వచ్చింది. అయితే వినడానికే ఎబ్బెట్టుగా ఉంది.

    ReplyDelete
  14. ఏది సకలాగమాంత పదమై, శుద్ధ ప్రకాశమై, చిద్వేద్యమై, హృద్యమై,శ్రీ భూదేవులకు యింటివెలుగై శోభిల్లుతోందో, అటువంటి "పెంజీకటికవ్వల వెలుగుచున్న" దైవీభూతమ్మగు దానిని (శ్రీహరిని) ప్రీతితో దేవతలు వీక్షిస్తున్నారు అని కవి సమయం అయ్యుండచ్చు...

    (లేదా)

    అటువంటి శ్రీహరి ఆశీస్సులు పుష్కలంగా ఉంటే ఈ శతావధానం లో రసజ్ఞత/ అనుభూతి "దైవీభూతమ్మగు !!" అని ఆశ్వాసన కూడా అయి ఉండవచ్చు....

    ఏదేమైనా మంచి సమస్యకి తృప్తికరమైన పూరణ.....

    కామేశ్వరరావు గారూ... దోగ్ధ్రీ ధేనువు గురించి పాతపుస్తకాలు వెతికితే ఒకే పద్యం లో రెండు విషయాలు పరిష్కారమయ్యాయి.

    (1) 'దోగ్ధ్రీ ధేనువు 'అన్న పదం మాత్రమే ఉందేమో అనుకున్నా... కాదు. మొత్తం పాదం కూడా ముమ్మూర్తులా అదే.
    (2) 'ర్భ ' కి 'ర్బ ' పొసుగుతుందా అన్న ప్రశ్న కి సమాధానం. గరికపాటి వారే 'దోగ్ధ్రీ ధేనువు 'కి "దృగ్ద్రాక్షా", "వాగ్ద్రూణంబుల్" అని వాడారు.

    శా !!దృగ్ద్రాక్షారస మాధురుల్ గుఱియు వాగ్దేవీ ప్రసాదంబదే
    వాగ్ద్రూణంబులు కుట్టినంత జననీ పాదమ్మె మందౌనుగా,
    దిగ్ధ్రా ప్రాసము దుష్కరమ్మె కనుమాంధ్రీమాత సంతానమున్
    దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికందుల్ పుట్టె నుగ్రాకృతిన్

    పృచ్చకులు వి.వి.ఆర్.ఎల్. నృసింహం గారు

    అయితే ఆ పూరణా, ఇప్పటి పూరణా ఒకటో కాదో మీరు చెప్పాలి.

    ReplyDelete
  15. కామెంటిన అందరికీ నెనరులు. ఇంకా వివరాలంటె కొంచెం కష్టమే! ముఖ్యమైన విశేషాలన్నీ చెప్పేసాను. ఇచ్చిన సమస్యలు, దత్తపదులకి ఔత్సాహికులు పూరిస్తారని అవధానిగారి పూరణ ఇవ్వలేదు. విజయభావనవారి బ్లాగులో బహుశా అన్ని పద్యాలు పెడతారు. అప్పటి దాకా వేచి ఉండండి. అప్పుడేమైనా పద్యాలకి వివరణ అవసరమైతే ఇస్తాను. ఆడియో లేదు కాని వీడియో 3 డివీడీలుగా వచ్చింది. అది అంతర్జాలంలోకి ఎక్కించడం కష్టం!

    సనత్ గారు, దోగ్ధ్రీధేనువు... పద్యానికి ఈసారి మరింత మంచి పూరణ వచ్చింది! "ద", "ధ"లకి మన పూర్వకవులు ప్రాస వేసారు, అంచేత అది చెల్లుతుంది. కాని "బ", "భ"లకి వెయ్యలేదు. అందుచేత చెల్లదని అన్నాను.

    ఊదం గారు, మా అమ్మగారు వారాయ్... దత్తపది ఇచ్చారు.

    ఇక నా సమస్య విషయానికి వస్తే, ఊరేవాళ్ళుంటే మరింత ఊరించే బుద్ధి :-) మొదటి పాదం విన్న తర్వాత, మా ఇంట్లో చర్చించి మేము కూడా "దైవీభూతమ్మగు"కి ఫిక్సయిపోయాము. ఇది మా తమ్ముడు ముందుగా ఊహించి చెప్పాడు. వాడి మీద చాలా కోపం ప్రకటించాను. పెద్ద వార్ణింగు కూడా ఇచ్చేశాను. అవధానిగారు కాని "దైవీభూతం" వేసి పూరిస్తే నీ భరతం పడతానని! ఎందుకంటే, ఈ సమస్యని నేనిచ్చి దీనికి "ర్భ" ప్రాస కాకుండా ఇంకేమైనా కుదురుతుందేమోనని వాణ్ణి (మా అమ్మగారిని కూడా) ఆలోచించమన్నాను, నాలుగు రోజులు టైమిచ్చాను. వాళ్ళకి కూడా ఇంకేమీ తట్టలేదు. అంచేత నేను కష్తపడి "ర్భ" ప్రాసతో పద్యం తయారుచేసుకొని అవధానిగారు కూడా కొంచెం శ్రమపడాలని ఈ సమస్యని ఇచ్చాను. ఇంత చేశాక మొదటి రోజు మొదటి పూట అవధానిగారు మొదటిపాదం చెప్పిన వెంటనే, ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో కూర్చున్నప్పుడు "దైవీభూతం" అని వేసుకుంటారేమో అని మా తమ్ముడు చెప్పేసరికి కోపం రాదూ మరి!

    ఇక అసలు విషయానికి వస్తే, ఛందస్సు పరంగా (గణ యతులు) సరిపోయే పదం "దైవీభూతం". అయితే...,

    "శుద్ధ ప్రకాశమై, చిద్వేద్యమై, హృద్యమై" వెలిగే "దైవీభూతమ్మయినది", కంటికి కనిపిస్తుందా, ఎంత దేవతలైతే మాత్రం? అలాగే ఓంకారం, రసజ్ఞత, అనుభూతి కూడాను. సమస్యలో "వీక్షించిరి" అని ఉంది కదా? "లోచూపుతో వీక్షించారు" అంటూ దబాయించవచ్చు కాని సరసమైన పూరణ అవ్వదు కదా.

    "శుద్ధప్రకాశమై", "చిద్వేద్యమై" వెలిగేది కంటికి ఎలా కనిపిస్తుందో ఆలోచించండి. పూరణ స్ఫురిస్తుంది! పూరణ త్వరలో విడుదల :-) (ఇది గరికిపాటివారి ఊతపదం. ప్రతి పాదం పూరించి, ఆ తర్వాత విషయం "త్వరలో విడుదల" అంటారు!)

    ReplyDelete
  16. దనుజాధీశుడు బంప పూతన కనెన్ దామోదరున్ వేగమే
    చనుబాలిచ్చి వధింప జేర హరి తా జంపెన్ సురుల్ మెచ్చగా
    పెను భూతమ్మగు దాని, ప్రీతిమతులై వీక్షించిరద్దేవతల్
    ఘనశ్యామున్ వరగోపిగోపహృదయాకాశార్కునిన్ బాలకున్

    ReplyDelete
  17. "అప్పటిదాకా తెలుగులోనే మాట్టాడుదాం" అనేది ఆయన మరో ఊతపదం -ఇది టీవీల్లో.

    ReplyDelete
  18. చాలా ఆనందంగానూ , టెన్షనుగానూ కూడా వుంది.

    ReplyDelete
  19. "ఎలా కనిపిస్తుందో ఆలోచించండి"
    అద్దమరేయి దాటిన తరువాత మీ వ్యాఖ్య చూసి ..

    ఇప్పుడు కాదులే అని - పొద్దునే లేచి - ద్రవీభూతమైన కళ్లను తుడుచుకుంటూ, నోటిని కాఫీభూతం (ప్రేరణ:గుంఫీభూతం) చేసుకొన్నా గానీ...
    ప్రయోజనం పెద్దగా లేదు..
    శైవీ భూతము, శాంభవీభూతము, వైష్ణవీభూతము ఇలా గొణుక్కుంటూ నడుస్తుంటే ... అందరూ .... నన్ను...

    అందువల్ల - అదేదో చెప్పేసి - మస్తిష్కాన్ని దీప్తీభూతం(?) చేయమని ప్రార్ధన

    ReplyDelete
  20. అనానిమస్ గారూ (పద్యం చూస్తే రాఘవగారనే అనిపిస్తోంది, అవునా?),

    పద్యం చాలా బాగుంది! "పెనుభూతమ్మగు దాని"ని విరిచి ముందు పాదంతో కలపడం వల్ల చాలా చక్కగా వచ్చింది పూరణ.

    ఊదం గారూ,

    హ హ హ!

    సరే ఇంకా సస్పెన్సు పెట్టడం సమంజసం కాదు. అవధానిగారి పూరణ చెప్పేస్తున్నాను.

    చిద్వేద్యమైన శుద్ధప్రకాశాన్ని చూడాలంటే ఆ వెలుగు పాంచభౌతికమైన స్వరూపాన్ని పొందాలి కదా! అందులోను, దానిని ప్రీతిమతులై వీక్షించారంటే అది మనోహరాకారమై ఉండాలి. (ఎంత మోహనంగా ఉందో మీరూ చూడాలంటే విజయమోహన్ గారి బ్లాగుకు వెళ్ళండి :-)

    శ్రీభూదేవుల కేది యింటివెలుగై చిద్వేద్యమై హృద్యమై
    శోభిల్లున్ సకలాగమాంత పదమై శుద్ధ ప్రకాశమ్మునై
    ఆభీరాంగన అంకమందొదిగె, తోయాకాశ వాయ్వగ్ని పృ
    థ్వీ భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్!

    ఒక భూతం కాదు పంచభూతాలని తెచ్చేసారు అవధానిగారు! ఆభీరాంగన అంటే గోపస్త్రీ, యశోద. అంతటి శుద్ధప్రకాశమూ కూడా వచ్చి ఆ యశోద అంకమందు "ఒదిగి"పోయింది. "ఒదిగె" అన్న పదం ఎంత సార్థకంగా వాడారిక్కడ! ఆ ఒదిగిపోయిన స్వరూపం పాంచభుతికమైనది. అంటే తోయ, ఆకాశ, వాయు, అగ్ని, పృథ్వీ భూతం. ఆ పంచభూతాత్మకమైన కృష్ణ స్వరూపాన్ని దేవతలు ప్రీతిమతులై చూసారు.
    ప్రతిపద సార్థకతతో ఉన్న ఈ పద్యం విడిగా చదువుకుంటే పూరణ పద్యమని తెలియదు. భాగవతంలో పద్యమేనా అని అనిపించదూ! "ర్భ" ప్రాసతో అవధానిగారు కష్టపడలేదే అన్న అసంతృప్తంతా ఈ అద్భుతమైన పూరణతో పటాపంచలైపోయింది. ఇంత మంచి పద్యం వచ్చిందని చాలా సంతోషం కలిగింది.

    ReplyDelete
  21. :(
    బావుంది - మనసు పంచభూతాల వరకువెళ్ళింది గానీండి - వాటిని విడగొట్టలని తోచలేదు, నేను సమైక్యవాదిని కాకపోయినా!.
    -----------------------------------
    "ఆ ప్రేక్షకుడు ఘటికుడు. అయితే ఆ పద్యమేమిటో చెప్పమన్నాడట."
    కీ.శే ఏలూరిపాటి అనంత రామయ్య గారు. ఎన్నో అవధానలు చేశారు. పృశ్చకులుగా, అప్రస్తుతప్రసంగీకునిగా, సంధానకర్తగా ఎన్నో అవధాన్లు సుసంపనం చ్చేసినవారు...
    ఓ సంగతి చెబుతూ ఉండేవాళ్లు
    ఓ మారు పల్నాడు లో భువనవిజయం చేస్తున్నారుట.సభ మంచి రసపట్టు లో ఉండగా మీరూ మీరూ లాలూచీ బడి సమస్యలిచ్చుకొని పూరించుకుంటున్నారు - నేను ఇస్తాను - పూరించండి - అని చాలా అసంధర్భమైన సమస్య ఇచ్చాడుట (ఆయన సమస్య చెప్పేవారు). పూరించిన వారికి వంద రూపాయలు ఇస్తానన్నాడుట ( అర ఎకరమొ ఎకరమో పొలం వచ్చేదిట ఆ రోజుల్లో)
    సరే అనంత రామయ్య గారు ( తె.రా.కృ.) పూరించారుట, మరో దిగ్గజం కూడా పూరించిన తరువాత, పెద్దన గారి వేషధారి పూరణకి సమాయత్తమౌతుంటే, సమస్య ఇచ్చినతని కొడుకు ( పొలాలు అమ్ముకోవలసి వస్తుందని) ప్రాధేయపడితే - రాయలవారి చేత గండపెండేరం తొడిగించుకున్న వాడివి - వందకు ఆశబడతావా - అని అనంత రామయ్య గారు ఆపినారుట.
    ఇంతకీ అప్పుడు జెప్పిన పూరణ చెప్పండి - అని ఘటికుడైన ప్రేక్షకుడు ఎవడైన అడిగితే -
    "ఊరినే జెబుతామేమిటి? ఆయన ఆ రోజుల్లోనే వంద రూపాయలు ఇచ్చాడు మరి." అని సమాధానం
    -------------------------------------

    సశేషం.

    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  22. :(
    బావుంది - మనసు పంచభూతాల వరకువెళ్ళింది గానీండి - వాటిని విడగొట్టలని తోచలేదు, నేను సమైక్యవాదిని కాకపోయినా!.
    -----------------------------------
    "ఆ ప్రేక్షకుడు ఘటికుడు. అయితే ఆ పద్యమేమిటో చెప్పమన్నాడట."
    కీ.శే ఏలూరిపాటి అనంత రామయ్య గారు. ఎన్నో అవధానలు చేశారు. పృశ్చకులుగా, అప్రస్తుతప్రసంగీకునిగా, సంధానకర్తగా ఎన్నో అవధాన్లు సుసంపనం చ్చేసినవారు...
    ఓ సంగతి చెబుతూ ఉండేవాళ్లు
    ఓ మారు పల్నాడు లో భువనవిజయం చేస్తున్నారుట.సభ మంచి రసపట్టు లో ఉండగా - ప్రేక్షకులలోంచి ఒకాయనలేచి -మీరూ మీరూ లాలూచీ బడి సమస్యలిచ్చుకొని పూరించుకుంటున్నారు - నేను ఇస్తాను - పూరించండి - అని చాలా అసంధర్భమైన సమస్య ఇచ్చాడుట (ఆయన సమస్య చెప్పేవారు). పూరించిన వారికి వంద రూపాయలు ఇస్తానన్నాడుట ( అర ఎకరమొ ఎకరమో పొలం వచ్చేదిట ఆ రోజుల్లో)
    సరే అనంత రామయ్య గారు ( తె.రా.కృ.) పూరించారుట, మరో దిగ్గజం కూడా పూరించిన తరువాత, పెద్దన గారి వేషధారి పూరణకి సమాయత్తమౌతుంటే, సమస్య ఇచ్చినతని కొడుకు ( పొలాలు అమ్ముకోవలసి వస్తుందని) ప్రాధేయపడితే - రాయలవారి చేత గండపెండేరం తొడిగించుకున్న వాడివి - వందకు ఆశబడతావా - అని అనంత రామయ్య గారు ఆపినారుట.
    ఇంతకీ అప్పుడు జెప్పిన పూరణ చెప్పండి - అని ఘటికుడైన ప్రేక్షకుడు ఎవడైన అడిగితే -
    "ఊరినే జెబుతామేమిటి? ఆయన ఆ రోజుల్లోనే వంద రూపాయలు ఇచ్చాడు మరి." అని సమాధానం
    -------------------------------------

    సశేషం.

    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  23. భాషకి కాదుకదా ఊహ కి కాదు అందలేదు పృథ్వీభూతమ్మగు అని పూరిస్తారన్న భావన.
    అద్భుతం..

    ReplyDelete
  24. ఎంతైనా అమృతోద్భవ స్ఫూర్తితో ఉన్న పద్యాలకన్నా.. కృష్ణ/ విష్ణు పరంగా అన్వయించి చేసిన పూరణలే అహ్లాదంగా ఉన్నాయి. అనానిమస్ గారిదీ, అవధానిగారిదీ and ofcourse నాది (కాకి పిల్ల కాకి కి ముద్దు కదా...) ఏమనుకోకండి స్మీ.

    అందులోనూ.. చెడును ఎక్కడా ఉటంకించకుండా, ఆ పదాలు వాడకుండా రాసినది అవధానిగారూ, నేనూ మాత్రమే అనుకోండి.. ;)

    స్వోత్కర్ష:

    స్వర్భానుండిను మ్రింగుచుండెనొ యనన్ శస్త్రమ్ము బాధింపగా
    నిర్భీత స్థితి గల్గజేసి శిశువున్నీరీతి రక్షింపగా
    గర్భంబందున శంఖ చక్ర గదశార్ఞ్గాద్యాయుధ శ్రేణి నా
    విర్భూతమ్మగువాని, బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్

    అపాండవీయమగు గాక అని అశ్వథ్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం వేసినప్పుడు గర్భస్థ శిశువుకి సూర్యుణ్ణి రాహువు కబళించేయబోతున్నాడా అన్నంత బాధ కలుగుతూంటే 'సిరికిన్ జెప్పడు' అన్నట్టు ఉన్నపళాన (ఉత్త చేతులతో) వచ్చెయ్యటం కాక అభయమొసగటానికి శంఖ చక్రాదులతో చతుర్భుజుడై గర్భంలోనే పరిక్షిత్తుకి దర్శనం ఇవ్వటానికి ఏతెంచిన విషుమూర్తి రూపాన్ని ప్రీతి మతులై దేవతలు వీక్షించారు అని నా ఊహ....

    కొసమెరుపు ఏమిటంటే నాలుగో చేతిలో కమలాన్ని కాక శార్ఞ్గాన్ని ధరించాడని నా స్వతంత్రత. ఎందుకు అంటే యతి కుదరాలి కాబట్టి అన్నది ఒకటైతే, నిర్భీతి స్థితి కలుగజేయటానికి ఆయుధ శ్రేణిని తెచ్చుకొస్తూ తగుదునమ్మా అని మధ్యలో పువ్వెందుకు ఆ తెచ్చుకునేది ఏ కోదండమో అయితే అవసరానికి పనికొస్తుంది కదా అని భావన .. ;)

    అయితే ఇక్కడ పునరుక్తి దోషం చేయటానికి కారణం సూచనలూ, సరిదిద్దుళ్ళూ దొరుకుతాయేమో అని ఆశ.

    సనత్

    ReplyDelete
  25. అసలు విషయం చెప్పటమే మర్చిపోయా. నా స్వతంత్రతకి స్ఫూర్తి : "వనమాలీ గదీశార్ఞ్గీ శంఖీచక్రీచనందకీ శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు" అని విష్ణుసహస్రనామం లో మకుటాయమానమైన 108 వ శ్లోకంలో వర్ణన.

    సనత్

    ReplyDelete
  26. సనత్ గారు,

    మీ పద్యం బాగా సాగింది. అందులో ఢోకా ఏం లేదు. కాకపోతే నా సమస్యకి పూరణ అని మాత్రం నేనొప్పుకోను, "దాని" "వాని"గా మార్చేసారు కాబట్టి :-) నాకు తోచిన మరో చిన్న విషయం. ఇక్కడ పరీక్షిత్తు కాకుండా ఇంకెవరైనా భక్తుని రక్షణకో దుష్టుని శిక్షణకో ఆవిర్భవించాడని ఊహిస్తే ఇంకా బాగుంటుందేమో. పరీక్షిత్తుని రక్షించడానికి ఇలాంటి రూపం అవసరం లేదు కదా! "గర్భం" పదం ప్రాసగా వాడడానికే పరీక్షిత్తుని లాగినట్టు అనిపిస్తోంది.

    ఊదం గారు,

    మీరు చెప్పిన విశేషాలు బాగున్నాయి. చివర్న "సశేషం" అనడం ఇంకా బాగుంది! :-)

    ReplyDelete
  27. క్రితం ఏడాది ఆగస్టు నెలలో సిలికాన్ వేలీ ( అమెరికాలో) మేడసాని మోహన్ గారి శతావధానం ఒకటి మేమూ నిర్వహించాం. పాతికమంది పృచ్ఛకులు నాలుగు దఫాలుగా ప్రశ్నలడిగారు. అష్టావధానంలో ఉన్న అన్ని అంశాలూ, అప్రస్తుతంతో సహా, ఉంచడానికి అవధాని గారు అంగీకరించారు. సుమారు 7 గంటలసేపు ఎంతో రమణీయంగా సాగింది. పూరణలన్నీ చక్కగా చేసినా సమయాభావం వల్ల ధారణ చెయ్య లేదు. కొన్ని సమస్యలకి అత్యద్భుతమైన పూరణిచ్చారు.

    అందులీ ఇచ్చిన కొన్ని సమస్యలు. వీలయితే మీరూ పూరించండి. అవధానిగారి సమాధానాలు తర్వాత చెబుతాను.

    1) షడ్జమ రాగాలు ఏల షందకు రతిలో

    2) తెలుగు ఘనులకాంగ్ల తెగులు పుట్టె

    3) సాహెబ్బీబీల కొడుకు సంధ్యలువార్చెన్

    సంస్య్చ్చినతసేపు పట్టలేదు పూరణ ఇవ్వడానికి. అతివేగంగా ఆయన చెబుతూంటే పృచ్ఛకులే రాసుకోడానికి నానాయాతనా పడ్డారు.

    -సాయి బ్రహ్మానందం

    ReplyDelete
  28. అరిహరి తమ్ము గూడి ముని యాగము కావ వనమ్ము చేర నం
    బర గతి యాగ భంగరతి బాతకి తాటకి గుబ్బిళింప దా
    శరథి వధించె దైత్య కుల సంభవ శీర్షము ద్రుంచె లోక త
    త్పర మతియై నిశాచర నివార కుశాగ్ర శరాగ్ర ధాటిచే!

    ReplyDelete
  29. (మొదటి) అనానిమసులవారి (మొదటి)పూరణ లో రెండు సమస్యలున్నాయి -ఒకటి భూతమైతే -
    రెండోది - "పూతన కనెన్ దామోదరున్"
    ********
    సనత్ గారు,
    1.మీరు కవి హృదయం అనబోయి కవి సమయం అన్నారు.కవి సమయం - కవులకు మాత్రమే కనిపిస్తుంది - నిజమనిపిస్తుంది
    2. "వీ" కి "వై" తో యతి చెల్లదనుకుంటున్నాను.
    *********
    కామేశ్వర రావు గారు,
    మీ పద్యం లో రెండో పాదం లో యతి కుదిరిందాఅండి, లేక నేను తప్పు చూస్తున్నానా..
    [తప్పు చూడటం నాకు అలవాటే - మీ సమస్య మొదట చూసి, క్షీ తో ప్రాస అనుకొని, సాక్షీ భూతం చేయచ్చనుకున్నాను, ప్రాసాక్షరం "వి" అని తెలిసిన తరువాత మొదలయ్యాయి నా తిప్పలు ]

    సశేషాన్ని స్వాగతించారు, సంతోషమండి.
    ముందు గా బాలరవి గారిని మెచ్చుకోవాలి.
    అవధాని గారి శతపత్ర వర్ణన బావుంది. ఈ భావన వారికి కొత్తగాదు, అవధానికి-పృశ్చకుని మధ్య పోటి అనో - స్పర్ధ అనో అనరాదంటారు - అష్టావధాన్నాల్లో దీన్ని -అష్టదళం చేస్తారేమో.
    ఒక అవధానం గొప్పతనం అవధాని మీద గాక పృశ్చకాళి మీద, సంధాన కర్త మీద ఆధారపడి ఉంటుందేమో. ఈ మాట బెంగలూరు అవధానం అప్పుడు కూడ అన్నానేమో. ఆ సభలో మంచి పద్యాలు వచ్చాయి. అక్కడ గణేశ్ గారు సంస్కృత శ్లోకాలను ఉటంకించటం, దానికి అందుకొని అవధాని గారు - మరో శ్లోకం చెప్పటం. వివేకానందుడి దత్తపది లో, మొదటి ఎత్తుగడలో యతిభగం అవుతోందేమో నని - గనేశ్ గారు వెంటనే హెచ్చరించటం. ఇక్కడ ఆ పని బాలరవి గారు సమర్ధవంతం గా చేసినారని మీ మాటలను బట్టి తెలుస్తోంది. పృశ్చకాళి మీద, సంధాన కర్తా మీద ఆధారపడి ఉంటుందేమో అని ఎందుకన్నానంటే, ఈ అవధాని గారే -ఓ అవధానం లో-చంపకమాల పాద ఉత్తరార్ధం లో - "అట్టును ఇట్టును తొంగిచూచుచున్" అని వేయటం విన్నాను ( చూచుచున్ కాకంటే - మరో U-I-U)

    సంధానకర్త గా ఉన్నపుడు బేతవోలు వారు - "మనం కూర్చొని వ్రాస్తే మటుకు ఇట్టాంటి పద్యాలు వస్తాయిటండీ" - అనేవారు. వారికి ఉజ్జీ ఏలూరిపాటి వారు. వీరికి కాస్త వాక్కాఠిన్యం.
    అవధాని గారు 'పూగీకర్పుర" అని వేస్తే "కర్పుర" లేదు. కప్పుర,కర్పూర సరైన వాడుకలు అంతే అని ఆక్షేపించారు.
    బేతవోలు వారు సర్ది చెప్పబోతే - అంతేలెండి- "మంచం సరిపోకపోతే కాళ్లు ముడుచుకోమూ" అని వత్తాసు.
    దాంతో అవధానిగారు పూగీమంగళ అని మార్చారు.

    ఈ సభ లొ ఇచ్చిన సమస్యలు దత్తపదులు - సాధారణం గా వినిపించే వాటి కంటే కష్టంగా ఉన్నాయి. ఒక "ట్మ" ప్రాస, రెండు గోపనాలు, ....
    ఇలా ఇస్తే ఇక పాతపద్యాలు పిట్టకధలు వింటామనటం లో సందేహమేముంది. :)

    పర్యావరణం మీద అడినప్పుడు, సాగరఘోష తప్పనిసరిగా ఉటంకించి ఉండాలి.
    గోవిందుడు అన్నసమస్య ఇచ్చినప్పుడున్నూ...

    అవధాని గారు ఏ సమస్యనైనా మూడోపాదం లో పెట్టి పూరించారా అండీ?

    వృద్ధాశ్రమాల ఆశువు బావుంది, మరీ ముఖ్యం గా చివరి పాదం. సభలో పుట్టి సన్మానం లో పోయే ప్రమాదాన్ని తప్పించారు ఆ పద్యానికి, మరికొన్ని పద్యాలకున్నూ. మీకు నెనరులు మరియు అభినందనలు.

    "ఒక సమస్య పూర్తి అయ్యీఅవ్వక ముందే పూరణ మొదటిపాదం అందుకోవడమంటే మరి మామూలువాళ్ళకి సాధ్యమా?!"

    మామూలు వాళ్లకి సాధ్యం కాదు గానీయండి, అవధానులకి సాధ్యమే, ఐతే కొంతమంది - పాదం ఎత్తుకుంటారు, కొంతమందేమో ఆలాపన ఎత్తుకుంటారు.

    వేగం ధారణ కి సరిపెట్టారు, సంతోషం.
    ఒక అవధానం లో స్తుతప్రసంగీకులు, ఈ పూరణకి ముప్పై సెకన్లు తీసుకున్నారు, ఈ ఐదు పూరణలకి కలిపి నాలుగు నిముషాలలోపు తీసుకున్నారు అని మొదలెట్టారు. పనిలో పని అవధానిగారు ఓ సమస్య పూరిస్తూ కందపద్యానికి తోడు ఓ మూడు గణాలు ఉచితంగా ఇచ్చారు, పృశ్చకమహాశయిలు నాకు మూడు గణాల ముక్కెందుకు ఇచ్చేదేదో ఎనిమిది గణాలపాదమే ఇవ్వండి అన్నారు. "సమయ"స్పూర్తి గల సంచాలకులు ఆ వెసులుబాటు అవధాని గారికి ఇచ్చాం అని వీటో చేసారు.

    ఇదంతా సరేగానీయండి, మీ బ్లాగు చూసి చూసి మొహం మొత్తింది, మీతమ్ముడి గారి బ్లాగు ఎక్కడ, వారి పద్యాలెక్కడ? :)

    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  30. కామేశ్వరరావు గారు,
    "తోయాకాశ వాయ్వగ్ని పృథ్వీ"
    దీన్ని కాస్త విపులీకరించరూ, వ్యాకరణపరంగా.

    సనత్ గారు,మీ పద్యం మొదటిపాదం వివరించరూ.
    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  31. భవశీర్షము ద్రుంచె లోకతత్పరమతియై అనే సమస్యకు అనానిమసుగారు పూరించారు కదా! ఇక అవధానిగారి పూరణ ఇవ్వండి.

    ReplyDelete
  32. గరికపాటి 75 పద్యాలను అలవోకగా ధారణ చేశారని భైరవభట్ల కామేశ్వర రావు గారు రాశారు.

    సముద్రాన్ని దాటిన వాడికి పిల్ల కాలువ ఒక లెక్కా అన్నట్టు సహస్రావధాన సమయంలో 750 పద్యాలను అలవోకగా ధారణ పట్టగలిగిన వ్యక్తి కి 75 ఒక లెక్కా??

    కాకినాడ సాగరతీరం లో సహస్రావధానం చేశారు గరికపాటి. అందులో అద్భుతమైన వర్ణనలూ, దత్తపదులూ, సమస్యలూ, ఆశువులూ.... ముత్యాలు మచ్చుక్కి కొన్ని (ఔత్సాహికులకి ప్రోత్సాహం గా ఉంటుందని సమస్యలకి పూరణలు ఇవ్వట్లేదు)

    క్లిష్టమైనవి
    (1)జానేదో సినిమాకు లాలు బహు పూజ్యంబౌ మునీశాళికిన్
    (2)కలరా రోగములున్న రాఘవుడు లంకంజేరె శతృఘ్నుతో
    (3)మానము లేని స్త్రీని గని మాతగ మ్రొక్కిరి పండితోత్తముల్
    (4)మన భార్య ఈమె, మనకమ్మయొ, అక్కయొ గావలెన్ జుమీ
    (5)బూతుకు బూతు బూతునకు బూతుకు బూతుకు బూతు బూతుకున్
    (6)సీతా! రామునికిట్లొనర్తువటవే సీ! ద్రోహమిల్లాలివై


    సరసమైనవి
    (7)పతి జూచిన పడతి గుండె భగ్గున మండెన్
    (8)దున్నని గని కన్ను గీటె తొయ్యలి యహహా

    దుష్కర ప్రాస
    (9) రాష్ట్రమునేలగా నొక విరాధుడు రావలె రక్తపాయియై

    ఇంకెందుకాలస్యం...? కానిచ్చెయ్యండి

    ReplyDelete
  33. @బ్రహ్మానందం గారూ,
    మేడసానివారి శతావధాన విశేషాలు, అతని పూరణలు మరికొంత వివరంగా వ్రాయండి. అష్టావధానంలో అంశాలన్నీ అంటే, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి వంటివి కూడానా? సమస్యలలో రెండవది పూరణకి పెద్ద సమస్య కాదు, నివారణకి తప్ప :-) మూడవ సమస్య పాదాన్ని రెండవ పాదంగా, "సాహెబ్బీబీల కొడుకు", "సంధ్యలు వార్చెన్" అని విడగొడితే సమస్య విడిపోతుంది. మొదటిది కొంచెం కష్టంగా ఉంది. కొంచెం ఆలోచించి పూరణ ప్రయత్నం చేస్తాను.

    @అనానిమస్ గారూ,
    ఇంత మంచి పద్యాన్ని వ్రాసి అనామకులుగా ఉండిపోవడం ఏమీ బాగోలేదు. మీరు తెలుసుననే అనుకుంటున్నాను కాని, దయచేసి మీ పేరు చెప్పండి. కంద పాదంలో ఇచ్చిన సమస్యని చంపకమాలలో పూర్తిచెయ్యడం ఒకెత్తైతే, రామబాణంలా దూసుకుపోయేట్టుగా ఆ పద్యముండడం మరో ఎత్తు. "అరిహరి" పదాన్ని అర్థం చేసుకోడానికి కొద్దిపాటి సమయంపట్టింది! ఎంత చక్కని ఎత్తుగడో అంత చక్కగానూ ముగించారు, "నిశాచర నివార కుశాగ్ర శరాగ్ర ధాటిచే!". బాగుంది. "గుబ్బటిల్ల" పదం విన్నాను కాని, "గుబ్బిళింప" పదం వినలేదు. ఇదెక్కడిదో చెప్తారా?

    @ఊదంగారూ,
    మొదటి అనానిమసులవారి పూరణలో మీరన్న సమస్యలేమిటో నాకు బోధపడలేదు.

    నా పూరణలో యతిమైత్రి గురించి. ఇంతవరకూ ఎవరూ అడగలేదేమా అని అనుకున్నాను :-) మొదటిపాదం చివర "మున్" పదంలోని"న"కారప్పొల్లుకి, రెండవపాదం యతి స్థానం ముందున్న "వెసన్"లోని "న"కారప్పొల్లుకి హల్ మైత్రి. అచ్చు మైత్రి ఎలాగో సరిపోయింది కదా ("ఉ"కి "ఓ"కి). యతి ప్రాసల విషయంలో ఆ అక్షరం ముందున్న పొల్లుని (ఒకవేళ ఉంటే), యతి/ప్రాస అక్షరంలో భాగంగా పరిగణిస్తారు.

    సంధాన కర్త, పృచ్ఛకులు (పృశ్చకులు కాదు) అవధానాన్ని రక్తికట్టించడంలో పెద్ద పాత్రే నిర్వహిస్తారు. అయితే స్వతహాగా అవధానిగారిలో సత్తా ఉండాలి. ఈ అవధానంలో మరో విశేషం చెప్పడం మరచాను. గరికిపాటివారు మధ్యలో ఎప్పుడైనా ప్రకృతి పిలుపుకి విరామం తీసుకున్నప్పుడు, రవికుమార్ గారు మంచి మంచి పద్యాలు చదివి వినిపించారు. సాగరఘోషలో కొన్ని పద్యాలు, రామాయణ కల్పవృక్షంలో శివధనుర్భంగ ఘట్టంలోని పద్యాలు, కల్పవృక్షంలోనిదే సీతాపహరణ మప్పుడు గోదావరి నది స్పందనని వర్ణించే ఒక వచనం, వినిపించి వివరించి ఆ విరామాలనికూడా సుసంపన్నం చేసారు. అతనికి కల్పవృక్షం చాలాభాగాలు కంఠస్థమంట!

    రెండవ పాదంలో పెట్టి పూరించిన సమస్య "గోవిందుడు క్రైస్తవులకు కులదైవంబౌ". ఎందుకో మీరు ఊహించవచ్చు.

    మీరు చెప్పిన "కర్పుర" నేనుకూడా విన్నట్టే ఉంది. మీరు చెపుతున్న ఈ అవధానం టీవీలో కాని వచ్చిందా?

    "తోయాకాశ వాయ్వగ్ని పృథ్వీభూతమ్ము" - ఒకటే సమాసం.
    తోయ+ఆకాశ = తోయాకాశ (నీరు, ఆకాశము)
    వాయు + అగ్ని = వాయ్వగ్ని - యణాదేశసంధి

    మా తమ్ముడు బ్లాగు గురించి మీరడగ్గానే, రెండురెళ్ళారు సినిమాలో నూతన్ ప్రసాద్ డైలాగు గుర్తుకువచ్చింది :-) బ్లాగేమిటో చెప్పను కాని, అది మీరు ఇప్పటికే చూసిన, లేకపోతే చూసే అవకాశం ఉందని మాత్రం చెప్పగలను. ప్రస్తుతానికిలా సస్పెన్సు ఉంచనియ్యండి :-)

    @మురళీమోహన్ గారు,
    అవధానిగారు కందపద్యంగానే పూరించారు. త్వరలో ఆ పూరణ ఇస్తాను.

    @సనత్ గారు,
    బాగున్నాయండి సమస్యలు. ఈ సమస్యలన్నీ కలిపి ఒకచోట పద్యం.నేట్లో డేటాబేసుగా పెడితే బాగుంతుందేమో, పూరణలతో పాటు. ఈ శతావధానం పద్యాలన్నీ కూడా అక్కడ పెట్టే అవకాశం ఉందేమో ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  34. అజ్ఞాతంగా ఉండి పోస్ట్ చేసినందుకు మన్నించండి. రెండు పూరణలూ నావే. "గుబ్బిళింప" నేనెక్కడా చూడలేదు. గుప్పించి ఎగిసేలా ధ్వనిస్తోందని వాడాను (మాయాబజార్ లో తసమదీయులు లాగ). దుష్ట ప్రయోగం చేసినందుకు మన్నించండి. "గుబ్బటిల్ల" సరైన అర్థానిస్తే దాన్నే వాడతాను. లేదా 'వేగ జేర' అని వ్రాసుకోండి.పోతనామాత్యుల వారి భాగవతం చదువుతోన్న పుణ్యం కాస్త మంచి పద్యాలు వస్తున్నయి. దయచేసి తప్పులు చూపించండి. ఊకదంపుడు గారి సమస్యలు అసలైన సమస్యలు కావు, పూరింపదగిన సమస్యలని వారి భావమనుకొంటాను. ఇంకొక పూరణ సమర్పిస్తున్నాను.

    పోరుం డస్సి అయోధ్య జేరి నిదురన్ పోవంగ సౌమిత్రి తా
    సారస్యంబగు స్వప్నమందున కనెన్ ఆ రామ సీతమ్మలన్
    గారాబంబొక పుత్రునంత చెదరంగా స్వప్న "మేమాయె! తా
    మేరీ (తాము + ఏరీ) మాత, సుతుండు, రాముడ?" నియెన్ మేకొంచు సౌమిత్రియే

    ReplyDelete
  35. @ఫణి ప్రసన్న కుమార్ గారు
    లక్ష్మణుడి పూరణ అదిరింది.రెండో పాదం లో యతి చూడండి.
    అరిహరి? నాకర్ధం కాలేదండి. అరి కి తాటకి కి అన్వయమా
    కామేశ్వరరావు గారు,
    ఒకటి మీరిచిన్న సమస్య ఐతే, రెండవది ఫణి గారు ఇరికించి పూరించారు మొదటి పాదం లో: "పూతన కనెన్ దామోదరున్" అని - కనెన్ పన్ చేసాననుకున్నాను, పన్ డలేదని మీరు చెప్పిన తర్వాత అర్ధం అయ్యింది.
    పూరణ కోసం సమస్యలు ఇచ్చి ఇచ్చి అలవాటై మీరు అలవోక గా వ్యాఖ్యలలో గూడా సమస్యలు సృష్టిస్తున్నారు. నేనిప్పుడు 2x2=6 చూడవలిసిన అవసరమేర్పడింది.
    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  36. పృశ్చకుడు - హతవిధీ - ఎదురుగా ఉండి అని ఉంటే కొట్టేవారేమో కదా - మన్నించండి - తప్పు టైపుతున్న ఆలోచనకూడా రాలేదు
    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  37. ఫణిగారూ,

    "మేరీమాత సుతుండు.." సమస్యాపూరణ కూడా బాగుంది. అవధానిగారు కూడా ఇంచుమించుగా ఇలాగే విరిచారు. "తామేరీ? మాత, సుతుండు రాముడు, అనియెన్" అన్నది వారు చేసిన విరుపు. అంటే ఇక్కడ సుతుడు రాముడే, మాత కౌశల్య. మీ పూరణ రెండవపాదంలో యతి సరిపోలేదు. "సా"కి, "ఆ"కి అచ్చు మైత్రి కుదిరినా, "సా" అన్నది హల్లు కాబట్టి, హల్మైత్రి కుదరదు.

    ఊదంగారూ,

    "పృచ్ఛకుడు" గురించి మరీ కొట్టినట్టు చెప్పానా? :-)
    అన్నట్టు సినిమా రెండురెళ్ళారు కాదు, శ్రీవారికి ప్రేమలేఖ. వీరభద్రరావు పెద్ద కొడుకు. అతని భార్య శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మిని కథ చెప్పమని ఒక రిక్షావాడు అడుగుతాడు... గుర్తుకువచ్చిందా :-)

    ReplyDelete
  38. ఊకదంపుడు గారికి, కామేశ్వర రావు గారికి ధన్యవాదములు. రెండవపాదం సవరిస్తాను. ఇంకో పూరణ ప్రయత్నించాను. ఊదంగారూ,అరి(శత్రువులకు) హరి(సింహము వంటివాడు)

    జతగను చావబోవ విధి! చావడు బాలుడు ప్రేమజంటలో
    జితమతు లక్కదమ్ములను చేరిరి పెద్దలు న్యాయవాదులన్
    సుత కథ న్యాయముంటగని సోదరుడిట్లనె "వాదులాడగన్
    బ్రతికిన పుత్రునిచ్చెద భవన్మృత పుత్రికనిమ్ము సోదరీ!"

    ReplyDelete
  39. సిగలో పువ్వులు వాలు చూపులు వగల్ సింగంపు లే మధ్యముల్
    నగవుల్ బల్ కుచశైలముల్ సొబగులౌ నారీమణుల్ యుల్లముల్
    తెగ చీల్చన్ మదనా! మదించితివొ? సీ! తీతూండ్ల మోహమ్ము క
    మ్మగ నిన్ కొట్టిన కాంతయే యగును సమ్మానార్హ లోకమ్మునన్

    ReplyDelete
  40. సంక్రాంతి కదా, చక్కెర వింటి తియ్యదనము విరిశరమ్ముల కబ్బిన వందునా? కాదు.
    మదనునివి పూలమ్ములు. మగువలవి రసాలమ్ములు. తియ్యగా గుచ్చుకొంటాయి.

    ReplyDelete
  41. ఫణిగారు,

    సిగలో పువ్వులు పద్యం బాగుంది. అవధానిగారు కూడా ఇలాగే విరిచారు.
    "మధ్యముల్" కాకుండా "మధ్యమల్" అనాలనుకుంటా. "మధ్యములు" అంటే పురుషవాచకం అవుతుంది.

    ReplyDelete
  42. సిగలో పువ్వులు, వగలు, లే నడుములు, నగవులు ఇలా నారీమణుల విశేషణాలను వివరిస్తున్నాను కనుక మధ్యముల్(నడుములు) సరైందే అని నా భావము.

    ReplyDelete
  43. అయ్య బాబోయ్. నేను అవధానం వినలేదూ, చూడలేదండోయ్. యాధృచ్చికంగా అవధాని గారి విరుపులు వచ్చాయంతే. నా తప్పేంలేదు. :))

    ReplyDelete
  44. ఫణి ప్రసన్న కుమార్ గారు, కామేశ్వర రావు గారు,
    నే మధ్యమాల్ అనలేమో అనుకున్నాను కాని బ్రౌణ్యం మధ్యము అంటే నడుము అని చెబుతోంది. కాబట్టి మధ్యముల్ అన్న ఒప్పే అనిపిస్తోంది.

    కామేశ్వర రావు గారు,
    లేదండీ, మీరు మామూలుగానే చెప్పారు.
    అవునండీ , ఆ అవధానం టి.వి లో వచ్చింది.
    " బ్రాకెట్, లాకెట్, రాకెట్, క్రికెట్"- ఈ దత్తపదికి పృచ్ఛకులు ఏదైనా వృత్తం అడిగారా, అవధానిగారికి స్వేచ్ఛనిచ్చారా

    ఈ పూరణ లో తప్పొప్పులు చెప్పండి:

    ఈ"ట్మం" ప్రాస నిడంగ బ్రోచుటకనన్ ఈఆంధ్రసీమందునన్;

    రాట్మంత్రిద్వయమందు పుణ్యపురుషుల్, రాతింజెయన్-భావజా

    రాట్మైహర్తసుపుత్రుసుందరకళన్; రాజారినౌరా! గనన్-

    ఖాట్మండూ పుర విఘ్ననాయకుని శృంగారమ్ము విన్నానమౌ

    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  45. అత్త, మామ, అమ్మ, నాన్న లు(వేరే అర్థాలతో) ఉపయోగించి శివధనుర్భంగమును వర్ణించమన్న దత్తపదికి నా పూరణ

    హరచాప మవలీల హరి లీల నెత్తంగ
    అత్తరి రాజుల అహము డిగ్గె
    నరపతి మదనారి నారిని బంధింప
    నారి కోర్కెలు స్వేచ్చ నాడ దొడగె
    నిరుపమామహితమౌ హరువిల్లు ఫెళ్ళన
    మిథిలను సన్నాయి మేళ మలరె
    అమ్మహా స్ఫోటన మరుణ ధూమము నింప
    ఇల్లు నిల్లున రంగ వల్లులమరె

    తెంపనాన్నగేశునివిలు తెగ తెంపు
    దుర్జనుం డెవడను రాము ఘర్జనములు
    పెండ్లి కొడుకువు కమ్మని ప్రేమ మీర
    పలుకు పల్కులుగా రఘుపతియు మెరసె

    ReplyDelete
  46. "ఈ"ట్మం" ప్రాస నిడంగ బ్రోచుటకనన్ ఈఆంధ్రసీమందునన్;

    రాట్మంత్రిద్వయమందు పుణ్యపురుషుల్, రాతింజెయన్-భావజా

    రాట్మైహర్తసుపుత్రుసుందరకళన్; రాజారినౌరా! గనన్-

    ఖాట్మండూ పుర విఘ్ననాయకుని శృంగారమ్ము విన్నానమౌ"

    మూడో పాదం చివరిలో "భావజా" బదులు "ఆ రతీ".... అంటే బావుండేదేమో...
    ఎంత ప్రాసకోసమైనా , వినాయకుడు అనటానికి మన్మధుడిని కాల్చి బూడిద చేసినవాడికొడుకు అన్నాడంటే ఎంత ఉపాలంభమో కదా...:)
    ఇహ ఇప్పుడు "రాజారి" గురించి చెప్పేదేముంది లెండి.
    భవదీయుడు
    ఊకదంపుడు

    ReplyDelete
  47. బ్రాకె టక్కరి యిండ్ల నుట్లను పట్ట రండని గోపికల్
    వాకిలాకెటు లూగినా హరి వచ్చెనంచును జూచుచున్
    రాకెటుండును చక్రి కెట్టుల రామ కట్టుట పగ్గముల్
    మాకు జెప్పను చక్కనమ్మల మాయమౌ కను గప్పుచున్
    శ్రీ కరమ్మగు నీదు క్రీడల సేతు మోడ్పుల శ్రీ హరీ!

    ReplyDelete
  48. శతావధానంలోని పాతిక సమస్యలు పూరణలు పద్యం.నెట్ (http://padyam.net) లో చదువుకోవచ్చు.

    ReplyDelete
  49. రాకేశ్వరుడి రాణ్మహేంద్రవరం తో నా పద్యం లోని వ్యాకరణ దోషాలు తెలిశాయండీ, ధన్యవాదములు.

    ReplyDelete
  50. ఇటీవల 2017 విజయవాడలో గరికి పాటి నరసింహా రావు గారి శతా వధా నము చేశారు. అందులో గల పూరణలు ఇవ్వాలని ప్రార్థన. ఇట్లు
    సాహితీ వందనములు.
    పంచరత్నం వెంకట నారాయణ రావు

    ReplyDelete