అననగనగా ఒక రాజు. ఆ రాజుగారు ఉదయాన్నే వాహ్యాళికి వెళ్ళేప్పుడు అతనికెవరూ ఎదురురాకూడదని శాసనం చేసారు, ఎవరెదురొస్తే ఏం అశుభం జరుగుతుందో అని. ఇది తెలియని ఒక పరాయి దేశపు పండితుడు ఒకాయన యీ రాజ్యం వచ్చి, ఓ రోజు పొద్దునే రాజుగారికి ఎదురయ్యాడు. అంతే! రాజుగారు ఆగ్రహించి "ఈ రోజు పొద్దునే నువ్వు నాకు ఎదురయ్యావు. నాకూ, ఈ రాజ్యానికి ఏమరిష్టం రాబోతోందో! నీకు మరణ శిక్ష విధిస్తున్నాను" అన్నాట్ట. అది విన్న పండితుడు నవ్వాడట. మరణ శిక్ష విధిస్తే వీడు నవ్వుతాడేమని రాజుకి ఆశ్చర్యం వేసింది. "నీకేమైనా పిచ్చా, మరణ శిక్ష వేస్తే ఎందుకలా నవ్వుతున్నావ్?" అని అడిగాడట. దానికా పండితుడు, "మహారాజా! నేనెదురైతే మీకేం అశుభం కలుగుతుందో నాకు తెలీదు కాని, ఈ రోజు పొద్దున్నే నేను మిమ్మల్ని చూసాను. దాని ఫలితంగా నాకు ఏకంగా మరణమే ప్రాప్తిస్తోంది! ఇంతకన్నా అశుభం ఏముంటుంది. అలాంటిది నావల్ల అశుభమేదో అవుతుందని మీరు భయపడ్డం చూస్తే నాకు నవ్వొచ్చింది" అన్నాట్ట. దానితో రాజుగారు పెద్ద ఆలోచనలో పడిపోయారు. అప్పుడతనకి తన మూర్ఖత్వం తెలిసొచ్చింది. వెంటనే ఆ పండితుణ్ణి సగౌరవంగా ఆస్థానానికి పిలిపించి మంచి సత్కారం చేసారు.
ఈ కథని చాలామంది వినే ఉంటారు. వేరు వేరు విధాలుగా విని ఉంటారు, వేర్వేరు రాజుల పేర్లతో, పండితుల పేర్లతో. తెలుగు సాహిత్యంలో చాటు పద్యాల్లాగ ఇలాంటి చాటు కథలు కూడా చాలా ఉన్నాయి. నేనీ మధ్య దీన్ని విన్నది కందుకూరి రుద్రకవి విషయంలో. ఆ పండితుడు కందుకూరి రుద్రకవి అని, ఆ రాజు శ్రీకృష్ణదేవరాయలని. చారిత్రకమైన ఆధారాలు స్పష్టంగా లేకపోయినా, ఇలాటి కథలలో ఎంతో కొంత నిజం ఉండకుండా ఉండదు. అది రుద్రకవి కాక మరొక పందితుడు కావచ్చు. ఆ రాజు రాయలు కాక వేరే ఎవరైనా కావచ్చు. అయినా ఆ పండితుని ధైర్యానికీ, సమయస్ఫూర్తికీ, తన తప్పుని గ్రహించి ఆ పండితుని సత్కరించిన ఆ రాజు ఇంగితానికీ అబ్బురపడకుండా ఉండలేం!
కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులుండేవారన్న కథ ప్రసిద్ధమే. అది కూడా చాటు కథే కాని దానికి చారిత్రకమైన ఆధారాలు సరైనవేమీ లేవు. ఈ కందుకూరి రుద్రకవి కూడా అష్ట దిగ్గజాలలో ఒకడనీ, అతను ఈశాన్యపు దిక్కునున్న పీఠాన్ని అధిష్టించాడనీ ఒక కథ. ఈ రుద్రకవి గురించి చాలా చాటు పద్యాలూ, వాటికితోడుగా కథలూ ప్రచారంలో ఉన్నాయి. ఇతనికి తాతాచార్యులతోనూ అలాగే భద్రకవితోనూ (ఇతను రాయల కొలువులో మరొక కవి అయ్యలరాజు రామభద్ర కవే అని కొందరంటారు) వాదోపవాదాలు జరిగాయని పద్యాలున్నాయి. సభకి వచ్చినప్పుడు ఇతనికి కూర్చోడానికి ఆసనమివ్వకుండా అవమానించినప్పుడు యీ పద్యం చెప్పాడట రుద్రకవి:
పండితులైనవారు దిగువం దగనుండగ నల్పుడొక్కడు
ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబులకేమి యెగ్గగున్
గొండొక కోతి చెట్టుకొన కొమ్మకు నెక్కిన గ్రింద గండ భే
రుండ మదేభ సింహములు రూఢిగ నంతట నిండియుండవే!
చాటువుల్లో తిట్టుకవిత్వం కూడా చమత్కారమైన పోలికలతో చతురంగా ఉంటుందన్నదానికి ఇదొక ఉదాహరణ. కవి రాజుగారి కొలువులో ఇంత నిబ్బరంగా మాట్లాడగలిగాడంటే ఆశ్చర్యం కలుగుతుంది! ఇలా పద్యం చెప్పేసరికి తాతాచార్యులవారు "ముందైతే నీ పండిత్యమూ కవిత్వ పటుత్వమూ నిరూపించుకో" అని కొన్ని దుష్కర ప్రాసలతో సమస్యలిచ్చి పూరించమన్నారట. వాటినన్నిటినీ రుద్రకవి ఆశువుగా అవలీలగా పూరించాడట. అందులో ఒక సమస్యాపూరణ:
సమస్య: దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములురేగె నదేమి చిత్రమో!
పాల సముద్రం మధ్యలో దుమ్ములు రేగాయని అర్థం. ఇక్కడ "గ్ధ" ప్రాస కష్టమైనది.
దీని పూరణ:
స్నిగ్ధపువర్ణు డీశ్వరుడు చిచ్చఱ కంటను బంచబాణునిన్
దగ్ధము చేసెనంచు విని తామరసేక్షణు మ్రోలనున్న యా
ముగ్ధపు లచ్చి మోదుకొన మోహన గంధము పిండి పిండియై
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములురేగె నదేమి చిత్రమో!
శివుడు మన్మథుణ్ణి భస్మంచేసాడన్న వార్త విన్న లక్ష్మీ దేవి పుత్రశోకంతో గుండెలు బాదుకుంటే, ఆమె శరీరమ్మీద ఉన్న గంధము పిండిపిండైపోయి, ఆ ధూళి పాలసముద్రం మధ్య దుమ్ములా రేగిందని తాత్పర్యం. ఇలా తన పాండిత్యాన్నీ, కవిత్వ శక్తినీ నిరూపించుకొని రాయల అష్టదిగ్గజాలలో ఒకడయ్యాడని కథ.
అయితే యీ రుద్రకవి ఆశ్రయించినది శ్రీకృషదేవరాయలని కాదనీ మరొక చిన్న రాజుననీ మరికొందరంటారు.
మల్కిభరాముని (ఇబ్రహీం కులీ కుతుభ్షా) ఆశ్రయించిన రుద్రకవి ఒకడున్నాడు. ఇతడూ అతడూ ఒకరో కాదో స్పష్టంగా తెలీదు. ఈ రుద్రకవి పేరు మీద చాలానే గ్రంధాలున్నాయి. నిరంకుశోపాఖ్యానము, సరసజన మనోరంజనము అనే కావ్యాలు, సుగ్రీవవిజయము అనే యక్షగానం (ఇదే మనకి లభిస్తున్న యక్షగానాలలో అతి ప్రాచీనమైనది) మొదలైనవి.
అన్నిటికన్నా ప్రసిద్ధి పొందిన రచన జనార్దనాష్టకము. "కందుకూరి జనార్దనా" అనే మకుటంతో ఉన్న ఎనిమిది పద్యాలు. అందమైన మధురమైన శృంగార రసవంతమైన పద్యాలివి. ఇవన్నీ మాత్రా ఛందస్సులో సొగసైన నడకతో సాగే పద్యాలు. యతి ప్రాసలు వీటికి అదనపు నిగనిగలు. మత్తకోకిల నడకలా సాగే ఈ పద్యాలు పాడుకోడానికి కూడా బావుంటాయి. ఈ జనార్దనాష్టకంలోని పద్యాలకు రాగం కట్టి పూర్వం దేవదాసీలు నృత్యం చేసేవారట. ఇవి కొన్నాళ్ళ క్రితం అందమైన బాపూ బొమ్మలతో ఒక పత్రికలో ప్రచురింపబడ్డాయి. తర్వాత పుస్తకంగా కూడా వచ్చినట్టుంది.
జనార్దనాష్టకంలోని ఒక పద్యం:
సిరులు మించిన పసిమిబంగరు జిలుగుదుప్పటి జాఱఁగాఁ
జరణపద్మముమీఁద, దేహము చంద్రకాంతులు దేరఁగా
మురువుచూపఁగ వచ్చినావో మోహనాకృతి మీఱఁగా
గరుడవాహన! దనుజమర్దన! కందుకూరి జనార్దనా!
మిగతా పద్యాలు పద్యం.నెట్లో చదువుకొని ఆస్వాదించండి.
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Monday, May 11, 2009
కందుకూరి జనార్దనా!
Subscribe to:
Post Comments (Atom)
చాలా బాగుందండి. ఇలాంటివి చదువుతుంటేనే ఎంతో హాయిగా ఉంటుంది.
ReplyDeleteరుద్రకవి జగన్నాథాష్టకం బాపు రంగు బొమ్మలతో పుస్తకంగా వచ్చింది. అందులో బాపు బొమ్మల కన్నా ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ముళ్ళపూడి వెంకటరమణ, ఆరుద్ర ఇత్యాదులు రాసిన వివరమైన వ్యాసాలు చాలా హృద్యంగా ఉన్నాయి.
ReplyDeleteఅదలా ఉండగా, కొన్ని భరతనాట్య సంప్రదాయాల్లో ఈ పద్యాలు రాగయుక్తంగా (ఒక పదంలాగా) పాడి, అభినయం చెయ్యడం ఉంది.
పూరణ బావుందండీ, క్షీరసాగరమధనానికి ముడిపడి ఉంటుందేమో అనుకున్నాను.
ReplyDeleteభవదీయుడు
"పండితులైన వారు..." పద్యం భాస్కర శతకంలో ఉన్నట్లు గుర్తు. ఆ శతకం నాదగ్గర ఇప్పుడు లేదు కాని పదాలన్నీ అవే, చివరన "... చేరి భాస్కరా" అని అంతమౌతుంది.
ReplyDeleteఅవును ఇది ముమ్మాటికీ నిజం. నా చిన్నప్పుడు కంఠస్థం చేసిన పద్యం ఇది
Deleteభాస్కర శతకంలోని ఆ పద్యం ఇక్కడ కనిపించింది "http://www.telugudanam.co.in/saahityam/Satakaalu/bhAskara_SatakaM.htm"
ReplyDeleteచంద్రమోహను గారూ ,మీ జ్ఞాపకశక్తి అమోఘమండి, భాస్కరశతకంలోని పద్యంలోని చివర లైను,
ReplyDeleteరుండ మదేభ సింహనికుడంబము లుండవె చేరి భాస్కరా!
దుష్కర ప్రాస పద్యం అద్భుతంగా ఉంది. "చిచ్చఱ కన్ను" అచ్చ తెనుగు పదం లా ఉంది. అంటే ఏమిటండి? "చిచ్చఱ పిడుగు" లాంటిదేనా ఈ ప్రయోగం?
ReplyDelete@కొత్తపాళీగారు, ఈ పుస్తకం గురించి వినడమే కాని చదివే అవకాశం కలగలేదు. గత సంవత్సరం విశాఖపట్నంలో విశాలాంధ్రకి రెండు మూడుసార్లు వెళ్ళాను కాని యీ పుస్తకం కనబళ్ళేదు. మా ఊళ్ళో పుస్తక ప్రదర్శనల్లోనూ చూడలేదు. ఇప్పుడిది ఔటాఫ్ ప్రింటేమో.
ReplyDelete@చంద్రమోహన్ గారు, మీకు బోలెడన్ని నెనరులు! ఈ పద్యం చదివినప్పణ్ణుంచీ ఎక్కడో చదివినట్టుంది ఎక్కడో చదివినట్టుందని తెగ ఆలోచిస్తున్నాను. మీరు చెప్పేక అవునిది భాస్కర శతకంలోని పద్యం కదా అని గుర్తుకువచ్చింది. నేనిచ్చిన పద్యం నిరంకుశోపాఖ్యానం పీఠికలో ఉంది. ఇలా ఒకే పద్యం రెండు మూడు చోట్ల కనిపించడం చాటు సంప్రదాయంలో భాగమే!
భాస్కర శతకంలో పద్యం:
పండితులైనవారు దిగువం దగనుండగ నల్పుడొక్కడు
ద్దండత బీఠమెక్కిన బుధప్రకరంబులకేమి యెగ్గగున్
గొండొక కోతి చెట్టుకొన కొమ్మల నుండగ గ్రింద గండభే
రుండ మదేభ సింహనికురుంబము లుండవె చేరి భాస్కరా!
@రవిగారు, చిచ్చఱ (చిచ్చు+అఱ) అంటే నిప్పులు చెఱిగే అని అర్థం. చిచ్చఱ పిడుగంటే అగ్గిపిడుగన్నమాట :-)
చిచ్చు + అఱ = చిచ్చఱ - బావుందండీ. మొన్న ఇక్కడ మా బెంగళూరులో ఓ ప్రముఖులతో మాట్లాడుతున్నప్పుడు, మాటలసందర్భంలో ఓ విషయం వచ్చింది. "తెలుగు వ్యాకరణం మీద పుస్తకాలు దాదాపు మృగ్యమైపోయాయి" అని. అంతర్జాలంలో మీ వంటి వారు పూనుకుంటే ఈ పరిస్థితి కాస్త చక్కబడుతుందని నాకనిపిస్తుంది.
ReplyDeleteమిమ్మల్ని రెచ్చగొట్టటానికి, పిచ్చి ప్రశ్నలడగి మీకు సహాయసహకారాలు ఇవ్వటానికి నేను ఎల్లవేళలా రెడీయే.
ఇహపోతే మళ్ళీ ఆ ముష్కరప్రాస పద్యానికి వస్తున్నాను.
కొన్ని రోజుల క్రితం సంస్కృత పదాలనే బోయీలతో (ఓ) తెలుగుపదమనే రాకుమారిని మోసిన వైనం చెప్పారు రాఘవ గారు. ఇప్పుడు ఈ పద్యం...
ఒకవైపు, స్నిగ్ధపువర్ణు డీశ్వరుడు , పంచబాణుడు, తామరసేక్షణుడు, దుగ్ధపయోధి...
ఇంకొకవైపు చిచ్చఱ కన్ను, ముగ్ధపు లచ్చి, పిండి పిండి...
లడ్డూ మధ్యలో జీడిపప్పు, కిస్ మిస్ అక్కడక్కడా కనబడ్డట్టు, సంస్కృతం మధ్యలో చిక్కటి తెలుగు పదాలు... భలే పద్యం వెతికారండి!
భాస్కర శతకం
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteవే.ఆ.కృ. రంగారావు గారు ప్రచురించిన జనార్ధనాష్టం తెలుగులో అందంగా, ఉత్తమంగా అచ్చయిన పుస్తకంగా పేరు గాంచింది. ఇప్పుడది collector's item. కొ.పా గారు చెప్తున్న "లీలాజనార్దనం" (బాలు ప్రచురణ, 2001) ఇంకా దొరకాలి. లేకుంటే నవోదయ రామమోహనరావుగారికి రాయండి.
ReplyDeleteOn a related note, you may like to check Velcheru Narayanarao, A.K. Ramanujan and David Shulman's _When god is a customer - Telugu courtesan songs by Ksetrayya and others_ (1994); esp. their preface. They do also translate the above అష్టకం.
-- శ్రీనివాస్
అయ్యా, ఈ రెండు పద్యాలు ఇందులోనివి అవునా, కాదా? దయచేసి చెప్పరా?
ReplyDeleteచెల్లెబో! పసుపంటినది నీ జిలుగు దుప్పటి విప్పరా
ముల్లుమోపగ సందులేదుర మోవి కెంపులుగప్పరా
తెల్లవారినదాక యెక్కడ తిరుగులాడితి చెప్పరా
కల్లలాడక,దనుజమర ్దన! దనుజమర్దన కందుకూరి జనార్దనా!
కొదవలన్నియు దీర్చుకొంటివి (నా) గుణములెరిగీ శయ్యనూ
అదనెరింగీ ఏలితివి, విరవాది పూవుల శయ్యనూ
మదనకేళికి నీవె జాణవు మారునేమిటి చెయ్యనూ
కదియరారా! దనుజమర్దన కందుకూరి జనార్దనా!
@శ్రీనివాస్ గారు, మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు.
ReplyDelete@అరుణగారు,
మీరిచ్చిన రెండు పద్యాలలో రెండోది మాత్రం చిన్న చిన్న మార్పులతో ప్రభాకరశాస్త్రిగారి చాటుపద్య మణిమంజరిలో ఉంది:
కొదవలన్నియు దీర్చుకొంటివి గుణము వెరిగీ శయ్యనూ
అద నెరిగీ నన్నేలితివి, విరవాది పూవుల శయ్యనూ
మదనకేళికి నీవె జాణవు మారు తాపము మాన్పరా
కదియరారా! దనుజమర్దన కందుకూరి జనార్దనా!
"జంటనేత్రము లంటి చూచితె..." పద్యం బదులు యీ పద్యం ఉంది. నేనిచ్చిన పద్యాలు నిరంకుశోపాఖ్యానం పీఠికలో ఉన్నవి.
మీరిచ్చిన మొదటి పద్యం మాత్రం నాకీ రెండు పుస్తకాల్లోనూ కనబడలేదు. మీరెక్కడ చూసారు వాటిని?