తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, May 22, 2009

కవిత్వము - కాంతిసంవత్సరాలు


ఇంక నా వల్ల కాదు బాబోయ్! ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. మొన్నీ మధ్యన ఒక బ్లాగులో ఏదో కథల సంపుటి గురించిన టపాలో బ్లాగరొక విషయం చెప్పారు. బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒకరికి కాలం ఒక కాంతిసంవత్సరంలా గడిచిందని ఆ కథలో ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. (సరిగ్గా ఇదే కాకపోవచ్చు కాని తాత్పర్యం ఇదే). దానికి కొత్తపాళిగారు కామెంటులో ఈ కాంతిసంవత్సరం ఇంకా శాస్త్ర పరిభాషేనని సాహిత్యంలో రచయితలకి అంతగా తెలిసనట్టు లేదని అన్నారు. అప్పుడే ఈ టపా రాద్దామనుకున్నాను. కాని ఆవు వ్యాసం కథ మాదిరి అవుతుందేమోనని ఆ ఉత్సాహాన్ని అణుచుకున్నాను. మొన్నటికి మొన్న మళ్ళీ "నా ప్రపంచం" బ్లాగులో ఇన్నయ్యగారు రాసిన ఈ వాక్యం నా కంటబడింది: " భూమికి అతి సమీపం లో వుండే తార నుండి కిరణాలు రావడానికి 4 కాంతి సంవత్చరాలు పడుతుంది". ఇక రాయకుండా ఉండలేక పోయాను :-)

ఇది చాలామందికి తెలిసిన విషయమే (అయినా చాలామంది పప్పులో కాలేస్తూ ఉంటారు!). "కాంతి సంవత్సరాలు" కాలాన్ని కొలిచే పరిమాణం కాదు. అది దూరాన్ని కొలుస్తుంది. కాంతి, శూన్యంలో ఒక సంవత్సరంలో ప్రయాణించే దూరాన్ని "కాంతి సంవత్సరం" అంటారు. అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాల మధ్య ఎంత దూరం ఉంటుందంటే, ఒక గోళం కాంతి మరొక గోళాన్ని చేరడానికి ఏళ్ళకి ఏళ్ళే పడుతూ ఉంటుంది. అంచేత వాటి మధ్యనున్న దూరాన్ని కొలవడానికి దీన్ని వాడతారు. ఇక్కడ మరో విశేషం ఏవిటంటే, ప్రస్తుత భౌతిక శాస్త్ర సిద్ధాంతాల ప్రకారం కాంతి కన్నా వేగంగా ఏదీ ప్రయాణం చెయ్యలేదు. అంచేత పెద్ద పెద్ద దూరాలని కొలవడానికి కాంతి సంవత్సరానికి మించిన ప్రమాణం లేదు.
"ఇంతకీ యీ సోదంతా ఎందుకు. గూగులిస్తే దీనికన్నా ఎన్నో రెట్ల సమాచారం మాకు దొరుకుతుంది. ఇందులో కవిత్వం ఏవిటుంది?" అనుకుంటున్నారా. ఇదిగో వస్తున్నా, వస్తున్నా.


గోళ కాంతిచ్ఛటల్ పెరగోళములకు
బయనముం జేయ నబ్దముల్ బట్టునట్లు
రాచదేవిడీలందు వార్తలును జేర
బ్రభువు ప్రభువును మధ్య నబ్దములు బట్టు

ఒక గోళపు కాంతి కిరణాలు మరొక గోళానికి ప్రయాణించడానికి కొన్ని సంవత్సరాలే పట్టవచ్చు. అలాగే రాచదేవిడీల మధ్య రాజుకీ రాజుకీ వార్తలు ప్రయాణం చెయ్యడానికి సంవత్సరాలే పట్టేస్తుందిట. ఇదేం పోలిక! ఎక్కడి పోలిక?
ఇది అరణ్య కాండలోని మొట్టమొదటి పద్యం. ఈ పోలిక ద్వారా, రాచదేవిడీల మధ్యనుండే భౌతికమైన దూరమే కాదు, వాటి మధ్యనుండే శూన్యాన్ని కూడా స్ఫురింప జేస్తున్నాడు కవి. ఇంతకీ వార్తలు తెలియడానికి అంత కాలంపట్టేదని ఎందుకంటున్నాడు? దానికి ఈ పోలిక ఎందుకు చెప్పాడు? నేను వివరించడం ఎందుకు. శ్రీ వడలి మందేశ్వర రావుగారి యీ వివరణ చదవండి ("<>" మధ్యనున్న మాటలు నా పుడకలు):

***
ఈ పద్యాన్ని ఈ శతాబ్దపు కవే వ్రాయాలి. ఏమంటే వెనుకటివాళ్ళకు కాంతిసంవత్సరాలతో అంత పరిచయం లేదు కనుక. అయితే ఈ ఆధునిక భావాన్ని ఉపమానంగా గ్రహించి కవి సాధించింది ఏమిటి? అంటే - చాలా ఉంది. అయోధ్యకాండ అంతా ఉంది.
కవి చెప్పదలచుకున్నది: బహుశా నీవు 20వ శతాబ్దిలో ఉండి, నీ రేడియో, ట్రాన్సిస్టర్ సాధనాలతో ప్రపంచంలో ఎక్కడ, ఏమూల జరిగిన వార్తనైనా క్షణాలమీద అందుకో గలవు కదా అని, ఈ కథలోని వార్తలు కూడా అలా ప్రయాణం చేస్తాయని అనుకుంటావేమో, అలా కాదు సుమా! అంటున్నాడు కవి.

నాటికీ, నేటికీ విశ్వాంతరాళంలోని ఒక గోళపు కాంతి మరో గోళానికి ప్రయాణం చేయడానికి పట్టే వ్యవధి కొన్ని క్షణాలనుంచి కొన్ని సంవత్సరాల వరకూ ఉండవచ్చు. అలాగే ఆనాడు కొన్ని వార్తలు గుప్పున వ్యాపించేవి. కాని, ప్రభువుకూ ప్రభువుకూ మధ్య రాచదేవిడీలలో వార్తలందడానికి ఆ రోజుల్లో ఏండ్లు పూండ్లు పట్టేది.

దీనికింత ప్రాధాన్యం ఇస్తూ తొలిపద్యంలోనే ఎందుకు చెప్పాలి అంటే, ఇందులోని కథ అంతా దీనిమీదనే ఆధారపడి ఉన్నది కనుకనే.
రామునికి ఆత్మలో ఒక విరాగం కలిగింది. ఆ మీద అది శాంతించింది(<ఇదంతా జరగడానికి ఏడాదిపైగా పట్టింది!>). ఇంత కథ జరిగాక కాని, దశరథున కా విషయం తెలియనే తెలియదు. తెలిస్తే తొందరపడి భరత శత్రుఘ్నులుండగానే రాముని యౌవ రాజ్యాభిషేకం జరిగి ఉండేది. రామకథ బాలకాండతో ముగిసి ఉండేది.

కైకకు అధికార పూర్వకంగా రామపట్టాభిషేక వార్తనంద జేసింది మంథర!(<అదీ ఎప్పుడు? పట్టాభిషేకం ఈ రోజో రేపో అనగాను!>) అవును -
"గోళ కాంతిచ్ఛటల్ పెరగోళములకు బయనముం జేయ నబ్దములు పట్టు!"

అయోధ్యలోనే ఒకరి మాట ఒకరి కందడానికి ఇలా ఉంటే, అయోధ్యనుంచి కేకయ రాజధానికి వార్తలందటానికి దశాబ్దాలే పడుతుంది. రాచదేవిడీలోనికి అడుగుపెట్టి కైకమ్మను చూసేవరకూ భరతునికి ఏ వార్తా తెలియనే తెలియదు. తెలిస్తే కథే లేదు కదా!
అయోధ్యకాండ అంతా ఈ వార్త నత్తనడకలా నడవడంలోనే ఉంది. వార్తలోని వ్యవధానం వల్లనే మంథర కైక మనసును మార్చ యత్నించింది. వార్తలందడంలోని వ్యవథానం వల్లనే కౌసల్యనుంచీ, భరద్వాజునినుంచీ, లక్ష్మణుడూ, గుహుని వరకూ అందరూ భరతుణ్ణి అవమానంగా చూశారు.

(<ఇక్కడ ముఖ్యమైన విషయమేంటంటే, పట్టాభిషేకం రోజువరకూ కైకేయికి ఆ వార్త ఎందుకు తెలియలేదు, భరతుడికి కూడా తల్లిని చూసే దాకా ఎందుకు తెలియలేదు అన్న విషయం వాల్మీకంలో స్పష్టంగా లేదు. అందికే, దశరథుడు కోరుండే ఈ వార్త కైకేయికీ కేకయ రాజుకీ తెలియకుండా దాచాడన్న వ్యాఖ్యానాలు వచ్చాయి. ఇక్కడకూడా మన తెలుగు కవి దీనికి వివరణ ఇవ్వలేదు. కవితాత్మకంగా ఒక పోలిక చెప్పి వదిలేసాడు!>)

చిత్రమేమంటే "గోళ కాంతిచ్ఛటల్ పెరగోళములకు" చేరడానికి అబ్దములు పట్టగా కొన్ని వార్తలు మాత్రం ఎన్నాళ్ళయినా అందనే అందవు.
రాముడొక స్వయం ప్రకాశ జ్యోతి అనుకుంటే, అతనిలో కల్గిన వైరాగ్య భావమన్న కాంతి దశరథ గోళానికి అందడానికి తగినంత కాలం పట్టింది. కాని దేవతలు వచ్చి రాముని రాజ్యమేల వద్దన్న వార్త దశరథునికి అందనే లేదు. రాముని కోర్కె మీదనే - దేవతల ఋణాన్ని తీర్చడానికే - కైకమ్మ వరాలను కోరిందన్న వార్త లోకానికి తెలియనే తెలియదు! అవును:
"గోళ కాంతి చ్ఛటల్ పెరగోళములకు
బయనముం జేయ నబ్దముల్ బట్టు!"

(<"ఏవిటీ కొత్త కథ? ఏమిటి లోకానికి తెలియని యీ వింత వార్త!" అనుకుంటున్నారా? దీని గురించి తీరుబడిగా మరోసారి మరోచోట ముచ్చటించుకుందాం.>)

***

అన్నట్టు, ఈ కవి ఎవరో ఇది ఏ కావ్యంలోదో నేను వేరేగా చెప్పక్కరలేదు కదా! :-)

3 comments:

  1. పద్యం సూపర్, అలాగే
    కాంతి సంవత్సరం=టైమ్. మా సైన్స్ సారు నేను 8 వతరగతి చదివేప్పుడు కూడా అలాగే చెప్పాడు :(

    లైట్ యియర్ అని చదివితే చాలు ఠక్కున నాకు నా వయసు గుర్తువస్తుంది. మా ఇంజనీరింగ్ సార్ చెప్పాడు :)

    ReplyDelete
  2. hats off to ur science sir..:)

    ReplyDelete
  3. Mee vivarana Ramayanamloni oka Vichitramaina Konani Aavishkarinchindi! Dhanyavadalu

    ReplyDelete