అష్టావక్రగారి బ్లాగులో ఈ పద్యాన్ని గురించిన ప్రస్తావన చూసేసరికి నేనెక్కడికో వెళ్ళిపోయాను. జ్ఞాపకాల గుడుసుళ్ళు గుండ్రాలు గుండ్రాలుగా తిరిగి నన్నో పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాయి! అప్పట్లో ఇంటర్నెట్టంటే ఒక అద్భుతం! ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో తెలియని వ్యక్తులతో సంభాషణలు. వయసు, చదువు, పరపతీ - ఇలాటి భేదాలేవీ లేని, తెలీని ఒక కొత్త లోకం! ఉద్యోగంలో చేరిన కొత్త. ఇంటర్నెట్టు మరీ కొత్త. అప్పటికింకా యాహూ, గూగులు గుంపులేవీ లేవు. Mailing Lists అని ఉండేవి. వాటి గురించి తెలిసి ఇంక మనసూరుకుంటుందా! మనకిష్టమైన వాటికోసం అన్వేషణ. ఎలా తగిలిందో ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు కాని, వెదకబోయిన తీగ "తెలుసా" ("తెలుగు సాహిత్యా"నికి సంక్షిప్త రూపం) రూపంలో నా కాలికి తగిలింది. అప్పటికే ఆ గుంపుకి మూడేళ్ళ వయసు. ఎందరో హేమాహేమీలు (అప్పటికి వాళ్ళు హేమాహేమీలని నాకు తెలీదు!) జరిపే ఆసక్తికరమైన చర్చలూ, అంతుతెగని వాదనలూ, కొత్త సాహిత్యాన్ని గురించిన పరిచయాలూ - ఒకటా రెండా, అబ్బో అదొక మహత్తర సాహిత్య శాల. అదే నాకు పెద్ద పాఠశాలయ్యింది. దింగంబర కవిత్వం రుచిచూసినా, స్త్రీవాద కవిత్వాన్ని గురించి తెలుసుకున్నా, భాషాశాస్త్రంలో ఓనమాలు దిద్దుకున్నా అవన్నీ ఆ పాఠశాలలోనే! అన్నిటికీ మించి, పద్యసుమాల పరిమళం ఆ ఆవరణ అంతటా పరచుకునేది. మన పద్యసాహిత్యంలోని అందాలగూర్చి వివరించడమూ చర్చించడమూ అయితేనేమి, చమత్కార సమస్యాలూ పూరణలూ అయితేనేమి, స్వీయ కవిత్వాలయితేనేమి, ఛందో బందోబస్తులగురించిన వాడి వేడి చర్చలయితేనేమి ఆ గుంపులో ఎప్పుడూ పద్యాస్వాదన జరుగుతూనే ఉండేది. అదిగో అలాటి సందర్భంలోనే ఒకరు పంపిన యీ పద్యం నా కంటబడింది:
కాలము మారె; మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తే; జం
బాలమునందు రక్తదళ పద్మిని మోసిడి పూలు పూచె; నం
ధాలయమందు స్వర్ణ కిరణాంకురముల్ జనియించి భావ భూ
తాలను బారదోలి చిర దాస్యతమస్సు నడంచె నాంధ్రుడా!
ఇది దువ్వూరి రామిరెడ్డి పద్యం. ఈ పద్యాన్ని చదవగానే, ఎందుకో ఠక్కున మరో పద్యం గుర్తుకువచ్చింది. అది దాశరథి మహాంధ్రోదయంలోని పద్యం:
వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం
డెలు జిలుజిల్లనన్ రుధిర నిర్ఝరిపారె, దిగంగనా ముఖ
మ్ముల నవకుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు, త
ల్పులు తెరువుండు రండు పిలువుండు శయించినవారినెల్లరన్!
వెంటనే టకటకా టైపుచేసి పంపించేసాను. అదే అంతర్జాలంలో నా మొట్టమొదటి టపా! దీనితోనే నా అంతర్జాల ప్రయాణానికి శ్రీకారం చుట్టాను. అప్పటి టపాలు ఇప్పటికీ ఇక్కడ భద్రంగా ఉన్నాయి. తెలుగు సాహిత్యమంటే ఆసక్తి ఉన్నవాళ్ళు యీ archives మధ్యలో పడితే, రత్నాకరంలో పడ్డట్టే :-)
ఎందుకీ పద్యం గుర్తుకువచ్చింది అనే ప్రశ్నకి అప్పుడు నేనిచ్చిన వివరణ:
దువ్వూరి, దాశరథి వారి యీ రెండు పద్యాలలో నాకు చాలా సామ్యము కనిపిస్తోంది.
రెండు పద్యాలూ ఆంధ్రుల దాస్యవిముక్తి గూర్చినవి. రెంటిలోనూ దానిని ఒక నవోదయంతో పోల్చడమే కాక, ఆ ఉదయ వర్ణన కూడా చాలా దగ్గరగా ఉంది. ఇద్దరూ సూర్య కిరణాలనీ, తామర మొగ్గలనీ కొత్త ఆశలకు, ఆలోచనలకు ప్రతీకగా చేసుకున్నారు. "రుధిర నిర్ఝరిపారె" అని దాశరథి అంటే, "రక్త దళ పద్మిని మోసిడి పూలు పూచె" అని కవికోకిల అంటారు. ఇద్దరి లోనూ విప్లవ ఛాయ గోచరిస్తుంది.
ఇది యథాతథంగా అప్పటి వివరణే అయినా, అప్పుడది ఉన్నది ఇంగ్లీషు(లిపి)లో. అప్పటికింకా తెలుగు ఫాంట్ల వినియోగం ఎక్కువగా లేదు. Rice Universityలోని కొంతమంది తెలుగువాళ్ళు తయారుచేసిన transliteration scheme, RTS అన్న పేరుతో చాలామంది వాడేవారు. ఇప్పటికీ చాలామంది వాడుతున్నారు. నా మొట్టమొదటి ఆ టపా రాసినప్పటికి నాకు దీనిగురించి కూడా తెలీదు! అప్పటికి చూసిన టపాల ఆధారంగా నాకు తోచిన transliteration schemeలో రాసేవాడిని. ఆ తర్వాత RTSగురించి తెలిసింది. RTS రాయడం చదవడం అలవాటై, కొన్నాళ్ళకి అనర్గళంగా ఇంగ్లీషులిపిలో(RTSలో) తెలుగు టైపు చెయ్యడం చదవడం వచ్చేసింది :-) తెలుగు మిత్రుల దగ్గర ఈ విద్యని ప్రదర్శించి వాళ్ళని ఆశ్చర్యపరచడం సరదాగా ఉండేది. ఆ తర్వాత సిరిగిన దంపతల ధర్మమా అని Telugu Lipi Editor వచ్చింది. నేను ఇంగ్లీషులిపిలో ఏ తెలుగు కవితో రాస్తే, అది వేరే వాళ్ళకి చదవడానికి వీలుగా తెలుగు ఫాంటులోకి తర్జుమా చేసి HTMLగానో imageగానో భద్రపరచే వీలు కల్పించింది తెలుగు లిపి. ఆ తర్వాత చాలా పరికరాలు వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రభారతివారి rts2pdf వాడేవాణ్ణి. ఇప్పటికీ pdfలో ఏదైనా భద్రపరచడానికి అది వాడుతూ ఉంటాను.
ఈ పదేళ్ళ ప్రయాణంలో, ఎన్నో పరిచయాలు. వాటిల్లో ప్రత్యక్ష పరిచయాలుగా మరినవి చాలా తక్కువే. ముఖాముఖీ కలుసుకోకుండా సంభాషించుకోవడం అదో ప్రత్యేకత! తెలుసా తర్వాత రచ్చబండ, ఛందస్సు గుంపులూ, ఈమాట పత్రికా, తెలుగు పీపుల్ డాట్ కాం, ఈ మధ్యనే పొద్దు, ఇతర అంతర్జాల పత్రికలూ - ఇలా సాగిన ప్రయాణం ప్రస్తుతానికి ఇదిగో యీ బ్లాగులవరకూ వచ్చింది. ఇంకా ముందుముందు ఎలాటి మలుపులు తిరగనుందో!
ఏదేమైనా, ఈ ప్రయాణంలో నేనెన్నో నేర్చుకోగలిగాను. ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. సాహిత్యంతో ఇప్పుడు నాకున్న అతి కొద్ది పరిచయం ఏర్పడడంలో అంతర్జాలం ముఖ్య పాత్ర నిర్వహించిందనడంలో ఏ మాత్రం సందేహమూ లేదు. దానికిగానూ అంతర్జాలానికీ, అందులో పాల్గొన్న (పాల్గొంటున్న) వ్యక్తులందరికీ యీ టపా ద్వారా నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
చూసేరా, నా జ్ఞాపకాలలో కొట్టుకుపోయి పద్యం గురించి మరిచే పోయాను! ఇది నాకు చాలా ఇష్టమైన పద్యం. ఉదయాన్ని మన కవులెంతమంది వర్ణించ లేదు! ఒక అభ్యుదయ కవి, విప్లవ స్ఫూర్తితో దర్శించిన ఉదయమిది. వెలుతురనే బాకుతో చిక్కని చీకటి రాత్రి గుండెలని చీల్చితే, అందులోంచి పారిన రక్తపుటేరు లాగా ఉందిట ఉదయాకాశం. ఆకాశంలో దిక్కులనే కాంతల ముఖాలమీద కుంకుమ కాంతులు విరిసాయట. కింద నేలపై అదే సమయానికి తామర మొగ్గలుకూడా విచ్చుకుంటాయి కదా. పైన ఆ కుంకుమ ప్రభలు కూడా, కిందనున్న తామర మొగ్గల్లానే ఉన్నాయిట! ఇంకేముంది తెల్లవారింది, తలుపులు తెరవండి, రండి, ఇంకా పడుకొని ఉన్నవాళ్ళందరినీ నిద్రలేపండి అని కవి పిలుపు. ఇక్కడ ఉదయమంటే అభ్యుదయం, స్వేఛ్చ. చిక్కని కాళరాత్రి - అజ్ఞానంతో నిండిన దాస్యం. దిగంగనల ముఖాలపై కుంకుమ కాంతులు, లోకానికి శుభం జరుగుతోందని సూచన. కవి ఇచ్చిన పిలుపు స్వేఛ్చా వాయువులని పీల్చి, అభ్యుదయం వైపుకి అడుగులు వెయ్యమని. ప్రకృతి వర్ణనలో, చెప్పదలచుకున్న విషయాన్ని ధ్వనింపచెయ్యడం మంచి కవిత్వం.
కవి తన కవితలో చిత్రించిన ఆ ఉదయం ఊహగానే మిగిలిపోయిందా? నిజంగానే నిజమయ్యిందా? నిజమౌతుందా? ఇవి మనందరం ఆలోచించుకోవాలసిన ప్రశ్నలు...
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Monday, December 8, 2008
రెండు పద్యాలూ, బోలెడన్ని జ్ఞాపకాలూ
Subscribe to:
Post Comments (Atom)
దువ్వూరి రామిరెడ్డిగారి పద్యాల గురించి శ్రీమతి మాలతీ చందూర్ గారు వారి జవాబులలో ఎన్నోసార్లు ఉదాహరించటం, అప్పట్నించీ వారి కవితలను సంపాదించి చదవాలను కోవడం తోనే సంవత్సరాలు గడచి పోతున్నాయి.ఇప్పడు మళ్ళీ మీరు గుర్తుచేసారు.internet లో ఓ సారి వారి పద్యాలు చూడటం జరిగింది కాని పుస్తకరూపంలో కొని ఉంచుకోవాలి.ఎప్పటికవుతుందో--
ReplyDeleteఆహా: యోగి రెండు పంక్తులు రాసి, మీతో ఏకంగా ఓ బ్లాగు రాయడానికి ప్రేరకుడయ్యాడన్నమాట.
ReplyDeleteకవితల్ని ఆర్టికల్స్ లాగా, బర బరా చదివే నాలాంటి వాళ్ళకి ఇలాంటి కమ్మటి కవితని, దాని తాత్పర్యాన్ని తెలియజేసినందుకు మీ ఇద్దరికీ బహు ధన్యవాదాలు.
"కవి తన కవితలో చిత్రించిన ఆ ఉదయం ఊహగానే మిగిలిపోయిందా? నిజంగానే నిజమయ్యిందా? నిజమౌతుందా?"
ReplyDeleteఉపనిషత్తుల్లో ఒక సందర్భాన్ని వ్యక్తీకరించడానికి ఓ అద్భుతమైన పదప్రయోగం వాడతారు. "చీకటిని పెనుచీకటి కప్పి ఉన్నప్పుడు..." అని. ఓక్కసారి ఊహించుకుని చూడండి, చీకటిని పెనుచీకటి ఆవరించబడినప్పుడు అని.... అలాంటి చీకటిని కూడా ఒఖ్ఖ కాంతి పుంజం చీల్చి వేస్తుంది!! దాశరధి గారి ఊహ ఇప్పటి వరకూ ఊహగానే మిగిలిపోయినా, ఆ ఊహ నిజం అవుతుందని ప్రగాఢమైన విశ్వాసం ఉంది నాకెందుకో.
ఎందుకని అడిగితే, "మనిషి ఆశా జీవి" లాంటి సమాధానాలు ఇవ్వలేను. మనిషి ఆశలకూ, వాస్తావాలకూ ఎలాంటి సంబంధమూ ఉండదు. సంకల్పానికీ, ఆశకీ చాలా తేడా ఉంది. కవి ఊహలు నిజం ఎందుకవుతాయంటే, అది విషయ ధర్మం కాబట్టి. మనుషుల ఆలోచనా రీతుల్లో అధర్మం పెచ్చరిల్లినప్పుడు, ప్రక్షాళన/సంతులనం చేసే అలోచనా రీతులు వాటంతట అవే వాడుకలోకి వస్తాయి. అలా జరక్కపోతే మనకు తెలిసి ప్రపంచం, దాని చరిఒత్రా ఉండేవి కాదు. :)
మీరు రాసిన అర్థం చదివిన తర్వాత పద్యం మీద ఇంకా ఇష్టం పెరిగింది. అలాగే మీరిచ్చిన లింకు కూడా ఉపయుక్తం గా ఉండేట్టు ఉంది. మీ బ్లాగు ముఖం గా, మీకు వీలైనప్పుడు ఇలాగే మంచి పద్యాలను పరిచయం చేస్తూ ఉండండి.
కృతజ్ఞతలు
యోగి
This comment has been removed by the author.
ReplyDeleteపద్య వివరణ ఆ బ్లాగులోనే అడుగుదామనుకొన్నాను.
ReplyDeleteఇలా ఆ అదృష్టం కలిగింది.
మంచి వివరణ ఇచ్చారు.
ఇక
మీ గత స్మృతులు చూసి నివ్వెర పోయాను. చాలా బాగున్నాయి.
వంటావిడ కవిత నచ్చింది. గొప్పగా ఉంది.
మీ లింకుని బుక్ మార్క్ చేసుకొన్నాను.
మరింత లోతుగా చదవాలి.
ధన్యవాదములతో
బొల్లోజు బాబా
బహుబాగు
ReplyDeleteకాలము మారె మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తె జం
ReplyDeleteబాలమునందు రక్తదళ పద్మిని మోసిడి పూలు పూచె నం
ధాలయమందు స్వర్ణ కిరణాంకురముల్ జనియించి భావ భూ
తాలను బారదోలి చిర దాస్యతమస్సు నడంచె నాంధ్రుడా!
కామేశ్వరరావుగారూ, భావభూతాలా? రామిరెడ్డిగారేం చెప్పదలచుకున్నారో నాకు పూర్తిగా అర్థం కాలేదు. (బహుశా నాకు దీనిని అర్థం చేస్కోవడానికి కాసింత చరిత్రలో కూడ జ్ఞానం అవసరమేమో!)
వెలుతురుబాకు తాకిడికి విచ్చిన చిక్కని కాళరాత్రి గుం
డెలు జిలుజిల్లనన్ రుధిర నిర్ఝరిపారె దిగంగనా ముఖ
మ్ముల నవకుంకుమప్రభలు మొల్చెను తామర మొగ్గలట్లు త
ల్పులు తెరువుండు రండు పిలువుండు శయించినవారినెల్లరన్!
మీరన్నట్టుగా భలే ఉందండీ దాశరథిగారి ప్రయోగం. రుధిరనిర్ఘరి పారడం, (ఆ ఝరిలో) తామరమొగ్గలు మొలిచినట్టుగా దిగంగనాముఖములపై కుంకుమ కాంతులు... ఆహా. భలే.
రెండు మంచి పద్యాలు పరిచయం చేశారు. నమోవాకం.
కామెంటిన అందరికీ నెనరులు.
ReplyDeleteబాబాగారు, నా పాత కవితనికూడా వెతికి చదివారా! నెనరులు.
రాఘవగారు, నిజమేనండీ. నాకూ భావభూతలన్నది సరిగా అర్థం కాలేదు. అచ్చు తప్పేమైనా ఉందేమో. పద్యం ఎక్కడుందో వెతికి చూడాలి. తక్కిన పద్యం అర్థమయ్యిందా?
కామేశ్వరరావు మాస్టారూ,
ReplyDeleteఆంధ్రుడా, కాలము మారె - స్పష్టం.
మ్రోడయిన కట్టెను కెంజిగురాకులొత్తె - పుట్టుకనీ క్రొత్త జన్మనీ ఆశనీ చూపుతోంది. కెంజిగురాకు అనడం వల్ల అరుణవర్ణం చూపబడుతోంది. పైగా కాలం మారడం గురించి చెప్పారు కాబట్టి బాహ్యంగానూ, జీవితాలలోనూ శిశిరం పోయి వసంతం (ఎఱ్ఱని మామిడి ఆకులు... ఆహా ఏమి అందంగా ఉంటై) వచ్చిందనీ.
జంబాలమునందు రక్తదళ పద్మిని మోసిడి పూలు పూచెన్ - బురదలో ఎఱ్ఱని తామర మొగ్గలువేసి పూలు పూచింది. జంబాలము అని వాడడం వల్ల పూర్వపరిస్థితి అధ్వానంగా ఉందనీ కాని ప్రస్తుతం కాలం మారడం వల్ల అందులోంచి అందమైన క్రొత్త జీవం తొణికిసలాడుతోందనీ. ఇక్కడా అరుణవర్ణమే.
అంధాలయమందు స్వర్ణ కిరణాంకురముల్ జనియించి భావ భూతాలను బారదోలి చిర దాస్యతమస్సు నడంచెన్ - చీకటిలో మంచి రంగు కలిగిన కిరణముల అంకురాలు పుట్టి... పూర్తిగా కిరణాలు ఇంకా రాకుండానే... భావభూతాలను (ఇది అర్థం కాలేదు) బయటకు తరిమి నెట్టి ఎప్పటినుండో ఉన్న దాస్యము అనే తమస్సుని అణచాయి. ఇక్కడకి అణచడం అన్న పని జరిగిపోయింది. బహుశా అందువల్లనే ఇక్కడ అరుణవర్ణమే కాక పసిడి యొక్క పసిమి ఛాయ.
ఇంతే కదండీ (తక్కిన) పద్యానికి అర్థం?
పద్యం ఎక్కడుందో వెతికి చూడాలి అన్నారు, ఎందులోదో కాస్త చూసి చెప్పుదురూ కనీసం ఆంధ్రచరిత్రపై నా జ్ఞానం పెంచుకోవడానికైనా నేనూ చదువుతాను ఆ పుస్తకాన్ని. అన్నట్టు ఇప్పటివరకూ దువ్వూరి రామిరెడ్డిగారి గ్రంథావళి లాంటిది ఏమైనా ప్రచురించబడిందాండీ?
రాఘవగారడిగిన "ఇప్పటివరకూ దువ్వూరి రామిరెడ్డిగారి గ్రంథావళి లాంటిది ఏమైనా ప్రచురించబడిందాండీ?" అన్న ప్రశ్నకు సమాధానం: ప్రచురింపబడింది. నాకు తెలిసి మొత్తం మూడుసార్లు. చివరిసారిగా ఆయన శతజయంతి సందర్భంలో, అంటే 1995/96ల్లో.
ReplyDeleteభవదీయుడు,
శ్రీనివాస్
రాఘవగారు,
ReplyDeleteదువ్వూరివారి పద్యానికి చక్కని వివరణే ఇచ్చారు మీరు! పరుచూరిగారు చెప్పినట్టు, దువ్వూరివారి రచనలు చాలాసార్లు ప్రచరితమయ్యాయి. బహుశా ఇప్పుడుకూడా దొరుకుతాయనే అనుకుంటాను. "దువ్వూరి రామిరెడ్డి - జీవితము, సాహిత్యము" అనే గ్రంథాన్ని కె.వి.రమణారెడ్డి రచించారు. దువ్వూరివారి జీవితంలోని అంశాలని జోడిస్తూ అతని సాహిత్యాన్ని విశ్లేషించారతను. వెతికితే, ఆ పుస్తకంలో ఈ పద్యం కనిపించింది. అది అముద్రిత పద్యమని అందులో ఉంది. "భావభూతలు" అనే ఉంది. ఈ పద్యాన్ని గురించి ప్రత్యేక వివరణ ఏమీ లేదు. పాతపడి బూజుపట్టిన భావాలని భావభూతాలగా వర్ణించారనుకుంటున్నాను.
శ్రీనివాస్‌గారూ కామేశ్వరరావుగారూ
ReplyDeleteమంచి సమాచారం అందించారు. కవికోకిల పుస్తకాలు దొరుకుతాయేమో ప్రయత్నిస్తాను. నెనరులు.
భైరవభట్ల గారూ, మీ Emailఅడ్రెసు తెలియకపోవడం వల్ల ఇక్కడే అడుగుతున్నా, మన్నించండి.
ReplyDeleteనాకు క్రింద ఇవ్వబడిన T.S. Eliot Poem అంటే చాలా చాలా ఇష్టం. స్వంతంగా తెలుగులోకి అనువదించగల పాండిత్యం లేదు.. మీరు దీనిని తెలుగులోకి అనువదించగలరా?
"Ah, yes
We shall not cease from exploration
And the end of all our exploring
Will be to arrive where we started
And know the place for the first time"
కృతజ్ఞతలు
యోగి
ఆర్యా! నమస్తే.
ReplyDeleteఉత్పలమాల:-
భైరవ భట్ల వంశజుడ! ప్రస్ఫుటమాయె భవన్మనో భిలా
షారుణ కాంతి పుంజములు హాయిని గొల్పగ జాలటంచు. నీ
కోరిన పద్యముల్ గనగ, కోర్కె ఫలించెనతంచు పొంగి, మీ
తీరును తెల్పి మామదుల తెనెల వాగుల దెల్ప గల్గిరే?
{ ఆంధ్రామృతం }
ఆర్యా! నమస్తే.
ReplyDeleteఉత్పలమాల:-
భైరవ భట్ల వంశజుడ! ప్రస్ఫుటమాయె భవన్మనో భిలా
షారుణ కాంతి పుంజములు హాయిని గొల్పగ జాలటంచు. నీ
కోరిన పద్యముల్ గనగ, కోర్కె ఫలించెనటంచు పొంగి, మీ
తీరును తెల్పి మామదులు తేనెల వాగుల దేల్ప గల్గిరే?
{ ఆంధ్రామృతం }
రామకృష్ణగారు,
ReplyDeleteమీ పద్యసుమాలకి నెనరులు.
యోగిగారు,
మీరడిగిన Eliot పద్యం పూర్తి పద్యం కాదు. LITTLE GIDDING అనే కవితలోని పంక్తులివి. పూర్తి కవితని ఇక్కడ చదవవచ్చు (సుదీర్ఘ కవిత!):
http://www.tristan.icom43.net/quartets/gidding.html
నిజానికీ పంక్తులు ఆ కవితలో భాగంగా చదివినప్పుడు మరింత లోతును సంతరించుకుంటాయి! అయినా మీ కోరిక మేరకు దీన్ని అనువదించాను (మొత్తం కవితని అనువదించాలని కూడా ఆశ కలిగింది, బహుశా అత్యాశేనేమో!).
నా అనువాదాన్ని మరో టపగా మీ ముందుంచుతాను, అందాకా కాస్త ఓపికపట్టండి :-)
భైరవభట్ల గారూ,
ReplyDeleteమీరన్నది నిజమే... అది మొత్తం పద్యం కాదు పద్యంలో నన్ను అమితంగా ఆకర్షించిన పంక్తులు. నా విన్నపాన్ని మన్నించి మీరు అనువదించడానికి సుముఖులైనందుకు వేవేల ధన్యవాదాలు :) మీ టపాకోసం ఎదురు చూస్తున్నా..
ఈ కొన్ని పంక్తులను అనువదిస్తే ఆనందం! మొత్తం అనువదించారంటే మహదానందం!! :)
Kameswara Rao gAru :
ReplyDeleteNamaskaramu.nEnu chAlA rOjulugA Annamayya krutulaku word by word translations kOsam vedukutunnAnu.mIru vrAyakODadU?prAmANikamaiyana blog gAnI,Dictionary gAnI EdainA sUchincha galarA?
dhanyavAdAlu
Padmaja
పద్మజగారూ,
ReplyDeleteనమస్కారం. దీని గురించి మీరు రచ్చబండలో అడిగినట్టున్నారు కదా? నాకు తెలిసి అలాంటి నిఘంటువు కాని ప్రతి సంకీర్తనకీ ప్రతిపదార్థమిచ్చే పుస్తకాలు కాని లేవండి. రచ్చబందలో పెద్దలెవరూ కూడా చెప్పలేదు కాబట్టి లేదనే అనుకుంటాను.
నా మీద మీకెందుకంత నమ్మకం ఏర్పడిందో కాని, నాకలాంటి పని చేసేటంత స్తోమత లేదు!
రెండేళ్ళ క్రితం అన్నమాచార్య ప్రాజక్టు సంచాలకులు మేడసాని మోహన్‌గారితో మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి సంకలనం (టీకా తాత్పర్యాలతో) సుమారు 500 సంకీర్తనలకి పని పూర్తయినట్టు, త్వరలో ప్రచురించనున్నట్టు చెప్పారు. అది రెండేళ్ళ కిందటి మాట. తితిదేలో అడిగిచూడండి.
ReplyDeleteసముద్రాల లక్ష్మణయ్యగారు "అన్నమాచార్య సంకీర్తనామృతం" అనేపేరుతో 150 అన్నమయ్య సంకీర్తనలకు భావార్థములతో విపులవ్యాఖ్యను వ్రాసి 1980లో ప్రచురించారు. 2008లో టిటిడి ప్రచురణగా వెలువడింది. ఇంటర్నెట్టులో PDF దొరుకుతుంది.
ReplyDelete--
రవ్వా శ్రీహరిగారు "అన్నమయ్య పదకోశం" వ్రాస్తున్నారు.
--
విధేయుడు,
వాడపల్లి శేషతల్పశాయి.