నా మిత్రుడొకడు ఈనాడులోని ఈ సంపాదకీయాన్ని నా దృష్టికి తెచ్చాడు. కొత్తవి కాకపోయినా, మరోసారి గుర్తుచేసుకోవాల్సిన విషయాలున్నాయందులో. ముఖ్యంగా ఎప్పుడో చదువుకున్న పద్యాన్ని మళ్ళీ గుర్తుచేసి నా మనసుని ఆ పద్యమ్మీదకి పరుగులు తీయించింది. నన్ను నేను మరోసారి సమీక్షించుకొనేలా చేసింది. ఎప్పుడో పదహారవ శతాబ్దంలో రాయబడ్డ పద్యం, నేనెప్పుడో చిన్ననాడు చదువుకున్న పద్యం ఇన్నాళ్ళకి మళ్ళీ నన్ను ఆలోచింపజేసిందంటే అది సామాన్యమా!
చదువది యెంతగల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా
చదువు నిరర్థకమ్ము గుణసంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్
బదునుగ మంచి కూర నలపాకము చేసిననైన నందు నిం
పొదవెడు నుప్పులేక రుచి బుట్టగ నేర్చునటయ్య భాస్కరా!
ఇది చాలామందికి తెలిసిన పద్యమే. అందరికీ అర్థమయ్యే పద్యమే. ఇందులో విశేషమంతా, "ఇంచుక" అన్న పదంలోనూ, ఈ రసజ్ఞతని ఉప్పుతో పోల్చడంలోనూ ఉంది. అంటే రసజ్ఞత కూడా తగిన పాళ్ళల్లోనే ఉండాలి. ఇది ఉండడం ఎంత అవసరమో, ఎక్కువ కాకపోవడమూ అంతే అవసరమన్న మాట. అదేవిటి, రసజ్ఞత మంచి గుణమే కదా, అది ఎక్కువైతే ఏవిటి సమస్య అన్న అనుమానం రావచ్చు. ఉప్పెక్కువైతే ఏవిటవుతుందో, రసజ్ఞత ఎక్కువైనా అదే అవుతుంది. ఉప్పెక్కువైతే అది మిగతా రుచులని ఆక్రమించేసి అదొకటే రుచి తెలుస్తుంది కదా. అలానే రసజ్ఞత ఎక్కువైతే, మనం చదివే దాంట్లో లేదా చెప్పాల్సిన దాంట్లో ఉన్న అసలు విషయాన్ని మన సొంత పైత్యం ఆక్రమించేస్తుంది. ఎలా అయితే తగినంత ఉప్పు, మిగతా రుచులకి ప్రోద్బలం కలిగిస్తుందో, అలానే రసజ్ఞత కూడా రచనలోని విశేషాలని గ్రహించేందుకు ప్రేరకం మాత్రమే కావాలి.
శతకాల్లో భాస్కర శతకానికి తనదైన ఒక ప్రత్యేకత ఉంది. ఇది భక్తి శతకం కాదు, నీతి శతకం. మనకి బాగా తెలిసిన నీతి శతకాలు వేమన, సుమతి శతకాలు. సంస్కృతం నుంచి అనువదించబడిన భర్తృహరి నీతి శతకాన్ని పక్కనపెడితే, తెలుగులో వృత్తాలలో నడిచే నీతి శతకం భాస్కర శతకం. ఇలాటి వృత్తాలకి చిక్కని చక్కని ధార అవసరం. అది పుష్కలంగా ఉన్న పద్యాలున్న శతకం భాస్కర శతకం. అలాటి నడకకి తోడు చక్కని దృష్టాంతాలు ఈ శతకంలోని పద్యాలని పాఠకుల మనసులో ముద్రపడేట్టు చేస్తాయి. ఈ శతకం రాసిన కవి పేరు మారవి వెంకయ్య.
ఇంతకీ ఈ పద్యం నన్నెందుకింతలా ఆలోచింపజేసిందిప్పుడూ అంటే, అందులో చెప్పిన రసజ్ఞత నాలో లోపించడం లేదు కదా అన్న అనుమానమే! చాలా కాలం క్రితం నా పద్యాలనీ, వ్యాసాలనీ చదివిన మా ముత్తాతగారు నాకో హెచ్చరిక చేసారు. నీలోని విమర్శకుడు నీలో ఉన్న కవిని మింగెయ్యకుండా జాగ్రత్త పడరా నాయనా అని! అతనన్నట్టుగానే విమర్శకుడు కవిని ఇంచుమించుగా మింగేసాడనే చెప్పాలి. అంతవరకూ సరే, ఏదో నా స్వభావమే అంత అని సరిపెట్టుకోవచ్చు. విమర్శకుడికైనా రసజ్ఞత అవసరమే. కవితలోనో కథలోనో ఉండే రసాన్ని (మన ప్రస్తుత భాషలో అనుభూతి అనుకుందాం) గ్రహించ గలిగే శక్తే రసజ్ఞత. విమర్శకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అదే కదా! కవి రాసిన దాంట్లో తప్పులు పట్టుకోవడమే ప్రథానమై పోతే రసజ్ఞత గంగలో కలిసినట్టే. వాదోపవాదాల మీదున్న ఆసక్తి మంచి రచనని ఆస్వాదించడంలో చూపించకపోతే వాడు రసికుడు కాదు రక్కసుడిగా తయారవుతాడు. ఈ రసజ్ఞత చాలకపోబట్టే కదా ఇంతకుముందు చెప్పుకున్న నత్కీరుడు అవస్థల పాలయ్యింది.
ఈ పద్యం మన సాహిత్యకారులూ, విద్యావంతులూ ఈ రసజ్ఞతకి ఎంత విలువనిచ్చారో స్పష్టం చేస్తోంది. తర్క మీమాంస వ్యాకరణాది శాస్త్రాలెన్ని చదువుకున్నా, కాస్తంత రసజ్ఞత లేనివాడు ఎక్కడా రాణించలేడని చెపుతోంది. ఎలాటి శాస్త్ర గ్రంథం రాసినా, సంభాషణ చేసినా అందులో కాస్తంత హృదయానికి హత్తుకొనే చతురత, చమత్కారం లోపిస్తే అవి ఎదుటివాళ్ళని ఆకట్టుకోవన్న మాట. అన్న మాట కాదది ఉన్న మాటే! తాంబూలాన్ని అడిగిన భవభూతీ కాళిదాసుల కథలో, ఆ వారకాంత భవభూతిలో చూసింది శుష్క పాండిత్యమైతే, కాళిదాసులో చూసింది రసజ్ఞత కదా!
కాస్త ఘాటైన వివాదాలు జరిగినా, పూర్వకాలంలో కవి పండితుల మధ్య చర్చలుగానీ వాదనలుగానీ చమత్కారంగా, సరసంగా సాగేవని మనకున్న చాటు పద్యాలూ కథలూ సాక్ష్యం చెబుతాయి. తెనాలి రామకృష్ణుడిలాంటి కుఱ్ఱకవి "ఎమి తిని సెపితివి కపితము" అని తనని ఎద్దేవా చేస్తే సహృదయంతో తన తప్పుని అంగీకరించిన పెద్దనని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అదే రామకృష్ణుడు తన పద్యాన్ని దిద్దిన రాయలవారికి సంతోషంతో ఇచ్చిన చిరుకానుక మహదానందంగా స్వీకరించిన రాయలని ఒకసారి తలుచుకోండి.
ఇరవయ్యవ శతాబ్దపు తొలినాళ్ళలో జరిగిన సాహిత్య వివాదాలలో మిరియాల ఘాటు ఎంత కనిపించినా, అంతర్లీనంగా దాగిన రసజ్ఞత బెల్లప్పాకంలా అక్కడక్కడ దర్శనమిస్తుంది. తిట్లుకూడా చాలవరకూ సరసంగా, చమత్కారంగా కనిపిస్తాయి.
భావకవిత్వంపై తిరుగుబాటుగా వచ్చిన అభ్యుదయకవిత్వాన్ని కృష్ణశాస్త్రి మనస్పూర్తిగా ఆహ్వానించినా, కృష్ణశాస్త్రి కవిత్వంలోని గాఢతని అభ్యుదయకవులు ఒప్పుకున్నా, ఉత్తర దక్షిణ ధృవాలవంటి విశ్వనాథ, శ్రీశ్రీలు పరస్పర కవిత్వ పటుత్వాన్ని గుర్తించినా, మొదట్లో ఎందరో తక్కువగా చూసిన జాషువాకి స్వయంగా వేంకటశాస్త్రిగారు కంకణం తొడిగినా - ఇదంతా ఆ కాలంలో యింకా యింకిపోని రసజ్ఞత వల్లనే.
కారణాలేవిటో తెలీదు కానీ, ఈ మధ్య వస్తున్న విమర్శలూ, చర్చలూ, వాదోపవాదాలలో ఇలాటి సరస సంభాషణలుగాని, రసజ్ఞత కానీ చాలా అరుదైపోయాయి. ఏవంటే ఏవర్థం తీసుకుంటారో అనే బెంగతో ఇలాటివి తక్కువయ్యాయో. తార్కిక సిద్ధాంతాల ఎండవేడికి సరస సరోవరాలు ఆవిరైపోయాయో మరి తెలీదు. సర్వత్రా పెచ్చుపెరిగిపోతున్న అసహన భావం కూడా దీనికి కారణం కావచ్చు.
సృజనాత్మక సాహిత్యం గణితమూ కాదూ, సాంఘిక శాస్త్రమూ కాదనే స్పృహ కలగాలి. సిద్ధాంతాల చట్రాలనుంచి బయటపడాలి. ఆలోచనతో పాటు అనుభూతికీ, మెదడుతో పాటు హృదయానికి సముచిత స్థానాన్ని ఇచ్చినప్పుడే జీవితంలో రుచిపుడుతుంది. లేదంటే చప్పిడి బతుకే మిగులుతుంది!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Monday, November 17, 2008
చదువది యెంతగల్గిన...
Subscribe to:
Post Comments (Atom)
కామేశ్వర్రావు గారు,
ReplyDeleteదినపత్రికల్లో సంపాదకీయాలు చదవటం దాదాపు మానుకున్నాను, ఎంతసేపూ రాజకీయ సమీక్షలే అని. కానీ మీరు చెప్పకపోతే ఇంత చక్కటి సంపాదకీయ వ్యాసం తప్పిపోయేది. చాలా కాలానికి వచ్చిన చక్కటి సంపాదకీయం. చాలా బాగుంది. దాని ఆసరాగా మీరు చెప్పిన పలుకులూ బాగున్నాయ్. మీరన్నట్లు ఎవరిని ఎత్తిచూపితే ఏ మనోభావాలు దెబ్బతింటాయో, ఏ ఇజాల నిజాములు కోపగిస్తారో అని భయపడుతూ, అంతటా ఎందుకొచ్చిన గొడవనుకుంటూ మౌనం దాల్చటమో లేక భజంత్రీలు మ్రోగించటమో నేడు జరుగుతోంది.
చదివినది తప్పని తెలిసీ భజంత్రీలయితే మరింత విలువతక్కువ రాతలు ప్రోత్సహించటమే అవుతుంది. ఇక మనకెందుకని ఊరకుంటే, మౌనం అర్ధాంగీకారమే కాబట్టి, అదీ విలువతక్కువ రాతల్ని మరింత ప్రోత్సహించటమే.
రచయిత, పాఠకుడు ఒకరినొకరు గౌరవించుకుంటూ తప్పొప్పుల్ని గ్రహిస్తూ గౌరవంగా ముందుకెళితే పరిస్థితి బాగుంటుంది. అలానే బ్లాగుల్లోనూ జరుగుతుందనే ఆశిద్దాం.
వాదోపవాదాల మీదున్న ఆసక్తి మంచి రచనని ఆస్వాదించడంలో చూపించకపోతే వాడు రసికుడు కాదు రక్కసుడిగా తయారవుతాడు చాలా బాగా చెప్పారు.
ReplyDeleteపద్యం బావుంది.
ReplyDeleteఈ మధ్య బ్లాగుల్లో ఇంచుక రసఙ్ఞత లోపించిన మాట నిజం.
కామేశ్వర్రావు గారు,వికటకవిగారి తో సాహిత్యము - సంపాదకీయాల మీద ఏకీభవిస్తాను.
ReplyDeleteమంచి టపా.
కారణాలు ఏవైనా, రసజ్ఞత కొఱవడడమే కాదు, అసహనం కూడా పెరిగింది.
బాగుందండీ. ఈ పద్యం నేను చూడడం ఇదే మొదలు. మీ వ్యాఖ్యానం చక్కగా వుంది.
ReplyDeleteచక్కని వ్యాఖ్యానం. ముఖ్యంగా "రసఙ్ఞత" అన్న పదానికి సరైన నిర్వచనం అందించినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteఈనాడు పేపర్ లో ప్రతీ ఆదివారం ఎడిటోరియల్ ను ఇలాగే మనం ఎంజాయ్ చేయగలం
ReplyDeleteతమ వ్యాఖ్యానం చాలా బాగుంది. అయితే పద్యంలోని "ఇంచుక" "రసజ్ఞత" భావనల విషయంలో నేను పూర్తిగా ఏకీభవించలేను.రసజ్ఞత లేకపోవటాన్ని ఉప్పులేకపోవటంతో పోల్చాడు కాని ఉప్పు ఎక్కువవటంతో పోల్చలేదు శతకకారుడు. కారణం రసజ్ఞత ఎక్కువ ఐతే చెడటం అన్నది ఉండదు. ఎందుకూ అంటే ముందు రసము అన్న భావనను లోతుగా విమర్శ చేసుకోవాలి. రసో వైసః అన్న వేదోక్తి ననుసరించి రసమంటే ఆనంద మని అర్థం అవుతూ రసమంటే భగవల్లక్షణమని కూడా అర్థం చేసుకోవాలి.ఈ రసో వైసః వేదోక్తిని లాక్షణికులు కావ్యానికి కూడా అన్వయించుకుని కావ్యంలో రసం ప్రధానమైన విషయం అన్నారు. శతకకారుడు "చదువు" అన్న మాటను తను జీవించిన కాలంలో చదువు ముఖ్యంగా సంస్కృతతెలుగు కావ్యపఠనం ద్వారా జీవితాన్ని అర్థం చేసుకోవాలన్న లక్ష్యంతో వాడినట్టు అనిపిస్తుంది. మానవుని పరమలక్ష్యం ఆత్మజ్ఞానం భారతీయ తత్త్వశాస్త్రం ప్రకారం. ఐతే ఆ లక్ష్యాన్ని కేవలం తాత్త్విక (యోగ)దృష్టితోనే గాక రసదృష్టితోనూ,కళాదృష్టితోనూ కూడా సాధించ వచ్చు నన్నది మన తత్త్వశాస్త్ర రహస్యం.ఆ విధంగా రసజ్ఞతలో పరాకాష్ట చేరుకున్న సత్పురుషులకు చెడిపోయేదేమీ లేదు.అందుచేత రసజ్ఞత లోపం వల్ల చదువు నిరర్థకమవుతుంది కాని రసజ్ఞతలో ఎక్కువైపోవటం అనేదేమీ ఉండదు.ఉప్పుతో పోలిక లోపించటంవరకే నని నా అభిప్రాయం.
ReplyDeleteఉప్పు ఎక్కువ తక్కువ అనికాదు, నింపొదవెడు అంటే సరిపడా అని.
Deleteచాలా బాగుంది
ReplyDeleteచదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాల కున్న నా ఈ పద్య పాదము యే ఛందస్సుకు చెందినది
ReplyDelete✍️
Delete