తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, December 31, 2008

కూర్మి గూర్చుగాత కొత్త ఏడు!


అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఎప్పుడు తలచుకున్నా తలుచుకోకపోయినా కాలం గురించి కాల గమనం గురించి, ఇలా సంవత్సరాలు మారే సమయంలో తప్పక తలుచుకుంటాం. కొత్తపాళీగారి టపా చూడగానే నాకు దువ్వూరివారి పానశాలలోని ఈ పద్యాలు గుర్తుకొచ్చాయి:

కాల మహర్నిశం బనెడి కత్తెరతో భవ దాయురంబర
శ్రీల హరించు; మోముపయి జిల్కును దుమ్ముదుమార మేలొకో
జాలిపడంగ? నీ క్షణము సంతసమందుము; నీవు వోదు, నీ
రేలు బవళ్ళు మున్నటు చరించు నిరంతర మండలాకృతిన్

కాలం - రాత్రి పగలు రెండు భాగాలుగా కలిగిన కత్తెరలాంటిదిట. మన ఆయువనే బట్టనది కత్తిరిస్తూ పోతుంది! ఉమ్రఖయాముదో, దువ్వూరివారిదో కాని ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉంది!

గతము గతంబె యెన్నటికి కన్నుల గట్టదు; సంశయాంధ సం
వృతము భవిష్యదర్థము; వివేకవతీ! యొక వర్తమానమే
సతత మవశ్యభోగ్యమగు సంపద; రమ్య విషాదపాత్ర కీ
మతమున దావులేదు; క్షణమాత్ర వహింపుము పానపాత్రికన్

ఇదీ ఉమ్రఖయాము మతం!

కానలేము కాలపు మర్మ మేను నీవు;
ఆ జిలుగు వ్రాత చదువ సాధ్యంబె మనకు!
తెరవెనుక నేను నీవను పొరపు గలదు
ఆ విభేదము తెరయెత్త నంతరించు!

సతము దత్త్వవిచారంబు సలిపిసలిపి
మూలసూత్రంబు నెవరైన ముట్టినారె?
నేడు నిన్నట్లు, రేపును నేటియట్లు
అందని ఫలంబు చేచాప నందుటెట్లు?


కాలాన్ని గురించి ఎంతమందో కవులు కవిత్వం రాసారు. ఎందరో తాత్వికులు చింతన చేసారు. అయినా అవన్నీ అసంపూర్ణాలే! ఎప్పటికప్పుడు కాలం తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. కాలమెప్పుడూ నిత్య నూతనమైనదే!

యాదృఛ్చికంగా, ఈ మధ్యనే ఓ టపాకి రాసిన వ్యాఖ్యలో యోగిగారు Eliot కవిత తాలూకు ప్రస్తావన తీసుకువచ్చారు. యాదృఛ్చికమని ఎందుకన్నానంటే, అది Eliot రాసిన నాలుగు సుదీర్ఘ కవితల్లో ఒకటి. ఆ నాలుగు కవితలూ కూడా కాల తత్త్వాన్ని గురించినవే!
కొత్తపాళీగారు అన్నట్టు మన ఋషులు కాలాన్ని వర్తులంగా ఊహించారు. ఒక పరిధిలో ఆలోచిస్తే అది వర్తులమే. పగలు తర్వాత రాత్రి తర్వాత పగలు! కాని నిన్న పగలూ, నేటి పగలూ, రేపటి పగలూ వేరువేరు! Eliot కూడా కాలాన్ని వర్తులంగానే ఊహించాడు. కాలాన్ని గురించి ఇతను రాసిన ఆ నాలుగు కవితలూ చాలా అద్భుతంగా అనిపిస్తాయి నాకు. చాలా చోట్ల అర్థమవ్వకపోయినా, ఆంతరంగికంగా ఉన్న ఒకానొక ప్రవాహ వేగంలో, కాలంలో లాగానే కొట్టుకుపోతాం. ఆసక్తి (దానితో పాటు కాసింత ఓపిక, కూసింత ధైర్యం :-) ఉంటే చదివే ప్రయత్నం చెయ్యొచ్చు!
ఇప్పుడు అసలు విషయానికి వస్తే, Eliot కవితలో తనకిష్టమైన పంక్తులని యోగిగారు నన్ననువదించమని కోరారు. వారికి నామీద అంత నమ్మకం ఎందుకేర్పడిందో మరి! సరే నా ప్రయత్నం నేను చేసాను (ఛందోబద్ధమైన పద్యమే), దాన్నొక టపాలో పెడదామనుకున్నాను. ఇంతలో మరో అవిడియా వచ్చింది! అంతర్జాలంలో ఇంకా చాలామంది పద్య ప్రియులున్నారు కదా వాళ్ళకీ పద్య రచనలో ఒక అభ్యాసంగా ఇదిస్తే ఎలా ఉంటుంది అని. కొత్త సంవత్సరం పూటా ఒక పద్యాన్ని రాయడంలో మరింత తృప్తి ఉంటుంది కదా! మరింక ఆలస్యం దేనికి? పద్య రచనాసక్తులైన వాళ్ళందరూ ప్రయత్నించి, అనువదించి మీ మీ బ్లాగుల్లో టపా వెయ్యండిక. బ్లాగులేని వాళ్ళు ఈ మిషతోనైనా బ్లాగులు తెరిస్తే మరీ మంచిది:-)


We shall not cease from exploration
And the end of all our exploring
Will be to arrive where we started
And know the place for the first time

5 comments:

  1. భలే!! Eliot వి ఆ నాలుగు వ్యాక్యాలు అంటే నాకూ చాలా ఇష్టం. ఇంతకుముందెప్పుడో కలం కలల ఫణీంద్ర గారి బ్లాగులో కూడా నేనా నాలుగు వ్యాక్యాలు రాసినట్లు గుర్తు.

    కాకపోతే ఆ పంక్తుల్లో కాలం మీద దృష్టి కన్నా, నాకు ఫిలసాఫికల్ క్వెస్ట్ ఎక్కువ కనబడింది నాకు. నేను వాటిని అలాగే చూసి ఇష్టపడ్డా.

    ఎప్పుడో పది సంవత్సరాల క్రితం పరిచయమయిన నాలుగు లైన్లు అలా నిలచి పోయాయి మదిలో. I came full circle అని అనిపించినప్పుడల్లా గుర్తొస్తాయి.

    ReplyDelete
  2. "వారికి నామీద అంత నమ్మకం ఎందుకేర్పడిందో మరి!"

    మీకన్నా అర్హులెవ్వరండీ :)

    ReplyDelete
  3. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

    ReplyDelete
  4. నా చిన్న ప్రయతాన్ని ఇక్కడ చూడగలరు: http://pushyam.blogspot.com/2009/01/eliot.html

    ReplyDelete
  5. http://loadj.ru/
    http://logan-baks.blogspot.com/

    ReplyDelete