తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, July 24, 2008

సుకవి జీవించు ప్రజల నాలుకలమీద!


ఆధునిక పద్యకవులలో నిస్సందేహంగా ఒక మహోన్నతస్థానాన్ని సొంతంచేసుకొన్న కవి జాషువా. అతని కవిత్వంలోని విస్తృతి, గాఢత, పద్య రచనలోని వాడీ వేడీ అతన్ని గొప్పకవిని చేసాయి. కవికోకిలని చేసాయి. నవయుగ కవిచక్రవర్తిని చేసాయి!

నా కవితావధూటి వదనమ్ము నెగాదిగ జూచి రూపరే
ఖా కమనీయ వైఖరుల గాంచి భళీభళి యన్నవారె నీ
దేకులమన్న ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవుచో
బాకున గ్రుమ్మినట్లగును పార్ధివచంద్ర! వచింప సిగ్గగున్!

అన్న జాషువా ఆవేదన విన్నప్పుడు కరగని హృదయం ఉంటుందా? అలా అని జాషువా భీరువు కాదు. అతని కవిత్వంలో ఆవేదన ఎంత ఉందో, ఆవేశం తెగింపూ తిరుగుబాటూ కూడా అంతే ఉన్నాయి.

గవ్వకుసాటిరాని పలుగాకుల మూక లసూయచేత న
న్నెవ్విధి దూరినన్, నను వరించిన శారద లేచిపోవునే!
ఇవ్వసుధాస్థలిన్ బొడమరే రసలుబ్ధులు, ఘంటమూనెదన్
రవ్వలురాల్చెదన్, గరగరల్ సవరించెద నాంధ్రవాణికిన్.

అని ప్రతిజ్ఞ పూని, దాన్ని సాధించిన కవి జాషువా. తెలుగుకవిత్వం ఉన్నంతకాలం జాషువా తెలుగువాళ్ళ గుండెల్లో మార్మ్రోగుతునే ఉంటాడనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఒకవైపు అచ్చమైన అందమైన అమాయకమైన పసిపాప, మరో వైపు తెలుగుజాతిపై తెలుగుభాషపై ఉప్పొంగే అభిమానం, ఇంకొకవైపు దళితజాతి చైతన్యాన్ని లోకానికి చాటే గబ్బిలం - జాషువా కలానికి అనంత ముఖాలు. అతను రాసిన శ్మశానవాటిక పద్యాలు, ఒక కాలంలో, నోటికి రాని తెలుగువారు అరుదంటే అతిశయోక్తికాదు. పద్యాలలో అభ్యుదయకవిత్వాన్ని రాసినవాళ్ళు మరికొందరున్నా, జాషువా పద్యాలు నా హృదయాన్ని తాకినంతగా మరెవ్వరివీ తాకలేదు.
ఈ రోజు అతని వర్ధంతి సందర్భంగా అతన్ని గుర్తుచేసుకోవడం, మనం మరచిపోతున్న తెలుగుదనాన్ని ఒక్కసారి మళ్ళీ గుర్తుచేసుకోవడమే! మనలోని మానవత్వాన్ని ఒక్కసారి తట్టిలేపడమే!
అతని "తెలుగు వెలుగు" ఖండికలోంచి కొన్ని పద్యాలు.

ఒకనాడాంధ్రుని కత్తి శాత్రవ బలవ్యూహాలపై రక్తనా
టకమున్ సల్పుట విస్మరింపకుము, గాఢంబైన పాశ్చాత్య శో
భకు నీ విప్పుడు లోభివైతివి, ప్రదీప్తంబైన నీ ప్రజ్ఞ నూ
రక పోనీక సముద్దరింపుకొను మాంధ్రా! వీర యోధాగ్రణీ!


బోళావాడవుగాన నీదు విభవంబున్ సత్కళామర్మముల్
జాలా భాగము కొల్ల బెట్టితివి నీ శాస్త్రప్రపంచంబులో
మేనెల్లన్ గబళించినారు పరభూమిశాగ్రణుల్, నేటికిన్
బోలేదేమియు దిద్దుకొమ్ము బలగంబున్ స్వీయ విజ్ఞానమున్.


తలికోట యుద్ధాన నళియ రాయుని వల్ల
ప్రిదిలిపోయినది నీ వీరదట్టి
మాయనాయకురాలి మారాముడుల చేత
శమియించె నీ బాలచంద్రరేఖ
బుద్ధిమాలిన చిన్ని పొరపాటుకతమున
వితమయ్యె నీ కొండవీటి పటిమ
ఉత్సాహయుతమైన యుడుకునెత్తురు లేక
ప్రాప్తింపలేదు రాష్ట్ర ధ్వజంబు.


పరువు దూలిన నీ యనాదరణ కతన
మేటి నీ భాష పొలిమేర దాటలేదు
పరుల విజ్ఞానమునకు సంబరము పడక
కడగి యొత్తుము నీ వీర కాహళంబు


చీనా పెగోడాల సిగమీది పుష్పమై
పొడమె నీ రాతిచెక్కడపు చెణుకు
అరవ పాటకుల తంబురకు ప్రాణమువోసి
కులికె నీ చిన్నారి తెలుగుబాణి
హిమవద్గిరులదాక జృంభించి పగవాని
తరిమి వెన్నాడె నీ కఱకుటలుగు
మొగలు రాజుల సభా భూములనూరేగె
నీ జగన్నాథపండితుని పలుకు


ఎందు జూచిన నీ యశస్స్యందనములు
నడచిపోయిన జాడ లప్పుడును గలవు
దిక్తటంబుల యలర నెత్తింపవోయి
తెలుగు మన్నీల పరువు నిగ్గుల పతాక!

3 comments:

  1. జాషువా ను తలచుకోవటమంటే
    ఒక ఆత్మాభిమానధనుని మనసుని తరచిచూడడమే.

    ఒక ఉత్తుంగ తరంగఝురితో విశ్వనాధుని సైతం అబ్బురపరచిన మనీషిని స్పర్శించటమే

    తనజాతి నేపధ్యం తన పాండిత్య ప్రతిభకు అడ్డం కాదని నిరూపించిన ఒకానొక ఉత్తమ కార్యసాధకుడిని స్మరించుకోవటమే.

    తనజాతి ప్రజలు గోచీకి కూడా దిక్కులేదని తెలిసినా, నాలా సూటూ బూటూ వేసుకుతిరగాలి ఆస్థాయికి మీరు చేరాలి, అని తన జీవితాన్నే పణంగా పెట్టిన అంబేద్కర్ లా, తనబోటి వారికి చదువులే మృగ్యమైన నేపద్యంలోంచి చందోబద్ద కవిత్వాన్ని సాధించుకొన్న జాషువా ను స్మరించుకోవటం, అంటే ఒక అంబేద్కర్ను మననం చేసుకోవటమే.

    కూర్చుండమాయింట కుర్చీలు లేవు ....... అన్న పద్యంలో ఉన్నంత ఆర్ధ్రత ఏ తెలుగు పద్యంలో కనిపించగలదూ?

    ఇచ్చోటనే కదా పద్యాలు ఇప్పటికీ పల్లెటూళ్లలో రైతుకూలీల నాలికలపై తారాడే పదాలు కావా?
    ఆచ్చోట అలవైకుంఠపురములో ......... ఉండదు కాక ఉండదు. ఇది సత్యం కాదా?

    పై అభిప్రాయాలు పూర్తిగా నావ్యక్తిగతములు. అన్యదా భావించరాదు.

    కామేశ్వరరావుగారు మీ టపా చాలా చాలా బాగుంది. విషయాన్ని చాలా అందంగా చక్కగా వివరించి చెప్పారు.
    మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకొంటున్నాను.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  2. కూర్చుండ మాయింట .. కరుణశ్రీది కాదూ? నేనెందుకో అలా అనుకున్నానే!

    సాంప్రదాయ కవిత్వానికి తిరిగి పట్టంగట్టే ప్రయత్నాల్లో జాషువాకి తగినంత గుర్తింపు రాలేదేమో ననిపిస్తుంది. మన అదృష్టం కొద్దీ విశాలాంధ్ర వాళ్ళు ఆయన సాహిత్య సర్వసం తాజా గా ముద్రిస్తున్నారు.

    ఈ మధ్యనే గబ్బిలం పుస్తకం తీసి మొదటి భాగం చదువుతున్నా. పేరు వినడమే గాని, ఆ కావ్యం గురించి అసలు ఐడియా లేదు. మేఘ సందేశానికి సామానాంతర ఆలోచనతో రాశారని గ్రహించి చాలా ఆశ్చర్యపోయాను.

    వారి కవిత్వాన్ని ఇలా పరిచయం చేసినందుకు చాలా సంతోషం.

    ReplyDelete
  3. కూర్చుండ మాయింట ......... పద్యాన్ని నేనిన్నాళ్లూ జాషువా గారిదని భావిస్తున్నాను. కొత్తపాళీ గారి కామెంటు చూసాకా సరిచూసుకొన్నాను. అది కరుణశ్రీ గారిదని తెలుసుకొన్నాను. పొరపాటుకు మన్నించగలరు.

    బొల్లోజు బాబా

    ReplyDelete