తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Thursday, July 10, 2008

ఈశ్వరుడే స్వయంగా రాసిన కవిత, మీరు చదివారా!?


అనుచు, జింతా పరంపర లనెడు వర్ష
ముడిగి, నత్కీరుడను మేఘు డుత్తరంబు
నడచె, సంతోషమున దక్షిణమున నున్న
కవుల ముఖపంకజములు వికాసమొంద

శివుడు రాసిన కవిత్వం ఇది కాదండోయ్! అది తెలియాలంటే చివరకంటా చదవాల్సిందే :-) దానికి సంబంధించిన నత్కీరుని కథలోని పద్యం ఇది. శ్రీ కాళహస్తిమాహాత్మ్యంలో మన తెలుగుకవి ధూర్జటి రాసింది.

ఆధునిక కాలంలో, అలంకారాలంటే కొంత విముఖత ఏర్పడింది. అవి కవిత్వానికి బరువులన్న అభిప్రాయం చాలామందిలో కలిగింది. అది నిర్హేతుకమేమీ కాదు. సన్నగా పీలగా ఉన్న ఒక వ్యక్తి, తన చేతికి లావుపాటి చేకట్టు (bracelet) వేసుకుంటే అది ఎబ్బెట్టుగా అనిపించదూ! అదే కాస్త ఒళ్ళుకనిపించేవాడు వేసుకుంటే కనువిందుగానే ఉంటుంది. అంటే, ఒక ఆభరణం, ఉచితమైన చోట ఉన్నప్పుడే అలంకారంగా ఒప్పుతుందన్నమాట. కవిత్వ విషయంలోనూ అంతే! ఔచిత్యం చెడిన అలంకార ప్రయోగం ఎప్పుడైతే కావ్యాలలో ఎక్కువయిందో, అప్పుడు వాటిమీద ఏహ్యభావం మొదలయ్యింది.అయితే, తగిన విధంగా అలంకారాలని ప్రయోగిస్తే, అవి కవిత్వానికి ఎంత పటుత్వాన్ని కలిగిస్తాయో, ఈ పద్యం చూస్తే తెలుస్తుంది!
అలంకారాలని కవులు సాధారణంగా వర్ణనల కోసం ఉపయోగిస్తారు. అది ఒక వస్తువు వర్ణన కావచ్చు, వాతావరణ చిత్రణకావచ్చు, పాత్ర రూపురేఖల వర్ణన కావచ్చు, మహా అయితే పాత్ర మనస్స్థితిని వర్ణించడానికీ కావచ్చు. పాత్రల స్వభావాన్ని చిత్రించేందుకు అలంకారాలని వాడడం అరుదుగా కనిపించే విషయం! ఈ పద్యంలో ధూర్జటి చేసిన పని అదే!

నత్కీరుడనే ఒక దక్షిణ దేశపు కవి ఉత్తరదిశగా వెళ్ళిపోయాడు. అప్పుడు దక్షిణ దేశంలో కవులందరూ సంతోషించేరట. ఎందుకూ అన్న కవి ఊహకి రూపమే ఈ పద్యం! "ఊహ ఉత్ప్రేక్షయగును" అని మనం చదువుకున్న "అలంకారశాస్త్రాన్ని" ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇక్కడున్న అలంకారం ఉత్ప్రేక్ష అని స్ఫురిస్తుంది. ఎవిటీ ధూర్జటి చేసిన ఊహ అంటే, నత్కీరుడనే మేఘం తన చింతలనే వర్షాన్ని విడివిపెట్టి ఉత్తరదిశగా వెళ్ళిపోయినప్పుడు, దక్షిణాది కవుల ముఖాలనే పద్మాలు వికసించేయి అని. నత్కీరుడు ఉత్తరానికి వెళ్ళిపోయాక దక్షిణాది కవులందరూ సంతోషించేరని మామూలుగా చెప్పేస్తే, ఎందుకు సంతోషించేరూ అన్న సందేహం వస్తుంది. "అంతకాలం నత్కీరుడు పెట్టే బాధలనుంచి విముక్తిపొందేరనా, లేక నత్కీరుడంటే ఈర్ష్యాద్వేషాలతో ఉన్నందువల్లా?" అని. ఔచిత్యశోభితమైన ఈ అలంకారం అలాంటి అనుమానాన్ని నివృత్తిచేస్తుంది!
ఎలా అంటారా - పద్మాలు ఎప్పుడు వికసిస్తాయి? సూర్యుడి వెలుగు సోకినప్పుడు. మరి నత్కీరుడనే మేఘం ఏం చేస్తోంది? ఆ సూర్యుడి వెలుగు పద్మాలపై పడకుండా చేస్తోంది. ఇక్కడ పద్మాలు దక్షిణాది కవులు. మరి సూర్యుడెవరు? ఆ కవులని పోషించే రాజన్న మాట. నత్కీరుడు తన అహంకారంతో అధికారంతో, రాజు ఇతర కవులని గౌరవించకుండా అడ్డుపడేవాడన్న విషయం స్ఫురించటం లేదూ! అంచేత ఇతర కవులు "హమ్మాయ్యా! వీడి పీడా విరగడయ్యిందిరా" అని ఊపిరిపీల్చుకోడంలో తప్పేమీ లేదని మనకి తెలుస్తుంది. మరీ ముఖ్యంగా, నత్కీరుడి పాత్రలోని లోపం మరింతగా బయలుపడుతుంది. ఎందుకీ నత్కీరుడి లోపం మనకి బాగా తెలియాలీ అంటే, మొత్తం కథ చెప్పుకురావాలి. ఆ పని కొత్తపాళీ గారిక్కడ ఎప్పుడో చేసేసారు: http://telpoettrans.blogspot.com/2006/11/srikalahasti-mahatmyam-1-this-is-month.html
క్లుప్తంగా చెప్పుకోవాలంటే, నత్కీరుడు ఒక రాజు ఆస్థానంలో ప్రముఖ కవి. ఆ రాజు తన కొలువులోని కవులు మెచ్చేట్టుగా ఎవరు కవిత్వం చెప్పినా వాళ్ళకి బోలెడంత డబ్బిస్తూ ఉండేవాడు. ఆ రాజ్యంలో ఓ సారి తీరని కఱవు వస్తుంది. ఒక శివాలయంలో పూజారి, శివభక్తుడు, ఆ కఱవుకి తట్టుకోలేక ఊరొదిలి పెట్టాలనుకుంటాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, నేనో పద్యం రాసిస్తాను, నువ్వు పోయి రాజసభలో చదువు, నీకు రాజు కావలసినంత ధనమిస్తాడు, దాంతో నువ్వు హాయిగా బతకొచ్చు అంటాడు. సరే అని శివుడిచ్చిన పద్యం తీసుకెళ్ళి రాజసభలో చదువుతాడు. అందులో "ఆడవాళ్ళ కేశాలకి సహజమైన గుబాళింపు ఉంటుంది" అన్న అర్థం వచ్చే వాక్యాలుంటాయి. దానికి నత్కీరుడు నవ్వి, ఇలాటిది మనమెక్కడా లోకంలో చూడం, కవి సమయం కూడా కాదు అని హేళన చేస్తాడు. పాపమా పూజారి శివుడి దగ్గరికి తిరిగివచ్చి జరిగింది చెప్తాడు. దాంతో శివుడు "ఠాట్! నా పద్యంలోనే తప్పుపడతాడా, నేనే స్వయంగా వచ్చి తేల్చుకుంటా"నని రాజసభకి వెళ్ళి, ఎవడు తన పద్యంలో తప్పుపట్టిందని అడుగుతాడు. నత్కీరుడు లేచి తనెందుకు తప్పుబట్టేడో మళ్ళీ చెప్తాడు. దానికి శివుడు, పార్వతీ దేవి కేశాలు సహజంగానే సుగంధాన్ని కలిగుంటాయని నచ్చ చెప్తాడు. "అయితే ఏంటి, ఈ లోకంలో ఎవరికీ ఉండదు కాబట్టి, ఇక్కడ కవిత్వానికి వర్తించదు పొ"మ్మంటాడు. పైగా "లూలామాలపు" మాటలు మాట్లాడకని ఎద్దేవా కూడా చేస్తాడు! దాంతో శివుడికి కోపంవచ్చి, తన మూడో కన్ను చూపిస్తాడు. పోనీ అప్పటికైనా ఊరుకోవచ్చు కదా, నత్కీరుడు మరింత రెచ్చిపోయి, "నీ తలచుట్టూరా కన్నులున్నా సరే, పద్యం తప్పే! కాదని నా చేత ఒప్పించడం నీ తరం కాదు" అంటాడు. శివుడప్పుడు, వీడికిలా బుద్ధిరాదని అనుకొని కుష్టువ్యాధితో బాధపడమని శపిస్తాడు. దెబ్బకి దెయ్యం దిగుతుంది నత్కీరుడికి! లబోదిబోమంటాడు. శివుడు కాస్త కరుణించి, కైలాస శిఖరం చూస్తే నీకు శాపవిమోచనం కలుగుతుందని చెప్తాడు. ఈ కుష్టువ్యాధితో బాధపడుతూ అంత దూరం ఎలావెళ్ళడం అని విచారించి, చివరికి, తప్పదుకదా అని ఉత్తరదిశగా బయలుదేరుతాడు. అదీ ఈ పద్యం ముందు దాకా జరిగిన కథ.
ఇదో విచిత్రమైన కథ. కవికీ దేవుడికీ మధ్య, కవిత్వం గురించి గొడవరావడం మరెక్కడా చదివిన గుర్తులేదు, ఇక్కడ తప్ప. మామూలుగా ఈ కథ వింటే, నత్కీరుడు చేసినదాంట్లో తప్పేముంది అని అనిపిస్తుంది. శివుడు అన్యాయంగా అతన్ని శపించాడనికూడా అనిపిస్తుంది. కానీ కాళహస్తి మాహాత్మ్యం చదివితే ఆ పాత్ర స్వభావం అర్థమవుతుంది. దానికి పైన చెప్పిన పద్యం చాలా ఉపయోగపడుతోంది. ఇతరులని కించపరిచే గుణం నత్కీరుడిలో ఉంది. పండితులకి ధిషణాహంకారం సహజంగా ఉండవచ్చు. కానీ అది మితిమీరితేనే ప్రమాదం. ఇవతలవాళ్ళు చెప్పింది గ్రహించే స్థితిలో లేకుండా, తను చెప్పిందే వేదమని ఇతరులని కించరిచే స్థాయిలో అహంకరించే వాళ్ళు దుర్గతిపాలు కాక తప్పదని ఈ కథ మనకి నేర్పే నీతి.
నత్కీరుడు చాలా గొప్ప కవీ పండితుడూ, అందులో ఏ సందేహమూ లేదు. చివరన శివుడుకూడా అతన్ని "సాహిత్యశ్రీ!" అని సంబోధిస్తాడు. పూజారి వచ్చి పద్యం చెప్పినప్పుడు దాన్ని ఆక్షేపించడంలో తప్పులేదు. కానీ అది శివుడు చెప్పిన పద్యమని పూజారి చెప్పినప్పుడు, దానిగురించి మళ్ళీ ఆలోచించాలని నత్కీరుడికి తట్టలేదు. స్వయంగా శివుడే వచ్చి, పార్వతి కురులకి సహజగంధం ఉంటుందయ్యా అని చెప్పినప్పుడయినా, "అయితే ఓకే" అని నత్కీరుడు ఒప్పుకోవాల్సింది. అది చెయ్యకుండా, అహంకరించి, శివుడినే వేళాకోళం చేస్తాడు! "కవిత్వముల్ నిలచునే సత్యంబు వర్ణించుచో!" అన్న గ్రహింపు అతడికి రాలేదు. అందుకే అవస్థల పాలవుతాడు. చివరికి జ్ఞానోదయమై, దక్షిణకాశి అనబడే శ్రీకాళహస్తిని దర్శించి శాపవిమోచనమయ్యాక, ఆ శివుని మీద నూరు పద్యాలు (శతకమే అయ్యుంటుంది) రాస్తాడు.
"ఏ లీలన్ నుతియింపవచ్చు..." అన్న పద్యం ఈ కథ స్ఫూర్తితోనే ధూర్జటి రాసుంటాడని నేననుకోడానికి ఇదీ కారణం!

ధూర్జటి రాసిన శ్రీకాళహస్తి మాహాత్మ్యం, రస రమ్యమైన కావ్యం. చక్కని తెలుగునుడికారం కావ్యమంతటా పరిమళిస్తుంది. చదివి అర్థం చేసుకోడం మరీ కష్టం కూడా కాదు. తెలుగు కవిత్వాన్ని అభిమానించే వాళ్ళందరూ తప్పకుండా చదవాల్సిన కావ్యమిది. IISc Digital Libraryలో ఇది లభిస్తుంది.
"నవ్య భాష"లో, "మాధురీ మహిమతో" రాస్తానని ధూర్జటే చెప్పుకున్న ఈ కావ్యాన్ని చదివి ఆనందించండి!

ఇంతకీ ఈశ్వరుడు చెప్పిన ఆ పద్యం ఎవిటో చెప్పనే లేదు కదూ!
ఆ పద్యాన్ని ధూర్జటి తన కావ్యంలో చెప్పలేదు. అందులో వివాదం రేపిన అంశాన్ని మాత్రం ప్రస్తావించి ఊరుకున్నాడు.
ఆ పద్యం స్కాందపురాణంలో (సంస్కృతంలో) ఇలా ఉంది (కొద్దిగా తేడాగా):
జానాసి పుష్పగంధాన్ భ్రమర! త్వం బ్రూహి
తత్వతో నేద్య దేవ్యాః కేశ శకలాసి
తుల్యో గంధేన కిం గంధః?
(దేవి కేశశకలమునకు గల పరిమళముతో తుల్యమైన పరిమళమెందైన కలదేమొ చెప్పుము)

తమిళంలో "తిరువిడియాల్" అన్న గ్రంధంలో ఇదే పద్యం ఇలా ఉంది:
కొంగుతేర్ వాళికె అంశిరైత్ తుంబి
కామం శెప్పాదు కందదు మొళిమో
సయిరియదు కైళి యనర్పిన్
మయిలిల్ శెరియె యిట్ట్రు అరికై కూందలిన్
నఱియువుం ఉళవో నీ అఱియుం పూవే?
(పూల తేనె చక్కగా తెలిసి ఆస్వాదించే జీవితమూ, లోనికడగి ఉన్న ఱెక్కలూ గల తుమ్మెదా! నా ఉద్యానవనంలో ఉన్న కారణంగా నాపై మొహమాటంతో కాక, నువ్వు స్వయంగా తెలుసుకున్న నిజం చెప్పు. నీకు తెలిసిన పుష్పాలలో జననాంతర సౌహృదమూ, నెమలి సౌకుమార్యమూ, మల్లెమొగ్గలలాంటి పలువరుసా గల ఈ కాంతయొక్క కురులవలె పరిమళమున్న పువ్వు ఎక్కడైనా ఉందా?)

12 comments:

  1. పరిమలాలతో నింపేశారు సార్!
    తమిళ గ్రంథం పేరు "తిరువిలయాడల్" అయ్యుండచ్చు. అదే పేరిట సినిమా కూడ తీశారు. అందులో నత్కీరుడి కథ ఒక ముఖ్య ఘట్టం. రాజసభలో శివుడిగా శివాజీ గణేశన్ రెచ్చి పోయి చెప్పే డయలాగులు ఆరూజుల్లో చాలా ప్రఖ్యాతి గాంచాయి.

    ReplyDelete
  2. కొ పా గారూ,

    అది తెలుగులోకి కూడా డబ్ చేయబడి తేజాలో పలుమార్లు వేయబడిన సినిమా!

    బాగుంటుంది, ముఖ్యంగా ముసలమ్మ గొంతు చివరిలో ఆమె పాట

    ReplyDelete
  3. అద్భుతమైన పోష్టు. మంచి పద్యాన్ని చదివించారు. వివరణ చాలా బాగుంది.
    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. @ఒరెమునా - నిజమా?
    ఇక్కడ టపాకి సంబంధం లేని ఒక పిట్టకథ. ఒకసారి యూట్యూబులో ఈ సినిమా కోసం వెదుకుతుంటే ఒక క్లిప్పు కనబడింది. అందులో ఈ నత్కీరన్ సంఘటన యావత్తూ సాఫ్టువేరు ప్రాజెక్టు దృష్టిలో డయలాగులు రాసి ఒరిజినల్ దృశ్యం మీద super-impose చేశారు. భలే ఫన్నీగా ఉంది. tiruvilayadal అని వెదికితే ఇంకా కనబడచ్చు.

    ReplyDelete
  5. http://www.youtube.com/watch?v=C554FUJFYKQ


    idEnaa?

    ReplyDelete
  6. నమస్కారమండీ:
    చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ స్కూల్ లో కూర్చుని మా తెలుగు టీచర్ క్లాసు వింటున్నట్టుంది మీ టపా చదువుతుంటే. నాకు కూడా అర్ధమైయ్యేలా చెప్పారు. మీ టపాలకై ఇక పై వేయి కళ్ళతో వేచి చూడాల్సిందే!! :-)

    కొత్తపాళీ గారు, ఒరెమునా గారు:
    ఆ లంకె తెలిపినందుకు ధన్యవాదాలు!! రేపు ఆఫీసులో ఫన్నే ఫన్ను!!

    ReplyDelete
  7. చాలా బాగా రాసారండీ వివరణ. కృతజ్ఞతలు.

    ReplyDelete
  8. చాలా బాగుందండి.శివుడు చెప్పిన శ్లోకం తెలుగు పద్య రూపంలో కూడా వచ్చిందని గుర్తు.ఎక్కడ చూసానో ఆ పద్యం ఏమిటో గుర్తుకు రావటంలేదు.

    ReplyDelete
  9. oremuna - yes! thanks.
    narasiMha - ఆ పద్యం కాళహస్తి మాహాత్మ్యంలో నేరుగా చెప్పరు. వాదన వచ్చినప్పుడు మాత్రం స్త్రీ కేశపాశపు సహజ సుగంధంఉ గురించి ప్రస్తావన వస్తుంది.

    ReplyDelete
  10. దీనికి సంబంధించిన తమిళ కథ, తమిళ పద్యం చంద్రిమ బ్లాగులో చంరమోహన్ గారు చక్కగా వివరించారు.

    ReplyDelete
  11. kALahasti mahAtmyaMlO:
    "siMdhura rAjagamanA dhammillaMbu sahaja sugaMdhammbu" ani uMdaMtE

    ReplyDelete
  12. అవును, "సింధురరాజగమనా ధమ్మిల్లంబు సహజసుగంధంబు" అన్నదే వివాదానికి దారితీసిన కీలక అంశం. కాని అది పూర్తి పద్యం కాదు కదా.

    ReplyDelete