తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, July 30, 2008

రెండు కన్నీటి చుక్కలు


మొన్న మళ్ళీ పేట్రేగిన బాంబుల భీభత్సం మనిషిగా మళ్ళీ సిగ్గుతో చచ్చిపోయేలా...
ఏదో ఆవేశం ఏదో ఆవేదన ఎవీ చెయ్యలేని నిస్సహాయత... రెండు కన్నీటి బిందువులై రాలిపడింది.

మరల చెలరేగె విద్రోహ మారణాగ్ని
మరల కన్నీరు పెట్టెను భరతభూమి
మరల నరజాతి చరిత నెత్తురుల దడిసె
మానవత్వము మరణించె మరల మరల

ఎన్నడైన నరుడు, ఈ మృగత్వము వీడి
పూర్ణుడైన మనిషివోలె యెదిగి
శాంతి లోకమందు స్థాపించునో? చీడ
పురుగు లెక్క పుడమి చెరచి చెడునొ!

రెండు కన్నీటి చుక్కలు, రెండు పద్య
వేదనా పుష్పములు, రాల్చి, వేగ మరచి
తిరిగి యెప్పటి రీతి నే మెరుగనట్లు
బ్రతుకు సాగింతు జీవచ్ఛవమ్ము రీతి...

8 comments:

  1. అవును నిజమే, నాకూ అలానే అనిపించింది. మూడో పద్యంతో మన అసహాయతను సరిగ్గా చెప్పారు.

    ReplyDelete
  2. చాలా బాగా చెప్పారు ... పైన వికటకవి గారు అన్నట్టు మూడో పద్యం మాత్రం మన అసహాయతను జీవితంలో ముందుకు సాగిపోయే విధానం కళ్లకు కట్టినట్టుగా చెప్పారు. అభినందనలు

    ReplyDelete
  3. తిరిగి యెప్పటి రీతి నే మెరుగనట్లు
    బ్రతుకు సాగింతు జీవచ్ఛవమ్ము రీతి...

    అ...ల..వా...టు పడిపోతున్నాము.. దేనికైనా!! :-(

    ReplyDelete
  4. ఏక్కడో మూల మనలోనూ (నాలోనూ) ఆ మృగత్వం ఉందేమోనన్న అనుమానం పీడిస్తుంటుంది.

    బాధితుల మీద జాలి,సానుభూతి కన్నా, ఆ వార్తా విశేషాల కోసం రకరకాల టీవీ చానెళ్ళు చూడ్డంలో ఉన్న ఆతృత, అభిలాష ఎక్కువ గా కనిపిస్తుంటుంది.

    నిజంగా మనం జీవచ్చవాలే.

    ReplyDelete
  5. మీ ఆవేదన అర్ధమయ్యింది - మళ్ళీ రెండు రోజుల్లో అందరూ వీటిని మర్చిపోయి ఏమీ జరగనట్టే ప్రవర్తిస్తారు, దేశ భద్రత మీద రాజకీయ నాయకుల్ని నిలదీయరు.

    మూడో పద్యం ఆఖరి పాదం చదవగానే అల్లసాని పెద్దన వారి "ఎదురైనచో తన మదకరీంద్రము నిల్పి" గుర్తుకొచ్చింది

    ReplyDelete
  6. జీవఛ్ఛవాలుగా ఉండనక్కర్లేదు. మన పరిధిలో మనం చెయ్య గలిగింది చెయ్యొచ్చు. బహుశా ఇదేనేమో కర్మ యోగమంటే!

    ReplyDelete
  7. రవిగారు, మీరన్నది కొంతవరకూ నిజమేనండీ. దాన్ని టీవీ ఛానళ్ళవాళ్ళు బాగా సొమ్ముచేసుకొంటున్నారు. ఈ ఛానళ్ళు చూపించే దృశ్యాలు మన మనసుల్ని మరింత మొద్దిబారిపోయేట్టు (insensitive) చేస్తున్నాయి! అందుకే నేనీమధ్య ముఖ్యాంశాలు మాత్రం చూసి మార్చెస్తున్నాను.
    కొత్తపాళీగారు, ఈ విషయంలో ఏం చెయ్యగలనో నిజంగానే తెలీలేదండీ. మన తృప్తికేదో చేసామని కాకుండా, ఎంతోకొంత ప్రభావం చూపించే పనేదైనా చెయ్యగలనా అని...

    ReplyDelete