తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, May 25, 2008

అటజని కాంచె...


అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్

మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం.


నిజానికి మనుచరిత్ర మనుచరిత్ర కాదు - మను సంభవ చరిత్ర, "స్వారోచిష మను సంభవము". మనువుల్లో ఒకడైన స్వారోచిషుడి జన్మ వృత్తాంతం. అయితే మనుచరిత్ర అనగానే గుర్తొచ్చేది వరూధినీ ప్రవరాఖ్యులు. వీళ్ళకీ ఆ స్వారోచిష మనువుకి ఉన్న సంబంధం యేమిటి? ఆ మనువు నాన్నమ్మ వరూధిని! అల్లసాని అక్కడనుంచి ప్రారంభించాడు కథని. ఆ భాగాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాడంటే, అదే అసలు కథేమో అన్నంతగా ప్రచారం పొందింది. ఇదొక తమాషా అయిన కథ. ఇంతకీ ప్రవరుడెవరయ్యా, ఆ మనువు తాతగారేనా అంటే, కాదు. ఒక రకంగా అవును! అందికే ఇది విచిత్రమైన కథ అయ్యింది. అసలిదొక allegorical story అని నాదొక సిద్ధాంతం ఉంది. దాని గురించి మరెప్పుడైనా ముచ్చటించుకుందాం.
ప్రస్తుతానికి వస్తే, ప్రవరుడి ఊరు అరుణాస్పదపురం. అతను "ఆ పురి బాయకుండు", అంటే ఆ ఊరిని విడిచి ఎప్పుడూ వేరే ఊరికి వెళ్ళలేదు! అదేంటి, మరీ బొత్తిగా ఏ పెళ్ళికో పేరంటానికో అయినా పొరుగూరు వెళ్ళి ఉండడా అంటే అలా కాదు. వేరే ఊళ్ళో ఉద్యోగానికి కానీ touristగా చూడ్డానికి కానీ ఎప్పుడూ వెళ్ళలేదని. కానీ యాత్రలు చెయ్యాలనే కోరిక మాత్రం ఉంది. యాత్రలంటే ప్రణయ యాత్రలో విహార యాత్రలో అనుకునేరు! తీర్థ యాత్రలు. మరి ఆ రోజుల్లో ఇప్పట్లా విమానాలూ అవీ లేవాయె, ఉన్నాయనుకొన్నా మానవులకి మాత్రం అందుబాటులో లేవాయె. తీర్థయాత్రలు చెయ్యడమంటే మాటలా మరి? కాబట్టి అతని కోరిక కోరికగానే ఉండిపోయింది. ఒక రోజు అనుకోకుండా ఓ సిద్ధుడు అతనింటికి వచ్చి, "నేను భూమంతా చుట్టేసాను, ఇది చూసాను అది చూసాను" అని ఓ చెప్పేసరికి, పాపం ఈ ప్రవరుడికి కోరిక మరింత పెరిగిపోతుంది. ఎదోలాగ అతని దగ్గరనుంచి ఒక పాద లేపనం సంపాదిస్తాడు. సంపాదించిందే తడవుగా హుటాహుటిని హిమాలయాలకి బయలుదేరేస్తాడు, ఇంట్లో చెప్పకుండానే! మొదటిసారిగా, ఊరిని కూడా విడిచి వెళ్ళని ఆ ప్రవరుడు, హిమాలయాలని చూసినప్పుడు అవి ఎలా కనిపించాయో చెప్పే వర్ణన ఈ పద్యం.

"శిరస్-సరజ్-ఝరీ" అన్నప్పుడు పైనుంచి కిందకి దూకే సెలయేళ్ళూ, "ముహుర్-ముహుర్-లుఠత్" అన్నప్పుడు ఆ సెలయేటి నీళ్ళు రాళ్ళకి తాకే సవ్వడీ, "అభంగ తరంగ మృదంగ" అన్నప్పుడు అవి చేసే మృదంగ నాదం, ఇవన్నీ మనకి కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఇలాటి రచననీ ఇంగ్లీషులో Onomatopoeia అంటారు. పదాలకుండే శబ్దాలు, వాటి అర్థాన్ని ప్రతిధ్వనించడం అన్నమాట. దీనినే "వికట కవిత్వం" అంటారని యు.ఎ.నరసింహమూర్తిగారు "కవిత్వ దర్శనం" అన్న పుస్తకంలో ప్రతిపాదించారు.

కిందటిసారి అన్నాను, వర్ణనలు సాధారణంగా కథలో విశ్రాంతి కోసం ఉంటాయని. ఇది అలాటి వర్ణన కాదు. ముఖ్య కథాభాగానికి ముఖ ద్వారం లాంటిది ఈ పద్యం. ఇది మనుచరిత్రలోని రెండవ ఆశ్వాసం(chapter) మొదట్లో వస్తుంది. ఆ ఆశ్వాసం మాంచి రసవత్తరంగా సాగే కథా భాగం, కథలో ముఖ్యమైన సంఘటనలు జరిగే భాగం. ఇందులో వరూధిని వాక్చాతుర్యం అమోఘంగా ఉంటుంది. వాటిల్లో ఉన్న సారం మాట ఎలా ఉన్నా, ఆ మాటలు మనలని మంత్రముగ్ధులని చేస్తాయి. ఈ పద్యమూ అంతే! ఇందులో అర్థం ముఖ్యం కాదు. పదాలూ, పదాల పొహళింపూ, శబ్ద సౌందర్యం, ఇవన్నీ మనలని మంత్రముగ్ధులని చేస్తాయి!
శబ్దం ప్రధానమైన ఇలాటి కవిత్వం అన్ని చోటలా అందాన్నివ్వదు. ఎక్కువైతే అజీర్తి చేస్తుంది కూడా! దీన్ని తగిన సందర్భంలో తగిన పాళ్ళలో వాడేడు కాబట్టే పెద్దన ఆంధ్రకవితా పితామహుడయ్యాడు. మనుచరిత్రలో ఇలాటి పద్యాలని మనం ఈనాటికీ ఆనందిస్తున్నాం. ఇది యెక్కువైన ఇతర ప్రబంధాలూ, వాటిని రాసిన కవులూ మరుగునపడిపోయారు.
ఈ పద్యంలో ఛందస్సుకి సంబంధించిన విశేషాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ పద్యాన్ని చంపకమాలలో ఎందుకు రాసుంటాడు పెద్దన అని ఆలోచిస్తే, "అటజని కాంచె" అన్న ప్రారంభం కోసం అని అనిపిస్తుంది. మొదటి నాలుగు లఘువులూ ఆ వెళ్ళడంలోని వేగాన్ని సూచించడం లేదూ! ఇక మొదటి పాదంలో "అంబర చుంబి" దాకా చంపకమాల నడకతో సాగిన పద్యం, హఠాత్తుగా "శిరస్సరజ్ఝరీ" (తడక్-తడక్-తడక్) అన్న నడకలోకి మారిపోడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చంపకమాలతో ఇలాటి నడక సాధించవచ్చా అనిపిస్తుంది. అలానే రెండవ పాదంలో "అభంగ తరంగ మృదంగ" (తధింత-తధింత-తధింత) అన్న నడకకూడా!
ఇక ఇందులోని అర్థం విషయానికి వస్తే - "అటజని కాంచె భూమిసురుడు". ఏమిటి చూసాడు? "శీతశైలమున్" - హిమాలయాన్ని. ఎలాంటిదా హిమాలయం అన్నది మొత్తం పద్యం, రెండు పొడవైన సమాసాలు!
"అంబర చుంబి శిరః" - ఆకాశాన్ని ముద్దాడుతున్న శిఖరాలనుండి, "సరత్ ఝరీ పటల" - ప్రవహిస్తున్న సెలయేళ్ళ (జలపాతాల) గుంపులో, "ముహుర్ ముహుర్ లుఠత్" - మాటిమాటికీ దొరలుతున్న, "అభంగ తరంగ మృదంగ" - ఎడతెగని తరంగాలనెడి మద్దెలలు చేసే, "నిస్వన స్ఫుట నటన అనుకూల" - ధ్వనికి తగినట్లు నాట్యం చేసే, "పరిఫుల్ల కలాప" - విప్పారిన పింఛం కలిగిన, "కలాపి జాలమున్" - నెమళ్ళ గుంపుతో కూడినది. ఆకాశాన్నంటే పర్వత శిఖరాలనుంచి కిందకి ఉరుకుతున్న జలపాతాల తరంగాలు అనే మృదంగాలు చేసే ధ్వనికి అనుకూలంగా పురి విప్పి నాట్యం చేస్తున్న నెమ్మళ్ళ గుంపుతో ఉన్నది ఆ హిమాలయం. ఈ వర్ణనలో గొప్పతనం ఏమిటంటే, కవి హిమాలయ శిఖరాలనీ, జలపాతాలనీ, నెమళ్ళనీ అన్నిటినీ ఇక్కడ చిత్రించాడు. ఏదో వేరే వేరేగా చూపెట్టడం కాకుండా వాటన్నిటినీ చక్కగా లింక్ చేసాడు. అదీ కవి ఊహ అంటే! ఇంతకన్నా గొప్ప విషయం మరోటి ఉంది. నెమళ్ళు సాధారణంగా పురివిప్పి యెప్పుడాడతాయి? ఉరుముల శబ్దం విన్నప్పుడు, వాన పడేటప్పుడు. ఇక్కడ ఈ జలపాతాలు చేసే శబ్దానికి నాట్యం చేస్తున్నాయంటే, ఆ జలపాతాల హోరు మేఘ గర్జనలా ఉందన్నమాట! శిఖరాలు ఆకాశమంత యెత్తున్నాయి కాబట్టి, ఆకాశంలోని మేఘాలే వర్షిస్తున్నట్లుగా ఆ జలపాతాలున్నాయన్న మాట! ఇవేవీ పద్యంలో సూటిగా చెప్పలేదు, స్ఫురింప చేసాడు! దీనినే మనవాళ్ళు "అలంకార ధ్వని" అంటారు.
ఒక విషయాన్ని చెప్పకుండా చెప్పడమూ, చూపించకుండా చూపించడమే కదా కవిత్వమంటే!
ఇక, అక్కడ నెమళ్ళే కాక ఏనుగులు కూడా ఉన్నాయి. "కటక చరత్" - ఆ పర్వతాల మధ్యలో తిరిగే, "కరేణు కర" - ఏనుగుల తొండాల చేత, "కంపిత సాలము" - కదిలించి వెయ్యబడ్డ చెట్లు కలది, ఆ హిమాలయం. ఇక్కడకూడా కవి మనకి ఒక still photograph కాకుండా videoని చూపిస్తున్నాడు. ఏనుగులని మాత్రం చెప్పి ఊరుకుంటే అది still photograph అయి ఉండేది. అవి కదిపి కుదిపేస్తున్న చేట్లని కూడా చూపించి దీన్ని videoగా మార్చాడు అల్లసాని.
ఇదే "అల్లసానివాని అల్లిక జిగిబిగి"!

50 comments:

  1. వావ్ !!! మంచి పూత రేకు లాంటి పద్యం వినిపించారు. ఈ పద్యం చిన్నప్పుడు ఎక్కడొ చూసి, కంఠస్తం చేసినది తప్పితే, వెనుక ఇంత అద్భుతమైన కథ ఉందని అనుకోలేదు.

    "ఓ చతురాస్య వంశ కలశొదధి పూర్ణ శశాంక.." దీన్ని కూడా విడమర్చాలి మీరు తప్పకుండా ఓ సారి.

    ReplyDelete
  2. చాలా బావుందని వేరే చెప్పాలా మహాశయా? ఇంతకీ వరూధిని ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదో పద్యాన్ని ఎప్పుడు విప్పుతారు?
    మీకు కొల్లూరు శ్రీరామమూర్తిగారు తెలుసుగా - మన హైస్కూల్లో తెలుగు పండిట్. మేం ఎనిమిదోక్లాసులో ఉన్నప్పుడు మా అందరిచేతా భువనవిజయం నాటకం వేయించారు - స్కూలు వార్షికోత్సవాలలో. అందులో కందాళ వెంకటాచార్యులగారి అబ్బాయి రమానాధ్ పెద్దన, నేను తిమ్మన, నారాయణదాసుగారి మునిమనవడు రామ్‌జీ అని - వాడు రామలింగడు. అందులో పెద్దనగారు ఈ పద్యం చదువుతే - దానికి కొల్లూరు మాస్టారి చమత్కార భాష్యం:
    రామలింగడు - "అయితే తాతా, ఇంతలు కన్నులుండ అనూరుకొన్నావే, ఎంతో చెప్పకపోతే ఎట్లా?" అనడుతాడు. పెద్దనగారు తన కుర్చీలోంచీ లేచి రామలింగడి దగ్గరకి వెళ్ళి సున్నితంగా అతని చెంపచెళ్ళుమనిపించి వచ్చి కూర్చొంటాడు. అప్పుడు రామలింగడు "ఓ - చెంపకు చారెడు అన్నమాట, తాత గారు ఎప్పుడూ మాటలతో ఏది చెప్పరు, అంతా శభ్ధంతోనే (ద్వని)తోనే" అంటాడు.

    నేను కూడా కళాపూర్ణోదయం, మనుచరిత్ర మీరన్నట్టు ప్రతీకాత్మక కథలు అనే అనుకొన్నాను, కళాపూర్ణోదయం లోని ప్రతీకలపై ఎప్పుడో ఒక చిన్న వ్యాసం కూడా రాసాను - కాని, అదింకా నేననుకొన్నట్టు రాలేదు. మనుచరిత్రని ప్రతీకగా ప్రతిపాదించే మీ వ్యాసంకోసం - "ఇంతలు కన్నులు చేసుకొని" ఎదురు చూస్తూన్నా.
    --నాగరాజు (సాలభంజికలు)
    http://canopusconsulting.com/salabhanjhikalu

    ReplyDelete
    Replies
    1. పద్య పద్యాన్ని చదివి ఊహాలోకంలో హిమాలయాలకు పయనమయ్యాను.వరూధినికి నన్నయ పద్యంలోనే కాదు తెలుగు సాహిత్య చరిత్రలో జీవం పోశారు. గొప్ప వివరణ. ధన్యవాదాలు.

      Delete
  3. enimido class lo chadiva ee padyam, inka gurtundi.. aa padala allika valle anipistundi.. vidamarchi asalu andam telsukunela chesaru...

    ReplyDelete
  4. చక్కని పద్యం విడమర్చి చెప్పినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. చాలా బావుంది మేస్టారూ.
    "అభంగ తరంగ మృదంగ" (తధింత-తధింత-తధింత) .. మొత్తానికి ఈ వరుస "జ" గణాల్లో ఏదో మహత్తు ఉందన్న మాట .. నాకు మళ్ళీ నిశాంత మహీజ గుర్తొస్తోంది.

    శబ్దం ధవ్నించేట్టు పదాల కూర్పు చేసినంత మాత్రాన నర్సింహ మూర్తి గారు దీన్ని వికటకవిత్వం అనడమెందుకో?

    అన్నట్టు ఆముక్త మాల్యదలో మాలదాసరి వటవృక్షాన్ని చూసే పద్యం కూడా ఇలాగే ఉంటుంది కొంచెం.
    http://telpoettrans.blogspot.com/2006/12/this-story-starts-off-6th-and-last.html

    ReplyDelete
  6. నచ్చిందని చెప్పినవాళ్ళందరికీ నెనరులు.
    నాగరాజుగారు,
    మొత్తానికి పెద్దనకి అలాటి చేతివాటం కూడా ఉండేదన్నమాట:-)
    మనుచరిత్ర ప్రతీకాత్మక కావ్యం అన్నది ఇంకా ఊహ స్థాయిలోనే ఉంది. సిద్ధాంతంగా ప్రతిపాదించడానికింకా సమయం పడుతుంది.

    కొత్తపాళి గారు,
    ఇక్కడ నరసింహమూర్తిగారు తేలిక దృష్టితో దీన్ని వికటకవిత్వం అని అనలేదు. సంస్కృత ఆలంకారికుల ప్రకారం వికటత్వం అనేది కవిత్వానికున్న గుణాలలో ఒకటి. అర్థస్ఫోరకమైన శబ్దాలుకలిగిన పదాలతో చెప్పే కవిత్వం వికటకవిత్వంగా సంస్కృతాలంకారికులు గుర్తించారని అతను వివరించారు.
    తెలుగులో ఇది అర్థం మారి, శబ్దాడంబరంతో హాస్యస్ఫూరితమైన కవిత్వం అన్న వాడుక వచ్చింది.

    ReplyDelete
  7. జిగిబిగి అంటే గజిబిజి అన్నట్టుగా వుంది. :)
    జిగి మరియు బిగి అంటే చమక్కు, బిగువు అనుకోవాలేమో!?

    ReplyDelete
  8. జిగిబిగి అంటే బ్రౌణ్యంలో అర్థం చెప్పారు.

    జిగి n. Brilliancy కాంతి, చల్లని వెలుగు.

    జిగిబిగి adj. Puzzling, surprizing, strange, striking (as beauty.)

    జిగిలి adj. Plump, fleshy, rounded. చిక్కని, Fine, handsome, bright, nice, pretty. చక్కని.

    ReplyDelete
  9. విశ్వనాథ సత్యనారాయణ "అల్లసానివాని అల్లిక జిగిబిగి" అన్న వ్యాసంలో అతనుకూడా ఇదే చర్చ లేవనెత్తి ఇలా అన్నారు.

    జిగిబిగి ఒక్కశబ్దమా, రెండు శబ్దములా? జిగి యనగా కాంతి, బిగి యనగా బిగువు. జిగిబిగులు కావలె. లేదా సమాహారద్వంద్వము చేసి యేకవద్భావమనుకొనవలె. కానీ లోకములో నీ శబ్దమును చిక్కుగానున్న పరిస్థితికి చెప్పుట కలదు. "అది యెంతయు జిగిబిగిగా నున్నది" అని లోకము. రెండును రెండు శబ్దములైనచో, నీ రెండుగుణములు పెద్దనగారి శైలియందు కలవు. ఆయన సర్వరచనయు కాంతితో కూడిన బిగువు కలదియే. ఈ జిగిబిగియే పురాణకవితనుండి కావ్యకవితను వేఱుచేయునది. అది వేఱువిషయము.

    ReplyDelete
  10. idi memu 10th class lo telugu subj pravaruniswagatam lo chadivamu..naku ippatiki notiki vachhu............baga prasa kooda kalasina padyam..........

    ReplyDelete
  11. చాలా బాగా వివరించారు. నేనెప్పుడూ ఈ పద్యం చదువుకోలేదు కాని రవి గారు చెప్పిన పద్యాన్ని (ప్రవరుడు తన ఇంటికి వచ్చిన సిద్ధుడితో మాటలు) చదువుకున్నాం. (మీ మెట్టిన యెడ ప్రయాగ ... మొదలైనవి)

    మా తెలుగు మాస్టారు గారు కూడా ఇంత బాగా వివరించలేదు (మేం చదువుకున్న పద్యాలని) :-)

    ~సూర్యుడు :-)

    ReplyDelete
  12. Himalaya parvatamulanu inta adbhutam gaa, kalla ku kattinattu varninchina, allasaani varidi, tiruguleni pandityam sir. Eee padyam nu chadivina koddi, chavaalani anipistadi..Thanks for sharing sir

    ReplyDelete
  13. పదవ తరగతిలో, 'ప్రవరుని స్వగతం' అనే పాటములో మొదటి పద్యంగా చదువుకున్నాను.(2001 లో). పదేళ్ళు గడిచినా ఈ అల్లిక వల్ల ఆ పద్యం మర్చిపోకుండా ఉండగలిగాను. ఈ పద్యానికి అద్భుతమైన వ్యాఖ్యానం అందించినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. పాటములో కాదు పాఠములో అని రాయాలి

      Delete
  14. కొన్ని పద్యాలు ఒక్కొక్కసారి చదివినప్పుడు ఒక్కొక్క భావాన్ని స్ఫురణకు తెస్తాయి. ఈ మధ్య ఒక అలంకారగ్రంథంలో చదివాను. "ట" వర్గం శృంగార విముఖత్వాన్ని సూచిస్తుందట. ఆ చెప్పినాయన "ట" వర్గంలో చెప్పిన శృంగారపద్యాన్ని ఉటంకించి, పద్యం ఎంత బావున్నా అది అనౌచిత్యమని కొట్టి పడేస్తాడు.

    ఆ వివరణ చదువుతున్నప్పుడు ప్రవరుడు, ఈ పద్యమూ గుర్తొచ్చాయి. ప్రవరుడు శృంగార విముఖుడని సూచించడానికి పెద్దన గారు "ట" వర్గం వాడి ఉంటారా అని నా అనుమానం. ఏమో? ఆయన ఎంతకయినా సమర్థుడు. అలంకారశాస్త్రం గురించి పెద్దనకు తెలిసి ఉండకపోదు.ఒకవేళ అది నిజమైతే, పెద్దనకు ఎక్కడున్నా వినబడేట్టు చప్పట్లు!

    ReplyDelete
  15. మంచి పద్యం అండీ.. నాకు ఇప్పటికీ కంటత ఈ పద్యం.. ధన్యవాదములు.

    ReplyDelete
  16. మనసకు ఆనందం....కూర్చింది.

    ReplyDelete
  17. Thanks to Yandamoori garu.. for enlightening your beautiful blog in my facebook followups. If not I would be really missing a great critic.. Hatsoff...

    ReplyDelete
  18. ఆహా తెలుగు లిటరేచర్ చేయాలనిపిస్తుంది

    ReplyDelete
  19. చాలా చక్కగా వివరించారు...ధన్యవాదాలు.....

    ReplyDelete
  20. చాలా చక్కగా వివరించారు...ధన్యవాదాలు.....

    ReplyDelete
  21. naku chala estamm ee poemnmm superrr

    ReplyDelete
  22. జై తెలుగువతల్లి

    ReplyDelete
  23. నేను 10వ తరగతి లో చదివిన పద్యము ఇది. ప్రవరుని స్వగతం లోది . అప్పుడు మాకు తెలుగు టీచర్ మాధవరావు గారు చాల చక్కగా చెప్పేరు . నిజం గా ఇప్పటి గుర్తుంది. ఈ పద్యము మరచిపోలేము మా మాస్టారు గారిని మరచిపోలేము. 

    ReplyDelete
  24. Sorry for typing in English Language..

    Excellent Poems and story ----- I still remember this poem.

    What about the poem. Aakasambuna artharaathramula ...

    ReplyDelete
  25. Na 10th class lo di e poem ipatiki roju ku okasaryna rivison chesukyntanu ana istam exlent story of the poem istill remember this poem

    ReplyDelete
  26. ఈ పద్యాన్ని నేను 1967లో 8వ తరగతి చదివేటప్పుడు ఆచారి మాష్టారు గారు చెప్పారు M.V.D.M హైస్కూలు, వైజాగ్ లో.ఇప్పటికి ఆ పద్యాన్ని మరిచిపోలేక పోతున్నాను.ఇంత చక్కగా వివరించిన మీకు నా ధన్యవాదాలు.

    వానపల్లి గంగరాజు,
    13.1.2020,
    విశాఖపట్నం.

    ReplyDelete
    Replies
    1. 1999 సంవత్సరం లో పబ్లిష్ అయిన తెలుగు పాఠ్య పుస్తకం లో ప్రవరుని స్వగతం పాఠం లో ఈ పద్యం ఉంది సర్. ఇప్పుడు ఆ సిలబస్ మారింది.

      Delete
  27. ఎప్పుడో పద్యం, భావం చదివాము సర్
    కానీ ఇంత అందముగా అర్థం చేసుకోలేకపోయాను ...

    కానీ ఈ రోజు దీన్ని కచ్చితంగా కంఠతా చేసి నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్న గాని వాళ్లకి నేర్పిస్తాను... (నా కూతురికి ప్రత్యేకంగా!)

    ReplyDelete
  28. I don't have telugu font with me
    But u explained it with such an ease.
    Hats off sir
    Thank you very much and keep posting

    ReplyDelete
  29. ENTHA BAAGUNDO PADYAM, ANTHA BAAGAA UNDI CHEPPIN ARTHAM.

    ReplyDelete
  30. ఒక అద్భుతమైన పద్యానికి, మీ మహాద్భుతమైన వ్యాఖ్యానం తోడుకావడం నిజంగా నాకు మిక్కిలి ఆనందాన్ని కలిగించింది...మీకు ధన్యవాదాలు సార్...

    ReplyDelete
  31. Supr naku malli chinnappati gurtu vayasu vachestundi

    ReplyDelete
  32. ఇంతటి చక్కని పద్యం వింటుంటే రోమాలు నిక్క బొడుస్థున్నాయి. తెలుగు భాష అంటే ఇదే మరి!

    ReplyDelete
  33. It is so pleasurable to read and enjoy the poem and it's meaning. Please add more.. for the people like us to expand the greatness our literature.

    ReplyDelete
  34. Akkada "KALAPA" "KALAPI" ANTE MAGA nemali AADA nemali, ani anukuntunnanu
    Meeru emantaaro koncham cheppandi

    ReplyDelete
  35. నేను 10వ తరగతి లో చదివిన పద్యము ఇది. ప్రవరుని స్వగతం లోది . అప్పుడు మాకు తెలుగు టీచర్ v. Krishnamachary ZPHS THADICHERLA KARIMNAGAR గారు చాల చక్కగా చెప్పేరు . నిజం గా ఇప్పటి గుర్తుంది. ఈ పద్యము మరచిపోలేము మా మాస్టారు గారిని మరచిపోలేము.

    ReplyDelete
  36. చాలా బాగుంది

    ReplyDelete
  37. Studied in 10th Class in 1963-64. Great

    ReplyDelete
  38. మంచి వివరణ సార్

    ReplyDelete

  39. ఈ పద్యం నేను ఈ మధ్య ఒక తెలుగు సినిమాలో చూశాను.. పేరు "ఒక తెలుగు ప్రేమకథ" తెలుగు భాష గురించే వుంటుంది.. కథానాయకుడు,పిల్లలకు తెలుగు భాష గొప్పదనం చెప్పబోతూ ఈ పద్యం పాడతాడు.. ఆ తర్వాత తెలుగు అక్షరమాల,పద్యం తెలుగు వారి సొత్తు? సామెత ఎలా వచ్చింది, ఛందస్సు, అలంకారాల గురించి ఒక మంచి తెలుగు పాటలో జనరంజకంగా వీక్షింపజేస్తాడు.. ఓటిటి లో విడుదలయిన చిత్రం అనుకుంటాను..అయినా ఈ మధ్య తెలుగు చిత్రాల్లో తెలుగే కనుమరుగవుతోంటే తెలుగు పద్యాలు, పాటలు గురించి ఎవరు పట్టించుకుంటారులే.. "అటజని"పద్య భావార్థం చాలా బాగా వివరించారు.. ధన్యవాదాలు

    ReplyDelete
  40. మంచి పద్యం అండీ.. నాకు ఇప్పటికీ కంటత ఈ పద్యం.. ధన్యవాదములు

    ReplyDelete
  41. ఈ పద్యం చాలా ప్రసిధ్ధమైనది. చక్కగా వివరించారు.
    ఇక్కడ పద్యంలో ఉన్న కరేణువు అన్న పదం గురించి కొంచెం చెప్పుకోవలసింది ఉంది. కరేణు శబ్దానికి సామాన్యార్ధంగా ఏనుగు అని చెప్పుకున్నా విశేషంగా ఆడయేనుగు అన్న అర్ధం ఒకటి ఉంది. ఏనుగులు మందలుగా తిరుగుతాయి. వాటిలో ఒక పెద్దమగ యేనుగున్నూ దానిని ఆశ్రయించుకొని అనేక ఆడయేనుగులూ. వెరసి ఒక గుంపు సామాన్యంగా. ఈ యేనుగులు అద్దాల్లాంటి మంచుకొండచరియల ప్రక్కనుండి పోతున్నప్పుడు ఆ మంచుఅద్దాల్లో వాటి ప్రతిబింబాలను ఆయేనుగులు చూస్తున్నాయి. (సాలము అన్న పదానికి కొండచరియ అన్న అర్ధం చెప్పుకోవచ్చును. ఎందుకో తరువాత చెప్తాను.) ఇవేవో క్రొత్త యేనుగులూ ఇవి గుంపులో జొరబడటానికి చూస్తున్నాయీ అన్న భ్రమతో అసూయతో అవి ఆ దర్పణదృశ్యమానకరిబింబాలతో తలపడటానికి యత్నం చేస్తున్నాయి. ఈ సంఘటనను ఫోటితీసి చెప్పే ప్రయోగం ఈపద్యం కరేణుకరకంపితసాలము అన్నది. కంపితసాలము శీతశైలము అని కూడా అన్నారు కవిగారు. ఆహా, సాలము దగ్గరకు వద్దాం. ఈ సాలము అనేది శీతశైలములో ఒక భాగము. కొండచరియ - (అద్దంలా ఉంది మంచుతో) - అది కొండలో ఒక భాగమే కదా. ఈ ఆడయేనుగులు అద్దంలో కనిపిస్తున్న క్రొత్త యేనుగుల్ని ఎదుర్కోవటానికి ఆ కొండచరియలతో తలపడటం కారణంగా ఆ శీతశైలం (మంచుకొండ) కంపితం అవుతున్నదీ అని కవిగారు చమత్కరించారు. ఇంత ఉందిక్కడ. అంతే గాని ఎనుగులు చెట్లను తొండాలతో గుంజుతుంటే మంచుకొండ కంపిస్తోందీ అని చెప్పుకోవటంలో సొగసు ఏమీ లేదు. అప్పుడు కరేణు పదం అవసరం లేదు. కరీంద్రకరకంపితసాలము అనేస్తే సరిపోయేది. పెద్దన్నగారు మామూలు కవిగా ఐపోయేవారు. కాని కరేణుకరం అనటంతో మంచి సొగసును చూపారు.

    ReplyDelete
    Replies
    1. పద్యంలో ఆకర్షణ ఉంది.

      ఆడు ఏనుగులగుంపు అద్దాల్లాటి పర్వత మంచు చరియల్లో, తమ ప్రతిబింబాలు చూసుకుని, మరో ఆడుఏనుగులగుంపుగా భావించి, వాటిని తొండలతో కొడితే మంచుచరియల అద్దాలు పగిలితే/కదిలితే వెనక ఉన్న లోయలు కదిలినట్టనిపించినట్టన్న, పెద్దనగారి ఊహ అద్భుతం. చెప్పడానికి మాటలు చాలవు.

      చిన్న సందేహం.అసందర్భ ప్రలాపం కావచ్చు, పెద్దనగారి ఈ పద్యంలో భాష తెనుగేనంటారా?

      Delete
    2. అటజని కాంచె వరకూ తెలుగేనండీ. సాలమూ శైలమూ తెలుగుచేసిన సంస్కృతం. మిగిలినది గీర్వాణమే.

      తెలుగు ఈకవి ఎంతబాగా వ్రాస్తారో కూడా చూడవచ్చు ఇంతలు కన్నులుండ తెరు వెవ్వరి వేడెదు వంటి ప్రయోగాలతో.

      Delete
  42. ఆహా తెలుగు లిటరేచర్

    ReplyDelete