ఈ రోజు మేడే, సెలవు రోజు. ఊరికే కూచుంటే ఏవో ఊహలూ, ఆలోచనలూ ఇలా పద్యాలై బయటకి వచ్చాయి. అసలిలాటి పద్యాలెప్పుడు రాసినా, "వట్టి మాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేల్ తలపెట్టవోయ్" అని గురజాడవారు నెత్తిన రెండు మొట్టికాయలు వేస్తూనే ఉంటారు. చెయ్యగలిగిందేదో నిశ్శబ్దంగా చేసుకుపోతున్నా, ఏదో చెప్పాలన్న తపనకూడా మనసుని వెంటాడుతుంది. దాని పర్యవసానమే ఇదిగో ఈ పద్యాలనిలా నలుగురిముందూ పెట్టడం...
వీటివల్ల సమాజమేదో మారిపోతుందన్న వెఱ్ఱి దురభిప్రాయం నాకేవీ లేదు. కనీసం ఒకళ్ళిద్దరిలోనైనా కాస్తంత ఆలోచన రేపగలిస్తే అదే పదివేలు...
శ్రామికులందరొక్కటిగ సంఘటితంబయి, చీమలేకమై
పామును బట్టినట్టు ధనవంతుల దోపిడి మట్టుబెట్ట దీ
క్షా మతులైన వేళ శ్రమశక్తిని లోకము దానెరింగెగా
మేమను భావనే వెలసె మేదిని పండగ మే దినమ్ముగా!
సోషలిజమ్ము స్వప్నమది సుందర సత్యమునౌట నెన్నడో?
వేషము మార్చి మార్చి ప్రభవించెనె దోపిడి మాటిమాటికిన్
దోషమదెక్కడున్నది? అథోగతి బీడిత తాడితాళి సం
తోషము నందు రోజులు సుదూరమునుండిన యెండమావులే?
మేడలు మిద్దెలు బెరిగెను
గూడైనను లేక పేదకూలీ లుండెన్
మేడే లవెన్ని వచ్చిన
మాడే కడుపులకు భుక్తిమార్గము సున్నా!
విత్తును మాత్రమే యొసగు వృక్షము, వేరొక వృక్ష జన్మకై;
సత్తువవచ్చు దాకె నిజసంతతి గాచును పక్షి జంతువుల్;
విత్తము కోట్లు కోట్లు దమ పిల్లలకై గణియింత్రు మానవుల్
మత్తులు! వారివల్లె అసమానతలింతగ హెచ్చిపోయెగా!
తాతయుదండ్రి యాస్తి దము తాకగరాదను సద్విచార ధా
రాతిసమంజసాన్విత మహాత్ములు గావలె నేటి యౌవనుల్!
దూతలు గావలెన్ బ్రగతి రోచిరహస్సుకి, నూత్న సంఘ ని
ర్మాతలు గావలెన్, సమసమాజపు ధాతలు గావలెన్ వడిన్!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Thursday, May 1, 2008
నేడే మేడే!
Subscribe to:
Post Comments (Atom)
చాలా చాలా బాగా రాశారు.నెనరులు.
ReplyDeleteచాలా బాగున్నాయి పద్యాలు.
ReplyDeleteబొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
గురువుగారూ
ReplyDeleteమీరు చేసే ఉద్యోగం వెంఠనే మానేసి, తెలుగు పత్రికో, పేపరో మొదలెట్టి తెలుగు పుస్తకాలు రాయమని నా ఉచిత సలహా. మీరు కనక పొరపాట్న సాఫ్టువేర్ ఉద్యోగం కానీ చేస్తూంటే అది తెలుగుజాతికే అవమానం.
తెలుగు భాష మీద మీకున్న పట్టు, ఒడుపూ మా బ్లాగుకాయలకి కనీసం (శంకరాభరణంలో శంకర శాస్త్రి డైలాగు గుర్తు వస్తోంది) ఒక్క పెర్సెంట్ ఉన్నా తెలుగు జాతి యావత్తూ బాగుపడుతుంది. ఏమంటారు?
నరసింహగారు, బాబాగారు,
ReplyDeleteమీ ప్రోత్సాహానికి నెనరులు.
RSDగారు,
మీ అభిమానానికి నెనరులండీ. మీది నిజంగా "ఉచితమైన" సలహానే.
నాకూ చాలా రోజులనుంచీ ఆ ఆలోచన ఉంది. కాకపోతే దానికి కాస్తంత దుడ్డు కావాలికదా! మీరు భయపడ్డట్టు నేను సాఫ్టువేరు ఉద్యోగమే చేసుతున్నాను. అయినా ఎదో ఇలా తోచినట్ట్లు నా తెలుగు అభిమానాన్ని తక్కిన వాళ్ళమీద కూడా రుద్దడానికి ప్రయత్నిస్తునే ఉన్నాను:-)
పాండిత్యం కన్నా కూడా తెలుగుమీద అభిమానం, తాపత్రయం ముఖ్యం. అవి చాలామంది తెలుగు బ్లాగర్లలో చాలా ఎక్కువగానే ఉన్నాయి. అదెంతో సంతోషించాల్సిన విషయం. ఇదిలాగే ఒక్క రెండు తరాలు కొనసాగితే, ఇంక తెలుగుభాషకి ఢోకా ఏవుంటుంది!
ఎంతో బాగున్నాయి, పద్యాలు. చివరి రెండూ అన్నిటిలోకీ ఉత్తమం.
ReplyDeleteమీ అన్ని టపాలూ చదివా.. మీ పద్య, వచన, విశ్లేషణలు హృదయాన్ని తడుపుతూ కొన్ని సార్లు, బండబారిన మెదడు ను ఉతికారేసి కొన్ని సార్లు, తెలుగు పట్ల అభిమానాన్ని పెంపొందించునే లా అన్ని సార్లూ ఉన్నయి.
ReplyDeleteస్ఫూర్తి వంతం గా బ్లాగు నడపుతున్నందుకు అభినందనలు, ధన్యవాదాలు.