తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Saturday, May 10, 2008

కరుణమూర్తి


ఈ ప్రగాఢ నిగూఢ మధ్యేనిశీథి
గడియ కదలించుచున్న సవ్వడి యిదేమి?
ఇప్పు డంతఃపురమ్మునం దెవరు వీరు
మూసియున్నట్టి తలుపులు దీసినారు?


తెర తొలగ ద్రోసికొని యేగుదెంచుచున్న
ముగ్ధ మోహన కారుణ్యమూర్తి యెవరు?
అందములు చిందు పున్నమ చందమామ
కళ దరుగదేమి కాలమేఘాలలోన?

నిండు గుండెలపై వ్రాలి నిదురపోవు
ఏ హృదయదేవి పావన స్నేహమునకు
ద్రోహ మొనరించి ప్రక్కకు త్రోసిపుచ్చి
వచ్చెనో కాక - వదన వైవర్ణ్యమేమి?

నమ్మి జీవన సర్వస్వ మమ్ముకొన్న
ప్రణయమయి శాశ్వత ప్రేమ బంధములను
త్రెంపుకొని బయటపడు ప్రయత్నింపులేమొ
తడబడుచు కాళ్ళు గడపలు దాటవేమి?

ఒడలు తెలియక ప్రక్కపై బడి, యనంత
మోహన స్వప్న లోకాలలో హసించు
ముద్దుపాపాయి చిఱునవ్వు ముత్తియములు
దొరలుచున్నవి వాలు కందోయి తుదల!

గేహమే వీడలేకనో; గృహిణితోడి
స్నేహమే వీడలేకనో; శిశువుమీది
మోహమే వీడలేకనో; సాహసించి
దేహళిని దాట నింత సందేహపడును?

ప్రణయ భాగ్యేశ్వరీ బాహుపాశ మట్లు
జారిపోలేక ముందుకు సాగనీక
వెంట జీరాడుచు భుజమ్ము నంటి వచ్చు
నుత్తరీయాంచలము చక్కనొత్తడేమి?

కేలుగవ సాచి ఆర్ద్ర నేత్రాలతోడ
మెట్టుమెట్టుకు పాదాల జుట్టుకొనెడి
ప్రేయసీ కల్పనా ప్రతిబింబ శత స
హస్రముల గాంచి నిస్తబ్దుడగుచు నిలుచు!

పడియు ముందుకు, వెనుకకే ప్రాకులాడు
ప్రభువు చరణాలు స్ఫటిక సోపాన పంక్తి
గాలికెదురుగ సెలయేటి జాలులోన
పయనమగు రాజహంస దంపతుల భంగి

ఆ మహోన్నత భర్మ హర్మ్యాల దిగుట
ఏ మహోన్నత సౌధాల కెక్క జనుటొ!
ఈ వన విహారములు త్యజియించి చనుట
ఏ నవ విహారములు సృజియించుకొనుటొ!

లలిత లజ్జావతీ లాస్య లాలనములు
కనెడి కన్నులు సత్య నర్తనము కనెనొ!
శ్రీ చరణ మంజు మంజీర శింజితములు
వినెడి వీను లంతర్వాణి పిలుపు వినెనొ!

మినుకు మినుకున గుడిసెలో కునుకుచున్న
దీపమంపిన దీన సందేశమేమొ
స్వర్ణశాలలపై భ్రాంతి సడలి, జీర్ణ
పర్ణశాలల మార్గమ్ము పట్టినాడు!

ఆపుకొనలేని హృదయమ్ము నదిమిపట్టి
దూరమగుచుండె ప్రభువు సంసారమునకు
శ్రీయు, శ్రీమతియు, చిరంజీవి లేని
ఈ మహానిష్క్రమణ కర్థ మేమి కలదొ!

కాంతిలోనుండి కటిక చీకటులలోన
కలసిపోవుచునున్నాడు కరుణమూర్తి!
కటిక చీకట్లలోనుండి కాంతిలోన
పతితపావనుడై బయల్పడగ నేమొ!!

ఇవి "ఉదయశ్రీ" పుస్తకంలోని "కరుణమూర్తి" ఖండికలోనివి. ఒక్క పద్యం రాద్దామని మొదలుపెట్టి, ఒకరెండు పద్యాలు రాద్దామనుకొని, ఇలా అన్ని పద్యాలూ రాయకుండా ఉండలేకపోయాను! నా అభిమాన కవి కరుణశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు. నాకు పద్యమంటే అమితమైన ప్రీతి కలగడానికి కారణం అతని పద్యాలే.

అప్పటికి నేను ఘంటసాల పుష్పవిలాపం వినలేదు. మా అమ్మమ్మ పాడే "ఎలుక గుఱ్ఱము మీద నీరేడు భువనాలు పరువెత్తి వచ్చిన పందెకాడు, నల్లమామా యంచు నారాయణుని పరియాచకాలాడు మేనల్లు కుఱ్ఱ..." మొదలైన వినాయకుని మీద పద్యాలు చిన్నప్పుడు విన్నాను. తొమ్మిదో తరగతిలో "బుద్ధదేవుని పునరాహ్వానం" అన్న పాఠం ఉండేది, కరుణశ్రీ గారిది. అందులో పద్యాలు చదువుతూ ఉంటే, ఒక గొప్ప అనుభూతి! అప్పుడింట్లో ఉన్న ఉదయశ్రీ పుస్తకం చూసాను. ఇప్పటికా పుస్తకం ఎన్ని మార్లు చదివుంటానో! అతని పద్యాలు చదువుతూ ఉంటే, తియ్యని మావిడిపండు రసం జుఱ్ఱుకుంటున్నట్టే ఉంటుంది. చదవడమంటే మనసులో చదువుకోడం కాదు. నోరారా గొంతెత్తి, పక్కవాళ్ళ గురించి పట్టించుకోకుండా, మనకి వచ్చిన రాగంలో పాడుకోడం.
లోతైన కవిత్వాన్ని గురించి వెతికే వాళ్ళకి కరుణశ్రీ పద్యాలు నిరాశని కలిగించవచ్చు. కానీ, సున్నితమైన భావాలతో, భావానికి అనువైన సున్నిత పదాల ధారతో అతని పద్యాలు గుండెని తట్టక మానవని నా అనుభవం.
ఉదాహరణకి ఈ ఖండికే తీసుకోండి. భార్యనీ, కుమారునీ వదిలి పెట్టి అర్థరాత్రి ఎక్కడికో బయలుదేరిన బుద్ధుని అవస్థని ఎంత మనోహరంగా చిత్రించారు! వీటికి వివరణ అనవసరం. ఎవరికి వారు మనసారా చదువుకొని అనుభవించాల్సిందే!
స్వప్నలోకాలలో నవ్వుకుంటున్న తన ముద్దుపాపాయి చిరునవ్వు ముత్యాలు అతని కనుతుదలలో దొరలుచున్నాయిట! అతని భుజాన ఉన్న ఉత్తరీయం, తన ప్రేయసి కౌగిలిలాగా, వదలిపోకుండా, ముందుకి వెళ్ళనీయకుండా తననంటిపెట్టుకుందిట! వీటన్నిటినీ వదలి అతను ఎలా వెళ్ళగలుగుతున్నాడు! ఎక్కడో గుడిసెలో మినుకు మినుకు మంటున్న చిరుదివ్వె అతనికేదో సందేశం ఇస్తోంది. "ప్రేయసి ప్రేమలోన కనిపించెడి తీయని స్వర్గమొక్కటే ధ్యేయము కా"దని చెపుతోంది. అందుకే ఆ కరుణమూర్తి బాధని గుండెలోనే అదిమిపట్టి ఆ మహాభినిష్క్రమణం చేస్తున్నాడు.

అసలు కరుణశ్రీ అంటేనే కరుణమూర్తి. అతని పద్యంలానే అతని మాట, అతని మాటలానే అతని హృదయం అతి మెత్తన. తెలుగు పద్యం అంటే చెవికోసుకొనే ఉత్సాహవంతులు మొట్టమొదట కంఠస్థం చెయ్యాల్సిన కవి కరుణశ్రీ!

7 comments:

 1. కోటానుకోట్ల జన్మలెత్తాక ఒకానొక చివరి జన్మకొచ్చేసరికి బుద్దుడు చెప్పినట్టుగానే నిర్వాణం కోసం ముందడుగు కదులుతుంది. అది మిణుకుమనే చిన్న దీపం లాకనిపించినా అదే దీపం ముందుకెళ్ళడానికి పరమావధి. అప్పుడే అటువంటి వాళ్ళకు తెలిసేది - ఆత్మార్ధే ప్రుధ్వీం త్యజేత్. ధూర్జటి అంటాడు ఏదో పద్యంలో - అమర స్త్రీలని అనుభవించినా కామం తీరుదూ అని. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా ఒకటే చెప్పేది - కోరికే అన్ని దుఖాలకీ మూలం.

  ఇదే చివరకి మిగిలేది. పంచ మహావాక్యాలు చెప్పేదీ, మంత్రపుష్పంలో చెప్పిన 'నీలతోయద మధ్యస్తా ద్విద్యుల్లేఖేన భాస్వరా...తస్యాశ్శిఖాయా మధే పరమాత్మా వ్యవస్తిథహా
  (ఈ లేఖినీ ఎడిటర్లో అరసున్నాలు, విసర్గలూ సరిగ్గా రాలేదు... ఏమీ అనుకోకండే? ;-)

  ReplyDelete
 2. హల్లో కామేశ్వర రావు గారూ !

  గేహమే వీడలేకనో; గృహిణితోడి
  స్నేహమే వీడలేకనో; శిశువుమీది
  మోహమే వీడలేకనో; సాహసించి
  దేహళిని దాట నింత సందేహపడును?

  పోతన ఛాయలు తొంగిచూసే పద్యం కదూ !!

  కరుణశ్రీలో నాకు బాగా నచ్చిన పద్యం "క్రొంజికురాకు వ్రేళుల కురుల్ తడియార్చుచు కూరుచున్న అభ్యంజన మంగళాంగి జడయల్లుదునా....."

  ReplyDelete
 3. హల్లో రఘూజీ,

  మీరన్నట్టు కరుణశ్రీ మీద పోతన ప్రభావం చాలానే ఉంది. పోతన అతని అభిమాన కవి ఆయెను.

  "ముద్దులుగార భాగవతమున్ రచియించుచు పంచదారలో
  నద్దితివేమొ ఘంటమును..." అంటారు. అంతేనా,

  "అచ్చపు జుంటితేనియల నైందవబింబ సుధారసాల, గో
  ర్వెచ్చని పాలమీగడల విచ్చిన కన్నె గులాబి మొగ్గలన్
  మచ్చరికించు నీ మధుర మంజుల మోహన ముగ్ధశైలి నీ
  వెచ్చట నేర్చినావు సుకవీ సుకుమారకళా కళానిధీ!"

  అని పులకించిపోతారు కూడా పోతన కవిత్వాన్ని గురించి కరుణశ్రీ!

  ReplyDelete
 4. 1. మూసినట్టి తలుపులు దీసినారు, ఏగుదెంచుచున్న జీరాడుచు భుజమ్మునంటి వచ్చు -- తీసినారు, ఏగుదెంచు, జీరాడుచు... నాకు ఈ ప్రయోగాలలో శాస్త్రిగారే కనిపిస్తున్నారు. పుష్పవిలాపంలో కూడా అరిగితి పుష్పవనికి, హృదయమే లేని నీ పూజ లెందుకోయి లాంటి క్రియాపద ప్రయోగాలు కరుణశ్రీ గారి శైలిని నా మనోఫలకం మీద శాశ్వతంగా ముద్రించేసాయి.
  2. అందములు చిందు పున్నమ చందమామ
  కళ దరుగదేమి కాలమేఘాలలోన
  అన్నచోట రెండు అర్థాలు గోచరిస్తున్నై. కారుణ్యమూర్తిని ఆయన కాంతిని అందాన్ని చూసి చందమామ చిన్నబోవటంలేదెందుకో... బహుశా ఇక సుఖాలు అనుభవించబోవట్లేదు కదా అన్న ఈర్ష్యతోనేమో అన్న ధ్వని ఒకటి. రెండు శ్లేష చెప్పుకుంటే సంసారాన్ని వదిలిపెడుతున్నా ముఖచంద్రుడు కాలమేఘాలలాంటి తెరలచాటున ఉన్నా కాంతి కోల్పోలేదని రెండవది. రెండు అర్థాలూ బాగున్నై.
  3. నిండు అనగానే నాకు కుండ గురుతుకొస్తుంది. నిండు గుండె ప్రయోగం తమాషాగా ఇక్కడ చక్కగా సరిపోయేలా అందంగా ఉంది.
  4. అనంత మోహన స్వప్న లోకాలలో హసించు... భలే ప్రయోగం. వసించు అంటే చిన్నపిల్లలకీ పెద్దవారికీ పెద్ద తేడా కనబడేది కాదేమో. హసించు ఇక్కడ సముచితం.
  5. దేహళి అంటే గడప అనీ భర్మ అంటే బంగారు అనీ, నాకు ఇంతవరకూ తెలియదు.
  6. ఉత్తరీయాంచలము చక్కనొత్తడేమి అన్నచోట గజేంద్రమోక్షం వర్ణించిన పోతన ప్రస్ఫుటంగా కనబడుతున్నాడు.
  7. ప్రభువు చరణాలు రాజహంచ దంపతుల భంగి -- ఆయన నడక అంత ఒయ్యారంగా ఉందనా? దంపతుల అనడంలో అంతర్లీనంగా మళ్లీ భార్యని వదలలేక అని ధ్వనించడం... భలే.
  8. మినుకు మినుకున గుడిసెలో కునుకుచున్న
  దీపమంపిన దీన సందేశమేమొ
  దేహానికి గుడిసెని ఉపమానంగా వాడి,
  ఏ మహోన్నత సౌధాల కెక్క జనుటొ!
  అనడం చాలా బాగుంది.

  కామేశ్వరరావుగారూ,
  ఎప్పటినుంచో చదువుదామని అనుకుంటున్నా ఇన్నాళ్లకి కుదిరింది మీ కరుణమూర్తి టపా చదవడం. నేను చదివిన కరుణశ్రీ మూడవ పద్యసంకలనమిది. మొదటిది పుష్పవిలాపం, రెండవది మహాకవి పోతన, మూడవది ఈ కరుణామూర్తి. మళ్లీ శాస్త్రిగారి పద్యాలు చదివే మహదవకాశం కల్పించినందుకు కృతజ్ఞుణ్ణి.

  ReplyDelete
 5. నేను స్కూలు లో చదూకొన్నప్పటి పాఠం--వ్రేళ్ళ సందుల మాగాయి పచ్చడి పసందు ఎటుల కనుగొంటివయ్య--ఈనాటికీ జ్ఞాపకం--నరసింహ

  ReplyDelete
 6. రాఘవగారూ,
  పద్యాలని చదువుతూ, ఆస్వాదిస్తూ చేసిన మీ వ్యాఖ్యానం బావుంది. "అందములుచిందు పున్నమచందమామ" అని బుద్ధుని ముఖాన్ని గురించే చెప్పేడనుకుంటాను. ఆ తర్వాతి పద్యంలోనే "వదన వైవర్ణ్యమేమి" అని అనడంలో బుద్ధుని విచిత్రమైన ద్వైదీభావ పరిస్థితిని(dilemma) చిత్రిస్తున్నారు. ఒకవైపు తను చెయ్యాలనుకున్న సత్యాన్వేషణపై ధృఢదీక్ష, మరో వైపు భార్యా పిల్లడిని వదలివెళుతున్న బాధ!
  అతని చరణాలని, గాలికెదురుగా ప్రయాణిస్తున్న రాజహంస దంపతులలాగా భావించడంలో కూడా ఇదే సందిగ్ధావస్థ. ముందుకివెళ్ళాలని ఉన్నా, గాలివాటం మళ్ళీ వెనక్కి తోస్తూ ఉంటే, ముందుకీ వెనక్కీ ఊగిసలాడే రాజహంసల పరిస్థితి. ఇక్కడ చరణాలు జోడీ కాబట్టి, రాజహంస దంపతులతో పోల్చడం.
  గుడిసెని దేహంగా భావించడం చాలాబావుంది. మీరన్నదాక నాకది స్ఫురించలేదు!

  ReplyDelete
 7. కామేశ్వర రావు గారూ
  మీ "కరుణమూర్తి" చూసిన తర్వాత ఆ ప్రోత్సాహంతో నాకెంతో యిష్టమయిన "సీత" సంగీత రూపకాన్ని బ్లాగులో ఉంచాను.దీనిలో ఆయన వాడిన పదసంపద అందర్నీ ముగ్ధుల్ని చేస్తుంది.ఈ రూపకాని కుపయోగించిన చందస్సు ఏమిటో నాకు తెలియదు.తెలిపితే సంతోషిస్తాను.

  ReplyDelete