నిన్న ప్రపంచపర్యావరణ దినం. ఈ సందర్భంగా ఒక హెచ్చరిక...
కొన్ని రిపైర్లని మినహాయిస్తే, నేను రాసిన మొట్టమొదటి పద్యకవిత ఇది.
హెచ్చరిక!
-------
ముగ్ధమోహన సౌందర్యమూర్తి ఆమె
పూలనవ్వుల పులకించు పొలతి ఆమె
మానవుని పాలిటను వరమాత ఆమె
ఆమె ఒకనాటి ప్రకృతీలలామ, నేడు
శోభలుడిగిన దయనీయ శోకమూర్తి!
నవ వసంతమునందు నవ రాగమున బల్కు
కోకిల గొంతులో కులుకులేవి
కరిమబ్బు క్రమ్మగా పురి విప్పి ఆడేటి
నీలకంఠుల నాట్య లీలలేవి
మధు సౌరభము జిందు మందార సందోహ
సుందర వనసీమ సొగసు లేవి
అమ్మ జోలల రీతి హాయిగా లాలించు
చల్లని చిరుగాలి స్పర్శలేవి
శూన్య మయిపోయె ప్రకృతి చైతన్య దీప్తి
లలిత లావణ్యమూర్తి తా మలినమయ్యె
అతిశయించిన మతిలేని స్వార్థమునకు
ఫలిత మియ్యిది మానవా తెలుసుకొనుము
నరులు తరులను కురులను నరికి వేయ
బోడిగా మారె నా విరిబోడి నేడు !
బాధ్యతలనెల్ల విడనాడి పరువులెత్తు
మానవా, మానవా యీ ప్రమాద సరళి!
ఏ మాతృహృదయంపు ప్రేమ పీయూషమ్ము
నదులుగా పారి సంపదలనొసగు
ఏ సుధామయి కృపా రాశిని కురిపించి
పాడిపంటల సిరుల్ వరములిడును
ఏ తల్లి మధుర సంగీత మాలాపింప
చల్లగా నిదురించు జగములెల్ల
ఏ యమ మందస్మితేక్షణమ్ముల సిరి
వెన్నెలల్ విరబూసి వేడి దీర్చు
అట్టి కరుణాంతరంగ దయార్ద్ర హృదయ
నరెరె కష్టాల పాల్జేసె నరుడు, ఖలుడు!
కాగితపు పూలతేనియ కాశచెంది
భంగపడు వట్టి మూర్ఖంపు భ్రమర మతడు!
తన సుఖమ్మును మాత్రమే తలచి, తూట్లు
పొడిచి పొడిచి, తా నోజోను పొరను జీల్చె
తల్లి గుండెను కోసిన తనయుడౌర!
మానవుండెంత నిర్దయ మానసుండు!
తల్లి లేకున్న బిడ్డడు తల్లడిల్లు
మనకు నాస్థితి కలుగక మునుపె కనులు
తెరచి గ్రహియించి యికనైన తెలివి కలిగి
ప్రకృతిమాతను శ్రద్ధ గాపాడ రండి!
తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్
Friday, June 6, 2008
హెచ్చరిక!
Subscribe to:
Post Comments (Atom)
వావ్! ఎంతందంగా వ్రాసారు!
ReplyDeleteనరులు తరులను కురులను నరికి వేయ
బోడిగా మారె నా విరిబోడి నేడు !
బాధ్యతలనెల్ల విడనాడి పరువులెత్తు
మానవా, మానవా యీ ప్రమాద సరళి!--తరులను కురులతో పోల్చడం ఎంత అందంగా వుందో!మీ శైలి కరుణశ్రీ గారిని గుర్తుకు తెస్తోంది.
కాగితపు పూలతేనియ కాశచెంది
భంగపడు వట్టి మూర్ఖంపు భ్రమర మతడు!-మంచి వర్ణన.
'అన్నమయ్య పలుకుబడులు' తరువాత నేను చెప్పగలిగిందేమంటే -
ReplyDeleteనీలకంఠమంటే ఇంతకాలం కేవలం శివుడే గుర్తుకొచ్చేవాడు. నెమళ్లకు ఈ మాటను వాడుకలో చూడటం నాకిదే మొదలు. మీరింతకు ముందెక్కడైనా చూశారాండీ? రెండవ సీసం చివరిపాదంలో 'ఏయమ' అనేపదం కూడా మంచి జానపదం, 'ఓ అమ్మా' అనే పిలుపును 'ఓ యమా'గా పిలవడం ఇప్పటికీ మా ప్రాతంలో వయోధికుల నోట వినొచ్చు. ఈ పద్యమెలా వుందంటే - పాండురంగ మహత్యం సినిమాలో ఘంటసాల పాడిన 'అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా' పాటనూ పాటచివర్లో వచ్చే పద్యాన్నీ గుర్తుకుతెచ్చేలా వుంది. మొత్తంగా మీ మొదటి పద్యకవిత బ్రహ్మాండంగా వుంది మాస్టారూ!
కామేశ్వర రావు గారు,
ReplyDeleteభూదేవిని మనిషి పెడుతున్న కష్టాలన్నీ ఎత్తిచూపుతూ చాల బాగా వ్రాసారు. మీ కవిత ఎక్కడా ఒడుదొడుకులు లేకుండా భలే ప్రవహించింది (ఒక్క "నరుడు, ఖలుడు" పాదం దగ్గర మాత్రం చదువుతున్నప్పుడు అడ్డుకట్ట పడ్డట్లు తోచింది కాని, అది నేను చదవడంలో తప్పు కూడ అయ్యి ఉండవచ్చు)
రానారె,
నేను ఈ మధ్యనే తెనాలి రామకృష్ణ కవి వ్రాసిన (ఉధ్భటారాధ్య చరిత్రము లోని) పద్యం ఒకటి చదివాను. అందులో శివుడిని మయూరముతో పోల్చిడ మున్నది, పూర్వ కవులు ఈ ప్రయోగం విరివిగా చేసేవారేనని నా నమ్మకం.
కామేశ్వర రావుగారు, మీరు మరిన్ని ఉదాహరణలు (వివరాలు)ఇవ్వగల సమర్థులు.
గిరి
గురువు గారు,
ReplyDeleteమీ హెచ్చరిక చాలా బాగుంది.
నిజమే. నాకు కూడా కరుణశ్రీ గుర్తొచ్చారు. పద్యాలు బాగున్నాయ్ మేఁష్టారూ.
ReplyDeleteపద్యాలగురించి అభిప్రాయం చెప్పిన అందరికీ నెనరులు.
ReplyDeleteనీలకంఠ పదం నెమళ్ళకి ఎక్కడ చదివానో చప్పున గుర్తు రావటం లేదు. బహుశా కృష్ణశాస్త్రి కవితల్లోనేమో? మొదట్లో కరుణశ్రీ, కృష్ణశాస్త్రి - ఇద్దరి ప్రభావమూ నా పద్యాలపై ఉండేది (ఇప్పటికీ ఉందేమో తెలీదు!).
చాలా బాగుంది.
ReplyDeleteగ్లోబల్ వార్మింగ్ పై నితిన్ దాస్ తీసిన 8 నిముషాల డాక్యుమెంటరి ఇక్కడ చూడొచ్చు.
http://thinkchangeindia.wordpress.com/2008/05/12/a-magical-fable-about-global-warming/