తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, June 15, 2008

కనిపెట్టగలరా?


ఇవి ఓ సుపరిచిత కవి అపరిచిత పద్యాలు. ఆ కవి ఎవరో ఎవరైనా కనిపెట్టగలరా?

ప్రళయ నర్తనము
------------

సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్సంపూర్ణ సౌందర్య రా
శీ యుక్తామల దివ్యమూర్తివయి, సాక్షీభూత నానామరు
త్తోయస్తోత్ర గభీర గానరస సంతుష్టాంతరంగంబునన్
మాయామేయ జగద్వినాశనమతిన్ నర్తింపుమా! శంకరా!


అలఘు ధ్వాంత వితాన సంభరిత రోదోంతర్మహాగహ్వర
స్థలి యంభోనిధి యయ్యె సంతత జలస్రావాతిరేకంబునన్
విలయాంభోధర ఘోష సమ్మిళిత గంభీరాట్టహాస ధ్వనీ
చలిత ప్రాకట దిగ్గజుండ వగుచున్ సంప్రీతి నర్తింపుమా!

కాలాంతప్రభవార్కకోటి ఘృణి సంకాశ ప్రతాప స్ఫుర
త్ఫాలాక్ష జ్వలదగ్ని దగ్ధ సకల బ్రహ్మాండ భాండుండవై
జ్వాలాదీప్త మహా ప్రభావ గరిమన్ స్వచ్ఛంద సంవర్త కే
ళీ లోలాత్ముడవై సమస్త జగముల్ కీర్తింప నర్తింపుమా!

6 comments:

 1. puTTaparti naaraayaNaachaaryulavani naa Uha.

  ReplyDelete
 2. శ్రీశ్రీ తొలినాటి పాండితీప్రకర్ష

  ReplyDelete
 3. నేను అసలు ఏ కావ్యాలూ చదవలేదు, ఇది వీరి శైలి అని కనీసం గమనించడానికి :(
  శైలి కాస్తో కూస్తో తెలుసున్నది పోతనదీ తర్వాత కరుణశ్రీ పాపయ్యశాస్త్రి గారిదీను. పద్యాలు ఈ ఇద్దరివీ కావు.
  పదజాలాన్ని బట్టి చూస్తే ఏ విశ్వనాథవారిదో వారి గురువు చెళ్ళపిళ్ళవారిదో అనిపిస్తోంది.

  ReplyDelete
 4. ధూర్జటి కవి లేదా పుట్టపర్తి నారాయణాచార్యులు అయి ఉండవ్చ్చునేమొ? కొంపదీసి ఈ పద్యాలు మీవి కావు గదా? వామ్మో !

  ReplyDelete
 5. రాజేంద్రకుమార్ గారు సరిగా చెప్పారు. ఇవి శ్రీశ్రీ తన పూర్వాశ్రమంలో రాసిన పద్యాలు.
  భాష మారినా, రూపం మారినా, వస్తువు మారినా శ్రీశ్రీ కవిత్వం ఎప్పుడూ శబ్దప్రథానమైనదే, చాలావరకు. శబ్దశక్తి బాగా తెలిసిన కవి శ్రీశ్రీ. అదే పాఠకులని కదిలించగలిగింది. అందుకే శ్రీశ్రీ కవిత్వం నాకిష్టం. నిన్న శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా, ఎక్కువమందికి తెలియని శ్రీశ్రీని పరిచయం చేద్దామనుకున్నాను.
  "ప్రభవ" అన్న పుస్తకంలో వీటినీ, ఇలాటి చాలా పద్యాలనీ చదువుకోవచ్చు.

  ReplyDelete
 6. నిజమా!
  హాచ్చెర్య పడీ మళ్ళీ లేచా!
  ఆయన పూర్వాశ్రమంలో ఛందోబద్ధ కవిత్వం రాశాడని తెల్సు ఘానీ ఈ పద్యాల్ని చూసి నేనూ ఏ ధూర్జటి వేపుకో వెళ్ళిపోయా :-)

  ReplyDelete