తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, April 3, 2009

పిబరే రామరసం


ఎప్పుడైనా ఏదైనా చదివినప్పుడు మీకు గుండెలోంచి ఏదో తెలియని వింత ఏడుపు పొంగుకొచ్చి కళ్ళని తడిపేసిన అనుభవం ఉందా? అది దుఃఖమో ఆనందమో ఆశ్చర్యమో తెలియదు. అలా అలా అందులో సాంతమూ మునకలేసిన తర్వాత ఒక ప్రశాంతత అణువణువూ నిండిపోతుంది.
దీన్నే "రసానుభూతి" అంటారేమో! అవును, అదే అయ్యుండాలి. కవిత్వాన్ని అనుభవించాలంటే అలాగే అనుభవించాలని అనిపిస్తూ ఉంటుంది. తర్కము, హేతువు అనే బౌద్ధిక శృంఖలాలని ఛేదించుకొని మనమొక కొత్త లోకాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుందప్పుడు. అది ఏ కొద్ది క్షణాలో... అంతే!
ఆ తర్వాత మళ్ళీ మన మనసు తన గాజుగూటిలోకి తిరిగివచ్చి అందులోంచి మనం చదివిన కవితనో, కావ్యాన్నో విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. చాలా శ్రమిస్తుంది కూడా. కానీ అదంతా వ్యర్థం కాదూ? అలా ఎంత శ్రమపడ్డా అది మొదట మనకిచ్చిన అనుభూతిని తిరిగి మనం పొందనూ లేము (ఆ విశ్లేషణ ద్వారా), మరొకళ్ళకి దాన్ని రుచి చూపించనూ లేము.

ఇలాటి అనుభూతి, అనుభవం నాకు కలిగించిన (ఎప్పుడూ కలిగిస్తూ ఉండే!) పుస్తకాలు కొన్నున్నాయి. అలాటి వాటిలో ముఖ్యమైనది రామాయణమూ, రామాయణం గురించి ఏవైనా మంచి వ్యాఖ్యలు. నిజానికి నేను వాల్మీకి రామాయణం చదవలేదు, కొన్ని కొన్ని సన్నివేశాలు తప్ప. చాలావరకూ దాని గురించి తెలుసుకొన్నది వ్యాఖ్యానాల వల్లనే. తెలుగులో మొల్ల రామాయణం పూర్తిగా చదివాను. వాల్మీకి రామాయణాన్ని పూర్తిగా అనుసరించి రాసిన కొన్ని రామాయణాలని అక్కడక్కడా చదివాను. ద్విపదలో ఉన్న రంగనాథ రామాయణాన్ని కొద్దిగా చదివాను. రామాయణ కల్పవృక్షాన్ని చాలావరకూ చదివాను.
అన్నిటిలోకీ నాకు పైన చెప్పిన అనుభూతిని కలిగించేది కల్పవృక్షమొక్కటే. అందుకే రామాయణం గురించి ప్రసక్తి వచ్చినప్పుడల్లా నాకు గుర్తుకొచ్చేది అదే.

ఒనర బోర్కాడించి యుయ్యెల తొట్టెలో
పండ బెట్టిన పసిపాపవోలె
వీథులంబడి తిర్గి బూదియ మై జల్లు
కొని పర్వులం బెట్టు కుఱ్ఱవోలె
నన్నమ్ము దించు మోమంతయు బెరుగన్న
మును జేసికొన్నట్టి బొట్టివోలె
జిట్టి! తలంటి పోసెద నన్న నందక
తొలగి పర్వులు వెట్టు నులిపివోలె

వెల్ల దుస్తులు కట్టించి వీథులన్ షి
కారు పంపిన రాజకుమారు వోలె
మింట నడుచక్కి జాబిల్లి మేదినీశు
నేత్రములకు జలువ బండించి పోసె

దశరథుడు సంతానంకోసం యజ్ఞం చేసే ప్రయత్నంలో ఉన్నప్పుడు, ఒక రాత్రి ఆ దశరథునికి చంద్రుడిలా కనిపించాడట! ఇతడు చంద్రుడా, రామచంద్రుడా, అచ్చమైన తెలుగింటి "రాము"నా? ఇలాటి చంద్రుడు మరే రామాయణంలోనూ నాకు దొరకలేదు.
దశరథుని యజ్ఞఫలంగా యజ్ఞపురుషుడు పాయసాన్ని అందిస్తూ ఉంటాడు. ఆ పాయసంలోకి పరమాత్మ శక్తి ప్రవేశిస్తుంది. అది ఎలాంటి శక్తి?

క్షీరాబ్ధి తరగలో శ్రీపయోధరములో
తొలిపాము పొలసులో దూగుశయ్య
చలువవెన్నెల చాలొ మలయునెండల వాలొ
యగ్గిమంటలడాలొ నిగ్గుచూపు
ప్రామిన్కు చివళ్ళొ బహుళసృష్టి మొదళ్ళొ
యచ్చతెల్వి కరళ్ళొ అసలు మూర్తి
తెఱగంట్ల హాళికో దితిజాళి మోళికో
వట్టిన కేళికో వచ్చు నటన

ఇల్లు వైకుంఠమందొ మౌనీంద్ర హృదయ
మందొ తనదహరాకాశమందొ యైన
చిత్తు నానందమును మించు సత్తొకండు
జనపతి కరస్థమగు పాయసమున జొచ్చె!

ఆ పాయసపు గిన్నెని చేతపట్టుకొని దశరథుడు ఆనందోత్సాహలతో వెళ్ళి కౌశల్యకి అందులో సగమిచ్చాడు. అప్పుడామె ఆ పాయసాన్ని ఎలా ఆరగించింది?

ఏ యించుక యెడమైనను
పాయసముననుండి హరియు బరువెత్తునొ నా
నా యమ దీక్షా వ్రత నిధి
పాయసమును బ్రేమమీర భక్షించె వెసన్

ఆలస్యం చేస్తే ఎక్కడ హరి ఆ పాయసన్నుంచి వెళిపోతాడో అనే ఆతృతతో, ఎంతో ప్రీతితో ఆ పాయసాన్ని గబగబా తాగేసిందిట!
రావలసిన శుభవేళ రానే వచ్చింది. ఆ రోజే చైత్ర శుద్ధ నవమి.

కెవ్వున స్నిగ్ధమంధరము కేక వినంబడె, మంత్రసానియున్
బువ్వునబోలె జే శిశువు బూనెను, బట్టపురాణియున్ గనుల్
నొవ్వగు మూత విచ్చుచు గనుంగొనె భాగ్యము నామె కన్నులన్
నవ్వెనొ జాలిపొందెనొ సనాతనమౌ మధుకాంతి జిందెనో!

అంతలోనే బయట చిరుజల్లులు, నవ్వుల విరిజల్లులు ఏకమై కురిసాయి.

చిటపట సవ్వడి వినబడె
గిటకిటనన్ బట్టమహిషి కిటికి దెస గనన్
చిటికలు గుటికలు మెటికలు
పటపట చిటచిటని జల్లువాన కురిసెడున్

క్రిందటేడు సీతాకల్యాణమప్పుడు పడ్డ వాన యీ ఏడు శ్రీరాముడు పుట్టగానే కురిసింది!

రామాయణాన్ని చదివేవాళ్ళు దాన్ని ఒక మత గ్రంధంగానో, చరిత్రగానో కాక కవిత్వంగా ఎందుకు చదవరో నాకైతే ఆశ్చర్యంగా ఉంటుంది. అది అచ్చంగా కవిత్వం. మరొకటేమైనా అయ్యిందీ అంటే అది ఆ తర్వాత కథ. రాముడు దేవుడా, మనిషా? నిజంగా ఉన్నాడా లేడా? అతను చేసింది ధర్మమా అధర్మమా? రామాయణాన్ని కవిత్వంగా చదివితే ఇలాటి ప్రశ్నలన్నీ గాల్లో కలిసిపోతాయి. శ్రీశ్రీ "పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి" అన్నప్పుడు తొక్కిసలాడుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోమని చెప్పాడా? "నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే ఆడపిల్లలు" అని తిలక్ అన్నప్పుడు అభౌతికమైన అక్షరాలు భౌతికమైన ఆడపిల్లలుగా ఎలా మారేయని మనం ప్రశ్నిస్తామా? మరి రామాయణంలో రాముడు శూర్పణఖ ముక్కూచెవులూ కోసెయ్యడం న్యాయమా అన్యాయమా అని వాదులాడుకోడం ఎందుకు? అలా వాదులాడుకోడం వెనక చాలా సజావైన కారణాలే ఉండవచ్చు. కాదనను. కాని ఒక్కసారి వాటన్నిటినీ పక్కన పెట్టి, రామాయణాన్ని కూడా కవిత్వంగా చదవడానికి ప్రయత్నించండి. అప్పుడు కలిగే ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇట్టే దొరుకుతాయి. ఆ సమాధానాలు మరొకళ్ళకి అంగీకారం కాకపోవచ్చు. నష్టం లేదు. కవిత్వం కలిగించే అనుభూతి సార్వత్రికం కాదు, కేవలం వైయక్తికం అంటే వ్యక్తిగతం.

యాదృచ్ఛికంగా (అదృష్టవశాత్తూ!) నిన్ననే రామాయణం గురించిన ఒక మహత్తర వ్యాఖ్య చదివాను (ఆ రచయిత బ్లాగ్లోకానికి సుపరిచితులే :-). మళ్ళీ అదే అనుభూతిని కలిగించింది! ఎక్కడో అంతరంగంలో మరుగునపడిపోయిన ఒక సుమధుర రాగమేదో హఠాత్తుగా తిరిగి వినిపించినట్టయ్యింది.
సీతాన్వేషణ మళ్ళీ మొదలయ్యింది.

నేనన్నన్ మఱి యెవ్వరో తెలియదే నీవైన చెప్పో ప్రభూ!
నేనే రాముడ నీవు జానకివి యన్వేషింతు నీకై ప్రభూ!
నేనే సీతను నీవొ రాముడవు నన్నేలంగ రావే ప్రభూ!
నేనే నీవును నీవె నేనునగుటల్ నిత్యంబెగా నా ప్రభూ!

సెలవు తీసుకొనే ముందు,
రాఘవగారి వాగ్విలాసంలో అతను వ్రాసిన సంస్కృత శ్లోకానికి నా తేట తెలుగు అనువాదం:

ఎండ వెన్నెల గనులు తామెవని కనులు
వెలుగు రేఱేడు లెవ్వని కొలము, పేరు
మేటి పాలేటిపట్టింటి మెరుపు తీగ
కెవడు మొయిలయ్యె పగటివేల్పింట బుట్టి
అతని, సీతమ్మ పెనిమిటి, నంజి యెదను
కొలువు జేసిన రామయ్య గొలుతు నేను

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
ఇంతకీ పండగ ఇవాళా? రేపా? నేనైతే రెండ్రోజులూ జరుపుకుంటున్నాను! రెండ్రోజులూ వడపప్పు పానకం ఆస్వాదించడం ఆనందమే కదా:-) అలానే రామసుధా రస పానం కూడాను!


పూర్తిగా చదవండి...

Tuesday, March 31, 2009

పద్యానికొక కొత్త గూడు - పద్యం.నెట్


ఎప్పుడో అంతరాంతరాల్లో ఒక చిన్న ఆలోచన విత్తనంలా నాటుకుంటుంది. అది సరైన సంరక్షణ లేక అలానే పడి ఉంటుంది. ఎవరో ఒకరు, ఒకరోజు హఠాత్తుగా దాన్ని గుర్తించి, దానికి నీళ్ళు పోసి, కష్టపడి మొలకెత్తేట్టు చేస్తే, ఆ విత్తనంలోంచి ఒక మొలక తలెత్తి ప్రపంచాన్ని చూసినప్పుడు ఆ భూమికి ఎంత ఆనందం కలుగుతుంది! సరిగ్గా అదే ఆనందం ఇప్పుడు నేను పొందుతున్నాను.
అంతర్జాలంలో పద్యానికి ప్రత్యేకమైన ఒక గూడు నిర్మించాలన్న ఆలోచనే ఆ విత్తనం. ఆ చిన్ని మొలక పద్యం.నెట్. ఆ కృషీవలుడు యోగిగారు (అతనికి సహాయం చేసినవారు శివగారు, మరింకెవరైనా కూడా ఉన్నారేమో నాకు తెలీదు).
అయితే ఉన్న తేడా అల్లా, ఊరికినే పైన పడున్న విత్తనాన్ని సమంగా భూమిలోకి నాటింది కూడా ఆ రైతే.

కొన్ని నెలల క్రితం, పద్యాల కోసం ఒక ప్రత్యేకమైన సైటు ఏర్పాటు చేస్తే బావుంటుందని యోగిగారు ప్రస్తావించినప్పుడు, నాలోని ఆలోచన అతని ద్వారా వినడం ఆశ్చర్యం ఆనందం అనిపించింది.
అయినా స్వాతిశయం అడ్డువచ్చి, భలేవారే, అయితే ఇక నా బ్లాగెందుకు మూసెయ్య వచ్చు అన్నాన్నేను. ఆ సైటు ఏర్పాటు చేసి మీకిచ్చేస్తాను ఆ తర్వాత దాన్ని ఎలా నిర్వహిస్తారో మీ యిష్టం అని అతను మర్యాదగా జవాబు చెప్పారు. అయితే ఆ తర్వాత సావధానంగా ఆలోచిస్తే నేను పొరపాటుపడ్డానన్న విషయం అర్థమయ్యింది.
బ్లాగు ప్రపంచంలో, ఇంకా విస్తృతంగా చూస్తే అంతర్జాలంలో, పద్యాల గురించి రాసిన, రాస్తున్న వాడిని నేనొక్కణ్ణే కాదు. చాలా మంది, చాలా బాగా రాస్తున్న వారు ఉన్నారు కదా. అలాంటి అందరికీ కూడా ఒక సామాన్య వేదికగా ఉండాల్సిన గూడు, నా ఒక్కడి సొత్తూ కాకూడదు. అందులో పద్య ప్రియులందరూ భాగస్వాములు కావాలి. ఆ ఉద్దేశంతో, దానికి తగ్గట్టుగా దీన్ని రూపకల్పన చేద్దామనుకున్నాం.

ఇంతకీ యీ కొత్త గూడు ఏం సాధించడానికీ అంటే;

1. అంతర్జాలంలో ఇప్పటికే పద్యాల గురించిన రకరకాల సమాచారం చాలా చాలా రూపాల్లో ఉంది. అయితే దాని గురించి వెతుక్కోవాలి. పైగా చాలా చోట్ల అది ఇంగ్లీషు లిపిలో ఉంది. అది చదవడానికి అసౌకర్యం. ఈ రెండు అసౌకర్యాలనీ నివారించాలన్నది ఒక ఉద్దేశం. దీనికోసం అంతర్జాలంలో అక్కడక్కడా ఇంగ్లీషు లిపిలో ఉన్న పద్య సంపదని వీలైనన్ని చోట్ల యూనీకోడులోకి మార్చి భద్రపరచే ప్రయత్నం చేద్దామనుకుంటున్నాం. అలాగే ఇప్పటికే తెలుగులో ఉన్న సమాచారానికి ఇక్కడనుంచి లంకెలివ్వడం ద్వారా వీటి గురించి ఒకే చోటనుంచి అందరికీ తెలిసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాం.

2. ప్రాచీన పద్య సాహిత్యం వీలైనంత భద్రపరచాలన్నది మరో ఉద్దేశం. అయితే యిది చాలా బృహత్తర కార్యం. ఒకరిద్దరితో సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ప్రస్తుతం వాటిలో కొన్ని కొన్ని భాగాలని మాత్రమిక్కడ ప్రచురించి పద్య ప్రియులకి వాటి మీద ఆసక్తి కలిగించాలన్నది ఆలోచన.

3. కొత్తగా పద్యాలు రాసే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేందుకు, వారికున్న సందేహాలని తీర్చేందుకు, తగిన ప్రోత్సాహం అందించేందుకూ ఒక వేదికగా కూడా యీ పద్యం.నెట్ ఉండాలని మరొక ఆకాంక్ష. దీనికి తగ్గట్టుగా, చర్చా వేదిక ఒకటి అందులో ఉంది. అలాగే పద్యాల కసరత్తు శీర్షిక ఒకటి.

సరే ఇంకా చాలా చాలా చెయ్యాలన్న ఉత్సాహం ఉంది (చెయ్యగలిగే వీలు కూడా ఉందని యోగిగారు భరోసా ఇచ్చారు కూడా) కాని, ప్రస్తుతానికి ఇంతకన్నా ఇక్కడ ప్రస్తావించడం అతిశయోక్తి అవుతుంది.

కాబట్టి పద్య ప్రియులందరికీ యీదే ఆహ్వానం, విన్నపం. పద్యం.నెట్ సందర్శించండి. మీ మీ అభిప్రాయాలు తెలియజెయ్యండి. దానిలో ఉత్సాహంగా పాల్గొనండి. అది మనందరి గూడు.
ముందే చెప్పినట్టుగా, ప్రస్తుతమిది మొలక దశలోనే ఉంది. దీన్ని జాగ్రత్తగా పెంచే పూచీ మనందరిదీను.

ఇదే నేను మిమ్మల్ని ఊరించిన కొత్త సంవత్సర కానుక :-) ఇది కానుక మాత్రమే కాదు, బాధ్యత కూడా అని గుర్తుంచుకోండి!


పూర్తిగా చదవండి...

Friday, March 27, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు


అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు!
కొత్త ఏడాది కొత్త ఛందస్సులో పద్యం రాద్దామనిపించింది. పేరుకి ఎంత విరోధి అయినా అతిథిగా వచ్చినవాణ్ణి మనసారా స్వాగతించడం మన సంస్కారం కదా!
అందుకే స్వాగత వృత్తంలో యీ స్వాగత పద్యం:

శ్రీకరమ్మగుచు చింతలు దీర్చే
శోకమున్ దుడిచి శోభల గూర్చే
జోకతోడ మము జూడు విరోధీ!
నీకు స్వాగతము నేరవిరోధీ!

అచ్చ తెలుగు ఆటవెలదిలో వచ్చిన విరోధికి ఒక విన్నపం:

గడప ద్రొక్కువాడు కడు విరోధి అయిన
స్వచ్ఛమైన హృదిని స్వాగతించు
మంచితనము కలుగు మా తెల్గువాళ్ళతో
చెలిమి కలిగి నీవు మెలగుమోయి!

మన తెలుగు సంవత్సరాలకి యీ పేర్లెలావచ్చాయో కాని భలే గమ్మత్తుగా ఉంటుంది! కోరికోరి ఎవరిలాటి పేరు పెట్టారో. ఈ పెరులో ఉన్న విరోధం ఆభాసగా మారాలని ఆకాంక్షిస్తూ, విరోధాభాసకి ఒక చక్కని ఉదాహరణ:

తన జనకుండురు స్థాణువు,
జనని యపర్ణాఖ్య, దా విశాఖుండనగా
దనరియు నభిమతఫలముల
జనులకు దయ నొసగుచుండు షణ్ముఖు గొలుతున్

ఇది నన్నెచోడుడు రచించిన కుమారసంభవంలో పద్యం. తండ్రేమో స్థాణువు (పెద్ద మోడు). తల్లేమో అపర్ణ (ఆకులే లేనిది), ఇంక తన పేరు విశాఖుడు (అంటే కొమ్మలు లేనివాడు). వినడానికి పేర్లిలా ఉన్నా జనులందరికీ అభిమతాలనే ఫలాలని దయతో అందించే షణ్ముఖుని కొలుస్తాను అని అర్థం.
అలాగే విరోధి పేరుకి మాత్రమే విరోధి అయి మనకి మంచి స్నేహామృతాన్ని పంచివ్వాలాని (దాన్ని అందుకొనే సహృదయం మనందరికీ ఉండాలనీ) మనసార కోరుకుంటూ...
అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.

అన్నట్టు, యీ కొత్త సంవత్సరం పద్యప్రియులకి ఒక కొత్త శుభవార్త! అదేమిటో అతి త్వరలో చెప్తాను. అందాకా వేచి ఉండండేం.


పూర్తిగా చదవండి...

Sunday, March 22, 2009

ఉద్యోగవిజయాలు


పని వత్తిడిలో పడి కొన్ని వారాలై బ్లాగు ముఖమే చూడలేదు.
అంత ఊపిరిసలపని పనిలోనూ, హఠాత్తుగా ఒక మధురక్షణంలో తిరుపతివేంకటకవుల ఉద్యోగవిజయాలు గుర్తుకొచ్చాయి. పడకసీను మనసులో మెదిలింది. ఇహనేం, "ఎక్కడనుండి రాక యిటకు...", "బావా యెప్పుడు వచ్చితీవు..." అంటూ మొదలుపెట్టి అందులో పద్యాలన్నీ ఒకటొకటీ అంతరంగ రంగస్థలమ్మీదకి సరాగాలతో వచ్చేసి హోరెత్తించేసాయి!
అంతలోనే ఓ చిలిపి ఊహ తళుక్కున మెరిసింది. మన సాఫ్టువేరు పనిగాళ్ళు యీ పడకసీను వేస్తే ఎలా ఉంటుందీ అని! అనుకున్నదే తడవుగా అంతరాత్మ స్టేజి మీద అన్నీ అమర్చేసింది.


అది ఒక సాఫ్టువేర్ కంపెనీ డివిషనల్ హెడ్డు కేబిన్. అందులో ఎప్పటిలా కృష్ణారావు సుదీర్ఘమైన ఓ కునుకు తీస్తున్నాడు. కలలోకూడా అతన్ని వదిలిపోని predictive management skill అతన్ని ఒక్కసారిగా నిద్రలేపింది. కేబిన్ బయటకి సారించిన అతని చూపుకి అర్జునరావు, రాజారావు వడివడిగా అడుగులు వేస్తూ తన కోసమే వస్తూ కనిపించారు. వాళ్ళిద్దరూ తనకింద పనిచేస్తున్న ప్రాజెక్టు మేనేజర్లు. ఈ మధ్యనే యిద్దరూ కొత్త కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టారు. అవి రెండూ (ఆ మాటకొస్తే ఏ రెండూ కావుకనక!) చాలా బిగిసిపోయిన కాలపరిమితితో (అదే tight schedule) ఉన్న ప్రాజెక్టులు. ఆ విషయం కృష్ణారావుకి బాగా తెలుసు. ఎందుకంటే కష్టపడి కష్టమరు కాళ్ళావేళ్ళా పడి తన బుద్ధి కుశలతనంతా ఉపయోగించి వాటిని సంపాదించి పెట్టింది (తద్వార బోనస్సులో అధికవాటా కొట్టేసింది) తనే కదా! దాన్ని పూర్తి చెయ్యమని "తగిన" టీముని కూడా తనే కదా ఏర్పాటు చేసాడు వాళ్ళకి. దాని గురించే తన దగ్గర మొరపెట్టుకోడానికి వస్తున్నారిద్దరూ అని అతనిట్టే గ్రహించేసాడు. హడావిడిగా బిజీ పనిలో నిమగ్నమైనట్టు, తన మోనిటర్ నుంచి తలతిప్పకుండా, కీబోర్డుపై వేళ్ళు టకటక లాడించడం మొదలుపెట్టాడు. ముందుగా అక్కడికి చేరిన రాజారావు, తన బాసు పనిలో ఉన్నాడనుకొని, అతనికి వ్రతభంగం చెయ్యకూడదని మెల్లిగా వచ్చి అతని మానిటరుముందున్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో అర్జునరావు కూడా అక్కడికి చేరాడు. అతను కాస్త బుద్ధికుశలత ఉన్న మేనేజరు. "May I come in Krish" అని తలుపుదగ్గరే నిలబడ్డాడు. తలతిప్పిన కృష్ణారావు అతన్ని చిరునవ్వుతో చూసాడు. బేగ్రౌండులో హార్మణీ సరిగమలని శ్రుతిచేసింది.

కృష్ణారావు: "ఎక్కడనుండి రాక యిటకు"

అర్జునరావు: (అంతరంగంలో) "నీ మొహం మండ! ఇంకెక్కణ్ణుంచి వస్తాను, అసలు సీట్నుంచి కదలడానికి టైముంటే కదా!" (జనాంతికంగా) "Open Plazaనుంచే" (అదివాళ్ళ టీము నివసించే బిల్డింగ్ పేరు)

కృ: "ఎల్లరునున్ సుఖులే కదా?"

అ: (ఏడవలేని ఒక నవ్వుతో ఊపీ ఊపకుండా తల ఊపుతాడు.)

కృ: "భలే టెక్కులు నీదు లీడులును, లేత మనస్కులు నీదు డెవ్లపర్స్
చక్కగనున్న వారె? మన దేవుడు కష్టమరన్ని వేళలన్
మక్కువ నిల్చి శాంతి గతి తాను చరించునె తెల్పు మర్జునా!

(ఈపాటికే సాఫ్టువేరువాళ్ళకి ఛందస్సు పెద్దగా రాదన్న విషయం ప్రేక్షకులు గమనించే ఉంటారు!)

అర్జునరావు జవాబు చెప్పేలోపలే తల పక్కకి తిప్పి అక్కడ కూర్చున్న రాజారావుని అప్పుడే చూసినట్టు చూసాడు కృష్ణారావు.

కృ: "నీవా! ఎప్పుడు వచ్చితీవు సుఖుడే నీ కష్టమర్ దేవుడున్
నీ వాల్లభ్యము పట్టు లీడులును డెవ్లప్పర్స్ సుఖోపేతులే?
మీ వర్కున్ సరిజూచు టెస్టరులు మీ మేల్గోరు క్యూయే ప్రియం
భావుల్ సేమముమై నెసంగుదురె నీ తేజంబు హెచ్చించుచున్...నీవా...ఆ...ఆ...ఆ..."

అతని రాగాన్ని ఆదిలోనే కట్ చేస్తూ రాజారావందుకొన్నాడు.

రా: "కష్టమరూ మనం మునుగు కాలము సేరువ అయ్యె"

అంతకన్నా అతనికి ఛందస్సులో మాట్లాడే ఓపిక లేక సూటిగా వచనంలో తన గోడంతా వినిపించేడు. పనిలోపని అర్జునరావు కూడా అందుకే వచ్చుంటాడని ఎడ్యుకేటెడ్ గెస్సుకూడా చేసి, అతనికన్నా ముందు తనే వచ్చేనని కూడా నొక్కివక్కాణించాడు.
చివరికి "సహాయమున్ కోరగ నేగుదెంచితిమి డివిషనలైక శిరోవిభూషణా" అని మాత్రం అన్నాడు.
అప్పుడు కృష్ణారావు ఒక కొంటె నవ్వు నవ్వి,

కృ: "ముందుగ వచ్చితీవు, మునుముందుగ అర్జును నేను జూచితిన్
పొందిన రిస్కులన్నియవి పాయగ నిల్చె సహాయ మిర్వురున్
జెందుట పాడి, మీకునయి చేతు రిసోర్సు విభాగ మందు మీ
కుం దగుదాని గైకొనుడు...కాని రాజారావ్,...కోరుట యెఫ్ఫెము కొప్పు ముందుగన్!

(F.M. అనగా Functional Manager. అనగా మేనేజర్ పనే చేసినా మేనేజరని పిలిపించుకోలేని వాడు. Managerకి ముందు దశన్న మాట. అర్జునరావింకా ఆ దశలోనే ఉన్నాడు. రాజారావు అప్పటికే ఆ దశని దాటుకొచ్చేసాడు.)

రా: (తనలో తాను) "ఔరా! క్రిష్ ఎంత మోసము చేయుచున్నాడు! నా తరువాత వచ్చిన అర్జునరావుకి రిసోర్సులో భాగమివ్వడమే కాక, కోరుకొనుటలోనూ అతనికే ముందు ఛాన్సు ఇచ్చాడు!".

రాజారావు అనుమానాన్ని గ్రహించిన కృష్ణారావు అతన్ని బుజ్జగిస్తూ,

కృ: "నువ్వేమో ఎక్స్పీరియన్సుడు మేనేజరువి. ప్రాజెక్టు మేనేజ్మెంటులో ఆరి తేలినవాడివి. ఇతనింకా జూనియరు. కాబట్టి ఇట్లు వేరుగ అడుగవలసి వచ్చింది. అది అట్లుండన్"
అని అసలు రిసోర్సింగు విషయానికి వచ్చాడు. వాళ్ళొచ్చింది Additional Resources కోసమే కదా!

కృ: "అన్ని యెడలను నాకు దీటైనవారు
కలరు పదిమంది డెవ్లపర్స్ ఘనులువారు
వారలొకవైపు, ఆర్కిటెక్టొక్కవైపు
కోడు చేతురు వారలబద్ధ మెందులకు
మరి ఆర్కిటెక్టో?

కోడింగు త్రోవబోవక, బుద్ధికి తోచినది ఏదో ఏదో సహాయమున్ బొనరించున్!"

రా: (తనలో తాను) "కపట నాటక సూత్ర ధారి! డెవెలపర్సందరినీ అర్జునరావుకి కట్టబెట్ట ఇతనీ పన్నాగము పన్నినాడు. ఒక మాడ్యూలైనా చేపట్టడట, కోడింగు చెయ్యడట. ఈ కంచి గరుడ సేవ ఏరికి కావలె! ఊ...!"

అ: "క్రిష్ కోరుకొమ్మందువా?"

కృ: "కోరుకొనవచ్చును కాని, నేను చెప్పిన మాటలు తుట్టదుద వరకూ వింటివో లేదో. మరొక్కసారి చెప్పెదను ఆలకింపుము.
మాడ్యులు నోనుసేయ డత డందరకూ నొక పట్ల టెక్నికల్
సాయము సేయువాడు, పెలుచన్నను పిమ్మట యెగ్గులాడినన్
దోయిలి యొగ్గెడున్, నిజము తొల్త వచించితి కోరికొమ్ము నీ
కేయది యిష్టమో కడమ యీతని పాలగునోయి అర్జునా!"

అ: (ఇతనికీ ఛందస్సులో మాట్లాడే ఓపికలేదు.) "క్రిష్ అటులైన నేను ఆర్కిటెక్టుని తీసుకొందును."

రా: (తనలో తాను) "హ...హ..హ... క్రిష్ తాను తీసిన గోతిలో తానే పడినాడు. నాకంతయూ మేలే జరిగినది". (జనాంతికముగా) "క్రిష్! ఇంక చేయునది ఏమున్నది. మిగిలిన డెవలపర్సందరినీ నేను గైకొందును. సరి, ఇక నాకు కష్టమరుతో టెలీకానుకి వేళ అయినది. ఇక నేను పోయివత్తునా? ఆ...? ఆ...!"

రాజారావు రంగస్థలం నుంచి నిష్క్రమిస్తాడు. కృష్ణారావుకి థాంక్సు చెప్పి అర్జునరావు కూడా వెళ్ళిపోతాడు.
కృష్ణారావు యథావిథిగా మళ్ళీ నిద్రకుపక్రమిస్తాడు.

తెరదించబడుతుంది.

ఆ తర్వాత కథ అందరూ ఊహించేదే! పదిమంది additional developersతో పని చేయించుకోడానికి రోజుకి మరో అయిదు గంటలు ఎక్కువ పని చేసినా రాజారావు ప్రాజెక్టు deadline దాటిపోతుంది. అర్జునరావు technical support బాధ్యతంతా ఆర్కిటెక్టుకి అప్పగించి నిశ్చింతగా తన పని చూసుకుంటాడు. ఆ ఆర్కిటెక్టు application architecture, design తయారు చెయ్యడం దగ్గర నుంచి, కొత్త developersకి training ఇవ్వడం, వాళ్ళెక్కడైనా చెయ్యలేకపోతే తనే స్వయంగా కూర్చుని వాళ్ళకి చేసిపెట్టడం,ఇలా రాత్రి పగలు "technical support" చేస్తూ ప్రాజెక్టుని అయ్యిందనిపిస్తారు. అర్జునరావుకి మరుసటి ఏడాది "Functional" అనే బిరుదుని తొలగిస్తారు. ఉద్యోగంలో విజయ రహస్యం తెలుసుకున్న అతను విజయునిగా (అనగా successful managerగా) పేరుతెచ్చుకుంటాడు.

స్వస్తి!

ముఖ్య గమనిక(లు):

ఈ నాటకం కేవలం కల్పితం. ఎవరూ భుజాలు తడుముకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇది ఏ ఒక్క వర్గాన్నీ కులాన్నీ కించపరిచే ఉద్దేశంతో రాసింది కాదని మనవిచేసుకుంటున్నాను.
అన్ని చోట్లా భారతదేశంలో Software భారత కథ ఇలాగే ఉంటుందని కూడా చెప్పలేమని సవినయంగా విన్నవించుకుంటున్నాను.


పూర్తిగా చదవండి...

Tuesday, February 24, 2009

ఇల్లరికపుటల్లుడు!


నిన్న చంద్రమోహన్ గారి బ్లాగులో శివుడు పార్వతి చేత మొట్టికాయ తిన్న సందర్భాన్ని చదివినప్పుడు, అదే హరవిలాసంలో మరో సందర్భం, మరో పద్యం గుర్తుకువచ్చింది.
శివపార్వతులు ఒకరికోసం ఒకరు తపస్సు చేసుకొని చివరికి పెళ్ళిచేసుకున్నాక, శివుడు సపరివారంగా హిమగిరిపైనే, మావగారింటనే నివాసమున్నాడట. "శివుడికి తన భార్యంటే ఎంత ప్రేమో, అలా ఇల్లరికం ఉండిపోయాడు!" అని ఆశ్చర్యపడతాడు శ్రీనాథుడు. అయితే ఆ సంబడం ఎంతో కాలం సాగదు. కొన్నాళ్ళు గడిచాక అత్తమామమలకి అతనిమీద చిరాకు కలుగుతుంది.
ఏవండీ, అల్లుడు ఒక్కడే తమ ఇంట్లో ఉండి కార్యనిర్వాహకుడై అన్నీ చూసుకుంటూ ఉంటే ఏ అత్తమామలైనా ఎన్నాళైనా అతన్ని తమ ఇంట్లో పెట్టుకుంటారు. విష్ణుమూర్తి మాత్రం ఇల్లరికపుటల్లుడు కాదూ! పాలకడలిపై శేషతల్పమున హాయిగా సంసారం సాగించుకుంటాడు కదా. అతనిమీద ఎప్పుడైనా సముద్రుడికి చిరాకు కలిగిందా? మరి హిమవంతుడికి శివుడిమీద ఎందుకొచ్చింది చిరాకు?
అసలే శివుడు బిక్షపతి! దానికి తోడు, తన పరివారాన్నంతా మావగారింత్లో దింపాడు. ఆ పరివారం ఎవరయ్యా? భూత పిశాచగణం, పశుగణమూను. వాళ్ళు చేసే భీభత్సం ఇక అంతా ఇంతానా! రాత్రీ పగలు కల్పలతాప్రసూన మాధ్వీకాన్ని తాగి తందనాలాడారు. ఇంకా చాలా చాలా గందరగోళం చేసారు. దానితో హిమవంతుడికి చిఱ్ఱెత్తుకొచ్చింది. రాదు మరీ! కానీ ఏం చేస్తాడు పాపం. తన కూతురు కోరి ప్రేమించి పెళ్ళిచేసుకున్న అల్లుడాయె! వెళ్ళి తన కూతురిదగ్గరే మొరపెట్టుకుంటాడు.
ఇలా శివుడి బంధుగణాన్నీ, శివుడినీ ఆక్షేపిస్తూ హిమవంతుడన్న మాటల్లో శివుడి ఆకారాన్ని వెక్కిరించే మాంచి అందమైన చమత్కార పద్యం ఒకటి మనకందించాడు శ్రీనాథుడు. అవధరించండి మరి:


తలమీద చదలేటి దరిమీల దినజేరు
కొంగలు చెలగి కొంగొంగురనగ
మెడదన్ను పునుకుల నిడుపేరు లొండొంటి
బొరిబొరి దాకి బొణ్బొణుగురనగ
గట్టిన పులితోలు కడకొంగు సోకి యా
బోతు తత్తడి చిఱ్ఱుబొఱ్ఱు మనగ
గడియంపు బాములు కకపాలలో నున్న
భూతి మై జిలికిన బుస్సు రనగ

దమ్మిపూజూలి పునుకకంచమ్ము సాచి
దిట్టతనమున బిచ్చము దేహి యనుచు
వాడవాడల భిక్షించు కూడుగాని
యిట్టి దివ్యాన్నములు మెచ్చునే శివుండు!

సీసమంటే శ్రీనాథుడే అన్నదానికి ఈ పద్యం ఒక మచ్చుతునక. శ్రీనాథుడు సంస్కృతానికి "డు ము వు లు" చేర్చి తెలుగు పద్యాలు రాసేస్తాడనే వారికి ఇదో చురక. ఎంత ఒళ్ళు పులకరించి పోయే తెలుగండీ ఇది! ఆ ఎత్తుగడే ఎంత ఒయ్యారంగా ఉందో మరొక్కసారి చదివి అనుభవించండి!

శివుడు భిక్షకి వెళ్ళే సందర్భంలో ఎంత గోల గోలగా ఉంటుందో వర్ణిస్తున్నాడు.

తలమీద ఉన్న "చదల ఏరు"(అంటే ఆకాశ గంగ)లో దరిమీనులు (ఇవో రకం చేపలు) ఉన్నాయట! జుమ్మని ఎగసిపడే గంగలో చేపలేంటని చొప్పదంటు ప్రశ్నలు వెయ్యొద్దు. శివుడి తలే పెద్ద మడుగైపోయి ఉంటుంది. అందులో చేపలు చేరి ఈదులాడుకోవచ్చు కదా. వాటిని తినడానికి కొంగలతని తల చుట్టూ మూగుతున్నాయట. అవి "కొంగు కొంగు" అని చేసే గోల అంతా ఇంతానా!
మెడలోనేమో పుఱ్ఱెల మాల. శివుడు కదులుతూ ఉంటే, ఆ పుఱ్ఱెలు ఒకదానితో ఒకటి రాసుకుంటూ చేసే "బొణుగూ బొణుగూ"మనే శబ్దం ఒకటి. అంతేనా! కట్టుకున్న పులితోలు కొంగుచివర, శివుడెక్కి కూర్చున్న నందిని తాకుతూ ఉంటే అది చిరాకుతో (భయంతోనో) చిఱ్ఱుబుఱ్ఱు లాడుతోంది. చేతికి కడియాలుగా కట్టుకున్న పాములు, చేతిలో ఉన్న కకపాలలోని విభూది మీద తుళ్ళినప్పుడల్లా బుస్సు బుస్సు మంటున్నాయి. అంతా గోల గోల!
ఇంత గోలా అవుతూండగానే, "తమ్మిపూ చూలి" (అంటే పద్మంలోంచి పుట్టిన బ్రహ్మ) కపాలాన్ని ఓ చేత్తో పట్టుకొని భిక్షాందేహీ అంటూ వీధివీధి తిరిగి బిచ్చమెత్తుకొంటాడు. అలాటి ముష్టెత్తుకున్న కూడు తప్ప శివుడికి మనం పెట్టే దివ్యాన్నాలు రుచిస్తాయా?
పాపం ఎంతగా ఇబ్బందిపడ్డాడో ఆ హిమవంతుడు. లేకపోతే ఇంత ఘాటుగా తన కూతురిముందే అల్లుణ్ణి మరే మావైనా గేలిచేస్తాడా! శ్రీనాథుడికి శివుడంటే ఎంత చనువులేకపోతే ఇలాటి పద్యాలు రాయగలడు!

భక్తి, తత్త్వం, వేదాంతం, మతం ఇవన్నీ పక్కన పెట్టీండి. తమకి తెలియని, ఎన్నడూ చూడని, ఒక నిర్గుణ నిరాకార శక్తికి ఇలాటి అద్భుతమైన ఆకారాన్ని ఊహించిన కల్పనా ప్రతిభకి "ఆహా!" అనకుండా ఉండగలమా? ఒకవైపు నెలవంక, మరోవైపు నీటి బుగ్గ. నుదుటి మధ్య నిప్పు కన్ను. మెడ చుట్టూ పాములు. కట్టుకునేది పులితోలు లేదా ఏనుగుతోలు. ఒక చేత త్రిశూలం, మరో చేత ఢమరుకం. ఇలాటి కల్పన చేసినవాడు ఎంత గొప్ప కవి అయ్యుంటాడు! ఆ కల్పనకి తోడుగా మరెన్ని కథలు, ఎన్ని చమత్కారాలు, ఎన్ని కావ్యాలు!

శ్రీనాథా! నీ ఈ పద్యానికి కనకాభిషేకం చేసే శక్తి నాకు లేదు కాని, నా ఆనందాశ్రువులతో నీకు నా మనసులోనే అభిషేకం చేసాను అందుకోవయ్యా!


చిన్న ప్రశ్న: ఎత్తుగీతి చివరి పాదంలో యతి ఎలా సరిపోయిందో చెప్పుకోండి చూద్దాం?


పూర్తిగా చదవండి...