తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Friday, March 27, 2009

నూతన సంవత్సర శుభాకాంక్షలు


అందరికీ నూతనసంవత్సర శుభాకాంక్షలు!
కొత్త ఏడాది కొత్త ఛందస్సులో పద్యం రాద్దామనిపించింది. పేరుకి ఎంత విరోధి అయినా అతిథిగా వచ్చినవాణ్ణి మనసారా స్వాగతించడం మన సంస్కారం కదా!
అందుకే స్వాగత వృత్తంలో యీ స్వాగత పద్యం:

శ్రీకరమ్మగుచు చింతలు దీర్చే
శోకమున్ దుడిచి శోభల గూర్చే
జోకతోడ మము జూడు విరోధీ!
నీకు స్వాగతము నేరవిరోధీ!

అచ్చ తెలుగు ఆటవెలదిలో వచ్చిన విరోధికి ఒక విన్నపం:

గడప ద్రొక్కువాడు కడు విరోధి అయిన
స్వచ్ఛమైన హృదిని స్వాగతించు
మంచితనము కలుగు మా తెల్గువాళ్ళతో
చెలిమి కలిగి నీవు మెలగుమోయి!

మన తెలుగు సంవత్సరాలకి యీ పేర్లెలావచ్చాయో కాని భలే గమ్మత్తుగా ఉంటుంది! కోరికోరి ఎవరిలాటి పేరు పెట్టారో. ఈ పెరులో ఉన్న విరోధం ఆభాసగా మారాలని ఆకాంక్షిస్తూ, విరోధాభాసకి ఒక చక్కని ఉదాహరణ:

తన జనకుండురు స్థాణువు,
జనని యపర్ణాఖ్య, దా విశాఖుండనగా
దనరియు నభిమతఫలముల
జనులకు దయ నొసగుచుండు షణ్ముఖు గొలుతున్

ఇది నన్నెచోడుడు రచించిన కుమారసంభవంలో పద్యం. తండ్రేమో స్థాణువు (పెద్ద మోడు). తల్లేమో అపర్ణ (ఆకులే లేనిది), ఇంక తన పేరు విశాఖుడు (అంటే కొమ్మలు లేనివాడు). వినడానికి పేర్లిలా ఉన్నా జనులందరికీ అభిమతాలనే ఫలాలని దయతో అందించే షణ్ముఖుని కొలుస్తాను అని అర్థం.
అలాగే విరోధి పేరుకి మాత్రమే విరోధి అయి మనకి మంచి స్నేహామృతాన్ని పంచివ్వాలాని (దాన్ని అందుకొనే సహృదయం మనందరికీ ఉండాలనీ) మనసార కోరుకుంటూ...
అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు.

అన్నట్టు, యీ కొత్త సంవత్సరం పద్యప్రియులకి ఒక కొత్త శుభవార్త! అదేమిటో అతి త్వరలో చెప్తాను. అందాకా వేచి ఉండండేం.

6 comments:

 1. మీక్కూడా మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. విరోది నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 3. యధావిధిగా చాలా చాలా బావుంది.
  నిన్న పంచాంగ శ్రవణంలో విరోధిలో వి ని ఉపసర్గగా తీసుకుంటే కష్టములు లేకుండే ఉండేది అని అర్ధం చెప్పారు మా శాస్త్రిగారు.

  ReplyDelete
 4. మీకు కూడ నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 5. కామేశ్వర రావు గారు,
  నూతన సంవత్సర శుభాకాంక్షలు.
  వేచి ఉంటాం కానీ, తమిళ నాట నిశిగంధు సినిమా విడుదల తేదీ లాగా .. పొడిగిస్తూ పోకోడదు మరి :)

  ReplyDelete
 6. ఎందుకేమిటెటులెప్పుడనంటూ సందియంబులను చాలనడంచీ విందుకోసమని వేచుచునుంటే నెందుకండి తమరిట్లది దాస్తే? త్వరగా సెలవీయరూ. :)

  ReplyDelete