ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా
వసంతస్సామంతో మలయమరుదాయోధన రథః
తథాప్యేకస్సర్వం హిమగిరిసుతే కామపి కృపాం
అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే
ఈ మధ్యనే శంకరాచార్యులవారి సౌందర్యలహరి చదవడం మొదలుపెట్టాను. ఇప్పటిదాకా దాని గురించి ఎవరైనా చెప్పగా వినడమే కాని ఎప్పుడూ చదవలేదు. చదవడం మొదలుపెట్టగానే, ఇది మామూలు పుస్తకంలా చదువుతూ పోకుండా, ఆ శ్లోకాలని కంఠస్థం చేస్తే బాగుంటుందన్న కోరిక బలంగా ఏర్పడింది. ఇంకా పట్టుపని పది శ్లోకాలయ్యాయి! అందులో పై శ్లోకం ఆరవది.
లోకాన్ని జయించిన మన్మథుడి గురించిన శ్లోకం. అతని విల్లేమో పువ్వులతో చేసింది. చాలా సుకుమారమైనది. మౌర్వీ అంటే వింటి నారి (అల్లె త్రాడు). అదేమో మధుకరమయీ, అంటే తుమ్మెదల మయం. అలాంటి అల్లెతాడుకి బిగువేముంటుంది? ఇంక ఆ మన్మథుడి దగ్గరున్న బాణాలేమో అయిదే అయిదు! అతనికి సహాయం ఎవరయ్యా అంటే వసంతుడు. ఏడాదికి రెండు నెలలు మాత్రమే ఉంటుంది అతని తోడు. ఈ మన్మథ యోధుడెక్కే రథం ఏమిటంటే మలయమారుతం. అంటే వట్టి గాలి! పైగా ఆ మన్మథుడెవరు? అనంగుడు. అంటే అతనికి భౌతికమైన శరీరమే లేదన్న మాట! అలాంటి మన్మథుడు తానొక్కడే ఈ లోకాన్నంతటినీ జయిస్తున్నాడు. ఎలా? ఓ హిమగిరిసుతా! నీ కడకంటి చూపులలోని ఏదో ఒక కృపావిశేషం లభించడం వల్లనే సుమా! మన్మథుని మహత్తు వెనకనున్న అసలు రహస్యం అమ్మవారి కృపేనన్నమాట.
మన్మథుడంటే మరెవరో కాదు మనిషి అంతరంగంలోని అనుభూతులే. సుకుమారమైన మనిషి మనసే మన్మథుడి విల్లు. అతని అయిదు బాణాలు మనిషి పంచేంద్రియాలు. ఈ బాణాలని మనసనే ధనుస్సుకి అనుసంధానం చేసే వింటి నారి - ఇంద్రియ స్పందనని మనసుకి చేర్చే నాడి. అలా పంచేద్రియాల స్పందన మనసుని వంచుతుంది. దాని ద్వారా ఏర్పడిన అనుభూతి చిత్తాన్ని సంచలింపచేసి మనిషిని లొంగదీసుకుంటుంది. అదే మన్మథ విజయం. అయితే ఈ అనుభూతిని కలిగించే శక్తి ఏదో మన అంతరంగంలో ఉండి ఉండాలి. ఆ మూల శక్తినే రకరకాల రూపాలలో భావించి స్తోత్రం చేసారు మన పూర్వులు. అందులో అమ్మవారి రూపం ఒకటి.
ఈ శ్లోకం చదవగానే కరుణశ్రీగారు వ్రాసిన పద్యం ఒకటి గుర్తుకువచ్చింది. ఉదయశ్రీ పుస్తకంలో "తపోభంగం" అన్న పద్య కవితలో నాకు ఇష్టమైన పద్యమిది.
తియ్యవిల్కాడు వింట సంధించి విడిచె
అక్షయమ్మైన సమ్మోహనాశుగమ్ము
గౌరి కడకంటి చూపుతో కలిసిపోయి
గుచ్చుకొనె నవి ముక్కంటి గుండెలోన
శివునికి తపోభంగమైన సన్నివేశం. శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే అతనికి ఉపచారాలు చేస్తున్న పార్వతీదేవి పూలబుట్టతో అతని దగ్గరకి వచ్చింది. సరిగ్గా అప్పుడే తియ్యవిలుకాడైన మన్మథుడు సమ్మోహన బాణాలని తన వింట సంధించి విడిచాడు. అవి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయి. అలా చెప్పి ఊరుకుంటే అందులో కవిత్వమేముంటుంది! ఇందులో మూడవపాదం ఈ పద్యానికి ఆయువుపట్టు. శివుని ఎదురుగ్గా నించున్న పార్వతీదేవి అతడిని తన కడకంటితో చూస్తోంది. ఆ కడకంటి చూపులలో ఈ బాణాలు కలిసిపోయి ముక్కంటి గుండెలో గుచ్చుకున్నాయట! అందమైన స్త్రీల చూపులని మన్మథ బాణాలతో పోల్చడం మామూలు. కాని ఇక్కడ నిజంగా మన్మథ బాణాలున్నాయి. అవి ఆ చూపులతో కలిసిపోయాయి. ఇప్పుడు శివుని మనసు చలించినది మన్మథుడి బాణాల వల్లనా, గౌరి చూపులవల్లనా? పరమ శివునిలో స్పందన కలిగించే శక్తి అమ్మవారికి తప్ప మన్మథుడి కెక్కడిది! మరి శివుడు పాపం మన్మథుణ్ణి ఎందుకు భస్మం చేసాడు? ఎందుకంటే మన్మథుడు తన ప్రతాపం వల్లనే ఇదంతా జరిగిందని భ్రమించాడు. అంచేత అతనికి కర్మ చుట్టుకుంది. ఆ కర్మ ఫలితం అనుభవించక తప్పింది కాదు.
శంకరాచార్యులవారు వాడే ప్రతి పదం వెనక ఏదో ఒక ప్రత్యేకమైన కారణం, అర్థం ఉండే ఉంటుందని చాలామంది వ్యాఖ్యాతలు అంటారు. పై శ్లోకంలో అమ్మవారికి "హిమగిరిసుతే" అన్న పదం ఉపయోగించడం శివ తపోభంగ ఘట్టాన్ని గుర్తుచెయ్యడానికే కాబోలు! ఆ శ్లోకమిచ్చిన స్ఫూర్తితోనే కరుణశ్రీగారు ఈ పద్యాన్ని వ్రాసారేమో! శంకరుల శ్లోకం గురించి తెలుసుకున్నాక, కరుణశ్రీగారి పద్యం మరింత అందగించింది. మరింత నచ్చింది!
పూర్తిగా చదవండి...