తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Tuesday, December 29, 2009

గరికిపాటివారి శతావధానం సంపూర్ణం

గరికిపాటివారి శతావధానం దిగ్విజయంగా పూర్తయ్యింది. ఈ అవధానం పుణ్యమా అని ఈసారి అసలు ఊరు వెళ్ళివచ్చినట్టే లేదు. ఉన్న మూడు రోజులూ మూడు గంటల్లా గడిచిపోయాయి! ఉదయాన్నే ఎనిమిదిన్నరకల్లా బయలుదేరి శతావధాన సభకి వెళ్ళడం. మధ్యాహ్నం సుమారు ఒంటిగంటన్నర దాకా సభ. తర్వాత భోజనాలు. ఒక గంట విశ్రాంతి. మళ్ళీ నాలుగుగంటలకల్లా సభ ప్రారంభం. రాత్రి ఇంచుమించు తొమ్మిది దాకా.

గరికిపాటివారు ఆశువుగా అనర్గళంగా పద్యాలు చదువుతూ ఉంటే, బాగా ఎత్తునుంచి పడే ఒక జలపాతం కింద నించొని ఆ నీటి ధారలో ఆపాదమస్తకం తడుస్తున్న అనుభూతి. ప్రేక్షకులని అయస్కాంతంలా ఆకర్షించగలిగే శక్తి అతని మాటల్లోనూ, మాట తీరులోనూ ఉంది. బహుశా మూడువందల మంది పట్టే ఆడిటోరియం అనుకుంటా, ప్రతి రోజూ నిండుగానే ఉండేది. చివరి రోజయితే చాలామంది జనాలు కూర్చునే చోటులేక నించునే ఉన్నారు! నేను ఒక పృచ్ఛకుడి కావడం వల్లనూ కాస్త స్థానబలిమి ఉండడం వల్లనూ గరికిపాటివారికి అతిదగ్గరగా కూర్చునే అదృష్టం లభించింది. అతనొక పద్యపాదాన్ని చెప్పి, ఎలా ఉందని చిద్విలాసంగా మా వైపు చూడడం, మేము మా ఆనందాన్ని మొహంలోనూ, ఒక తల ఊపులోనూ చూపిస్తూ ప్రతిస్పందించడం, సరదాగా విసిరే హాస్యోక్తులనూ ఉద్వేగంతో పలికే కఠినోక్తులనూ తాదాత్మ్యంతో చెప్పే మధురోక్తులనూ మేము కూడా సంతోషంతో ఉద్వేగంతో తాదాత్మ్యంతో వినడం - ఇలాంటి అనుభవం నిజంగా అదృష్టమే.

సహజంగా ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా రాష్ట్రంలో ఈనాడు నెలకొన్న పరిస్థితుల గురించిన అంశాలు వచ్చాయి. దీని గురించి గరికిపాటివారు చాలా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాజకీయ పరిపాలనా కారణాల వల్ల విడిపోవలసిన అవసరం ఉంటే విడిపోవడంలో తప్పులేదు. అది సమస్య కాదు. ఎంతటి వైవిధ్యమున్నా భాషా సంస్కృతులు ఒకటేనన్న గ్రహింపు ఉండి, ప్రజలలో ప్రాంతీయ విద్వేషాలు లేకుండా ఉండడం చాలా అవసరం. స్వార్థ రాజకీయశక్తుల వల్ల ఇది చెడిపోతోందని అతను చాలా ఆవేదన చెందారు. ఎక్కడబడితే అక్కడ సమైక్యాంధ్ర బ్యానర్ల మీద "సమైఖ్యాంద్ర" అని వ్రాసి ఉండడం సమైక్యాంధ్ర మాట దేవుడెరుగు, ముందు తెలుగు భాషకి పట్టిన దౌర్భాగ్యాన్ని తనకి పదేపదే గుర్తుకుచేసిందని బాధపడ్డారు.

గరికిపాటివారికి ధారణా బ్రహ్మరాక్షసుడు అనే బిరుదు ఉంది కాని, అతను ధారలో కూడా బ్రహ్మరాక్షసుడే! ఒక సమస్య పూర్తి అయ్యీఅవ్వక ముందే పూరణ మొదటిపాదం అందుకోవడమంటే మరి మామూలువాళ్ళకి సాధ్యమా?! సరే ధారణ సంగతి చెప్పనే అక్కర లేదు. మొత్తం 75 పద్యాలను 32 నిమిషాలలో ధారణ చేసారు. అంటే ఒకో పద్యం ధారణ చెయ్యడానికి అరనిమిషం కూడా పట్టలేదన్న మాట! ఆ ప్రవాహ వేగం గురించి ఇంకా చెప్పేదేముంది! సాధారణంగా అవధానాలలో పద్యాలని ఎంత వేగిరం పూరిద్దామా అని చూస్తారు, వర్ణనలని కూడా. దీని వల్ల వీటిలో కవిత్వం పెద్దగా గుబాళించదు. కాని గరికిపాటివారికి ఈ విషయమై కాస్త తాపత్రయం ఎక్కువ. కాబట్టి కొన్ని చోట్ల ఆగి ఆలోచించడం జరిగింది. దాని ఫలితంగా కొన్ని అందమైన పూరణలు కూడా వచ్చాయి.

సమస్య, దత్తపదులు, వర్ణనలు, ఆశువులు అన్నీ కలిపి మొత్తం 101 పద్యాలు. ఇవన్నీ విజయభావనవాళ్ళు తమ బ్లాగులో పెడతారనుకుంటాను. పద్యప్రియులు వాటిని ఆస్వాదించవచ్చు. కొంత భాగం వీడియో తీసినట్టున్నారు కాని అది ఎప్పటికి వస్తుందో, ఇంటర్నెట్లో పెట్టగలనో లేదో తెలియదు.

ప్రస్తుతానికి, నేనిచ్చిన సమస్య ఇది:

భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్

ఆసక్తి ఉన్నవాళ్ళు పూరించడానికి, గరికిపాటివారి పూరణని నా పూరణని ఇవ్వడం లేదు. ప్రయత్నించి చూడండి.

24 comments:

 1. బాగుంది భైరవభట్ల గారూ మీరు చెప్పిన అవధాన విశేషాలు - మరింత విపులంగా వివరిస్తారని - పూరణ చేసేంత సత్తా నాకు లేదు కానీ - "కారణ భూతమ్మగు" తో ముగుస్తుంది అని మటుకు అనిపిస్తోంది! :)

  ReplyDelete
 2. ఏక నుండి వచ్చింది సమైక్య అవ్వదా అని నాకూ అనిపించింది. ఒక చోటైతే సమైఖాంధ్ర అని కూడా వుంది.
  నేనూ మల్లిన నరసింహారావు గారూ వద్దామనుకున్నాం. ఆయనైతే చాలా వద్దామనుకున్నారు, కానీ నాకు ఆదిసోమ వారాలు ఇక్కడ ఇతర జనాలను కలసుకోవాల్సివచ్చి ఉండిపోయాను.

  ReplyDelete
 3. విశేషాలు బావున్నాయండి. మీరు ఆయన పక్కన కూర్చొని అనుభూతి చెందడానికి ఖచ్చితంగా అర్హులే.

  పూరణలు చేసే శక్తి నాకూ లేదు, అయితే మీ సమస్య సరళంగా ఉన్నట్లు నాకనిపిస్తున్నది.

  ReplyDelete
 4. మీకు అవధానాల్లో లోపింపజేయటం అలవాటు, నాకు అందరి లోపాలు వెతకటం అలవాటు.

  పూరణ బట్టుకొని 2010 లో దర్శనం జేసుకుంటాను.
  భవదీయుడు
  ఊకదంపుడు

  ReplyDelete
 5. వంశీ గారూ,
  మీరన్నట్లు
  కా - రణ భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేతల్.
  అంటే ర-వీ లకు యతి చెల్లదు.

  ReplyDelete
 6. రవి గారూ.. సమస్య ఏమాత్రం సరళంగా లేదు. నాదృష్టిలో గంభీరంగా ఉంది. మీరు గమనిచారో లేదో...

  "భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించి రద్దేవతల్" = 18 అక్షరాలతో 'త జ భ స ర ర ' గణాలుగా వస్తున్నవి. నా మటుక్కి నాకు ఈ గణాలు ఏ వృత్తనివో/ జాతులవో తెలియటం లేదు.

  కామేశ్వరరావు గారూ.. పూరించే ముందు నాదొక చిన్ని ప్రశ్న.
  మీరిచ్చినది పూర్తి పాదామేనా?

  మూడవపాదంలో అక్షరాలను కలుపుకుని సమస్యని పూరించటం తెలుసు కానీ ఏకం గా మీరివ్వని(లేదా) మాకు నచ్చిన పదాలను కూడా కలుపుకుని పూరించవచ్చా?? (అలా చేస్తే పూరణల్లో పొందికగా నిలిచే ప్రాస నిర్ణయం పృచ్చకుడిది కాక పూరించేవాడిది అయిపోదా..??)

  తప్పుంటే సరిజేయగలరు.
  ఒకవేళ 18 అక్షరాల వృత్తం ఒకటుంటే దాని స్వభావ లక్షణాలను (యతి, ప్రస, గణ ఇత్యాది లక్షణాలను) తెలియజేయగలరు.

  భవదీయుడు
  సనత్ కుమార్

  ReplyDelete
 7. @వంశీగారు,
  శంకరయ్యగారు చెప్పినట్టు "కారణ భూతమ్మగు" అని వేసుకుంటే గణాలు సరిపోతాయి కాని యతి సరిపోదు. మరికొన్ని విశేషాలని, పద్యాలని మరో టపాలో పెడతాను.

  @రాకేశ్వరగారు,
  అయ్యో వచ్చి ఉంటే బాగుండేదే!

  @రవి,
  సనత్ గారి వ్యాఖ్యని చూడండి.

  @ఊదంగారు,
  :-) 2010కి ఇంకా ఒక రోజే మిగిలి ఉంది. త్వరగా పూరించండి.

  @మాధవ్ గారు, మీ బ్లాగు బాగుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు
  @సనత్ గారు,
  నేనిచ్చినది పూర్తి పాదం కాదండి. దీన్ని ఛందో గోపనం అంటారు. సమస్యలివ్వడంలో ఇదొక పద్ధతి. ఇందులో కొన్ని అక్షరాలని లోపింప జేసి కాని, కొన్ని అధికాక్షరాలతో కాని ఛందస్సు వెంటనే గుర్తుపట్ట లేకుండా దాచడం జరుగుతుంది. ఇక్కడ జరిగింది ఒకటి/రెండు అక్షరాలు లోపించడం. ఈ ఛందస్సు గుర్తుపట్టి, దానికి తగ్గట్టుగా అక్షరాలు చేర్చి సమస్యని పూరించాలి. యతిని జాగ్రత్తగా చూసుకొని దానికి తగ్గ అక్షరం వేసుకోవాలి. ఇదంతా అవధానంలో ఒకటి రెండు క్షణాలలో జరిగిపోవాలి!

  ReplyDelete
 8. మును క్షీరోదధిఁ జిల్కగా విషము తా ముంచెత్తె లోకాల నం
  తను శక్రాదులు "శర్వ పాహి" యనఁగాఁ ద్రావెన్ తృటిన్ మృత్యుశా
  సనుఁ డంతే! తమ మృత్యువున్ హరగళస్థానంబులో శోభిలన్
  పెనుభూతమ్మగుదాని బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్ :)

  ReplyDelete
 9. కామేశ్వరరావు గారూ - మీరు ఛందోగోపనం అని విప్పాక నా తప్పు ఎక్కడో - సమస్య ఏమిటో అర్థమయ్యింది.! :) - ధన్యవాదాలు !

  ReplyDelete
 10. చాలా సంతోషం.
  గరికపాటి వారి ధారణే కాక ధార కూడా ధాటీగానే ఉంటుందని విన్నాము.
  మీరిచ్చిన సమస్య బహు సొగసుగా ఉంది :)

  ReplyDelete
 11. అద్భుతం ... మీ సమస్యకి జోహార్లు. పూరణతో రేపు కలుస్తా...

  ReplyDelete
 12. కామేశ్వర రావుగారు - చిన్న ప్రశ్న !

  ఛందోగోపనంతో పాటుగా ఈ అవధానంలో పాదగోపన ప్రక్రియ ఎవరన్నా తగిలించారా ? ఎందుకు అడిగానంటే - ఒకసారి మా బందరులో జరిగిన అవధానంలో పృచ్ఛకుడొకాయన అవధాని పరమేశ్వర శాస్త్రి గారిని ఇరుకున పెట్టాడని, రసాభాసకు, గందరగోళానికీ కారణమయ్యిందనీ - అవధాని గారు మొదట్లో తడబడ్డా తర్వాత తిప్పికొట్టారని మా మావయ్య అప్పుడెప్పుడో చెప్పగా విన్నమాట... :)

  వంశీ

  ReplyDelete
 13. కామేశ్వర రావు గారు,
  శక్తికి మించినదే అయినా ప్రయత్నిస్తున్నాను, మన్నించండి.

  ఆర్భాటమ్ముగ స్నేహమున్ నెఱపియే ఆదైత్యసంఘమ్ముతో
  నిర్భీతిం గరళమ్మునేగుడిపియేనిర్నిద్రుకున్; రత్న, శ్రీ
  గర్భన్,ఓరిమితోమధింపగనటన్,కాంక్షామితంబౌనొ?ఆ
  విర్భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్

  భవదీయుడు
  ఊకదంపుడు

  ReplyDelete
 14. సనత్ శ్రీపతి గారు,

  ఇది ఏ వృత్తమో నాకూ అంతుబట్టలేదు. అయితే అనేక ఛందస్సులు, వంశస్థ బిలమని, మాలిని, లయగ్రాహి, వసంత తిలకం - ఇలా ఏవేవో ఉన్నవి కదా, వీటిలో దేనికైనా సంబంధించినదేమో అని అనుకున్నాను.

  కామేశ్వర్రావు గారి వివరణ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ లోపించిన అక్షరాలు ఎక్కడివో, అస్లది ఏ వృత్తమో, ఇది తెలియడమే పెద్ద సమస్యగా ఉంది.

  ReplyDelete
 15. @రాఘవగారు,
  పద్యం హాయిగా సాగింది. పద్యాన్ని చూస్తే కచ్చితంగా సమస్యని పూరించడానికి వ్రాసిన పద్యమని మాత్రం వెంటనే తెలిసిపోతుంది. సమస్యని మరీ సులువు చేసి పూరించేశారు :-) ఇంకొంచెం కష్టపడితే ఇంకా అందమైన పూరణ వస్తుంది.

  @ఊదంగారు,
  మీరు సరిగ్గా నాలాగే ఆలోచించారే! క్లిష్టమైన "ర్భ" ప్రాసతో కష్టపడి పద్యాన్ని పూర్తిచేసారు :-) "రత్న శ్రీగర్భ" ఒకటే సమాసం కాబట్టి న్యాయంగా "త్న" గురువవుతుంది. "కాంక్షామితంబౌనొ?" అనడం కన్నా "కాంక్షల్ ఫలింపంగ" అంటే ఇంకా బాగుంటుంది.
  అవధానిగారు యీ ప్రాసనే వేసుకోవాలని నా ఉద్దేశం. కాని అతను తప్పించుకున్నారు! అయినా మంచి పూరణ చేశారు!

  @రవి,
  పై పద్యాలు చూస్తే ఈపాటికి తెలిసే ఉంటుంది. ఇది మత్తేభం(రెండక్షరాల చేర్పుతో) కాని శార్దూలం(ఒక అక్షరం చేర్పుతో) కాని అవుతుంది.

  @వంశీగారు,
  పాదగోపనం అంటే పద్యంలో మూడు పాదాలిచ్చి అవధానిని మిగిలిన ఒక పాదాన్ని పూరించమనడమా? అటువంటిది ఇవ్వలేదు. ఇటువంటిది సంస్కృత సమస్యలలో ఇవ్వడం తెలుసు. తెలుగులో ఎక్కడా నేను వినలేదు.
  మరికొన్ని రకాల సమస్యలు వచ్చాయి. సమస్య, దత్తపది, వర్ణన - అన్నిటా వైవిధ్యం చాలానే ఉండడం వల్ల పూరణలు రక్తికట్టాయి. దీని గురించి మరో టపాలో వివరిస్తాను.

  ReplyDelete
 16. కామేశ్వర రావుగారు

  అవును పాదగోపనం - మొదటి మూడు పాదాల్లో నాల్గో పాదం మొత్తాన్ని ఇమిడ్చి ఇవ్వటం. సంస్కృత సమస్యల సంగతి తెలుసు. ఐతే తెలుగులో వినలేదు అన్నమాట పుచ్చుకుని, దాని పుట్టుపూర్వోత్తరాల సంగతి నాకూ తెలియదు కాబట్టి మా మావయ్య సత్యనారాయణ ప్రసాదు గారిని అడిగి దాని మీద వివరంగా ఒక టపా వ్రాస్తాను. (ఈయన గత నలభై ఏళ్ళుగా దాదాపు కృష్ణా,గుంటూరు జిల్లాల్లో జరిగిన అవధానాలన్నిట్లోనూ పాలు పంచుకున్నారు!) ఆవిధంగానన్నా ఒక మంచి పని చేసినవాడినవ్వచ్చు. :)

  వంశీ

  ReplyDelete
 17. ఊ.ద. గారూ,

  నా భావాన్ని, క్లిష్టమైన నా పదాలనీ నాకన్నా ముందుగా వాడేయడం అన్యాయం, అక్రమం. సమస్య అర్ధం అయ్యింది అని చెప్పేటప్పుడే చెపేస్తే అయిపోయుండేది. కాలాతీతం అయిపోయింది కదా అని వాయిదా వేశా.. నా కొంప ముంచింది. సరే కానివ్వండి.. ఏం చెస్తాం....

  కామేశ్వరరావు గారూ,
  ఈ క్రింది పూరణని గమనించగలరు. మీరిచ్చిన సమస్య లో భావాన్వయం లో బేధం లేకుండా ఒక అక్షరాన్ని రూపాంతరం చేశా... మన్నించగలరు.

  స్వర్భానుండిను మ్రింగుచుండెనొ యనన్ శస్త్రమ్ము బాధింపగా
  నిర్భీత స్థితి గల్గజేసి శిశువున్నీరీతి రక్షింపగా
  గర్భంబందున శంఖ చక్ర గదశార్ఞ్గాద్యాయుధ శ్రేణిన్ ఆ
  విర్భూతమ్మగువాని, బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్

  సనత్ కుమార్

  ReplyDelete
 18. కామేశ్వరరావు గారు,
  కొంచం సరిచేశాను చూడండి.


  ఆర్భాటమ్ముగ, స్నేహమున్ నెఱపియే ఆదైత్యసంఘమ్ముతో
  నిర్భీతిం గరళమ్మునేగుడిపియేనిర్నిద్రుకున్; చేరి , శ్రీ
  గర్భన్,ఓరిమితోమధించుచునటన్,కన్నార్పకన్ నిల్పి,ఆ
  విర్భూతమ్మగు దాని బ్రీతిమతులై వీక్షించిరద్దేవతల్

  ఈ సమస్య చూసినప్పటి నుండి తెలుగు సినిమాలకు అంటగట్టి అద్దేవతలను "ప్రేక్షకదేవుళ్లు" చేయాలని మహా సరదా గా ఉంది

  .....వింతయ్యిదోచుంగదా
  విన-భూతమ్మగు దాని...

  అవధాని వారి పూరణని బాగానే ఊరిస్తున్నారు. ఆయన పర్యావరణానికి అన్వయించారేమో అని నా ఊహ. చెప్పి పుణ్యం కట్టుకుందురూ

  సనత్ గారు,
  ఈ ఒక్కసారికి ఒగ్గేయండి.

  కామేశ్వరరావు గారు,
  సనత్ గారు, తోటి ఔత్సాహికుల హక్కులు కాపాడటనికి "moderation" పెట్టి అన్ని పూరణలు ఒకసారే విడుదలచేయాలేమో, సమస్య లిచ్చేటప్పుడు.
  అన్నట్టు "ర్భ" కు "ర్బ" కు ప్రాసవేయవచ్చాండీ.

  మళ్ళీ వచ్చేవరకు...

  http://sreekaaram.wordpress.com/2007/08/14/%e0%b0%95%e0%b1%8a%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4-%e0%b0%b8%e0%b0%ae%e0%b0%b8%e0%b1%8d%e0%b0%af%e0%b0%b2%e0%b1%81/

  భవదీయుడు
  ఊకదంపుడు

  ReplyDelete
 19. ఊ.ద. గారూ,
  మీ పద్యాన్ని చూసిన తర్వాతనే కదా వస్తు నిర్ణయాన్ని, ప్రాస పదాలనీ మార్చుకుని పద్యం రాయ గలిగా..
  మెదడుకి మేత ఉండాలంటే పూరణల్ని ఎప్పటికప్పుడు ప్రకటించెయ్యటమే ఉత్తమం.

  సనత్ కుమార్

  ReplyDelete
 20. @వంశీగారు, తప్పకుండా. మీ టపా కోసం చూస్తూ ఉంటాను.

  @సనత్ గారు, ఊదం గారు,
  మంచి ప్రయత్నం చేశారు.

  @ఊదం గారు,
  "బ"కి "భ"కి ప్రాస పూర్వకవులెవరూ వేసినట్టు లేదు. అంచేత కుదరదనుకుంటాను.
  అవధానిగారు కూడా నన్నిలాగే ఊరించారు కదా రెండు రోజులు :-) నేను సమస్య అడగగానే మొదటి పాదం ఇలా చెప్పారు:

  శ్రీ భూ దేవులకేది యింటి వెలుగై చిద్వేద్యమై హృద్యమై

  అంటే "భ"కార ప్రాస ఫిక్సు చేసేశారన్న మాట! ఇప్పుడింక యతి ఎలా చెల్లిస్తారాని మర్నాడు సాయంత్రం వరకూ ఆతృతే!

  ReplyDelete
 21. Very interesting discussion :-)

  I am not capable of participating in this but can enjoy it.

  I was in VZM on 24th and thought I could return before 27th but I could not and missed attending this event :(

  ~sUryuDu :-)

  ReplyDelete
 22. సరే అలానే కానీయండి, వేచియుంటాను

  ReplyDelete
 23. భైరవ భట్ల వంశజ! సభాస్థలినున్నటు లుండె. యాసుధా
  ధారల మమ్ము ముంచె. కడు ధన్యుడనైతి. శతావధానమున్
  ధీవర! మీరు తెల్పుటను. తెల్పిరి మిత్రులు. నారసింహుడన్
  భావన గల్గెనా! విజయ భావన లో గన నారసింహునిన్?

  ReplyDelete
 24. భైరవభట్ల గారు!
  బహుశ మీరీ పాదం క్షీరసాగర మథనాన్ని ఊహించి ఇచ్చారనుకుంటాను
  గరికిపాటి గారు కూడ అలానే పూరించి ఉంటారని నేను ఊహిస్తున్నాను.
  అమృతం కోసం మధిస్తున్న సమయంలొ పుట్టిన హాలాహలాన్ని ఉద్దేశించి అయ్యుంతందని నా అభిప్రాయం.
  పూరణని కూడా దయచేసి తెలుపగలరు

  ReplyDelete