తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Sunday, November 22, 2009

ఛందస్సుతో నడక - 3

మళ్ళీ నడక కొనసాగించే ముందు వెనక్కి తిరిగి నడిచి వచ్చిన దారిని ఒకసారి చూసుకుందాం. క్రిందటి మారు ఒక పద్య నిర్వచనాన్ని/ఛందస్సుని/నమూనాని (ఈ మూడూ ఒకటే) గ్రాఫులో చూపించే ప్రయత్నం చేసాము. అలాగే పద్య నిర్మాణాన్ని (అంటే ఒక పద్య పాదాన్ని) గ్రాఫులో చూపించే ప్రయత్నం చేసాము. ఒకే చందస్సులో ఉండే వివిధ పద్యాల గ్రాఫుల్లో తేడాలు ఎలా వస్తాయో గుర్తించాము. ఈ తేడాకి, పద్య పాదంలో ఉండే పదాల విభజన ప్రధాన కారణమని తెలుసుకున్నాము. గ్రాఫులో x-axisలో అక్షరాలని, y-axisలో గురు లఘువుల విలువలని తిసుకున్నాము. పదాల మధ్య వచ్చే విరామాన్ని కూడా ఒక అక్షరంగా పరిగణించి దానికి 1 విలువ ఇచ్చాము.

ఇప్పటి దాకా చేసిందీ చూసిందీ ఇది. వచ్చే టపాలో తెలుగు ఛందస్సులని గ్రాఫుల్లో గీసే ప్రయత్నం చేస్తానని చెప్పాను కదా. కాని దానికింకా సమయం ఉంది. అంతకన్నా ముందు మరొక విషయాన్ని తెలుసుకోవాలి. క్రిందటిసారి రెండు పాటలని "తనన" భాషలో ఇచ్చి కనుక్కోండి చూద్దామన్నాను కదా. దాని వెనక ఒక కారణం ఉంది. అందులో మొదటి పాట రెండవ పాట కన్నా కనుక్కోడం సులువని నా ఆలోచన. రవి రాకేశ్వరుల ప్రయత్నాలు నా ఆలోచనని ఒక రకంగా నిరూపించాయనే అనుకుంటున్నాను. ఎందుకో మనం సులువుగానే ఊహించవచ్చు. అదేమిటంటే, మొదటి పాటలో ప్రస్ఫుటంగా కనిపించే ఒక లయ ఉంది. అంటే? "తనన" అనేది మొదటి పాదంలో నాలుగు మార్లు వస్తోంది. అలాగే మొదటి రెండు పాదాలు ఒకటే "తనన"లు. మూడు నాలుగు పాదాల్లో కూడా ఇలాంటి సామ్యమే ఉంది. ఇది ఆ పాటకి ప్రస్ఫుటంగా కనిపించే ఒక నడకని ఇస్తోందన్న మాట. అలాంటి నడకని గుర్తించడం సులభం. అదే రెండో పాటలో అలా మళ్ళీ మళ్ళీ ఒకేలాగ వచ్చే "తనన"లు లేవు. అందువల్ల దానికి చదవగానే గుర్తుపట్ట గలిగేటంత ప్రత్యేకమైన నడక లేదు.

సరే, దీనికీ ఛందస్సుకీ ఏమిటి సంబంధం? అంటే, పాటల్లో లాగానే ఇలాంటి తేడాలు పద్యాలలో కూడా ఉన్నాయి! ఉదాహరణకి ఈ క్రింద "లయగ్రాహి", "మత్తకోకిల" అన్న రెండు ఛందస్సులకి (రెండూ వృత్తాలే) గ్రాఫులు ఇస్తున్నాను. లయగ్రాహి గురించి రాకేశ్వరగారు తన బ్లాగులో వివరంగా వ్రాసారు.



ఇప్పుడు ఈ గ్రాఫులని కిందటి టపాలో ఉన్న ఉత్పలమాల గ్రాఫుతో పోల్చి చూడండి. వృత్యనుప్రాసలో మళ్ళీ మళ్ళీ ఒకే అక్షరాలు వచ్చినట్టుగా, ఇక్కడ (లయగ్రాహి, మత్తకోకిల వృత్తాలలో) ఒకే గురు లఘు క్రమం మళ్ళీ మళ్ళీ వస్తోంది కదా. ఇలాంటి repetitive pattern మనకి ఉత్పలమాలలో కనిపించదు.

ఇప్పుడు మత్తకోకిలలో ఉన్న ఈ రెండు పాదాలు, వాటికి సంబంధించిన గ్రాఫులు పరిశీలించండి:


నిండుపున్నమి పండువెన్నెల జాలువారిన రేయిలో


నా మనస్సు వ్యథన్ భరింపగ జాలకుండె క్షమింపవే


మొదటి ఉదాహరణలో ఛందస్సు నిర్వచనంలో ఉన్న repetitive patternని సరిగ్గా అనుసరించి పద్యం నడిచింది. అంటే అందులో పదాలు సరిగ్గా ఆ patternకి తగ్గట్టు ఉన్నాయి. రెండో ఉదాహరణలో అలా జరగడం లేదు. అవునా. అయినా రెండో ఉదాహరణని రెండు మూడు సార్లు చదివి చూడండ్ది. అది మత్తకోకిల నడకలోనే ఉందని సులువుగానే గ్రహించ గలుగుతారు. రెండు గ్రాఫులు చూసినా వాటి మధ్య పోలికలు బాగానే కనిపిస్తాయి (ముఖ్యంగా దీన్ని ఉత్పలమాల, దాని ఉదాహరణలతో పోల్చి చూస్తే తేడా బాగా తెలుస్తుంది). Pattern Recognitionతో కొంత పరిచయం ఉన్నవాళ్ళకి, repetitive patterns ఉన్నప్పుడు వాటిని గుర్తుపట్టడం సులువన్న విషయం తెలిసే ఉంటుంది.

అంతే కాదు, repetitive pattern ఛందస్సుకి ఒక ప్రత్యేకమైన నడకని ఇస్తుంది. ఆ ఛందస్సులో పద్యాలని అలాంటి నడకతో రాయడమే సాధ్యమవుతుంది! ఎంత విరగ్గొట్టి రాద్దామనుకున్నా ఇంచుమించు ఆ నడక వచ్చే తీరుతుంది. ఇలాంటి ప్రత్యేకమైన నడక లేని ఉత్పలమాల లాంటి పద్యాలకి రకరకాల నడకలు వస్తాయి. అంటే నడక పరంగా చూస్తే, మత్తకోకిల లయగ్రాహి లాంటి వృత్తాలు చాలా rigid వృత్తాలన్న మాట. వీటిని nonelastic ఛందస్సు అని పిలవవచ్చు. ఛందస్సుకి ఎలాస్టిసిటీ అన్న విషయాన్ని శ్రీశ్రీ ఒకచోట ప్రస్తావించారు. కానీ దాని గురించి ఎక్కడా వివరించినట్టు లేదు. ఉత్పలమాలలాంటి వృత్తాలు పూర్తి elastic వృత్తాలు.

దీని సారాంశం రెండు ముక్కల్లో చెప్పాలంటే, Repetitive pattern ఉన్న ఛందస్సులకి రెండు ప్రత్యేకతలు ఉంటాయన్న మాట:

1. ఈ ఛందస్సులో ఉన్న పద్యాలని గుర్తుపట్టడం సులువు
2. ఈ ఛందస్సులో వ్రాసే పద్యాలకి ఒకటే ప్రత్యేకమైన నడక ఉంటుంది. దాని కారణంగా అది nonelastic ఛందస్సు అవుతుంది.

ఇంకొక విషయం. సంస్కృతంతో పోలిస్తే, తెలుగు వృత్తాలకి ఎలాస్టిసిటీ ఎక్కువ! ఎందుకంటారా, అదంతా "యతి" మహత్తు! సంస్కృతంలో యతి విరామాన్ని నిర్దేశిస్తుంది. అంటే సరిగ్గా యతిస్థానంలో ఉన్న అక్షరంతో ఒక కొత్త పదం మొదలవ్వాలన్న మాట. ఉదాహరణకి ఉత్పలమాలలో యతి స్థానం 10. కాబట్టి ఏ ఉత్పలమాల పద్యంలోనైనా పదవ అక్షరంతో కొత్త పదం కచ్చితంగా మొదలవ్వాలి. క్రితం టపాలో ఇచ్చిన రెండు ఉదాహరణలూ దీన్ని అనుసరించడం యాదృఛ్చికం!
"ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి..." అన్న పద్యంలో ఈ నియమం పాటించబడ లేదు. యతిస్థానం లో "దం" అన్నది పదం మధ్యలో ఉంది. ఇది తెలుగు పద్యం కనక సరిపోయింది. ఇలాంటిది సంస్కృతంలో కుదరదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, మన గ్రాఫు రెండు భాగాలు అయిపోతుంది. యతి స్థానం ముందు వరకూ ఒక భాగం. తర్వాతది మరొక భాగం. ఈ రెండిటి మధ్య 1 విలువ ఉండే విరామం ఎప్పుడూ ఉంటుంది. దీనితో పద్యానికి కొంతవరకూ ఒక ప్రత్యేకమైన నడక అంటూ ఏర్పడుతుంది. అందులోని ఎలాస్టిసిటీ కొంత తగ్గుతుంది. అంతే కాదు, సంస్కృతంలో ప్రతి పాదం చివరకూడా ఇలాగే విరామం ఉండాలి. అంటే ఒకే పదం రెండు పాదాల్లోకి సాగకూడదన్న మాట. అంచేత ఒక పాదం పూర్తయ్యాక తప్పనిసరిగా చిన్న విరామం ఇచ్చి తరువాత పాదాన్ని చదవడం మొదలుపెడతాం. దీనివల్ల నడక మరింత సులభంగా తెలుస్తుంది. అదే తెలుగు పద్యాలలో అయితే ఈ నియమం లేదు. అంచేత తెలుగులో ప్రతిపాదం తర్వాత ఒక విరామం ఉండవలసిన పనిలేదు. అలా లేనప్పుడు, అలాంటి పద్యాలని గుర్తుపట్టడం మరింత కష్టం! అయితే దీనివల్ల పద్యాలకి ఎలాస్టిసిటీ మరింత పెరుగుతుంది.

ఇవాళ్టికి ఇక్కడకి ఆపుదాం. ఈసారి విషయం కొంచెం బరువైనట్టుంది. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదివి, ఏమైనా సందేహాలుంటే నిరభ్యరంతరంగా అడగండి.

ఆ... ఆగండాగండి. ఈసారి మీ మెదడుకి మేత ఏమీ ఇవ్వలేదు కదూ! సరే, కిందటి టపా వ్యాఖ్యలలో "కన్నెపిల్లవని" పాట ప్రస్తావన వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్రశ్న. అందులో "తనన తనన అన్న తాన అన్న తాళం ఒకటే కదా" అన్న వాక్యం గుర్తుందా? దీని అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? లేదంటే ఇప్పుడు ఆలోచించండి. ఆలోచించి, ఏమిటనుకుంటున్నారో చెప్పండి. సరేనా!


పూర్తిగా చదవండి...

Thursday, November 12, 2009

ఛందస్సుతో నడక - 2

క్రిందటిసారి నేనిచ్చిన మూడు ప్రహేళికలను పూర్తిచేసిన వాళ్ళకీ, ఆసక్తితో ప్రయత్నించిన వాళ్ళకీ అభినందనలు. మొదటి టపాలో రంగాన్ని మాత్రం సిద్ధపరుచుకున్నాము. అక్కడ వేసుకున్న ప్రశ్నలకి సమాధానాలు వెతకడం ఇంక మొదలుపెడదామా. దీనికి కాస్త థియరీ అవసరం అవుతుంది మరి. మరీ బోరు కొట్టకుండా వివరించే ప్రయత్నం చేస్తాను.

ఆ థియరీలోకి వెళ్ళే ముందు మళ్ళీ మీ మెదడుకి మేత. క్రితం సారి పద్యాలయ్యాయి కదా, ఈ మారు సరదాగా సినిమా పాటలు తీసుకుందాం. ఒక రెండు సినిమా పాటల పల్లవులని క్రింద ఇస్తున్నాను, "తనన" భాషలో. ఆ పాటలేమిటో గుర్తుపట్టండి చూద్దాం!

మొదటిది:

తనన తనన తనన తనన తానానా
తనన తనన తనన తనన తానానా
తననన తననన తానన తానానా
తననన తననన తానన తానానా
తనన తనన తనన తాన

రెండోది:

తానా తననననన తానా
తానాన తానాన తాన తనానా
తానా తానా తానా
తానా తానా తానానా (అమెరికావాళ్ళ "తానా"కీ దీనికీ ఏ సంబంధం లేదని మనవి :-)

సరే, ఇంక అసలు విషయంలోకి వద్దాము. ఒక వాక్యమో లేదా వాక్య సముదాయమో పలికేటప్పుడు, అందులో ప్రతి అక్షరం పలకడానికి కొంత సమయం తీసుకుంటాము కదా. అలా తీసుకునే కాలం ఒక ప్రత్యేక క్రమంలో ఉంటే అది పద్యం అవుతుంది అని ముందటి టపాలో చెప్పాను. ఒకో అక్షరాన్ని పలకడానికి తీసుకునే సమయం, ఆ అక్షరాన్నిబట్టి మారుతుంది కదా. ఉదాహరణకి దీర్ఘాలు ఉన్న అక్షరాలు, మామూలు అక్షరాల (హ్రస్వాలు) కన్నా కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఉదాహరణకి "ఆకాశము" అన్నప్పుడు "శ", "ము" అనే అక్షరాలు పలకడానికి తీసుకునే సమయం కన్నా, "ఆ", "కా" అనే అక్షరాలు పలకడానికి ఎక్కువ సమయం తీసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే "సంగతి" అన్నప్పుడు "సం" అనే అక్షరం ఎక్కువ సమయం తీసుకుంటుంది పలికేటప్పుడు. ఇలా పలకడానికి మామూలు కన్నా కాస్త ఎక్కువ సమయం తీసుకునే అక్షరాలని "గురువులు" అని ఒక పేరుపెట్టారు. ఎక్కువ సమయం తీసుకోని మిగతా అక్షరాలని "లఘువులు" అని అంటారు. ఈ గురులఘువుల గురించి ఇంతకు ముందు "పెద్దోడు చిన్నోడు" అనే టపాలో వివరంగా వ్రాసాను. ఒక లఘువు పలకడానికి కావలసిన సమయాన్ని ఒక మాత్ర అని అంటారు. గురువుకయితే రెండు మాత్రల సమయం పడుతుందని సుమారుగా సంస్కృత ఛందస్సు వ్రాసినవాళ్ళు నిర్ణయించారు. తమిళ ఛందస్సులలో అయితే మరో కేటగిరీ కూడా ఉంది. తెలుగు ప్రధానంగా సంస్కృత ఛందస్సునే అనుసరిస్తుంది కాబట్టి మనకి ఉన్నవి గురువు, లగువు అని రెండే కేటగిరీలు.

అంచేత ఒక వాక్యంలో ఉన్న గురు లఘువుల క్రమం, లేదా మాత్రల క్రమం, ఆ వాక్యపు నడకని పట్టి ఇస్తుందన్న మాట. ఈ గురు లఘు క్రమంలో ఒక నియమాన్ని పెడితే, అది దాని నడకలో ఒక ప్రత్యేకతని తెస్తుంది. అలాంటి వాక్య సముదాయాలు పద్యం అవుతాయి. అయితే పద్యాన్ని నిర్వచించేటప్పుడు వాక్యాల ప్రసక్తి కాకుండా, పాదాలను నిర్వచిస్తాం. ఒక ప్రత్యేకమైన నడక కలిగిన అక్షర సముదాయాన్ని ఒక పాదం అంటాం. అలాంటి రెండు లేక అంత కన్నా ఎక్కువ పాదాల కలయిక ఒక పద్యం అవుతుంది. దీని గురించి నా మొదటి టపాలోను, "ఛందస్సు - కథా కమామీషు" టపాలోనూ మరి కొంచెం వివరించాను.

మనకి స్కూల్లో పరిచయమయ్యే మొదటి వృత్తం ఉత్పలమాల. "భరనభభరవ" అని కంఠస్థం చేస్తాం కదా. అంతకన్నా ముందే "యమాతారాజభానసలగం" అన్నది కూడా కంఠస్థం చేస్తాము. ఏమిటీ ఛందస్సు? ప్రతి పాదంలోనూ ఉండే గురు లఘువుల క్రమాన్ని నిర్దేశించే ఒక ఛందస్సు ఇది.
UIIUIUIIIUIIUIIUIUIU - ఇదీ ఆ గురు లఘువుల వరస. ఉత్పలమాల పద్యంలో నాలుగు పాదాలు. ప్రతి పాదంలోనూ అక్షరాలు సరిగ్గా ఇదే గురులఘువుల క్రమంలో ఉండాలన్నమాట. చిన్నప్పుడు మీ తెలుగు టీచరు ఇలాగే ఇదంతా చెప్పేటప్పుడు మీకు బోరుగా అనిపించలేదూ? అనిపించే ఉంటుంది! ఇప్పుడూ అలాగే ఉందా? సరే మనం మరికాస్త సరదా కోసం, కాస్త గ్రాఫిక్కుల జిమ్మిక్కులు చేద్దాం. ఈ గురులఘువుల క్రమాన్ని ఒక గ్రాఫులా గీస్తే ఎలా ఉంటుందో చూద్దాం:


ఇదిగో ఇలా ఉంటుంది! లఘువుకి విలువ 2, గురువుకి విలువ 4 ఇచ్చానిక్కడ. ఎందుకో మరికొంత సేపట్లో తెలుస్తుంది. మొదలు చివరలని స్పష్టంగా చూపించడం కోసం ముందొకటి వెనకొకటి సున్నాలు తగిలించాను. బావుందా! ఉత్పలమాలలో ఉన్న ఏ పద్యాన్ని తీసుకుని ఈ గ్రాఫు గీసినా కచ్చితంగా ఇలాగే ఉంటుంది.

సరే ఇప్పుడిలాగే చంపకమాలని కూడా చూద్దాం:


ఉత్పల చంపకమాలలోని పోలిక ఇట్టే గుర్తుపట్టారు కదా!

సరే ఇంతకీ ముందు టపాలో మనం Pattern Recoginition వగైరా వగైరా మాట్లాడుకున్నాం కదా. ప్రతి ఛందస్సుకీ ఇలాంటి గ్రాఫొకటి తయారుచేసుకుని, ఇచ్చిన పద్యానికి ఒక గ్రాఫు వేసి పోలిస్తే ఇట్టే తెలిసిపోతుంది, అవునా? మరి ఇందులో ఇంతగా ఆలోచించడానికీ ఏముంది? ఏమీ లేదంటే లేదు, ఉందంటే ఉంది. వృత్త పద్యాలని తీసుకుని చిన్నప్పుడు బడిలో చేసినట్టు గురువు లఘువు గుర్తుపట్టి, దాన్ని వృత్త నిర్వచనలాతో పోల్చి ఏ వృత్తమో సులువుగానే చెప్పవచ్చు. గురు లఘువులని గుర్తుపట్టడమే కొంచెం క్లిష్టమైన పని కాని, అది చేసిన తర్వాత కంప్యూటరు కూడా ఇట్టే గుర్తుపట్టేస్తుంది. ఇందులో చెప్పుకోదగ్గ Pattern Recognition ఏమీ లేదు. గుర్తుపట్టాల్సిన సమాచారమంతా అచ్చు గుద్దినట్టు ఒకే మూసలో ఉంటే చాలా తేలికగా గుర్తుపట్టెయ్య వచ్చు. సమాచారంలో వైవిధ్యం ఉండి, కొంత శాతం గోల గజిబిజి ఉన్నప్పుడు, అందులోంచి నమూనాని వెలికి తియ్యడం అసలైన ఛాలెంజి. మరి ఇలాంటి వృత్త పద్యాలలో ఆ వైవిధ్యం ఎక్కడనుంచి వస్తుంది?

ఎక్కడ నుంచి వస్తుందంటే, పద్యాన్ని చదివేటప్పుడు వస్తుంది. మనం పద్యాన్ని చదవగానే, లేదా వినగానే ఆ ఛందస్సుని గుర్తుపట్టాలంటే ఎలా? పలికినప్పుడు ప్రతి ఉత్పలమాల పద్యం మనకి ఒకేలా వినిపించదు. ఒకో పద్యం ఒకోలా వినిపిస్తుంది. ఈ వైవిధ్యానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అందులో ఒక ప్రధానమైన కారణాన్ని తెలుసుకుందాము. మనము పద్యం చదివేటప్పుడు, సాధారణంగా ఒకే గుక్కలో చదువుకుంటూ పోము కదా. మధ్య మధ్యలో కొంత విరామం తీసుకుంటాము. ఎక్కడ? ప్రతి పదం తర్వాత ఒక అతి చిన్న విరామం తీసుకుంటాము. అలాగే వాక్యం పూర్తయినప్పుడు కూడా కొంత విరామం తీసుకుంటాము. మధ్య మధ్యలో తీసుకునే ఈ విరామాలు పద్యపు నడకలో చాలా తేడాలని కలిగిస్తాయి. ఉదాహరణకి ఉత్పలమాల పద్యాలలోవే, ఈ రెండు పాదాలు చదివి చూడండి:

సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బోంకుచే

నీ కనుదోయి వెన్నెలలు నిండిన నా హృదయాంగణమ్ములో

చదువుకున్నారా. ఇంక వీటినే గ్రాఫుల రూపంలో చూద్దాము. విరామాలని ఒక అక్షరంగా భావించి, దాని విలువ 1 ఇచ్చి గ్రాఫుని గీస్తే, అవి ఇలా ఉంటాయి:



ఇప్పుడు చెప్పండి, ఈ రెండూ ఒకటే నమూనాకి (ఛందస్సుకి) చెందిన పద్య పాదాలని గుర్తించడం అంత సులువంటారా? కాదు కదా. పద్యాలని విని, వాటి నడకబట్టి ఛందస్సుని కనుక్కోవడంలో ఉన్న కష్టం చాలావరకూ దీని వల్లనే వస్తుంది. ఇలా పదాల మధ్య వచ్చే విరామాలలో తేడాల వల్ల, ఒకే ఛందస్సులోని పద్య పాదాలకి అనేక వేల రకాల నడకలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటన్నిటిలోనూ ఉన్న విరామాల గోలని తొలగించి, అసలు నమూనాని గుర్తుపట్టడం ఒక పెద్ద సవాలు. ఆ పనిని మన మెదడు చక్కగా చెయ్యగలదు, తగిన సాధన చేస్తే!
కొంతమంది ఏం చేస్తారంటే, చదివినప్పుడు పదాలతో సంబంధం లేకుండా మూడేసి అక్షరాలని కలిపి చదువుకుని, నడకేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఉదాహరణకి, "నీ కనుదోయి..." పాదాన్ని, "నీకను దోయివె న్నెలలు నిండిన నాహృద యాంగణ మ్ములో". అలా చదువుకుంటే, ఉత్పలమాల పాదాలన్నీ సుమారుగా ఒకే నడకతో వినిపిస్తాయి. గుర్తుపట్టడం కాస్త సులువవుతుంది. దీని కన్నా కూడా మేలైన పద్ధతి మన మెదడనే కంప్యూటరుకి సాధ్యమైనంత ఎక్కువ "డాటా"ని అందివ్వడమే. అంటే ఒకే వృత్తంలో ఉన్న బోలెడు పద్యాలని మనం కంఠస్థం చేస్తే, ఆ వృత్త నడకని వినగానే గుర్తుపట్ట గలిగే ప్రజ్ఞని మన మెదడు సంపాదిస్తుంది. చక్కని నడకతో పద్యాలని వ్రాయడానికీ, ఆశువుగా పద్యాలని అల్లడానికీ ఈ ప్రజ్ఞ చాలా అవసరం.

వృత్తాలలో నడకని గ్రాఫులలో చూసే ప్రయత్నం చేసాము. వృత్తాల నిర్వచనంలో ఉన్న నిర్దిష్టత, వాటిని పద్యంగా నిర్మించేటప్పుడు (తద్వారా చదివేటప్పుడు) ఎలా లోపిస్తుందో తెలుసుకున్నాము. ఆ గోల ఎక్కడనుంచి వస్తుందో కూడా చూసాము. చేరాగారు వీటిని మూడు స్థాయిలగా వివరించారు ఒకచోట - నిర్వచనము, నిర్మాణము (రచించడం), నిర్వహణ (చదవడము). మనం నిర్మాణము, నిర్వహణ ఒకేలా ఉంటుందని అనుకున్నామిక్కడ. ఈసారికి ఇక్కడతో ఆపుదాం.

తర్వాత టపాలో మన తెలుగు ఛందస్సులని ఇలాగే పరిశీలిద్దాం. ఆటవెలది, తేటగీతి, కందం లాంటి ఛందస్సులని ఇలా గ్రాఫులలో ఎలా చూపించాలో ఆసక్తి ఉన్నవాళ్ళు ఆలోచించండి. మీకేమైనా మంచి ఆలోచన వస్తే, నాతో పంచుకోండి. ఎందుకంటే ఎలా చూపించాలో ఇంకా నేను నిర్ణయించుకోలేదు.


పూర్తిగా చదవండి...

Wednesday, November 4, 2009

ఛందస్సుతో నడక - 1

ఒకోసారి ఏదైనా పాట వింటున్నప్పుడు హఠాత్తుగా మరో పాత పాట గుర్తుకొస్తుంది. "అరే! ఇది దానిలాగానే ఉందే" అనిపిస్తూ ఉంటుంది. కొందరికిలా సర్వధారాణంగా జరిగితే చాలామందికి ఎప్పుడో కాని ఇలా జరగదు. ఇది ఒక రకమైన రాగ జ్ఞానం. ఒకే రాగంలో ఉన్న రెండు పాటల మధ్యనున్న పోలికని గుర్తుపట్టే సామర్థ్యం ఇది. సంగీత జ్ఞానం ఉన్నవాళ్ళు ఆ రాగమేమిటో కూడా గుర్తుపడతారు. ఇలాంటి సామర్థ్యాన్నే సాంకేతికంగా Pattern recognition అంటాం. అచ్చ తెలుగులో చెప్పాలంటే నమూనాలని ఆనవాలు పట్టడమన్నమాట. ఒకటే నమూనానుంచి ఏర్పడిన రకరకాల మూర్తులని ఒకే నమూనాకి చెందినవిగా గుర్తుపట్టడం. మనిషి మెదడుకి ఈ శక్తి అమోఘంగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు అక్షరాలు నేర్చుకుంటే, ఆ తర్వాత ఆ అక్షరాలని ఎన్ని రకాలుగా (రంగులు, ఫాంట్లు, టైప్ సెట్లు) ముద్రించినా, మరీ డాక్టరు దస్తూరీలా కాకుండా కాస్తో కూస్తో అర్థమయ్యేట్టు ఎంతమంది చేత్తో వ్రాసినా మనం గుర్తుపట్టగలం! ఇది నమూనాల ఆనవాలే కదా. ఇదే ఒక కంప్యూటరుతో చేయించాలంటే తల ప్రాణం తోక్కి వస్తుంది!

పాటలలో రాగాలని గుర్తుపట్టినట్టుగానే పద్యాలలో ఛందస్సుని గుర్తుపట్టవచ్చు. అంటే ఒక పద్యాన్ని చదవగానే లేదా వినగానే అదే ఛందస్సులో మనకి బాగా తెలిసిన ఇతర పద్యాలు గుర్తుకు రావడమన్నమాట. ఉదాహరణకి:

కాకికేమి తెలుసు సైకో ఎనాలసిస్
ఆటవెలది ద్విపద కత్తగారు
ఐదు, మూడు, రెండు ఆముక్త మాల్యద

అని మూడు పాదాలు చెప్పగానే, వేమన పద్యాలు చదువుకున్న ఎవరైనా నాల్గవ పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అని పూరిస్తారు. ఈ పద్యాన్ని చదవగానే మనకి వేమన పద్యాలు గుర్తుకొస్తాయి. ఈ పద్యం అలాగే ఉందన్న సంగతి ఇట్టే తెలిసిపోతుంది. అది ఆటవెలది ఛందస్సు అని కాని, ఆ ఛందస్సు స్వరూపం కాని తెలియాల్సిన అవసరం లేదు. అలాగే మరో ఉదాహరణ:

పిల్లులు పిల్లలు బెట్టును
నల్లను త్రావెడి కతాన నల్లి యనబడెన్
అల్లురు దశమోగ్రహములు
వెల్లుల్లికి తీపి లేదు ...

అని ఆపగానే, వినరా సుమతీ అని పూర్తి చెయ్యడానికి కంద ఛందస్సు తెలియాల్సిన పనిలేదు. ఇదెలా సాధ్యం?! వేమన, సుమతీ శతకాలు కంఠస్థం చేసిన వాళ్ళకి ఆయా ఛందస్సుల నమూనాలు మెదడులో ముద్రపడి ఉంటాయి. ఈ పద్యాలని చూడగానే మెదడు గుర్తుపట్టేస్తుంది!

ఇప్పుడు మరో పద్యం చూద్దాం:

సిరి గల నాడు మైమరచి చిక్కిన నాడు తలంచి పుణ్యముల్
పొరి పొరి చేయనైతి నని పొక్కిన గల్గునె? గాలి చిచ్చు పై
కెరలిన వేళ, డప్పి గొని కీడ్పడు వేళ, జలంబు గోరి త
త్తరమున ద్రవ్వినం గలదె? ...

దీన్ని పూరించాలంటే కాస్త ఆలోచించాల్సి వస్తుంది, యీ శతకాన్ని ఇంతకుముందు చదివిన వాళ్ళకి కూడా. అంటే ముందు ఉదాహరణలతో పోలిస్తే, ఇక్కడున్న నమూనని గుర్తుపట్టడానికి కొంత పరిశ్రమ అవసరమవుతోంది. ఎందుకు? ఒక కారణం - ఈ శతకం వేమన, సుమతీ శతకాలంత ప్రాచుర్యం పొందకపోవడం అనుకోవచ్చు. కాని అదొక్కటే కారణం కాదు. వేరే కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటో ముందుముందు చూద్దాం.

ఇప్పుడు ఇంకొక పద్యం:

నీ మనసు తెలుసుకొని నడచుకొనెద నేను, చెలి! నిజము నే మునుపటి నీ ప్రియుడను గాను, నమ్ముమో ప్రేయసీ! కలిసిమెలిసి గడిపెదము జీవితమును

ఇది నేను పద్యంలాగా నాలుగు పాదాలు విడగొట్టి ఇవ్వలేదు (ఇచ్చినా కస్ఠమే అనుకోండి!). ఇందులో ఛందస్సుని కనుక్కోండి చూద్దాం! మీ జుట్టు కాస్త మీ చేతిలోకి వస్తే నా పూచీ కాదు సుమా :-) పై పద్యాలలో ఛందస్సు అంత సులువుగా తెలిసిందే మరి ఇదెందుకు ఇంత కష్టం?

ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం ఇప్పుడు మొదలుపెడదాం. కొత్తగా ఏదో నేను కనిపెట్టి చెప్పబోవటం లేదు. మనందరికీ తెలుసున్న విషయాలే, కాని అంతగా గుర్తించని విషయాలు.

ఛందస్సు వేద పురుషుడి పాదాలని చెప్పబడింది. అంటే ఛందస్సు పద్యాలకి నడకనిస్తాయన్న మాట. నాకు సంగీతం పెద్దగా తెలీదుకాని, పాటకి తాళం ఏమి చేస్తుందో, కాస్త అటు ఇటుగా పద్యానికి ఛందస్సు అదే చేస్తుందనుకుంటాను. ఒక వాక్యాన్ని లేదా వాక్య సముదాయాన్ని పలికేటప్పుడు, అందులోని ప్రతి అక్షరం పకలడానికి కొంత సమయం తీసుకుంటాము కదా. అలా తీసుకునే కాలం ఒక ప్రత్యేక క్రమంలో ఉంటే అది పద్యం అవుతుంది. ఆ ప్రత్యేక క్రమమే ఛందస్సు. అందుకే ఛందస్సు పద్యం నడిచే తీరుని నిర్దేశిస్తుంది.

అర్థమయ్యీ అవ్వనట్టు ఉందా? ఇప్పుడే కదా నడక మొదలుపెట్టాం. మెల్లిగా అన్నీ అవే అర్థమవుతాయి. వచ్చే టపాలో దీని గురించి మరింత వివరిస్తాను. ప్రస్తుతానికి ఒక చిన్న క్విజ్:

ఈ మధ్యనే మొదలుపెట్టిన ఒక పుస్తకంలో ఈ కిందనిచ్చిన శ్లోకాలు చదువుతూ ఉన్నాను. ఇలాంటి శ్లోకాలు ఎక్కడో విన్నానే అని అనిపించింది. ఒక అయిదు నిమిషాల తర్వాత తట్టింది. వీటిలాగే ఉండే ఆ మరో శ్లోకాలు బాగా తెలుసున్నవే! తెలుగువాళ్ళందరూ ఎప్పుడో అప్పుడు తప్పక వినే ఉంటారు. నేను చదివిన శ్లోకాలలో ఒక రెండు:

సత్యం న మే విభవనాశకృతాస్తి చింతా
భాగ్యక్రమేణ హి ధనాని భవంతి యాంతి
ఏతత్తు మాం దహతి నష్ట ధనాశ్రయస్య
యత్ సౌహృదాదపి జనాః శిథిలీ భవంతి

కిం త్వం భయేన పరివర్తిత సౌకుమార్యా
నృత్యప్రయోగ విశదౌ చరణౌ క్షిపంతీ
ఉద్విగ్న చంచల కటాక్ష విసృష్ట దృష్టిః
వ్యాధానుసార చకితా హరిణీవ యాసి

ఈ శ్లోకాల నమూనాతో ఉన్న మరో ప్రసిద్ధ శ్లోకాలేమిటో గుర్తుపట్టండి చూద్దాం!


పూర్తిగా చదవండి...