మొన్న రవిగారు తన కామెంటుతో ఒక మంచి పద్యాన్ని గుర్తుచేసారు. తీగలాగారు - డొంకంతా కదిలింది!
తిక్కన భారతంలోని పద్యమిది. విరాట పర్వంలోది. తెలుగు కవిత్వమ్మీద ఆసక్తీ అభిమానం ఉన్నవారెవరైనా తప్పకుండా చదివి తీరాల్సిన కావ్యం విరాటపర్వం. అవును తిక్కన తీర్చిదిద్దిన విరాటపర్వం అచ్చంగా ఒక కావ్యమే!
ఎవ్వాని వాకిట నిభమద పంకంబు
రాజభూషణ రజోరాజి నడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు
నొజ్జయై వినయంబు నొఱపు గఱపు
ఎవ్వని కడకంట నివ్వటిల్లెడు చూడ్కి
మానిత సంపద లీనుచుండు
ఎవ్వాని గుణలత లేడువారాశుల
కడపటి కొండపై గలయ బ్రాకు
నతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడె ధర్మ సుతుడు
ముందు యీ పద్యాన్ని ఇక్కడ ఘంటసాల శ్రావ్యమైన గొంతులో వినండి. తర్వాత మీదైన గొంతుతో ఎలుగెత్తి కొన్ని సార్లు చదువుకోండి/పాడుకోండి. మన పద్య కవిత్వం మనలో మనం మౌనంగా చదువుకోడానికి కాదు. వినడానికీ, పాడుకోడానికీను. ఇలా గొంతెత్తి పాడితే అది మీ నోటికీ, గొంతుకీ, శ్వాసకీ మంచి ఎక్సర్సైజు కూడాను! నా మాట నమ్మండి.
అయ్యిందా? సరే, ఇప్పుడింక దీని అర్థ తాత్పర్యాలలోకి వెళదాం.
ఎవ్వాని వాకిట - ఎవని వాకిట్లో, ఇభ - ఏనుగుల, మద - మద ధారల చేత ఏర్పడిన, పంకంబు - బురద, రాజ భూషణ - రాజులు వేసుకున్న ఆభరణాల, రజోరాజిన్ - రజము అంటే ధూళి రాజి అంటే గుట్ట రజోరాజి అంటే గుట్టగా పడుతున్న ధూళి చేత, అడగు - అణగు (అణిగిపోతుందో)
అతని వాకిట ఎందరెందరో రాజులు ఏనుగులమీద వస్తారు. ఆ ఏనుగులనుంచి కారే మద ధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారుతోంది. రాజులు ధరించినవన్నీ రత్నాభరణాలు. వాళ్ళేమో కిక్కిరిసి ఉన్నారు. ఆ రాపిడికి ఆ రత్నాలు ఒరుసుకొని రత్న ధూళి కిందంతా పడుతోంది. ఆ ధూళిరాశులు కిందనున్న బురదని పోగొడుతున్నాయి.
ఎవ్వాని చారిత్రము - ఎవని చరిత్ర అయితే, ఎల్ల లోకములకు, ఒజ్జయై - గురువై, వినయంబు - వినయముయొక్క, ఒఱపు - గొప్పదనుము లేదా పద్ధతి, కఱపు - నేర్పు (నేర్పుతుందో)
ఎవని చరిత్ర గురువై వినయముయొక్క పద్ధతినీ గొప్పతనాన్నీ లోకమంతటికీ నేర్పుతుందో
ఎవ్వని కడకంట - ఎవని కనుతుదల, నివ్వటిల్లెడు - వ్యాపించే లేదా అతిశయించే, చూడ్కి - చూపు, మానిత - కొనియాడబడిన, సంపదలు, ఈను చుండు - ప్రసాదించును (ప్రసాదిస్తూ ఉంటుందో)
ఎవని కడకంటి చూపు గొప్ప సంపదలు ప్రసాదిస్తుందో
ఎవ్వాని గుణలతలు - ఎవని గుణములనే లతలు, ఏడు వారాశుల - సప్త సముద్రాల, కడపటి కొండపై - అవతల ఉన్న కొండపై, కలయన్ ప్రాకు - అంతటా ప్రాకుతున్నాయో
ఇక్కడ గుణములు లతలు కాబట్టి అవి ప్రాకుతాయి. ఎక్కడికి? సప్తసముద్రాల అవతలున్న కొండమీదకి. అంటే ఎవని గుణములు లోకమంతా అంతగా ప్రసిద్ధి పొందాయో అని.
అతడు, భూరి ప్రతాప - అధికమైన ప్రతాపం అనే, మహా ప్రదీప - గొప్ప జ్యోతి చేత, దూర విఘటిత - దూరాలకి కొట్టివేయబడ్డ, గర్వాంధకార - గర్వమనే చీకటి గల, వైరి వీర - శత్రు వీరుల యొక్క, కోటీర - కిరీటములందు ఉన్న, మణి ఘృణి - మణుల యొక్క కాంతి, వేష్టిత - చుట్టబడిన, అంఘ్రితలుడు - పాదములు కలిగినవాడు
అతనెవరు? తన అమోఘప్రతాపము అనే మహాజ్యోతి చేత శత్రు రాజుల గర్వమనే అంధకారం దూరమైపోయింది. అలా గర్వం తొలగింపబడిన ఆ రాజులు ఇతని కాళ్ళకి నిరంతరం మ్రొక్కుతూ ఉన్నారు. దానితో వాళ్ళ కిరీటాలలో ఉండే మణుల కాంతి ఎల్లెప్పుడూ అతని పాదాలని చుట్టుకొని ఉంది.
ఈ చాంతాడు సమాసం ఎందుకో ఈపాటికి అందరూ గ్రహించే ఉంటారు. ఇందులో అందమంతా పొహళింపులోనూ, ఆ కుదింపులోనూ ఉంది. మామూలు వాక్యాలలో చెప్పాలంటే అవసరమయ్యే విభక్తి ప్రత్యయాలు సమాసాల్లో అదృశ్యమైపొతాయి. క్రియలు విశేషణాలుగా మారిపోతాయి. "మహా ప్రదీప దూర విఘటిత గర్వాంధకారము" - మామూలు భాషలో చెప్పాలంటే "మహాజ్యోతి చేత గర్వమనే చీకటి దూరంగా కొట్టబడింది" అని చెప్పాలి. సమాసంలో అన్ని పదాల అవసరం ఉండదు. పటిష్ఠమైన సమాస గ్రధనం వల్ల సాధించే క్లుప్తత యిది. కవిత్వం తెలిసినవాళ్ళకి దీని అవసరం తెలుస్తుంది.
ఇంతకీ ఎవరితను? కేవల మర్త్యుడే - సాధారణమైన మనిషా ఇతను? ధర్మ సుతుడు - యమ ధర్మరాకు కొడుకైన యుధిష్టిరుడు. పాండవుల్లో పెద్దతను. ఇక్కడ ధర్మరాజు సామాన్య మనిషా? కాదు. అని ఒక అర్థం. ఇతను సాధారణ మనిషా? కాదు, స్వయానా యమధర్మ రాజు కొడుకు అని మరో అర్థం.
ధర్మరాజు గొప్పతనాన్ని వర్ణించే భేషైన పద్యం యిది. సాధారణంగా ఎవరికీ ధర్మరాజంటే మంచి అభిప్రాయం ఉండదు. అది చాలా సహజం. కానీ యీ పద్యాన్ని చదివాక "ఆఁ! ధర్మరాజు నిజంగా యింత గొప్పవాడా!" అనుకోక మానరెవరూ. ఈ పద్యం ఎత్తుగడలోనే మనసులని కట్టిపడేసే అద్భుతమైన అలంకారాన్ని ప్రయోగించాడు తిక్కన. దానికి దీటైన నడక. ధర్మరాజు వైభవాన్ని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించాడు. రెండవపాదంలో అతని స్వభావాన్నీ, ప్రసిద్ధినీ వర్ణించాడు. మళ్ళి మూడవపాదం అతని సంపద, వైభవం. నాల్గవపాదం మళ్ళీ అతని కీర్తి ప్రసిద్ధి. ఇన్నీ అయ్యాక అసలైన గుణాన్ని ఎత్తుగీతిలో మూడు పాదాలు ఆక్రమించే ఒక సుదీర్ఘ సమాసంలో దట్టించి చెప్పాడు. అది అతని ప్రతాపం. క్షత్రియులకి అతి ముఖ్యమైన గుణం. చివరాఖరికి అతను సాధారణ మానువుడే కాదు అని తేల్చేసాడు. అవును ఇన్నీ ఉంటే అతను మామూలు మనిషి అవుతాడా? పైగా దైవాంశ సంభూతుడు!
ఇదీ తిక్కన పద్యశిల్ప నైపుణ్యం. తీసుకున్నది సీస పద్యం. దానిలో ధర్మరాజు గొప్పతనాన్ని కీర్తించాలి. పద్యం ఎలా ఎత్తుకుని ఎలా నడిపించి ఎలా ముగిస్తే అది వినేవాళ్ళ గుండెల్లో ముద్రపడిపోతుందో అలా నడిపించాడు. అందుకే యీ పద్యం అంత ప్రసిద్ది పొందింది.
సరే ఇంతకీ యీ పద్యాన్ని ఎవరు చెప్పారు? దీని కథా కమామీషు ఏమిటి? నర్తనశాల చూసినవాళ్ళు యిది బృహన్నల భీమ ద్రౌపదులకి చెపుతున్న పద్యమని అనుకుంటారు. ఆ సినిమాలో అక్కడ సన్నివేశానికి తగ్గట్టు అలా చూపించారు. కాని భారతంలో యీ పద్యం చెప్పింది బృహన్నల కాదు.
ద్రౌపది!
ఇది చదివుతున్న చాలామంది ఒక్కసారి కుర్చీల్లోంచి లేచే ఉంటారు! మరి ద్రౌపది ధర్మరాజు గురించి ఇంత గొప్పగా చెపుతుందని ఊహించడం కష్టమే కదా. అక్కడే ఉంది చమత్కారం. ద్రౌపది పాత్రలోని వైశిష్ట్యం. అవిడ భర్తలని (ముఖ్యంగా ధర్మరాజుని) ఎప్పుడుపడితే అప్పుడు ఆడిపోసుకోదు. తెగాడల్సి నప్పుడు తెగుడుతుంది, పొగడాల్సిన నప్పుడు పొగుడుతుంది. ఇంతకీ ప్రస్తుత సందర్భం ఏమిటిట?
సైరంధ్రి రూపంలో ఉన్న ద్రౌపదికి కీచకుని చేత ఘోరమైన పరాభవం జరుగుతుంది. అతను కామాంధుడై ద్రౌపది వెంటపడతాడు. ఆమె పరుగెత్తుకుంటూ విరటుని కొల్వులోకి వస్తుంది. కీచకుడు ఆమెని వెంబడిస్తూ అక్కడికివచ్చి ఆమె కొప్పు పట్టుకుంటాడు! అది విడిపించుకుని అక్కడున్న విరటుణ్ణి నిలదీస్తుంది. ఏమిటీ అన్యాయమని. దూరన్నుంచి యిది చూస్తున్న భీముడు కోపం పట్టలేక పక్కనున్న చెట్టుని పెరికే ప్రయత్నం చేస్తాడు. కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు ఇదంతా చూసి ద్రౌపదిని ఊరుకోమంటాడు. నీ భర్తలు అంత పరాక్రమవంతులైన గంధర్వులే అయితే వెళ్ళి వాళ్ళ దగ్గర మొరపెట్టుకోక, ఇక్కడెందుకిలా సభలో నాట్యకత్తెలా తైతక్కలాడతావు అంటాడు. ఏవండీ, చీమూ నెత్తురూ ఉన్న ఏ మనిషైనా ఇలాంటి మాటంటే తట్టుకోగలరా? అక్కడికక్కడే ధర్మరాజుని లాగి లెంపకాయ కొట్టాలనిపించదూ? అనిపిస్తుంది. ద్రౌపదికి కూడా అనిపించింది. కానీ అలా చెయ్యలేదు కదా! సభా మర్యాద, పాతివ్రత్యమూ మాట దేవుడెరుగు. ముందు తమ నాటకం బయటపడి మళ్ళీ వనవాసం చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి మాటలతో ధర్మరాజు గుండెలో ఒక్క పోటుపొడిచి వెళిపోతుంది. ఆమె అంటుందీ:
"నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు
పెద్దవారి యట్ల పిన్నవారు
గాన, బతుల విధమ కాక యే శైలూషి
గాననంగ రాదు కంక భట్ట
అట్లగుటం జేసి నాకు నాట్యంబును బరిచితంబ. మత్పతి శైలూషుండ కాడు కితవుండును గావున జూదరియాలికి గఱువతనంబెక్కడియది"
"ఓ కంకభట్టూ! నా భర్తే ఒక పెద్ద నటుడు. పెద్దల తోవలోనే కదా చిన్నవాళ్ళూ వెళతారు. అంచేత నా భర్తల తీరే నాదీను. నన్ను నాట్యకత్తె అని తూలనాడ్డం ఎందుకు? అంతే కాదండోయ్! నా భర్తగారు నటుడే (శైలూషుడు అంటే నటుడు) కాదు పెద్ద జూదరి (కితవుడు అంటే జూదరి) కూడాను. జూదరి భార్యకి గౌరవం ఎక్కడుంటుంది చెప్పండి?" అంటుంది. ఇక ధర్మరాజు తలెక్కడ పెట్టుకోవాలి?!
సరే ఇదంతా అయిపోయాక, తనలో రగులుతున్న బాధ తీరే మార్గమేదీ అని ఆలోచించి, భీమసేనుడికి చెప్పుకోడానికి వస్తుంది. కీచకుడు తనని చేసిన అవమానాన్ని వివరంగా చెపుతుంది. తన దుఃఖాన్ని వెళ్ళగక్కుతుంది. "మీ యన్న పెద్దతనము జూచితి నేమందు ననిల తనయ" అంటుంది. "ఇంతా జరిగాక మీ అన్నగారు చూపించిన పెద్దతనం చూసావుగదా, ఇంక నేనేమనాలి?" అని నిలదీస్తుంది. నన్నా కీచకుడలా తనిన్నప్పుడు ధర్మరాజు ఎలా చూస్తూ ఊరుకున్నాడని ప్రశ్నిస్తుంది. అప్పుడు భీముడు ద్రౌపదికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. ధర్మరాజే కనక ఆపకపోయి ఉంటే నేనా కీచకుణ్ణీ విరటుణ్ణి కూడా అక్కడికక్కడే చంపేసేవాడినని, అదే జరిగితే మళ్ళీ మనం వనవాసానికి వెళ్ళాల్సి వచ్చేదనీ, అప్పుడందరూ ద్రౌపదినీ తననే తప్పుబట్టే వారనీ చెపుతాడు. అంచేత ధర్మరాజుని మెచ్చుకోవాలి కాని తిట్టకూడదని అంటాడు. అప్పుడు మళ్ళి ద్రౌపది అందుకుంటుంది. నేను పొందిన బాధలోనీ కోపంలోనీ అలా అన్నానే కాని నాకు ధర్మం తెలియక కాదు, ధర్మరాజు గొప్పదనం తెలియకా కాదు అంటుంది. ధర్మరాజు గుణగణాలని పొగడ్డం మొదలుపెడుతుంది. అప్పుడా వరసలో చెప్పిన పద్యమే యీ పైన చెప్పిన పద్యం.
ధర్మరాజుని పొగిడి ఊరుకోదు. అంతటివానికి యిన్ని కష్టాలు వచ్చాయే అని వాపోతుంది. ఆ తర్వాత వరుసగా భీమసేనణ్ణి, అర్జునుణ్ణీ, నకుల సహదేవులనీ పేరుపేరునా పొగుడుతుంది. వారికొచ్చిన కష్టాలకి బాధపడుతుంది. చివరికి తనంత దానికి వచ్చిన కష్టాలని చెప్పుకుంటుంది. అన్నీ అయ్యాక మళ్ళీ చివరాఖరికి ఏమిటంటుంది?
ఇందఱకు నిన్నిభంగుల నిడుమ గుడువ
వలసె ధర్మతనూభవు వలన జేసి
దాయ లొడ్డిన మాయజూదంపుటురుల
బడి కులంబున కతడిప్పాటు దెచ్చె
ఇదీ ద్రౌపది వాక్పటిమ. ఇదీ ద్రౌపది దృఢమైన సంపూర్ణమైన వ్యక్తిత్వ చిత్రణ!
ఇంచుమించు ఇదంతా సంస్కృత భారతంలో కూడా ఉన్నదే. కాని తిక్కన దాన్ని మరింత నాటకీయంగా తీర్చిదిద్దాడు. సంస్కృతంలో ద్రౌపది వచ్చీ రాగానే తన గోడంతా వినిపించేసి, పాండవులందరి గొప్పతనాన్నీ వర్ణించేసి వాళ్ళిన్ని కష్టాలు పడుతున్నారే, దీనంతటికీ కారణం ధర్మరాజే అని ముగిస్తుంది. భీముడు ఆ తర్వాత మాట్లాడతాడు. కాని తెలుగు భారతంలో ద్రౌపది భీముల మధ్య మాటలు నాటకంలో సంభాషణల్లా సాగుతాయి. అది తిక్కన రచనలోని నేర్పు.
విరాటపర్వంలోని మరిన్ని ఆణిముత్యాలని ముందుముందు రుచిచూద్దాం!
మళ్ళీ చెపుతున్నాను. తెలుగు కవిత్వం అంటే ఆసక్తి అభిరుచి ఉన్నవాళ్ళు తప్పకుండా చదివి తీరవలసిన కావ్యం తిక్కన విరాట పర్వం (ఆ మాటకొస్తే భారతమంతానూ!).
పూర్తిగా చదవండి...