పని వత్తిడిలో పడి కొన్ని వారాలై బ్లాగు ముఖమే చూడలేదు.
అంత ఊపిరిసలపని పనిలోనూ, హఠాత్తుగా ఒక మధురక్షణంలో తిరుపతివేంకటకవుల ఉద్యోగవిజయాలు గుర్తుకొచ్చాయి. పడకసీను మనసులో మెదిలింది. ఇహనేం, "ఎక్కడనుండి రాక యిటకు...", "బావా యెప్పుడు వచ్చితీవు..." అంటూ మొదలుపెట్టి అందులో పద్యాలన్నీ ఒకటొకటీ అంతరంగ రంగస్థలమ్మీదకి సరాగాలతో వచ్చేసి హోరెత్తించేసాయి!
అంతలోనే ఓ చిలిపి ఊహ తళుక్కున మెరిసింది. మన సాఫ్టువేరు పనిగాళ్ళు యీ పడకసీను వేస్తే ఎలా ఉంటుందీ అని! అనుకున్నదే తడవుగా అంతరాత్మ స్టేజి మీద అన్నీ అమర్చేసింది.
అది ఒక సాఫ్టువేర్ కంపెనీ డివిషనల్ హెడ్డు కేబిన్. అందులో ఎప్పటిలా కృష్ణారావు సుదీర్ఘమైన ఓ కునుకు తీస్తున్నాడు. కలలోకూడా అతన్ని వదిలిపోని predictive management skill అతన్ని ఒక్కసారిగా నిద్రలేపింది. కేబిన్ బయటకి సారించిన అతని చూపుకి అర్జునరావు, రాజారావు వడివడిగా అడుగులు వేస్తూ తన కోసమే వస్తూ కనిపించారు. వాళ్ళిద్దరూ తనకింద పనిచేస్తున్న ప్రాజెక్టు మేనేజర్లు. ఈ మధ్యనే యిద్దరూ కొత్త కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టారు. అవి రెండూ (ఆ మాటకొస్తే ఏ రెండూ కావుకనక!) చాలా బిగిసిపోయిన కాలపరిమితితో (అదే tight schedule) ఉన్న ప్రాజెక్టులు. ఆ విషయం కృష్ణారావుకి బాగా తెలుసు. ఎందుకంటే కష్టపడి కష్టమరు కాళ్ళావేళ్ళా పడి తన బుద్ధి కుశలతనంతా ఉపయోగించి వాటిని సంపాదించి పెట్టింది (తద్వార బోనస్సులో అధికవాటా కొట్టేసింది) తనే కదా! దాన్ని పూర్తి చెయ్యమని "తగిన" టీముని కూడా తనే కదా ఏర్పాటు చేసాడు వాళ్ళకి. దాని గురించే తన దగ్గర మొరపెట్టుకోడానికి వస్తున్నారిద్దరూ అని అతనిట్టే గ్రహించేసాడు. హడావిడిగా బిజీ పనిలో నిమగ్నమైనట్టు, తన మోనిటర్ నుంచి తలతిప్పకుండా, కీబోర్డుపై వేళ్ళు టకటక లాడించడం మొదలుపెట్టాడు. ముందుగా అక్కడికి చేరిన రాజారావు, తన బాసు పనిలో ఉన్నాడనుకొని, అతనికి వ్రతభంగం చెయ్యకూడదని మెల్లిగా వచ్చి అతని మానిటరుముందున్న కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో అర్జునరావు కూడా అక్కడికి చేరాడు. అతను కాస్త బుద్ధికుశలత ఉన్న మేనేజరు. "May I come in Krish" అని తలుపుదగ్గరే నిలబడ్డాడు. తలతిప్పిన కృష్ణారావు అతన్ని చిరునవ్వుతో చూసాడు. బేగ్రౌండులో హార్మణీ సరిగమలని శ్రుతిచేసింది.
కృష్ణారావు: "ఎక్కడనుండి రాక యిటకు"
అర్జునరావు: (అంతరంగంలో) "నీ మొహం మండ! ఇంకెక్కణ్ణుంచి వస్తాను, అసలు సీట్నుంచి కదలడానికి టైముంటే కదా!" (జనాంతికంగా) "Open Plazaనుంచే" (అదివాళ్ళ టీము నివసించే బిల్డింగ్ పేరు)
కృ: "ఎల్లరునున్ సుఖులే కదా?"
అ: (ఏడవలేని ఒక నవ్వుతో ఊపీ ఊపకుండా తల ఊపుతాడు.)
కృ: "భలే టెక్కులు నీదు లీడులును, లేత మనస్కులు నీదు డెవ్లపర్స్
చక్కగనున్న వారె? మన దేవుడు కష్టమరన్ని వేళలన్
మక్కువ నిల్చి శాంతి గతి తాను చరించునె తెల్పు మర్జునా!
(ఈపాటికే సాఫ్టువేరువాళ్ళకి ఛందస్సు పెద్దగా రాదన్న విషయం ప్రేక్షకులు గమనించే ఉంటారు!)
అర్జునరావు జవాబు చెప్పేలోపలే తల పక్కకి తిప్పి అక్కడ కూర్చున్న రాజారావుని అప్పుడే చూసినట్టు చూసాడు కృష్ణారావు.
కృ: "నీవా! ఎప్పుడు వచ్చితీవు సుఖుడే నీ కష్టమర్ దేవుడున్
నీ వాల్లభ్యము పట్టు లీడులును డెవ్లప్పర్స్ సుఖోపేతులే?
మీ వర్కున్ సరిజూచు టెస్టరులు మీ మేల్గోరు క్యూయే ప్రియం
భావుల్ సేమముమై నెసంగుదురె నీ తేజంబు హెచ్చించుచున్...నీవా...ఆ...ఆ...ఆ..."
అతని రాగాన్ని ఆదిలోనే కట్ చేస్తూ రాజారావందుకొన్నాడు.
రా: "కష్టమరూ మనం మునుగు కాలము సేరువ అయ్యె"
అంతకన్నా అతనికి ఛందస్సులో మాట్లాడే ఓపిక లేక సూటిగా వచనంలో తన గోడంతా వినిపించేడు. పనిలోపని అర్జునరావు కూడా అందుకే వచ్చుంటాడని ఎడ్యుకేటెడ్ గెస్సుకూడా చేసి, అతనికన్నా ముందు తనే వచ్చేనని కూడా నొక్కివక్కాణించాడు.
చివరికి "సహాయమున్ కోరగ నేగుదెంచితిమి డివిషనలైక శిరోవిభూషణా" అని మాత్రం అన్నాడు.
అప్పుడు కృష్ణారావు ఒక కొంటె నవ్వు నవ్వి,
కృ: "ముందుగ వచ్చితీవు, మునుముందుగ అర్జును నేను జూచితిన్
పొందిన రిస్కులన్నియవి పాయగ నిల్చె సహాయ మిర్వురున్
జెందుట పాడి, మీకునయి చేతు రిసోర్సు విభాగ మందు మీ
కుం దగుదాని గైకొనుడు...కాని రాజారావ్,...కోరుట యెఫ్ఫెము కొప్పు ముందుగన్!
(F.M. అనగా Functional Manager. అనగా మేనేజర్ పనే చేసినా మేనేజరని పిలిపించుకోలేని వాడు. Managerకి ముందు దశన్న మాట. అర్జునరావింకా ఆ దశలోనే ఉన్నాడు. రాజారావు అప్పటికే ఆ దశని దాటుకొచ్చేసాడు.)
రా: (తనలో తాను) "ఔరా! క్రిష్ ఎంత మోసము చేయుచున్నాడు! నా తరువాత వచ్చిన అర్జునరావుకి రిసోర్సులో భాగమివ్వడమే కాక, కోరుకొనుటలోనూ అతనికే ముందు ఛాన్సు ఇచ్చాడు!".
రాజారావు అనుమానాన్ని గ్రహించిన కృష్ణారావు అతన్ని బుజ్జగిస్తూ,
కృ: "నువ్వేమో ఎక్స్పీరియన్సుడు మేనేజరువి. ప్రాజెక్టు మేనేజ్మెంటులో ఆరి తేలినవాడివి. ఇతనింకా జూనియరు. కాబట్టి ఇట్లు వేరుగ అడుగవలసి వచ్చింది. అది అట్లుండన్"
అని అసలు రిసోర్సింగు విషయానికి వచ్చాడు. వాళ్ళొచ్చింది Additional Resources కోసమే కదా!
కృ: "అన్ని యెడలను నాకు దీటైనవారు
కలరు పదిమంది డెవ్లపర్స్ ఘనులువారు
వారలొకవైపు, ఆర్కిటెక్టొక్కవైపు
కోడు చేతురు వారలబద్ధ మెందులకు
మరి ఆర్కిటెక్టో?
కోడింగు త్రోవబోవక, బుద్ధికి తోచినది ఏదో ఏదో సహాయమున్ బొనరించున్!"
రా: (తనలో తాను) "కపట నాటక సూత్ర ధారి! డెవెలపర్సందరినీ అర్జునరావుకి కట్టబెట్ట ఇతనీ పన్నాగము పన్నినాడు. ఒక మాడ్యూలైనా చేపట్టడట, కోడింగు చెయ్యడట. ఈ కంచి గరుడ సేవ ఏరికి కావలె! ఊ...!"
అ: "క్రిష్ కోరుకొమ్మందువా?"
కృ: "కోరుకొనవచ్చును కాని, నేను చెప్పిన మాటలు తుట్టదుద వరకూ వింటివో లేదో. మరొక్కసారి చెప్పెదను ఆలకింపుము.
మాడ్యులు నోనుసేయ డత డందరకూ నొక పట్ల టెక్నికల్
సాయము సేయువాడు, పెలుచన్నను పిమ్మట యెగ్గులాడినన్
దోయిలి యొగ్గెడున్, నిజము తొల్త వచించితి కోరికొమ్ము నీ
కేయది యిష్టమో కడమ యీతని పాలగునోయి అర్జునా!"
అ: (ఇతనికీ ఛందస్సులో మాట్లాడే ఓపికలేదు.) "క్రిష్ అటులైన నేను ఆర్కిటెక్టుని తీసుకొందును."
రా: (తనలో తాను) "హ...హ..హ... క్రిష్ తాను తీసిన గోతిలో తానే పడినాడు. నాకంతయూ మేలే జరిగినది". (జనాంతికముగా) "క్రిష్! ఇంక చేయునది ఏమున్నది. మిగిలిన డెవలపర్సందరినీ నేను గైకొందును. సరి, ఇక నాకు కష్టమరుతో టెలీకానుకి వేళ అయినది. ఇక నేను పోయివత్తునా? ఆ...? ఆ...!"
రాజారావు రంగస్థలం నుంచి నిష్క్రమిస్తాడు. కృష్ణారావుకి థాంక్సు చెప్పి అర్జునరావు కూడా వెళ్ళిపోతాడు.
కృష్ణారావు యథావిథిగా మళ్ళీ నిద్రకుపక్రమిస్తాడు.
తెరదించబడుతుంది.
ఆ తర్వాత కథ అందరూ ఊహించేదే! పదిమంది additional developersతో పని చేయించుకోడానికి రోజుకి మరో అయిదు గంటలు ఎక్కువ పని చేసినా రాజారావు ప్రాజెక్టు deadline దాటిపోతుంది. అర్జునరావు technical support బాధ్యతంతా ఆర్కిటెక్టుకి అప్పగించి నిశ్చింతగా తన పని చూసుకుంటాడు. ఆ ఆర్కిటెక్టు application architecture, design తయారు చెయ్యడం దగ్గర నుంచి, కొత్త developersకి training ఇవ్వడం, వాళ్ళెక్కడైనా చెయ్యలేకపోతే తనే స్వయంగా కూర్చుని వాళ్ళకి చేసిపెట్టడం,ఇలా రాత్రి పగలు "technical support" చేస్తూ ప్రాజెక్టుని అయ్యిందనిపిస్తారు. అర్జునరావుకి మరుసటి ఏడాది "Functional" అనే బిరుదుని తొలగిస్తారు. ఉద్యోగంలో విజయ రహస్యం తెలుసుకున్న అతను విజయునిగా (అనగా successful managerగా) పేరుతెచ్చుకుంటాడు.
స్వస్తి!
ముఖ్య గమనిక(లు):
ఈ నాటకం కేవలం కల్పితం. ఎవరూ భుజాలు తడుముకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇది ఏ ఒక్క వర్గాన్నీ కులాన్నీ కించపరిచే ఉద్దేశంతో రాసింది కాదని మనవిచేసుకుంటున్నాను.
అన్ని చోట్లా భారతదేశంలో Software భారత కథ ఇలాగే ఉంటుందని కూడా చెప్పలేమని సవినయంగా విన్నవించుకుంటున్నాను.
పూర్తిగా చదవండి...