తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Wednesday, September 3, 2008

వినాయకునికి పద్యాల నైవేద్యం


అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!
వినాయకచవితి తెలుగువాళ్ళకి ఆహ్లాదకరమైన పండగ. వినాయకుడంటే తెలుగువాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి! అతని రూపమే చిత్రం! అతని వాహనం మరీ విచిత్రం! ఇష్టమైన పిండివంటలు సరే సరి! మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా! అతనితో ఎన్ని సరదాలు, మరెన్ని సరాగాలు! ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలక గుఱ్ఱాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటీ మొదలుపెట్టాడా స్వామి!

వినాయకుడు: రేపు వినాయకచవితి గుర్తుందా!

నేను: అయ్యో ఎంత మాట! నాకు గుర్తులేకపోవడమేమిటి, మాకు సెలవు కూడానూ!

వినాయకుడు: అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావ్?

నేను: అదీ...మరీ...స్వామీ... మా ఆవిడ ఉండ్రాళ్ళో ఏవో చేస్తానంది. ఆవిడ దయా మీ ప్రాప్తం!

వినాయకుడు: అది కాదోయ్! నువ్వు పెట్టే నైవేద్యమేవిటీ అని అడుగుతున్నా...

నేను: నేనా? ఏంటంటున్నారు స్వామీ?

వినాయకుడు: అదేనయ్యా, నీ బ్లాగులో పండగలకీ పబ్బాలకీ పద్యాలు వేస్తున్నావు కదా! ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేనడుగుతున్నది.

నేను: ఓ, అదా! అయినా మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా అని...

వినాయకుడు: అదేంటయ్యా అలా అంటావ్! అసలు నాకు సంస్కృతశ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా!

నేను: అవునా స్వామీ! అదేం?

వినాయకుడు: నన్ను తల్చుకోగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు.

నేను: శుక్లాంబరధరం విష్ణుం...

వినాయకుడు: అవునా! మరి నన్ను తల్చుకోగానే గుర్తుకొచ్చే మీ తెలుగు పద్యం ఏవిటి?

నేను: తోండము నేకదంతమును...

వినాయకుడు: ఊ...పూర్తిగా చదువు.

నేను:
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!

వినాయకుడు: చూసావా! నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేనుకూడా చాలా కాలంనుంచీ నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలందులో నాగురించి ఏవిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాక్కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు. స్పష్టంగా, వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తోందో! అందికే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం!

నేను: బావుంది స్వామీ! మీకు తెలుగు పద్యాలిష్టమని విని చాలా ఆనందంగా ఉంది!

వినాయకుడు: మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు! అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో!

నేను: అలాగా!

వినాయకుడు: అవునయ్యా! అతనెవరూ... జిగిబిగి కవిత్వం రాసాడు. ఆ... అల్లసాని పెద్దన. అతను బలే గడుసువాడు సుమా! నా గురించి బలే పద్యాన్ని రాసాడు. ఏదీ ఆ పద్యం ఒక్కసారి చదివి వినిపించూ.

నేను:
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!

వినాయకుడు: తస్సాదియ్యా! కవంటే ఇతనేనయ్యా. నాక్కూడా ఎప్పుడూ రాలేదిలాంటి అల్లరి ఆలోచన! దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలిది నా గురించే కాదనీ ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకవేవీ పట్టవు. నా గురించి అలాటి చమత్కారమైన ఆలోచన చేసాడు చూడూ! అది నాకు బలే బలే అద్భుతంగా అనిపించింది.

నేను: అవును స్వామీ! పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె అని అందుకేగా మేం అనుకునేది! అయితే ఇంతకన్నా ముందే కేతన కవి ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీచేత ఆడించాడు స్వామీ!

వినాయకుడు: అవునా! ఎందులో? ఏదీ ఆ పద్యం కూడా వినిపించు మరి.

నేను: ఈ పద్యం దశకుమారచరిత్రములోది. వినండి.
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!

వినాయకుడు: ఓరి మీ అసాధ్యంగూలా! మీ తెలుగుకవులు భలే వాళ్ళయ్యా! నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారూ! నా రెండు చేతులతోనూ మా నాన్న రెండు కళ్ళూ మూసేసి, మా నాన్న మూడో కంటిని నా మూడో చేత్తో, "హస్తంతో", అంటే తొండంతో మూసేసానా! ఆ నిప్పుకంటి జోలికి వెళితే నా తొండమేం గానూ!

నేను: పొండి స్వామీ మీరు మరీను! పరమేశ్వరుని చిత్తం చిగురిస్తే, ఆ కన్ను మంటలు కురిపిస్తుందా ముద్దులు కురిపిస్తుంది కానీ.

వినాయకుడు: ఆలా అంటావా! అయితే ఓకే. ఇంతకీ, నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు?

నేను: నన్నెచోడుడు అనుకుంటాను స్వామీ!

వినాయకుడు: ఓహో! అతనే కదూ మా తమ్ముడు పుట్టుకగురించి కుమారసంభవం తెలుగులో రాసిన కవి. ఏదీ అతను రాసిన పద్యం వినిపించు.

నేను: చిత్తం.
తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ
ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా
జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!

వినాయకుడు: బావుందయ్యా! నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే యీ కవి! మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా! ఇంకా ఎవరెవరు ఏం చమత్కారాలు చేసారో త్వరగా వినిపించు.

నేను: కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామీ. అతను రామరాజభూషణుడు, ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు. మీరే వివరించాలి!

వినాయకుడు: ఏవిటి నేనా! ఇప్పుడంత సమయం లేదే. సరే చదువు చూద్దాం.

నేను:
దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!

వినాయకుడు: అబ్బో, యీ భట్టుమూర్తి చాలా ఘటికుడయ్యా! వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసిపారేసాడు! మధ్యలో శ్లేష ఒకటి!
నా తొండంతో ముందు గంగ నీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట! తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే, ఆ ఊపుకి, మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకొందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించేనట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని (కుమారస్వామికి అన్ననే కదా!) సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి!

నేను: బాగా వివిరించారు స్వామీ! స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది!

వినాయకుడు: అది సరేగానీ, ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా, వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకొనే పద్యాలు ఎవరూ రాయలేదా?

నేను: ఎందుకు రాయలేదు స్వామీ! అలాటివాటికి పెట్టింది పేరు పోతన, ఆ తర్వాత కొంతవరకూ మొల్ల.

వినాయకుడు: అయితే తొందరగా వినిపించు మరి!

నేను: పోతన తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో:
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!

వినాయకుడు: ఆహా! పోతన పద్యంలో తీయని మకరంద ధార జాలువారుతునే ఉంటుంది. మరి మొల్ల పద్యమో?

నేను: చిత్తం సిద్ధం!

చంద్రఖండ కలాపు జారు వామనరూపు
గలిత చంచలకర్ణు గమల వర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహు
భద్రేభవదను సద్భక్తసదను
సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
ననుదినామోదు విద్యాప్రసాదు
బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు
నురుతరఖ్యాతు నాగోపవీతు

లోకవందిత గుణవంతు నేకదంతు
నతుల హేరంబు సత్కరుణావలంబు
విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు
బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!

వినాయకుడు: చాలా బావుంది! సీసంలోని తూగు మరే పద్యానికొస్తుంది! అన్నట్టు సీసమనగానే గుర్తుకొచ్చింది. అసలుసిసలు తెలుగుకవి, మీ శ్రీనాథ కవిసార్వభౌముడు నా గురించేమీ రాయలేదా?

నేను: అయ్యో పొరపాటైపోయింది స్వామీ! మరచిపోయాను. ఇదిగో మీ గురించి అతను రాసిన సీసం!

కలితశుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజలధరములు
వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్నమేఖలములు
పక్వ జంబూఫల ప్రకటసంభావనా
చుంబిత భూభృత్కదంబకములు
వికట కండూల గండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు

శాంభవీశంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి గావించు గాత!

వినాయకుడు: అబ్బబ్బా! ఏవి ధారా, ఏవి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ ధారాధుని అని పిలిచేది. సెభాష్!
అవునూ, నువ్వందరూ పాతకవులనే చెప్తున్నావ్, ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి?

నేను: అయ్యో లేకేం స్వామీ! పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే, ఏకంగా ఒక పద్య ఖండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే, కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు "నమస్తే" చెప్పారు.

వినాయకుడు: అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీవాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారుచేసారో, ఎన్నెన్ని పిండివంటలు చేసారో చూడ్డానికి వాహ్యాళికి వెళ్ళాలి. నువ్వు కూడా తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలి కదా! మచ్చుకి ఒక్క పద్యం వినిపించు చాలు. ఆనక మిగతావి వింటాను.

నేను: సరే అలాగే స్వామీ! చిత్తగించండి.

ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరుగెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా!" యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట

అమరులందగ్ర తాంబూలమందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!

వినాయకుడు: నేను విష్ణుమూర్తిని "నల్ల మామా" అని ఆటపట్టిస్తానా! ఆహా బలే అయిడియా ఇచ్చాడే ఇతను! ఎంతైనా మీ తెలుగుకవులకి సరసం ఎక్కువే సుమీ!
మొత్తానికివాళ పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం చేసినట్టుంది! బావుంది నీ పద్య నైవేద్యం!
కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తోంది.

నేను: లోటా! ఏవిటి స్వామీ?

వినాయకుడు: మీ తెలుగు కవులు ఇందరిగురించి కావ్యాలు రాసి, నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తోంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి కూడా వెయ్యేళ్ళ కిందటే ఎవరో రాసారని చెప్పావే, మరి ఇన్నాళ్ళై నా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు?

నేను: అవును స్వామీ! మీరు చెప్పే దాకా నాక్కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది.

వినాయకుడు: పోనీలే. ఇంతమంది రాసిన పద్యాలు చెప్పేవు కదా. సొంతంగా నువ్వొక్క పద్యం నా గురించి యిప్పుడు చెప్పకూడదూ. విని దానితోనే సంతృప్తి పడతాను.

నేను: అయ్యో అంత కన్నా మరో భాగ్యం ఉంటుందా! అవధరించండి!

శ్రీకంఠుని సతి ప్రేమకి
ఆకారమ్మైన సామి! హరుని దయన్ నూ
త్నాకృతి దాల్చిన గజముఖ!
చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగ మాకున్!

నేనిలా పద్యం చదివానో లేదో, అలా అదృశ్యమైపోయాడా గణనాథుడు! నా పద్య ప్రభావమేనో ఏమో! సరే పొద్దున్న యథావిథిగా పూజా కార్యక్రమాలు సాగించి, మా ఆవిడ చేసిన పిండివంటలు స్వామికి నైవేద్యం పెట్టి నేను తిని, ఇదిగో నా నైవేద్యాన్ని మీ ముందు పెట్టాను. ఆరగించండి మరి!

31 comments:

 1. :-)

  అమ్మ చేసిన పిండి వంటలు తిని భుక్తాయాసం తో ఉన్న నాకు, ఈ పద్యాల ప్రసాదం అమితానందాన్ని ఇచ్చింది. ఇన్ని పద్యాలు పరిచయం చేసిన మీకు బోలెడన్ని కృతజ్ఞతలు.

  వినాయక చవితి శుభాకాంక్షలు.

  ReplyDelete
 2. చాలా బాగుంది విఘ్నాధిపతితో మీ ముఖాముఖి. అన్ని పద్యాలు బాగున్నాయి, ముఖ్యంగా భట్టుమూర్తిది. ఈ రకంగా సందర్భోచితంగా మంచి పద్యాలు పండగ రోజున చదివించినందుకు ధన్యవాదాలు.

  ReplyDelete
 3. adbhutamagaa vumdi mee padya naivedyam

  ReplyDelete
 4. చాలా బావుంది మీ పద్య నైవేద్యం. ఆ వినాయకుడికే కాక అందరికీను ఈ ప్రసాదం అద్భుతమైనది.

  ReplyDelete
 5. అద్భుతం మేష్టారూ!
  అందులోనూ స్వామితో సంభాషణలాగా కూర్చిన మీ చాతురి అమోఘం.
  ఇటీవల ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు రాసిన ఒక స్తుతి శ్లోకం చదివాను ఏదో పుస్తకంలో .. అది కూడా చాలా ప్రౌఢంగా ఉంది. దొరికితే పంపిస్తాను.
  మీకూ, మీ బ్లాగు పాఠకులకీ శ్రీ విఘ్నేశ్వర కటాక్ష సిద్ధిరస్తు!

  ReplyDelete
 6. అద్భుతంగా వుంది.వినాయకుని 21 పత్రాలతో గాకుండా పద్యాలతో నైవేద్యం అర్పించినట్లుంది మీరు.పాత పద్యాలను మళ్ళీ గుర్తుచేసినందుకు ధన్యవాదములు.

  మీకు నా వినాయక చవితి శుభాకాంక్షలు.

  ReplyDelete
 7. మీ విఘ్నేశ్వర స్వామి ప్రసాదం చాలాచాలా బాగుందండి.ఇన్ని పద్యాలతో కూడిన ప్రసాదం మాకందరికీ పంచిపెట్టినందులకు మీకు మా అందరి తరఫున కృతజ్ఞతాభినందనలు.

  ReplyDelete
 8. క:-పద్యంబుల నైవేద్యము
  హృద్యాద్భుతమై రహించె నిపుణత తోడన్.
  పద్యము మీరే వ్రాయుదు.
  సద్యశమిడి విఘ్నరాజు చక్కగ బ్రోచున్.

  ReplyDelete
 9. మీ ఓపికకు నెనెర్లు

  ReplyDelete
 10. మీ నైవేద్యం వలన గణపతి ఘనంగా పద్యోదరుడు ఐయుంటాడు.

  అయినా కామేశ్వరరావు మేష్టారూ, నిజమా? వినాయకుడిపై కావ్యమే లేదా ఇంతవరకూ? అది నిజమే ఐనా అస్సలు నమ్మశక్యంగా లేదండీ.

  ReplyDelete
 11. మీ పద్యాలు విని వరములిచ్చి వెళ్ళాక ఎమయ్యిందో తెలుసా??

  క. చక్కటి పద్యము తెలుపగ
  మిక్కిలి సంతసము తోడ పెక్కు వరములన్
  ఠక్కున నిచ్చిన బిడ్డకు
  చక్కెర పాయసము బెట్టె శంకర పత్నీ!

  ReplyDelete
 12. చవితి నాడు వినాయకుడికి చేసిన గొప్ప పూజ ఇది. ఖచ్చితంగా వినాయకుడు మీ ఇంటినుండి వెళ్ళలేక వెళ్ళి ఉంటాడు -భుక్తాయాసంతోటీ, మరిన్ని పద్యాలను వినాలన్న కోరికను అణచుకోలేకా.

  ReplyDelete
 13. పద్య ప్రసాదం పరమ తీపిగా ఉంది!

  దైవానిక,
  ప్రావీణ్యం బాగానే సంపాదించారుగా పద్య రచనలో మీరు కూడాను!

  ReplyDelete
 14. తొండపు గురుడికి వృత్తపు
  దండలు కందపు కుడుములు దండిగ గుప్పన్
  వెండియు వేడ్కతొ సీసపు
  తండము పత్రిగ నొసగను తమరికె యొప్పున్

  ReplyDelete
 15. ప్రసాదాన్ని ప్రీతితో సేవించిన భక్తులందరికీ "సర్వ విఘ్నోప శాంతయే!" :-)
  కొందరు ఉత్సాహవంతులైన భక్తులు తమ తమ నైవేద్యాలని కూడా సమర్పించుకున్నారు, బహు బాగు!
  దైవానిక గారు, మీ బ్లాగులో కందాలు కూడా బావున్నాయి. అలాగే రామకృష్ణగారూ, మీ పద్యాలు కూడా బావున్నాయి. మీ యిద్దరి పద్యాల్లోనూ రెండవ పాదంలో యతి కుదిరినట్టు లేదు. చూసుకోండి.
  అయినా, పోతనగారి పద్యంలోనే యతి తప్పినప్పుడు, మీ పద్యాల్లో అలాటి చిన్న తప్పులు వెతకడం సమంజసం కాదనుకోండి!
  గిరిగారూ మీ సంగతి వేరే చెప్పాలా! కొత్తపాళీగారి మాటే నా మాట.
  అన్నట్టు పెద్దనగారి "అంకము జేరి..." పద్యానికి అసలు మాతృక అనదగ్గ మరో పద్యం కనిపించింది. పిల్లలమఱ్ఱి పినవీరభద్రుని శృంగారశాకుంతలంలో పద్యమిది:

  జననీస్తన్యము గ్రోలుచున్ జరణ కంజాతంబునన్ గింకిణీ
  స్వన మింపారగ దల్లి మేన మృదుల స్పర్శంబుగా దొండ మ
  ల్లన యాడించుచు జొక్కు విఘ్నపతి యుల్లాసంబుతో మంత్రి వె
  న్ననికిన్ మన్నపు పొంపుమీర నొసగున్ భద్రంబు లెల్లెప్పుడున్

  అయితే పెద్దన పద్యంలో ఉన్న చమత్కారమూ అలంకారమూ ఇందులో లేదనుకోండి!

  ReplyDelete
 16. >>"పోతనగారి పద్యంలోనే యతి తప్పినప్పుడు"
  వీలైతే ఆ వివరాలు చెప్పండి. ఏదేనీ ప్రత్యేక కారణమా లేక అలానే రాసారా పోతన గారు.

  ReplyDelete
 17. గిరి: నా సెబాసు కూడా!

  ReplyDelete
 18. సీ. పిండివంటలవలె మెండైన తీయని
  పద్యప్రసాదంబు పంచినారు
  కొబ్బరి కాయను కొట్టినట్టుగ పద్య
  సొబగులు విడమర్చి చూపి నారు
  గుడిఘంట నాదాలు గుర్తు జేసినయట్లు
  యింపైన శబ్దాల నిచ్చినారు
  అలరించు పూలతో యర్చించు నట్లుగా
  మంచి భావాల నందించి నారు

  తే. అక్షరార్చన సేవను యందు కొనుచు
  శంభు సుతుడనిశంబు విశ్వంబు లోన
  శాంతి సౌభాగ్యములు నిల్ప స్థిరము గాను
  వేడు కొందును వినవయ్య విఘ్న రాజ
  ----
  శ్రీనివాస్

  ReplyDelete
 19. > శాంతి సౌభాగ్యములు నిల్ప స్థిరము గాను
  "శాంతి సౌభాగ్యములు నిల్ప శాశ్వతముగ" అని చదువ మనవి
  ----
  శ్రీనివాస్

  ReplyDelete
 20. గిరి గారు, ఇలాంటి కందమే వ్రాద్దామని నిన్నటి నుంచి ప్రయత్నిస్తున్నాను కాని అస్సలు కలవలేదు. మీరు భలే సులువుగా వ్రాసేసారు కదా!
  కామేశ్వరరావు గారు, 'ప'కి 'మ'కి యతిమైత్రి కుదురుతుందని వికీ చెబుతుంది. మరి అది కరెక్టో కాదో నాకు తెలీదు. కుదరదంటారా??

  ReplyDelete
 21. వ్యాఖ్యల సంఖ్య "21" అని చూసి, మళ్ళీ నేను వ్యాఖ్య రాద్దామనుకోలేదు :-) కానీ వికటకవిగారు, దైవానికగారు అడిగిన సందేహాలని తీర్చడానికి తప్పటం లేదు.
  @వికటకవిగారూ, నేనీ టపలో ఇచ్చిన పోతన పద్యాన్ని మరోసారి జాగ్రత్తగా చదవండి!
  @దైవానికగారూ, "ప"కి "మ"కి యతి చెల్లదండీ. వికీలో ఇచ్చిన బాహ్య లంకెలో యతి నియమాలు సరిగా, చాలావరకూ వివరంగా ఉన్నాయి. నేను వికీ పేజీని సరిచేసాను. ఒకసారి మళ్ళీ చూడండి.
  ఇదే వికీలో నా ఆరంగేట్రం! వీలువెంబడి ఛందస్సు మీద ఇతర వ్యాసాలని కూడా చూస్తాను.

  ReplyDelete
 22. బ్లాగు వేదిక పై పద్యనైవేద్యం - బాగుంది.

  పెద్దన గారు పద్యం నాకు పూర్తిగా అర్థం కాలేదు గాని, అలాంటి పద్యాన్ని ఒక దాన్ని నేను సౌందర్యలహరిలో చూసాను. (ఇక్కడ ౭౨వ పద్యం)

  ReplyDelete
 23. హరజూటానటదాపగాంబుఝురి తుండాగ్రంబునం బీల్చి,సా
  దరతం దజ్జలజంబు తల్లికి,సముద్య త్పుష్క రాకృష్ణ సా
  గర గౌ ర్యగ్రజ కంధ రాంతర ఫణి గ్రైవేయకం బద్భుత
  స్ఫురణందండ్రి కొసంగి,ముద్దుగొను దేవుండిచ్చు నిర్విఘ్నతన్.-శశాంక విజయము-శేషము వెంకటపతి.

  కలిత శుండా దండ గండూషి తోన్ముక్త
  సప్త సాగర మహా జల భరములు
  వప్ర క్రియా కేళి వశ విశీర్ణ సువర్ణ
  మేదినీ ధర రత్న మేఖలములు
  పక్వ జంబూ ఫల ప్రకట సంభావనా
  చుంబిత భూ భృ త్కదంబకములు
  వికట కండూల గండక దేహ మండలీ
  ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు

  శాంభవీ శంభు లోచ నోత్సవ కరములు
  వాసవా ద్యమృ తాశన వందితములు
  విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
  మించి విఘ్నోపశాంతిఁ గావించుఁ గాక.-హర విలాసము-శ్రీనాధ మహాకవి.

  తొండముమీఁది కెత్తుకొని దోర్యుగళంబునఁ దాళగించుచు
  న్గండమదాంబుధారలకుఁ గ్రమ్మెడు తుమ్మెదలొత్తుకారగా
  గొండలఱేని కూర్మిసుతకుంబ్రియమొందఁగనాడుచున్న వే
  దండముఖుండునవ్యకవితారస సూక్తులు మాకునీవుతన్
  -పద్మ పురాణము- మడికి సింగన

  పిల్లలమఱ్ఱి వారిది కూడా వ్రాద్దామనుకున్నా.మీరే వ్రాసేసారు.ఇంకా ఇంకా ఎత్తి వ్రాయాలనే ఉంది.ఊరెళ్ళాల్సొచ్చి ఆపేస్తున్నాను.ఇంకోసారికి--

  ReplyDelete
 24. telugu antarinchi potundi ane vallaku idi chakkati jawabu. veyyellu kadu velayellu telugu sajeevam ga vuntundi. i lage chakkati vastuvu teesukuni pandita sreshtulu appudappudu vari bhavalanu panchukovalani korika
  sreenivasa murthy t v hyderabad.

  ReplyDelete
 25. వినాయకుడికి నైవేద్యం, మాకు ప్రసాదం రెండూ అద్భుతంగా కుదిరాయి. ఒక్క నారాయణుడికి మాత్రం కొంచెం అలకగా ఉందేమో. పాపం పోతన ఎంతో శృంగారంగా "నల్లని వాడు పద్మనయనంబులవాడు", "మామా, వలువలు ముట్టకు", అంటూ చెప్తే ఆ రెండింటినీ కలిపి "నల్ల మామ" అనేసారు :-)

  చక్కని వ్యాసం, మీకు మేమందరం ఋణపడి ఉన్నాము.

  ReplyDelete
 26. ఆణిముత్యాల్లాంటి పద్యాలు. ప్రస్తుత తరం కోల్పయిన పద్యకవితా సంపద.

  ReplyDelete
  Replies
  1. చాలా గొప్ప సంకలనం.
   మనసు పులకించింది

   Delete
 27. ప్రసాద్ ఏలూరుSeptember 2, 2019 at 6:05 PM

  http://www.andhrabhoomi.net/content/others-3304

  ReplyDelete
 28. మంచి సేకరణ. అభినందనలు. ధన్యవాదాలు

  ReplyDelete