తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్

Monday, September 29, 2008

మరల నిదేల "అగ్నిప్రవేశం"బన్న... :-)


సీత అగ్నిప్రవేశం ప్రస్తుతం బ్లోగ్లోకంలో కొన్ని బుఱ్ఱలని చాలా వేడెక్కించింది. అజ్ఞాతంలోకి వెళ్ళిన బ్లాగ్రాజులని బ్లాగ్జీవన స్రవంతిలోకి తిరిగి తీసుకు వచ్చింది కూడా :-) సరే ఈ అగ్నిలో నావంతు ఆజ్యం నేనూ పోయవద్దా!
నాకు రామాయణమంటే ముందు గుర్తుకొచ్చేది రామాయణ కల్పవృక్షం. అది నా వీక్నెస్సు! మరి అందులో అగ్నిప్రవేశాన్ని విశ్వనాథ తీర్చిన విధానం చూద్దామా మరి. ఇందులో విశ్వనాథ ఎలా చక్కని కావ్య శిల్పాన్ని ప్రయోగించాడని చూపించడమే నా ముఖ్యోద్దేశం. అంతే తప్ప దీనిగురించి సామాజిక, తాత్విక విశ్లేషణ/విమర్శ/చర్చ చెయ్యడం నా ఉద్దేశం కాదు. కాబట్టి దీని గురించి బుఱ్ఱలుపయోగించకుండా, ఉన్నది ఉన్నట్టు ఆస్వాదించడానికి ప్రయత్నించమని మనవి :-) ఇందులో చాలా లోతులున్నాయి కాని, నేను కేవలం పైపైనే చూపించ బోతున్నానని కూడా గ్రహించగలరు.

కల్పవృక్షంలో అగ్నిప్రవేశానికి ప్రవేశిక సుందరకాండలో జరుగిందని చెప్పవచ్చు! హనుమంతుని తోకకి నిప్పంటించినప్పుడు, అది కాలకుండా, అగ్నికున్న ఉష్ణాన్ని సీత తనలో దాచుకుంటుందిట! ఇది సీతని అగ్ని ఏవీ చెయ్యలేదన్న నిబ్బరం పాఠకునిలో కలిగించడానికేమో అనిపిస్తుంది.
అంతకన్నా మరో చిత్రమైన కల్పన చేసారు విశ్వనాథ. ఇంద్రజిత్తు వేసిన ఒక అస్త్రానికి రామలక్ష్మణులు మూర్ఛపోతారు. అప్పుడు రావణుడు వాళ్ళు చనిపోయారనే భావించి సీతదగ్గరకి వచ్చి, వాళ్ళు చనిపోయారన్న వార్త చెప్తాడు. సీత నమ్మదు. త్రిజట స్వయంగా యుద్ధరంగానికి వెళ్ళి చూసివచ్చి చెప్తుంది, వాళ్ళు పడిపోయే ఉన్నారు కాని వాళ్ళ ముఖాలు కాంతివంతంగానే ఉన్నాయని. అప్పుడు సీత ఒక విచిత్రమైన మొక్కు మొక్కుకుంటుంది. ఈ ఆపదనుంచి రామలక్ష్మణులు బయట పడిన తర్వాత, ఏ అగ్నిసాక్షిగా అయితే తను రాముని పెళ్ళాడిందో, ఆ అగ్నిలో తాను దూకుతానని ఆ మొక్కు. రావణుడాంటాడు, రామునిలాంటి భర్తని నమ్ముకుంటే నీకు అగ్నిప్రవేశమే గతి అని! రాముడెలాగూ యుధ్ధంలో చనిపోతాడు, అతనితో సీత సహగమనం చెయ్యడానికి నిప్పులో దూకాల్సి వస్తుంది అని అక్కడ రావణుని ఉద్దేశం. మరి తర్వాత సీత చేసిన అగ్నిప్రవేశం తన మొక్కు తీర్చుకోడానికా? తన భర్త ఉన్నా తనకి లేనట్టే అన్న పరిస్థిని సూచించడానికా? ఇన్ని ఆలోచనలని రేపే కల్పన ఇది!

ఇక అసలు ఘట్టానికి వద్దాం. సీత రాముడున్న ప్రదేశానికి ఇలా వచ్చింది:
"మత్త గజ మంథరగమనంబున భీతవోలె, విరాగిణివలె, దిరస్కారభావయుతవలె, భర్త్రనురక్తవలె నడచుచు బ్రవేశించి శ్రీరామచంద్రుని కెదురుగా నిలుచుండిన."
అలా నిలుచున్న సీతని చూస్తే రామునికెలా అనిపించింది?

ఏడాది యన్నమ్ము నెఱుగదు లలితాంగి
నిద్దుర యెఱుగదు నీరజాక్షి
ముడుచుకు కూర్చున్న యొడలుగా నంసభా
గమున వంగినయట్లు కానిపించు
మొగి నిరంతం బెడతెగని యేదో భయం
బక్షుల వెనుభాగ మానరింప
నఖిలలోకాతీత మైన సర్వాంగ వి
న్యాస సౌభాగ్య సౌందర్య మొప్ప

తన్ను హరిణంబు గొని తెమ్మటన్న కాంత
సగము సగమైన మై రామచంద్రునకును
తన సమస్త కామమున కాస్థాన భూమి
కనుల యెదుటను వచ్చి సాక్షాత్కరించె.

అప్పుడు రాముని మనసులో ఏమనుకుంటున్నాడు?

ఈ యమ హేతువై వనుల నెల్ల జరించెను దా బికారిగా
నీ యమ హేతువై జలధి కెంతొ శ్రమంపడి కట్టగట్టె దా
నీ యమ హేతువై గెలుచు టెంత శ్రమంబయిపోయె లంకలో
నా యమ జూచినంత హృదయంబున బట్టగరాని కోపమై

అతడు రాక్షసుం డటంచు సౌమిత్రి వ
చించె సుంత వినదు చెలువ తాను
ననుభవించె దాను ననుభవించితి మేము
నాడదింత సేయుననుచు గలదె?

ఇదంతా వాల్మీకంలోని "హృదయాంతర్గత క్రోధమే". ఆ తర్వాత విశ్వనాథలోని కవి ప్రవేశిస్తాడు. అక్కడున్న వచనం ఇది:

"ఇట్లూహించుచు" రాముండు మనసులో "నూరక" కోపంబు పెంచుకొంచుండగా"

కవి భాషాశక్తిని ఎలా ఉపయోగించుకున్నాడో చూసారా! ఊహించుకోవడం రెండర్థాలనిస్తుంది, అలానే "ఊరక" అన్న పదం కూడా.
ఆ సీత చూసేవాళ్ళకి ఎలా ఉందిట?
"తెలియన్ రాకయ చూచు నేత్రములకున్ స్త్రీమూర్తి తానింతలో
పల నాగ్నేయ శిఖాకృతిం బొలుచు"
అగ్నిశిఖలా ఉందిట ఆవిడ!

అంతలో ఏమయింది?
"అంత బడబాగ్ని చేత సళపెళ క్రాగి కళపెళలాడు సముద్రోపరి సముద్భూత బుద్బుదధ్వనులవోని కంఠరావ మొప్ప శ్రీరామచంద్రుడిట్లనియె"
లోపల బడబాగ్ని చేత, పైన కళపెళలాడే అలలపై బుడగల చప్పుడులా ఉందిట రాముని కంఠం. ఏవిటా బడబాగ్ని అన్నది పాఠకులే ఊహించుకోవాలి.
రాముడు వాల్మీకంలోలాగానే మాట్లాడతాడు. దాంతోపాటు ఇంకా దారుణంగా అనిపించే మరోమాట కూడా అంటాడు:

మఱియున్ నీకొక మాట చెప్పవలయున్ మారీచునిం జంపితిన్
హరిణం బయ్యది కాదు లక్ష్మణుడు యాథార్థ్యంబు వాచించె ని
ష్ఠురు లాయిద్దఱు గూడబల్కికొని దక్షుల్వచ్చి రచ్చోటి క
బ్బుర మా బంగరులేడి గోరెదని నీవున్ వార లెట్లెంచిరో?

"అప్పుడు నువ్వుకోరిన బంగారు లేడి లక్ష్మణుడు అనుమానించినట్టే రాక్షసుడు, మారీచుడు. ఆ రావణాసురుడూ మారీచుడూ ఇద్దరూ కలిపి కూడబలుక్కొని ఈ పన్నాగం పన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏవిటంటే, నువ్వు అలా బంగారులేడిని కోరుకుంటావని వాళ్ళెలా ఊహించారో కదా!" అని దీనర్థం. ఎంత మహా ఘోరమైన నింద ధ్వనిస్తోంది ఇందులో!

అప్పుడు సీత ఏం చేసింది?
"అంత బెద్దసేపు జానకీదేవి రామచంద్రుని వంక జూచుచు నట్లే నిలుచుండి చివరకు లక్ష్మణుని గాంచి యిట్లనియె"

"నాకుం బిడ్డలు లేరు, బిడ్డవలె నున్నా వీవు నిన్నాళ్ళు, నా
కై కొంచెమ్మయినట్టి సాయమును జేయంజూడవే నీవు ల
చ్చీ! కాష్ఠంబులు తెచ్చి నాకయి చితిం జేర్పించు, నేనీ దరి
ద్రాకారంబున జచ్చియుం బ్రదికి యౌరా! యొక్కరీతిం దగున్"

లక్ష్మణుని కావాలంటే పెళ్ళిచేసుకో అన్న రాముడికి ఈ మాటలు కొరడాతో కొట్టినట్టు అనిపించక మానతాయా!
సీత అగ్నిప్రవేశానికి ముందు రాముణ్ణి పూర్తిగా కుంకుడుకాయ రసంపోసి మరీ తలంటేస్తుంది! ఆవిడ పెట్టే చీవాట్లు వింటే, సీతేదో అమాయకురాలు, నోరులేనిదీ, భర్త దగ్గర నోరెత్తనిదీ, దీనురాలు అనుకొనే వాళ్ళ ఆలోచనల్లో తుప్పొదిలిపోతుంది.

నే నొక్కించుకసేపు లోనన మహాగ్నిం జొచ్చుచున్నాను స్వా
మీ! నీ యాజ్ఞన్ వచియింతు గొంచెము సమున్మీలద్యశోధామ! దై
వానన్ వచ్చిన దోసమంతయును నా వంకన్ నిరూపింతు, నీ
వైనన్ దైవమ వండ్రు, నీకు కృపలే దందున్ మఱట్లైనచో

దైవం వల్ల వచ్చిన దోషాన్ని నాపై పెట్టడానికి ప్రయత్నించావు. నిన్నందరూ దేవుడిలా చూస్తారు కాని, నీకు ఏమాత్రం దయా గుణం లేదు.

మచ్చిక జెట్ట యర్థముల మాటలనంటివి నన్ను నీవనన్
వచ్చును నేనునైన బడవచ్చును, బంగరులేడి జూడగా
విచ్చిన కంటితో నెడద విచ్చెను విచ్చిన గుండెలోపలన్
జొచ్చిన వయ్య రామ! రిపుసూదన! సర్వ ఋషీంద్ర వాంఛలున్!

ఏ ఋషి భావనా మహిమ ఏర్పడ నాయెదలోన జొచ్చి నన్
గోరగ జేసె లేడి, నది కోమలనీలపయోదదేహ! నా
కోరిక యిట్టులుండు ననుకొంటకు దానవులోన స్ఫూర్తిగా
నేరను వచ్చు, నీ విదియు నేరవె? సర్వఋషీంద్ర హృత్స్థితా!

ఒకపని మంచిచెడ్డలు సముద్భవమౌ ఫలదృష్టి నిర్ణయం
బు కలుగనటం జూతురు తమోహరణా! దయజూచితేని కో
రికయును నాది నీకు సురరీకృత కీర్తిరమా ఫలప్రదం
బకలుష గుప్తశౌర్య బహిరాగతి దివ్యఫలంబు రాఘవా!

నువ్వు ఊరికే అనవసరమైన చెడ్డమాటలన్నీ అన్నావు. అయినా నువ్వు నన్ననవచ్చు నేను పడవచ్చునూ. కాని అసలు విషయం చెప్తాను. బంగారులేడిని జూడగానే నా కళ్ళు చెదిరాయి నిజమే. కాని దాంతోపాటు నా గుండెకూడా చెదిరిపోయింది. చెదిరిన ఆ మనసులో సమస్త ఋషుల కోరికలు కూడా దూరాయి. నన్ను బంగారులేడిని కోరినట్లుగా చేసినది ఆ ఋషిభావనా మహిమ (దానవ సంహారమే ఆ ఋషుల కోరిక కదా). దానికి నువ్వు రాక్షస భావం అంటగడుతున్నావు. నీకామాత్రం నిజానిజాలు తెలియవా? సరే, ఒక పనివల్ల కలిగే మంచిచెడ్డలని చూసి ఆ పని సరైనదా కాదా అని నిర్ణయిస్తారు కదా. అలా చూసినా నేను కోరిన ఆ కోరిక నీకు మేలే చేసింది. నీలో దాగిన శౌర్యాన్ని అందరికీ తెలిసేలా చేసి నీకు కీర్తిని సంపాదించి పెట్టింది కదా!

ఆడది యింత సేతు ననుటన్నది యున్నదె యంచు నన్ను నూ
టాడితి, కైక కోరక మహాప్రభు నీ వని రాకలేదు, నీ
యాడది సీత కోరక మహాసుర సంహరణంబు లేద, యా
యాడది లేక లేద జగమంచు, నిదంతయు నేన చేసితిన్

ఆడది ఎంతకైనా చేస్తుందన్నావే, నిజమే నయ్యా! నిన్నొక ఆడది కైక కోరిక కోరికపోతే అడవికి వచ్చేవాడివా, నేను (బంగారులేడిని)కోరకపోతే ఈ రాక్షసులనందరినీ సంహరించేవాడివా!

ఇలా రాముడన్న ప్రతిమాటకీ సమాధానమిస్తుంది సీత.

ఇనవంశేందు! మనస్సు లోపల మనస్సే లేదు నీకందు! నీ
కొనరన్ నిక్కముగా మనస్సున మనస్సున్నన్ ధరాజాత నే
మనినా వెవ్వరినో వరింపుమనియా? యయ్యయ్యొ! యా వేరి పే
ర్లనినా వెవ్వరుగాని నవ్వరటవే, రామా! జగన్మోహనా!

మనసున నింత యుంచుకొని మారుతితోడన యుంగరంబు పం
చినయది గుర్తు చిత్రము, రచించిన నీయెదలోని చా టెఱుం
గనియది, యిర్వదేండ్లు నిను గాంతుని గాగను నమ్మి సంసృతిం
బొనరిచి నిన్ను నే నెఱుగబోవని నా తెలివిన్ హసించెదన్

"నీకు మనసంటూ లేదు రామా! ఇన్నాళ్ళూ నిన్ను తెలుసుకోలేని నా తెలివికి నేనే నవ్వుకుంటున్నాను" అని ఎంత సూటిగా చెప్పింది! పైగా ఎంటంటోందో చూడండి (ఇక ప్రతిపద్యానికీ వివరణ ఇవ్వడం నా వల్ల కాదు!):

నీ పొనరించుదాన నొక నీతియు నున్నది నేనెఱింగినన్
నీ పొనరింపబోవు పనినే మరణించియ యుందు దేనికై
యా పది శీర్షముల్ కలిగినట్టి మహాసురు నీవు చంపునౌ
నీ పదిదిక్కులన్ యశమదెట్టుల దక్కును నీకు మత్పతీ!

ఆమిక్షాకృతి విచ్చిపోదు రనసూయారుంధతుల్ గాని లో
పాముద్రాసతిగాని నీ విటుల భూపాలా! మదిన్ నమ్మవే
నీ, మోహాంధ వటంచు ధూర్జటి హిమానీశైలకన్యామణిం
దా మాటాడునె? నీవు పల్కెదవుపో ధాత్రీ సతీకన్యకన్

అప్పుడరుంధతీ సతియు నంతిపురంబును నింక ద్రొక్కనం
చొప్పమి లేచిపోయె విపినోర్వికి నేనును వచ్చు టెంచుచున్
జెప్పకు మింటి కేగి యిది, సీతయు నగ్నిని జొచ్చె నేను బో
నప్పుడె యంచు జెప్పిన మహాప్రభు! దోసము మాసిపోయెడున్

ఆయా మౌనుల యిండ్లకుం జనకుమయ్యా! నీ వయోధ్యం జనన్
ధ్యేయాకారలు వారి గేహినులు భక్తింబొల్చు న న్నీ గతిం
జేయన్ నీవును గోప మూనెదరుసూ! సేమంబు కాదద్ది నీ
వా యా మౌనులయిండ్లకుం జనకుమయ్యా! నీ వయోధ్యం జనన్

ఆ వేళన్ వని జేరునప్పుడు ప్రసంగానీతమై చెప్పగా
సావిత్రీకథ నేను నీ మరణవాంఛాబుద్ధి నైనట్లుగా
నీ వాడన్ బ్రభు నేన చత్తునని యంటిన్ నిక్కమట్లయ్యె నీ
నీవే కారణమౌట దానికిని బండెన్ మత్తపంబంతయున్

రాముడిని అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఋషుల ఇంటికి వెళ్ళడం క్షేమం కాదని హెచ్చరిస్తోంది! ఎందుకు? తననిలా తూలనాడినందుకు మునిపత్నులందరూ రామునిపై తీవ్రంగా కోపగించుకుంటారు కాబట్టి!

నాపయి రామచంద్ర! రఘునాయక! మత్పతి! నీకు నెందుకో
కోపము వచ్చె నద్ది యిదిగో పది యల్లితి వంశగౌరవ
క్షేమముగాగ మచ్చ యని చెప్పితి వచ్చట నింత కంటె దీ
వ్రాపద యున్నదయ్య రఘువంశము నందున గోప మేటికిన్

నీకు నామీద ఎందుకో కోపం వచ్చింది. అంచేత ఎవో పది రకాలుగా నన్నన్నావు. నువ్వేదో మీ వంశగౌరవం అంటున్నావే, దానికి నువ్వనుకుంటున్నదానికంటే పెద్ద నష్టం ఇప్పుడు వాటిల్లబోతోంది! ఏవిటది?

నన్నున్ వీడి మఱీవు వేఱయిన కాంతం బొంద వప్డున్ గులో
త్సన్నంబై చను గైకకంటెను భవత్సంపాదితంబైన సమా
సన్నంబై చను పెద్దయెగ్గు రఘువంశంబందు లోకాగ్నికిన్
స్నాన్నాయంబగు నూహ లెత్తదు భవిష్యత్కాల సంసూచిగా

భరతుడొసగిన ధర ధర్మపత్ని ప్రక్క
లేక యేలెడు నర్హత లేదు నీకు
నరపతివి కాక నన్ను గొనంగవచ్చు
నుభయతోభ్రష్టతం బొందుచుంటి రామ!

ఆహా! ఎంత తిరుగులేని మాట చెప్పింది సీత యిక్కడ! రాముడు తన్ను వీడి మరొక కాంతను ఎలానూ చేపట్టడు. దానివల్ల కైక రఘువంశానికి చేసిందనుకొంటున్న కీడు కన్నా కూడా మహాపద కలుగుతుంది. భరతుడు తనకి ఒప్పచెప్పిన రాజ్యాన్ని ధర్మపత్ని లేకుండా రాముడు ఏల లేడు. అప్పుడు మరి రఘువంశ భవిష్యత్తు ఏమి కావాలి? పైగా, రాముడు తన వంశాన్ని రాజ్యాన్ని వదులుకొని ఇప్పుడు సీతని గ్రహించవచ్చు. కాని సీతని పరిత్యజించి ఆ వంశగౌరవాన్నీ, రాజ్యాన్నీ ఎటూ పొందలేడు. అప్పుడతను రెంటికీ చెడ్డ రేవడే అవుతాడు!
ఇది చెప్పిన తర్వాత, సీత మరో రహస్యం చెప్పి, అగ్నిప్రవేశానికి ఉపక్రమిస్తుంది.

అగ్నిమండుచు నున్నది యారిపోక
ముందు నే దానిలోనికి బోవవలయు
జివరి కొకమాట నీకును జెప్పవలయు
దెలియజాలరు దీనిని దేవతలును

ఇరువురము నొక్క వెలుగున
జెఱుసగమును దీని నెఱుగు శివుడొకరుండే
పురుషుడ వీ వైతివి నే
గరితనుగా నైతి బ్రాణకాంతా! మఱియున్

అచట చూచుచు నున్నట్టి యందఱకును
జెలువ యేమని చెప్పెనో తెలియలేద
చాది చూచిరి నట నుర్విజాత నచటి
యుర్విజాత యన్నట్లుగా నున్నదాని

మారుతి లక్ష్మణుండును క్షమాసుత బూర్వము చూచినట్టి వా
రా రుచిరాంగి చెప్పినది యంతయు నర్థము చేసికొన్న వా
రీ రచనంబు సర్వమును మహీయ మతీతమనస్కమై జనం
బేరును రామునందున వహింపరు తొల్త దలంచు దోసమున్

"నిర్భీకవలె, స్వాధీనపతికవలె, బురస్కారభావయుతవలె, మత్తగజ మంథర సుందర గమనంబున నగ్నికడకు నడచి యగ్ని బ్రవేశించిన"

ఈ చివరి సీత నడకని, ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు వర్ణించిన నడకతో (ఈ టపా మొదట్లో ఉంది) పోల్చి చూడండి. అందులో ఎంతటి వైవిధ్యాన్ని విశ్వనాథ ప్రదర్శించారో, ఎందుకు ప్రదర్శించారో!

ఈ అగ్నిప్రవేశ ఘట్టం మనల్నీ (రాముణ్ణీ) రామాయణం చివరికంటూ వెంటాడుతునే ఉంటుంది! ఆ తర్వాత సీతని ప్రసన్నురాలిని చేసుకోడానికి నా నా తిప్పలూ పడతాడు రాముడు. ఆఖరికి రాముడు జానకిని ప్రసన్నురాలిని జేసుకొనవలసిన స్థితినుండి, సీతచేత తాను అనుగ్రహింపబడవలసిన స్థితికి వస్తాడుట!
తిరిగి అయోధ్యకి సీతారాములు ప్రయాణమైనప్పుడు ఋష్యమూక పర్వతం కనిపిస్తుంది. అప్పుడు రాముడు సీతతో, అక్కడ ఎంతగా విరహాగ్ని తనని కాల్చివేసిందో చెప్తాడు రాముడు. అప్పుడు సీత, "నిన్నేమో అగ్ని కానిది అగ్నిలా దహించింది, నన్నేమో అగ్నే అగ్నిలా దహించకుండా పోయింది" అని ఓ పోటు పొడుస్తుంది!
ఆ తర్వాత వాళ్ళు అత్రి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు, సీత అనసూయకి జరిగిన వృత్తాంతం చెప్తూ, తనని రాముడు చేసిన అవమానం కూడ చెప్పి, రాముడన్న మాటలకి "జుగుప్సావార్ధులాడెం జుమీ!" అంటుంది. దాంతో అనసూయ, రాముని వద్దకు వచ్చి చాలా కోపంగా చూసి, తర్వాత తనని తమాయించుకొని మళ్ళీ లోపలకి వెళ్ళిపోతుందిట!
భరతుడికి తను తిరిగివస్తున్నానన్న వార్త చెప్పమని హనుమంతుని పంపిస్తాడు రాముడు. హనుమంతుడు వెళ్ళేసరికి, రాముడు గడువు పూర్తయినా రాలేదని అప్పుడే అగ్నిప్రవేశానికి సిద్ధపడతాడు భరతుడు. అప్పుడు హనుమంతుని కంటికి భరతుడు ఇలా కనిపించాడట:

ధరణిదేవికన్య దశరథసూనుండు
రామమూర్తి యనలరాశి ద్రోచె
దానికిన్ ఫలంబు తానే మహాగ్నిలో
నుఱుకుచుండె నన్న యూహ తోచి

భరతుడు రామునిలాగే ఉంటాడు కదా ఆకారంలో మరి! దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అగ్నిప్రవేశాన్ని మనకి గుర్తుచేసారు విశ్వనాథ.
అయోధ్యకి తిరిగివచ్చిన తర్వాత, అరుంధతి తమని చూడటానికి వస్తున్నప్పుడు రాముడు తెగ భయపడిపోతాడు! అనసూయ అయితే కోపంగా చూసి ఊరుకుంది, అరుంధతికి కోపం వస్తే అలా ఊరుకుంటుందన్న నమ్మకం లేదు. అంచేత ఆమెకి ఏమీ చెప్పవద్దని సీతని ప్రాధేయపడతాడు రాముడు. సీత అతనికి అభయం ఇస్తుంది!

ఇలా అగ్నిప్రవేశం గురించి కల్పవృక్షంలో చదివితే స్త్రీశక్తి, అందులోనూ సీతాదేవి మహోన్నత వ్యక్తిత్వం, మనకి కొట్టొచ్చినట్టు కనపడుతుంది. రామాయణం "సీతాయాశ్చరితం" అన్నది మరింత బలపడుతుంది.
వడలి మందేశ్వరరావుగారు "ఇది కల్పవృక్షం" అన్న పుస్తకంలో, అగ్నిప్రవేశాన్ని గురించి చెప్తూ, ఇది సీతకన్నా కూడా రామునికే అగ్ని పరీక్షగా మారింది. దీనివల్ల ఇప్పటికీ రాముని వ్యక్తిత్వాన్ని సరిగా అంచనా వెయ్యడానికి కష్టంగానే ఉంది అన్నారు. అది అక్షర సత్యం!


పూర్తిగా చదవండి...

Saturday, September 20, 2008

పద్య రచనలో టెక్కునిక్కులు


గిరిగారు తన బ్లాగులో రాసిన "ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్" అనువాదం చూసి, కొన్ని "ఉచిత" సలహాలక్కడ పడేసాను. ఆ తర్వాత దాని గురించి మరింత వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందేమో అనిపించింది. అందుకే యీ టపా.
"పద్యం రాయడం ఎలా?" అన్న ప్రశ్న కాస్త విచిత్రంగా అనిపించొచ్చు. ఛందస్సు (గురులఘువులు, గణాలూ, వృత్తాలూ మొదలైన విషయాలు) నేర్చుకొని, రాయాల్సిన పద్య ఛందస్సుని ఎన్నుకొని, అందులోని నియమాలని అనుసరించి మనం చెప్పాలనుకున్న విషయానికి తగ్గ పదాలని పేరుస్తూ పోతే పద్యం వస్తుంది - ఇంతే కదా! ఇంతే కదా అంటే స్థూలంగా ఇంతే, కానీ సూక్ష్మంగా ఇంకా చాలా ఉంది. అలాటి కొన్ని సూక్ష్మ విషయాలని కాస్త పరిశీలిద్దాం. దీనికోసం ముందు వేసుకొన్న ప్రశ్నని "మంచి పద్యం రాయడం ఎలా?" అని మారిస్తే మరికొంత అర్థవంతంగా ఉంటుంది. ఈ విషయాన్ని ఉదాహరణతో వివరిస్తే బావుంటుందనిపించింది. దీనికోసం "ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్" రైమునే తీసుకుంటాను, గిరిగారు తప్పుగా అనుకోరనే ధైర్యంతో.

పద్యం రాయడం ఓ కళ అని అందరూ ఒప్పుకొనేదే. కాని అందులో కొన్ని టెక్కునిక్కులు కూడా ఉన్నాయి. పద్యం అనగానే మొట్టమొదటి ప్రశ్న, "ఏ ఛందస్సులో రాయాలి?" అని. మనకి బాగా నచ్చిన ఛందస్సులో రాసుకోవచ్చు. లేదా బాగా వచ్చిన ఛందస్సులో రాసుకోవచ్చు. మొదట్లో ఈ పని చెయ్యొచ్చు కాని, "ఫరవాలేదు, మనం పద్యాలు రాయగలం" అని అనుకున్న తర్వాత ఈ టెక్నిక్కుని అవతల పడేయాలి. పడేసి, రాయదల్చుకున్న విషయం మీద దృష్టి సారించాలి.

రాయాలనుకున్న వస్తువుని బట్టి ఛందస్సుని ఎంచుకోవడం మంచి టెక్నిక్కు. అలా అని "విషయం బై ఛందస్సు" లాంటి పట్టిక ఏదీ లేదు, ఠపీమని విషయాన్ని బట్టి ఛందస్సుని ఎంచేసుకోవడానికి. ఇక్కడ ఛందస్సు స్వరూపం గురించి కాస్త జెనరల్ నాలెడ్జి అవసరం అవుతుంది.
కాస్త గంభీరమైన విషయాలకు శార్దూలం మత్తేభం లాంటి వృత్తాలూ, సుకుమారమైన విషయాలకి ఉత్పల చంపకమాలలూ, ఒకే వస్తువు గురించి రక రకాలగా వర్ణించడానికి సీసం, లలితమైన క్లుఫ్తమైన భావాలకి తేటగీతీ, ప్రత్యేకమైన నడకతో తేలికగా గుర్తుండిపోవాల్సిన చిన్న చిన్న విషయాలకి ఆటవెలదీ... ఇలా కొన్ని సూచికలు ఉన్నాయి. అవి కేవలం సూచికలే, సూత్రాలు కావన్న సంగతి మాత్రం మరిచిపోకూడదు.

సరే మన ఉదాహరణకి వద్దాం. "ట్వింకిల్ ట్వింకిల్ లిట్టిల్ స్టార్"ని అనువదించాలంటే ఏ ఛందస్సు సరైనది? ఇదొక పిల్లల గీతం. ఇందులో గంభీరమైన, సుకుమారమైన విషయాలేవీ లేవు. కాబట్టి ఖచ్చితంగా వృత్తాల జోలికి పోకూడదు. చెప్పే విషయం చాలా చిన్నదైనా, ఇది పిల్లలకి గుర్తుండిపోవాలి. అలాంటి విశేషం ఇందులో ఏవుంది అంటే, అందులోని కొట్టొచ్చినట్టు కనబడేది - "తానా నానా తానా నా..." అంటూ సాగిపోయే దాని నడక. అంచేత దీన్ని అనువదించేటప్పుడు అలాంటి కొట్టొచ్చినట్టుండే నడక అత్యవసరం. అలాటి ఛందస్సు పైన చెప్పుకున్న వాటిలో ఆటవెలది ఒక్కటే. మరొకటి ముత్యాలసరం. ఇది మాత్రా ఛందస్సు. మాత్రా ఛందస్సులకి నడకే ప్రాణం. అసలీ ఇంగ్లీషు గీతం కూడా మాత్రా ఛందస్సులో ఉన్నదే. చూడండి:

ట్వింకిల్ (4) ట్వింకిల్ (4) లిట్టిల్ (4) స్టార్ (2) (మాత్రలు)
హౌ ఐ (4) వండర్ (4) వాట్యూ (4) ఆర్ (2)
అప్పే (4) బోవ్ దా (4) వార్ల్డ్ సో (4) హై (2)
లైకే (4) డైమండ్ (4) ఇందా (4) స్కై (2)

ఇప్పుడు మనదగ్గర మూడు రకాల ఛందస్సులున్నాయి ఎన్నుకోడానికి. ఒకటి ఆటవెలది, మరొకొటి ముత్యాలసరం, మూడోది ఇంగ్లీషు రైములోనే ఉన్న మాత్రా ఛందస్సు, దీన్ని ఆ రైము పేరుమీద ట్వింకిల్ ఛందస్సు అందాం. ఇప్పుడీ ఛందస్సులనీ, మూలాన్నీ మరి కాస్త పరిశీలించాలి. ట్వింకిల్ ఛందస్సులో మనం గమనించాల్సిన అంశం - నాలుగు పాదాలూ ఒకే రకమైన మాత్రలు. అలానే రైములో ప్రతి వాక్యమూ ఒక పాదం. అంటే ఒక వాక్యం ఒక పాదంతో పూర్తయిపోతోంది. మొదటి రెండు పాదాలకీ అంత్య ప్రాస ఉంది, అలానే మూడు నాలుగు పాదాలకీను. ఈ అంశాలన్నీ ఆ రైము చక్కదనానికి దోహదం చేసినవే. కాబట్టి సాధ్యమైనంతవరకూ తెలుగులో కూడా ఇవి ఉంటే బావుంటుంది. అయితే తెలుగుకి అంత్యప్రాస అంత అందాన్ని ఇవ్వదు కాబట్టి దాన్ని వదిలేయొచ్చు.
ఇప్పుడు మనమనుకున్న ఛందస్సులని పరిశీలిస్తే, ఆటవెలది అసమ పాదాలు కలిగినది. అంటే నాలుగు పాదాలూ ఒకే మాత్రలూ లేదా గణాలూ కాదు. చెప్పే విషయంలో అలాటి అసమత ఉంటే దానికి ఆటవెలది వాడుకోవచ్చు. కానీ ఇక్కడ మన ఇంగ్లీషు గీతంలో అలాటిదేం లేదు. కాబట్టి ఆటవెలది ఈ సందర్భంలో ఎంత అందాన్నిస్తుందో కొంచెం అనుమానమే. పోతే ముత్యాలసరం. ఇది సమ ఛందస్సనే అనుకోవచ్చు. అంటే నాలుగు పాదాలూ ఒకే నడక ఉండే అవకాశం ఉంది. చివరి పాదంలో కావాలంటే కొంత తేడా చూపించవచ్చు.
అంచేత ప్రస్తుతానికి ఛందస్సు ముత్యాలసరమో, ట్వింకిలో అని నిర్నయించవచ్చు.

హమ్మయ్యా! ఛందస్సు నిర్ణయించే పెద్ద పని అయిపోయింది. వాట్ నెక్స్టూ?

ఛందస్సుతో పాటు దాని నిర్మాణం గురించి కూడా ఆలోచించి నిర్ణయించుకోవడం మంచిది. ఇంగ్లీషు రైముకున్న లక్షణం, అంటే ఒకో పాదానికీ ఒకో వాక్యం అన్న నియమం మన అనువాదంలో కూడా ఉండాలి. నిర్మాణ పరంగా ప్రస్తుతానికి ఇది చాలు.

తరవాత గమనించాల్సిన ముఖ్యమైన విషయం భాష. ఇది పిల్లల గీతం. కాబట్టి భాష చాలా సరళంగా, పిల్ల భాషకి దగ్గరగా ఉండాలి. అంటే పదాలు తేలికగా (సంస్కృతపాండిత్యం లేకుండా) వాక్యాలు సరళంగా (సంధులూ సమాసాలూ లాంటివి లేకుండా) ఉండాలన్న మాట.

భావం విషయంలో పూర్తిగా ఇంగ్లీషు రైముని అనుసరిస్తే సరిపోతుంది.

ఇంక అనువాదం మొదలుపెడదావా మరి! ముందుగా ముత్యాలసరంలో ప్రయత్నిద్దాం.

ట్వింకిల్ కి మంచి తెలుగు పదం ఉండనే ఉంది - మినుకు
"మినుకు మినుకని మెఱయు తారా" ఎలా ఉంది? ఊ.ఊ.ఊ... "మెఱయు" పదం కొంచెం గ్రాంధిక వాసన కొట్టటం లేదూ? పైగా అలాటి పదమేవీ ఇంగ్లీషు రైములో లేదాయె. అంచేత ఇక్కడా పదం అనవసరం. సరే తీసేద్దాం. మరి దాని బదులు ఏ పదం వెయ్యాలి? అరే, "లిట్టిల్" మన అనువాదంలో రాలేదు. అది పెడితే సరి.
"మినుకు మినుకూ చిన్ని తారా". బాగానే ఉంది కాని "చిన్న" తెలుగుపదం, "తార" సంస్కృతపదం అయిపోయి రెండూ పక్కపక్కనే బావున్నట్టు లేదు. "తార"కి చక్కని తెలుగు పదం ఉందిగా, దాన్నే ఉపయోగిద్దాం.
"మినుకు మినుకూ చిన్ని చుక్కా". బావుంది. ఒక పాదం అయిపోయింది.

ఇక రెండో పాదం, "How I wonder what you are!"- ఇది చాలా సులువు. "నిన్ను చూస్తే ఎంత వింతా!".

మూడో పాదం, "Up above the world so high". ఇది కొంచెం ఇబ్బంది పెట్టే వాక్యమే. ఎందుకంటే "world so high" అన్నది ఇంగ్లీషు భాషకే పరిమితమైన పదబంధం. ఇది మక్కీకి మక్కీ అనువాదం చెయ్యలేం. తర్వాత పాదం "Like a diamond in the sky" కూడా అలాటిదే. ఇక్కడొక విశేషం గమనించాలి. ఈ రెండు పాదాల్లోనూ "క్రియ" ఎక్కడుంది? లేదు! కాని దాని లోటు మనకి తెలీటం లేదు. అదే తెలుగులో అయితే అలా కుదరదు. ఉదాహరణకి, ఈ రెండు వాక్యాలనీ ఉన్నదున్నట్టుగా తెలుగులో చెప్తే, "లోకానికంతటికీ అంత ఎత్తులో, ఆకాశంలో ఒక వజ్రంలా". వజ్రంలా ఉందనో మెరుస్తోందనో అనకపోతే ఆ వాక్యం పూర్తికాదు తెలుగులో. కాబట్టి తెలుగులో అలాటి క్రియా పదం చేర్చుకోవాలి. సరే, అలాటి పదాన్ని చేర్చుకొని ఆ రెండు పాదాలనీ పూర్తి చేద్దాం:

అంత ఎత్తున ఆకసమ్మున
వజ్రమల్లే మెరసినావే

ఊ..హూ.. మళ్ళీ "ఆకసమ్మున", "వజ్రం" కాస్త గ్రాంధిక వాసన కొడుతున్నాయి. ఆకసము బదులు నింగి వాడొచ్చు. చక్కని తెలుగు పదం. మరి వజ్రానికి తెలుగు పదం ఏమైనా ఉందా? ఉంది - "రవ్వ". "రవ్వల గాజులు", "రవ్వల నెక్లెసు" అనే వాడుక ఉండేది, ఇప్పటికీ కొన్ని చోట్ల పల్లెటూళ్ళలో వినొచ్చు. వాటితో పద్యాన్ని పూర్తి చెయ్యొచ్చు. పూర్తి పద్యం:

మినుకు మినుకూ చిన్ని చుక్కా
నిన్ను చూస్తే ఎంత వింతా!
అంత ఎత్తున నింగిలోనా
మెరిసిపోతావ్ రవ్వలా!

ఇది ముత్యాలసరంలో అనువాదం. ఇలాగే, ట్వింకిల్ ఛందస్సులో రాస్తే:

మినుకూ మినుకూ చుక్కమ్మా
నినుచూస్తేనే వింతమ్మా!
అంతెత్తులోన మెరిసావే
ఆకాశంలో రవ్వల్లే!

ఇక్కడ నిర్మాణ సంబంధమైన మరో విశేషాన్ని గమనించాలి. ఇంగ్లీషు రైములో, మూడో పాదంలో "Up above the world so high" అని ఉంది కదా. మాత్రల సంఖ్య మిగతా పాదాల్లోలాగే ఉన్నా, దీని నడకలో చిన్న తేడాని గమనించండి. "Up above the" అన్నప్పుడు నడుస్తూ నడుస్తూ ఒక్కసారి ఎగిరినట్టు లేదూ? మాత్రలు పదాలలో ఎలా విరిగాయో గమనిస్తే, ఇది ఎలా సాధ్యమయిందో తెలుస్తుంది. మరి దీన్ని అనువాదంలో ఎందుకు వదులుకోవాలి?
"అంతెత్తులోన" అనడంలో అది కొంతవరకూ వచ్చిందని అనుకుంటున్నాను. మూడో పాదం నడకని తక్కిన పాదాల నడకతో పోల్చి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

అలాగే మనకి తెలియకుండానే చేసిన మరో పని - అంత్యప్రాసని కొంతలో కొంత తీసుకురావడం. "హల్లులు" కలవకపోయినా, "అచ్చులు" కలిసాయి కదా! ముత్యాలసరంలో అన్ని పాదాల చివరా "ఆ" వస్తే, ట్వింకిల్ ఛందస్సులో చేసిన అనువాదంలో మొదటి రెండు పాదాల చివరా "ఆ", మూడు నాలుగు పాదాల చివరా "ఏ" వచ్చాయి. నిజానికి గమనిస్తే, ఇంగ్లీషు రైములో కూడా చివరి రెండు పాదాల్లోనూ ఉన్న అంత్యప్రాస "అచ్చు"లకి మాత్రమే!

ఇవీ పద్యం రాయడంలో "కొన్ని" టెక్కునిక్కులు! ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు రెండున్నాయి:
1. ఈ అనువాదం చాలావరకూ మూలాన్ని మక్కీకి మక్కీ అనుసరించింది. ప్రతి అనువాదం ఇలాగే ఉండాలని లేదు.
2. ఇక్కడ చేసిన అనువాదాల కన్నా మంచి అనువాదాలు ఈ రైముకి ఉండవచ్చు. నేను చేసినవే ఉత్తమమైనవి అని నేను చెప్పటంలేదు. కానీ అనువాద విధానంలో ఈ సూత్రాలు చాలావరకూ వర్తిస్తాయని మాత్రం చెప్పగలను.

మరోసారి మరో రకమైన ఇంగ్లీషు కవితని తీసుకొని దాన్ని అనువదించే ప్రయత్నం చేద్దాం.

ప్రస్తుతానికి మీకో సమస్య. ట్వింకిల్ లాంటిదే మరో పిల్లల గీతం. దీన్ని అనువదించడానికి ప్రయత్నిస్తారా?

"Johny Johny" "Yes Papa!"
"Eating Sugar" "No Papa!"
"Telling lies" "No Papa!"
"Open your mouth" "Ha! Ha! Ha!"


పూర్తిగా చదవండి...

Thursday, September 11, 2008

ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోతుందా?


నా మార్గమ్మును కాదు, శిష్యుడయినన్ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; వీని దెదియో! ఈ మార్గ మట్లౌటచే,
సామాన్యుండనరాదు వీని కవితాసమ్రాడ్వ్త మా హేతువై,
యీ మచ్ఛిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్

ఇతని కవిత్వాన్ని గురించి బహుశా ఇంతకన్న సరైన అంచనా మరెవరూ వెయ్యలేరు. తన శిష్యుని గురించి స్వయంగా అతని గురువే చెప్పిన మాటలుకావడం వీటికి మరింత విశిష్టతనిస్తుంది. ఆ శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ, ఆ గురువు చెళ్ళపిళ్ళ.
ఈ రోజు అతని జయంతి. అది గుర్తుచేసిన తెలుగురథం శర్మగారికి ముందుగా కృతజ్ఞతలు.

విశ్వనాథ నాకెప్పుడు పరిచయమయ్యారో సరిగా గుర్తులేదు కాని, అతన్ని చదువుతూంటే కలిగే అనుభూతులు అనేకం! ఒకోసారి అతని మీద జాలి పుడుతుంది. మరోసారి చిరాకు, ఇంకోసారి భక్తి, కొన్ని సార్లు భయం, మరికొన్ని సార్లు గౌరవం పుడుతూ ఉంటాయి. అయితే చాలాసార్లు పుట్టే అనుభూతి మాత్రం ఆశ్చర్యంతో కూడుకొన్న తీవ్రమైన విస్మయం! విశ్వనాథ కవిత్వం చదువుతునప్పుడు, అది పూర్తిగా నాకర్థమవుతుందో లేదో నాకు తెలీదు. కానీ అర్థమయ్యిందీ అని అనిపించినంతలో, దాన్ని అనుభవించినంతలో, అందులో దర్శనమిచ్చే అతని "ప్రతిభ" ("పాండిత్యం" కాదని గుర్తించండి) - ఇంతటి గాఢ ప్రతిభ యితనికెలా అబ్బిందబ్బా అన్న విస్మయంలో ముంచెత్తేస్తుంది.
విశ్వనాథ మౌలికంగా కవి. కథకుడూ, నవలాకారుడూ, విమర్శకుడూ కేవలం పరిస్థితుల ప్రభావం వల్ల అయ్యారు అని నాకనిపిస్తుంది.
విశ్వనాథకి భక్తులూ ఎక్కువే, బద్ధ శత్రువులూ ఎక్కువే. అయినా, వీళ్ళుకాని వాళ్ళుకాని అతన్ని నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువే.

బహుశా నేను మొట్టమొదట విన్న (అప్పటికి అతని పద్యాలేవీ నేను చదవలేదు కూడా) మొట్టమొదటి పద్యం ఇదనుకుంటాను:

నా ప్రాణములకు నీ పొగమబ్బుల
కేమి సంబంధమో! యేను గూడ
పొగమబ్బునై కొండచిగురు కోసలపైన
బురుజులపైని గొమ్ములకు బైని
వ్రాలిపోనో మధ్య వ్రీలిపోనో నేల
రాలిపోనో గాలి తేలిపోనో
నా యూహ చక్రసుందర పరిభ్రమణమై
యీ పొగమబ్బులనే వరించె

యెన్ని పొగమబ్బు లెఱిగి లేనేను మున్ను?
తూర్పు కనుమలు విడుచు నిట్టూర్పు లట్టి
విచటి యీ పొగమబ్బులే యెడదలోన
లలితము మదీయ గీతి నేలా వెలార్చు?

ఇది ఆంధ్రప్రశస్తిలోని పద్యం. ఎవరిదో ఉపన్యాసంలో విన్నాను. ఆ ఉపన్యాసకుడు ఈ పద్యాన్ని చదివిన తీరుకీ, దాన్ని వివరించిన విధానానికీ మంత్ర ముగ్ధుణ్ణయిపోయాను! అలా ఆనాడా మబ్బుతునక చిందించిన చిన్న చినుకు, ఆ తర్వాత చిలికి చిలికి గాలివానై మొత్తం నన్ను ముంచెత్తేసింది!

విశ్వనాథ గురించి చెప్పడం మొదలుపెడితే ఇంక అతన్నీ పట్టలేం, నన్నూ పట్టలేం :-) అంచేత, అతని పద్యాలు కొన్ని తలచుకొని "సం" తృప్తిని పొందుతాను, ప్రస్తుతానికి.

శ్రీకృష్ణ సంగీతంలో ఒక గోపిక కృష్ణునితో చేస్తున్న నిందా స్తుతి ఇది:

యాదవా నీది గానంబు కాదురయ్య!
గాన మెచ్చటనైనను కర్ణ రంధ్రములను జొచ్చు,
యెడదకు సౌఖ్యము సమకూర్చు.
ఇంక నీ పాట చెవులలో నెపుడు జొచ్చు? చొచ్చుచును జొచ్చుచును గుండె జొచ్చుగాని!
ఎపుడు నీ పాట అది సుఖమిచ్చు నెదకు? ఇచ్చుచును ఇచ్చుచును దుఃఖ మిచ్చుగాని!
నేను నీ పాటకును రానె రాను పొమ్ము...

పైది నిజానికి వచనమే, కాని తేటగీతి ఛందస్సులో ఉంది.

ఆంధ్రప్రశస్తిని మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి అంకితమిస్తూ అన్న మాటలలో విశ్వనాథ ఆంధ్ర దేశాభిమానం ఉరకలు వేస్తుంది:

ఇది నీకై యిడినట్టి నా యుపద, మున్నేనాడొ ఘాసాగ్రముల్
పదునై యాంధ్ర విరోధి కంఠ దళన ప్రారంభ సంరంభ మే
చు దినాలనే మఱి తోడి సైనికులమై చూఱాడు ప్రేమంబులో
నిది లేశంబనియైన జెప్పుటకు లేవే నాటి స్వాతంత్ర్యముల్!

రామాయణకల్పవృక్షంలో శబరి తలమీద పువ్వులూ పండ్లూ పెట్టిన తట్టతో నడిచి వస్తూ ఉంటే, ఆమే ఇలా ఉందిట:

తుట్టతుద దాక ఎండిన చెట్టుకొమ్మ
శేఖరంబున యందు పుష్పించినట్లు

శబరి శరీరం ఎండిపోయిన చెట్టుకొమ్మలా ఉంది. ఆ చెట్టుకొమ్మ చివరమాత్రం పుష్పించినట్లుందట!

రాముడు ఖరుడిని చంపేటప్పుడు చూపించిన వీర రసం:

ఆకంఠంబుగ మెక్కినట్టి మునిరాజానేక మాంసంబులన్
నీ కంఠంబును గత్తిరించి యిదిగో నీచేత గ్రక్కించెదన్
భూకాంతుండయినట్టి యా భరతు డబ్బో! తీక్ష్ణు డీ కార్యమున్
నాకుం బెట్టెను దైత్య రాడ్గళ గళన్నాళంబులం గోయగన్

కల్పవృక్షంలోంచి ఎన్నని ఉదాహరణలివ్వగలం! రాముడు ధనుర్విద్యా పారంగతుడయ్యాక అతని పరిస్థితి ఎలా ఉందో వివరించే పద్యం ఇది:

సుడియన్ బ్రత్యణువున్ బ్రవేగధుర మౌచుం బంచకల్యాణి సా
వడిలో నూఱక కట్టివేసిన నసృగ్బాధోల్బణంబైన కై
వడి నిల్పోపక రామభద్రుడు ధనుర్వైధగ్ధ్య సాఫల్య మే
ర్పడు మార్గంబుల కోసమై వెదకు సౌత్రశ్రీ లహోలిప్తలన్

మంచి పదునుమీదున్న పంచకల్యాణీ గుఱ్ఱాన్ని ఊరికే సావడిలో కట్టేస్తే ఉఱకలు వేసే నెత్తుటితో అది ఎలా బాధపడుతుందో అలా తన ధనుర్విద్య సాఫల్యం చెందే అవకాశం రాక రామభద్రుడు విలవిలలాడిపోయాడుట!

అన్నిటికన్నా విశ్వనాథని దగ్గరగా మనం చూడగలిగేది అతని శతకాల్లో. అందులోనూ విశ్వేశ్వర శతకంలో. అందులోంచి రెండు పద్యాలు:

అతను కటిక దారిద్ర్యం అనుభవించిన రోజుల్లో ఒళ్ళుమండి రాసిన పద్యం కాబోలు ఇది!

మీ దాతృత్వమొ తండ్రి దాతృతయొ మీమీ మధ్య నున్నట్టి లా
వాదేవీలకు నాదు బాధ్యతకు సంబంధంబు లేదిట్లు రా!
ఏదో లెక్కలు తేల్చుకో! మొఱటుతోనేలా? యొడల్ మండెనా
ఏదో వచ్చిన కాడి కమ్మెదను సుమ్మీ నిన్ను విశ్వేశ్వరా!

అయినా అతనికా స్వామి మీదున్న భక్తి అపారమైనది.

నీవే రాజువు నేను సత్కవిని తండ్రీ! నిన్ను వర్ణించెదన్
నీవే దైవము నేను భక్తుడను తండ్రీ! నిన్ను ధ్యానించెదన్
నీవే భూమివి నేను గర్షకుడ తండ్రీ! నిన్ను బండించెదన్
నా వైదగ్ధ్యము నీవ చూతు, కృప సంధానించు విశ్వేశ్వరా!

తెలుగు పద్యకవిత్వం మొత్తాన్ని చదవే భాగ్యం నాకీ జన్మకు ఎలాగూ లేదు. విశ్వనాథ కవిత్వాన్ని చదివితే తప్పకుండా ఆ లోటు తీరుతుంది. కాని అది కూడా సాధ్యమవుతుందన్న నమ్మకం లేకుండా ఉంది :-(


పూర్తిగా చదవండి...

Wednesday, September 3, 2008

వినాయకునికి పద్యాల నైవేద్యం


అందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు!
వినాయకచవితి తెలుగువాళ్ళకి ఆహ్లాదకరమైన పండగ. వినాయకుడంటే తెలుగువాళ్ళందరికీ ఒక రకమైన ఆప్యాయత. ఎందుకో మరి! అతని రూపమే చిత్రం! అతని వాహనం మరీ విచిత్రం! ఇష్టమైన పిండివంటలు సరే సరి! మరే దేవుణ్ణైనా మనం గడ్డితో పూజిస్తామా! అతనితో ఎన్ని సరదాలు, మరెన్ని సరాగాలు! ఆ చనువుతోనే కాబోలు నిన్న రాత్రి ఎలక గుఱ్ఱాన్నెక్కి సరాసరి నా కల్లోకి వచ్చేసి పిచ్చాపాటీ మొదలుపెట్టాడా స్వామి!

వినాయకుడు: రేపు వినాయకచవితి గుర్తుందా!

నేను: అయ్యో ఎంత మాట! నాకు గుర్తులేకపోవడమేమిటి, మాకు సెలవు కూడానూ!

వినాయకుడు: అయితే మరి నాకేం నైవేద్యం పెడుతున్నావ్?

నేను: అదీ...మరీ...స్వామీ... మా ఆవిడ ఉండ్రాళ్ళో ఏవో చేస్తానంది. ఆవిడ దయా మీ ప్రాప్తం!

వినాయకుడు: అది కాదోయ్! నువ్వు పెట్టే నైవేద్యమేవిటీ అని అడుగుతున్నా...

నేను: నేనా? ఏంటంటున్నారు స్వామీ?

వినాయకుడు: అదేనయ్యా, నీ బ్లాగులో పండగలకీ పబ్బాలకీ పద్యాలు వేస్తున్నావు కదా! ఆ తెలుగు పద్యాల ప్రసాదం గురించి నేనడుగుతున్నది.

నేను: ఓ, అదా! అయినా మా తెలుగు పద్యాలు మీకు ఆనతాయా అని...

వినాయకుడు: అదేంటయ్యా అలా అంటావ్! అసలు నాకు సంస్కృతశ్లోకాల కన్నా తెలుగు పద్యాలే ప్రీతిపాత్రం తెలుసా!

నేను: అవునా స్వామీ! అదేం?

వినాయకుడు: నన్ను తల్చుకోగానే అందరికీ గుర్తుకొచ్చే సంస్కృత శ్లోకం ఏంటో చెప్పు.

నేను: శుక్లాంబరధరం విష్ణుం...

వినాయకుడు: అవునా! మరి నన్ను తల్చుకోగానే గుర్తుకొచ్చే మీ తెలుగు పద్యం ఏవిటి?

నేను: తోండము నేకదంతమును...

వినాయకుడు: ఊ...పూర్తిగా చదువు.

నేను:
తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!

వినాయకుడు: చూసావా! నువ్వు చదివిన ఆ సంస్కృత శ్లోకం నేనుకూడా చాలా కాలంనుంచీ నా గురించే అనుకుంటున్నాను. కానీ కొంతమంది అది నాది కాదు, అసలందులో నాగురించి ఏవిటుందని సందేహం వెలిబుచ్చారు. దాంతో నాక్కూడా అనుమానం వచ్చేసింది, అది నా గురించేనా అని. అదే మీ తెలుగు పద్యం చూడు. స్పష్టంగా, వివరంగా నా గురించి ఎంత చక్కగా చెప్తోందో! అందికే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం!

నేను: బావుంది స్వామీ! మీకు తెలుగు పద్యాలిష్టమని విని చాలా ఆనందంగా ఉంది!

వినాయకుడు: మీ తెలుగు కవులు ఎన్నెన్ని రకాలుగా నన్ను ప్రస్తుతించారు! అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జ నిండిపోతుందనుకో!

నేను: అలాగా!

వినాయకుడు: అవునయ్యా! అతనెవరూ... జిగిబిగి కవిత్వం రాసాడు. ఆ... అల్లసాని పెద్దన. అతను బలే గడుసువాడు సుమా! నా గురించి బలే పద్యాన్ని రాసాడు. ఏదీ ఆ పద్యం ఒక్కసారి చదివి వినిపించూ.

నేను:
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహివల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!

వినాయకుడు: తస్సాదియ్యా! కవంటే ఇతనేనయ్యా. నాక్కూడా ఎప్పుడూ రాలేదిలాంటి అల్లరి ఆలోచన! దీనికి మీ విమర్శకులేవో చాలా లోతైన విశ్లేషణలు చేస్తారు. అసలిది నా గురించే కాదనీ ఏదో వేదాంతం చెప్తారు. కానీ నాకవేవీ పట్టవు. నా గురించి అలాటి చమత్కారమైన ఆలోచన చేసాడు చూడూ! అది నాకు బలే బలే అద్భుతంగా అనిపించింది.

నేను: అవును స్వామీ! పెద్దనవలె కృతిసెప్పిన పెద్దనవలె అని అందుకేగా మేం అనుకునేది! అయితే ఇంతకన్నా ముందే కేతన కవి ఇలాంటిదే మరో చిత్రమైన ఆట మీచేత ఆడించాడు స్వామీ!

వినాయకుడు: అవునా! ఎందులో? ఏదీ ఆ పద్యం కూడా వినిపించు మరి.

నేను: ఈ పద్యం దశకుమారచరిత్రములోది. వినండి.
గ్రక్కున నేత్రయుగ్మము కరద్వితయంబున మూసిపట్టి యా
మిక్కిలి కంటికిం దనదు మిక్కిలి హస్తము మాటుసేసి యిం
పెక్కెడు బాలకేళి బరమేశ్వరు చిత్తము పల్లవింపగా
దక్కక ముద్దునం బొలుచు దంతిముఖుం గొలుతుం బ్రసన్నుగాన్!

వినాయకుడు: ఓరి మీ అసాధ్యంగూలా! మీ తెలుగుకవులు భలే వాళ్ళయ్యా! నా చేత ఎన్నెన్ని చిత్రమైన చేతలు చేయించారూ! నా రెండు చేతులతోనూ మా నాన్న రెండు కళ్ళూ మూసేసి, మా నాన్న మూడో కంటిని నా మూడో చేత్తో, "హస్తంతో", అంటే తొండంతో మూసేసానా! ఆ నిప్పుకంటి జోలికి వెళితే నా తొండమేం గానూ!

నేను: పొండి స్వామీ మీరు మరీను! పరమేశ్వరుని చిత్తం చిగురిస్తే, ఆ కన్ను మంటలు కురిపిస్తుందా ముద్దులు కురిపిస్తుంది కానీ.

వినాయకుడు: ఆలా అంటావా! అయితే ఓకే. ఇంతకీ, నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పు?

నేను: నన్నెచోడుడు అనుకుంటాను స్వామీ!

వినాయకుడు: ఓహో! అతనే కదూ మా తమ్ముడు పుట్టుకగురించి కుమారసంభవం తెలుగులో రాసిన కవి. ఏదీ అతను రాసిన పద్యం వినిపించు.

నేను: చిత్తం.
తను వసితాంబుదంబు, సితదంతముఖం బచిరాంశు, వాత్మ గ
ర్జన మురుగర్జనంబు, గర సద్రుచి శక్రశరాసనంబునై
చన మదవారివృష్టి హితసస్య సమృద్ధిగ నభ్రవేళ నా
జను గణనాథు గొల్తు ననిశంబు నభీష్టఫల ప్రదాతగాన్!

వినాయకుడు: బావుందయ్యా! నన్ను కాస్తా నల్లనివాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే యీ కవి! మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా! ఇంకా ఎవరెవరు ఏం చమత్కారాలు చేసారో త్వరగా వినిపించు.

నేను: కాస్త ప్రౌఢమైన చమత్కారమేదో చేసిన కవి ఒకడున్నాడు స్వామీ. అతను రామరాజభూషణుడు, ఉరఫ్ భట్టుమూర్తి. ఆ పద్యం నాకు సరిగా అర్థం కాలేదు. మీరే వివరించాలి!

వినాయకుడు: ఏవిటి నేనా! ఇప్పుడంత సమయం లేదే. సరే చదువు చూద్దాం.

నేను:
దంతాఘట్టిత రాజతాచల చలద్గౌరీ స్వయంగ్రాహముం
గంతుద్వేషికి గూర్చి శైలజకు దద్గంగాఝరాచాంతి న
త్యంతామోదము మున్నుగా నిడి కుమారాగ్రేసరుండై పితృ
స్వాంతంబు ల్వెలయింపజాలు నిభరాడ్వక్త్రుం బ్రశంసించెదన్!

వినాయకుడు: అబ్బో, యీ భట్టుమూర్తి చాలా ఘటికుడయ్యా! వాక్యాలని అటూ ఇటూ చేసి అన్వయం కష్టం చేసిపారేసాడు! మధ్యలో శ్లేష ఒకటి!
నా తొండంతో ముందు గంగ నీళ్ళన్నీ పీల్చేసి సవతిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట! తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే, ఆ ఊపుకి, మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా హత్తుకొందిట. ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించేనట. ఇలా తల్లిదండ్రులిద్దరికీ ఆనందాన్ని చేకూర్చి నేను వాళ్ళ కుమారులలో అగ్రస్థానాన్ని (కుమారస్వామికి అన్ననే కదా!) సంపాదించానట. దానికి నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి!

నేను: బాగా వివిరించారు స్వామీ! స్వయంగా మీ నోటితో దీని వివరణ వినడం పరమానందంగా ఉంది!

వినాయకుడు: అది సరేగానీ, ఇన్నేసి చమత్కారాలు గుప్పించిన పద్యాలు కాకుండా, వినసొంపుగా హాయిగా మనసుకి హత్తుకొనే పద్యాలు ఎవరూ రాయలేదా?

నేను: ఎందుకు రాయలేదు స్వామీ! అలాటివాటికి పెట్టింది పేరు పోతన, ఆ తర్వాత కొంతవరకూ మొల్ల.

వినాయకుడు: అయితే తొందరగా వినిపించు మరి!

నేను: పోతన తనకి సహజమైన అంత్యప్రాసలతో రాసిన పద్యం ఇదిగో:
ఆదరమొప్ప మ్రొక్కిడుదు నద్రిసుతా హృదయానురాగ సం
సాదికి దోషభేదికి బ్రసన్నవినోదికి విఘ్నవల్లికా
చ్ఛేదికి మంజువాదికి నశేష జగజ్జననందవేదికిన్
మోదక ఖాదికిన్ సమద మూషికసాదికి సుప్రసాదికిన్!

వినాయకుడు: ఆహా! పోతన పద్యంలో తీయని మకరంద ధార జాలువారుతునే ఉంటుంది. మరి మొల్ల పద్యమో?

నేను: చిత్తం సిద్ధం!

చంద్రఖండ కలాపు జారు వామనరూపు
గలిత చంచలకర్ణు గమల వర్ణు
మోదకోజ్జ్వలబాహు మూషికోత్తమవాహు
భద్రేభవదను సద్భక్తసదను
సన్ముని స్తుతిపాత్రు శైలరాడ్దౌహిత్రు
ననుదినామోదు విద్యాప్రసాదు
బరశువరాభ్యాసు బాశాంకుశోల్లాసు
నురుతరఖ్యాతు నాగోపవీతు

లోకవందిత గుణవంతు నేకదంతు
నతుల హేరంబు సత్కరుణావలంబు
విమల రవికోటితేజు శ్రీవిఘ్నరాజు
బ్రథిత వాక్ప్రౌఢికై యెప్డు ప్రస్తుతింతు!

వినాయకుడు: చాలా బావుంది! సీసంలోని తూగు మరే పద్యానికొస్తుంది! అన్నట్టు సీసమనగానే గుర్తుకొచ్చింది. అసలుసిసలు తెలుగుకవి, మీ శ్రీనాథ కవిసార్వభౌముడు నా గురించేమీ రాయలేదా?

నేను: అయ్యో పొరపాటైపోయింది స్వామీ! మరచిపోయాను. ఇదిగో మీ గురించి అతను రాసిన సీసం!

కలితశుండాదండ గండూషితోన్ముక్త
సప్తసాగర మహాజలధరములు
వప్రక్రియా కేళివశ విశీర్ణ సువర్ణ
మేదినీధర రత్నమేఖలములు
పక్వ జంబూఫల ప్రకటసంభావనా
చుంబిత భూభృత్కదంబకములు
వికట కండూల గండక దేహమండలీ
ఘట్టిత బ్రహ్మాండ కర్పరములు

శాంభవీశంభు లోచనోత్సవ కరములు
వాసవాద్యమృతాశన వందితములు
విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు
మించి విఘ్నోపశాంతి గావించు గాత!

వినాయకుడు: అబ్బబ్బా! ఏవి ధారా, ఏవి ధారా! ఇందుకేగా ఇతన్ని ప్రసిద్ధ ధారాధుని అని పిలిచేది. సెభాష్!
అవునూ, నువ్వందరూ పాతకవులనే చెప్తున్నావ్, ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవే లేడా ఏంటి?

నేను: అయ్యో లేకేం స్వామీ! పైన చెప్పిన కవులందరూ తమ కావ్యాల్లో ఒక పద్యంలో మిమ్మల్ని స్తుతిస్తే, ఏకంగా ఒక పద్య ఖండికనే మీకు సమర్పించిన ఆధునిక కవి ఒకరున్నారు. అతనే, కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి. తన ఉదయశ్రీలో మీకు "నమస్తే" చెప్పారు.

వినాయకుడు: అవన్నీ వినడానికి ఇప్పుడు నాకు సమయం చాలదు. అవతల మీవాళ్ళందరూ నన్ను ఎన్నెన్ని రూపాల్లో తయారుచేసారో, ఎన్నెన్ని పిండివంటలు చేసారో చూడ్డానికి వాహ్యాళికి వెళ్ళాలి. నువ్వు కూడా తొందరగా నిద్రలేచి పూజ చేసుకోవాలి కదా! మచ్చుకి ఒక్క పద్యం వినిపించు చాలు. ఆనక మిగతావి వింటాను.

నేను: సరే అలాగే స్వామీ! చిత్తగించండి.

ఎలుకగుఱ్ఱము మీద నీరేడు భువనాలు
పరుగెత్తి వచ్చిన పందెకాడు
ముల్లోకముల నేలు ముక్కంటి యింటిలో
పెత్తనమ్మొనరించు పెద్దకొడుకు
"నల్లమామా!" యంచు నారాయణుని పరి
యాచకాలాడు మేనల్లుకుఱ్ఱ
వడకుగుబ్బలి రాచవారిబిడ్డ భవాని
నూఱేండ్లు నోచిన నోముపంట

అమరులందగ్ర తాంబూలమందు మేటి
ఆఱుమోముల జగజెట్టి అన్నగారు
విఘ్నదేవుడు వాహ్యాళి వెడలివచ్చె
ఆంధ్రవిద్యార్థి! లెమ్ము జోహారు లిడగ!

వినాయకుడు: నేను విష్ణుమూర్తిని "నల్ల మామా" అని ఆటపట్టిస్తానా! ఆహా బలే అయిడియా ఇచ్చాడే ఇతను! ఎంతైనా మీ తెలుగుకవులకి సరసం ఎక్కువే సుమీ!
మొత్తానికివాళ పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం చేసినట్టుంది! బావుంది నీ పద్య నైవేద్యం!
కాకపోతే ఇన్ని పద్యాలు చూసి నాకొకటే లోటుగా అనిపిస్తోంది.

నేను: లోటా! ఏవిటి స్వామీ?

వినాయకుడు: మీ తెలుగు కవులు ఇందరిగురించి కావ్యాలు రాసి, నా గురించి మాత్రం రాయలేదే అని వెలితిగా అనిపిస్తోంది. మా తమ్ముడు కుమారస్వామి గురించి కూడా వెయ్యేళ్ళ కిందటే ఎవరో రాసారని చెప్పావే, మరి ఇన్నాళ్ళై నా కథని ఎవరూ కావ్యంగా ఎందుకు రాయలేదు?

నేను: అవును స్వామీ! మీరు చెప్పే దాకా నాక్కూడా తట్టలేదు. ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఆశ్చర్యంగానే ఉంది.

వినాయకుడు: పోనీలే. ఇంతమంది రాసిన పద్యాలు చెప్పేవు కదా. సొంతంగా నువ్వొక్క పద్యం నా గురించి యిప్పుడు చెప్పకూడదూ. విని దానితోనే సంతృప్తి పడతాను.

నేను: అయ్యో అంత కన్నా మరో భాగ్యం ఉంటుందా! అవధరించండి!

శ్రీకంఠుని సతి ప్రేమకి
ఆకారమ్మైన సామి! హరుని దయన్ నూ
త్నాకృతి దాల్చిన గజముఖ!
చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగ మాకున్!

నేనిలా పద్యం చదివానో లేదో, అలా అదృశ్యమైపోయాడా గణనాథుడు! నా పద్య ప్రభావమేనో ఏమో! సరే పొద్దున్న యథావిథిగా పూజా కార్యక్రమాలు సాగించి, మా ఆవిడ చేసిన పిండివంటలు స్వామికి నైవేద్యం పెట్టి నేను తిని, ఇదిగో నా నైవేద్యాన్ని మీ ముందు పెట్టాను. ఆరగించండి మరి!


పూర్తిగా చదవండి...